top of page
Writer's pictureNeeraja Prabhala

తుల్యాంక వెల్ నెస్ యోగాలయ



'Thulyanka Wellness Yogalaya' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 04/07/2024

'తుల్యాంక వెల్ నెస్ యోగాలయ' తెలుగు కథ

రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



రోజూ లాగానే ఆరోజు ఉదయమే ఇంట్లోని పనులన్నీ ముగించింది వనజ. ఆతర్వాత మంచంలో ఉన్న భర్త రమణని తన చేతితో తట్టి, అనునయంగా పిలిచి తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి ఆయనను నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి ఆయనకి బెడ్ పాన్ పట్టింది. తర్వాత ఆయనకి దంతధావనం చేసి షుగర్ టెస్ట్, బిపి టెస్టులు చేసింది. గోడవారగా దిండు వేసి ఆయనని కూర్చోబెట్టి టి. వి. ఆన్ చేసింది. దాన్ని చూస్తూ ఉండమని తను వంటగదిలోకి వెళ్లి అల్లంవేసిన టీ తయారు చేసి భర్త చేతికిచ్చి కాసేపు కబుర్లు చెప్పింది. 


ఆతర్వాత కాసేపటికి వేడివేడిగా టిఫిన్ తయారు చేసి ఆయనకి అందించింది. గంటన్నర తర్వాత మరల షుగరు టెస్ట్ చేసి అన్నీ ఒక పుస్తకంలో వ్రాసుకుంది. ఆయనను విశ్రాంతిగా పడుకోబెట్టి, టి. వి. ఆఫ్ చేసి గదితలుపు ఓరగా వేసి వంటగదిలోకి వచ్చింది. 


ఒక గంట తర్వాత వంట పూర్తి చేసి గదిలోకి వచ్చి భర్తని నెమ్మదిగా తట్టిలేపి గోడవారగా కూర్చోబెట్టి ఘగర్ టెస్ట్ చేసి రోజూలాగానే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చింది. తర్వాత కాసేపటికి భోజనం తెచ్చి ప్రేమగా ఆయనకు కబుర్లు చెపుతూ తినిపించి మందులు వేసి కాసేపు టి. వి. ఆన్ చేసింది. ఒక అరగంట తర్వాత ఆయన పడుకుంటాననగానే పడుకోబెట్టి టి. వి. ఆఫ్ చేసి డైనింగ్ గదిలోకి వచ్చి తనుకూడా భోజనం ముగించింది వనజ. 


ఇవన్నీ గత రెండు సం.. ల నుంచి ఆమెకి దినచర్యే అయినప్పటికీ ఎందుకో గత రెండు రోజులుగా చాలా స్ట్రెస్ గా ఉండి నిద్ర లేమి కూడా ఉంటోంది. దానికి తోడు మోకాళ్ల నొప్పులు. కాసేపటికి విదేశాల్లో ఉన్న కూతురు దివ్య ఫోన్ చేసింది. 


ఫోన్ లిఫ్టు చేసి “హలో! దివ్యా!” అంది వనజ. 


“హలో! అమ్మా! ఎలా ఉన్నావు? నాన్న ఆరోగ్యం ఎలాఉంది? నీ మోకాళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి?” అడిగింది దివ్య. 


“నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు. నా మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాస్త దూరం నడిస్తే కాళ్ల నెప్పులు. పైగా ఈ మధ్యన మీ నాన్న హాస్పిటలైజ్డ్ కావడంతో నిద్రలేమి కూడా నాకు ఎక్కువై బి. పి. పెరుగుతోంది. నిన్న డాక్టరు వద్ద చెక్ చేయించుకుంటే “తగినంత నిద్ర లేకపోతే బి. పి, ఘగర్ తదితర సమస్యలు వస్తాయి. పైగా మీకు స్ట్రెస్ ఉంది. ప్రతి రోజూ మీరు యోగా, మెడిటేషన్ చేయండి అని డాక్టర్ చెప్పారు” అంది వనజ. 


“అవునమ్మా! చాలా రోజులనుండి నేను అదే చెపుదామనుకుంటున్నా. నాతో నీవు ఎప్పుడు మాట్లాడుతున్నా ఏదో కంగారు, ఆదుర్దా, స్ట్రెస్ కనిపిస్తోంది. గత రెండు సం..నుండి నాన్న అనారోగ్యం, ఆయనకు సేవలు, పని ఒత్తిడి మొ..వాటితో నీకు క్షణం తీరిక లేకుండా ఉన్నావు. ఇప్పటికైనా నీ ఆరోగ్యంపట్ల శ్రధ్ధ చూపు. ఏదైనా మంచి యోగా సెంటర్ లో చేరు. నీవు నిత్యం వాకింగ్ చేస్తున్నావు కదా! దానితోపాటు యోగా, మెడిటేషన్ ఆరోగ్యానికి చాలా మంచిది”. అంది దివ్య. 


“అలాగే” అంది వనజ. 

 ఆ తర్వాత కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది దివ్య. 


 రోజూ లాగానే ఆ మరురోజు ఉదయపు వ్యాహ్వాళికి బయలుదేరింది వనజ. కొంతదూరం నడిచాక రోజూలాగానే ఎదురుగా భవాని నడిచివస్తూ కనిపించింది. 


 “హాయ్! బాగున్నారా!” అని ఇరువురూ ఎప్పటిలాగా పలకరించుకున్నాక వనజకు ప్రతిరోజూ ఆవిడ యోగాకి వెళ్లివస్తున్నట్లు తనతో లోగడ చెప్పడం గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా అక్కడి నుంచే రావడం కనిపిస్తోంది ఆవిడ చేతిలో యోగా మాట్ ను చూడగానే వనజకి. 


“భవానిగారూ! మీరు యోగా ఎక్కడ నేర్చుకుంటున్నారు? నాకు కాస్త వివరాలనిస్తారా? నేను గత పదిసం.. నుండి హైదరాబాద్ లో ప్రతిరోజూ యోగాకి వెళ్లేదాన్ని. ఈమధ్యనే ఇక్కడకు వచ్చాక యోగా ఎక్కడ నేర్పుతున్నారో తెలియక, మా వారి అనారోగ్య రీత్యా నాకు వీలుకుదరలేదు. ఇప్పుడు నేను మరలా యోగాలో చేరుదామనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్!” అంది వనజ. 


