top of page

ఎప్పుడో, యెవరో, యేతావునో..'Eppudo Evaro Ethavuno' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 06/07/2024

'ఎప్పుడో, యెవరో, యేతావునో' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్వర్షం కురుస్తోంది. పగటిపూట కురిసే వర్షం అలజడిగా చిత్తడి చిత్తడిగా ఉండవచ్చేమో గాని, సాయంత్రం పూట వచ్చే వాన, పూల వనాలను స్పర్షిస్తూ ప్రాణ పూర్ణమైన గాలుల్ని మోసుకువస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని మనసునంతటా వెదజల్లుతుంది. జీవన ప్రాంగణంలో కమ్మదనాన్ని నింపుతుంది. 


అప్పుడు నేను లాడ్జీ వరండాలోకి వెళ్ళి చేయి చాచి చూసాను. తుంపర ముత్యాలల్లిన దారంలా పడుతూనే ఉంది. చిన్ననాటి వానపాట గుర్తుకి వచ్చి నాకు మరింత హాయనిపించింది. ఎక్కడైతే నేమి వాన పాటంటే బాల్యాన్ని కళ్ళముందుకు తెచ్చుకోవటమేగా! నిదానంగా రూములోకి వచ్చి, ఆఫీసు మాన్వల్ పుస్తకాల ను ముందేసుకుని కాఫీ తాగుతూన్న దీనదయళుని అడిగాను.. ”ఇప్పుడేమి చేయదలచావు? ” 


అతడు తలెత్తి చూసాడు- “చూస్తే తెలియటంలే! సోమవారం హెడ్డాఫీసులో జరగబోయే పెర్ఫార్మెన్సు రివ్యూ మీటింగుకి కసరత్తు చేస్తున్నాను. రా! నువ్వూ వచ్చి కూర్చో—” 

నేను అడ్డంగా తలవిదిలిస్తూ అన్నాను- “ఇప్పుడు వీలుపడదు. రేపు ఉదయం చూసుకుంటాను. ఇప్పుడు నేను బైటికి వెళ్తున్నాను. నువ్వూ వస్తున్నావు నాతో—”


 నా మాట విని దీనదయాళు భృకుటి ముడిచాడు. “మనల్ని హయ్యర్ గ్రేడ్ టీ ఏ- డీయే యిచ్చి యిక్కడకు యెందుకు పంపించారో తెలుసు కదూ! మనం రీజనల్ ఆఫీసు తరపున టిప్ టాప్ గా వచ్చాం. పెర్ఫార్మెన్సు స్థాయిని అందరి ముందూ యెత్తి చూపించడానికి, రీజనల్ కార్యాలయ స్థాయిని పెంచడానికి. మరొకటి- నువ్వు జోవియల్ మూడ్ లో పడి మరచిపోతున్నట్టున్నావు- ఇద్దరికీ రిటైర్మంట్ యేజ్ దగ్గర పడుతూంది. ఈ సమయంలో వయసుకి తగని తైతక్కలాట మంచిది కాదోయ్!”


నేను నవ్వుతూ అన్నాను- “అటువంటిదేమీ సంభవించదు అగ్రసోదరా! గతకాల పాపాలెలా వెన్నంటి వస్తాయో- అదే రీతిన గతంలో చేసిన పుణ్యకార్యాలు కూడా మనల్ని- ముఖ్యంగా నిన్నువెన్నంటి వచ్చి నీడనిచ్చే గొడుగులా కాపాడుతాయి. ఐనా యెంత సేపని- గంటా- గంటన్నర లోపున అంతా ఐపోతుంది. నౌ గెటప్! డ్రెస్సప్పవు” అని ఒత్తిడి పెట్టాను. 


“ఇంతకీ యెక్కడికి? యెందుకు?”అడిగాడతను. 


అతడిలోని కంగారు చూసి నవ్వుకున్నాను. “రామ్ నగరు లోనున్న మా బంధువులింటికి. వాళ్లమ్మాయికి నిశ్చితార్థం” 


దీనదయాళు ఆశ్చర్యంగా చూసాడు “నిశ్చితార్ధానికా! అదీను పిలవని పేరంటానికా! అనామకుణ్ణి. శివపూజలో యెలుగులా నేనక్కడ కనిపిస్తే బాగుంటుందా?”


