top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 5'Jeevana Ragalu Episode 5'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 29/05/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:

కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది. 

దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 

దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి.ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 5 చదవండి. 


‘'ఒక కారు, రెండు బస్సులు నెల్లూరులో ఏర్పాటు చేశాను మామ!... రేపు ఉదయం ఆరు గంటలకు మన యింటి ముందు వుంటాయ్. ఆరుగంటలకు మనం బయలుదేరితే ఏడున్నర లోపల కావలికి చేరుతాం. కార్లో మీరు, మా అత్తయ్య, దశరథ.. అదే మా బావా, సుశీల బయలుదేరండి. నేను, మనవాళ్ళందరం కలసి బస్సుల్లో మీ వెనకాలే వస్తాము.” శంకరయ్య ఎంతో వినయంగా విన్నవించాడు వెంకట రామయ్యగారికి.


"అలాగే శంకరా!... మంచిపని చేశావు." అల్లుణ్ణి మెచ్చుకొన్నాడు వెంకటరామయ్య..


అదే సమయానికి గ్రామ ముఖ్యులు కోటిలింగయ్య, రామన్నచౌదరి, రామదాసు వచ్చారు. నమస్కార ప్రతినమస్కారాలు జరిగాయి. ఆశీనులయ్యారు.

“మీరంతా కుటుంబసమేతంగా మాతో రావాలి. రేపు ఉదయం ఆరు గంటలకు మన ప్రయాణం.” ఆహ్వానపూర్వకంగా వారికి తెలిపాడు వెంకటరామయ్య.


“మీరు చెప్పడం మేము రాకుండా వుండడమా బావగారూ!...” నవ్వుతూ చెప్పాడు రామన్న చౌదరి.

మిగతా యిరువురూ వంత పాడారు.

బలరామశర్మ రంగప్రవేశం చేశారు. సుఖాశీనులయ్యారు. చిరునగవును చిందిస్తూ వెంకటరామయ్య వదనంలోకి చూచారు.


"మీ కూతురు అన్ని సిద్ధం చేశానని చెప్పింది. లోనికి వెళ్ళి ఒక్కసారి చూడండి.’’ ఎంతో వినయంగా కోరాడు వెంకటరామయ్య. 


“అలాగే...” యింట్లోకి నడిచారు బలరామశర్మ. 


హాల్లో పార్వతమ్మ వారికి ఎదురైయ్యింది.

"రండి బాబాయిగారూ!...” నవ్వుతూ స్వాగతం పలికింది. 


యిరువురూ ప్రక్క గదిలోకి నడిచారు.

“బాబాయ్!... అన్నీ క్రమంగా అమర్చి వున్నాయి. మీరు ఒక్కసారి పరిశీలనగా చూడండి. ఏదైనా అవసరమైతే తెప్పిస్తాను.”


బలరామశర్మ ఆమె ముఖంలోకి చూచి నవ్వాడు.

“ఏంటి బాబాయ్!...” చిరునగవుతో అడిగింది పార్వతమ్మ.


"ఎన్నేళ్ళుగా చూస్తున్నాను... నీవు ఏకసంతాగ్రాహివి అమ్మా!... నీకు ఒక్కసారి చెబితే చాలు.” నవ్వుతూ పలికాడు బలరామశర్మ.


బలరామశర్మ అభినందనకు పార్వతమ్మ మురిసిపోయింది. యిరువురి నయనాలు క్రిందవున్న వస్తువుల వైపు లగ్నమైనాయి.


పసుపు కొమ్ములు, కుంకుమ, పసుపు, టెంకాయలు, కర్పూరం, అగరవత్తులు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, గజనిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, చీరలు, రవికలు అన్నీ వరుసగా వేరువేరు కవర్లల్లో క్రమంగా పెట్టబడివున్నాయి.


“అమ్మా!... అన్నింటినీ సవ్యంగా సమకూర్చారు.” తృప్తిగా పలికాడు బలరామశర్మ.


వాటి ప్రక్కన వున్న చందనపు వన్నె పెట్టెను వంగి చేతికి తీసుకొంది పార్వతమ్మ. మూతను తెరిచింది.


