top of page

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link


'Srivari Kattu Kathalu Episode - 5' Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో...


జయా ఆంటీ ఇంట్లో పడగ్గదిలో ప్రవీణ్ అనే కుర్రాడితో ఉండి పోవాల్సిన పరిస్థితి వస్తుంది సమీరకు.

బయటకు వెళ్ళబోయిన ఆమెను తలుపుకు అడ్డంగా నిలబడి ఆపుతాడు ఆ యువకుడు.

ఇక చదవండి...


తనను అతడు అడ్డగించడంతో కోపంతో ఊగిపోతోంది సమీర.

అంతలో అతను రెండు చేతులూ జోడించి సమీరకు దండం పెడుతూ " ప్లీజ్ అక్కా! నువ్వలా వెళ్ళిపోతే నేనేదో చేశానని అందరూ అనుకుంటారు. నాకు రావాల్సిన ఉద్యోగం కూడా రాదు. అటకమీద ఉన్న ఆ బ్యానర్ తీసుకొని వెళ్ళిపోతాను. నీ తట్టు చూడను అక్కా! ప్లీజ్..." అంటూ అభ్యర్ధించాడు.


క్షణం ఆలోచించింది సమీర.

'ఇలా మొహమాటంలో పడ్డం వల్లనే కదా నిషా అనే ఓ అమ్మాయి ఆ మధ్య బలైపోయింది.

ఏమైతే అది అవుతుంది. తాను గట్టిగా కేకలు పెడితే మంచిది...'

ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతను కిందకు వంగి సమీర కాళ్లకు నమస్కరించబోయాడు. అప్రయత్నంగా అతని భుజంపై చెయ్యి వేసి ఆపింది సమీర.

"సరే. త్వరగా వెళ్ళు" అంది సమీర డోర్ దగ్గరే నిలుచొని.


అతను సమీరకు మరొకసారి దండం పెట్టి ఆ బ్యానర్ తీసుకొని వెళ్ళిపోయాడు.

నిజంగానే అతను సమీర వంక కన్నెత్తి కూడా చూడలేదు.

తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సమీర.


హాల్లో ఓ ఐదారు మంది మహిళా మండలి సభ్యురాళ్లు వచ్చి ఉన్నట్లు శబ్దాలను బట్టి గ్రహించింది సమీర. గౌతమ్ వచ్చే టైం అయింది. అతను వచ్చేసరికి తాను ఇక్కడ ఉండటం బాగుండదు.


అప్పుడైనా ఈ కార్పొరేటర్ కంట్లో పడాల్సిందే కదా. ఇప్పుడే వెళ్లిపోవడం మంచింది.

పైగా తన ఫోన్ కూడా ఇంట్లోనే వుంది. గౌతమ్ కాల్ చేసాడేమో.


'ఈ డ్రస్ లో అతనికి కనిపించకు' అని జయా ఆంటీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

తనేమయినా అర్ధ నగ్నంగా ఉందా? ఒకసారి ఆ బెడ్ రూమ్ లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ లో తనను చూసుకుంది.


లెగ్గింగ్స్ పైన పలచటి టి షర్ట్ తో, చూడగానే కాస్త రెచ్చగొట్టేలా ఉంది. అయినా గౌతమ్ అన్నట్లు తను చీరలో కూడా సెక్సీ గానే ఉంటుంది. తప్పు తన అందానిదే.

జయా ఆంటీ ఏమనుకున్నా సరే.. తను వెంటనే వెళ్ళిపోవాలి.

అనుకున్నదే తడవుగా డోర్ తెరిచి హాల్ లోకి వచ్చింది.


అక్కడ కనకారావు(కార్పొరేటర్) తో సహా అందరూ తన వంక గుడ్లప్పగించి చూడడం కాస్త ఇబ్బంది కలిగించింది ఆమెకు.

జయా ఆంటీ వైపు తిరిగి "గౌతమ్ వచ్చే టైం అయింది. నేను వెళతాను" అంది.

కనకారావు సమీరను తేరిపార చూస్తూ "ఈ అమ్మాయిని ఎప్పుడూ ఇక్కడ చూడలేదే? మీ గ్రూపులో కొత్తగా చేరిందా?" అని జయా ఆంటీని అడిగాడు.


"మాకు అంతోటి అదృష్టం కూడానా? ఈ అమ్మాయే మా సంఘంలో వుంటే మీబోటి మహారాజులు, మేము అడిగిన దానికి రెట్టింపు డొనేషన్ లు ఇవ్వరూ? పక్క అపార్ట్మెంట్ లో ఉంటుంది. పేరు సమీర. కొత్తగా పెళ్లయింది." అని చెప్పింది జయా ఆంటీ.


ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసింది ఆమె.

ఎదురుగా ప్రమోద్ ఉన్నాడు.


'ఇదేమిటబ్బాయ్? మగదిక్కు లేని అపార్ట్మెంట్ కి వచ్చి బెల్ కొట్టేయడమేనా? ఏదైనా వుంటే మీ ఆవిడను పంపించాలి" అంది జయా ఆంటీ.


