జీవన రాగాలు ఎపిసోడ్ 2
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- May 11, 2024
- 5 min read
Updated: May 17, 2024

'Jeevana Ragalu Episode 2' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 11/05/2024
'జీవన రాగాలు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు.
అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది. గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 2 చదవండి.
ఆ ప్రాంతంలో చుట్టూ వున్న యిరవై గ్రామాల్లో దశరథరామయ్యగారి పేరు వినని వారు లేరు. అనాదిగా ఆ కుంటుంబం మంచి స్థితిని.. పేరును కలిగివున్నది. సాటి మానవులపట్ల ప్రేమ.. గౌరవం.. అభిమానం చూపడం ఆయింట పుట్టిన వారికి సహజ లక్షణం. వారు కులమతాలకు అతీతులు. ఆ ప్రాంతం వారికి దశరథరామయ్య మాట వేదవాక్కు. శ్రీరామనవమి.. మహాశివరాత్రి.. వుత్సవాల్లో ముస్లిమ్, క్రయిస్తవ సోదరులు పాలుపంచుకొంటారు. వాహనాలను మోస్తారు. ఆ రోజులను అందరూ కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు.
ముస్లిమ్ ల పీర్లపండుగ రోజున పీర్లు జండాచెట్టు దగ్గర నుంచి బయలుదేరి ముందు నేరుగా దశరథరామయ్యగారి యింటి ముందుకు వస్తాయి. పీర్లకు మొదటి నైవేద్యం దశరథ రామయ్యగారి యింటిదే. ఆ తర్వాతే.. పీర్లు వూరంతా తిరుగుతాయి. క్రయిస్తవుల వుత్సవాలకు కూడా ప్రథమ నివేదన ఆ యింటి నుంచే.
దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. ఈ దంపతులకు.. దశరథరామయ్య, సుశీల కన్న బిడ్డలు.
యిరవై సంవత్సరాల క్రిందట పార్వతమ్మ రైలు ప్రమాదంలో మరణించారు. ఆరునెలల క్రిందట వెంకటరామయ్యగారు స్వర్గస్థులైనారు.
సుశీలను వూర్లోనే.. అయినవారి యింటికి కోడలుగా చేశారు. అమె భర్తపేరు శంకరయ్య. వారి నాన్నగారు చేస్తూ వుండిన కాంట్రాక్టు వృత్తినే వారూ ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. వారికి యిద్దరు పిల్లలు. ప్రశాంతి, నారాయణ. మూడేళ్ళ క్రిందట వెంకటరామయ్యగారికి వచ్చిన సంబంధంతో ప్రశాంతి వివాహం జరిగింది. వారు వుండేది విడవలూరు.
ప్రశాంతి భర్త మురారి. సర్కిల్ యిన్ స్పెక్టర్. వారి తండ్రి అనంతరామయ్య.. వ్యవసాయదారుడు. వారిదీ మంచి కుటుంబం. ప్రశాంతి, మురారిలకి ఒక కొడుకు. ఐదేళ్ళు. పేరు రఘనాథ్.
దశరథరామయ్యకు.. రాజకీయాలకు, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. వారి వుద్దేశ్యంలో వారికి అందరూ కావాలి. కక్షలు, కార్పణ్యాలు వారికి నచ్చవు. సాటిమనిషిని మనిషిగా గౌరవించి, ప్రేమాభిమానాలను పంచి ఐక్యతను సాధించాలి అనేదే వారి సిద్ధాంతం. తండ్రి వెంకటరామయ్య తనయుడు దశరథరామయ్యకు నేర్పినది అది. తండ్రి మాటను తు. చ. తప్పకుండా ఆచరించడం దశరథరామయ్యగారి మహోన్నత తత్వం.
దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల ముద్దుల కూతుళ్ళు. పెద్దకుమార్తె వివాహం సంవత్సరం క్రిందట జరిగింది. సునంద అత్తగారి వూరు నెల్లూరు. భర్త పేరు శాంతారామ్. వారి తండ్రి ఆదినారాయణ. తల్లి ఊర్మిళ. శాంతారామ్, దశరథనందన కాలేజ్ మేట్సు. వారిరువురు మంచి స్నేహితులు.
