top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Love Challenge Episode 13' Telugu Web Series Written By


Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్గత ఎపిసోడ్ లో…


శాన్వీ మీద అనుమానంతో ఆమె దగ్గరకు వచ్చిన జీవన్ కి ఆధారాలేవీ దొరకలేదు.

గురుమూర్తికి పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దినకరన్ కాల్ చేసి చక్రధరం తో వైరం వద్దనీ, ఇద్దరికీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాననీ అడుగుతాడు.

కొడుకును సంప్రదించి చెబుతానంటాడు గురుమూర్తి.

ఇక చదవండి…


రేపు పొద్దునే జీవన్ తో ఈ విషయం మాట్లాడాలి. కానీ అప్పటికి తనకు ఈ విషయాలు గుర్తుంటాయా.. మామూలుగానే మరుపు వస్తోంది.


పైగా ఈ రోజు టివి స్క్రోలింగ్ విషయంగా టెన్షన్ పడి కాస్త ఎక్కువ డ్రింక్ తీసుకున్నాడు.మరి ఎలా గుర్తు పెట్టుకోవాలా అని ఆలోచించాడు.


ఏదైనా బుక్ లోనో డైరీలోనో రాసుకుంటే..


కానీ ఆలా రాసుకున్న విషయం గుర్తుకి రావాలిగా..


అలోచించి, రేపు దినకరన్ కి కాల్ చెయ్యాలని గోడ మీద రాసి పెట్టుకోవాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా మార్కర్ పెన్ కోసం వెతికాడు.

కనపడక పోవడంతో పడుకొని ఉన్న తన భార్య ధనలక్ష్మిని లేపాడు.


"ధనం.. ధనలక్ష్మీ.. కాస్త స్కెచ్ పెన్ గానీ మార్కర్ గానీ ఇస్తావా.." అడిగాడు ఆమెని.

"ఈ టైం లో ఎందుకండీ.." అడిగిందామె.

"ఎదురు మాట్లాడకుండా ఒక్క పని చెయ్యవు కదా! నోర్ముసుకొని స్కెచ్ పెన్ ఇవ్వు" అన్నాడు గురుమూర్తి ఊగిపోతూ.

టేబుల్ డ్రా వెదికి మార్కర్ పెన్ ఇచ్చిందతనికి.


దాంతో గోడమీద 'రేపు దినకరన్ కి ఫోన్ చెయ్యాలి.. చక్రధరం విషయంగా..' అంటూ రాసాడు.

రాశాననుకున్నాడు గానీ అవన్నీ పిచ్చి గీతల్లాగా వచ్చాయి.

భార్యతో తను రాసింది చదవమన్నాడు.

"అదేదో భాష.. గుళ్ళల్లో రాతి గోడల మీద ఉంటుంది.. ప్రాకృతం కాబోలు. అలా వుంది. ఒక్క ముక్క అర్థం కావడం లేదు.రేపు ఉదయం ఫోన్ చేస్తానని ఇందాక ఎవరితోనో అంటున్నారు. ఆ విషయమేనా?" అడిగిందామె.

"ఆ మాటలన్నీ విన్నావా! మరి ఆ ముక్క గోడలు ఖరాబు చెయ్యక ముందే చెప్పొచ్చుగా" అన్నాడు గురుమూర్తి.

"మీరు చిన్న పిల్లాడిలా గోడల మీద రాస్తారని అనుకోలేదు. అయినా మా పుట్టింటి వాళ్ళు కూడా మందు కొడతారు. మా నాన్నయితే ఫుల్ బాటిల్ తాగినా తొణకడు. మీరేమిటి నాలుగైదు పెగ్గులకే పెద్ద గొడవ.. చేసిన యాగీ చాలుగానీ పడుకోండి" అని గదమాయించింది ధనలక్ష్మి.

పిల్లిలా ఆమె పక్కన పడుకున్నాడు గురుమూర్తి.

