కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu Episode - 9' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
కనకారావు ఇంటికి వెళ్ళడానికి తోడు రమ్మంటుంది జయా ఆంటీ.
ఒప్పుకుంటుంది సమీర.
స్నేహ ఒక మొబైల్ సమీరకు ఇచ్చి కాల్ చెయ్యమంటుంది.
ఇక చదవండి....
కాల్ చేసిన సమీర అటువైపునుండి గౌతమ్ గొంతు వినపడ్డంతో ఉద్వేగానికి లోనవుతుంది.
ఆనందం, దుఃఖం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి.
ఆమె కళ్ళవెంట అశ్రువులు ధారగా కారుతున్నాయి.
"కూల్ సమీరా! యిపుడేమయ్యిందని అంతలా ఏడుస్తున్నావ్? అన్నీ సర్దుకుంటాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రమోద్ స్పృహలోకి రావచ్చు. అతను చెప్పేదాన్ని బట్టి పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు" చెప్పాడు గౌతమ్.
అయినా సమీరకు దుఃఖం ఆగలేదు.
"సమీరా! ఏడవకు. అన్నట్లు ఇప్పుడు నా పక్కన ఎవరు ఉన్నారో తెలుసా?" అడిగాడతను.
తెలీదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది సమీర.
"ఏం మాట్లాడవు? ఒకవేళ నువ్వు తల ఊపి వుంటే నాకు కనపడదుగా! వీడియో కాల్ చేస్తానుండు" అంటూ కాల్ కట్ చేసాడు గౌతమ్.
కొద్ది నిముషాలకే వీడియో కాల్ చేసాడతను.
ఫోన్ లిఫ్ట్ చేసిన సమీర అటువైపు తన తండ్రిని చూసి నిర్ఘాంత పోయింది.
"నాన్నా!' అంటూ గట్టిగా ఏడ్చేసింది.
"ఊరుకో సమీరా! విషయం తెలియగానే నేను, మీ అమ్మా, మీ అత్తమామలు హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడి పోలీస్ ఉన్నతాధికారులు చాలామంది నాకు జూనియర్ లు. వాళ్ళను కలిసి సహాయం అడిగాను. వీలయినంతవరకు గౌతమ్ అరెస్ట్ కాకుండా కాపాడతామని చెప్పారు. మరీ రాజకీయ ఒత్తిడి వస్తే పరారీలో ఉన్నట్లు చూపుతామని, ఈ లోగా ప్రమోద్ స్పృహలోకి వస్తే సమస్యే ఉండదని చెప్పారు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు” కూతుర్ని ఓదారుస్తూ చెప్పాడు సమీర తండ్రి మాధవరావు.
కాస్త కుదుట పడింది సమీర. ఆయన రిటైర్డ్ ఐ పి ఎస్ ఆఫీసర్ కాబట్టి గౌతమ్ కి న్యాయం జరుగుతుందన్న ధైర్యం వచ్చిందామెకి.
అంతలో గౌతమ్ తండ్రి శ్రీరామ మూర్తి ఫోన్ అందుకొని, "వాళ్లకు మా ఫోన్ నంబర్లు ఎలా తెలిశాయోగానీ మీ నాన్నకు, నాకు కూడా ఫోటోలు పంపారు. మామూలుగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు 'తప్పు మీ అమ్మాయిదనీ.. కాదు కాదు మీ అబ్బాయిదనీ..’ వియ్యంకులు ఒకరినొకరు నిందించుకుంటారు. కానీ ఇక్కడ అలాకాదు. నేను నిన్ను నూరు శాతం నమ్మితే, మీ నాన్నగారు గౌతమ్ ను నూటపది శాతం నమ్ముతున్నారు. అయన సహకారం లేకుంటే ఈ పాటికి గౌతమ్ చాలా ఇబ్బంది పడి ఉండేవాడు" అన్నాడు.
కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి సమీరకు.
అందరూ ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు..? కానీ తను మాత్రం గౌతమ్ ను అనుమానించింది...
గిల్టీగా ఫీల్ అయింది సమీర.
ఆమె ముఖ కవళికలు గమనించిన శ్రీరామమూర్తి, ఫోన్ గౌతమ్ కు అందించాడు.
ఫోన్ అందుకున్న గౌతమ్ కన్నీళ్లతో తల దించుకొని ఉన్న సమీరను చూసి చాలా బాధపడ్డాడు.
