top of page

వెంటాడే నీడ ఎపిసోడ్ 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Ventade Nida Episode 3' New Telugu Web series written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

(రెండవ ఎపిసోడ్ లో సుమంత్ పై దాడి చేసిన ఆకారం అతను కొట్టిన రాతి దెబ్బకు కింద పడిపోతుంది. అతను ఆ వికృత ఆకారాన్ని గుంట తవ్వి పూడ్చి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఒక్కడే ఆ పని చేయలేక పోయాడు. సహాయం కోసం తన ఫ్రెండ్ విశాల్ కు కాల్ చేశాడు.

విశాల్ ఫోన్, వింత ఆకారం దగ్గరే మ్రోగుతుండటంతో ఆశ్చర్యపోయాడు.

ఇక మూడవ భాగం చదవండి.)ఏం జరిగిందో అర్థం కాలేదు సుమంత్ కి.

విశాల్ ఫోన్ ఈ ఆకారం దగ్గర ఉండటం ఏమిటి?

అంటే...

అంటే అతనికేమైనా హాని జరిగిందా ?

అతన్ని చంపేసి ఈ ఆకారం తననూ చంపటానికి వచ్చిందా?

ఆ ఊహే భరించలేకపోయాడు సుమంత్.


ఆవేశంతో గునపం తీసుకొని ఆ ఆకారాన్ని మళ్ళీ పొడవటానికి వెళ్ళాడు.

ఆ ఆకారం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది.

తనను సమీపిస్తున్న సుమంత్ ను కాలితో బలంగా తన్నింది.

వెల్లకిలా పడ్డ సుమంత్ పైకి దూకి అతని గుండెల మీద కూర్చుంది.

తన రెండు చేతులూ అతని మెడ చుట్టూ బిగిస్తోంది.

ఊపిరి ఆడటం లేదు సుమంత్ కి.


భయంతో, బాధతో గింజుకుంటున్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి.

"సుమంత్! ఏమైంది నీకు?" అన్న మాటలు వినిపించి కళ్ళు తెరిచాడు.

ఎదురుగా విశాల్!

నమ్మలేకపోయాడు సుమంత్.


ఒకసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసాడు.

సందేహం లేదు. విశాల్ తన పక్కనే ఉన్నాడు.

" ఏమైంది సుమంత్? ఎందుకు నా చేతులతో నీ మెడని బిగించుకోవాలని ప్రయతిస్తున్నావు ? బిగ్గరగా కేకలు పెడుతున్నావు... ఒళ్ళంతా రక్కుకుంటున్నావు.. ఏం జరిగింది? నేను నీ పక్కనే ఉన్నాను" సుమంత్ ను గట్టిగా కుదుపుతూ అడిగాడు విశాల్.


నెమ్మదిగా లేచి కూర్చున్నాడు సుమంత్.

ఒకసారి చుట్టూ చూసాడు.

ఇంకా చీకటి పడలేదసలు.

మరి తనకు వచ్చిందంతా కలా?


అతని అవస్థ చూసిన విశాల్ ప్రేమగా తల మీద నిమిరాడు.

విశాల్ ను గట్టిగా కౌగలించుకొని భోరున ఏడ్చేశాడు సుమంత్.


"విశాల్! ఇది కలంటే నమ్మలేక పోతున్నాను.

నిజంగా జరిగినట్లే ఉంది. నా వొళ్ళంతా ఒకటే నొప్పులు.

ఆ ఆకారం నన్ను గట్టిగా తోసింది. అప్పుడు నా ఎముకలకు తగిలిన దెబ్బల తాలూకు నొప్పి ఇంకా తగ్గలేదు.నా ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి చూడు. నా మాటలను నమ్ము ప్లీజ్! " ఉద్వేగంతో చెప్పాడు సుమంత్.