***

మర్నాడు ఉదయాన్నే గురు మూర్తి ని నిద్ర లేపింది అతని భార్య ధనలక్ష్మి.


నిద్ర లెయ్యగానే ఎదురుగా గోడ మీద పిచ్చి పిచ్చిగా ఉన్న గీతాల్ని చూసాడు.


"ఈ గీతలేమిటి? మొన్న మీ అక్కయ్య మనవడు వచ్చినప్పుడు గీచాడా? గోడను పాడు చేసాడు. ఏమైనా అంటే మా పుట్టింటి వాళ్ళు అంటూ వెనకేసుకొస్తావు.." చిరాగ్గా భార్యతో అన్నాడు గురుమూర్తి.


"వాడు కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్నాడు. నాలుగో తరగతైనా చక్కగా రాస్తాడు. వీధి బళ్ళో చదివిన ఓ యాభై ఏళ్ళ పెద్దాయన తాగిన మైకంలో గీకి ఉంటాడు లెండి" అంది ఆమె.


రాత్రి తను గోడ మీద ఏదో రాసినట్లు లీలగా గుర్తు అతనికి.


కానీ అదేమిటో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు.


ఇలా మర్చిపోవడాన్ని అదేదో జబ్బు అంటారట.. ఆ పేరు కూడా గుర్తుకు రావడం లేదు.

నిస్సహాయంగా భార్య వైపు చూసాడు.


“నిన్న ఎవరికో ఫోన్ చేయాలని చెప్పారు. అబ్బాయిని నిద్రలేపి వాడితో మాట్లాడండి” అని చెప్పింది.


రాత్రి తాగిన మద్యం తాలూకు హ్యాంగోవర్ తో అతనికి తలనొప్పిగా ఉంది. అయినా ఓపిక తెచ్చుకొని పైకి లేచాడు. బ్రష్ చేసుకుని కొడుకు గదిలోకి వెళ్ళాడు.


నిద్రపోతున్న జీవన్ భుజం మీద సున్నితంగా తడుతూ, “బాబూ జీవన్! లేస్తావా.. నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు.


“ఇప్పుడే మాట్లాడాలా ? రాత్రి బాగా పొద్దు పోయింది. నిన్నటి గొడవలకు సరిగ్గా నిద్ర పట్టలేదు” బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు జీవన్.

“రిత్విక్ గురించి మన టీవీ ఛానల్ లో స్క్రోలింగ్ వేయించాం కదా.. ఆ విషయం గా చక్రధరం సీరియస్ అయ్యాడట. నేరుగా మన పార్టీ హై కమాండ్ వాళ్లకు మనమీద ఫిర్యాదు చేశాడట. వాళ్లు పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దినకరన్ చేత ఫోన్ చేయించారు. దినకరన్ మాట్లాడుతూ మన హైకమాండ్ కి ఆ చక్రధరాన్ని మన పార్టీ లోకి ఆహ్వానించే ఆలోచన ఉందని చెప్పాడు. అవసరమైతే నా సీటును అతనికి అప్పగిస్తారట” ఆందోళనగా అన్నాడు గురుమూర్తి.


నిద్రమత్తు వదిలింది జీవన్ కి.

ఒక్కసారిగా లేచి కూర్చుని, “అదేమిటి? ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి సీట్ ఇస్తే మన సంగతి ఏమిటి.. అదే జరిగితే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చెయ్యి నాన్నా! మన సత్తా ఏమిటో చూపిద్దాం” అన్నాడు జీవన్.

