top of page

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Srivari Kattu Kathalu Episode - 2' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో...

భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమీర. కానీ అతను ఎంతసేపటికీ రాడు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాననీ, మరికాసేపట్లో వచ్చేస్తానని చెబుతూ ఉంటాడు. అనుకోకుండా అతని బాస్ మోహిత ఫోన్ చేసి గౌతమ్ సెలవులో ఉన్నట్లు చెబుతుంది.

ఇక చదవండి…


మెదడంతా మొద్దు బారి పోయినట్లు అనిపించింది సమీర కు.

గౌతమ్ తనతో అబద్ధం చెప్పాడా...?

ఎంత మాత్రం నమ్మలేక పోతోంది. మరోవైపు 'మగాళ్ళు వట్టి మాయగాళ్ళు' అంటూ పక్క పోర్షన్ జయా ఆంటీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

‘కానీ ఆమె మాటలు నమ్మి తను గౌతమ్ ను అనుమానించ కూడదు. తొందరపడి ఏ నిర్ణయానికీ రాకూడదు. అలాగని ఇదివరకు లాగా అతన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇలాంటప్పుడే తన తెలివితేటలు చూపించాలి. తను అనుమానిస్తున్నట్లుగా గౌతమ్ కు ఎంత మాత్రం సందేహం రాకూడదు' .


ఆలోచన వచ్చిందే తడవుగా వాష్ బేసిన్ వద్దకు వెళ్లి ముఖాన్ని కడుక్కుంది.

ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకుని నార్మల్ గానే ఉన్నట్టుగా తెలుసుకుంది. తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్లి అటువైపు తిరిగి పడుకుంది.


సమీర చాలా ఆతృతగా బాత్రూమ్ డోర్ తెరుచుకున్న శబ్దం కోసం ఎదురుచూస్తూ ఉంది.

'గౌతమ్ బయటకు రాగానే ఏం చేస్తాడు? ముందు తన బాస్ కు కాల్ చేయవచ్చు. ఎందుకంటే అతను బాత్రూం లో ఉండగా ఆవిడ నుండి కాల్ వచ్చినట్లు తను చెప్పింది కదా! లేదా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తను ఎంతగా అవస్థ పడిందీ వివరించి చెప్పవచ్చు. ఈ రెండేనా లేక మరేదైనా విషయం మాట్లాడే అవకాశం ఉందా? తను డోర్ తీసేటప్పుటికి అతను జయా ఆంటీ తో మాట్లాడుతూ ఉన్నాడు.


ఒకవేళ ఆమె, తను ఎదురు అపార్ట్మెంట్ ప్రమోద్ తో మాట్లాడిన విషయం గురించి గౌతమ్ తో ఏమైనా చెప్పిందా? చెప్పడానికి ఏముంది... జస్ట్ ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఏమైనా ఉందా లేదా కనుక్కుందామని అతని దగ్గరికి వెళ్ళింది. తప్పేముంది? అలా అనుకుంటే గౌతమ్ చేసిన దాంట్లో మాత్రం తప్పేముంది? కాస్త ఆలస్యం అయింది. అంత మాత్రానికే తను ఏదో ఊహించుకుంటే ఎలా ? కానీ ఆఫీసుకి వెళ్తున్నట్లు తనకి చెప్పడం తప్పు కాదా?

ఇంతకీ జయా ఆంటీ అతనితో ఏం మాట్లాడింది? దానికి అతని రియాక్షన్ ఏమిటి?


నో... నో... గౌతమ్ అలా సిల్లీగా ఆలోచించడు.

మరి తను?

తను కూడా అంతే! కాకపోతే జయా ఆంటీ మాటల ప్రభావం కాస్త తన మీద పడ్డట్టు ఉంది. అది లేకపోతే ఈ విషయాన్ని తను పట్టించుకునేది కాదు.


కానీ ఆమె భావించినట్లు ఆ రెండూ జరగలేదు. ఎంతసేపటికీ బాత్రూం డోర్ తెరిచిన శబ్దం వినపడక పోవడంతో ఆలోచనలు ఆపి, ఇటు పక్కకు తిరిగింది సమీర. ఆశ్చర్యంగా గౌతమ్ అప్పటికే ఆమె పక్కన పడుకొని ఉన్నాడు. శబ్దం అవుతుందని బాత్రూమ్ డోర్ లాక్ చేయకుండా అలానే వచ్చేశాడు. మరింత జాగ్రత్తగా బెడ్ ఏమాత్రం కదలకుండానే తన పక్కకు చేరాడు.