" కూల్ ఫ్రెండ్! టెన్షన్ పడకు. జరిగిన విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకో. మత్తు ఎక్కువ కావడంతో కాస్సేపు ఇక్కడే ఉంటానని చెప్పావు నువ్వు. నిన్ను ఒక్కడినే వదిలి వెళ్లడం ఇష్టం లేక నేను కూడా నీతో ఉన్నాను. నాతో మాట్లాడుతూనే నువ్వు గాఢ నిద్రలోకి జారుకున్నావు. కాస్సేపటికి నేను కూడా నిద్ర పోయాను. కొన్ని క్షణాల ముందే నువ్వు నా చేతులని నీ మెడ చుట్టూ బిగించుకున్నావు. నేను లేచి, నిన్ను గట్టిగా కుదపడంతో నీకు మెలకువ వచ్చింది. ఇంతే జరిగింది. మరి నీకు ఎలాంటి కల వచ్చిందో, నువ్వెందుకంత డిస్టర్బ్ అయ్యావో నాకు అర్థం కావడం లేదు." అని చెప్పాడు విశాల్.


తల అడ్డంగా ఊపాడు సుమంత్.

విశాల్! నా మాటలు విను. ఇది కలైతే నా వంటిమీద గాయాలు ఎలా వస్తాయి? కదలలేనంత నొప్పులు ఉన్నాయి. కలలో ఎవరన్నా నన్ను తోస్తే లేచాక నొప్పులు రావు కదా! ఇంకో విషయం! కలలో కనిపించిన ఆకారాలు నిద్ర లేచాక చాలా అస్పష్టంగా ఉంటాయి. కానీ ఆ ఆకారం ఇప్పటికీ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. చీకట్లో కూడా మెరిసే కళ్ళు, నోటినుండి బయటకు పొడుచుకు వచ్చిన దంతాలు, జడలు కట్టిన జుట్టు.... తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుతోంది.” అన్నాడు సుమంత్.


"నీ మెంటల్ కండిషన్ నేను అర్ధం చేసుకోగలను సుమంత్. నీ పరిస్థితిలో ఇంకెవరైనా వుంటే, నేను వాళ్ళతో ఈ పరిస్థితుల్లో వాదించను. వాళ్ళేం చెప్పినా సరే అని మరుసటి రోజు నేను చెప్పాలనుకున్నది చెబుతాను. కానీ నువ్వు ఇంటెలిజెంట్ వి. లాజికల్ గా ఆలోచించగలవు. అందుకే నీకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు మరీ డిస్టర్బ్ అయినట్లున్నావు. వద్దంటే ఈ విషయం గురించి రేపు చర్చించుకుందాం" అన్నాడు విశాల్.


"అదేం లేదు. నువ్వుచెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పు. నాకంటే నువ్వే బాగా ఆలోచిస్తావు." అన్నాడు సుమంత్.


"చూడు సుమంత్! ప్రశాంతంగా నేనుచెప్పేది విను. మన పార్టీ, లంచ్ రెండింటికి పూర్తయింది.


వెంటనే డ్రైవ్ చెయ్యడం ఎందుకని మరో రెండు గంటలు కబుర్లు చెప్పుకున్నాం. నాలుగు గంటలకు బయలుదేరుదామని నేను చెప్పాను. నాలుగుంపావుకి మిగతావాళ్ళు వెళ్లిపోయారు. మనమిద్దరమే ఇక్కడ ఉండిపోయాం. మరో పావుగంటకి ... అంటే సరిగ్గా 4.30 కి నువ్వు నిద్రలోకి జారుకున్నావు. ఇంతవరకు ఒప్పుకుంటావు కదా!" అన్నాడు విశాల్.


కొంతసేపు ఆలోచించాడు సుమంత్. తరువాత ఒప్పుకున్నట్లుగా తల ఊపాడు.

"ఇక అసలు పాయింట్ కి వద్దాం! ఇప్పుడు టైం ఎంతయిందో నువ్వే చెప్పు." అడిగాడు విశాల్.


వెంటనే తన వాచ్ వంక చూసుకున్నాడు సుమంత్. సరిగ్గా 5.00 అయింది. అదే చెప్పాడు విశాల్ తో.


“మనం దాదాపు పావు గంట నుంచి మాట్లాడుకుంటున్నాం. అంటే నువ్వు 4.45 కి నిద్ర లేచావు.


అంటే సరిగ్గా పావు గంట నిద్ర పోయావు. ఈ పావు గంటలో ఏం జరగడానికి అవకాశం ఉంది? ఒక్కసారి కూల్ గా ఆలోచించు.