"ఆవేశంగా గతంలో అలా తమ గురించి గొప్పగా ఊహించుకొని, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు దారుణంగా దెబ్బతిన్నారు. మన పరిస్థితి కూడా అంతే అవుతుంది. విడి గా పోటీ చేసి నాలుగైదు వేల ఓట్లు తెచ్చుకుంటే మన కెపాసిటీ అంతే అని అందరికీ తెలిసిపోతుంది. పోనీ అపోజిషన్ పార్టీలో చేరుదామంటే మన వాళ్లు నా చేత ఆ పార్టీ నాయకుడిని ప్రతిరోజూ తిట్టించారు. మన ఛానల్లో వాళ్ల గురించి తప్పుడు ప్రచారాలు చేయించారు. ఇంత జరిగాక మనకు అక్కడ సీటు దొరకదు. దొరికినా ఆ పార్టీ కార్యకర్తలు ఎవరూ మనకోసం పని చెయ్యరు. చక్రధరం తో రాజీ చేసుకోవడమే ఉత్తమం అనిపిస్తోంది. జరిగిన విషయాలకు క్షమాపణలు చెప్పి, ఆయన జోలికి ఇంకెప్పుడూ రామని చెబుతాను. ఆయన శాంతిస్తే, నా సీట్ కు ఢోకా ఉండదు. ఇది నా అభిప్రాయం. నీ అభిప్రాయం కూడా చెప్పు. ఇది పిల్లల మధ్య మొదలైన వివాదం కాబట్టి నీ చేత కూడా క్షమాపణ చెప్పించాలని అడుగుతారేమో! కానీ నువ్వు తగ్గడం నీకే కాదు, నాక్కూడా ఎంత మాత్రం ఇష్టం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు” అన్నాడు గురుమూర్తి.


“నాన్నా! ఆద్య ను నేను మొదటి చూపు లోనే ప్రేమించాను. ఆమె కోసం ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెడతాను. ఆమె విషయంలో ఈ రోజు కాకపోయినా మరో రోజైనా రిత్విక్ తో తల పడక తప్పదు.


నువ్వు ఆ దినకరన్ కి ఫోన్ చేసి ‘ఇది పిల్లల విషయంగా వచ్చిన సమస్య కాబట్టి వాళ్లే సాల్వ్ చేసుకుంటారని చెప్పు. పిల్లలు ఈ రోజు తన్నుకున్నా రేపు ఒకటై పోతారు. అదే పెద్దవాళ్లు కల్పించుకుంటే గొడవలు పెరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని పిల్లలకు వదిలేయ’మని చెప్పు. మరో రెండు రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ ఉన్నాయి. ఆపై ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. అవి అయ్యాక నేను రిత్విక్ ని కలిసి, ఈ విషయాల గురించి మాట్లాడుతానని చెప్పండి. నా ఉద్దేశంలో చక్రధరం ఇందుకు ఒప్పుకుంటాడని అనుకుంటున్నాను. అంతగా కాదంటే అప్పుడు మీరు మాట్లాడుకునే విషయం ఆలోచిద్దాం” అన్నాడు.


“అలాగే జీవన్! నువ్వు చెప్పినట్లే దినకరన్ తో చెప్పి చూస్తాను. కానీ ఫైనల్స్ ముగిశాక అయినా సరే, సమస్యను ఎలా పరిష్కరించాలి? అప్పుడైనా మనం తగ్గ తప్పదు కదా!” అన్నాడు గురుమూర్తి.


“నాన్నా! జరగబోయే క్రికెట్ మ్యాచ్ లలో రిత్విక్ అట్టర్ ప్లాప్ అయ్యేలా, నేను సూపర్ హిట్ అయ్యేలా ప్లాన్ చేశాను. ఈ రెండు మ్యాచ్ లూ ముగిసేసరికి సిటీ లో నా పేరు మార్మోగిపోతోంది. ఆ తరువాత జరిగే భేటీలో నాదే పైచేయి అవుతుంది” తను వేయబోయే ప్లాన్ పట్ల విశ్వాసంతో చెప్పాడు జీవన్.

“తొందర పడకు జీవన్! నిన్న పబ్ విషయంలో జరిగిన పొరపాటు ఎన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టిందో చూసావు కదా. ఈసారి ఏ ప్లాన్ వేసినా ముందుగా నాకు చెప్పు. నాకున్న అనుభవంతో అందులో ఉండే లోటుపాట్లు నీకు చెబుతాను. తరువాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. క్రికెట్ బుకీ పూర్నేష్ తో నువ్వు మాట్లాడింది ఈ విషయాలేనా? ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ కి ప్లాన్ చేస్తున్నావా?” అడిగాడు గురుమూర్తి.


