top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 6'Jeevana Ragalu Episode 6'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 06/06/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది. 


దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 

దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి.


నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది.


ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 6 చదవండి. 


“ఔరా!... ఔరా!... బావా!... ఏమి ఏర్పాట్లు.. ఏమి ఏర్పాట్లు...” ఎంతో ఆశ్చర్యంతో పలికాడు సోమయాజులు.


నవ్వుతూ బలరామశర్మ... “బావా!... వెంకటరామయ్యగారి మనస్సు అందరికీ వుండదయ్యా!... ఆయన చెడ్డలో మంచిని చూసే మనిషి. కలలో కూడా ఎవరికీ అపకారం తలపెట్టడు. ‘అపకారికి ఉపకారము నెపమెమన్నక చేయువాడు నేర్పరి సుమతీ'. యీ సుమతీ శకత సూక్తిని తు.చ. తప్పకుండా పాటించే మహానుభావుడు. అలాంటి ఆయన తన ఒక్కగానొక్క కొడుకు వివాహం... ఎంతో ఘనంగా చేయాలనుకోవడం ధర్మమేకదా!...” ఆనంద పారవశ్యంతో చెప్పాడు.


"అవునవును. వారిని గురించి చాలా విన్నాను...” అభినందనా పూర్వకంగా పలికాడు సోమయాజులు.

ఆనందంగా నవ్వుకొంటూ ఆ యిరువురు పురోహితులు వెంకటరామయ్యగారి భవంతి ముందు ఏర్పాటు చేయబడిన కళ్యాణ మండపంలో ప్రవేశించారు.


అక్కడ అప్పటికే వీరికంటే ముందుగా వచ్చిన పుండరీకశర్మ, విష్ణుశాస్త్రి పార్వతమ్మగారితో సంప్రదించి అన్నింటినీ క్రమబద్దంగా సమకూర్చారు.


పార్వతమ్మ, వందన, సుశీల, వందన తల్లి శాంతమ్మ.. ఆ పురోహితులకు ఎదురైనారు.

“బాబాయ్!... పుండరీక, విష్ణు...అడిగినవన్నీ యిచ్చాను. అంటే... పూలమాలలు, పూలు, పండ్లు, టెంకాయలు, అగరవత్తులు, పన్నీరు, పాలు, చందనం, కర్పూరం, వక్కలు, ఆకులు, బియ్యం, తలంబ్రాల బియ్యం, బిందే, గ్లాసులు, మామిడి ఆకులు, దారపుండ... మీరు అన్నింటినీ ఒకసారి వీక్షించి... యింకేమైనా అవసరం అయితే... తెలియజేయవలసినదిగా నా కోరిక...” నవ్వుతూ ఆనందంగా పలికింది పార్వతమ్మ.


అన్నింటిని పరీక్షగా చూచాడు బలరామశర్మ. యింతలో లక్ష్మి అక్కడికి వచ్చింది.

“అమ్మాగారూ!... యీ కవరు స్టోరు రూంలో వుణ్ణింది." పార్వతమ్మకు అదించింది. లక్ష్మిలోనికి వెళ్ళిపోయింది.


కవరులో వున్న గుడ్డను బయటకి తీసి..."బాబాయ్..! తెరపచ్చరం” 


“ఆఁ... యిలా యీమ్మా!... పార్వతమ్మ అందించగా బలరామశర్మ ఆ వస్త్రాన్ని అందుకొన్నాడు.

"అమ్మా!... అన్నీ క్రమంగా వున్నాయి.” తృప్తిగా చెప్పాడు.


యింతలో ఒకతనుపరుగెత్తుకొని వచ్చి...

"అమ్మా!... అమ్మాయి వాళ్ళు వచ్చారు. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు.” చెప్పాడు.


“అలాగా!... సుశీ.... వనజా... రండి” వేగంగా వారు ముగ్గురూ శంకరయ్య యింటికి వెళ్ళారు.


వెంకటరామయ్యను శంకరయ్యను తదితరులనూ కలిశారు.

వారంతా కలసి పెండ్లికుమార్తె కౌసల్యకు, తండ్రి ఆనందరావు, తల్లి సంధ్యకు, వారి బంధుమిత్రులకు స్వాగతం పలికారు. వారందరికీ శంకరయ్య యిల్లు విడిది గృహము.