మరో విషయం. ఒకసారి తల పైకెత్తి చూడు. ఇంకా ఎండ కాస్తోంది. కానీ నువ్వు చెప్పినదంతా రాత్రి పూట జరిగింది. ఇప్పుడు చెప్పు. నీకు వచ్చింది కల కాదంటావా?" అన్నాడు విశాల్.

ఆలోచిస్తున్నాడు సుమంత్.


చెప్పడం కొనసాగించాడు విశాల్."ఇక నీ బాడీ పెయిన్స్ గురించి.

మనం మూడు రోజులనుంచి ఈ తోటలోనే కబడ్డీ ఆడుతున్నాం. అందరికీ బాడీ పెయిన్స్ వున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆట. తిరిగి ఇంత కాలానికి మళ్ళీ మొదలు పెట్టాం. అంతే కాకుండా నీకు వచ్చిన కల వల్ల బాగా డిస్టర్బ్ అయి ఒళ్ళంతా రక్కుకున్నావు. అంతే కానీ నీ ఒంటిమీద బలమైన గాయాలేమీ లేవు.


ఇక ఈ తోట మన ఫ్రెండ్ హేమంత్ వాళ్ళది.

మనం ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాం కానీ హేమంత్ దాదాపు ప్రతి వారం కొంతమందిని వెంటేసుకొని వస్తూ ఉంటాడు. ఇదేమి జన సంచారం లేని చోటు కాదు.ఈ తోటకు వాచ్ మన్ కూడా ఉన్నాడు. అతను ఫ్యామిలితో ఇక్కడే ఉంటాడు. వింత ఆకారాలో, దయ్యాలో ఈ తోటలో వుంటే అతను ఇక్కడ ఎలా కాపురంఉంటాడు? కాబట్టి ఇక ఆ కల గురించి మర్చిపో. ఇంకా ఏమైనా డౌట్స్ వుంటే రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ ఇంటికి వెళ్లొద్దు. నాతో పాటు మా రూమ్ కి వచ్చెయ్యి. నీ బైక్ వాచ్ మన్ కి అప్పగిద్దాం. రేపు ఇద్దరం ఇక్కడికి మళ్ళీ వద్దాం. అప్పుడు నువ్వు నీ బైక్ ని తీసుకొని వెళ్ళవచ్చు. ఏమంటావ్?" అన్నాడు విశాల్.


విశాల్ చెప్పింది సబబుగానే అనిపించింది సుమంత్ కి.

ఇద్దరు బైక్ లు స్టార్ట్ చేసారు. గేట్ దగ్గరే ఒక గుడిసె వేసుకొని అందులో ఉంటాడు వాచ్ మన్.


సుమంత్ బైక్ ను అతనికి అప్పగించాడు విశాల్.

తరువాత అతన్ని పలకరిస్తూ "నీ పేరేమిటి?" అని ప్రశ్నించాడు.

"నా పేరు షణ్ముగం బాబుగారూ!" వినయంగా బదులిచ్చాడు అతను.

"చూడు షణ్ముగం ! ఇక్కడ ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నావ్?"


"హేమంత్ సార్ వాళ్ళ తాతగారు పదేళ్లకు ముందు.ఈ తోట కొన్నప్పటినుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. తోట కొన్న రెండు నెల్లకే అయన కాలం చేశారు. ఈ తోట కలిసి రాలేదని హేమంత్ వాళ్ళ నాన్నగారు ఇటువైపు వచ్చేవారే కాదు.తోటను లీజుకు ఇచ్చేశారు. అప్పుడప్పుడూ హేమంత్ బాబు కొంతమందితో వస్తుంటాడు." చెప్పాడు షణ్ముగం.


"ఈ తోటలో ఎప్పుడైనా దయ్యాల్ని చూసావా?" హఠాత్తుగా అతన్ని ప్రశ్నించాడు సుమంత్.

" లేదు బాబుగారూ! అలాంటిదేమైనా వుంటే నేను మా ఆడోల్లతో ఈడ కాపురం ఉంటానా?" అన్నాడు షణ్ముగం.


ఇంతలో గుడిసెలోనుంచి బయటకు వచ్చింది అతని భార్య చంద్రిక.