“ఆరోజు నీకు కాల్ చేసి ‘ఎందుకు అని అడక్కుండా ఐదు కోట్లు కావాలి నాన్నా’ అన్నాను. నువ్వు సరే అన్నావు. ఆ డబ్బు ఇందుకోసమే. జరగబోయే క్రికెట్ మ్యాచ్ లో అవతల వైపు ప్లేయర్స్ కొందరిని కొనబోతున్నాను. వాళ్ల సహాయంతో నేను చక్కగా ఆడేటట్లు, రిత్విక్ ఘోరంగా విఫలం అయ్యేటట్లు పూర్నేష్ ప్లాన్ వేస్తున్నాడు” అన్నాడు జీవన్.


“దీంట్లో ప్లాన్ చెయ్యడానికి ఏముంటుంది? నువ్వు ఆడే దాన్ని బట్టే కదా నీకు వచ్చే రన్స్ ఉంటాయి? అలాగే రిత్విక్ బాగా ఆడకుండా నువ్వెలా ఆపగలవు? ” అన్నాడు గురుమూర్తి.


“నీకు క్రికెట్ గురించి పూర్తి అవగాహన లేదు నాన్నా! కాబట్టి అర్థం కావడం కష్టం. అయినా చెబుతాను విను.


మామూలుగా అయితే ఓ మ్యాచ్లో నేను ఒక ముప్పై రన్ లు తీసి రన్ అవుట్ అవుతాననుకుందాం. కానీ ఆ బంతిని త్రో చేసిన వ్యక్తి మన మనిషి అయి ఉంటే, పక్కకు వెళ్లేలా విసురుతాడు. నేను సేవ్ అయితే మరికొన్ని రన్స్ చేసే అవకాశం ఉంటుంది.


అలాగే మన మనిషి ఉన్న వైపు బంతిని ధైర్యంగా సిక్స్ కి లేపవచ్చు. పొరపాటున క్యాచ్ కి అందినా, అతను మిస్ చేస్తాడు” తండ్రికి అర్థం అయ్యేటట్టు వివరించాడు జీవన్.


“ఇందుకు అవతలివైపు వాళ్ళు ఒప్పుకుంటారంటావా” అడిగాడు గురుమూర్తి.


“అందరూ కాదు కానీ కొంతమంది లొంగుతారు. మరి కొంత మందికి బహుమానం ఆశ చూపించవచ్చు. రిత్విక్ కి మైడెన్ ఓవర్ వేస్తే ఓ లక్ష ఇస్తామనీ, అతను కొట్టిన బంతిని క్యాచ్ చేస్తే రెండు లక్షలు ఇస్తామనీ, అతనిని క్లీన్ బౌల్డ్ చేస్తే ఐదు లక్షలు బహుమానంగా ఇస్తామని.. ఇలా రకరకాలుగా ప్రయత్నించవచ్చు. స్టూడెంట్స్ కాబట్టి నీతీ నిజాయితీ అంటూ కొందరు ఆదర్శాలు పాటించవచ్చు.


కానీ వందకో వెయ్యికో పేరెంట్స్ మీద ఆధార పడేవాళ్ళకు లక్షల్లో ఇస్తామంటే ఆశ పుడుతుంది.

ఆ డబ్బుతో ఎలా ఎంజాయ్ చేయవచ్చో పూర్నేష్ వాళ్లకు ఊరించి చెబుతాడు. అతని చేతిలో కొందరు మోడల్ గర్ల్స్ ఉన్నారు. అవసరమైతే వాళ్ళను ఎరగా చూపిస్తాడు.


అవన్నీ పూర్నేష్ చూసుకుంటాడు. ఎక్కడా మన పేరు బయటకు రాదు. బెట్టింగ్స్ కోసమే ఇదంతా తను చేయిస్తున్నట్లు చెప్పుకుంటాడు” వివరించాడు జీవన్.