ఈసారి నిజంగానే నవ్వేసాను- “మీ యింట్లో వాళ్ళు- ముఖ్యంగా మీ శ్రీమతి చెప్పిందో లేదోగాని- నాకు నీలో ఒక స్పార్క్ కనిపిస్తుంటుందోయ్! నువ్వు గాని ప్రక్కనుంటే-- జయమ్ము నిశ్చయమ్ము-- అందుకే నిన్ను అంటిపెట్టుకుని వస్తుంటాను” 


నా పొగడ్తకు దీనదయాళు పక్కున నవ్వేస్తూ “మాటల మాంత్రికుడవి” అంటూ ఆఫీసు మాన్వెల్ పుస్తకాలను, పీరియాడికల్ పెర్ఫార్మెన్సు రిపోర్టులను మూసాడు. 


మేం రామ్ నగరు చేరుకునేటప్పటికి సాయంత్రం మరింత చల్లబడింది. నన్ను చూసి మా అక్కయ్య ప్రత్యూత్థానం పలుకుతూ లోపలకు తీసుకు వెళ్ళింది. నేను వెళుతూ తిరిగి చూసాను. దీనదయాళు అక్కడే నిల్చుండి పోయాడు. నేను వెళ్ళి హాలు మధ్యకు రమ్మనమని పిలిచాను. అతడు తల అడ్డంగా ఆడిస్తూ రానన్నాడు. 


“నేనెవరో వాళ్ళకు తెలియదు. వాళ్ళెవరో నాకు తెలి యదు. ఎందుకొచ్చిన రచ్చ- నేనటు వెళ్ళి కూర్చుంటాను” అంటూ వెనుక సైడుకి వెళ్ళి ఆసీనుడయాడు. 


అంతకు మించి దీనద యాళు పైన ఒత్తిడి పెట్టకూడదని తలపోస్తూ మావాళ్ళతో కలసిపోయాను. పురోహితుడు పంచాంగం ముందేసుకుని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపించేలా యేదో వివరిస్తున్నాడు. పెండ్లి కూతురు కాబోయే అమ్మాయి ప్రక్కన వైదేహీ మాత్రం కూర్చుంది. వాళ్ళ అక్కయ్యేమో దూరంగా తొలగి కూర్చుంది. కాబోయే పెళ్ళికొడుకు తరపున అమ్మానాన్నలూ మేనమామా కలసి కూర్చున్నారు. మరి కాసేపటికి కాబోయే వధూవరులిద్దరూ మాలలు మార్చుకుని ఉంగరాలు తొడుక్కున్న తరవాత మిగిలిన తతంగం దాదాపు పూర్తయింది. 


నేను చివ్వున లేచి సెలిగిన కొబ్బరి బొండాను తీసుకు వెళ్ళి దీనదయాళుకి అందించి తిరగబోయాను. అప్పుడతను నన్నాపాడు- ఉఁ అంటూ ప్రక్కన కూర్చున్నాను. 

“ఆ అమ్మాయెవరు?” అని చేయి చూపించాడు. 


“ఆ పచ్చ చీర కట్టుకున్నమ్మాయేనా! పెద్దది. కాబోతూన్న పెళ్ళికూతురుకి అక్కయ్య. ఎందుకడుగుతున్నావు?” 


“అబ్బే! మరేమి లేదు. చాలా చురుగ్గా బొంగరంలా అలుపనేది తెలియనీయకుండా పనులు చక్కబెడ్తూంటేనూ-- . బంగారు తీగలా కళ కళగా చురుగ్గా వెన్నెలలా కనిపించే అమ్మాయంటే నాకు మురిపెం. ఔను గాని— ఆ అమ్మాయి మెడ బోడిగా ఉందేం?” 


“భళే వాడివోయ్! కనిపించడంలే-- మెడన బంగారు గొలుసు- వజ్రాల హారమూ- నడుమున వెండి వడ్డాణమూను—’


“నేనడిగింది ఒకటీ— నువ్వుచెప్పేది మరొకటీను— మెడన పుస్తెల తాడు కనిపించడం లేదంటున్నాను” 


“ఓ- అదా నువ్వడుగుతున్నదీ! దానికొక పెద్ద కథ ఉందిలే— మరి కాసేపట్లో రూముకి వెళ్తాం కదా- అప్పడు చెప్తాను” 


“లేదు. ఇప్పుడే చెప్పు” 


నేను దీనదయాళు వేపు గుడ్లప్పగించి చూసాను. “అదేంవిటి? పరుల స్వంత విషయాలలో అంతెత్తు ఆసక్తి చూపిస్తున్నావు! ఇది అవసరమా?”