"సమీరా! నీ తప్పేం లేదు. నా మీద ఉన్న ప్రేమ వల్ల నీకు అలా అనిపించి ఉండవచ్చు. అయినా నేనే నీతో అబద్ధాలు చెప్పి పొరపాటు చేసాను" అంటూ సమీరను ఓదార్చబోయాడు.
"లేదు గౌతమ్! నేను ప్రమోద్ నుండి బొకే అందుకున్న ఫోటో చూసినా నువ్వు అనుమానించలేదు. మన పేరెంట్స్ కూడా మనల్ని అనుమానించలేదు. నేను మాత్రం..." అంటున్న సమీరను మధ్యలోనే ఆపేసాడు గౌతమ్.
"సరే అయితే. నన్ను అనుమానించి నువ్వు పొరపాటు చేసావు. అందుకు పరిహారంగా తొందర్లో జూనియర్ గౌతమ్ నో జూనియర్ సమీరనో ఇవ్వు" అన్నాడు విషయాన్ని తేలికపరచడానికి ప్రయతిస్తూ.
"యూ... పక్కన పెద్దవాళ్లున్నారని మర్చిపోయావా.." అంది సమీర సిగ్గుతో కూడిన కోపంతో.
"హమ్మయ్య! నార్మల్ అయ్యావన్నమాట. ఇక మీ అమ్మగారితో, అత్తగారితో కూడా మాట్లాడు" అంటూ ఫోన్ తన అత్తగారికి అందించాడు.
తన తల్లితో, అత్తగారితో మాట్లాడాక సమీర మనసు మరింత తేలిక పడింది.
తరువాత గౌతమ్ ఫోన్ అందుకొని "సాయంత్రం జయా ఆంటీతో కనకారావు ఇంటికి డొనేషన్ కోసం వెళ్ళు. కనకారావు తన ఇంటి దగ్గర పెద్ద మనిషిలానే ఉంటాడు. కాబట్టి భయపడాల్సిందేమీ లేదు. అయినా స్నేహ నీకు ఒక మైక్రోఫోన్ ఇస్తుంది. నేను కనకారావు ఇంటికి పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఉంటాను. నీ మాటలు నాకు రిసీవర్ ద్వారా వినబడతాయి. నాతో పాటు ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఉంటారు. ఈ ఏర్పాట్లు మీ నాన్నగారు చేయించారు. నువ్వు ధైర్యంగా ఉండు. అతను రాజకీయ నాయకుడు కాబట్టి తగిన ఆధారాలు లేకుండా పోలీసులు చర్య తీసుకోలేరు" అని చెప్పాడు.
"గౌతమ్! నువ్వెన్ని చెప్పినా నా గుండె దడ తగ్గట్లేదు. అయినా నువ్వు చెప్పినట్లు చేస్తాను" అని చెప్పి అందరికీ బై చెప్పి ఫోన్ పెట్టేసింది సమీర.
స్నేహ, సమీరకు ధైర్యం చెబుతూ "నాకు తెలిసి ఈ రోజు నీకు ఏ ఇబ్బందీ కలగదు. నిన్ను ఇంప్రెస్ చెయ్యడానికి జయా ఆంటీకి భారీగానే డొనేట్ చేస్తాడు కనకారావు. తరువాత జయా ఆంటీ నిన్ను కలిసి ప్రమోద్ కి యాక్సిడెంట్ జరిగిందనీ, పోలీసులు గౌతమ్ ను అరెస్ట్ చెయ్యబోతున్నారనీ అప్పుడే తెలిసినట్లుగా చెబుతుంది. కనకారావు సహాయం తీసుకోమని చెబుతుంది" అని చెప్పింది.
"ఈ జయా ఆంటీకి పొయ్యేకాలం వచ్చింది కాబట్టే నా గౌతమ్ జోలికి వచ్చింది. లోపల కుట్రలు చేస్తూ పైకి నా వెల్ విషర్ లాగా నటిస్తోంది. నేను అంతకంటే బాగా నటించి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను" అంది సమీర.
"హాట్స్ ఆఫ్ సమీరా! నాకు సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ నీలా ధైర్యంగా ఎదిరించాలనుకోలేదు. గౌతమ్ ధైర్యం చెప్పక పోయి వుంటే ఈ పాటికి.." సందీప్ తనని అనుమానించిన విషయం గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహకు.