వచ్చిన వారంతా శంకరయ్య భవంతిలో ప్రవేశించారు. ఆనందరావుగారి బృందం రెండు బస్సుల్లో దిగారు. వారినందరినీ ప్రియంగా పలకరించి, వారికి కావలసినవి సమకూర్చి... వెంకటరామయ్య, పార్వతమ్మలు వారి యింటికి వచ్చారు.


భజంత్రీలు వారికి నిర్ధేశించిన స్థానంలో కూర్చొని నాదస్వర కచ్చేరీని ప్రారంభించారు. మైక్సెట్టు అమర్చిన కారణంగా రెండు డోళ్ళు, రెండు నాదస్వరాల మధురాతి మధురమైన రాగరసాలు ఆ ప్రాంతంలో మారుమ్రోగాయి.


ముహూర్త సమయం ఆసన్నమయింది. వరుడు దశరధరామయ్య మండపంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చున్నాడు.


మంగళ వాద్యములు ముందు.. వెనుక వధువు కౌసల్య, ఆమె తల్లిదండ్రులు బంధుమిత్రులు కళ్యాణమండపంలో ప్రవేశించారు. వధువు కౌసల్య వరుడి ప్రక్కన కూర్చుంది.

పురోహితులు బలరామశర్మ, సోమయాజులు వైవాహిక మంత్రోచ్ఛారణ... మైకులో శ్రవణానందంగా వినిపిస్తున్నాయి.


తల్లితండ్రులు, బంధువులు, వధూవరుల చుట్టూ చేరారు. తెరపచ్చరాన్ని పట్టుకొన్నారు పుండరీకశర్మ, విష్ణుశాస్త్రి. బలరామశర్మ... సోమయాజులు జీలకఱ్ఱ బెల్లాన్ని మంత్రయుక్తంగా మొదట వరుడు వధువుకు తదురి వధువు వరునకు తలపై సవ్యంగా అమరేటట్లు చేశారు. తదుపరి.... ఆనందరావు, అల్లుడు దశరధరామయ్య పాదాలను వెండిపళ్ళెంలో వుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు.


మాంగల్యాన్ని... పుండరీకశర్మ అందరిచేతా తాకించి బలరామశర్మకు అందించారు. విష్ణుశాస్త్రి అందరికీ అక్షింతలను అందించారు.


సోమయాజులు బలరామశాస్త్రిగారి ఆదేశానుసారంగా… వరుడు, వధువు కౌసల్య మెడలో మాంగల్యధారణ చేశాడు. మూడు ముళ్ళు గట్టిగా వేశాడు. 


బంధుమిత్రుల ఆశీర్వాదాలతో శతకోటి అక్షితలు ఆ వధూవరుల శిరస్సులను తాకాయి.

ప్రత్యేకంగా వరుడి తల్లి పార్వతమ్మ, తండ్రి వెంకటరామయ్య, వధువు తల్లి సంధ్య, తండ్రి ఆనందరావు వధూవరులను సమీపపించి వారి హృదయపూర్వక ఆశీర్వచనములతో వారి తలపై అక్షింతలను చల్లారు.


తదుపరి.... వధూవరులు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులు శివాలయానికి వెళ్ళి జగత్ మాతాపితలను దర్శించి, మ్రొక్కులు చెల్లించి, యింటికి తిరిగివచ్చారు. కౌసల్య కోడలుగా ఆ యింట కుడికాలు పెట్టి ప్రవేశించింది.


తదనంతరం వివాహ విందుభోజనం ఎంతో కోలాహలంగా పరస్పర సరస సంభాషణాలతో దివ్యంగా జరిగింది.


సాయంత్రం నాలుగు గంటలు ప్రాంతం... దూరాన్నించి వచ్చిన బంధుమిత్రులు వెంకటరామయ్య పార్వతమ్మలను అభినందించి వెళ్ళివస్తామని చెప్పి, వెళ్ళిపోయారు.


పురోహితులకు ఘనంగా సంభావన వస్త్రాలను సమర్పించి వారి ఆశీస్సులను మరోమారు అందుకొన్నారు నూతన వధూవరులు కౌసల్యా దశరధరామయ్యలు. 


అన్ని వర్ణాల వారు సమబంతి భోజనంలో పాల్గొని కడుపునిండా విందుభోజనం సేవించి... నవదంపతులను, పార్వతీ వెంకటరామయ్యలను నిండు నూరేళ్ళూ చల్లగా వుండాలని మనసారా దీవించారు.


