'Jeevana Ragalu Episode 11' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 04/07/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో జరుగుతుంది. కౌసల్య, దశరథ రామయ్యలకు కవలలు పుడతారు. వారికి దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు.
గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు.
పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది.
దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి.
తాగిన మైకంలో దశరథనందన, భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మధరావు, అతని భార్య మంగ. నందనను ఇంటినుంచి వెళ్లిపొమ్మంటాడు దశరథరామయ్య.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 11 చదవండి.
ఏడు గంటల ప్రాంతంలో కాలింగ్ బెల్ సవ్వడి విని.. లేచి తలుపు తెరిచాడు దశరథనందన. ఎదురుగా బాయ్ నిలబడి వున్నాడు.
“సార్!.. కాఫీ, టిఫిన్ కావాలా. ”
“వద్దు. ఏదైనా అవసరం అయితే పిలుస్తాను. ” క్లుప్తంగా జవాబు చెప్పి తలుపు మూశాడు.
వ్రేలితో పళ్ళు రుద్దుకొని.. స్నానం చేసి, తన వద్ద వేరే బట్టలు లేనందున వాటినే మరలా వేసికొని గదిఖాళీ చేసి, హెూటల్ కు వెళ్ళి కాఫీకి ఆర్డర్ యిచ్చాడు. కాఫీ వచ్చింది. త్రాగసాగాడు.
కొంతకాలం యీ ప్రాంతాన్ని వదలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఆ నిర్ణయంతో పెద్దబజార్ కు వెళ్ళి, రెండు జతల రడీమేడ్ దుస్తులు, హ్యాండ్ బ్యాగ్, బ్రష్, పేస్టు, లుంగీ కొనుక్కొని రైల్వేస్టేషన్ కు చేరాడు. చెన్నై వెళ్ళే రైలు ఎక్కాడు.
రైలు బండి చెన్నై చేరింది. స్టేషన్ లో మంగుళూరుకు వెళ్ళే రైలు ఎక్కాడు. మంగుళూరు చేరాడు. వుడిపి శ్రీకృష్ణ ఆలయం, కొల్లూరు మూకాంబికాలయం, ధర్మస్థల, శృంగేరి, సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలను దర్శించాడు. మైసూరి మీదుగా బెంగుళూరు చేరి.. అక్కడి నుంచి హైదరాబాద్ చేరాడు. మూడు వారాల యీ యాత్రలో అతనికి తను ఏ తప్పూ చేయలేదనే నిర్ణయం, నమ్మిక ఏర్పడింది. సమస్యను ఎదుర్కోవాలనే ధైర్యం కలిగింది.
హైదరాబాద్ లో పబ్లిక్ గార్డెన్ లో ఫణీంద్ర, అతని మిత్రులు యిద్దరినీ కలిశాడు. ఫణీంద్ర నందనను తన రూమ్ కు ఆహ్వానించాడు. నలుగురూ గదికి చేరారు. ఫణీంద్ర రెండు బాటిల్స్ విస్కీని తెప్పించాడు. ఐస్ ముక్కలు సోడాతో విస్కీ గ్లాసును నందనకు అందించాడు.
ఫణీంద్ర తన మిత్రులు తన కోసం ఏమైనా చేస్తారని వారిని గురించి ప్రగల్భాలు పలికాడు. వారినామధేయాలు పాండురంగ, ముస్తఫా. నాలుగు పెగ్గులకు వాళ్ళు అవుట్ అయిపోయారు. మంచంపై వాలిపోయారు.
"బ్రదర్.. వీళ్ళు మంచి వాళ్ళే.. కానీ.. కొడుకులకు విల్ పవర్ లేదు. చూడు ఎలా పడిపోయారో!.. ” నవ్వుతూ పలికాడు ఫణీంద్ర.
“నీకు విల్ పవర్ అద్భుతం ఫణీంద్రా!.. ” తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు దశరథనందన.
“యస్!.. అది మగాడికి అవసరం బ్రదర్!.. ” క్షణం ఆగి గ్లాసులోని విస్కీని త్రాగి.. “మన్మధరావు నీకు, భానుప్రియకు వివాహం చేయాలనుకొంటున్నాడు కదూ!.. ” ప్రశ్నార్ధకంగా నందన ముఖంలోకి చూచాడు ఫణీంద్ర.
“అవును!” ఫణీంద్ర ముఖంలోకి పరీక్షగా చూస్తూ క్లుప్తంగా పలికాడు నందన.