అంతలోనే తేరుకొని, "ఇదేమిటి? నీకు ధైర్యం చెప్పమని గౌతమ్ నన్ను పంపిస్తే నేనిలా ఏడుస్తున్నాను?" అంటూ కళ్ళు తుడుచుకుంది.
"ధైర్యం లేకుంటే పక్కనే జయా ఆంటీ ఉందని తెలిసినా ఇక్కడికి వచ్చేదానివా.. నీ బాధల్లా సందీప్ ఇక్కడ లేకపోవడమే" అంటూ స్నేహాను ఊరడించింది సమీర.
“నా ధైర్యం ఇక్కడ ఉండటమే. ఇక్కడ ఏం జరిగినా ఆంటీ పైకి అనుమానం వస్తుంది. కాబట్టి నాకే హానీ తలపెట్టరు. పైగా నేను వచ్చినట్లు వాళ్లకు తెలీదు" అంది స్నేహ.
అలా అనుకోవడం పెద్ద పొరపాటని స్నేహకు ఆ క్షణంలో తెలీదు. ఆ పొరపాటు ఏ ప్రమాదానికి దారి తీస్తుందో కూడా ఆమె ఆ క్షణంలో ఊహించి ఉండదు.
"నువ్వు బయటి నుంచి లాక్ చేసుకొని వెళ్ళు. నేను ఇంట్లోనే ఉంటాను" అంది సమీరతో.
స్నేహాను జాగ్రత్తగా ఉండామని చెప్పి డోర్ బయటనుండి లాక్ చేసింది సమీర. తరువాత జయా ఆంటీ ఇంటి బెల్ నొక్కింది.
సమీర కోసమే ఎదురు చూస్తున్న ఆంటీ, పర్వీన్ వెంటనే బయటకు వచ్చారు.
"ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఏమిటి?' బయటకు వచ్చి సమీరను చూడగానే అడిగింది ఆంటీ.
ఉలిక్కిపడింది సమీర.
"ఎవరూ లేరు. ఏం అలా అడిగారు?" ప్రశ్నించింది సమీర, తన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ.
ఒకసారి సమీరవంక సూటిగా చూసింది జయా ఆంటీ.
కాస్త భయపడింది సమీర.
ఆంటీ పకపకా నవ్వేస్తూ "ఒక బ్యూటీషియన్ చాలాసేపు కస్టపడి రెడీ చేసినట్లు ఉన్నావు. ఒక్కదానివే ఇంత త్వరగా అందంగా ఎలా రెడీ అయ్యావు? నిన్ను చూస్తుంటే నాకే..." అంటూ సమీరను కౌగలించుకొని తన పెదాలు ముందుకు సాగదీస్తూ ఉండగా సమీర బలవంతంగా విడిపించుకొంది.
వెంటనే పర్వీన్ కూడా సమీరను కౌగలించుకోబోయి, జయా ఆంటీ సైగతో ఆగి, కాళ్లకు నమస్కరించింది.
తనను పైకి లేపిన సమీరతో, "అక్కా! నువ్వు చేస్తున్న ఈ సహాయం జన్మలో మరచిపోను" అంది.
ముగ్గురూ కలిసి జయా ఆంటీ కారులో బయలుదేరారు. డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లు అనిపించింది సమీరకు.
అది గ్రహించిన ఆంటీ " ఈ రోజనగా మా డ్రైవర్ లీవ్ పెట్టాడు. అందుకని నా చెల్లెలి కొడుకు ప్రవీణ్ ను రమ్మన్నాను. వీడు నీకు తెలుసుగా... ఆ రోజు గదిలో... వీడిని చూసి, నిన్నేదో చేసేస్తాడని భయపడ్డావు. వీడిది నీ రేంజ్ కాదని వీడికి తెలుసులే" అంది.
ఆమె మాటలు అర్థం కాలేదు సమీరకు.
డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్ మిర్రర్ ను సమీర కనిపించేలా అడ్జస్ట్ చేసి, అందులోంచి సమీరను చూస్తూ అదోలా నవ్వాడు. ఆ నవ్వు చూడగానే ఒళ్ళు జలదరించింది సమీరకు.
తాను ట్రాప్ కాబోతోందా..
తలచుకోగానే చెమటలు పట్టాయి సమీరకు.
సశేషం....
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
コメント