"ఏమీ లేదంటావేంటి ? ఈ తోట అమ్మినాయన వాళ్ళ నాన్న.... అదే ... ఈ వూరి ఎక్స్ సర్పంచి గోవర్ధనం బాబు ఈ తోటలోనే కదా రక్తం కక్కుకొని చనిపోయింది. అందుకేగదా వాళ్ళబ్బాయి ఈ తోట అమ్మింది. హేమంత్ బాబు వాళ్ళ తాత కూడా ఈ తోటలోనే కదా కాలం చేసింది.ఈన మాత్రం ఏమీ లేదంటాడు. నమ్మకండి బాబూ! " అంది ఆమె.


"నువ్వు ఆపేహే! లేనిపోనివి సెప్పి బయిపిచ్ఛద్దు. గోవర్ధనం బాబును పార్టీల గొడవల్లో చంపేసినారు.హేమంత్ బాబు వాళ్ళ తాత పాముకరిచి కదా చనిపోయింది.


అసలు ఇసయం సెబుతాను బాబూ మీకు. మాకు వయసుకొచ్చిన ఇద్దరు కూతుళ్లున్నారు. మీలాంటి కుర్రాళ్లు వస్తూ పోతు వుంటే ఎప్పుడైనా ఏదైనా గోరం జరుగుతాడని దీని బయ్యం.అందుకే ఆ మాటలు సెబతా వుంది." అన్నాడు షణ్ముగం.

చర్రున లేచింది చంద్రిక.


" నీకేమైనా ఇంగితం ఉన్నదా? నీకిద్దరు కూతుళ్లు ఉన్నారనీ, ఇద్దరూ వయసుకొచ్చినారని ఊరంతా టముకేసి సెప్తావా ! " అంటూ షణ్ముగాన్ని కసిరి పారేసింది.


ఆమె భయాన్ని అర్థం చేసుకున్న విశాల్ " చూడమ్మా! మేము సరదాగా పార్టీ చేసుకుంటాం గానీ తప్పుడు పనులు చేయం. ఆడవాళ్లంటే మా అందరికీ గౌరవం. మా గురించి మీరేమీ భయపడకండి " మీకు కూతురయితే మాకు చెల్లెలవుతుంది." అన్నాడు.


"మాకెందుకయ్యా బయ్యం? ఈ తోటలో ఉన్న గంగమ్మ రాయే మాకు కాపు. మీకే ఆ గోవర్ధనం బాబులాగా..." ఇంకా ఏదో చెప్పబోతున్న చంద్రిక , భర్త ఉరిమి చూడటంతో గుడిసె లోపలి వెళ్ళిపోయింది.


" నేను సెప్పానుగా. దాని బయ్యం దానిది దాని పిచ్చి మాటలు మనసుకెత్తుకోవద్దు బాబూ." అన్నాడు తోటమాలి షణ్ముగం.


" ఆమె మాటలతో మళ్ళీ భయం మొదలైందా?" సుమంత్ వంక పరిశీలనగా చూస్తూ అన్నాడు విశాల్.


"అబ్బే! అదేం లేదు. నువ్వు చెప్పిన లాజిక్ కి కన్విన్స్ అయ్యాను. నాకు ఏమీ జరగలేదని ఒప్పుకుంటున్నాను." అన్నాడు సుమంత్.


ఏమో ! నాకు డౌట్ గా ఉంది. ఒక పని చెయ్యి. బైక్ కాస్సేపు నువ్వే డ్రైవ్ చెయ్యి చూద్దాం" అన్నాడు విశాల్.


"అలాగే! నువ్వు చెబితే నిప్పుల్లో కూడా దూకుతాను. బైక్ డ్రైవ్ చెయ్యడం ఎంత?" నమ్మకంగా

అన్నాడు సుమంత్.


"సరదాగా అన్నానులే! నేనే డ్రైవ్ చేస్తాను" అన్నాడు విశాల్.

"ఏం ఫర్వాలేదు. నేను స్టడీ గానే ఉన్నాను. నిన్ను పడెయ్యనులే!" అన్నాడు సుమంత్.

"చిన్న మాట సెబుతాను, ఏమీ అనుకోమాకండి" భయపడుతూనే అన్నాడు షణ్ముగం.

ఏమిటన్నట్లు చూసారిద్దరూ.


