top of page

శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Srivari Kattu Kathalu Episode - 3' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్



గత ఎపిసోడ్ లో

గౌతం తనతో లీవ్ శాంక్షన్ కాలేదని చెప్పి, ఆఫీసుకు వెళ్తున్నట్టుగా నటించి, ఎక్కడికో వెళ్లడం సమీరను చాలా బాధించింది. అదే సమయంలో పక్క పోర్షన్ జయా ఆంటీ సమీరను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇక చదవండి...


"నా మీద కోపం తగ్గినట్లుగా ఉందే!" అంటూ లోపలికి వచ్చి సోఫా లో కూర్చుంది జయా ఆంటీ. ఏం మాట్లాడకుండా ఆమె పక్కనే కూర్చుంది సమీర.


అంతలోనే చటుక్కున పైకి లేచి "సారీ ఆంటీ! మీకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కూర్చుంటున్నాను. టీ పెట్టుకుని వస్తాను" అంటూ లోపలికి వెళ్లబోయింది.


జయా ఆంటీ ఠక్కున పైకి లేచి సమీర భుజం మీద చేయి వేసి "మనలో మనకు మర్యాదలు ఎందుకే? కూర్చో " అంటూ సోఫా లో తన పక్కనే కూర్చో పెట్టుకుంది.


తన భుజం మీది నుంచి ఆమె చెయ్యి తీయకపోవడంతో సమీర తన భుజం ఒకసారి కదిలించి ఆమె చేతిని నెమ్మదిగా తొలగించింది.


"అదేంటి పిల్లా? ఏ ఎదురింటి కుర్రాడో చెయ్యి వేసినట్లు అలా ఉలిక్కి పడ్డావు?" అంటూ సమీరను దగ్గరకు లాక్కొని బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టింది.


ఆమెను విడిపించుకుని పైకి లేచింది సమీర, "ఏంటి ఇది..." అంటూ కాస్త కోపంగా.


కానీ ఆమెలో తనమీద మునుపటి కోపం లేదని గ్రహించింది జయా ఆంటీ.

' ఎంతమంది అమ్మాయిలని బుట్టలో వేసుకోలేదు? నువ్వు ఒక లెక్కా..." అన్నట్టుగా సమీర వంక చూసి, "తప్పుగా అనుకోకు పిల్లా. నేనేమీ లెస్బియన్ ను కాదు. ఇష్టం ఎక్కువైతే ఎవరైనా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటారు. మీ ఆమ్మో అత్తమ్మో అయితే నిన్ను ముద్దు పెట్టుకోరా?" అంటూ తిరిగి తన పక్కన కూర్చో పెట్టుకుంది.


ఇంతలో డోర్ బెల్ మోగడంతో జయా ఆంటీ ని విడిపించుకుని తలుపు తెరిచింది సమీర.. ఎదురుగా ఎదురింటి ప్రమోద్ నిలుచొని ఉన్నాడు.


'ఎందుకొచ్చారు?' అన్నట్లుగా అతని వంక చూసింది సమీర.

"ఆంటీ కోసం ఎవరో వచ్చి వెళ్లారు. ఆవిడ మీ ఇంట్లోకి రావడం చూశాను. కాస్త పిలుస్తారా?" అన్నాడు ప్రమోద్.


"అయ్యో నా మతి మండా! మా మహిళా మండలికి డొనేషన్ ఇవ్వమని మన కార్పొరేటర్ గారిని అడిగాను. వివరాలు మాట్లాడటానికి ఆయన తన తమ్ముడిని పంపిస్తాం అని చెప్పాడు. ఆ విషయం మర్చిపోయి నిన్ను చూసుకుంటూ కూర్చున్నాను" అంది జయా ఆంటీ సమీరతో.


తరువాత ప్రమోద్ వైపు తిరిగి "వాళ్ళు ఏమైనా చెప్పారా?” అని అడిగింది.


"కార్పొరేటర్ కనకారావు ఓ అరగంటలో వస్తారని చెప్పమన్నారు" అన్నాడు ప్రమోద్.

"ఇదిగో బాబూ! ఏమీ అనుకోకుండా నాకు ఒక పూల బొకే తెచ్చి పెడతావా? కార్పొరేటర్ గారికి ఇస్తే బాగుంటుంది. ఆయన దయతలిచి నాలుగు డబ్బులు ఇస్తే అనాధ మహిళలకు కాస్త సహాయం చేయవచ్చు. 'ఆంటీ కోసం ఇప్పుడు బయటకు వెళ్ళి రావాలా' అవి విసుక్కోకుండా వెళ్ళు. సమీర స్వయంగా నిన్ను అడిగినట్లుగా అనుకో. సమీరే నిన్ను అడిగి ఉంటే వెళ్ళవా? అలాగే అనుకుని వెళ్ళు. మా బాబు కదూ.." అంటూ అతన్ని రిక్వెస్ట్ చేసింది.