ఔను- అవసరమే అన్నట్టు తలూపాడతను. ఇక తప్పదన్నట్టు అతడి ప్రక్కన కుదురు గా కూర్చుని చెప్పసాగాను- 


“మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వైదేహి పెద్దది. వైదేహి యేదో టెక్నికల్ కోర్సులో ఉన్నప్పుడు- యెదురు చూడని దుర్ఘటన సంభవించింది. మామయ్య డ్యూటీ చేస్తూన్న సెక్షన్ లో ఉన్నపాటున బాయిలర్ పేలిపోయింది. మామయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దానితో కుటుంబ పరిస్థితి దెబ్బతింది. దాదాపు చితికిపోయింది. నష్ట పరిహారంతో బాటు మా అక్కయ్యకు కంపెనీ మేనేజ్మెంట్ జాబ్ ఆఫరి చేసింది. 


కాని అక్కయ్యకు చెప్పుకోదగ్గ చదువు లేకపోవడాన జాబ్ ఆఫర్ ని అందుకోలేక పోయింది. అప్పుడు యింటికి పెద్దదయిన వైదేహి చదువుతూన్న ప్రొఫెషనల్ కోర్సు నుండి తొలగి జాబ్ లో చేరింది. అప్పట్నించి వైదేహికి పెళ్ళి సంబంధాలు యింటి గుమ్మం వద్దకు రాసాగాయి. కాని- కుటుంబం మరొక దుర్గతి యెదుర్కుంది. చెల్లి పరిమళ ప్రేమ వలలో పడ్డది” 


“కాలేజీ రోజుల్లో అమ్మాయిలు ప్రేమ వలలో పడటం సహజమేగా! దీనిని అంత భయానకంగా చిత్రీకరించడం యెందుకోయ్!”


“ప్రేమవలలో పడటం అంటే మనసిచ్చి మనసు తీసుకోవడం కాదు. పరిమళ కడుపు తెచ్చుకుంది. తద్ద్వారా ఆ పిల్లను పెళ్ళి పీటలపైన కూర్చోబెట్టడానికి వైదేహి తల్లితో చేరి యమయాతన పడాల్సివచ్చింది. లవ్ మ్యారేజీ అన్న పేరే గాని అన్ని లాంఛనా లూ తు. చ. తప్పకుండా పూర్తి చేయాల్సి వచ్చింది. కాస్తంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. 


ఆ బాదరాబందీలో వైదేహి తన పెళ్ళి కోసం యెలా ఆలోచించగలదు — చేసిన అప్పులన్నీ తీర్చ వద్దూ! ఒకటి తరవాత ఒకటిగా యెదురైన సమస్యల వల్ల వైదేహి తన పెళ్ళి గురించే కాదు- తన వయసు గురించి తలచడం కూడా మరచిపోయింది. మరైతే-- ప్రాయంలో ఉన్న ఆడ పిల్లల్నేగా వయసు వేగంగా తరుముకొస్తుంది! ఆ తరవాత వైదేహి పెళ్ళి సంబంధాల కోసం మా అక్కయ్య వెతికింది గాని కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దేనికైనా అదృష్టం కలసిరావాలి కదా! 


ఇప్పుడేమో పొరుగూరు నుంచి చిన్న అమ్మాయి భవానికి పెళ్ళి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఈడూ జోడూ కుదిరింది కాబట్టి కట్న కానుకలేవీ వద్దంటూ ముందుకి వచ్చారు పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు. ఇక యిటు వంటి సంబంధం మళ్ళీ దొరక్కపోవచ్చని వైదేహి తల్లికి నచ్చచెప్పి ఒప్పించింది. ఇదీ సంగతి—ఇంకేమైనా అడగాలా?”


తల అడ్డంగా ఆడిస్తూ పెదవులపైన నవ్వు తెరల్ని పొరలిస్తూ దీన దయాళు అన్నాడు- “చూసావా ఆడిపిల్ల మనసు! తనకింకా పెళ్ళి కాలేదనే తలంపు లేకుండా తండ్రి లేడన్న కొరత తెలియ నివ్వకుండా తోబుట్టు వుల్ని యెలా చూసుకుంటుందో! అందుకే అంటారు- వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీలోనూ తల్లితనం దాగుంటుందని. సరే—అదలా ఉంచు. నేను మీ అక్కయ్యతో మాట్లాడాలి. ఇప్పుడు కాకపోతే తరవాత కలుసుకుంటాను. ఓకే!” అని లేచాడు దీనదయాళు. 


