top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 1

ధారావాహిక ప్రారంభం


'Jeevana Ragalu Episode 1'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 06/05/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్నా మాట

ఈ మన భారతావనికి... మన హైందవతకు... ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకత వుంది. దానికి కారణం... యీ దేశ వాసులైన మన పూర్వీకులు... సత్కీర్తివంతులైన తల్లిదండ్రులు, వారి పెంపకంలో పెరిగిన వారి వారసులు.

నేటి మన దేశ ప్రజ... యువతరం, కొందరు పాశ్చాత్య నాగరీకతా వ్యామోహంలో మనదైన హైందవ సంస్కృతిని... సాంప్రదాయాలను, విస్మరిస్తున్న తరుణంలో... కొందరు తల్లిదండ్రులు వారి సంతతిని మన రీతి నీతి పద్దతిలో పెంచి పెద్ద చేస్తున్న వారూ ఉన్నారు... కన్న తల్లిదండ్రులను ఎంతగానో అభిమానించి, గౌరవించే పిల్లలూ వున్నారు.

తాత తండ్రుల కీర్తి ప్రతిష్టలను గుర్తించి తమ జీవిత విధానాన్ని నిర్ణయించుకొని వర్తిస్తూ, కన్నవారికి ఆనందాన్ని కలిగించేవారు కొందరు. వారే మన హైందవ సంస్కృతికి వారసులు. భావితరానికి ఆదర్శప్రాయులు.

యీ తత్వానికి... ప్రతిబింబమే యీ నా నవల జీవనరాగాలు

రచయిత

సిహెచ్.సి.యస్.శర్మ


“అయ్యా!... పోస్టు...” దశరధరామయ్యగారిని సమీపించి మెల్లగా పలికాడు పోస్టుమెన్ వెంకన్న.

దినపత్రికను చూస్తున్న దశరధరామయ్యగారు దృష్టిని ప్రక్కకు మరల్చి... వెంకన్నను చూచాడు.

"ఏం వెంకన్నా!... అంతా బాగున్నారా!...” చిరుదరహాసంతో అడిగాడు దశరధరామయ్య.


“బాగున్నారయ్యా!... అంతా తమ దయ. మీరే కదయ్యా నాకు యీ వుద్యోగాన్ని యిప్పించారు. మీరుణాన్ని నేను యీ జన్మలో తీర్చుకోలేను" ఎంతో వినయంగా చెప్పాడు వెంకన్న.


“ఆఁ... నీకు యిద్ధరు కొడుకులు ఒక కూతురూ కదూ... నాలాగే.” నవ్వుతూ అడిగాడు దశరధరామయ్య.


“అవునయ్యగారు”


"పిల్లల్ని బాగా చదివించు. ఏదైనా అవసరం అయితే వచ్చినన్నడుగు. సరేనా?” 


“అలాగే అయ్యగారు” కవర్ ను దశరధరామయ్యకు అందించాడు వెంకన్న... 

“నేను వెళ్ళివస్తానయ్యా” ఎంతో విధేయతతో చెప్పాడు.


“మంచిది” కవర్ ను పరిశీలనగా చూస్తూ యాంత్రికంగా పలికాడు దశరధరామయ్య.


వాలు కుర్చీలో వెనక్కువాలి కవర్ను విప్పి అందులోని ఆహ్వాన పత్రికను చేతికి తీసుకొన్నాడు.

ఆ ఆహ్వాన పత్రిక లేత ఆకుపచ్చ రంగులో వుంది. ఎంతో అందంగా బంగారు రంగుతో అక్షరాలు తెలుగులో చిత్రించబడి వున్నాయి. అందులో యిలా వుంది. కళ్ళ అద్దాలను సరిచేసికొని... చదవడం ప్రారంభించారు దశరధరామయ్య.


కౌసల్యా దశరధరామ కెమికిల్సు ప్రయివేట్ లిమిడెడ్ 

ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక

రిబ్బన్ కటింగ్, ఓపనింగ్ శర్మనీ...

శ్రీయుతులు పి.వి.నారాయణశర్మ. జిల్లా కలెక్టర్ 

ఈ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే

దయతో విచ్చేసి మమ్ములను ఆశీర్వదించ ప్రార్ధన.