దశరథరామయ్యగారి అర్థాంగి సుందరి.. తన మామగారు వెంకట రామయ్యగారు బ్రతికి వున్నంత కాలం ఎంతో భయభక్తులతో మామగారిని, భర్తని సేవించేది.
అవసానదశలో వెంకటరామయ్యగారు తాళాల గుత్తిని తనకు ఎంతో ప్రియమైన కోడలు సుందరి చేతులో వుంచారు. కళ్ళు మూశారు. తండ్రిగారి వియోగం దశరథరామయ్యగారికి ఎంతగానో బాధించింది. ప్రాణ మిత్రుడు పుండరీకశర్మ దశరథరామయ్యకు అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు. వూరడించాడు. ఓదార్చాడు. మానవజీవిత సత్యాలను తెలియజేశారు. దశరథరామయ్యను మామూలు మనిషిని చేశాడు.
తాళాలు చేతికి రాగానే క్రమంగా సుందరిలో అహం పెరిగింది. భర్తయందు గౌరవం తరిగింది. సర్వాధికారిణిగా మారిపోయింది. సాధుస్వభావం కల దశరథరామయ్య సహనాన్ని కవచంగా ధరించాడు.
ప్రతిదినం సాయంత్రం ఆరుగంటలకు యింటికి ఒక కిలోమీటర్ దూరంలో వున్న గెస్టుహౌస్ తోటకు వెళ్ళడం దశరథరామయ్యగారి ఆనవాయితీ. ఏదైనా పనిమీద ప్రక్కవూర్లకు వెళ్ళవలసి వస్తే.. తన కార్యక్రమాన్ని ఐదుగంటలకు యింటికి తిరిగి వచ్చే రీతిగా రూపొందించుకొనేవారు.
తోటకు వెళ్ళేదారిలో చెల్లెలు సుశీల యిల్లు వుంది. ఆ రోజు దశరథరామయ్య ఆయింటిని సమీపించేసరికి గేటు తెరుచుకొని చెల్లెలు సుశీల ఎదురైంది.
“అన్నయ్యా!” దగ్గరగా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి చేతిని పట్టుకుంది.
“ఏమ్మా”
“తోటకు వెళుతున్నావా?”
“అవున్రా”
"వదిన యీ రోజు యింట్లో లేదుగా! రాత్రికి మనయింట్లో భోంచెయ్యి అన్నయ్యా.. ”
ప్రాధేయపూర్వకంగా అడిగింది సుశీల.
విరక్తిగా నవ్వుతూ.. “అలాగేరా.. తోటకు వెళ్ళి నేరుగా మన యింటికే వస్తాను" చెప్పాడు దశరథరామయ్య.
సుందరికి సుశీలంటే పడదు. వూర్లోవున్నా వెంకటరామయ్యగారు వెళ్ళిపోయినప్పటినుంచీ రాకపోకలు తక్కువ. కావలిలో వుండే తన అన్నా వదిన.. పిల్లల మీద వున్న అభిమానం సుశీల శంకరయ్య వారి పిల్లల మీద లేదు.
“చాలా సంతోషం అన్నయ్యా" ఆనందంగా పలికింది సుశీల.
యిద్దరూ ముందుకు నడిచారు. తన యిల్లు సమీపించగానే..
"అన్నయ్యా! మరచి పోకుండా యింటికిరా.. ” దశరథరామయ్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది సుశీల.
ఆమె ‘మరచిపోకుండారా, అన్న మాటను విని నవ్వుతూ సుశీల ముఖంలోకి చూచాడు దశరథరామయ్య..
“నీ యీ నవ్వు వెనక.. ఎంత బాధ దాగివుందో.. నాకు తెలుసు అన్నయ్య!.. ” విచారంతో నిట్టూర్చి పలికింది సుశీల.
“ప్రవాహానికి ఎవరూ ఎదురీదలేరు కదా చెల్లీ!.. ” వేదాంతిలా మెల్లగా పలికాడు దశరథరామయ్య.