ఏదో చెప్పబోతున్న సమీరను తన పైకి లాక్కొని, "ఏదైనా తరువాత మాట్లాడుకుందాం. నీకు బాకీ ఉన్న వంద సారీలు కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం వేస్ట్ చేసే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు" అన్నాడు.


సమీర ఏదో జవాబు ఇచ్చేంతలో కాలింగ్ బెల్ మోగింది. అతను పైకి లేవడానికి వీలుగా అతని మీద నుంచి పక్కకు జరిగింది సమీర. అప్పుడు చూసింది అతను నైట్ డ్రెస్ కూడా వేసుకోకుండానే టవల్ తోనే తన పక్కకు చేరడం!


" మీరు ఉండండి. నేను వెళ్ళి చూస్తాను" అంటూ బయటకు వెళ్లింది సమీర. డోర్ తెరిచి చూసేసరికి ఎదురుగా జయా ఆంటీ ఉంది. చెప్పలేనంత చిరాకు కలిగింది సమీరకు.

"చెప్పండి. ఏం కావాలి మీకు?" అంది సమీర.


'నార్మల్ గా మాట్లాడాలి' అనుకున్నా కూడా ఆమె మాటల్లో కఠినత్వం తొంగి చూసింది.

"ఎల్లుండి మా ఇంట్లో మా మహిళా మండలి సభ్యుల మీటింగ్ ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలి. ఉదయం 10 గంటలకు పైన, మొగుళ్ళు ఆఫీసులకు వెళ్లాకే, మీటింగ్ ఉంటుంది. మరిచిపోవద్దు సుమా" అంది జయా ఆంటీ.


"అందుకోసం ఇప్పుడు డిస్టర్బ్ చేయాలా?" అంది సమీర.

" నువ్వు అప్పుడే తలుపులు బిడాయించుకుంటావని నేను అనుకోలేదు పిల్లా. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటి వరకు నేను నీ విషయం... అదే ఎదురింటి అబ్బాయి ప్రమోద్... నువ్వు దుపట్టా లేకుండా... ఇవేవీ గౌతమ్ తో చెప్పలేదు. నేను చెప్పి ఉంటానని ఆనుకొని, నువ్వెక్కడ టెన్షన్ పడి మూడ్ పాడు చేసుకుంటావో అని, నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. అన్నట్లు ఎల్లుండి మా మీటింగ్ కి రావడం మర్చిపోవద్దు పిల్లా!" అని చెప్పి వెనక్కి తిరిగింది జయా ఆంటీ.


"చూడండి ఆంటీ! మా మధ్య దాపరికాలు ఏమీ లేవు. ఎదురింటి ప్రమోద్ తో మాట్లాడిన విషయం నేనే గౌతమ్తో చెప్పేస్తాను. ఈ విషయం గురించి మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేసి, మీ మీటింగ్ కి రప్పించుకోనఖ్ఖర్లేదు" అంది సమీర చాలా కోపంగా.


"చూడు పిల్లా! నువ్వు నా గురించి చాలా తప్పుగా అనుకుంటున్నావు. మా ఇంటికి వచ్చిన వాళ్ళను కిడ్నాప్ చేసి, రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తానన్నట్లుగా నా గురించి నీకు ఎవరో నూరి పోశారు. పదేళ్లనించి ఇక్కడే ఉంటున్నాను. అలాంటిదేమైనా వుంటే నన్ను ఈ పాటికి తన్ని, తరిమేసే వాళ్ళు. నా మీద పంతంతో తొందరపడి గౌతమ్ తో ఏమీ చెప్పవద్దు. నా మాట నమ్ము. మగవాళ్ళు వొట్టి అనుమానపు మనుషులు. నీ వీక్ పాయింట్ ఏదైనా దొరికితే వాళ్లు మరింత రెచ్చిపోతారు. నువ్వు ఇప్పుడు బాగా కోపంగా ఉన్నావు. మరో సారి వచ్చి మాట్లాడతాను" అని విస విసా నడుచుకుంటూ తన అపార్ట్ మెంట్ లోకి వెళ్ళింది జయా ఆంటీ.


తలుపు విసురుగా మూసి లోపలికి వస్తూ ఒక్క క్షణం ఆలోచించింది సమీర.

'నిజమే! తను తొందరపడి గౌతమ్ తో ఏమీ మాట్లాడకూడదు. అనవసరంగా అతడికి అనుమానం కలిగించకూడదు' అనుకుంటూ బెడ్ రూం లోకి వచ్చింది.