“లేదు లేదు. ఇప్పుడే యేర్పాటు చేస్తాను” అంటూ లోపలకు వెళ్ళి అక్కయ్యకు విషయం చెప్పాను. 

“నాతో మాట్లాడటం యేమిట్రా! వైదేహికి చెప్పి భోజనం యేర్పాటు చేసి పంపించు” అని విస్తుపోతూ అంది. 


నాకు సర్రున కోపం వచ్చింది. “చెప్పింది చెయ్యవే అక్కాయ్! సంబరం తగ్గించి అక్కడ కూర్చో— చిన్న కూతురు కోసం తెగ యిదయి పోకు—” అని గట్టిగా అన్నాను. 


నా గొంతు విని అక్కడకు వేదేహి పరుగున వచ్చింది- “ఏం కావాలి మామయ్యా! ”అంటూ—

నేను అదే టెంపోతో అన్నాను. “నాకేమీ వద్దు. నా సహోద్యోగి దీనదయాళు గారు మీతో మాట్లాడాలంటున్నాడు. ఇక్కడ మీరిద్దరూ కుదురుగా కూర్చోండి. పిలుచుకు వస్తాను” అని బైటకు వెళ్ళి దీనదయాళుని తీసుకువచ్చాను. 


అతణ్ణి చూసి తల్లీ కూతుళ్ళిద్దరూ లేచి నమస్కరించారు. దీనదయాళు నవ్వుతూ యిద్దర్నీ కూర్చోమని సంజ్ఞ చేస్తూ యెదురుగా కూర్చుని వెంటనే సంభాషణ కుపక్ర మించాడు- “వైదేహీ! నీ గురించి మీ మామయ్య చెప్పాడు. విషయాన్ని నాన్చకుండా సూటిగానే ప్రస్తావిస్తున్నాను. నీకు పెళ్ళి చేసుకోవాలన్న తలంపు ఉంది కదూ? ” 


అప్పుడు నేను పుంజుకున్నాను- “అవేం మాటలోయ్! వైదేహి మాత్రం అమ్మాయి కాదా! ఆ పిల్లకు మాత్రం నిండు సంసారం ఉండాలన్న ఆశ ఉండదా? కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పిల్ల పెళ్ళి అటూ యిటుగా ఊగిసలాడుతూంది. అంతే—”


దీనదయాళు బదులి వ్వకుండా వైదేహిని తేరి చూసాడు. వైదేహి తల దించుకుంది. 

ఈసారి తలాడిస్తూ స్పందించాడు దీనదయాళు- “దెన్ ఇ టీజ్ ఓకే! ఊళ్ళో మా మేనల్లుడున్నాడు. వాడికి చెప్తాను. ఆ తరవాత యేమి జరగాలో అదే జరుగుతుంది” అంటూ లేవబోయాడు. 

నేను వెంటనే అతడి చేయి పట్టుకుని ఆపాను- “ముఖ్యమైన విషయాన్ని నువ్వుగా కదిపి అలా విసురుగా వెళ్ళిపోతావేంటి? కూర్చో—” అని వైదేహిని ఉద్దేశించి అన్నాను- “ఇంట్లో కాఫీ పొడి ఐపోయిందే మిటి? లేక అతిథులకి కాఫీ యివ్వాలన్నది మరచిపోయావా!” 


ఆ మాటతో వైదేహి ముఖం యెర్రబడింది. “సారీ మామయ్యా! ఏదో మూడ్ లో ఉండి పోయి మరచిపోయాను” అని సర్రున లేచి లోపలకు వెళ్ళింది. అప్పుడు మా అక్కయ్య అందుకుంది- “మరేమీ లేదండి— ఇంతకు ముందు యిటువంటి రెండు మూడు సంబంధాలు వచ్చి పెరడు వేపు నుండి వెళ్ళిపోయాయి. పెళ్ళి ఊసు యెత్తినప్పుడల్లా ప్రాత సంఘటనల్ని తలచుకుని అమ్మాయి అలా ఐపోయుంటుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన అబ్బాయి గురించి నేనొకటి అడుగుతాను. ఏమీ అనుకోరు కదా! ”


దీనదయాళు తల అడ్డంగా ఆడించి- “అడగండి” అన్నాడు. 