“చూడు బ్రదర్!.. దానికి చాలా పొగరు. మొగవాళ్ళంటే లెక్కలేదు. ”
“అలాగా!.. ” ఆశ్చర్యంతో అడిగాడు దశరథనందన.
"అవును. నీతో ఒక మాట చెబుతాను ఎవ్వరికీ చెప్పకు. దాని క్యారక్టర్ మంచింది కాదు. కానీ.. దాన్ని నేను పెండ్లి చేసుకోవాలనుకొంటున్నాను. అది కోడలుగా మాయింటికి వచ్చిన తర్వాత.. బ్రదర్!.. చూపిస్తాను. దానికి నరకాన్ని.. నా యింట్లో దానికి నరకాన్ని చూపిస్తాను. ” బాటిల్ లోని విస్కీని గ్లాసులో పోసికొని గుటగుటా త్రాగాడు.
“భానూ!.. నీవు నన్ను అవమానిస్తావా!.. నన్ను అవమానిస్తావా!.. ’’ నిషాపూర్తిగా ఎక్కిపోయింది. చేతిలోని సిగరెట్ జారిపోయింది. మంచంపై బోర్లా పడిపోయాడు.
తనచేతిలోని గ్లాసుని టీపాయ్ పై వుంచి నందన గది నుంచి బయటకి వచ్చాడు. ఆటోలో ఎక్కి, తనరూమ్ కు వచ్చాడు. మంచంపై వాలిపోయాడు.
భానుప్రియకు, ఫణీంద్రకు మధ్యన ఏదో జరిగిందన్న విషయం అతనికి తేటతెల్లనైయ్యింది. రేపు ఉదయం ఫణీంద్రను కలుసుకొని ఆ విషయాన్ని గురించి వివరాలు సేకరించాలని నిర్ణయించుకొన్నాడు.
*
మరుదినం ఉదయం ఏడు గంటలకల్లా ఫణీంద్ర లాడ్జికి వచ్చాడు దశరథనందన. వాళ్ళు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారని లాడ్జి రిసెప్షన్ లో చెప్పారు. నందన తన లాడ్జికి తిరిగి వచ్చాడు. ఖాళీచేసి.. బస్టాండ్ కు వెళ్ళి కావలికి వెళ్ళే బస్సులో కూర్చున్నాడు.
దశరథనందన కావలికి చేరాడు. నేరుగా మన్మధరావు యింటికి వెళ్ళాడు. హాల్లో కూర్చొని వున్న మన్మధరావు, మంగమ్మల చేతులు పట్టుకొన్నాడు. తన వలన తప్పు జరిగిందని క్షమించమని వారిని అశ్రుపూరితనయనాలతో అర్ధించాడు. మీరు చెప్పింది చేసేదానికి సిద్ధంగా వున్నానని తప్పును ఒప్పుకున్నాడు.
మొదట అతన్ని దశరథరామయ్యను దుయ్య పట్టిన మన్మధరావు.. నందన స్థితిని మాటలను విని చల్లబడ్డాడు.
“వాడు తన తప్పును ఒప్పుకొన్నాడుగా!.. భానుకు వీడికి వివాహం జరిపిద్దాం. ఆగ్రహావేశాలతో నోటికి వచ్చినట్లు మాట్లాడి వాడి మనస్సును నొప్పించకు. ఏది ఏమైనా వాడు మనకు కాబోయే అల్లుడు. " శాసించినట్లు పలికింది మంగమ్మ.
మంగమ్మ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు మన్మధరావు. మంగమ్మ కన్ను గీటింది. బయట పని వుందని చెప్పి వెళ్ళిపోయాడు మన్మధ.
మంగమ్మ అల్లుణ్ణి ఆప్యాయంగా చూచింది. “నందనా!.. వెళ్ళి స్నానం చేసిరా!.. కలసి భోంచేద్దాం” నందన స్నానాల గది వైపు వెళ్ళాడు.
అంతవరకూ జరిగిన సన్నివేశాన్ని భానుప్రియ ప్రక్కగదిలో నుంచి వీక్షించింది. తల్లి రాకతో వులిక్కిపడి తల దించుకొంది.
“బావకు టవల్ యిచ్చిరా.. ! వెళ్ళు. " అనునయంగా చెప్పింది మంగమ్మ.
తల్లి ప్రశాంతంగా వుందని భాను సంతోషించింది.
టవల్ చేతికి తీసుకొని బాత్రూమ్ వైపుకు ముసిముసి నవ్వుతో వెళ్ళింది భానుప్రియ. నందనకు టవల్ అందించింది ఆనందంగా.