“అలాగే! మనకు దగ్గరలోనే సిధ్ధార్ధ కాలేజిలో “తుల్యాంక వెల్ నెస్ యోగా సెంటర్” అని మంచి యోగా సెంటర్ ఉంది. అందులో మా మాస్టారు ‘శ్రీ జెట్టి సుధాకర్ బాబు గారు’ అందరికీ ఉచితంగా చాలా చక్కగా యోగా నేర్పుతున్నారు. మీరు చేరుతానంటే రేపు ఉదయమే చేరవచ్చు. మాస్టరు గారితో నా పేరు చెప్పి మీరు రండి” అని యోగా క్లాసు జరిగే ప్రదేశం, దాని సమయాలను చెప్పింది భవాని. 


“మీ సహాయానికి చాలా ధన్యవాదాలు భవాని గారు. తప్పకుండా రేపు అక్కడికి వస్తాను” అంది వనజ. 


 ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లారు. భవాని ఇంటి సమీపంలోనే తన ఇల్లు. అందుకే యోగాకి ప్రతిరోజూ ఇద్దరూ కలిసి వెళ్లిరావచ్చు అని సంబరపడింది వనజ. 


ఆ మరునాడు ఉదయాన్నే భర్తకు చేయవలసిన పనులు ముగించి, తను యోగా మాట్ ను తీసుకుని భవాని చెప్పిన యోగా సెంటరుకు వెళ్లింది. మనసులో భయం భయంగా ఉంది. అక్కడి మాస్టారు తనని చేర్చుకుంటారో? లేదో? ఏమంటారో? ఆయన తనని చేర్చుకున్నా ఈ మోకాళ్ల నెప్పులతో అందరిలా తను యోగా చేయగలనో? లేనో? తను మానేసి చాలా నెలలయింది ” అనే పలు సందేహాలు మనసులో తలెత్తాయి. 


యోగా క్లాసు ఉదయం గం. 5. 10ని.. కి ప్రార్థనతో మొదలయి శరీర కదలికలకోసం సుమారు పదిహేను నిముషాలు ‘వార్మప్’ చేసినాక నిలబడిచేసే ఆసనాలను అందరూ వేశారు. 


తర్వాత అందరూ చేతులు జోడించి కనులు మూసుకొని ఏకాగ్రతతో సూర్యభగవానుడే తన ముందు నిలుచుని ఉన్నట్టుగా మనసులో భావించుకుని 


“ఓం నమః సవిత్రే జగదేకచక్షుసే, 

 జగత్ప్రసూతి స్ధితినాశహేతువే, 

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే, 

విరించి నారాయణ శంకరాత్మనే!!” 


“ఓమ్ నమస్తే బ్రహ్మ రూపాయ, 

ఓమ్ నమస్తే విఘ్ణరూపాయ, 

ఓమ్ నమస్తే రుద్రరూపాయ, 

భాస్కరాయ నమోనమః “అని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన ఆ సూర్యనారాయణ మూర్తిని ముక్తకంఠంతో ధ్యానించారు. 


“ఓమ్ మిత్రాయ నమః నుంచి ఓమ్ భాస్కరాయ నమోనమః” వరకు సూర్యుని ద్వాదశ నామాలను స్పష్టంగా భక్తితో ఉఛ్ఛరిస్తూ, తను స్వయంగా ఆ మంత్రానికి తగిన ఆసనాలను వేస్తూ యోగాకి వెన్నెముక వంటి సూర్యనమస్కారాలను 9 జతలు

 అనగా 18 సార్లు చేసి ‘అమృతాసనం’లో కాసేపు సేద తీరారు. 


తరువాత వివిధ ఆసనాలను కూర్చొని కొన్ని, వెల్లకిలా కొన్ని, బోర్లాపడుకొని కొన్ని, ఇలా మూడు స్ధితులలో ఆసనాలను ఎలా వేయాలో చెపుతూ, వాటిని చేసి చూపించడమే కాక వాటి ప్రయోజనాలను కూడా గురువు గారు క్షుణ్ణంగా విశదీకరించారు. 


 వివిధ ప్రాణాయామాలను ఎలా చేయాలో చెపుతూ, వాటిని చేసి చూపించటం, ఏఏ ఆరోగ్య సమస్యలకు ఏ ఏ ప్రాణాయామాలు చేయాలో, వాటిలో శ్వాసలను ఎలా ఉపయోగించాలో వివరించారు. 

 

 ఆ దృశ్యాన్ని చూడగానే వనజ మనసు సంతోషంతో పులకరించింది. దానిని తన మనసులో అందమైన ఫ్రేముగా పదిలపరచుకుని అలా తనను తాను మైమరచి అందరినీ చూస్తూ ఉండిపోయింది. క్లాసు మధ్యలో డిస్ట్రబ్ చేయగూడదన్న ఉద్దేశ్యంతో నిలబడిఉన్న వనజని సుధాకర్ మాస్టారు గమనించి కొంచెం ఇవతలకు వచ్చి “ఎవరమ్మా మీరు?” అడిగారు వనజని. 


“నమస్కారం మాస్టారు. నా పేరు వనజ. నేను గృహిణిని. మేము హైదరాబాద్ నుంచి క్రొత్తగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. భవానిగారు మీ యోగా గురించి చెప్పింది. నేను చేరుదామని వచ్చాను. దయచేసి యోగాలో నన్ను చేర్చుకోండి మాస్టారు” అని తనని తాను పరిచయం చేసుకుని రెండు చేతులను జోడించి వినయంగా, భక్తితో ఆయనకు నమస్కరించింది వనజ. 


“తప్పకుండా అమ్మా! మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే చెప్పండి. దానికనుకూలంగా కూడా యోగా చేయిస్తాను. అవితగ్గి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది” అన్నారు మాస్టారు. 