ఆమె మధ్యలో తన పేరు తేవడం సమీరకు నచ్చలేదు.

"అలాగే ఆంటీ” అంటూ వెనక్కి వెళ్ళబోయాడు ప్రమోద్.

"చూడు బాబూ! ఆ బొకే తీసుకొని నేరుగా మా డోర్ బెల్ నొక్కవద్దు. కార్పొరేటర్ గారు ఏమైనా తప్పుగా అనుకోవచ్చు. నువ్వు ఆ బొకే సమీర దగ్గర ఇవ్వు. ఈ పిల్ల నాకు చేరుస్తుంది" అంది జయా ఆంటీ.

సరేనంటూ వెళ్ళాడు అతను.


" ఆంటీ! నాకు తల నొప్పిగా ఉంది. నేను పడుకుంటున్నాను. మీరే అతని దగ్గర బొకే తీసుకోండి. ఏమీ అనుకోవద్దు" అంది సమీర.


"ఇలాంటి విషయాలేనమ్మా నన్ను బాధించేవి! మగాడు పరాయి ఆడవాళ్లను బైక్ లో లేదా కారులో డ్రాప్ చేసినా తప్పుగా అనుకోరు. ఆఫీసునుండి తిన్నగా ఇంటికి రాకుండా రాచకార్యాలు వెలగబెట్టినా ఆడాళ్ళు సర్దుకుపోవాలి. వాళ్ళు చెప్పే కట్టు కథలు నమ్మాలి. అదే ఒక అమ్మాయి పక్కింటి ఆంటీకి సహాయం చేయడం కోసం ఒక బొకే తీసుకుంటే నీ మొగుడు నిన్ను అనుమానిస్తాడని భయపడుతున్నావు" అంది జయా ఆంటీ.


"అదేం కాదు ఆంటీ! గౌతమ్ అలా అనుమానించే వాడు కాదు. నాకే ఎందుకో అలా పరాయి మగవాళ్ళతో మాట్లాడటం ఇష్టం ఉండదు" అంది సమీర.


"నువ్వు మా కాలంలో పుట్టాల్సిన దానివి. నేను ఈ కాలంలో పుట్టాల్సిన దాన్ని. అయినా నీవేం మాట్లాడనక్కర లేదే పిల్లా. గమ్మున అతను ఇచ్చిన బొకే అందుకో. వీలైతే 'థాంక్స్' అని ఒక మాట పలుకు. అదే మహాభాగ్యం అనుకొని మురిసిపోతాడు ఆ అబ్బాయి. ఇంకేం మాట్లాడకు. వాళ్లు వచ్చే టైం అయింది. బొకే తెచ్చివ్వడం మర్చిపోకు" అంటూ తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది ఆంటీ.


ఏం జరుగుతోందో సమీరకు ఏమీ అర్థం కావడం లేదు. ‘ఈ ఆంటీ తనను విసిగిస్తోంది. నిన్నటి లాగే ఆమెతో కఠినంగా ఉండి ఉంటే అంతటితో తనను వదిలేసేది. తనే గౌతమ్ మీద కోపంతో ఈమె విషయంలో కాస్త మెత్తబడింది’ అనుకుంటూ డోర్ వేసుకొని వంట పని చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. అలా వెళ్లిందో లేదో ఆమె ఫోన్ మోగింది. గౌతమ్ చేస్తున్నాడు.


ఫోన్ తీసి "హాయ్ గౌతమ్! ఆఫీస్ లో ఉన్నావా? ఈ రోజు కూడా రావడానికి లేట్ అవుతుందా" అని అడిగింది సమీర.

"లేదు సమీరా! మోహిత గారు నా కోసం లీవ్ క్యాన్సిల్ చేసుకున్నారు. నాకు ఈరోజుకు సెలవు ఇచ్చారు. నేను బయలుదేరి వస్తున్నాను. ఇద్దరం నూన్ షో కి వెడదాం" అన్నాడు గౌతమ్.


" అయ్యో! ఇంకా వంట మొదలు పెట్ట లేదండీ" అంది సమీర.