సమీర లోపలికి వచ్చేసరికి అతను బెడ్ రూమ్ డోర్ దగ్గరే ఉన్నాడు. కనీసం ఎవరు వచ్చారని కూడా అడక్కుండా ఆమెను తన చేతులతో చుట్టేశాడు.

తన ఆలోచనలకు స్వస్తి చెప్పి, అతన్ని బెడ్ పైకి తోసింది సమీర.

రాత్రి రెండు గంటలకు మెలకువ వచ్చింది సమీరకి. తామిద్దరూ డిన్నర్ చెయ్యని విషయం గుర్తుకు వచ్చింది.


అతన్ని సున్నితంగా కదుపుతూ "గౌతమ్! పద భోంచేద్దాం. నాకు బాగా ఆకలిగా ఉంది"అంది.


"నా ఆకలి తీరిపోయింది. నీకు ఇంకా ఆకలిగా ఉందా...?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు గౌతమ్. రెండు చేతులతో తన ముఖం కప్పుకొని, సిగ్గు పడింది సమీర.

ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ "పద. వెళదాం" అన్నాడు గౌతమ్.


ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. ఇద్దరికీ భోజనం వడ్డించింది సమీర.

"అన్నట్లు ఇందాక మీ బాస్ మోహిత కాల్ చేసింది. ఆ విషయం నీకు అప్పుడే చెప్పాను కదా! నువ్వు లిఫ్ట్ చెయ్యక పోవడంతో నా మొబైల్ కి కాల్ చేసింది. లీవ్ విషయం గురించి కాల్ చేసిందట" అంది అతని ముఖం వంక చూస్తూ.


ఉలిక్కిపడ్డాడు గౌతమ్. అతనికి పొలమారడం తో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

అతని తలమీద తన ఎడం చేత్తో తడుతూ "కూల్ గౌతమ్! అంది సమీర.

కాసేపటికి స్థిమితపడ్డాడు గౌతమ్.


"అవును కదూ! మర్చిపోయాను. ఇప్పుడే ఆమెకు కాల్ చేస్తాను" అంటూ పైకి లేవ బోయాడు. "గౌతమ్! ఏమిటిది? ఇప్పుడు టైం రాత్రి రెండు గంటలు దాటింది. ఈ టైంలో కాల్ చేస్తావా" అంది సమీర.


“అవును కదూ! మర్చిపోయాను. ఇంతకీ ఆమె ఏం చెప్పింది?” ఆతృతగా అడిగాడు గౌతమ్.

"రేపు లీవ్ పెట్టడానికి కుదరదని చెప్పింది. ఆమె ఏదో పని మీద తన తాతగారి ఊరికి వెళుతుందట. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవని నన్నే మీతో ఈ విషయం చెప్పమంది. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది" అంది సమీర.


"అవునా! ఏమర్థమైంది?" తడబడుతూ అడిగాడు గౌతమ్.


"అదే! నేను అడిగినా ఈరోజు లీవ్ పెట్టలేక పోయారు కదా... అందుకని రేపైనా పెట్టడానికి ట్రై చేసి వుంటారు. అంతేనా?" అంది సమీర.


"ఎగ్జాక్ట్లీ సమీరా! సరిగ్గా నా మనసులో ఉన్నది కనిపెట్టేశావు" అన్నాడు గౌతమ్.


"కానీ రేపు కూడా లీవ్ ఇవ్వడానికి కుదరదట. ఆవిడా లీవ్ లో వెడుతోంది" అంది సమీర.

"బాడ్ లక్. ఇక నెక్స్ట్ వీక్ ట్రై చేయాల్సిందే" అన్నాడు గౌతమ్ బాధగా.

మర్నాడు ఉదయం నిద్ర లేచినప్పటినుండి, మోహితను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు గౌతమ్. కానీ ఆమెకు కాల్ కలవడం లేదు.



అతను సరిగ్గా అతను స్నానానికి వెళ్ళగానే ఫోన్ మోగింది. ఎవరా అని చూసింది సమీర.

'బాస్ కాలింగ్' అని వస్తోంది. అంటే మోహిత ఫోన్ చేసింది అన్నమాట. 'ఒకవేళ ఈరోజుకి లీవ్ శాంక్షన్ చేసిందా...' అనుకుంటూ హుషారుగా బాత్రూమ్ డోర్ తట్టింది.

డోర్ తీసిన గౌతమ్ తో "మోహిత కాలింగ్. ఇవ్వమంటారా?" అని అడిగింది.


"ఇలా ఇవ్వు" అంటూ బాత్ రూమ్ లో నుండే ఫోన్ అందుకుని తిరిగి డోర్ వేసుకున్నాడు గౌతమ్. అతను బయటకు వచ్చే వరకూ ఆతృతగా ఎదురు చూస్తోంది సమీర.

