top of page

స్టేటస్ కో

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Status Quo' New Telugu Story


Written By Mallavarapu Seetharam Kumar


రచన : మల్లవరపు సీతారాం కుమార్


"నాన్నా! మనకు నెల్లూరుకు పక్కన అల్లీపురం గ్రామంలో తాతగారు రాసిచ్చిన ఇల్లు ఉందన్నావు కదా!" అడిగాడు మా పెద్దబ్బాయి సుధీర్.


అతను హైదరాబాద్ లో మా దగ్గరే ఉంటూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.


"అవును సుధీర్! అయన వీలునామాలో నాకు రాసిచ్చాడు. ఆ ఊరికి అయన అంత్యక్రియలు, కర్మకాండలకు వెళ్లడమే.. అప్పుడు తాళం వేసుకుని వచ్చేశాను.

పదేళ్లయింది. మళ్ళీ అటువైపు వెళ్ళడానికి కుదర్లేదు. ఆ తరువాత ఆ ఇంటి గురించి పట్టించుకోలేదు" అన్నాను నేను.


"ఒకసారి వెళ్దాం నాన్నా. ఆ ఇల్లు ఎలా ఉందో.. చూడాలనుంది" అన్నాడు రెండో అబ్బాయి కళ్యాణ్. వాడు బి టెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు.


గతుక్కుమన్నాను. కొంపదీసి వీళ్లకు ఆ ఇంటి విషయంగా గొడవలు జరిగినట్లు తెలిసిందా..?


అనుమానంగా నా శ్రీమతి వైపు చూశాను.

తను వారికేమీ చెప్పలేదన్నట్లు సైగ చేసిందామె.

'హమ్మయ్య! వాళ్ళు యధాలాపంగా అడిగారన్న మాట. ఏదో చెప్పి దాటవేయ్యాలి' అనుకున్నాను.


"మీకేనా.. నాక్కూడా ఎన్ని రోజుల్నించో అక్కడికి వెళ్లి, అవసరమైన మరమ్మత్తులు చేయించాలని ఉంది. ఆ ఇల్లు మా నాన్నగారి జ్ఞాపకం కదా! ఈ రెండు నెలలూ బిజీ గా ఉంటాను. తరువాత అందరం కలిసి వెడదాం " అన్నాను వెంటనే.


నా వంక ఆశ్చర్యంగా చూస్తోంది శ్రీమతి.

బహుశా నేను అబద్ధమాడుతూ ఉండగా ఆమె చూడడం అదే మొదటిసారేమో…


ఏం చెయ్యను..? పిల్లలు కదా.. ఉడుకు రక్తం. వెనకా ముందూ ఆలోచించరు.

అందుకే అబద్ధం చెప్పి ప్రస్తుతానికి గండం గట్టెంకించాను.


ఇక అసలు విషయానికి వస్తే..


మా నాన్నగారిది నెల్లూరు పక్కనున్న అల్లీపురం గ్రామం.

ఆయనకు అక్కడ రెండెకరాల మాగాణి పొలం, ఒక పెద్ద పెంకుటిల్లు ఉండేవి.


నేను ఆడిటర్ గా హైదరాబాద్ లో స్థిరపడటంతో నాన్నగారి చేత ఆ భూమి అమ్మించి, అమ్మానాన్నలను మాతో తీసుకొని వచ్చేశాను.

తాను పుట్టి పెరిగిన ఇంటిమీద మమకారం చావక, ఆ ఇంటిని మాత్రం అమ్మలేదు ఆయన.


హైదరాబాద్ వచ్చాక కూడా అమ్మానాన్నలు నాలుగైదు నెలలకొకసారైనా అక్కడికి వెళ్లి వస్తూ ఉండేవారు.