చక్కటి ఉచ్చారణ, మంచి సభ్యత, సంస్కారం ఉట్టిపడుతూ చూడగానే చేతులెత్తి నమస్కరించాలనే ఆయన రూపం మంచి గురువుగా తనకి లభించారనే సంతోషంతో మది నిండిపోయింది వనజకు. 


“నాకు లో బి. పి, మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. పైగా ఈమధ్యన నిద్రలేమి కూడా వచ్చింది. దానివలన బి. పి పెరిగింది. జాగ్రత్తగా ఉండాలి. యోగా, మెడిటేషన్ చేయమని నిన్ననే నాకు టెస్టులు చేసి డాక్టర్ చెప్పారు. ” అంది వనజ. 

 

 రెండేళ్ల క్రితం ‘డయాబెటిక్ హీల్ అల్సర్’ వలన తన భర్తకు డాక్టర్లు యాంప్యుటేషన్ చేసి కుడికాలుని తీసివేయాల్సొచ్చిందని, అప్పటినుంచి ఆయన బెడ్ రిడెన్ అనీ, తనే ఆయనకు సపర్యలు చేస్తున్నట్లు, ఇప్పుడీ మోకాళ్ల బాధ, నిద్రలేమి వలన బి. పి కూడా వచ్చింది. ” అని తన అనారోగ్యసమస్యలను, పరిస్థితిని ఆయనకి వివరించింది వనజ. 


 అంతా ఓపికగా విన్న ఆయన చాలా ఓదార్పుగా “ఇంతకుముందు మీకు యోగా చేసిన అనుభవం ఉందా?” అన్నారు. 


“ఉంది మాస్టారు. గత పదేళ్ళుగా హైదరాబాదులో యోగా సెంటర్ లో యోగా చేశాను. నిత్యం వాకింగ్ కూడా బాగా అలవాటు. “ అంది వనజ. 


“వెరీగుడ్. రేపటి నుండి మీరు క్లాసుకు రావచ్చమ్మా. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని క్లాసులో అందరూ ఎలా చేస్తున్నారో శ్రధ్ధగా గమనించండి” అని ఆయన చెప్పిన తీరు వనజకి చాలా నచ్చింది. 


 ‘ఇహ తనకీ అనారోగ్య బాధలన్నీ తొలగిపోయి అందరిలా తను కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు’ అనే మనోధైర్యం ఏర్పడి ఆయన చూపించిన ప్రదేశంలో బుధ్ధిగా కూర్చుని చకచకా యోగా చేస్తున్న అందరినీ శ్రధ్ధగా గమనిస్తోంది వనజ. 


“వీళ్లంతా ఎంతో అదృష్టవంతులు. 

 ఇంత చక్కగా యోగా విద్యని బోధించే మంచి గురువు లభించారు. అదీ ఉచితంగా నేర్పడం. రేపటినుండి తను కూడా వీళ్లందరిలాగా చక్కగా యోగా చేయడానికి ప్రయత్నించాలి. ” అనుకుంది మనసులో స్ధిరంగా. 


 గురువుగారు ఒక్కో ఆసనం పేరు చెప్పి తను చేస్తూ, అందరిచేతా చేయిస్తూ లో బిపి, హైబీపీ, లో ఘగర్, హై ఘగర్ ఉన్నవాళ్లు ఎవరు ఏ అసనాలను వేయవచ్చో, ఎవరు ఏ ఆసనాలను వేయకూడదో వాటి మంచి చెడులను చక్కగా విశ్లేషిస్తూ యోగా చేయడం చాలా గొప్పవిషయం అనుకుంది. 


 లోగడ తను అంతకు ముందు చేసిన యోగా సెంటర్ లో మాస్టారు ఏదో యాంత్రికంగా చెప్పి యోగా చేయించడం చూసిన వనజకు ఇక్కడ గురువు గారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఇంత శ్రధ్ధా, వాత్సల్యాభిమానాలను చూపుతూ అందరికీ అర్ధమయ్యేలా చక్కటి విశ్లేషణ చేయడం చాలా ఆనందం కలిగింది. 


యోగా క్లాసు పూర్తవగానే మాస్టారు అందరిచేతా మెడిటేషన్ చేయించారు. వనజ కూడా మెడిటేషన్ చేద్దామని కూర్చుంది. మృదుమధురస్వర ఉచ్చారణతో గురువుగారు ప్రాణాయామం, కపాలభాతి, చంద్రనాడి -సూర్యనాడిలను యాక్టివేట్ చేసే విధానం, ఆ తర్వాత మన శరీరంలో ఉన్న షట్చక్రాలు 1. మూలాధార చక్రము. 2. స్వాధిష్ఠాన చక్రము. 3. మణిపూరక చక్రము 4. అనాహత చక్రము 5. విశుద్ధి చక్రము 6. ఆజ్ఞా చక్రముల గురించి చక్కటి వివరణనిస్తూ, ఒక్కో చక్రం మన శరీరంలో ఏఏ ప్రదేశాలలో ఉంటాయో చెపుతూ, వాటిని యాక్టివేట్ చేయిస్తూ, వాటివలన మనకు కలిగే ఉపయోగాలను వివరించారు. 


 ఇంక ‘మెడిటేషన్’ అయితే అనేక విధాలుగా.. ఆజ్ఞ, సహస్రారం, ఆనందం, శూన్య, ధ్యాన, తురీయాలు, పంచేంద్రియ, షట్చక్ర, మేరుదండశుద్ది మొదలగువన్నీ పది నుంచి. నలభై ఐదు నిమిషాల వరకు చేయవచ్చని, మెడిటేషన్ లో అన్ని రకాలు ఉన్నాయని అప్పుడే తెలుసుకుంది వనజ. 


ఆ తర్వాత విద్య నేర్పిన గురువు శ్రీ వేదాద్రి మహర్షిగారిని, తల్లి తండ్రులను స్మరిస్తూ, అందరి యోగక్షేమాలను, పశుపక్ష్యాదుల, సమస్త జీవరాశుల సుఖసంతోషాలని ఆశిస్తూ, గురువుల, పెద్దల ఆశీస్సులను కోరుతూ “లోకాః సమస్తాః సుఖినోభవంతు” అని సమస్త జనుల క్షేమాన్ని కోరుతూ ధ్యానాన్ని పూర్తిచేశారు. 