“యీ ఆభరణాలను మనం అమ్మాయికి చేయించాము. చూడండి.”


పెట్టెను చేతికి అందుకొని, ఒక్కొక్క నగను పైకి ఎత్తి చూచి... యధాస్థానంలో వుంచాడు బలరామశర్మ.

“అన్నీ చక్కగా వున్నాయమ్మా!...” ఆనందంగా నవ్వుతూ పెట్టెను పార్వతమ్మ చేతికి అందించాడు.

పార్వతమ్మ వదనంలో ఎంతో తృప్తి, ఆనందం.


పెట్టెను ఆమె యధా స్థానంలో వుంచింది. యిరువురూ వరండాలోకి వచ్చారు. బలరామశర్మగారు కూర్చున్నారు.


"మా అమ్మాయి అన్నింటినీ సక్రమంగా సమకూర్చింది వెంకటరామా!...” నవ్వుతూ వారి ముఖంలోకి చూచి చెప్పాడు బలరామశర్మ.


“అలాగా!... చాలా సంతోషం." నవ్వుతూ పార్వతమ్మ ముఖంలోకి చూస్తూ చెప్పాడు వెంకటరామయ్య.

అందరూ లేచి “యిక మేము వెళ్ళివస్తాము. రేపు ఉదయం ఆరుగంటలకు కలుసుకొందాం.” చెప్పి తమతమ యిండ్ల వైపు సాగారు.


వారికి ఎదురైన పాలేర్లు వరండాను సమీపించి వెంకటరామయ్యకు నమస్కరించారు.

“మీరంతా మాతో రేపు ఉదయం కావలికి రావాలి. విషయం తెలుసుకదా!... మన దశరథ వివాహ నిశ్చితార్థం. ఆరుగంటలకు బయలుదేరుతాము.” చిరునవ్వుతో పలికాడు వెంకటరామయ్య.


అందరి వదనాల్లో ఆనందం, తమ యజమాని తమకు యిచ్చిన ఆహ్వానానికి వారందరికీ సంతోషం. 

"ఏం గోవిందా!... మాట్లాడవు!..." అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు వెంకటరామయ్య. గోవిందు వాళ్ళందరి నాయకుడు.


"అయ్యా!... తమరు పిలవడం, మేము రాకుండా వుండమా!... అందరం తప్పకుండా వస్తామయ్యా!...” ఎంతో ఆనందంగా చెప్పాడు గోవిందు. 


అర్ధాంగి వైపుకు తిరిగి. “పారూ!.... వీళ్ళకు రెండు వేలు యివ్వు.” 

పరుగున పార్వతమ్మ లోనికి వెళ్ళింది. వెంటనే తిరిగి వచ్చింది. 

“గోవిందా తీసుకో.”


గోవిందు యజమానురాలు అందించిన డబ్బును అందుకున్నాడు.


"మీ సొంత ఖర్చులకు వుంచుకోండి గోవింద...” వెంకటరామయ్య చెప్పాడు. 


అందరూ సంతోషంతో తలలు ఆడించారు.

“యిక మేము వెళ్ళి వస్తామయ్యగారు.” ఆనందంగా నవ్వుతూ చెప్పాడు గోవింద.


“మంచిది.” చిరునగవుతో వెంకటరామయ్యగారి జవాబు.


అందరూ చేతులు జోడించి వెళ్ళిపోయారు.

“శింగపేట నుంచి ఎన్ని గంటలకు వస్తానన్నాడు దశరథ, పారూ!...”


“యీ పాటికి వస్తూ వుంటాడండీ... అక్కడి గ్రామస్థులకు నూతన వ్యవసాయ పద్ధతులను గురించి చెప్పి ఒప్పించి రావాలికదా!...” భర్త ముఖంలోకి చూస్తూ చెప్పింది పార్వతమ్మ.


“అమ్మా! వచ్చేశానమ్మా!...” గుర్రబండి దిగి నవ్వుతూ పలికాడు దశరథరామయ్య.


“రా నాన్నా రా!...” ఆప్యాయత నిండిన తల్లి పిలుపు.