కొన్నేళ్ళకు అమ్మ కన్ను మూయడం జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే నాన్నగారు కూడా పరమపదించారు. అయన కోరిక మీద అల్లీపురం గ్రామంలోనే అయన అంత్యక్రియలు జరిపించాను. ఇక ఆ ఇంటితో అవసరం ఉండదు కాబట్టి అయిన కాడికి అమ్మెయ్యమని బంధువులు సలహా ఇచ్చారు. కానీ ఆయన గుర్తుగా మరి కొన్నేళ్లయినా ఆ ఇంటిని ఉంచుకుందామని అనుకొని, ఆ ఇంటికి తాళం వేసుకొని వచ్చేశాను.


ఇది జరిగి పదేళ్ళయింది.

ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా నాకు అక్కడికి వెళ్ళడానికి వీలు పడలేదు.

నాన్నగారి గుర్తంటూ ఆ ఇంటిని పాడు పెట్టడం కంటే అమ్మెయ్యడమే మంచిదని అనిపించింది.


దాంతో రెండు నెల్ల క్రితం నేను ఒక్కడినే ఆ ఊరికి వెళ్ళాను.


పదేళ్లలో ఊరు చాలా మారిపోయింది. కానీ మా ఇల్లు వీధి మొదట్లోనే ఉండటంతో సులభంగానే గుర్తు పట్టాను.


ఇల్లు సమీపిస్తుండగానే నాన్నగారి జ్ఞాపకాలతో ఉద్విగ్నతకు లోనయ్యాను.

ఇంటిని సమీపిస్తుండగానే కీస్ జేబులోంచి తీశాను.


తీరా దగ్గరకు వెళ్లి చూస్తే తలుపుకు వేసిన తాళం లేదు.

లోపల ఎవరో ఉన్నట్లున్నారు.

ఆశ్చర్యపోతూ తలుపు తట్టాను.

ఓ యాభై ఏళ్ళ వ్యక్తి తలుపు తీశాడు.

"ఎవరు మీరు? ఎవరు కావాలి..?" అన్నాడు.


"ముందు మీరెవరో చెప్పండి. నేను ఈ ఇంటి ఓనర్ విశ్వనాథం గారి అబ్బాయిని" అన్నాను.


" ఆ.. గుర్తుకు వచ్చింది. విశ్వనాథం అనే ఆయన దగ్గర ఈ ఇల్లు కొన్నట్లు మా నాన్న బతికున్న రోజుల్లో చెప్పేవాడు. చెప్పండి. ఏమిటి విషయం?" అన్నాడు ఆ వ్యక్తి.


"ఈ ఇల్లు అమ్మడమేమిటి? ఎవరు అమ్మారు? ఎప్పుడు అమ్మారు..?నాన్నగారు చనిపోయే ముందు నా పేరుతో వీలునామా కూడా రాశారు.."అంటూ ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నించాను.


ఆ వ్యక్తి అసహనంగా "ఒరేయ్ పెద్దోడా! ఈయనెవరో గొడవ చేస్తున్నాడు చూడు" అన్నాడు.


లోపలినుండి ఓ పాతికేళ్ల వ్యక్తి కోపంగా వచ్చి "ఎవరయ్యా నువ్వు? ఏమిటి గొడవ?" అన్నాడు.


"మీ తాత విశ్వనాథం అనే ఆయన దగ్గర రెండెకరాల పొలం, ఈ ఇల్లు కొన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఇల్లు మనకు అమ్మలేదంటున్నాడు" అంటూ కొడుకుతో చెప్పాడు.


అతను నా వంక కోపంగా చూస్తూ "ఇంకొంత సేపు వుంటే పొలం కూడా అమ్మలేదంటాడు. ఇలాంటి వాళ్ళతో మాటలేమిటి.." అంటూ నా ముఖం మీదే తలుపు వేశాడు.


కళ్ళు గిర్రున తిరిగాయి నాకు.

అసలే హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వచ్చాను. బాగా అలిసిపోయి ఉన్నాను.