“అబ్బాయిది రెండవ మనువా? ”


దీనదయాళు మరొకమారు తల అడ్డంగా ఆడించి- వైదేహి వచ్చి అందించిన కాఫీ కప్పు అందుకుంటూ బదులిచ్చాడు “కాదు. పవన్ కి ఇంత వరకూ పెళ్ళి కాలేదు. ఒక దుర్ఘటన వల్ల వాడికి షాక్ తగిలింది. సుమారు పదేళ్ళ క్రితం వాడు మనసార ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయి కారు యాక్సిడెంటులో చనిపోయింది. అదీను పవన్ డ్రైవ్ చేస్తూన్న కారులోనే— ట్రాక్టర్ అడ్డంగా వచ్చి ఢీకొంది. వాడు స్వల్పగాయాలతో బైటపడ్డాడు. కాని వాడి ప్రేయిసి వాడి కళ్ళ ముందే వాడి కళ్ళలోకి చూస్తూ ప్రాణాలు విడిచింది. 


అప్పట్నించి వాడు వైరాగ్యం పెంచుకున్నాడు. మెల్ల మెల్లగా చాలా రోజులుగా ఫాలో చేసి వాణ్ణి దారికి తీసుకు వచ్చాను. ’కాలమంతా మా అక్కయ్య నిన్ను కనిపెడ్తూ ఉండలే దురా! దానికీ వయసు మీరి పోతూంది. ఇకపైన నువ్వే చూసుకోవాలి. కనీసం మీ అమ్మకోసమైనా నువ్వు పెళ్ళి చేసుకోవాలి. కోడలి పిల్లను యింటికి తెచ్చుకోవాలి‘ అని వెదురుకి వంపు తీసినట్టు నా వేపు సానుకూలంగా వంచాను” అని చెప్పడం ఆపి వైదేహి వేపు తిరిగాడు- 


“ఇలా అడుగుతున్నానని యేమీ అనుకోకమ్మా- నీకు యిరవై యెనిమిదుంటుందా? ”


వైదేవీ సిగ్గుపడుతూ తల అడ్డంగా ఆడిస్తూ అంది- “మొన్ననే ముప్పై దాటింది అంకుల్” 


“ఇటీజ్ ఓకే! పవన్ కి ముప్పై ఆరుంటుంది, నేను సోమవారం ఊరుకి వెళ్లి— “నేను వెంటనే యేకలవ్యుడి బాణంలా యెలార్టుగా కట్ చేసాను-’


“ఊరుకి వెళ్ళి చెప్పడం యేమిటోయ్! మనం ఊరుకి వెళ్ళేటప్పటికి ఆకాశం నలుపు దేలి నేలను భారీ వర్షాలు చిత్తు చేసి విడిచి పెడ్తాయి. ఇక్కణ్ణించే యిప్పుడే ఫోనులో అబ్బాయికి ఒక మాట చెప్పవచ్చుగా--”


అలాగంటావూ-- అంటూ దీనదయాళు పవన్ కి ఫోనుతో కనెక్టయాడు “ఈ రోజు సాయంత్రం దీపాలు పెట్టేవేళ దాటిపోక ముందు ఇక్కడకు రాగలవా? ఏమిటీ రెండు అర్జంటు కేసులున్నాయా! అలాగయితే— రేపు ఆదివారమేగా- మధ్యాహ్నం కల్లా రాగలవా? కారులో తిన్నగా మేముంటూన్న లాడ్జికి వచ్చేయి. అక్కడ ఫ్రెషప్పయి మాతో బాటు వద్దువు గాని— డబ్బై కిలోమీటర్లు- కారు నిదానంగా తోలుకుంటూ రా-- ఇప్పుటికిప్పుడు అక్కయ్యను తీసుకు రావద్దులే. --” అని ఫోను కట్ చేసాడు దీనదయాళు. 


అప్పుడు మా అక్కయ్య నవ్వుతూ మొహమాట పడుతూనే అడిగింది- “అబ్బాయి అర్జంటు కేసులంటున్నాడు. కోర్టు కేసులా!” 


“కాదండి. వాడు చెప్పేది కోర్టు కేసుల గురించి కాదు. ముఖ్యమైన రెండు సర్జరీలు చేయాలట. ఊళ్ళో పవన్ పేరున్న సర్జన్. ప్రైవేటు హాస్టిటల్ నడుపుతున్నాడు. దానికి యెమ్డీ వాడే— వాడితో బాటు నలుగైదుగురు జూనియర్ డాక్టర్లు ఉన్నారు” అని లేచాడు దీనదయాళు. 