ఆ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నందన భానుప్రియ గదిని సమీపించాడు. తలుపును మెల్లగా తోశాడు. తెరుచుకుంది. లోనికి వెళ్ళి తలుపుకు గడియ తగిలించాడు.
భానూ నిద్రపోతూవుంది. మెల్లగా తట్టిలేపాడు. భానూ కళ్ళు తెరిచింది. నందనను చూచి ఆశ్చర్యపోయింది.
“బావా!.. "
“భయపడకు.. నీతో మాట్లాడాలని వచ్చాను. మా నాన్నగారు నన్ను యింటి నుంచి వెళ్ళిపొమ్మన్నారు. ”
“నాకు తెలుసు. ”
“నాకు నీ క్షేమం ముఖ్యం. ”
"అదీ నాకు తెలుసు. ”
“నేను చెప్పినట్లు చేస్తావా?”
“చేస్తాను. ”
“నీవు నాతో రావాలి. ”
“వస్తాను.. నీతో వచ్చేదానికి నాకేం భయం బావా!.. ”
“అయితే.. నేను చెప్పినట్లు చెయ్యి. ”
“ఏం చేయాలి బావా!.. ”
"కాగితం పెన్ కావాలి. ”
ప్రక్కనే వున్న డ్రాయర్ ను మెల్లగా తెరచి పెన్ కాగితాన్ని బయటకి తీసి.. నందన ముఖంలోకి చూచింది భానుప్రియ.
“నేను చెప్పినట్లు వ్రాయి. ” మెల్లగా పలికాడు నందన.
“చెప్పండి. ” " పెన్ కేప్ తీసి..
'అమ్మా నాన్నలకు నమస్కారములు. నేను బావతో వెళ్ళిపోతున్నాను. మా పెళ్ళికి మామయ్య ఒప్పుకోరన్న విషయం మీకు తెలుసు. నా కారణంగా వారు బావను యింటినుంచి బయటకి నెట్టేశారు. కానీ.. బావకు నేనంటే చాలా యిష్టం. మేము రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొంటాం. మా వివాహం అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. నా గురించి మీరు దిగులు పడవద్దు.
ఇట్లు
మీ భాను
వ్రాయడం పూర్తిచేసి కాగితాన్ని నందనకు అందించిది భానుప్రియ.
‘అందమైన అక్షరాలతో చక్కగా వ్రాసింది భాను' మనస్సులో అనుకొన్నాడు నందన.
ఆ కాగితాన్ని దిండు క్రింద వుంచాడు. యిరువురూ గది నుండి బయటకి వచ్చారు. సవ్వడి లేకుండా మెట్లు దిగి.. గృహప్రాంగణాన్ని దాటి బస్టాండుకు వచ్చి టాక్సీ ఎక్కి నెల్లూరికి బయలుదేరారు. సెల్ ఫోన్ లో తను భానుతో వస్తున్నట్లు చెల్లి సునందకు బావ శాంతారామ్ కు చెప్పాడు.
టాక్సీ ఐదున్నర గంటల ప్రాంతంలో శాంతారామ్ యింటి ముందు ఆగింది. డబ్బు యిచ్చి టాక్సీ వాణ్ణి వెళ్ళమన్నాడు నందన. టాక్సీ వెళ్ళిపోయింది.
కాలింగ్ బెల్ సవ్వడి విని ఊర్మిళ వచ్చి తలుపు తెరిచింది. వారిరువురినీ చూచి ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాల తర్వాత.. సాదరంగా లోనికి ఆహ్వానించింది.
అడ్వకేట్ ఆదినారాయణ, వారి అర్ధాంగి ఊర్మిళ వెంకటరామయ్యగారి నిర్యాణాన్ని గురించి.. ఆస్థి పంపకాలను గురించి నందనకు తెలియజేశారు. అనంతాచారి తనకు యిచ్చిన నందన భాగపు పత్రాలను చూపించాడు ఆదినారాయణ. కన్నీరు కార్చటం తప్ప వేరే ఏమీ చేయలేని దుస్థితి నందనది.
ఆ యిరువురు పెద్దలు, చెల్లెలు సునంద, బావ శాంతారామ్ నందనను ఓదార్చారు.
“యిదంతా నా వల్లనే జరిగింది. ” బోరున ఏడ్చింది భానుప్రియ. ఊర్మిళ, సునంద ఆమెను ఓదార్చారు.