కోపం వచ్చింది నాకు. తలుపును బలంగా తడుతూ "మేము అమ్మి ఉంటే ఆ పత్రాలు చూపించు" అన్నాన్నేను.


"కోర్టులో కేసు పెట్టు. అక్కడికి వచ్చి చూపిస్తాం" అన్నాడతను లోపలినుండి.


విషయం అర్థమైంది నాకు.

అతను నా ఇంటిని ఉద్దేశపూర్వకంగానే ఆక్రమించుకున్నాడు.


తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు.

అవసరమైతే నన్ను బెదిరించడానికి కూడా వెనుకాడడు.

అప్పటికే చుట్టుపక్కల జనాలు గుమికూడారు.


వాళ్లకు విషయం చెప్పాను నేను. ఆ ఊర్లో ఉన్న నా బంధువుల పేర్లు చెప్పాను.

వాళ్ళెవరూ ఇప్పుడు అక్కడ లేరని చెప్పారు వాళ్ళు.


ఒక పెద్దాయన కాస్త అలోచించి "మీ నాన్నగారు నాకు తెలుసు. ఆయన తన భూమిని భూషణం అనే ఆయనకు అమ్మాడు. ఆయన చనిపోయాడు. ఆయన కొడుకే ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాడు. మీ నాన్న భూమి అమ్మినప్పుడు అప్పటి సర్పంచ్ సాక్షిగా ఉన్నాడు.


ఆయన ఇల్లు చూపిస్తాను. ఆయనేమైనా సలహా ఇస్తాడేమో ప్రయత్నించండి" అంటూ నన్ను ఆ మాజీ సర్పంచ్ ఇంటికి తీసుకొని వెళ్ళాడు.


ఆయన నన్ను తన ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడాడు.


"మీ నాన్నగారు కేవలం పొలం మాత్రమే భూషణం అనే వ్యక్తికి అమ్మారు.

ఆ భూషణం రెండేళ్ల క్రితం చనిపోయాడు.


అతని కొడుకు వీరాస్వామి ఆ పత్రాల్లో మార్పు చేసి ఇంటిని కూడా చేర్చాడు.

అడిగిన వాళ్ళని 'నీ ఇల్లు కాదుగదా.. నీకెందుకు' అని గదమాయించాడు.


'వాళ్ళు వచ్చినప్పుడు నేను చూసుకుంటానులే' అన్నాడు.


ఇప్పుడు ఇక్కడ స్థలాల రేట్లు బాగా పెరిగిపోయాయి.

మీ ఇల్లు మెయిన్ రోడ్ కి పక్కనే, వీధి మొదట్లోనే ఉంది. కాబట్టి ఆ స్థలమే ఇప్పుడు పాతిక లక్షలు పై చిలుకు పలుకుతుంది.


ఆ వీరాస్వామికి ఇది అప్పనంగా వచ్చిన సొమ్ము కదా. ఓ నాలుగైదు లక్షలు కోర్టు ఖర్చులకు, పై ఖర్చులకు ఖర్చు చెయ్యగలడు. పైగా పనీపాటా లేనివాడు కాబట్టి ఎన్నేళ్ళైనా కోర్టు చుట్టూ తిరగగలడు.


కానీ మీ సంగతి ఆలా కాదు. కష్టపడి సంపాదించిన సొమ్ము కోర్టు ఖర్చులకు వాడాలి.

పోనీ అని ఖర్చు చేసినా కోర్టులో ఎన్నేళ్లు పడుతుందో తెలీదు.


అలాగని చట్టాన్ని అతిక్రమించి అతనితో గొడవలు పడలేరు.

మీ బలహీనతా, అతని బలం అదే.


అనకూడదు కానీ మీ తరం గడిస్తే మీ పిల్లలు ఈ ఇంటి గురించి అసలు పట్టించుకోరు.


కానీ మీరు కోర్టులో కేసు వేస్తే, నేను మీ తరఫున సాక్ష్యం ఇస్తాను.


మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఆ రోజు ఈ వీరాస్వామి తండ్రి భూషణంతో భూమి అమ్మకం విషయంగా రేటు మాట్లాడుకున్నారు. తరువాత వేరే వాళ్ళు రెట్టింపు ధర ఇస్తామని వచ్చారు కానీ ఇచ్చిన మాటకే కట్టుబడతానన్నారు మీ నాన్నగారు.


'ఇంకా అగ్రిమెంట్ కాలేదు కదా..' అని నేను కూడా చెప్పి చూసాను.

కానీ ఆయన ఒప్పుకోకుండా,మాటకు కట్టుబడి భూషణానికే అమ్మేశాడు.


అప్పట్లో రికార్డులు ఆన్లైన్ లోకి ఎక్కలేదు. తరువాత ఆన్లైన్ చేసేటప్పుడు ఇల్లుకూడా అమ్మినట్లు రికార్డుల్లోకి ఎక్కించేశాడు అతని కొడుకు వీరాస్వామి" అంటూ

జరిగిన విషయాలు వివరించాడు మాజీ సర్పంచ్.


"మా నాన్నగారు మీకు తెలుసంటున్నారు. అయన మంచి వ్యక్తని మీరే చెబుతున్నారు. మరి ఈ విషయంలో మీరేం సహాయం చేయలేరా" అని అడిగాను.


“మీరు మీ దగ్గర ఉన్న వీలునామా పత్రాలు తీసుకొని రండి. నేను ఈలోగా గ్రామ ప్రముఖులతో, ఇప్పటి సర్పంచ్ తో ఈ విషయం మాట్లాడుతాను. ఆ వీరాస్వామి అంటే ఊళ్ళో చాలా మందికి గిట్టదు. అతన్ని పంచాయితీకి పిలిపించి మీ ఇల్లు మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను" అన్నాడాయన.


ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకొని, హైదరాబాద్ వచ్చేశాను.


కొద్ది రోజులయ్యాక ఇంటి పత్రాలు తీసుకోని అల్లీపురం బయలుదేరాలనుకున్నాను.


ఇంతలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ కాల్ చేశాడు.


"ఆ వీరాస్వామి, కోర్ట్ లో ఒక పిటిషన్ వేశాడు.

ఆ పిటిషన్ ప్రకారం హైదరాబాద్ కి చెందిన మీరు- ఆ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ ల సహకారంతో అతని ఇంటిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. తన మీద దౌర్జన్యం చేసే అవకాశం ఉందట.తనని కాపాడమని కోర్ట్ ను ఆ పిటిషన్ లో వేడుకున్నాడు.


"కోర్ట్ 'స్టేటస్ కో' ఆర్డర్ ఇచ్చింది. మా అందరికీ ఆర్డర్ కాపీలు వచ్చాయి. మీ అడ్రస్ తెలిస్తే మీకు కూడా కాపీ వస్తుంది " అని చెప్పాడతను.

కోర్ట్ ఆర్డర్ కాపీని ఫోటో తీసి నా మొబైల్ కి పంపాడు.


నీరసం ఆవహించింది నన్ను.


"నా ఇంటిని ఆక్రమించుకున్న వాడిని గట్టిగా నిలదీయలేక పోయాను నేను.

కానీ వాడు, నేనేదో దౌర్జన్యం చేయబోతున్నట్లు పిటిషన్ వేశాడు.

ఆలా చెయ్యడానికి వాడికి మనసెలా ఒప్పిందో.." అంటూ జరిగిన విషయాలు శ్రీమతికి చెప్పి బాధపడ్డాను.


అందుకే ఇప్పుడు పిల్లలు ఆ ఇంటి విషయం అడగడంతో నాకు అనుమానం వచ్చింది.