ఐదు గంటల ప్రాంతలో వధూవరులు... వధువు తండ్రి ఆనందరావు తల్లి సంధ్య, వరుడి తల్లి పార్వతమ్మ ఆమె కూతురు సుశీల మరో యిద్దరు ముత్తయిదువులు కలిసి, ఆరున్నర గంటలకు కావలికి చేరారు. ఆ రాత్రి కౌసల్యా దశరధరామయ్యలకు తొలిరేయి.

*

కన్నతల్లి, పినతల్లి, కౌసల్య తరపు ముత్తయిదువులు దశరధరామయ్యను... వారి తొలిరేయి పాన్పు అమర్చిన గది వద్దకు తీసుకొని వచ్చారు.


“నాన్నా!... కోడలి మనస్సు ఎరిగి మసలుకోవాలి” పినతల్లి నవ్వుతూ చెప్పింది. 


నవ్వుతూ సిగ్గుతో... తల ఆడించాడు దశరధరామయ్య. 

అమ్మ సౌజ్జతో గదిలోకి ప్రవేశించాడు.


తలుపులు మూసి ఆ అమ్మలక్కలు వెళ్ళిపోయారు. దశరధ గదినంతా పరిశీలనగా చూచాడు. గది మధ్యన విశాలమైన పందిరి మంచం. పైనా... నాలుగు ప్రక్కల పైనించి క్రింది వరకూ వ్రేలాడుతున్న మల్లెపూల మాలలు, ఒక ప్రక్కగా టేబుల్, దానిపైన నారింజ, దానిమ్మ, అరటిపళ్ళు. ఒక ట్రేలో లడ్లు, జిలేబీ, మైసూర్ పాక్, గ్లాసులో బియ్యం అందులో వెలిగించిన అగరుబత్తులు క్రమంగా అమర్చబడి వున్నాయి. గదికి నాలుగు కిటికీలు, కర్టన్లు అందంగా ఆహ్లాదకరంగా వున్నాయి. అంతకు మునుపే వేసిన సాంబ్రాణి వాసన గదినిండా వుంది. గదిలో ఒక మూల నిలువుటద్దం ముందున్న టేబుల్ పై పౌడర్, సెంటు, దువ్వెనా క్రమంగా అమర్చబడి వున్నాయి.


ఆ క్షణంలో దశరధ మనస్సు నిండా వున్నది కౌసల్య, తన ప్రియాతి ప్రియమైన అర్థాంగి, అతని చూపులు మూసి వున్న తలుపుపై లగ్నమయ్యివుంది.


కొద్ది నిముషాలు తర్వాత గది తలుపులు తెరవబడ్డాయి. కౌసల్య గదిలో ప్రవేశించింది. ఆమెతో వచ్చిన ముత్తయిదువులు కిలకిలా నవ్వుతూ తలుపురెక్కలను మూశారు.


తెల్ల చీర.. అదేరంగు రవిక... తలనిండా మల్లెపూలు, మెడనిండా నగలు, చేతులకు బంగారు గాజులు... కాలికి మెట్టెలు, గజ్జల గొలుసులు, నొసటన సింధూరం... బుగ్గన కాటుక చుక్క... దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా గోచరించింది దశరధకు కౌసల్య.


ఆమె చేతిలో పాలగ్లాసు వుంది. తలుపు ముందే నిలబడి వున్న కౌసల్యను సమీపించాడు దశరధ. తలుపు గడియ బిగించి, కౌసల్య ముందుకు వచ్చి... “కౌసల్యా దేవికి స్వాగతం” నవ్వుతూ మెల్లగా పలికాడు దశరధ.


నవ్వుతూ చేతిలోని పాలగ్లాసును దశరధకు అందించబోయింది కౌసల్య. 


చేతిని వెనక్కు తీసుకొని... "యిక్కడ కాదు. అక్కడ." పందిరి మంచాన్ని నవ్వుతూ చూపించాడు దశరధ.


ముందు దశరధ, వెనుక కౌసల్య నడిచి మంచాన్ని సమీపించారు. దశరధ మంచం పై కూర్చున్నాడు. ఎదురుగా కౌసల్య నిలబడింది.


తనకు ముందు మౌనంగా తల దించుకొని పాలగ్లాసుతో నిలబడివున్న కౌసల్య చేతిలోని పాలగ్లాసును తన చేతిలోకి తీసుకొని...

“కూర్చో కౌసల్యా!...” ఎంతో అభిమానంతో చెప్పాడు.


కౌసల్య మౌనంగానే... మంచంపై కూర్చుంది.