" వంట పని ఈరోజుకు వదిలేయి. బయటకి వెళ్దాం . నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు. నేను ఒక అరగంట లో వచ్చేస్తా" అన్నాడు గౌతం..


అంతలో అతనే మాట్లాడుతూ "ఏం డ్రస్సు వేసుకుంటావు?" అని అడిగాడు.


ఒక్క క్షణం ఆలోచించింది సమీర. ఇదేమిటి ? తనకు అతని మీద ఉన్న కోపం ఏమైపోయింది? అతను ఇంటికి వచ్చాక నిన్న ఎక్కడికి వెళ్ళాడో నిలదీసి అడుగుదామా అని అనుకుంది కానీ 'నిన్నటి విషయం గురించి ఈరోజు పాడు చేసుకోవడం ఎందుకు? ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చులే ' అని సర్ది చెప్పుకుంది..


సమీర డ్రెస్ సెలక్షన్ గురించి ఆలోచిస్తోందని అనుకున్న గౌతమ్ “నేనే చెప్తానులే. బ్లాక్ కలర్ లెగ్గింగ్స్, పైన వైట్ కలర్ టీ షర్ట్ వేసుకో. ఇంకా.." అంటూ అతను ఏదో చెప్పబోతూ ఉండగా

"వైట్ కలర్ టీ షర్ట్ కింద రెడ్ కలర్ బ్రా వేసుకోమంటారా? అప్పుడు కదా అందరూ నన్ను తినేసేలా చూస్తారు" అంది సమీర.


"నువ్వు చీరలో వచ్చినా అందరూ నీ వంక అలాగే చూస్తారు. నీ అందం అటువంటిది. తొందరగా రెడీ అవ్వు. బై 'అంటూ ఫోన్ పెట్టేసాడు గౌతమ్.


అతనిపై ఉన్న కోపం అంతా క్షణాల్లో మాయమైపోయింది. హుషారుగా విజిల్ వేసుకుంటూ స్నానానికి వెళ్ళింది సమీర. నిన్నటి లాగే ఒక్కొక్క డ్రెస్ విప్పుతూ అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోయింది.


చకచకా స్నానం ముగించి, టవలు చుట్టుకొని బెడ్ రూం లోకి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని తనని తాను చూసుకుంటూ 'ఇంత అందమైన భార్య ఉండగా గౌతమ్ పక్క చూపులు చూడడు. నిన్న ఫ్రెండ్స్ తో ఏదైనా పార్టీకి వెళ్లి ఉండవచ్చు. తను అనవసరంగా అతన్ని ఏదో అడిగి హర్ట్ చేయకూడదు...'


ఇలా ఆలోచిస్తూ బీరువాలో నుంచి అతను చెప్పిన బ్లాక్ కలర్ లెగ్గింగ్స్ , వైట్ టీ షర్ట్ బయటకు తీసింది. లెగ్గింగ్స్ వేసుకొని బ్రా వేసుకోబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. బహుశా ఎదురింటి ప్రమోద్ వచ్చి ఉంటాడు. ఎలా ...


ఆలస్యం చేస్తే అతను ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తను వెళ్లి బెల్ కొట్టి అతన్ని పిలవాలి. వెంటనే వెళ్లి అతని దగ్గర్నుంచి ఆ బొకే తీసుకోవాలి' అనుకొని బ్రా పక్కన పెట్టి, తొందరగా టీ షర్ట్ వేసుకొని హాల్లోకి వచ్చి డోర్ తీసింది. అప్పటికే అతను తన అపార్ట్మెంట్ లోకి వెళ్లి తలుపు వేసుకో బోతున్నాడు.


అప్రయత్నంగా సమీర బయటకు వచ్చి "ప్రమోద్ గారూ!" అంటూ పిలిచింది.

అతను సమీరని చూసి బయటకు వచ్చి బొకే ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె అతనికి 'థాంక్స్' చెప్పింది. అతను సమీర వంక కన్నెత్తి కూడా చూడకుండా తన అపార్ట్ మెంట్ లోకి వెళ్ళిపోయాడు.


" హమ్మయ్య! గండం గడిచింది" అనుకొని ఇంట్లోకి రాబోయింది సమీర.

అప్పుడే పక్క అపార్ట్మెంట్ తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన జయా ఆంటీ సమీరను చూసి "బొకే తీసుకున్నావా. ఇలా ఇవ్వు" అంది.


సమీర ఆమె దగ్గరకు వెళ్లి బొకే అందించింది.