నేను ఈ విషయంలో బాధపడుతున్నట్లు తెలిస్తే పిల్లలిద్దరూ ఊరుకోరు. నాకోసం అవసరమైతే గొడవపడతారు. ఆ వీరాస్వామి అసలే దుర్మార్గుడు. పిల్లలకేదైనా హాని తలపెడితే..


ఆ ఊహే భరించలేక పోయాను.


'ఆ ఇల్లు పోతే పోయింది. అది లేకపోయినా నా ఆనందానికి లోటేమీ లేదు కదా!' అని నన్ను నేనే ఓదార్చుకున్నాను.


మరుసటి రోజు మా పెద్దబ్బాయి సుధీర్ నా దగ్గరికి వచ్చి, "నాన్నగారూ! మా ఆఫీస్ తరఫున ఫ్రెషర్స్ కి రెండు వారాలు బెంగళూరులో ట్రైనింగ్ ఇవ్వడానికి వెడుతున్నాను. అందరం కలిసి వెడితే అక్కడ హాయిగా స్పెండ్ చెయ్యవచ్చు. వీలు చూసుకొని చుట్టుపక్కల ప్రదేశాలు చూడవచ్చు" అని అడిగాడు.


"నీకు తెలుసుగా. ఏప్రిల్ మే నెలల్లో ఆడిటర్ గా బాగా బిజీగా ఉంటాను. నలుగురు అసిస్టెంట్ లతో నా ఆడిటింగ్ ఫర్మ్ జోరుగా సాగుతోంది. మరోసారెప్పుడైనా వెళదాం" అన్నాను నేను.


నిజానికి నాకు కూడా వెళ్లాలనే ఉంది. ఇంటి విషయంగా ఏర్పడ్డ చికాకు కాస్తయినా తగ్గుతుందనిపించింది. కానీ ఈ రెండు నెలలూ నేను నిజంగా బిజీనే.


నిన్ననే నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి నన్ను కలిసి తన అల్లుడి గ్రూప్ అఫ్ కంపెనీల తాలూకు అకౌంట్స్ చూసి పెట్టమన్నాడు.


"పోనీ తమ్ముడిని తీసుకొని వెళ్ళనా? వాడికి ఫైనల్ ఇయర్ క్లాసులు ఇంకా ప్రారంభం కాలేదు కదా! నాకు తోడుగా ఉన్నట్లుంటుంది. వాడికి కూడా కాలక్షేపం అవుతుంది" అన్నాడు సుధీర్.

సరేనన్నాను నేను.


ఏదో విజయం సాధించిన వాడిలా ఫీలయ్యాడు సుధీర్.

తల్లి వైపు చూసి చిన్నగా నవ్వాడు.


ఆమె కూడా ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.

ఎందుకో నాకు అర్థం కాలేదు.


రెండు రోజులు గడిచాయి.

నా శ్రీమతి తన మొబైల్ లో ఏవో ఫోటోలు చూసి మురిసి పోతూ కనిపించింది.


ఇద్దరు యువకులు రైతుల దుస్తుల్లో ఉన్నారు.


ఏదో అనుమానం వచ్చి ఫోన్ దగ్గరకు తీసుకొని చూశాను.

"మన పిల్లలే. బెంగళూర్ పక్కనున్న ఒక గ్రామానికి టూర్ లాగా వెళ్లారట.


అక్కడ తీసుకున్నారు ఈ ఫోటోలు. ఎంత ముచ్చటగా ఉన్నారో.." అంది.


నిజంగానే ఇద్దరూ రైతుల గెటప్ లో చాలా చక్కగా ఉన్నారు.

పెద్దవాడు సుధీర్ పంచె కట్టుకుని, తలపాగా చుట్టుకొని ఉన్నాడు.

చిన్నవాడు కళ్యాణ్ ట్రాక్టర్ మీద కూర్చొని పోజ్ ఇచ్చాడు.


వెంటనే వాళ్ళకి కాల్ చేసి కాసేపు మాట్లాడాము మేము.


మరో వారం గడిచాక పిల్లలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు.