“పోయిన పనీ...” వెంకటరామయ్య పూర్తి చేయక మునుపే... “చాలా బాగా అయింది నాన్నా!... అందరూ నా అభిప్రాయాన్ని శ్రద్ధగా విన్నారు. 'వ్యవసాయం చేయడంలో మీరు చెప్పిన నూతన పద్ధతులను అనుసరిస్తాము’ అని నాకు హామీ యిచ్చారు నాన్న...” ఎంతో తృప్తిగా ఆనందంగా పలికాడు దశరథరామయ్య.


“సరే... ముఖం వాడిపోయింది. వెళ్ళి స్నానం చెయ్యి... భోం చేసి త్వరగా పడుకోవాలి. వేకువన నాలుగు గంటలకు లేవాలి నాన్నా!...” ఎంతో ఆప్యాయతతో పలికింది పార్వతమ్మ.


“అలాగే అమ్మా...” యింట్లోకి వెళ్ళిపోయాడు దశరథ అతన్ని అనుసరించింది పార్వతమ్మ.


 “ఫకీరా! యిలారా!...” పిలిచాడు వెంకటరామయ్య.


గుర్రపు బండి చోదకుడు ఫకీరా యజమానిగారిని సమీపించాడు.

“ఏంటయ్యగారూ!...” చేతులు కట్టుకొని ఎంతో వినయంగా అడిగాడు.


“కూర్చో...”


స్థంభం ప్రక్కగా కూర్చున్నాడు ఫకీరా.


 “అమ్మా సుశీలా!...” కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు వెంకటరామయ్య. 

యింట్లో నుంచి సుశీల పరుగెత్తి వచ్చింది. “ఏం నాన్నా...” అడిగింది. 


“అమ్మ దగ్గరకు వెళ్ళి ఫకీరాకు కొన్ని గుడ్డలను అడిగి తీసుకొని రా.” 


“అలాగే నాన్నా!...” మెరుపు తీగలా వెళ్ళిపోయింది సుశీల. 


"అయ్యా!... నేను మీకో విషయం చెప్పనా!...”


“ చెప్పు.” ఫకీరా ముఖంలోకి చూస్తూ అడిగారు వెంకటరామయ్య.


ఫకీరా నవ్వుతూ... “మన సుశీలమ్మకు... శంకరయ్య బాబుకు యీడూ జోడుగా బాగా వుంటుందయ్యా!...” వెంకటరామయ్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ చెప్పాడు ఫకీరా.


వెంకట రామయ్య వదనంలో దరహాసం... “ఫకీరా! శంకరయ్య నా మేనల్లుడు. నా చెల్లెలి కొడుకు. నా చెల్లి నా మాటను కాదనదు. అమ్మాయి బి.ఏ. పూర్తి కాగానే వారి వివాహాన్ని జరిపిద్దాం.” ఆనందంగా పలికాడు వెంకటరామయ్య.


"శంకరయ్య అంటే... అమ్మాయిగారికి చాలామంచి అభిప్రాయం అయ్యా!... అలాగే శంకరయ్యగారికి... సుశీలమ్మ అంటే ఎంతో అభిమానం అయ్యా!..." ఎంతో అణుకువగా... అనునయంగా చెప్పాడు ఫకీరా.


“నాకు తెలుసు ఫకీరా!...” చిరుదరహాసంతో చెప్పాడు వెంకటరామయ్య. 


“నాన్నా!... యివిగో.” రెండు కవర్లను తండ్రి చేతికి అందించింది సుశీల. 


రెండు క్షణాల తర్వాత... “నాన్నా! ఫకీరా మీద ఒక కంప్లయింట్.” చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ముద్దుగా పలికింది సుశీల.


“అలాగా!... ఏమిటమ్మా అది... చెప్పు. శిక్ష వేయాల్సి వుంటే ఫకీరాను శిక్షిస్తాను.” కళ్ళు పెద్దవి చేసి సుశీలను... ఫకీరాను... మార్చి మార్చి చూచాడు వెంకట రామయ్య.