"ఏం చెప్పింది గౌతమ్? ఈరోజు ఏమైనా లీవ్ కుదురుతుందని చెప్పిందా?" అతను రాగానే అడిగింది సమీర.


"లేదు సమీరా! నీకు చెప్పిన విషయమే నాకు కూడా చెప్పింది. పైగా కాస్త ముందుగా ఆఫీస్ కి రమ్మని చెప్పింది. టిఫిన్ రెడీ చేశావా?" అని అడిగాడు గౌతమ్.


"రెడీగా ఉంది. ప్లేట్ లో పెట్టి పిలుస్తాను' అంటూ కిచెన్ లోకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ లో టిఫిన్ వడ్డించి, అతన్ని పిలవడానికి బెడ్ రూం వద్దకు వెళ్ళింది సమీర.


సమీర రావడం చూడగానే 'కాసేపట్లో వస్తాను కదా. మాట్లాడుకుందాం' అని చెప్తూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్. టిఫిన్ అన్యమనస్కంగానే ముగించి హడావిడిగా బయలుదేరాడు. అతను వెళ్లిన అరగంటకు మోహిత నుండి కాల్ వచ్చింది సమీరకు.

ఆశ్చర్యపోతూ కాల్ లిఫ్ట్ చేసింది సమీర.


"నిన్న లీవ్ ఇవ్వకపోవడంతో నీకు బాగా కోపం వచ్చిందని గౌతమ్ చెప్పాడు. ఐ యాం వెరీ సారీ! అందుకే మా మేనేజర్ తో మాట్లాడి ఈరోజు లీవ్ అరేంజ్ చేశాను. అందుకోసంగా నా లీవ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాను. గౌతమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందేమిటి? ఒకసారి ఫోన్ ఇవ్వవా?...ముఖ్యమైన విషయం చెప్పాలి" అంది.


"అదేమిటి? లీవ్ శాంక్షన్ కాలేదని ఇందాక మీతో మాట్లాడినప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పాడు?" ఆశ్చర్యంగా అంది సమీర.


అటువైపు క్షణం నిశ్శబ్దం.

"గౌతమ్ లీవ్ శాంక్షన్ చెయ్యమనీ, నా లీవ్ క్యాన్సల్ చేసుకుంటాననీ మా మేనేజర్ కు మెసేజ్ పెట్టాను. శాంక్షన్ చేస్తున్నట్లు ఇప్పుడే రిప్లై వచ్చింది. ఎనీ హౌ అతను ఆఫీస్ కి వస్తే నేను చెబుతాను. నీకు కాల్ కలిస్తే నువ్వు చెప్పు" అని చెప్పి ఫోన్ పెట్టేసింది మోహిత.


ఆమె గౌతమ్ ను కవర్ చేస్తోందని అర్థమయింది సమీరకి. ఒకవేళ ఆమె తన కన్నా ముందు గౌతమ్ తో మాట్లాడితే, తనకు కాల్ చేసిన విషయం చెబుతుంది. అప్పుడు గౌతమ్ తనకు ఫోన్ చేసి ఆ విషయం అప్పుడే తెలిసినట్లుగా నటించి ఇంటికి వచ్చేస్తాడు.

అలా కాకుండా ముందుగా తన కాల్ లిఫ్ట్ చేస్తే, ఆఫీస్ లో ఉన్నట్లే నటిస్తాడు. ఆ తర్వాత మోహిత కాల్ లిఫ్ట్ చేసి, తను దొరికిపోయినట్లు తెలుసుకుంటాడు. అప్పుడు దానికి తగ్గట్టు మరో అబద్ధం ప్లాన్ చేస్తాడు. అందుకే తను అతనికి కాల్ చేయకూడదు. అతని కాల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి" అని మనసులోనే నిశ్చయించుకుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తీసి చూస్తే ఎదురుగా జయా ఆంటీ.


ఆమెను చూడగానే ఇదివరకటిలా కోపం కలగలేదు సమీర కు.

'పాపం భర్త వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో' అని మనసులోనే కాస్త జాలిపడింది.

“లోపలికి రండి” అంటూ ఆమెను ఆహ్వానించింది. ఆమె బలవంతం చేస్తే రేపు జరిగే మీటింగ్ కు అటెండ్ కావాలని నిర్ణయించుకుంది.

ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుందని ఆ క్షణంలో ఆమెకు తెలీదు .


***ఇంకా ఉంది ***

(శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 3 అతి త్వరలో....)


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).













..









302 views0 comments

Comments


bottom of page