అతడితో బాటు నేనూ లేచాను. కాని నేను మాత్రం యింటి గడప వరకూ వెళ్ళలేదు. వెనక్కి తిరిగి వచ్చి అక్కయ్య ను సమీపించి ముఖంలో ముఖంపెట్టి అన్నాను- “నాకు తెలుసక్కాయ్ నీ మనసులో యేమి మెదుల్తుందో-- చెప్పేదా! ” 


నవ్వటానికి ప్రయత్నిస్తూ- “ఉఁ చెప్పు. వింటాను” అందామె. 


“దీనదయాళుకి మేనల్లుడి పైన అమాంబాపతు అక్కర ఉంది కదా — అతనెందుకు తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయలేదు- ఇదే కదూ నువ్వు అడగాలనుకున్నది? ”

 

ఆమె బిత్తరపోయి చూడసా గింది. వైదేహి తల్లి భుజాలపైన చేతులుంచి నవ్వుతూ లేచి నిల్చుంది. 

అప్పుడు నేనందుకున్నాను- “దీనదయాళుకి ఇద్దరున్నారు. ఇద్దరూ కొడుకులే” అంటూ వడి వడిగా నడుస్తూ గడప దాటబోతూన్న దీనదయాళుని అందుకున్నాను. 


అనుకున్న ప్రకారం డాక్టర్ పవన్ మేముంటూన్న లాడ్జి చేరుకున్నాడు. మామయ్యను కౌగలించుకుని నాకు అభివాదం చేసి బాత్ రూములోకి వెళ్ళి ప్రెషప్పయి వచ్చాడు, ముగ్గురమూ కాఫీ మాత్రం తీసుకుని పవన్ కారులో బయల్దేరాం. వైదేహి నాకు ముందే చెప్పింది మా కోసం అల్పాహారం చేసి ఉంచుతానని. 


జీవన ప్రాంగణంలో కనిపించీ కనిపించని ఓ వైచిత్రి ఉంది. అశుభాలే కాదు; శుభకార్యాలు కూడా అప్పుడప్పుడు ఒకటి తరవాత ఒకటిగా జరుగుతుంటాయి. ఇముడ్చుకోలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. నిన్ననేమో కడపటి చెల్లెలి నిశ్చితార్థం. నేడేమో- వైదేహికి పెళ్ళి చూపులు. ఎంతటి శుభకరమైన క్షణాలు! అమృత ఘడియలంటే ఇవి కావా—


అక్కయ్య వాళ్ళ యింటి గుమ్మం చేరుకునేటప్పటికి నాకు స్టన్నయిపోయినంత పనయింది. ఇంటి ముంగిట పచ్చటి తోర ణాలు- గాలిలో యెగురుతూన్న రంగు రంగుల బెలూన్లు- మనసు పూరించుకుపోయింది. ఇంట్లోపలకు వచ్చిన తరవాత తెలుసు కున్నాను అక్కయ్య పెళ్ళి చూపుల కోసం చెల్లెళ్ళిద్దరూ హడావిడి చేస్తున్నారని. 


మా అక్కయ్యేమో హాలులోకి రాకుండా మూల న నిల్చుని నవ్వుతూ చూస్తూంది. అక్కయ్య ముఖాన తల్లి నిండుప్రేమ తొణికిసలాడుతూంది. పవన్ తిన్నగా వెళ్ళి అక్కయ్యకు నమస్కారం పెట్టాడు. ఆ తరవాత మామధ్యకు వచ్చి కూర్చున్నాడు. మరికాసేపటి చెల్లెళ్ళిద్దరూ అక్కయ్యను తీసుకు వచ్చి యెదురుగా కూర్చోబెట్టారు. లేత యెరుపు రంగు చీరలో- మెడన ముత్యాల హారంతో లేస్ తో అల్లిన బ్లవుజులో వైదేహి కళ కళ మెరిసిపోతూంది. 


నిండు పుష్కరిణిలా పెళ్లి కళ వచ్చేసింది. సిగలో తురిమిన మల్లె చెండు పరవశించినట్లు పరిమళిస్తూంది. పవన్ హాయ్ అని పలకరించాడు. ఆమె మాత్రం నవ్వుతూ చూసి, నిదానంగా సంప్రదాయబధ్ధంగా కదలి వచ్చి మా ముందు మోకరిల్లి నమస్కరించింది. 