వారం: మంగళవారం

తేదీ: 4/02/2020

సమయం: 6.00 - 9.00

ఇట్లు 

మ్యానేజింగ్ డైరెక్టర్ 

దశరధనందన


సాంతం చదివి సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచారు దశరధరామయ్య. వారి నయనాలు కన్నీటితో నిండిపోయాయి. మనస్సులో వ్యక్తం చేయలేని మూగబాధ. కళ్ళు మూసుకొన్నాడు. నయనాల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు చక్కిళ్ళ పైకి దిగజారాయి. శరీరానికి చిరు చమట పట్టింది. వాలు కుర్చీలో అచేతనంగా వుండి పోయారు. 


“ఏమండీ!...” అర్ధాంగి సుందరి కర్కశ స్వరం.


ఏదో లోకంలో వున్న దశరధరామయ్య ఆమె పిలుపును ఆలకించలేదు. 

దగ్గరగా వచ్చి సుందరి “ఏమండీ.. మిమ్మల్నే పిలిచేది” కాస్త హెచ్చు స్థాయిలో రుసరుసలాడుతూ అంది.


సుందరి యీ పద వుచ్ఛారణ సమ్మెట దెబ్బలా దశరధరామయ్య చెవులకు సోకింది.

తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు. చెక్కిళ్ళపైని కన్నీటిని పై పంచితో అద్దుకుంటూ వెనక్కు తిరిగిచూచాడు దశరధరామయ్య.


భద్రకాళిలా సింగారించుకుని సుందరి కూర్చీకి దగ్గరలో వెనుక నిలబడి వుంది.

“ఏమిటి సుందరి?” ఆమె వైపు చూడకుండానే అడిగాడు.


“నేను మా అమ్మగారి యింటికి వెళుతున్నాను. నిన్న నేను అడిగితే... మీరు రాన్నన్నారుగా...” అసహనంగా అడిగింది సుందరి.


“అవును... నీవు వెళ్ళిరా” ఖచ్చితంగా చెప్పాడు.


యింతలో... గుర్రపు బండినితోలే మస్తాన్ సాహెబ్ అక్కడికి వచ్చాడు. అయ్యగారి వంక చూచి చేతులు జోడించాడు.


“అమ్మగారూ... బండి సిద్ధంగా వుందమ్మా” చేతులు కట్టుకొని సవినయంగా మనవి చేశాడు మస్తాన్.

ఎంతో కాలంగా వారి వద్ద వుంటున్నాడు మాస్తాన్. ఎంతో విశ్వాసపాత్రుడు. దశరధరామయ్యగారి వదనం గంభీరంగా, అప్రసన్నంగా గోచరించింది మస్తాన్ కు. 


“జాగ్రత్తగా వెళ్ళిరండి మస్తాన్.” కుర్చీ నుండి లేస్తూ చెప్పాడు దశరధరామయ్య. 


సుందరి దృష్టి దశరధరామయ్య చేతిలోని... ఆహ్వాన పత్రికపై పడింది.

“ఎవరిది ఆ ఆహ్వాన పత్రిక?" వెటకారంగా అడిగింది సుందరి. 


“నీకు కానీ నీ పెద్దకొడుకు పంపాడు. ఫ్యాక్టరీ ఓపన్ చేస్తున్నాడట.” సుందరి కళ్ళల్లోకి చూచాడు దశరధరామయ్య.


పనిమనిషి లక్ష్మి సూట్కేసుతో గుర్రపుబండిని సమీపించింది.

దశరధరామయ్య చేతిలోని పత్రికను లాక్కుని... క్షణం సేపు చూచి కుర్చీలో పడేసి బండి వైపుకు వేగంగా నడిచింది సుందరి.


మస్తాన్ పరుగున ఆమెకంటే ముందు బండిని సమీపించాడు.

లక్ష్మి సూట్కేసును బండిలో పెట్టింది.


దశరధరామయ్య బండి దగ్గరకు వచ్చాడు.

సుందరి బండి ఎక్కింది.


“లక్ష్మి యిల్లంతా నీట్ గా సర్దు" సింహగర్జనలా వుంది ఆ హెచ్చరిక. 


“అలాగే అమ్మ గారూ!...” ఎంతో వినయంగా చెప్పింది లక్ష్మి. 