అవునన్నట్లు సాలోచనగా తల పంకించింది సుశీల. “తప్పకుండా త్వరలో పరిస్థితులు చక్కబడతాయి అన్నయ్యా!.. కృష్ణపక్షం తర్వాత శుక్లపక్షం రాక మానుతుందా అన్నయ్యా!.. వచ్చి తీరుతుంది. ” దృఢమైన నమ్మిక ఆ మాటల్లో గోచరించింది దశరథరామయ్యకు. 'నా బంగారు చెల్లి, మనసున అనుకొని ఆమె భుజం తట్టాడు.
మౌనంగా ముందుకు నడిచాడు దశరథరామయ్య. ముందుకు వెళుతున్న అన్నయ్యను కొంతసేపు పరీక్షగా చూచింది సుశీల. ఆమె కళ్ళు చమ్మరిల్లాయి. దూరం పెరిగాక పవిటతో కన్నీళ్ళు ఒత్తుకుంటూ యింట్లోకి వెళ్ళిపోయింది సుశీల.
మహా అరణ్యంలో వీరవిహారం చేస్తున్న మృగరాజుగా పిలువబడే సింహం పట్టుబడి సర్కస్ బోనులో బంధింపబడిన దృశ్యం ఆమె కళ్ళముందు సాక్షాత్కరించింది.
తోటగేటును తెరచుకొని లోన ప్రవేశించాడు దశరథరామయ్య. తోటమాలి వీరన్న పరుగున వచ్చాడు. చేతులు జోడించాడు. కళ్ళతోనే ప్రీతిగా ప్రతి నమస్కారాన్ని తెలియజేశాడు దశరథరామయ్య.
ఇరువురూ మౌనంగా తోటలో ఒకప్రక్కన వున్న సమాధులను సమీపించారు. అక్కడ మూడు సమాధులు వున్నాయి. ఒకటి తన తల్లిగారిది. రెండవది తన తండ్రిగారిది. మూడవది.. ?!..
అప్పటికే.. ప్రమిదల్లో నూనె వత్తులను వేసి సిద్ధంగా వుంచాడు వీరన్న. అది అతని నిత్యకృత్యం. సమాధుల ప్రక్కన కూర్చున్నాడు దశరథరామయ్య. వీరన్న అగ్గిపెట్టెను అందించాడు. పుల్లలను గీచి మూడు ప్రమిదల్లోని వత్తులను వెలిగించాడు. సమాధులకు ఒక పక్కగా కూర్చొని కళ్ళుమూసుకొని కొద్ది నిముషాలు మౌనంగా వుండిపోయాడు. వీరన్న చేతులు కట్టుకొని ప్రక్కనే నిలబడ్డాడు.
ఆ క్షణంలో వీరన్న కళ్ళకు దశరథరామయ్య.. సర్వసంఘపరిత్యాగి అయిన సన్యాసిలా గోచరించాడు.
కొద్ది నిముషాల తర్వాత.. కళ్ళు తెరచి మెల్లగా లేచి నిలబడ్డాడు దశరథరామయ్య.
మౌనంగానే యిరువురూ గెస్టుహౌస్ లోనికి ప్రవేశించారు. అక్కడ క్రమంగా అమర్చబడివున్న ఒక సోఫాలో కూర్చున్నాడు దశరథరామయ్య.
“అయ్యా!” పాలు తీసుకురానా!.. ” వినయంగా వంగి మెల్లగా అడిగాడు వీరన్న.
“యిప్పుడు వద్దు వీరన్నా.. చెల్లి భోజనానికి పిలిచింది. కొంతసేపు యీ ప్రశాంత వాతావరణంలో కూర్చొని బయలుదేరుతాను. నీవు వెళ్ళి నీ పని చూచుకో పో. ” సాలోచనగా పలికాడు దశరథరామయ్య.
వీరన్న చేతులు జోడించి.. “సరే అయ్యగారు!.. శలవు. ” ఎంతో వినయంగా చెప్పి తన గుడిసె వైపుకు వెళ్లిపోయాడు.
గదిలో కిటికీలు తెరవబడి వున్నాయి. విద్యుత్ దీపాలు రెండు వెలుగుతున్నాయి. ఫ్యాన్ తిరుగుతూ వుంది. బయటనుంచి కిటికీల గుండా చల్లగాలి గదిలోకి వస్తూ వుంది.