“యింతకు ముందు మనం నాలుగు సార్లు కలిశాము...


మొదట... నీవు పుచ్చకాయలు బండి వాడితో బేరాలు ఆడుతున్నప్పుడు. నేను నిన్ను చూచేదానికి వచ్చినప్పుడు. రెండవసారి... బిట్రగుంట తిరునాళ్ళలో. మూడవసారి... మన నిశ్చితార్థం రోజు నాల్గవసారి. మన వివాహ వేదికపైన... యిది మన ఐదవ సమావేశం. కేవలం మన కోసం... అంటే భార్యా భర్తల కోసం... మన పెద్దలు ఏర్పాటు చేసిన ఏకాంత సమయం. మన తొలిరేయి. అవునా!...” చిలిపిగా నవ్వుతూ కౌసల్య ముఖంలోకి వంగి చూచాడు దశరధ. 'అవును' అన్నట్లు తలవూపింది కౌసల్య తలవంచుకొని.


గ్లాసులోని పాలు సగం త్రాగి... “ఇవి నీ భాగం... త్రాగు...” గ్లాసు కౌసల్యకు అందించాడు దశరధ.

గ్లాసును అందుకొని... పాలను గుటగుటా త్రాగేసింది. కౌసల్య, ఖాళీ గ్లాసును అందుకొని టేబుల్ క్రింద పెట్టి చేతి వాచీ కేసి చూచి.. “టైమ్ పదిన్నర...” నవ్వుతూ కౌసల్య ముఖంలోకి చూస్తూ అన్నాడు దశరధ.


“ఏం చేయాలో చెప్పండి.” తలదించుకొని నవ్వుతూ మెల్లగా చిలకలా పలికింది కౌసల్య.


ఆమెకు దగ్గరగా జరిగి తన రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకొని, ఆమె నొసటన మెల్లగా చుంబించాడు దశరధ.


“నీవు నా సౌభాగ్య దేవతవు" ఆ క్షణంలో అతని పెదవులు అప్రయత్నంగా పలికాయి.


కౌసల్య అతని చేతుల్లో వాలిపోయింది లేడి పిల్లలా. గదిలోని లైటు ఆరిపోయింది. ఆ చీకట్లో కౌసల్య ముఖంలోకి పరిశీలనగా చూస్తూ దశరధ... 

“లైటు!!!...”


“నేనే ఆర్పాను”


యిరువురూ మంచం పై వాలిపోయారు. బిగి కౌగిలింతలో యిరువురూ ఒకటైనారు. మనస్సుల నిండా మధురానుభూతులు. ఆ యిరువురూ విహంగాలై... వినువీధిలో ఎంతో ఆనందంగా విహరించారు.

రాత్రి రెండు గంటలు ప్రాంతం... కౌసల్య దశరధరామయ్య ఎదపై తలపెట్టుకొని వుంది. మదినిండా మధురానుభూతులు. "కౌసల్యా!... నీకు ఎంతమంది పిల్లలు కావాలి?...” అడిగాడు దశరధ.

“పదిమంది... మన పేరును నిలబెట్టేది మన పిల్లలేగా!...” గలగలా నవ్వింది కౌసల్య. పరవశంలో అర్ధాంగిని అక్కున చేర్చుకున్నాడు దశరధ.

*

“ఖచ్చితంగా ఐదుగంటలకు మన యింటిముందు వుంటాం బావా!...” ఫోన్లో ఆనందరావు వెంకటరామయ్యకు చెప్పాడు.


“పారూ!... మన కొడుకు, కోడలు... మనవాళ్ళు ఐదుగంటలకల్లా మన యింటికి వస్తారట.” పార్వతమ్మను సమీపించి నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య. 


“అలాగా!... చాలా చాలా సంతోషం.” ఆనందంగా పలికింది పార్వతమ్మ. 


నవదంపతులు... కౌసల్య దశరధరామయ్యలకు అమ్మాయి యింట్లో కావలిలో మూడు నిద్రలూ ముగిసాయి.


ఆనందరావుగారు చెప్పిన ప్రకారం రెండు కార్లలో ఆనందరావు దంపతులు, వధూవరులు, నలుగురు ముత్తయిదువులు... వెంకటరామయ్యగారి నిలయానికి ఐదు గంటలకు చేరారు. వెంకటరామయ్య దంపతులు వారి బంధువులు... వచ్చిన వారికి స్వాగతం పలికారు.