అతను వెంటనే వెళ్ళిపోబోయాడు.

అతన్ని పిలిచి, "ఇదిగో అబ్బాయ్. మరీ అంత భయపడితే ఎలా? ఏదో.. ఇలా పరాయి మగాళ్లు వస్తూ వుంటే మా కనకారావు బావగారు... అదే .. కనకారావు బాబుగారు ఏమైనా అనుకుంటారని అలా అన్నాను " అంది జయా ఆంటీ, కనకారావును క్రీగంట చూస్తూ.


"ఆ కుర్రాడు ఎవరికోసమో వస్తే నేనెందుకు అనుకుంటాను?" అన్నాడు కనకారావు.

"హమ్మయ్య! మా బావగారు... అదే... బాబుగారు నా శీలాన్ని శంకించలేదన్న మాట!" అంది జయా ఆంటీ.


ఆ మాటలకు అందరూ గొల్లున నవ్వారు.

"ఐతే చెప్పవయ్యా మగడా.." అని నాలుక్కరుచుకొని, "చెప్పవయ్యా మగాడా! ఎవరికోసం వచ్చావు? ఈ నిర్మలా ఆంటీ కోసం వచ్చావా.. ఆ మోహినీ ఆంటీ కోసం వచ్చావా? వెనక కూర్చొని వుందే... ఆ వనజాక్షి కోసం వచ్చావా .. ముందు కూర్చొని మా బావగారి...అదే బాబుగారి కంట్లో పడాలని చూస్తోందే... ఈ పర్వీన్ ఆంటీ కోసం వచ్చావా?.."


జయా ఆంటీ మాటల ప్రవాహాన్ని అక్కడున్న ఆడాళ్ళందరూ కలిసి అడ్డుకున్నారు.

"ఎక్కడ మీ బావగారి...అదే.. బాబుగారి కంట్లో మేము పడతామో అని మమ్మల్నందరినీ ఆంటీలుగా చెబుతున్నావా?" సరదాగా అంది వనజాక్షి.


"నేనైతే థర్టీ ప్లస్. అంతే" అంది నిర్మల.

" నాకెందుకు తెలీదే..నీకు ముప్పై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు. అంతేనా..

మీ అందరి జాతకాలూ నా దగ్గర ఉన్నాయి" అంది జయా ఆంటీ.


"నేను.. నేను సమీర గారి కోసం వచ్చాను" చెప్పాడు ప్రమోద్.

అందరూ సమీర వంక, అతని వంక మార్చి మార్చి చూసారు.

బాగా ఇబ్బందిగా ఫీల్ అయింది సమీర.

ఇతనికి తనతో పని ఏమిటి? అదీ తను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు..

ఏమిటన్నట్లు అతని వంక కోపంగా చూసింది.


"గౌతమ్ మీకు కాల్ చేస్తే మీరు తియ్యలేదట. నాకు చేసాడు. తను ఇంటికి రావడం లేదట. అర్జెంట్ పని మీద వెళుతున్నాడట. మీకు చెప్పమన్నాడు..." పాఠం లాగా అప్పజెప్పి వెళ్ళిపోయాడు ప్రమోద్.


"కుర్రాడు బాగా భయస్తుడిలా ఉన్నాడు" అంది వనజాక్షి.

"ఇలాంటి వాళ్లే మెత్తగా కథ నడిపేస్తుంటారు" అంది మోహిని.

"ఎక్కడా? ఈ పిల్ల కంటి చూపుతోనే బయపెట్టేస్తుంటేనూ" సమీర వంక చూస్తూ దీర్ఘం తీసింది జయా ఆంటీ.


"మొదట్లో అలాగే బెట్టు చేయాలిలే" అంది పర్వీన్.

"తరువాత ఏం చెయ్యాలో కూడా నువ్వే చెప్పు" అంది నిర్మల.

అందరూ పెద్దగా నవ్వారు.


అప్పుడు ప్రవీణ్ మాట్లాడుతూ " ఇందాక పెద్దమ్మ చెప్పిందని బ్యానర్ తేవడానికి అక్క ఉన్న రూమ్ లోకి వెళ్లాను .. అబ్బ! ఎంత కోపంగా చూసిందనీ" అన్నాడు.


ఇంతలో జయా ఆంటీ కనకారావు వంక తిరిగి "ఇదేమిటి? బావగారిని... అదే.. బాబుగారిని ఎదురుగా పెట్టుకుని ఈ మాటలు మాట్లాడుతున్నాం మనం?" అంది.


తరువాత సమీరతో " నీ మొగుడు రావడం లేదుగా. వంట కూడా వండినట్లు లేదు. కాస్సేపు మాతో ఉండిపోరాదూ..ఇక్కడే భోంచేసుకొని వెడుదువు గానీ" అంది.

"అవును. కాసేపు ఉండండి" అన్నారు మిగతా వాళ్ళు.

ఆలోచించింది సమీర.


'ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి గౌతమ్ రాలేదని ఏడుస్తూ కూర్చోవడం కంటే ఇక్కడే సరదాగా గడిపితే పోతుంది' అనిపించింది ఆమెకు. పర్వీన్ ఆమె చెయ్యి పట్టుకొని, తన పక్కన కూర్చోపెట్టుకుంది.