ఆ తర్వాత మాస్టారు క్లాసులో అందరినీ పేరుపేరునా పరిచయం చేశారు వనజకి. మాస్టారి సతీమణి శ్రీమతి పద్మజ గారిని పరిచయం చేయగానే మంచి తేజస్సుతో మూర్తీభవించిన ఆవిడ రూపం చూడగానే తొలి పరిచయంలోనే తల్లిలా అనిపించింది వనజ మనసుకి. వినయంగా, భక్తితో ఆవిడకి నమస్కారం చేసింది వనజ. 


 చెక్కుచెదరని చిరునవ్వుతో అతిశయం, గర్వం ఇసుమంతైనా లేకుండా అనునయంగా ఆవిడ మాట్లాడిన తీరు వనజ మనసుకి చాలా నచ్చింది. గురువుగారి భార్య అయిఉండి ఏమాత్రం గర్వం, అతిశయం లేకుండా వేకువనే ఇంతదూరం వచ్చి అందరిలో కలిసిపోయి తనూ ఒకరిగా నిత్యం యోగా సాధన చేయడం చాలా ఆశ్చర్యం, ఆనందం వేసింది వనజకి. 


క్లాసుపూర్తవగానే వనజ మనసు ఎంతో ఊరటచెంది దూది పింజలా తేలిపోయింది. తను సరైన మంచి యోగా సెంటరుకు వచ్చానని, మంచి గురువు తనకు లభించారని సంతోషంతో హృదయం ఉప్పొంగిపోయి గురువుగారి దంపతులకు వినయవిధేయతలతో భక్తితో నమస్కరించి, మంచి మనస్సుతో తనని చేర్చుకున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు చెప్పి, వాళ్ల వద్ద శెలవుతీసుకుని ఇంటికి వచ్చింది వనజ. 

 

ఆరోజంతా ఆమె మనసు సంతోషంగా ఉంది. “సంతోషమే సగం బలం” కదా! ఎంతో ఉత్సాహంగా ఇంటి పనులను, భర్తకు సపర్యలను పూర్తి చేసింది. 


ఆ మరురోజు క్లాసుకి వెళ్లి అందరితో తను కూడా సూర్యనమస్కారాలు, వివిధరకాల ఆసనాలను పూర్తి చేసింది వనజ. మెడిటేషన్ ని కూడా చేశాక క్లాసు పూర్తవగానే అందరితో మాట్లాడింది. ఎంతో కలుపుగోలుగా, స్నేహ సౌభ్రాతృత్వం వ్యక్తపరిస్తూ కళ, భవాని, శ్రీలక్ష్మి, పావని, భారతి, స్వాతి, సుధ, గద్దెసునీత, ఉమ, నీరజ, పద్మప్రియ, గంగుల సునీత, నాగభూషణం గారు, సురేష్ గారు, గోపాలకృష్ణ గారు, రత్న కుమారి, స్వరూపరాణి, అనూరాధ, ఉమాదేవి, శిరీష, రాధ, సుజాత, మాధవి, కవిత, నీలిమ, షకీనా, లక్ష్మి, భాగ్యలక్ష్మి, జ్యోతి మొ.. వారందరూ తనతో చాలా ఆప్యాయంగా మాట్లాడడంతో చాలా ఆనందం కలిగి “యథా గురుః తథా శిష్యః” అనేది యదార్ధం అని, అంత మంచి గురుదంపతులకు తగిన మంచి శిష్యులు వీళ్ళు” అనుకుంది మనసులో వనజ. 


అతి త్వరలోనే వాళ్లందరూ మంచి స్నేహితులయ్యారు వనజకి. మగవాళ్లు ముగ్గురు ఉన్నా వాళ్లు తామందరికీ సోదర సమానంగా వ్యవహరించేవారు. అది వాళ్ల మంచి సంస్కారంకి చక్కటి ఉదాహరణ. 


ఇంక ప్రతిరోజూ యోగా క్లాసుకు వెళ్లి యోగా సాధన, మెడిటేషన్ చేయడం, తిరిగివస్తూ ఇంటికి వాకింగ్ పరిపాటయింది వనజకి. చాలామార్లు సుధ, మాధవి, రత్న కుమారిలు తనని ఇంటివద్దకు వాళ్ల స్కూటర్ మీద దింపి వెళ్లేవారు. వాళ్ల సాయానికి పలుమార్లు వాళ్లకి కృతజ్ఞతలు చెప్పుకునేది వనజ. 

యోగా క్లాసులో రకరకాల వృత్తులలోని ఉద్యోగస్తులు, ప్రొఫెసర్, వ్యాపారస్తులు, టీచర్లు, గృహిణులు, బాంకు ఉద్యోగస్తులు ఇలా అన్నివయసులవారు ఉన్నారు. కొందరు కార్లలో, స్కూటర్లపైనా, ఇంకొందరు నడిచి వస్తున్నా ఎవరిపట్లా ఏనాడూ ఎటువంటి అసమానతలు చూపకుండా “మనమందరం ఒకటే” అనే నిబధ్ధదతతో చాలా కలుపుగోలుగా ఉండడం ముదావహం. 

 

యోగా క్లాసులో ప్రతిరోజూ వేకువనే లేచి శుచిగా, శుభ్రంగా స్నానాదికాలను పూర్తిచేసి యోగాకు వచ్చే గురుదంపతులను, విద్యార్థులను చూస్తే చాలా ముచ్చట వేసి పవిత్ర మైన దేవాలయానికి వచ్చిన అనుభూతి ఎప్పుడూ కలుగుతుంది వనజకి. వర్షం వలన ఏరోజన్నా క్లాసుకు వెళ్లలేకపోతే ఆరోజంతా చాలా నిస్సత్తువుగా, బద్దకంగా ఉండేది వనజకి. 


క్లాసులో భవాని ప్రతిరోజూ విధిగా శివాలయానికి వెళ్లి ఆ స్వామిని దర్శించుకుని యోగాక్లాసుకు రావడం చెప్పుకోదగ్గ మరొక విశేషం. 


 ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు నవగ్రహ ధ్యానం, కుండలినీ శక్తిలో, ఆజ్ఞాచక్రంలో సహస్రదళ పద్మంలో ఆసీనురాలైన అమ్మవారి ధ్యానసాక్షాత్కారం, సూర్యలోకం, చంద్రలోకం ధ్యానం, ఈశ్వర ధ్యానం, శివలోకం, శక్తి లోకం గూర్చి ఇలా విశదంగా వివరిస్తూ గురువుగారు చెపుతూ ఉంటే ఆ లోకాలకి వెళ్లిన భావన, అనుభూతి కలిగి మనఃస్వాంతన లభిస్తోంది వనజకి. ఆ భావన, ఆ ఆనందానుభూతిని మాటలతో చెప్పనలవికానిది. అది గురువుగారి క్లాసులో అనుభవైక వైద్యం కావాలి. 



కార్తీకమాసంలో ఆ మాసమంతా గురుదంపతులు 

“దీపంజ్యోతి పరమ్ బ్రహ్మ, 

దీపమ్ జ్యోతి పరాయణా, 

దీపేనా వరదే పాపమ్, 

 ప్రాతఃకాల దీపమ్ నమోస్తుతే!”

దీపస్ధమ్ బ్రహ్మ రూపేఘ, జ్యోతి షామ్ ప్రభురవ్యః! సౌభాగ్యం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే!!”


అని వచించినట్లుగా త్రిమూర్తి స్వరూపమైన దీపజ్యోతిని ఆ మాసమంతా గురువుగారు భక్తి శ్రధ్ధలతో ధ్యానం చేయించేవారు. వేకువజాముననే దేవాలయానికి వెళ్లలేని తనలాంటి వారికి ‘ఇదొక సువర్ణావకాశం’ అని భావించేది వనజ. 

 

విద్యార్థులకు నిరంతరం యోగాలో శ్రధ్ధాసక్తులు కలిగే విధంగా ఆసనాలుగాని, ప్రాణాయామాలు గాని ప్రతిరోజూ మారుస్తూ వుండడం, వీటితో పాటు వివిధములైన యోగాముద్రలు, ఎటువంటి ముద్ర ఏఏ రుగ్మతలను నయం చేసేది కూడా చెబుతూ, వాటిని ప్రాణాయామాలలో ఉపయోగించే విధానములను బోధిస్తూ రుగ్మతలనన్నింటిని తొలగిపోయేటట్లు చేసి స్వాంతన చేకూరుస్తారు. 

 

 ప్రాణాయామాలు గానీ, ముద్రలుగానీ, విద్యార్థులకు “ఒకసారి చెప్పాను గదా!” అని గురువు గారు అనుకోకుండా రెండు లేక మూడు రోజులకి ఒకసారి మరల వాటిని క్షుణ్ణంగా వివరిస్తారు. 


నిత్యం యోగా క్లాసుని ఎంతో క్రమశిక్షణ, నియమనిబధ్ధలతో నడుపుతూ విద్యార్థులందరికీ యోగా నేర్పే గురుదంపతులు క్లాసు పూర్తవగానే తల్లితండ్రుల వలే వాళ్లందరి యోగక్షేమాలు, వాళ్ల బాధలను‌ అడిగి తెలుసుకుని మంచి సలహాలు, సూచనలని ఇచ్చి వాళ్ల సమస్యలను పరిష్కరించడం వాళ్ల మంచితనానికి గొప్పనిదర్శనం. 


అవేకాకుండా వివిధ రుగ్మతలననుసరించి డయాబిటిస్, బిపి, ఒబేసిటి, ఆయాసం, గ్యాస్ సమస్య, నడుము, మోకాళ్ళనొప్పులు వగైరా సమస్యలమీద ప్రత్యేకంగా క్లాసులు కూడా చెబుతారు. 


అలాగే తనకి నిద్రలేమి ఉందని చెబితే గురువుగారు దానికి ముద్ర వేసి ఇలా చేస్తే తప్పక నిద్ర వస్తుందని చెబితే వనజ అలా చేసి ఆ సమస్యని అధిగమించింది. 


"ఈ కలికాలంలో కూడా ఇంత నిస్వార్థంగా ఉండే గురువు ఉన్నారా? ధనసంపాదనే పరమావధిగా భావించే ఈ సమాజంలో ఒక్క పైసాని కూడా ఏమాత్రం ఆశించకుండా ఇంత అమూల్యమైన, అద్భుతమైన యోగవిద్యా జ్ఞానాన్ని బోధిస్తున్నారు మా గురువుగారు శ్రీ జెట్టి సుధాకర్ బాబుగారు" అనుకుంది వనజ. 


విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించే గురువుగారు విద్యార్థులు గైర్హాజరు కాకుండా ప్రతిరోజూ హాజరుపట్టి పధ్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతిరోజూ మూడునెలలు క్లాసులకి విధిగా హాజరైన వాళ్లకి తన స్వంత డబ్బుతో బహుమతులనిచ్చి ప్రోత్సాహించేవారు. ఆ బహుమతులకోసమన్నా ఏరోజూ బద్దకించకుండా ఉదయాన్నే యోగా క్లాసుకి వెళదామనిపించేది. వనజకి. 


క్లాసు పూర్తవగానే గురుదంపతులు వెళ్లినాక భారతి, కళ, నాగభూషణం గార్ల ఛలోక్తులు మనసుకు చాలా హాయినిచ్చేది. సమయస్ఫూర్తితో కూడిన వాళ్ల హాస్య చతురత, సెన్సాఫ్ హ్యూమర్ కి అందరిలో నిస్సత్తువ పోయి క్రొత్త శక్తివచ్చేది. ఆ హాస్య వాతావరణాన్ని అందరూ ఎంతో ఇష్టపడేవారు. 