వధూవరులు భవంతి సింహద్వారాన్ని సమీపించారు. హారతి యివ్వబడింది. ఎంతో ప్రేమాభిమానాలతో పార్వతమ్మ కోడలి చేయి పట్టుకొని లోనికి ఆహ్వానించింది. వరసైన వారు... అడ్డు తగిలారు.


"వదినా!... మీ వారి పేరేమిటో చెప్పు.” కౌసల్యను సమీపించి నవ్వుతూ అడిగారు.

కౌసల్య సిగ్గుతో చిరునగవుతో తలదించుకొంది.


తల్లి సంధ్య కూతురు ముఖంలోకి చూస్తూ... “చెప్పమ్మా!... అంది. 


“దశరధరామయ్యగారు” అతి మెల్లగా నవ్వుతూ పలికింది కౌసల్య.


“ఆ యిక నీవు చెప్పు. నీ భార్య పేరేమిటి?...” దశరధవంక చూస్తూ అడిగారు ముత్తయిదువులు.


“కౌసల్యాదేవి.” భార్య ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు దశరధ.


అందరూ ఆనందంగా నవ్వుకొన్నారు. కౌసల్య కుడి కాలుతో బియ్యపు చెంబును తాకింది. చెంబులోని బియ్యం ఇంద్రధనుస్సులా గదిలో వ్యాపించాయి. కౌసల్య తన గృహప్రవేశాన్ని చేసింది, ఎంతో ఆనందంగా భర్త చేతిని పట్టుకొని.


"ఆ రాత్రి... విందు భోజనాలను ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు పార్వతమ్మ వెంకటరామయ్యలు.

ఆ భవంతిలో వారికి అది నాల్గవరేయి. నవదంపతులు యిరువురి మధ్యా కొంత చనువు ఏర్పడిన కారణం బిడియం వీడి పరస్పర అవగాహనతో... ఆ రాత్రి స్వర్గసుఖాలను అనుభవించారు. మధురమైన ఊహలలో తేలిపోయారు.


దినకరుడి దివ్య తేజంతో... జగత్తు మేలుకొంది. రాత్రి నిద్రలేమి కారణం దంపతులు అలిసి వేకువన నిద్రలో మునిగిపోయారు. తలుపులు తట్టిన సవ్వడిని విని యిరువురూ వులిక్కిపడి లేచారు.


కౌసల్య చీరా రవికను సరిచేసుకొని వెళ్ళి తలుపు తెరచింది. ఎదురుగా నిలబడి వున్న పార్వతమ్మను, తల్లి సంధ్యను చూచింది. సిగ్గుతో తల వంచుకొంది. “అమ్మా!... పద స్నానం చేద్దువుగాని...” ఆప్యాయతతో చెప్పింది పార్వతమ్మ.


కౌసల్య వారిని అనుసరించింది. గది నుంచి వెలుపలికి వచ్చిన దశరధరామయ్య మధురస్మృతులతో... మదినిండా ఆనందంతో వారిని అనుసరించాడు.


స్నానాదులు ముగిసిన తర్వాత... పూజా మందిరంలో అందరూ సమానేశమయ్యారు. వెంకటరామయ్యగారు పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. మంగళహారతి యివ్వబడింది.


నవదంపతులు పెద్దలందరికీ పాదాభివందనం చేశారు. తర్వాత... అల్పాహార సేవన కార్యక్రమం ముగిసింది. ఆనందరావు దంపతులు తిరుగు ప్రయాణానికి సిద్ధమైనారు. అందరూ హాల్లోకి వచ్చారు.

కూర్చొని వున్న ఆనందరావు లేచి వెంకటరామయ్యను సమీపించాడు. “బావగారూ!... యింటికి పెద్దబిడ్డగా పుట్టిన కౌసల్య అంటే... మాకు ప్రాణం. ఆమె పుట్టిన తర్వాత నాకు... వ్యాపారం బాగా కలిసి వచ్చింది. ఆమె పేరు మా తల్లిగారి పేరు. నా బిడ్డను మీరు... తను ఏదైనా పొరపాటు చేస్తే.. సహృదయంతో మన్నించి, నచ్చచెప్పి మీ బిడ్డగా... చూచుకొనవలసినదిగా కోరుచున్నాను.”


గద్గదస్వరంతో కన్నీటితో... చెప్పాడు ఆనందరావు. ప్రక్కన వున్న సంధ్య రోదిస్తూ వుంది.