“మస్తాన్... పద” మస్తాన్ వంక చూచి సిగ్నల్ యిచ్చింది.


మస్తాన్ బండి ఎక్కాడు. బండి కదిలింది. వీధిలో ప్రవేశించింది. లక్ష్మి యింట్లోకి వెళ్ళిపోయింది. దశరధరామయ్య వీధి గేటు వరకూ నడిచాడు. పరుగులాంటి నడకతో వస్తున్న శంకరాన్ని చూచాడు. శంకరం దశరధరామయ్యను సమీపించాడు. 


“ఏమిటి బావా... యిక్కడ నిలబడి వున్నావ్?”


“మీ అక్క వాళ్ళ అమ్మగారి వూరికి యిప్పుడే వెళ్ళింది”


“ఏమిటి విషయం?"


“వాళ్ళ అన్నగారి పుట్టిన రోజట.”


“ఎప్పుడు?”


"రేపు”


“ఒహో... అలాగా!... పదండి బావా యింట్లోకి వెళదాం.” తల ఆడించి దశరధరామయ్య వెనక్కు తిరిగాడు. యిరువురూ... భవంతి ముందలి వరండాలో ప్రవేశించారు. కుర్చీలలో కూర్చున్నారు.

శంకరయ్య దశరధరామయ్య ముఖాన్ని... పరీక్షగా చూచాడు. వారి ముఖంలో చాలా విచారం గోచరించింది శంకరానికి.


“చాలా దిగులుగా వున్నట్లున్నావ్. కారణం ఏమిటి బావా?...”


వెంకన్న యిచ్చి వెళ్ళిన ఆహ్వాన పత్రికను దశరధరామయ్య శంకరయ్యకు అందించాడు. దాన్ని అందుకొని రెండు క్షణాలు పరీక్షగా చూచి... శంకరయ్య నవ్వుతూ... 


“బావా!... నా అల్లుడు స్వయంగా వచ్చి ఎంతో ఆదరాభిమానాలతో యోగక్షేమాలను విచారించి యీ పత్రిక యిచ్చి... మామయ్యా... మీరు తప్పక రావాలి, అంటూ నా చేతులు పట్టుకొన్నాడు. నా పాదాలను తాకి నా ఆశీర్వాదాలను తీసుకొని ఎంతో ఆనందంగా చెప్పాడు శంకరయ్య. 

దీక్షగా విన్న దశరధరామయ్య... మనస్సులో 'వాడు నా కొడుకు' అనుకున్నాడు. 


“శంకరా.. నీవు వెళతావు కదూ?...” ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూచాడు దశరధరామయ్య.


"ఏంటి బావా ఆ ప్రశ్న!... నేను వెళ్ళకుండా ఎలా వుండగలను... ఫ్యాక్టరీని కట్టింది నేనే కదా!”


“తప్పకుండా వెళ్ళు... వాడికి నీ ఆశీస్సులతో పాటు యీ తండ్రి ఆశీస్సులనూ నీవే చెప్పి ఆశీర్వదించిరా.” ఎంతో ప్రాధేయ పూర్వకంగా చెప్పాడు దశరధరామయ్య. 


ఆ క్షణంలో... దశరధరామయ్య నయనాల్లో కన్నీటి తడిని గమనించాడు శంకరయ్య. గతచరిత్ర అంతా తెలిసినవాడు. అయినవాడు. ఆప్తుడు.

“మీరు నాకు చెప్పాలా బావా.. అది నా కర్తవ్యం కదా...”


"అవును" శూన్యంలోకి చూస్తూ మెల్లగా పలికాడు దశరధరామయ్య. 


“బావా!... మీతో యీ విషయాన్ని చెప్పాలని వచ్చాను. యిక నే వెళ్ళొస్తాను” 


“మంచిది శంకరా...” ప్రీతిగా అతని భుజాన్ని తట్టాడు దశరధరామయ్య. 


శంకరయ్య బావగారి పాదాలు తాకి నమస్కరించి వెళ్ళిపోయాడు. 

సమయం... సాయంత్రం నాలుగున్నర ప్రాంతం. ఆ సమయంలో టీ త్రాగటం దశరధరామయ్యకు అలవాటు. లక్ష్మి వచ్చింది టీ తీసుకొని.