“చాలా రోజులుగా నాకు ఓ మంచి కథను చెబుతానని రోజూ చెబుతూ... ఆ కథను యింతవరకూ చెప్పలేదు నాన్నా.” కంప్లయింట్ను వివరించింది సుశీల చిరుకోపంతో.


వెంకట రామయ్య ఫకీరా ముఖంలోకి చూచి నువ్వుతూ... “నిజమా ఫకీరా!...” అడిగాడు.

ఫకీరా నవ్వి అవునన్నట్లు తల ఆడించాడు.

“చెప్పు ఫకీరా!... నీకు మాట తప్పడం అలవాటు లేదుగా!...”


“అట్టాగేనయ్యా...”


“విన్నావుగా తల్లీ. నా ముందు ఒప్పుకున్నాడుగా. తప్పకుండా చెబుతాడు. ఎల్లుండి స్కూలుకి వెళ్లేటప్పుడు.” అలాగే, అన్నట్లు ఫకీరా తల ఆడించాడు నవ్వుతూ. 


“ఫకీరా!... ఎల్లుండి తప్పకుండా చెప్పాలి!..." ప్రాధేయపూర్వకంగా పలికింది సుశీల.


“అట్లాగే తల్లీ.” అంగీకరించాడు ఫకీరా.


"యిప్పుడు సంతోషమేగా చిట్టి తల్లీ!... నీ చేతులతో కవర్లను ఫకీరాకు యివ్వు” సుశీలకు అందించాడు వెంకటరామయ్య.


సంతోషంతో నవ్వుతూ సుశీల... ఫకీరాకు కవర్లను అందించింది.

పరమానందంతో అందుకొన్నాడు ఫకీరా.


కృతజ్ఞతా పూర్వకంగా వెంకటరామయ్య నమస్కరించి ఫకీరా వెళ్ళిపోయాడు. 

సుశీల ఆనందంగా లోనికి వెళ్ళిపోయింది. వెంకటరామయ్య కుర్చీ నుండి లేచి... భవంతి చుట్టూ తిరిగి అన్నింటిని పరీశీలనగా చూచాడు.


శంకరయ్య నేతృత్వంతో పనివారు తీర్చిదిద్దిన రంగుతో ఆ భవనం... ముఫ్ఫై ఏళ్ళ క్రింద నిర్మించినా ఆ సంవత్సరంలో నిర్మించినంత కొత్తదిగా గోచరిస్తూ వుంది. 

ఆవులు... గేదెలు కొన్ని గడ్డి తింటున్నాయి. కొన్ని పడుకొని నెమరు వేస్తున్నాయి. లేగదూడలు తల్లుల పాలు తాగి అటూ యిటూ పరుగెడుతున్నాయి.


కొటాంలో ఎద్దులు... ఎండు పిల్లిపెసరను మేస్తున్నాయి. మూడు గుర్రాలు మూతులకు దాణా సంచులు వ్రేలాడుతుండగా... అవి దాణా వులవగుగ్గిళ్ళను తింటున్నాయి.

చైత్రమాసం కావటం వల్ల టెంకాయ చెట్లు మామిడి... బాందం... కానగ... వేపచెట్లు... పచ్చగా కనులకు నిండుగా గోచరిస్తున్నాయి. శకున పక్షులు చెట్లపై జేరి వాటి భాషలో ఎంతో ఆనందంగా రాగాలు తీస్తున్నాయి.


ఆ క్షణంలో వెంకటరామయ్యకు తన తండ్రి... దశరథరామయ్య, తల్లి మహాలక్ష్మి గుర్తుకు వచ్చారు. వారు కీర్తిశేషులు. కొడుక్కు... తండ్రి పేరే పెట్టాడు.


‘అమ్మా!... నాన్నా!... మీరు నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. నేను నా బిడ్డలను అదే విధంగా పెంచాను. రేపు మీ మనవడి నిశ్చితార్థం. ఏ లోకానున్నా వాణ్ణి మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని నా నమ్మకం. మనస్సులోనే తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపాడు.


భవంతి ముందుకు వచ్చాడు. శంకరయ్య... శివాలయ అర్చకులు త్రిమూర్తి వెంకటరామయ్యకు ఎదురైనాడు.