వెంకటరామయ్య సోఫానుంచి లేచి... ఆనందరావు భుజంపై చెయ్యివేసి.. “బావా!... ఏ క్షణాన నా బిడ్డ, కౌసల్య మెడను తాకి మూడుముళ్ళు వేశాడో... ఆ క్షణం నుంచీ, కౌసల్య మా బిడ్డగా మారిపోయింది.

తన పైనున్న కండువాతో ఆనందరావు అశ్రువులను తుడిచి... “మీరు... యికపై కౌసల్యను గురించి ఎలాంటి బాధా, దిగులు పడకూడదు.. ఆమె మా బిడ్డ.” ఎంతో అనునయంగా పలికాడు వెంకట రామయ్య.


ఏడుస్తున్న సంధ్యను సమీపించి పార్వతమ్మ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొంది. ఆమె ముఖంలోకి చూస్తూ... తన పమిటతో ఆమె కన్నీళ్ళు తుడిచి...

“వదినా యిది మనమందరం ఆనందించవలసిన సమయం. యికపై మీ బిడ్డ నా బిడ్డ. నా మాటను నమ్ము.” ఆమె చేతిలో తన చేతిని వుంచింది.


మేడపైనుంచి... దశరధరామయ్య... కౌసల్యా దిగి వచ్చారు. కౌసల్య తల్లిని సమీపించింది. ఆమె కళ్ళల్లో నిండివున్న కన్నీటిని చూచింది. అప్రయత్నంగా కౌసల్య నయనాలు అశ్రుపూరితాలైనాయి.

“అమ్మా!...” రోదిస్తూ తల్లిని కౌగలించుకొంది కౌసల్య.


వారిరువురునీ సమీపించి పార్వతమ్మ... కౌసల్యను తనవైపుకు త్రిప్పుకొంది. ఆమె కన్నీటిని తుడిచి తన హృదయానికి హత్తుకుంది.


“ఏడవకూడదమ్మా!... వాళ్ళు బయలుదేరుతున్నారు. నవ్వుతూ వారికి వీడ్కోలు చెప్పాలి. యికపై నేనూ నీ తల్లినే.” ఎంతో మృదుమధురంగా మెల్లగా పలికింది పార్వతమ్మ.


కౌసల్య తమాయించుకొంది. దశరధరామయ్య ఆమెను సమీపించాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని...


'ఏడవకు' కళ్ళుతోనే సాజ్ఞ చేశాడు. ఆ క్షణంలో.. అతని నయనాలలో గోచరించిన అభిమానానికి కౌసల్య ముఖం చిరునగవుతో నిండిపోయింది.


కొద్దినిముషాల తర్వాత అందరూ వరండాలోని వచ్చారు. 

"శలవు బావగారు!...” చేతులు జోడించాడు ఆనందరావు. 


“మంచిది బావా!... వెళ్ళండి.”


“వదినా!... వెళ్ళి వస్తాము.”


“వెళ్ళిరండి వదినా!...” నవ్వుతూ పలికింది పార్వతమ్మ. 


ఆనందరావు, సంధ్య, ముత్తయిదువులూ కార్లల్లో కూర్చున్నారు.

కౌసల్య తల్లి తండ్రి ముఖాల్లోకి చూచింది. 'జాగ్రర్త' అన్నట్లు ఆ నాలుగు కళ్ళు తెలియజేశాయి. 'సరే' అన్నట్లు కౌసల్య తల ఆడించింది.


కార్లు భవంతి ఆవరణం దాటి వీధిలో ప్రవేశించాయి. వెంకటరామయ్య దంపతులు చిరునగవుతో భవంతిలోనికి వెళ్ళారు.


దశరధరామయ్య కౌసల్యను సమీపించాడు. ఎంతో ఆశగా దీనంగా కౌసల్య అతని ముఖంలోకి చూచింది. తన ఎడం చేతిని ఆమె భుజం పై వేశాడు. "కౌసల్యా!... ఏం కోరి నన్ను చేసికొన్నావు. నీ విషయంలో, నేనూ అంటే... నా వల్ల... నా వారివల్ల, నీకు ఏనాడూ... ఎలాంటి కష్టం... కలగదు. నా మాట నమ్ము.” పలుకుల్లో ఎంతో ఆప్యాయత నిండి వుంది. కౌసల్య ఎంతో సంతోషంతో తృప్తిగా నవ్వింది. ఆ యిరువురూ భవంతిలోనికి నడిచారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.18 views0 comments

Comments


bottom of page