ప్రతిసం..అంతర్జాతీయ యోగాదినోత్సవం జూన్ 21 వ తేదీన “తుల్యాంక వెల్ నెస్ యోగా సెంటర్” లో గురువుగారు సిధ్ధార్ధ అకాడమీ పెద్దలని పిలిచి వాళ్లని శాలువా, పుష్పగుఛ్ఛాలుతో సత్కరించి, వాళ్ల చేత యోగా పట్ల విద్యార్థులందరికీ అవగాహన కలిగేలా ఉపన్యాసాలనిప్పించి చాలా ఘనంగా యోగా దినోత్సవం జరిపి స్వీట్లు, హాట్లను అందరికీ పంచేవారు. ఆ సన్నివేశం చూస్తుంటే తన చిన్నతనంలో స్కూలులో జెండావందనాన్ని గుర్తుచేసుకుని తను చిన్నపిల్లగా మనసులో భావనచేసుకునేది వనజ. ఎంతో హుషారుగా వనజతో పాటు అందరూ యోగా వేడుకల్ని సంతోషంగా జరుపుకునేవాళ్లు. 

నిజంగా ఆరోజు అందరికీ పండుగే. మరలా ఆరోజు ఎప్పుడొస్తుందా?’ అని ఆశగా ఎదురుచూసేది వనజ. 

 

చూస్తూఉండగానే మూడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ మూడేళ్లలో వనజకి మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గిపోయాయి. తనకు నిద్రలేమికి గురువుగారు చెప్పిన ముద్రల వలన నిద్రలేమి తొలగిపోయి, బి. పి కూడా లేదు. స్ట్రెస్ పోయి మానసిక ప్రశాంతత కలిగి చక్కటి ఆరోగ్యం చేకూరింది. 

 

ఇలా ఉండగా స్వతహాగా రచనాశక్తి ఉన్న తనకు ఇంకా రచనలు చేయాలనే ఉద్దేశ్యంతో మరలా ఆ రంగంని పునఃప్రారంభించింది వనజ. అంతకు ముందే తను వ్రాసిన వివిధ కధలు, కవితలు పలు పుస్తకాలలో, పలు వెబ్సైట్ లలో ప్రచురితమైనందున మరలా క్రొత్తగా కధలు, కవితలను వ్రాయప్రారంభించింది. తను చేసే యోగా సాధన, మెడిటేషన్ ఇందుకు కారణం. వరుసగా కధలు, కవితలను వ్రాస్తూ అనేక నగదు బహుమతులు, పలువురి ప్రశంశలను అందుకుంది వనజ. 


గురుదంపతులు, తన సహచరులు అందరూ ప్రతి కధని చదివి అభినందించడంతో వనజకి తను ఇంకా వ్రాయాలనే కాంక్ష, పట్టుదల పెరిగి మనసుకి చాలా ఉత్సాహాన్నిచ్చేది. రచయితలకు పాఠకుల ఆదరణ, ప్రోత్సాహం ముఖ్యం కదా! కొన్నాళ్లకు రవీంద్రభారతిలో “ఉత్తమ రచయిత”గా బిరుదుని, సన్మానాన్ని కూడా పొందినది. 


కొన్ని రోజుల తర్వాత వనజ వ్రాసిన 175 కధలతో ఒక పుస్తకం, 75 కవితలతో మరొక పుస్తకం ప్రఖ్యాత వంశీ సంస్థచేత రవీందభారతిలో తను సంగీతం నేర్చుకున్న, తనకి ఎంతో ఇష్టమైన సంగీతగురువుల చేత, ప్రముఖ సినీ కవుల సమక్షంలో పుస్తకాలు ఆవిష్కరణ జరగడం, అవార్డునిచ్చి ఘన సన్మానం, ఆ మరుసటిరోజు మన ఉపరాష్ట్రపతి చేత అవార్డు, ఘనసన్మానం పొందడం తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా ఎప్పుడూ భావిస్తుంది వనజ. 


 యోగాద్వారా తనకు మానసికంగా, శారీరకంగా ఆనందాన్ని, ఆహ్లాదాన్నిస్తూ, రచనలకు మంచి ఆలోచనలు, క్రొత్త ఉత్సాహం కలిగేటట్లు చేసి ప్రశాంతతని చేకూర్చిన, చేకూరుస్తున్న గురుదంపతులకు సదా వందనాలను సమర్పిస్తోంది. వనజ. 


ఆ తర్వాత విజయవాడలో ప్రముఖ సంస్ధ చేత వనజకి సన్మానం, అదీ తను తల్లితండ్రులుగా, గురువుగా భావించే గురుదంపతుల సమక్షంలో ఆ కార్యక్రమం జరగడం తన పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా ఎప్పుడూ భావిస్తోంది వనజ. ఆ వేడుకకి తన యోగా మితృలందరూ రావడం వనజకి మరింత సంతోషం. 


ఆతర్వాత ఒక శుభోదయాన యోగా క్లాసులో మితృలందరి సమక్షంలో వాళ్ల హర్షధ్వానాల మధ్యన గురుదంపతులు తనని ఘనంగా సన్మానించి, అమూల్యమైన మెమెంటోని ఇచ్చి అభినందించండం తన అదృష్టంగా భావిస్తూ ఆ శుభసమయాన్ని తన జీవితంలో మరపురాని, మధురమైన రోజుగా తన హృదయకమలంలో పదిలంగా నిక్షిప్తం చేసుకుంది వనజ. 

 

ఇంటికివచ్చి తన భర్తకి, విదేశాల్లో ఉన్న కూతురికి, అల్లుడికి, మనవళ్లకి చెప్పి తన ఆనందాన్ని పంచుకుంది వనజ. 


కొన్నినెలల క్రితం గురుదంపతులు అమెరికాకి తమ పిల్లల వద్దకు వెళ్లారు. వెళ్లేముందు ఆయన యోగా మీద తను స్వంతంగా రచనచేసి వివిధ రకాల ముద్రలను, వాటి ఉపయోగాలను సవివరంగా తెలియచెపుతూ పుస్తకాన్ని తమ స్వంత ఖర్చుతో ముద్రించడమే గాక, వాటిని అందరికీ ఉచితంగా వితరణ చేయడం చాలా హర్షణీయం. 