“మామ!... రేపు ఉదయం ఐదు గంటలకు జరిగే ఆభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.” నవ్వుతూ చెప్పాడు శంకరయ్య.


అంతవరకూ యజమాని వెనకాలే తోకలు ఆడిస్తూ వారితో సంచారం చేసిన జాతి కుక్కలు ముందుకు వచ్చి తోక ఆడిస్తూ వారిని చూస్తున్నాయి.

"రాణి... రంగ... వెళ్ళండి.”


యజమాని మాటలు వినగానే శునకద్వయం దూరంగా వెళ్ళిపోయాయి.

“త్రిమూర్తీ!...” వెంకటరామయ్య పూర్తి చేయక మునుపే...

“అన్నీ సవ్యంగా ఏర్పాటు చేశారు తమరి అల్లుడుగారు మీరు... ఉదయం ఐదుగంటలకు ఆలయంలో ప్రవేశిస్తే... నేను నా కార్యక్రమాన్ని ఆరుగంటల కల్లా ముగిస్తాను.” దరహాస వదనంతో ఎంతో వినయంగా చెప్పాడు త్రిమూర్తి.


“అలాగే.. యిక మీరు వెళ్ళి రండి.”


“శలవు.” చేతులు జోడించి త్రిమూర్తి వెళ్ళిపోయాడు.


యింతలో అక్కడికి... చెల్లెలు శాంతమ్మ.. ఆమె కూతురు వందనా... ఆమె కొడుకు శివకుమార్ అక్కడికి వచ్చారు.

శివకుమార్... "తాతయ్యా!...” అంటూ వెంకటరామయ్య కాళ్ళను తన చేతులతో బంధించాడు.


నవ్వుతూ వంగి మనమణ్ణి ఎత్తుకున్నాడు వెంకటరామయ్య.


"అమ్మా!... వందనా!... మన వాళ్ళంతా బాగున్నారుగా!...” ఆప్యాయతతో అడిగాడు వెంకటరామయ్య.


"అంతా బాగున్నారు మామయ్యా!..." చిరునగవుతో చెప్పింది వందన. అందరూ ఆనందంగా యింట్లోకి నడిచారు.

*

"ఓహెూ!... దశరథా!... ఆనందరావుగారికి చాలా బలగం వున్నట్లుంది"

కారు దిగిన దశరథరామయ్యను, బస్సు ఆగగానే దూకి... పరుగున పుండరీక అతన్ని సమీపించి ఆశ్చర్యంతో అన్నాడు.


దశరథరామయ్య అతని ముఖంలోకి చూచి 'అవును' అన్నట్లు తల ఆడించాడు. 


ఆనందరావు, సంధ్య కారు దగ్గరకు వచ్చి... వెంకటరామయ్యను పార్వతమ్మను పెండ్లి కొడుకు దశరథరామయ్యను తదితరులను... సగౌరవంగా ఆహ్వానించి భవంతిలోనికి పిలుచుకొని వెళ్ళారు.

ఎడమవైపున వున్న విశాలమైన గదిలో అందరూ ప్రవేశించారు. ఆ గదిలో సోఫాలు కుర్చీలు క్రమంగా అమర్చబడివున్నాయి.


“కూర్చోండి బావగారూ!...” ఎంతో ఆప్యాయంగా చెప్పాడు ఆనందరావు.


“కూర్చోండి వదినగారూ!” దరహస వదనంతో పలికింది సంధ్య.


దశరథరామయ్య వంక చూచి "కూర్చోండి బాబూ!..." ప్రీతిగా పలికాడు ఆనందరావు.


అందరూ ఆసనాలను అలంకరించారు. పురోహితులు విష్ణుశాస్త్రిగారి తండ్రి సోమయాజులు... పుండరీకశర్మ తండ్రి బలరామశర్మ... వెంకటరామయ్యగారిని సమీపించారు.


“ఆనందరావుగారు... అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. అనుకొన్న ముహూర్తానికి కార్యక్రమాన్ని దివ్యంగా జరిపిస్తాము.” నవ్వుతూ చెప్పాడు బలరామశర్మ. “అలాగే, చాలా సంతోషం" నవ్వుతూ చెప్పాడు వెంకట రామయ్య. 