“నందనా!.. ప్రతి మనిషీ తనకు తోచిన రీతిగా కొన్ని నిర్ణయాల్ని తీసుకొంటారు. కానీ ఫలితాన్ని ప్రసాదించేది ఆ సర్వేశ్వరుడేనయ్యా!.. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం.. ఆ దైవాన్ని నమ్మి శరణుకోరడం మన కర్తవ్యం. మన సంకల్పాలు మంచివి అయితే ఆ తండ్రి తప్పక నెరవేరుస్తాడు. చెడ్డభావాలైతే.. దానికి ఫలితం వ్యతిరేకంగా పరిణమిస్తుంది. మనిషికి దైవ నమ్మిక చాలా ముఖ్యం. నీ చుట్టూ వున్న సమస్యలు నాకు బాగా తెలుసు.. భయపడకు. నేను నీకు అండగా వుంటాను. త్వరలో అన్ని సమస్యలూ సమసిపోతాయి. వెళ్ళండి.. స్నానం చేసిరండి. అందరం కలసి టిఫిన్ చేద్దాం. ”
భానుప్రియ వంక చూస్తూ.. "అమ్మా భానూ!.. యిది నీ యిల్లే అనుకో.. యీ పెదనాన్న నీకు మంచిని చేస్తాడు. సరేనా.. వెళ్ళు. ” నవ్వుతూ పలికాడు ఆదినారాయణ.
భానుప్రియ మౌనంగా తలపంకించింది. సునంద ఆమె చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళింది.
అందరూ కలసి ఆనందంగా టిఫిన్ చేశారు.
తర్వాత ఊర్మిళ, సునంద భానుప్రియను సునంద గదిలోకి తీసుకోని వెళ్ళారు.
“ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు భానూ!.. ” అడిగింది ఊర్మిళ.
భానూ నయనాలు చెమ్మగిల్లాయి.. ఏడ్చేసింది.
ఊర్మిళ, సునంద ఆమెను ఓదార్చారు.
“ఆ రాత్రి.. అన్న అతని స్నేహితులు, బావా పార్టీలో త్రాగారు. నేను నా గదిలో పడుకొని వున్నాను. బావ గదికి నా గదికి మధ్యన తలుపు వుంది. దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో కరంటు పోయింది. బావ మధ్య తలుపు తెరుచుకొని నా గదిలోకి వచ్చాడు. నన్ను తట్టిలేపాడు. ఎంతో ప్రేమగా మాట్లాడాడు. ఆయన మాటలకు నేను ఎంతో ఆనందించాను. బావ నా మంచంపై పడుకొన్నాడు. ” భానుప్రియ చెప్పడం ఆపేసింది.. దోషిలా తల ద్రించుకోంది.
“ఆ తర్వాత!.. మెల్లగా అడిగింది ఊర్మిళ.
"బావ ఏమాటనూ నేను కాదనలేకపోయాను. కారణం బావంటే నాకు ఎంతో యిష్టం. ” గద్గద స్వరంతో పలికింది భాను.
ఊర్మిళకు, సునందకు విషయం అర్థం అయింది.
ఐతే.. ఆ పని చేసింది నందనా!.. లేక వేరెవరన్నానా!..
నందన అంతటి నీచుడు కాడు.
వేరెవరో ఆ పనిని చేశారు. అత్తా కోడళ్ళు నిర్ణయం ఒక్కటే.
విషయాన్ని ఆదినారాయణకు వివరించింది ఊర్మిళ.
ఆదినారాయణ కావలకి ఫోన్ చేశాడు. మంగమ్మ ఫోన్ ఎత్తింది. నందన తన కూతుర్ని తీసుకువెళ్ళాడని తన కసిని వెళ్ళకక్కింది. ఆదినారాయణ ఆమెతో..
“నీ కూతురు, నందన యిప్పుడు నా యింట్లోనే వున్నారు. వారు రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు. కారణం.. వారి వివాహం మా బావగారైన దశరథరామయ్యకు అంగీకారం కాదు కాబట్టి. మీ బిడ్డ నా బిడ్డతో సమానం. ఆమెను గురించి మీరు విచారించకండి. కొంతకాలం వారు నా యింట్లోనే వుంటారు. వారిని నేను జాగ్రత్తగా చూచుకొంటాను. ” ఎంతో అనునయంగా చెప్పాడు ఆదినారాయణ.
ఆ రోజు మన్మధరావు వైజాగ్ లో పార్టీ విషయంగా వున్నాడు. మంగమ్మ.. కూతురు వ్రాసిన లెటర్ గురించి, ఆదినారాయణ చెప్పిన మాటలను గురించి భర్తకు వివరించింది. తొలిత ఆవేశపడ్డా.. మన్మధరావు, ఆదినారాయణ గురించి బాగా తెలుసు కాబట్టి “అంతా విధి నిర్ణయం. బాధపడకు.. ” వేదాంతిలా భార్యను ఓదార్చాడు.