“అబ్బే! మీరు శ్రమపడకండి. మీ గురించి మా మామయ్యా మీ మామయ్యా ముందే చెప్పారు” అని పవన్ లేచి నిల్చున్నాడు. వెనుక వైదేహి చెల్లెళ్ళిద్దరూ నవ్వేసారు. 


అప్పుడు నేనందుకున్నాను- “మేం చెప్తే సరిపోతుందా? నువ్వు స్వయంగా తెలుసుకోవద్దూ! అందునా ఈ కాలపు డేషింగ్ టైప్ కదూ మీరందరూ— అరటి పండు యిస్తే తీసుకోరు. ఒలిచి యివ్వాలి- అప్పుడు గాని అందుకోరు. ఇద్దరూ కాసేపు అలా పెరడు వేపు మాట్లాడుకొని రండి. నీకేమీ ఆక్షేపణ లేదు కదమ్మా వైదేహీ?”


తల అడ్డంగా ఆడిస్తూ పరిమళ వచ్చి అందించిన ట్రేని అందుకుని అందరికీ కాఫీ కప్పులు అందించింది. కాఫీకప్పు అందుకుంటూ పవన్ సగం సాసర్లో ఉంచుకుని మిగతా సగం వైదేహికి అందించాడు. 


వైదేహి ఆశ్యర్యపోతూ- “పర్వాలేదు సార్! మీరు తీసుకోండి. నేను తరవాత తీసుకుంటాను” అని దూరంగా జరగబోయింది. 


కాని అతడు తల అడ్డంగా తిప్పుతూ గ్లాసుని ఆమె చేతిలో ఉంచి సాసర్లోని కాఫీని తాగి అన్నాడు- “నాపేరు సార్ కాదు మేడమ్. పవన్- డాక్టర్ పవన్. ఓకే? ” అని పెరడు వేపు కదిలాడు. వైదేహి కూడా చేతిలోని కాఫీకప్పుతో అతణ్ణి అనుసరించింది. 


 అలా వెళ్ళిన యిద్దరూ యేమి మాట్లాడుకుంటున్నారో యేమో అరగంటవరకూ హాలులోకి రాలేదు, అప్పుడు దీనదయా ళు నవ్వుతూ నన్ను పురమాయించాడు- “ఓసారి అలా వెళ్ళి రావోయ్! పెరడు వేపు వెళ్ళారో లేక రోడ్డు దాటి వెళ్లిపోయారో—”


 అప్పుడు వైదేహి చిన్నచెల్లెలు భవాని నవ్వుతూ అంది- “వెళ్లొద్దు మామయ్యా! వాళ్ళిద్దరూ సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇద్దరి మాటలు యిక్కడకు వినిపిస్తున్నాయి”

 

ఆ మాటతో నేను లేవలేదు. ఆలోపల ఇద్దరూ హాలువేపు రాసాగారు. “సారీ! ఏమనుకోకు” పవన్ గొంతు వినిపించింది, 


“పర్వేలేదండి” అని వైదేహి స్పందిస్తూ నడచి వస్తూంది. 


నేను లేచి యెదురు వెళ్లాను- “ మనసు విప్పిమాట్లాడుకున్నారా! లేక యింకా మాట్లాడుకోవలసిందేమైనా ఉందా?”


“లేదు మామయ్యా! ఇప్పుడు మేమిద్దరమూ గుడికి వెళ్తున్నాం. వచ్చిన తరవాత భోజనాలు చేద్దాం” 


“గుడికా! ఇప్పుడా!” అందరమూ దాదాపు ముక్త కంఠంతో ఒకేసారి అన్నాం. వైదేహి బదులివ్వలేదు.


పవన్ చేయి అంది పుచ్చుకుంటూ గేటవతల ఉన్నకారు వేపు నడిచింది. తల తిప్పి చూసాను- దీనదయాళూ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నాడు. అక్కయ్యేమో నమ్మలేనట్టు కళ్ళు మిటకరిస్తూంది. 