ప్రవీణ్, నిర్మల కలిసి బ్యానర్ ను గోడవారగా కట్టారు. రెండు కుర్చీలు వేసి ముందు ఒక చిన్న టేబుల్ వేశారు. సోఫా లోంచి లేచి ఆ కుర్చీలో కూర్చున్నాడు కనకారావు.

జయా ఆంటీ అతని పక్కనే నిలబడి మాట్లాడుతూ "మన సంఘానికి విరాళం ఇవ్వడానికి వచ్చిన కనకారావు బావగారికి...ఇదేమిటి? ఈ రోజిలా బావగారు అనేమాట పదే పదే వస్తోంది? కనకారావు బాబుగారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా బావ... బాబుగారికి మన సమీర గారు బొకే ఇస్తారు" అంది.


"నేనా!" ఆశ్చర్యంగా అంది సమీర.

"లేదంటే మోహిని బొకే ఇస్తుంది. నువ్వు మెడలో దండ వేద్దువుగానీ" అంది జయా ఆంటీ.

"బొకే ఇస్తానులే" అంది సమీర చేసేదేమీ లేక..


"ఇప్పుడు మన అపార్ట్మెంట్ బ్యూటీ సమీర, మన బావ...బాబుగారికి బొకే ఇస్తుంది" అని చెప్పింది జయా ఆంటీ.

అతనికి బొకే అందించింది సమీర.

అందరూ చప్పట్లు కొట్టారు.


బొకే అందుకునేటప్పుడు తన చేతి వేళ్లను అతడు కావాలనే తాకాడని గ్రహించింది సమీర.

తరువాత మోహిని కనకారావు మెడలో దండ వేసింది. కానీ అతని చూపు సమీర పైనే ఉండటం గమనించింది మోహిని.

***

ఇక కారును రోడ్ పక్కగా ఆపిన గౌతమ్ వాట్స్ ఆప్ లో తనకు వచ్చిన ఫోటో చూసి ఆశ్చర్య పోతాడు. సమీర ఎదురు అపార్ట్మెంట్ దగ్గర నిలబడి ప్రమోద్ తో మాట్లాడుతున్న ఫోటో అది.


విపరీతమైన ఆవేశానికి లోనవుతాడు అతను.

వెంటనే ప్రమోద్ కు కాల్ చేస్తాడు.

"మా ఆవిడకు కాల్ చేస్తే తియ్యడం లేదు.బహుశా ఫోన్ ఇంట్లో పెట్టి, పక్కింటికి వెళ్లి ఉంటుంది. జస్ట్ .. ఆవిడ దగ్గరకు వెళ్లి, నేను ఇంటికి రావడం లేదని, అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పగలరా...ప్లీజ్" అడిగాడు గౌతమ్.


"ష్యూర్ " అన్నాడు ప్రమోద్.

"మీరు ఇంటి దగ్గరే ఉన్నారా?" మళ్ళీ అడిగాడు గౌతమ్.

"అవును. మా బంధువులు వస్తున్నారు. అందుకని లీవ్ పెట్టాను" చెప్పాడు ప్రమోద్.

"మీతో కొంచం మాట్లాడాలనుకున్నాను . సరే. మరో రోజు మాట్లాడుకుందాం" అన్నాడు గౌతమ్.


నేను మరో రెండు గంటలు ఫ్రీగానే ఉంటాను. పైగా నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి" చెప్పాడు ప్రమోద్.

" సరే. ముందు సమీరకు విషయం చెప్పి రండి" అన్నాడు గౌతమ్.

మరో ఐదు నిముషాలకు ప్రమోద్ కాల్ చేసాడు.


"విషయం చెప్పాను. ఇక నేనుఎక్కడికి రావాలో చెప్పండి" అని అడిగాడు.

ప్లేస్ చెప్పాడు గౌతమ్.

మరో పది నిముషాలు కార్ ని అక్కడే రోడ్ పక్కనే ఉంచి వెయిట్ చేసాడు.

అతను ఊహించినట్లుగానే అతనికి మరో వాట్స్ అప్ మెసేజ్ వచ్చింది.

అది సమీరకు ప్రమోద్ బొకే అందిస్తున్న ఫోటో.


ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా తన ఫ్రెండ్ వినీత్ కు కాల్ చేసాడు.

అతడు కాల్ లిఫ్ట్ చేయగానే " అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అన్నట్లు స్నేహ ఎలా వుంది?" అని అడిగాడు.


" మొన్న నువ్వు రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళావు కదా. అప్పట్నుంచి హుషారుగా ఉంటోంది" చెప్పాడు వినీత్.


"ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. ప్రమోద్ ని కూడా రమ్మన్నాను.అంతా మనం అనుమానించినట్లే జరుగుతోంది" అని చెప్పి కార్ స్టార్ట్ చేసాడు గౌతమ్.

ఇంకా ఉంది...


శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6 త్వరలో..మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


256 views0 comments

コメント


bottom of page