తర్వాత అందరికీ అల్పాహారం సమకూర్చబడింది. అందరూ ఆనందంగా సేవించారు.

వధువు బంధుజాలం అందరూ వచ్చి దశరథరామయ్య చూచారు. కౌసల్యకు చాలా మంచి వరుడు దొరికాడని అందరూ సంబరపడ్డారు.


లేత గంధం వన్నె లాల్చీ... మల్లెపూల తెల్లదనాన్ని అధిగమించే తెల్లటి సాంప్రదాయ బద్దమైన ధోవతి పంచెకట్టు, మెడలో బంగారు దండ. రెండు చేతులకు నాలుగు వుంగరాలు. నొసటన చందనం దాని మధ్యన కుంకుమ బొట్టు, వుంగరాల జుట్టు... పెదవులపై చిరుదహాసం... చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాడు దశరథరామయ్య.


ముహూర్త సమయం ఆసన్నమయ్యింది. బలరామశర్మ ఆ హాల్లోకి వచ్చి...

“వెంకటరామా!... యిక మనం వెళ్ళి ముందు హాల్లోకూర్చోవాలి. అమ్మాయి వైపు వాళ్ళంతా కూర్చున్నారు.” అన్నాడు.


ఆనందరావు... సంధ్య వచ్చి, మొగపెళ్ళి వారిని ఆహ్వానించారు. అందరూ వెళ్ళి భవంతి మధ్య హాల్లో కూర్చున్నారు.


“ఉభయ పురోహితులు... సోమయాజులు తనయుడు విష్ణుశాస్త్రి... బలరామశర్మ తనయుడు పుండరీక శర్మ మధ్యలో ఎదురెదురుగా కూర్చొని ప్రధమంగా శ్రీ వినాయక పూజ దివ్య మంత్రోచ్ఛారణతో చేశారు. తదనంతరం రెండు వంశాల మూడు తరాల వారి నామాలు పలికి... వరుడు, వెంకటరామయ్య పార్వతమ్మల తనయుడనీ... వధువు, ఆనందరావు సంధ్యల ప్రధమ పుత్రిక కౌసల్య అని... సభికులకు తెలియపరిచారు.


వధువు వరుల తల్లిదండ్రులు ఫలపుష్పాదులు కానుకలతో నిండిన తట్టలను ఒకరినుంచి ఒకరు అందుకొన్నారు.


తను తెచ్చిన నగలను పార్వతమ్మ కాబోయే కోడలు కౌసల్యకు స్వహస్తాలతో అలంకరించింది.

అందరూ అక్షితలను చల్లి వధూవరులను ఆశీర్వదించారు.


'తర్వాత... పెద్దవాడు... సోమయాజులు గారు వివాహలగ్న పత్రికను చదివారు. ఆనందరావు వెంకటరామయ్యగార్లు దానిమీద సంతకాలు చేశారు. పురోహితుల చేతుల మీదుగా ఆ ఉభయులు లగ్నపత్రికలను అందుకొన్నారు.


నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది. ఘనంగా విందు భోజనాలు జరిగాయి. వధూవరులను ప్రక్క ప్రక్కగా కూర్చోబెట్టారు.

“నేను నీకు నచ్చానా!...” మెల్లగా నవ్వుతూ... అడిగాడు దశరథరామయ్య. 


“మాటలతో చెప్పలేను.” అతి మెల్లగా దరహాస వదనంతో పలికింది కౌసల్య. 


భోజనాల పర్వం ముగిసింది. తర్వాత ఆనందరావుగారు వెంకటరామయ్యగారు పురోహితులు మరికొందరు ముఖ్యులు పదిహేను రోజులలో జరగనున్న వివాహాన్ని గురించి చర్చించుకొన్నారు. చివరగా నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి. వెంకటరామయ్య బృందం ఆ భవంతి నుండి బయటికి నడిచారు. ఆనందరావు దంపుతులు వారిని సాగనంపారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.28 views0 comments

Comments


bottom of page