 దైవదర్శనం చేసుకుని వచ్చిన తరవాత వైదేహి మరొక కుదుపు యిచ్చింది. “మీరందరూ డైనింగ్ హాలు వేపు రండి. వడ్డించేస్తాను. మేమిద్దరమూ తరవాత భోంచేస్తాం” 


అప్పుడు దీనదయాళు నాకు మాత్రం వినిపించేలా అన్నాడు- “ఇద్దరూ కాబో యే వధూవరుల్లా కాదు. చేరిపోయిన భార్యాభర్తల్లా లేరూ! ”


నేను బేలాగా నవ్వి తలూపాను. సినీ హీరో హిరోయిన్ల మధ్య కెమిస్త్రీ బాగా పండిందంటారు సీనీ సమీక్షకులు. మరి దీనినేమనాలి-- 


 నేనూహించినట్లే మధ్యాహ్నం ఊరుకి పవన్ తిరుగు ప్రయాణానికి ప్రెషప్ అవుతున్నప్పుడు దీనదయాళు మేనళ్ళుణ్ణి యెన్ కౌంటర్ చేసాడు. నేనప్పుడు అక్కడే ఉన్నాను, “ఏమిట్రా పవన్, నీ ప్రవర్తన ఓవర్ యాక్షన్ లా కనిపిస్తుందే! ఏమిటీ గంద్రగోళం? ” 


“ఏమీ లేదు మామయ్యా! జస్ట్ లైక్ దట్—”


“నాకలా మామూలు విషయంలా కనిపించడం లేదే! అక్కయ్య రావాలి. పెళ్ళి సంబంధం కుదర్చాలి. నిశ్చితార్థం జరిపించాలి. ఆ తవాత జరగవలసింది యెంతో ఉంది. ఈలోపల మొదటి రోజే చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నట్టున్నావు. ఐనా నువ్వా టైపు కాదే! అమ్మాయిల ముందు నువ్వు చాలా షై- టైపుతో ఉంటావు. 


అంతెందుకు— హాస్పిటల్ జూనియర్ లేడీ డాక్టర్స్ తో కూడా దూరంగా జరుగుతూ మెసలడం నేను చూసాను. వాటీజ్ ది మేటర్?”


 “నా వేపు ఓసారి చూసి ఆతరవాత తలతిప్పుకుని నవ్వటానికి ప్రయత్నిస్తూ తల దించుకున్నాడు. దీనదయాళు విడిచి పెట్ట లేదు. 


“నీ నిశ్శబ్దం బోలెడంత కథాకమామిషూ చెప్తూంది. ముందు దీనిని క్లియర్ చేయి. నువ్వు వైదేహికి సారీ చెప్తూ హాలు వేపు వచ్చావు. ఎందుకని? ” 


“కొంచెం యెమోషనల్ ఐపోయి ఓవర్ యాక్ట్ చేసాను. అందుకని-- ” 


“ఓవర్ యాక్ట్ చేసావా! కాని నువ్వాటైపు కాదే—ఇంతకీ యేమి చేసావు? ఎందుకు చేసావు? “ 


“ఉద్వేగం ఆపుకోలేక వాటేసుకున్నాను. గుండెలకు గాఢంగా హత్తుకున్నాను” 


“గౌరవ మర్యాదలు గల సెన్సిటివ్ అమ్మాయి వైదేహి. ఆ పిల్లను అలా చేయవచ్చా! ” 


“అందుకేగా సారీ చెప్పాను. నేనెందుకలా యెమోషనల్ ఐపోయాననేగా మీ ప్రశ్న— చెప్తాను. మొదటి చూపులోనే నేను వైదేహికి సరెండర్ ఐపోయాను. ముఖం- కళ్లు- పొడవు- మేనిరంగు- రూపమంతా నన్ను పదేళ్ళ క్రితం విడిచి పెళ్ళిపోయిన విమలను చూస్తున్నట్లే వివశుణ్ణయాను. మోహంతో కాదు—ఆర్ద్రతతో కన్నీరు విడుస్తూ వైదేహిని కౌగలించుకున్నాను. వైదేహి నాకు దేవుడిచ్చిన వరం మామయ్యా! “ అంటూ కాళ్ళకు నమస్కరించాడు. 


దీనదయాళు దీవిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నేనేదో చెప్పాలని నోరు తెరవబోయాను. కాని చెప్పలేక పోయాను. నాకళ్ళు నాకు తెలియకుండానే తడిసి పోయాయి. విధి విన్యాసమంటే ఇది కాదూ! కృతజ్ఞతా భావంతో దీనదయాళ్ ని కౌగలించుకున్నాను. 

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

 
67 views1 comment

1 Comment


చాలా చక్కగా ఉంది కథ. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అనడానికి నిదర్శనం ఈ కత. ఎవరికీ, ఎప్పుడు, ఎవరితో ముడి వేసి పెడతాడో ఆ భగవంతుడు. ఆ క్షణం వచ్చే వరకు ఎవరికీ తెలియని విషయం. - P Sudharamana

Like
bottom of page