"రెండో బండి కూడా ఈడే ఎట్టేసి ఇద్దరూ ఆటోలో ఎల్లండి. నా మాట ఇనండి. నాకెందుకో ఈ మాట సెప్పాలనిపించింది." అన్నాడు షణ్ముగం.

ఏంచేద్దామన్నట్లు సుమంత్ వంక చూసాడు విశాల్.


"అంత అవసరం లేదు దోస్త్. లెట్ మీ డ్రైవ్ " అన్నాడు సుమంత్, బైక్ స్టార్ట్ చేస్తూ.

అతని వెనకే కూర్చుని "వెళ్లొస్తాం షణ్ముగం అన్నాడు విశాల్. బైక్ ను వేగంగా ముందుకు దూకించాడు సుమంత్.


అప్పుడు సమయం 5.30

ఇంకా సూర్యుడు అస్తమించలేదు. వీళ్లకు వెనక వైపు నుంచి ఎండ పడుతోంది. బైక్ తో పాటు వీళ్ళ నీడ ముందు వైపుకు పడుతోంది.


ఇంకా కాస్త మత్తు ఉండటంతో మధ్యమధ్యలో తన దృష్టిని రోడ్డుపైనుంచి తమకంటే ముందు వెళుతున్న తమ నీడల వైపు మళ్లిస్తున్నాడు సుమంత్.

"మొత్తానికి నేను భయపడి నిన్ను కంగారు పెట్టాను. సారీ విశాల్. అయినా నేను చాలా లిమిట్ గానే తీసుకున్నాను కదూ!" అన్నాడు సుమంత్ .

వెనకనుంచి సమాధానం రాలేదు.


వెనక్కి తిరిగి చూడకుండా ముందు పడుతున్న నీడల వైపుచూసాడు సుమంత్.

అంతే! అతని చేతులు వణికాయి. నీడలో అతని వెనకున్నది విశాల్ కాదు. ఇందాక అతని మీద దాడి చేసిన వింత ఆకారం.


బ్రేక్ వేసి బైక్ ఆపాడు సుమంత్. వెనక్కి తిరిగి చూసాడు.

వెనక ఎవరూ లేరు. ముందు వున్న నీడ వైపు చూసాడు. తను ఒక్కడే ఉన్నాడు.

మరి విశాల్ ఏమయ్యాడు? ఏమీ అర్థం కాలేదతనికి.

ఇలాగే వుంటే పిచ్చెక్కుతుంది. తొందరగా టౌన్ చేరుకోవాలి.

వెంటనే బైక్ ను తిరిగి స్టార్ట్ చేసి వేగం పెంచాడు.


'విశాల్ ఏమయ్యాడో తెలుసుకోవాలి' అనుకొని బైక్ డ్రైవ్ చేస్తూనే, తన సెల్ బయటకు తీసాడు. విశాల్ కు రింగ్ చేసాడు. భుజానికి, తలకూ మధ్య సెల్ ఇరికించుకుని రిప్లై కోసం చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అతని వెనకే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో తన దృష్టిని ఎదురుగా పడుతున్న నీడ వైపు సారించాడు.


ఆ నీడలో అతని వెనుక వైపు మళ్ళీ ఆ వికృతాకారం కూర్చుని ఉంది. ఆ ఆకారం చేతిలో సెల్ ఫోన్ ఉంది.

కళ్ళు తిరిగాయి సుమంత్ కి

భుజం పైన ఉంచుకున్న సెల్ జారి, రోడ్ మీద పడిపోయింది..

అతని చేతులు పట్టు తప్పాయి.


బైక్ తో పాటు కింద పడిపోయాడు.

తలకు బలంగా దెబ్బ తగిలింది.

రక్తం ధారగా కారుతోంది.

బైక్ దూరంగా పడిపోయింది.


స్పృహ తప్పుతుండగా ఎదురుగా ఉన్న నీడ వైపు అప్రయత్నంగా చూసాడు.

అతడితో పాటు కింద పడ్డ వింత ఆకారం పైకి లేచి వెనక్కి వెళుతున్నట్లుగా అనిపించిందతనికి.


తల వాల్చేసాడు సుమంత్.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


113 views0 comments

Comments


bottom of page