“అలాగే కానివ్వు. కానీ చాలా జాగ్రత్తగా ఉండు. ఒకసారి హెచ్చరించిన తరువాత కూడా మనం రిత్విక్ ని టార్గెట్ చేశామని వాళ్లకు తెలిస్తే ఊరుకోరు. చక్రధరం గట్టిగా అనుకుంటే మనల్ని ఏమైనా చెయ్యగలడు. ” అని చెప్పాడు గురుమూర్తి.


“అలాగే నాన్నా! ఈరోజు కాలేజీలో రిత్విక్ తో, ఆద్యతో ఏమీ తెలియనట్లు ఉంటాను” అన్నాడు జీవన్.


కానీ అతని మనసులో టెన్షన్ గానే ఉంది. నిన్న జరిగిన సంఘటన పట్ల ఆద్య, దీప్తి ల రియాక్షన్ ఎలా ఉంటుందోనని అతనికి ఆందోళనగా ఉంది. శాన్వి తో రూడ్ గా ప్రవర్తించడం కూడా తప్పని అతనికి అనిపిస్తోంది.

మొత్తానికి మొదటిసారి భయపడుతూ కాలేజీ కి వెళ్ళాడు జీవన్.

అతను వెళ్లేసరికి అతని మిత్ర బృందం కాలేజీలో ఉన్నారు.


“హాయ్ జీవన్!” అంటూ ఎప్పటిలాగే పలకరించింది శాన్వీ. సాగరికతో సహా మిగతా వాళ్ళు కూడా నార్మల్ గానే ఉన్నట్లు అనిపించింది అతనికి. మరికాసేపటికి రిత్విక్ కాలేజీ లోకి ఎంటర్ అయ్యాడు.


జీవన్ ని చూసిన అతను నేరుగా అక్కడికి వచ్చాడు.


“జీవన్! ఈరోజు నుండి మధ్యాహ్నం పూట కాలేజ్ కి వెళ్ళకుండా గ్రౌండ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేద్దాం. మన టీం మేట్స్ అందరికీ మెసేజ్ పెడుతున్నాను. నిన్ను కలిసిన వాళ్లకి నువ్వు కూడా చెప్పు” అన్నాడు.


రిత్విక్ నార్మల్ గా మాట్లాడటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు జీవన్.

మరికొంతసేపటికి ఆద్య, దీప్యలు కూడా కాలేజీకి వచ్చారు.


కాస్త భయపడుతూనే వాళ్ల వంక చూశారు జీవన్, చందూలు.

కానీ వాళ్లు ఎప్పటిలానే ఉండడంతో రిలాక్స్ అయ్యారు.


రిత్విక్, జీవన్ లు ఒకేచోట ఉండడంతో ఆద్య, దీప్యలు అక్కడికి వచ్చారు. ఈలోగా ఆ కాలేజ్ క్రికెట్ టీమ్ లోని మరికొందరు మెంబర్స్ కూడా అక్కడికి వచ్చారు.


రిత్విక్ ఆద్య తో “మధ్యాహ్నం నుంచి క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. క్వార్టర్ ఫైనల్స్ లో మా టీం తో ఓడిపోయిన వాళ్ళను రిక్వెస్ట్ చేసి, ఫైనల్స్ అయ్యేవరకూ ప్రాక్టీస్ కోసం రమ్మన్నాము. ఒప్పుకొన్నారు. వీలుంటే మీరు కూడా వచ్చి కాసేపు మా ప్రాక్టీస్ మ్యాచ్ చూడవచ్చు” అని రిక్వెస్ట్ చేసాడు.


“ఖచ్చితంగా వస్తాము. నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్” చెప్పింది ఆద్య.


‘ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎలాగైనా బాగా ఆడి, ఆద్య దృష్టిలో పడాలి’ అనుకున్నాడు జీవన్.


ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


37 views0 comments

Comments


bottom of page