"టూర్ బాగా జరిగిందా? మైసూర్ వెళ్ళారా లేదా.." రాగానే అడిగాను నేను.


ఇప్పుడే వచ్చారు కదా! కాస్త రెస్ట్ తీసుకోనివ్వండి" అంది నా శ్రీమతి.


అలా అందే కానీ కాస్సేపటికే ముగ్గురూ బెడ్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.


‘ఎంతైనా అమ్మ కదా.. అన్ని విషయాలూ అడిగి తెలుసుకోనిదే తనకు తృప్తి ఉండదు’ అనుకున్నాను.


కొంత సేపటికి అల్లీపురం గ్రామ మాజీ సర్పంచ్ నుండి కాల్ వచ్చింది.


"మొత్తానికి మీ పిల్లలు ఘటికులే" అన్నాడు నేను ఫోన్ తియ్యగానే.


"అదేమిటి? వాళ్ళ గురించి మీకేం తెలుసు?" అర్థం కాక అడిగాను నేను.


"అయితే పిల్లలు ఇంకా మీకేం చెప్పలేదా.." అన్నాడాయన.

"వాళ్ళేం చెబుతారు? ముందు మీకు తెలిసింది చెప్పండి" అన్నాను నేను ఆదుర్దాగా.


"మన మాజీ మినిష్టర్ మీకు బాగా తెలిసిన వారటగా..నాతో చెప్పనేలేదే!" అంటూ ప్రారంభించాడాయన.


అయన చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే..


ఈ మధ్య మాజీ మినిష్టర్ మా ఇంటికి వచ్చాడు కదా.. మా పిల్లలు ఆయనను కలిశారు.


వాళ్ళ అబ్బాయి మా పెద్దబ్బాయికి క్లాస్ మేట అట.


ఆ అబ్బాయికి మావాళ్లు మా ఇల్లు కబ్జా ఐన విషయం చెప్పడంతో అతను తన తండ్రికి అంతా చెప్పి సహాయం చెయ్యమన్నాడట.


అయన మా వాళ్ళను వెంటనే ఆ ఊరికి వెళ్ళమన్నాడు.


బెంగళూరు టూర్ అంటూ మా వాళ్ళు అక్కడికి వెళ్లారన్న మాట.


వాళ్ళు తీయించుకున్న ఫోటోలు, మా నాన్నగారు అమ్మేసిన మా పొలంలో తీసుకున్నవే.

మాజీ మినిష్టర్ గారి అనుచరుడు ఆ ఇంట్లో వీరాస్వామి సామాన్లు బయట పడేసి ఆ ఇంటిని ఆక్రమించుకున్నాడు. వీరాస్వామి తనతో గొడవ పడటం వీడియో తీశాడు.


ఇంటితో పాటు పొలాన్ని కూడా మా నాన్నగారు తనకు వీరాస్వామి వాళ్ళ నాన్నకంటే ముందు అమ్మేశాడని పత్రాలు చూపించాడు. తనమీద వీరాస్వామి దౌర్జన్యం చేసినట్లు కూడా సాక్ష్యాలు చూపిస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు.


కోర్టు ముందులాగే ‘స్టేటస్ కో’ ఆర్డర్ ఇచ్చింది.


నిజానికి వీరాస్వామి సృష్టించిన పత్రాలు కోర్టులో చెల్లవు. ఏదో ఒక పత్రం చూపి కబ్జా చేసాడంతే.

'స్టేటస్ కో' ఆర్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి కేసు క్లియర్ అయ్యేదాకా ఆ ఇల్లు అతని అనుభవంలో ఉంటుంది.

అతన్ని గెంటేసి 'స్టేటస్ కో' నే వాడుకున్నారు పిల్లలు.


అంటే కేసు తెగేవరకు ఇంటితో పాటు పొలం పైన కూడా వీరాస్వామికి హక్కు ఉండదు.