"అయ్యగారూ!... టీ తీసుకోండి.” కప్పు సాసర్ అందించింది లక్ష్మి. 


టీ కప్పును అందుకొని... త్రాగి టీపాయ్ పై వుంచాడు. కప్పును తీసుకొని లక్ష్మి యింట్లోకి వెళ్ళిపోయింది.

“వందనాలు ప్రభూ... వందనాలు" దరహాసవదనంతో పురోహితుడు పుండరీకశర్మగారు దశరధరామయ్యను సమీపించారు.


వారిరువురూ సమవయస్కులు... పుండరీకశర్మ మంచి పండితులు. మహాజ్ఞాని... చక్కటి మాటకారి. దశరధరామయ్యకు ప్రియమిత్రుడు.

“కూర్చో పుండరీక” నవ్వుతూ చెప్పాడు దశరధరామయ్య.

పుండరీకశర్మగారు కూర్చున్నారు.


"అయ్యా!... మన పెద్ద అబ్బాయిగారు నన్ను కలిశారు. ఫ్యాక్టరీలో పూజ జరిపించాలని కోరారు. పత్రికను యిచ్చి నా ఆశీస్సులను స్వీకరించి వెళ్ళారు. వచ్చే దశమి గురువారం నాడు... అంటే మీరు పుట్టిన రోజు 27వ తేదీ సోమవారం ఫ్యాక్టరీ తెరిచే కార్యక్రమం ఉదయం 10.48 - 12.24ల మధ్య కాలంలో జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమరు... ఆ కార్యక్రమాన్ని నేను జరిపించేటందుకు నాకు అనుమతిని ప్రసాదించవలసినదిగా నా కోరిక." ఎంతో వినయంతో... దరహాస వదనంతో కోరాడు పుండరీక శర్మ.


పుండరీకశర్మగారి మృదుమధుర వచనాలకు అభినయానికి దశరధరామయ్య వదనంలో ఎంతో ఆనందం.


"పుండరీకా!... నీకు అలాంటి మంచిపని చేసే దానికి నా అనుమతి కావాలా!...” ఆశ్చర్యాన్ని అభినయిస్తూ అడిగాడు దశరధరామయ్య.


"అవును మిత్రమా!... మీరు నా యజమానులు... మాకున్న మాన్యాలు... యీ వూర్లో వుండే గుళ్ళు... పాఠశాలలూ అన్నీ మీ పూర్వీకులు, మీరు ఏర్పరచినవే. మీ సుపుత్రుడు ఆ ఫ్యాక్టరీ మూలంగా మన ప్రాంతంలో వున్న ఎన్నో పేదకుటుంబాలకు ఉపాధి కల్పించబోతున్నాడు. తాతతండ్రుల పేరు నిలబెట్టబోతున్నాడు. నాకో చిన్న పాత్రను యిచ్చాడు. నాలోని సంతోషాన్ని నీతో పాలుపంచుకోవడం నాధర్మం కదా!... నవ్వుతూ చెప్పాడు పుండరీకశర్మ..


ఆ క్షణంలో... దశరధరామయ్య వదనంలో ఎంతో ఆనందం. నవ్వుతూ... 

"పుండరీకా!... వెళ్ళి ఘనంగా జరిపించు.”


“చాలా సంతోషం మిత్రమా యిక నే వెళ్ళి వస్తాను”


“మంచిది”


పుండరీకశర్మ నమస్కరించి వెళ్ళిపోయారు. వెంకన్న యిచ్చి వెళ్ళిన ఆహ్వాన పత్రికను చేతికి తీసుకొన్నాడు. పత్రిక చివరనున్న రెండులైన్లను దీక్షగా చూచాడు. 'దశరధనందన... మ్యానేజింగ్ డైరెక్టర్' అప్రయత్నంగా ఆ పదాలను వారి పెదాలు పలికాయి. సుధీర్ఘమైన నిట్టూర్పుతో వాలుకుర్చీలో వెనక్కు వాలిపోయడు. మనుస్సు నిండా తన పెద్దకుమారుని తలపులు, తనకు ఎంతో ప్రియమైన శంకరయ్య, పుండరీకశర్మ తన బిడ్డను గురించి పలికిన పలుకులు మస్తిష్కంలో మారుమ్రోగాయి.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.76 views0 comments

Comments


bottom of page