 అంతేగాక సురేష్ గారికి, కళ గారికి తను వచ్చేవరకూ క్లాసు నిర్వహణ బాధ్యతని అప్పగించారు. స్వతహాగా ప్రొఫెసర్ అయిన సురేష్ గారు తను యోగా చేస్తూ, విద్యార్థులందరి చేతా చేయిస్తూ క్లాసుని చక్కని క్రమశిక్షణతో ఉంచేవారు. అలాగే కళ గారు కూడా. ఎప్పుడూ సందడిగా, అందరితో కలుపుగోలుగా, నవ్వుతూ ఉండే కళ అంటే క్లాసులో అందరికీ అభిమానం. 


గురువుగారిలాగే సురేష్ గారు కూడా ప్రతిరోజూ క్లాసులో హాజరువేసేవారు. మూడు నెలల తర్వాత సంపూర్ణ హాజరు అయిన వారు ఐదుగురు అయితే సురేష్ గారు, కళ గారు వారికి బహుమతులనిచ్చి ప్రోత్సహించారు. అలాగే నాగభూషణంగారు యోగా బాగా చేసిన వారికి, రోజూ చక్కగా యోగా నేర్పుతున్న వాళ్లకి తన స్వంత ఖర్చుతో ‘తుల్యాంక’ పేరుతో మెడల్స్ ఇచ్చి వాళ్లని అభినందించారు. గురువు గారు ప్రవేశపెట్టిన విధానాన్ని ఆయన అనుమతితో వీళ్లు కొనసాగించడం ఆనందదాయకం. 


 విద్యార్థులందరూ సత్ప్రవర్తనతో ఉంటూ క్రమశిక్షణతో యోగా చేయడం చూస్తుంటే గురువుగారి పట్ల భక్తి గౌరవాలు, అంకితభావం అర్ధమవుతుంది. 


 గురువుగారు సుధ, స్వాతి, పావని, సురేష్ గారు, షకీనా, సునీతలకు ప్రత్యేక యోగా, మెడిటేషన్ లలో శిక్షణనిచ్చి తర్ఫీదునిచ్చారు. ప్రతిరోజూ ఏయే ఎక్సర్ సైజులు, ఏయే ఆసనాలుండాలో ఆయన ఒక కోర్సుగా చెప్పి వాళ్లకు శిక్షణ నిచ్చారు. వాళ్లు యోగా చేస్తూ, తమ సహచర విద్యార్థులందరికీ చక్కగా ఓర్పుగా క్లాసు చెబుతూ యోగా, మెడిటేషన్ లు క్షుణ్ణంగా చేయిస్తున్నారు. అలాగే షకీనా మెడిటేషన్ చెబుతూ అమావాస్య, పౌర్ణమి ధ్యానాలను అందరిచేతా చక్కగా చేయించేది. 


గురువుగారు విదేశాల్లో ఉన్నా ఆయన మనసంతా క్లాసుమీదా, విద్యార్థులందరి ఆరోగ్యం మీదే ఉంటుంది. ఆదివారం నుంచి శనివారం వరకు ఏయే రోజు ఏయే ఆసనాలను చేయాలో, ఏయే ప్రాణాయామాలు, మెడిటేషన్ లు చేయాలో ఒక లిస్టుగా వ్రాసి విద్యార్థులకిచ్చి అక్కడి నుంచి ప్రతిరోజూ వాటిని గుర్తుచేసేవారు. అన్నింటినీ సరిగ్గా చేస్తున్నారో? లేదో? విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. విద్యార్థులంటే ఆయనకు వల్లమాలిన ప్రేమాభిమానాలకిది చక్కటి నిదర్శనం. 


వీలు కుదిరినప్పుడల్లా గురుదంపతులు అక్కడి నుండి ఫోన్లు చేసి విద్యార్థులందరినీ తల్లితండ్రుల వలే చాలా ఆప్యాయంగా పలకరించేవారు. 

నిత్యం నిరవధికంగా క్లాసు జరగాలనే ఆయన ఆశయాన్ని గమనిస్తే యోగాపట్ల ఆయనకున్న అంకితభావం అందరికీ స్ఫూర్తి దాయకంగా, ఆదర్శప్రాయంగా ఉంటుంది. నిజంగా యోగా విద్యార్థులందరికీ ఆయనొక రోల్ మోడల్. 


 గురుదంపతుల శిక్షణలో చక్కటి యోగా వలన తనకు ఏవిధంగా ఆరోగ్యం చేకూరిందీ పూసగుచ్చినట్లు కూతురికి, అల్లుడికీ సంతోషంగా చెప్పింది వనజ. 


“చూడు దివ్యా! మీరు కూడా ఉద్యోగంలో పని వత్తిడి, ఇంటా, బయటా పనులు, పిల్లల పెంపకం మొ.. వాటితో క్షణం తీరిక లేకుండా ఉంటూ స్ట్రెస్ అవుతున్నారు కదా! ఆ విషయం లోగడ నీవు చాలా సార్లు నాతో చెప్పావు. యోగాచేయడానికి సమయం లేదంటే ఎలా? మీరు త్వరగా యోగాలో చేరండి. మీరింకా చిన్నవాళ్లు. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. అలాగే బాధ్యతలుకూడా ఉన్నాయి. విలువైన మీ సమయాన్ని పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్, పార్టీలంటూ వృధాచేయకుండా ఆహార నియమాలని పాటిస్తూ నిత్యం యోగా, మెడిటేషన్ చేయండి. చక్కటి ఆరోగ్యం - అందమైన జీవితం మీ స్వంతం” అంది వనజ దివ్యతో. 


“సరే అమ్మా! ఇంకనుంచి నిన్ను స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా యోగా చేస్తాము. కానీ నీకు దొరికినట్లుగా మంచి గురుదంపతులు, ‘తుల్యాంక వెల్ నెస్ యోగా సెంటరు’ వంటి మంచి క్రమశిక్షణ గల యోగా కేంద్రం, అంత మంచి స్నేహితులు మాకు లభిస్తే ఎంత బావుండు. ” అంది దివ్య. 