ఆదినారాయణ నందనను తన గదిలోనికి పిలిచాడు.
“నందనా!.. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు”
“మామయ్యా!.. ఆ రాత్రి నేను వద్దంటున్నా బలవంతంగా థమ్స్ అప్ లో విస్కీని కలిపి రఘనందన అతని మిత్రుడు ఫణీంద్ర నా చేత త్రాగించారు. పదిన్నర ప్రాంతంలో పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. రఘనందన యింట్లోకి వెళ్ళిపోయాడు. ఫణీంద్ర నాతో మేడమీది నా గది వరకూ వచ్చాడు. గుడ్ నైట్ చెప్పి బిల్డింగ్ ప్రక్కన వున్న మెట్ల మీదుగా క్రిందికి వెళ్ళిపోయాడు. నేను గదిలో మంచంపై వాలిపోయాను.
నేను కళ్ళు తెరచి చూచే సరికి వరండాలో నేల మీద వున్నాను. అప్పుడు సమయం ఐదున్నర. నాకు భయం వేసింది. వెంటనే క్రిందకి వెళ్ళి పళ్ళు త్రోముకొని చన్నీటితో స్నానం చేశాను. మంగమ్మ అత్తయ్యతో చెప్పి నేను మా వూరికి వచ్చేశాను. నాకు తెలిసినంత వరకూ నేను ఏ తప్పూ చేయలేదు మామయ్యా!.." ఆ క్షణంలో నందన నయనాల్లో అశ్రువులు నిండాయి.
అతన్నే పరీక్షగా చూస్తున్న ఆదినారాయణ నిట్టూర్చి..
“నందనా!.. నీవు ఏ నేరమూ చేయలేదు. నేరస్థుడు ఫణీంద్ర. వాణ్ణి మనం పట్టుకోవాలి. ఆ విషయం నేను చూచుకొంటాను. ” సాలోచనగా చెప్పాడు ఆదినారాయణ.
సెల్ తీసి.. బంగారన్నకు ఫోన్ చేశాడు. యోగక్షేమాలను విచారించాడు.
“సరే!.. నీ కోడుకు ఏం చేస్తున్నాడు?”
“బి. య్యే పరీక్షలు రాసినాడు. స్నేహితుల్తో కలిసి గోవా, బొంబాయి చూసేదానికి పోయినాడు. డబ్బు కావాలని ఫోన్ చేస్తే యియ్యలే ఓ లచ్చ వాడి అకౌంటులో ఏసినా.. అవునూ.. ఏం నా కొడుకు వివరాలు అడగతా వుండవు?" బంగారన్న ప్రశ్న.
"పెళ్ళికి ఎదిగాడా లేదా అని.. ”
“ఓహో.. అదా సంగతి.. ఎదిగినాడప్పా.. మంచి పిల్ల నీకు తెలిసుంటే చెప్పు. వాడి చేత మూడుముళ్ళు వేయించేస్తాను. ఇంకో మాట.. వాడికి నీలాగే లాయర్ కావాలని ఆశంట. నీకాడ పెట్టుకొని వాణ్ణి చదివిస్తావా!.. ”
“తప్పకుండా!.. ”
“వాణ్ణి నీయ్యంతటోణ్ణి చెయ్యాలి. ”
“చేస్తాను.. ” నవ్వుతూ చెప్పాడు ఆదినారాయణ. క్షణం ఆగి..
“యింటికి ఎప్పుడు వస్తాడు?”.
“నాకు తెలవదు. వాడి నెంబరిస్తా. ఫోన్ చేసి నువ్వే కనుక్కో”
“నెంబర్ చెప్పండి”
"xxxxxxxxxx"
“ఓకే.. బంగారన్నా.. నేను వాడితో అన్ని విషయాలూ మాట్లాడుతాను. ”
“అన్ని విషయాలంటే?”
“అంటే.. పెళ్ళి.. చదువు. ”
“ఆ.. సరే.. సరే.. పెట్టేస్తావుండ. ”
ఆదినారయణ సెల్ కట్ చేసి మరో నెంబర్ నొక్కాడు.
“చెప్పండి బాబాయ్!.. ”
“మురారీ.. నీవు యీ రోజు నన్ను కలుసుకోవాలి. ”
“తప్పకుండా బాబాయ్. మరో గంటలో మీ దగ్గర వుంటాను. ”
మురారీ.. దశరథరామయ్య చెల్లెలు సుశీల కుమార్తె ప్రశాంతి భర్త, సర్కిల్ ఇన్ స్పెక్టర్.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Kommentarer