కేసు ఏళ్ళ తరబడి సాగుతుందని వీరాస్వామికి బాగా తెలుసు.


ఒకప్పుడు వీరాస్వామి ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మేము ఉన్నామన్న మాట.


దాంతో అతను దారికి వచ్చాడు.


ఇల్లు వదిలెయ్యడంతో పాటు పొలం కూడా ఎంతో కొంతకు అమ్మి, వూరు వదిలి వెళ్ళిపోతానన్నాడు.


విషయమంతా విన్న నేను, పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లాను.


"మొత్తానికి నేను సాధించలేనిది మీరు సాధించారు" అంటూ వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందించాను.


"మేము ఏదైనా సాధించామంటే అది మీ పేరు వాడుకునే..

పరిచయాలను వాడుకోవడం మీకు ఇష్టం ఉండదు.

కానీ అవసరమైనప్పుడు కూడా మన సామర్థ్యం, పరపతి వాడకుండా ఉండడం తప్పని మా అభిప్రాయం" అన్నాడు సుధీర్.


"కానీ గొడవలు ఎప్పటికీ మంచివి కావు. వాటివల్ల మనకు మనశ్శాంతి ఉండదు" అన్నాను నేను.


"కానీ మనకు అన్యాయం జరిగినప్పుడు కూడా మౌనంగా ఉండటం తప్పుకదా!" అన్నాడు సుధీర్.


"ఆ మాజీ మినిష్టర్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే.." అంటున్న నా మాటలకి అడ్డు వచ్చాడు రెండో అబ్బాయి కళ్యాణ్.


"లేకుంటే మరో దారి వెతుక్కునే వాళ్ళం" అన్నాడు.


"అవును రావణుడితో యుద్ధానికి తన సైన్యం వెంట లేదని ఊరుకోలేదు శ్రీరాముడు. వానరుల సహాయం తీసుకున్నాడు. ఉన్న అవకాశాలను వాడుకొని ధర్మాన్ని గెలిపించుకోవాలని ఇందులో అంతరార్థం" అన్నాడు సుధీర్.


"నీ మాటల్లో ఇంత పరిణితి ఎప్పుడు వచ్చిందిరా?" అభినందిస్తూనే ఆశ్చర్యంగా అడిగాను నేను.


"అంతా గీతాబోధన మహిమ" అన్నాడు సుధీర్.


అర్థం కాలేదు నాకు. ఆ మాటే వాడితో అన్నాను.


"గీతలో యుద్ధ విముఖుడైన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? ఎదుట ఉన్నది వృద్ధులైనా, బంధువులైనా, గురువులైనా.. వాళ్ళు అధర్మానికి పాల్పడితే ఎదిరించమన్నాడు. అంతేగానీ మౌనంగా ఉండమనలేదు" చెప్పాడు సుధీర్.


ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న నాతో "చెప్పానుగా.. గీతాబోధన మహిమ అని" అన్నాడు ఈసారి గీత అన్న పదాన్ని వత్తి పలుకుతూ.


అప్పుడర్థమైంది నాకు.


అన్నట్లు నా శ్రీమతి పేరు గీత అని మీకు చెప్పనే లేదు కదూ!


ఆమె వంక 'ఇదంతా నీ పనేనా..' అన్నట్లు చూశాను.


ఎప్పటిలాగే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంటిట్లోకి వెళ్ళింది శ్రీమతి.


'ఆ ఇంటి గురించి నువ్వు బాధ పడుతూ ఉండడం చూడలేక అమ్మ మాకు విషయం చెప్పింది" చెప్పారు పిల్లలు.


"ముందు ముందు కూడా ఇలాగే ‘స్టేటస్ కో’ మైంటైన్ చెయ్యి గీతా.." వంటిట్లో ఉన్న ఆమెకు వినపడేలా అభినందించాను నేను.

***శుభం ***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






























90 views1 comment
bottom of page