"చాలా థ్యాంక్స్ పిల్లా! ఏమీ అనుకోకుండా.మరొక సహాయం చేస్తావా?" అని అడిగింది జయా ఆంటీ.

"ఏమిటో చెప్పండి" అంది సమీర.


"ఓ అరగంటలో ఆ కార్పొరేటర్ మా ఇంటికి వస్తాడట. హాలంతా గందరగోళంగా ఉంది. ఒక్కదాన్నే సర్దుకోలేక పోతున్నాను. కాస్త హెల్ప్ చేయవే ప్లీజ్..." అంటూ దీనంగా అభ్యర్థించింది ఆమె. కాదనలేక పోయింది సమీర. కానీ ఆమె ఇంటికి వెళ్ళాలి అంటే ఎందుకో సంకోచంగా ఉంది.


సమీర సందిగ్ధాన్ని గమనించిన జయా ఆంటీ "ఇంట్లో ఎవరూ లేరు. వాళ్లు వచ్చేలోగా నువ్వు వెళ్ళిపోవచ్చు. భయపడకుండా రా. మా మహిళా మండలి సభ్యులను కూడా నలుగురైదుగురిని రమ్మన్నాను. ఎవరు వచ్చినా నువ్వు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్..." అంటూ మరోమారు అభ్యర్థించింది.


"కానీ గౌతం ఇప్పుడు ఇంటికి వస్తాను అన్నాడు. మేమిద్దరం బయటకు వెళ్లాలి" అంది సమీర.

"అలాగే వెళుదువు గానీ, ఈలోగా ఈ ఆంటీకి కాస్త హెల్ప్ చెయ్యవే" అంటూ సమీర గడ్డం పట్టుకుని అడిగింది జయా ఆంటీ.


ఇక ఎదురు చెప్పలేక డోర్ లాక్ చేసుకుని ఆంటీ ఇంట్లోకి నడిచింది సమీర. ఆమె చెప్పినట్లుగానే హాల్ కాస్త గందరగోళంగా ఉంది. తనకు తోచినట్లు సర్దడం ప్రారంభించింది సమీర.


"పోయిన సంవత్సరం కూడా ఈ కార్పొరేటర్ మాకు డొనేషన్ ఇచ్చాడు. అప్పట్లో మేము 'కలియుగ కర్ణుడు కార్పొరేటర్ కనకారావు గారికి స్వాగతం' అంటూ ఒక బ్యానర్ రెడీ చేసాము. ఆ బ్యానర్ ఎక్కడుందబ్బా.. " అంటూ తన బుగ్గమీద చూపుడు వేలితో తట్టుకుంటూ కాసేపు ఆలోచించింది జయా ఆంటీ.


"ఆ! గుర్తొచ్చింది. బెడ్ రూమ్ లో అటక పైన ఉంచాను. దాన్నే వాడుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఫోల్డింగ్ నిచ్చెన ఉంది. అది వేసుకొని నువ్వేమైనా ఆ బ్యానర్ తీయగలవా?" అంటూ "నా పరిస్థితి చూశావుగా. నడవడమే కష్టంగా ఉంది. ఇక నిచ్చెన పైకి ఎక్కడం అసాధ్యం" అంది.


"అలాగే పదండి" అంటూ ఆమె వెంట బెడ్రూమ్ లోకి నడిచింది సమీర.

"అలా మంచం మీద కూర్చోవే పిల్లా! నిచ్చెన తీసుకొని వస్తాను" అంది జయా ఆంటీ.

ఇంతలో హాల్లోంచి ఎవరో "జయా! జయా... ఎక్కడున్నావ్" అంటూ పిలవడం వినిపించింది.


"ఆ కార్పొరేటర్ వచ్చినట్లు ఉన్నాడు. నేను వెళ్లకపోతే ఇక్కడికే వచ్చేస్తాడు. నిన్ను ఈ డ్రెస్ లో చూసాడంటే ఇంకేమైనా ఉందా? నువ్వు ఇక్కడే ఉండు. నేను అతన్ని కూర్చోబెట్టి వస్తాను" అంటూ హాల్లోకి నడిచింది జయా ఆంటీ. చేసేదేమీలేక బెడ్ పైన కూర్చుంది సమీర.


ఇంతలో ఓ పాతికేళ్ల కుర్రాడు ఆ గదిలోకి వచ్చాడు.

భయంతో ఒళ్ళంతా ఒణికి పోయింది సమీరకు..

***ఇంకా ఉంది ***

(శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 4 అతి త్వరలో....)



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



2,187 views0 comments

Comments


bottom of page