కాళ్ళను టీపాయ్ పైనుంచి సోఫాలో.. వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు దశరథరామయ్య. అతని మనోదర్పణం పై గతం గోచరించడం.. ప్రారంభం అయింది.
*
“ఇది నీ యిరవైనాల్గవ పుట్టినరోజు దశరథా!.. యీ సంవత్సరం నీకు వివాహాన్ని జరిపించాలనుకొంటున్నాను. నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా!.. ”.. దరహాస వదనంతో.. తండ్రి వేంకటరామయ్య తనయుడు దశరథరామయ్యను అడిగాడు.
ఉదయాన్నే తల్లి పార్వతి దశరథరామయ్యకు నూనెతో తల అంటింది. స్నానం అయిన తర్వాత కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు అందరూ శివాలయానికి వెళ్లి సర్వేశ్వరునికి అభిషేకం.. శతనామావళి పూజ జరిపించి ఆనందంగా యింటికి వచ్చారు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసాడు దశరథరామయ్య. బిడ్డను మనసారా దీవించారు ఆ దంపతులు.
తన పాదాలను తాకి లేచిన దశరథరామయ్యను. హృదయానికి హత్తుకున్నాడు వెంకటరామయ్య. “నిండు నూరేళ్ళు చల్లగా వుండు నాయనా!.. ” తన కుడిచేతిని కుమారుడి తలపై వుంచి మనసారా దీవించాడు వెంకటరామయ్య. తర్వాత.. అతని వివాహ విషయంలో తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
మౌనంగా వున్న దశరథరామయ్యను ప్రీతిగా చూస్తూ..
“నాన్నా!.. నా ప్రశ్నకు నీవు జవాబు చెప్పాలిగా!.. ” నవ్వుతూ అడిగాడు వెంకటరామయ్య.
“ఏమిటండీ మీ మాటలు. నా బిడ్డ ఏనాడైనా మీ మాట కాదన్నాడా!.. ” చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ నవ్వుతూ అంది పార్వతమ్మ.
“పారూ!.. వాడు మనకు ఒక్కగానొక్కడు. వాడికి కష్టం కలిగించే ఏ పనీ నా జీవిత కాలంలో చేయకూడదని నా అభిప్రాయం. ” ఎంతో సౌన్యుంగా సరళంగా చెప్పాడు వెంకటరామయ్య.
“నాన్నా.. అమ్మా!.. మీ యిష్టమే నా యిష్టం. మన యింటికి కోడలిగా తగిన పిల్లను మీరే చూచి నిర్ణయించండి. నేను మారు మాట్లాడకుండా తాళి కట్టేస్తాను.. ” హృదయపూర్వకంగా నవ్వుతూ చెప్పాడు దశరథరామయ్య.
“యీ ఫొటోను చూడు.. ” అందించింది పార్వతమ్మ. అందుకొని కొన్ని క్షణాలు చూచి..
“అమ్మా! నాకు నచ్చింది. ఏవూరు?.. పేరేమిటి?” తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు దశరథరామయ్య.
“వూరు కావలి.. పేరు కౌసల్య. మనకు దూరపు బంధువులు. ” తనయుడిని పరీక్షగా చూస్తూ చెప్పాడు వేంకటరామయ్య.
తండ్రీకొడుకుల చూపులు కలిశాయి. యిరువురి నయనాలలో అనిర్వచనీయమైన ఆనందం.
“అమ్మా!.. యికపై అంతా మీ యిష్టం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ” ఫొటోను తల్లి చేతిలో వుంచి నవ్వుతూ పరిగెత్తిపోయాడు దశరథరామయ్య.
భర్తకు దగ్గరగా జరిగి వారి కళ్ళల్లోకి చూస్తూ.. “విన్నారుగా నా బిడ్డ అభిప్రాయం!.. ” మధురస్వరంతో పలికింది పార్వతి. “వాడు నాకూ కొడుకే కదా పారూ!.. ” చేతులతో ఆమె భుజాలను పట్టుకొని నొసటన ముద్దు పెట్టాడు. “యిదంతా నాకు నీ వల్లే సంక్రమించింది పారూ.. ” మెల్లగా ఎంతో ప్రేమతో పలికాడు వెంకటరామయ్య.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Commentaires