“మనసుంటే మార్గం ఉండకపోదు. ప్రయత్నం చేయి. సాధనమున పనులు సమకూరు ధరిలోన అన్నట్లు ప్రయత్నం చేస్తే అన్నీ వనగూడుతాయి. సంకల్పశుధ్ధి బలంగా ఉంటే కార్యసిద్ధి తప్పక కలుగుతుంది. నాదింకో సలహా. వేలకు వేల డాలర్లు పోసి అక్కడి యోగాసెంటర్లకు వెళ్లకపోతే హాయిగా నీవు, అల్లుడు, మనవళ్లు మన విజయవాడకు వచ్చేయండి. ఇక్కడే హాయిగా ఇద్దరూ ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండచ్చు. మా “తుల్యాంక వెల్ నెస్ యోగా సెంటర్” లో మీరు కూడా చేరచ్చు. మా గురుదంపతులు చాలా మంచివాళ్లు. మిమ్మల్ని సంతోషంగా చేర్చుకుంటారు. ఇక్కడ పిల్లలకు మంచి చదువుకూడా లభిస్తుంది. “కలిసి ఉంటే కలదు సుఖం” అన్నట్లు మనమందరం కలిసి మెలసి హాయిగా ఉండచ్చు. ” అంది వనజ దివ్యతో. 


“సరే ! ఆలోచిస్తాం. నీ మాటని ఎప్పుడు కాదన్నాను? మా మంచికే కదా నీవు చెప్పేది. ఇక్కడ ఉద్యోగరీత్యా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. త్వరలోనే వాటిని అధిగమించి మీ వద్దకు వచ్చి ఉంటాం. మీ యోగాలో చేరుతాం. మీ గురువుగారి దంపతులకు నా నమస్కారములు, శుభాభినందనలు తెలియజేయి. అలాగే మీ మితృలందరిని అడిగినట్లు చెప్పు. సరేనా! ” అంది దివ్య. 


“సరే!” అంది వనజ. దివ్య ఫోన్ పెట్టేసింది. 


ఫోన్ పెట్టేసిన వనజ తనకు ఇంత మంచి క్రమశిక్షణ, సభ్యత, చక్కని సంస్కారం నేర్పుతున్న గురుదంపతులను మనసులో తలుచుకుంది. 

 

 బాంకు మేనేజర్ గా పదవీ విరమణ చేసి అందరికీ ఆరోగ్యం చేకూరాలనే సదుద్దేశంతో ఉచితంగా యోగా నేర్పే గురువుగారికి మేడమ్ పద్మజ గారు తగిన ఇల్లాలు. “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అని ఆ దంపతులను చూడగానే ఎవరికైనా అనిపించక మానదు. 


 మృదుమధుర స్వర ఉఛ్ఛారణ, ఓర్పు, నేర్పు, సహనం, నిరాడంబరత, నిర్మల మనస్సు, సేవా దృక్పథం వాళ్ల సహజ భూషణములు. హిమగిరి శిఖరమంత ఔన్నత్యాన్ని కలిగిఉండి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే విశాలహృదయులు ఆ దంపతులు. 


వాళ్ల పిల్లలు విదేశాల్లో స్ధిరపడినా ఇంట్లో ఉంటూ విశ్రాంతిగా హాయిగా సుఖపడకుండా మా అందరి ఆరోగ్యం కోసం ఆ వయసులో కూడా ప్రాతఃకాలాన్నే లేచి యోగా సెంటర్ కి వచ్చి మా అందరికీ ఉచితంగా యోగాను నేర్పుతున్న సుమనస్కులు ఆ దంపతులు. 

 

 “తుల్యాంక వెల్ నెస్ యోగా సెంటర్” అనేది పవిత్రమైన దేవాలయం. సార్ధక నామధేయం. 


అమూల్యమైన, అద్భుతమైన “తుల్యాంక” అనే నందనవనంలో తామంతా ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న మొగ్గలం. ఇవి మరింత వికశించి, వెల్లివిరిసి సువాసనలను వెదజల్లే సుగంధపుష్పాలై, మాలలుగా మారి అవి గురుదంపతుల పాదాలవద్ద భక్తిసుమమాలగా చేరి, నలుదిశలా, దశదిశలా గురువుగారి యశస్సు ఆ చంద్రతారార్కం వ్యాప్తి చెందాలని మనసారా ఆ దేవదేవుడిని నిత్యం ప్రార్ధిస్తోంది వనజ. 


పార్వతీపరమేశ్వరుల వంటి ఆ దంపతులు నిండునూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, ‘తుల్యాంక వెల్ నెస్ యోగా సెంటరు’ మరింత పేరుప్రఖ్యాతులు పొంది దినదినాభివృధ్ధిచెందుతూ ఉండాలని, అందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటోంది వనజ. 

 

 పచ్చని ప్రకృతి తివాచీ పరిచినట్లు వివధ రకాల వృక్షాలు, అందమైన ఫల, పుష్ప వన సముదాయంలో, దేవాలయం వంటి విద్యాలయంలో, పక్షుల కిలకిలారావాలు, కోయిల కుహుకుహూల మధ్య ఇంతటి అమూల్యమైన, అద్భుతమైన తుల్యాంక యోగా సెంటరుకు ఉచిత వసతినిచ్చిన సిధ్ధార్ధ యాజమాన్యానికి అనేక ధన్యవాదాలు తెలుపుతోంది వనజ. 


అంతేకాక ప్రతినెలా అందరికీ ఉచిత వైద్యశిబిరం, సూచనలు - సలహాలు, ప్రముఖవ్యక్తుల చేత ఉపన్యాసాలు, ఉపాహార వితరణ నిర్వహిస్తున్న సిధ్ధార్ధ కాలేజి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తోంది వనజ. 


మంచిక్రమశిక్షణ గల దైవం వంటి గురువు, చక్కటి యోగ సాధన ఉంటే తనలాగే అందరికీ ఆరోగ్యం, ఆనందం చేకూరుతుంది. “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నది అక్షర సత్యం అనుకుని మరలా ఇంటి పనులలో, భర్తకు సపర్యలలో మునిగింది వనజ. 

.. సమాప్తం. 

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.


గత  5సం.. నుంచి  “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో  నేను కధలు  వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో  నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక  ప్రశంసలు లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు🙏. 


ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery







53 views1 comment

1 commentaire


@ChSuryakala

• 1 hour ago

Super madam real story

J'aime
bottom of page