top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 7'Jeevana Ragalu Episode 7'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 11/06/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. అయన భార్య సుందరి పుట్టింటికి వెళుతుంది. 


దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 

దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి.


నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది.

వివాహం అంతకంటే ఘనంగా జరుగుతుంది.

అత్తవారింటికి చేరుతుంది కౌసల్య. 


ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 7 చదవండి. 


గలగలా ప్రవహించే కృష్ణానది ఒడ్డున వున్న విజయవాడ కనకదుర్గమ్మ దర్శనంతో ప్రారంభమైనది వారి ప్రేమ యాత్ర. నదీ స్నానం... దేవత దర్శనం జరిగింది. తర్వాత రాజమండ్రి... గోదావరి నదీ స్నానం... ఆలయాల సందర్శనం... తదుపరి విశాఖపట్నం.. ఆ ప్రాంతంలో వున్న ఆలయాల సందర్శనం... 


తదపరి శ్రీశైలం పార్వతీ పరమేశ్వరుల సందర్శనం... శ్రీరాఘవేంద్రస్వామి వారి ఆలయ సందర్శనం.. ఆపై నెల్లూరు శ్రీ వరదరాజు స్వామి, ధర్మరాజు దేవాలయ దర్శనం, చేసికొని... కానుకలను సమర్పించి... ప్రసాద తీర్థాలను సేవించి... పది రోజుల తర్వాత స్వగ్రామాన్ని చేరారు ఆ దంపతులు.

*

ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. రెట్టింపు ఆదాయం వచ్చింది. అందరూ కోడలు మహాలక్ష్మి కౌసల్య వచ్చిన వేళావిశేషం అని కొనియాడారు.


ఆ యింట కౌసల్యకు కన్నతల్లిదండ్రులను మైమరపించే అత్తమామలు... తనకోసం ఏదైనా చేసే దానికి ఎల్లవేళలా సంసిద్ధంగా వుండే భర్త అవ్యాజానురాగాలు... తనకన్న మూడేళ్ళు చిన్నదైన మరదలు సుశీల తన పట్ల చూపే ఆదరాభిమానాలు గౌరవం... ఎంతో హాయిని ఆనందాన్ని కలిగించాయి. వాళ్ళను విడిచి పుట్టింటికి వెళ్ళాలనే తలంపే వచ్చేది కాదు కౌసల్యకు.

సన్నజాజి పందిరి ప్రక్కన నిలబడి మొగ్గలను కోస్తూ వుంది కౌసల్య. శంకరయ్య ఆమెను సమీపించాడు.


" అమ్మా!... కౌసల్యా!...”


తలను ప్రక్కకు త్రిప్పి... శంకరాన్ని చూచి... “అన్నయ్యా!... ఎప్పుడొచ్చారు. చెప్పండి. యీ చెల్లి మీ కోసం ఏం చేయాలి!..." చిరునగవును చిందిస్తూ అడిగింది కౌసల్య.


“నేను అడగబోయేది!...” సందోహంతో మధ్యలోనే ఆపి తలదించుకొన్నాడు శంకరయ్య.

శంకరం ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ..." అన్నయ్యా!.. ఆపేశారేం. చెప్పండి నిర్భయంగా చెప్పండి. ”


“నేను పెండ్లి చేసికోవాలనుకొంటున్నానమ్మా!...” యాంత్రికంగా శూన్యంలోకి చూస్తూ పలికాడు శంకరయ్య.


కౌసల్య అతని వాలకాన్ని చూచి గలగలా నవ్వింది.

శంకరయ్య బిత్తరపోయాడు. భయంతో ఆమె ముఖంలోకి చూచాడు. “చెల్లీ!.. తప్పుగా మాట్లాడానా!...” దీనంగా అడిగాడు.


"లేదన్నయ్యా!.... లేదు. భయపడకండి. ఒప్పుగానే మాట్లాడారు. సరే అన్నయ్యా!... నేను మీకు మాట యిస్తున్నాను.” కళ్ళు పెద్దవి చేసి... నవ్వుతూ చెప్పింది కౌసల్య.


“ఏమనమ్మా!...”బిక్కముఖంతో అడిగాడు శంకరయ్య.


“త్వరలోనే యీ అన్నయ్యగారి వివాహం వారు కోరుకున్న వారితో జరుగుతుందని. యీ చెల్లి జరిపిస్తుంది. సంతోషమా!...” నవ్వుతూ అడిగింది కౌసల్య. 


“అమ్మా!... చాలా సంతోషం.” నవ్వుకొంటూ వేగంగా వెళ్ళిపోయాడు శంకరయ్య.


ఆ రాత్రి భోజన సమయం. వెంకటరామయ్య, పార్వతమ్మ, సుశీల, దశరధరామయ్య... భోంచేస్తూ వున్నారు. కౌసల్య వడ్డిస్తూ వుంది.

“అత్తయ్యా!...” 


“ఏమిటమ్మా!...”


“యిప్పుడు మన సుశీలకు ఎంత వయస్సు?...'


ఆశ్చర్యంగా చూచింది పార్వతమ్మ కౌసల్య ముఖంలోకి.


“అమ్మా!... నా వుద్దేశ్యం... సుశీల బి.య్యే పరీక్షలు బాగా వ్రాసింది. నెలరోజుల్లో రిజల్సు వస్తాయి. యీ సంవత్సరంలో ఆమెకు వివాహం చేస్తే బాగుంటుందని,” దరహాసవదనంతో తన నిర్ణయాన్ని ఎలాంటి తొణుకుబెణుకు లేకుండా నిర్భయంగా చెప్పింది కౌసల్య.


"తల్లీ!... నీవు ఒకమాట చెప్పావంటే... దాన్ని యీ యింట్లో ఎవరూ కాదనలేరు. కారణం నీ మంచి మనస్సు.” వెంకటరామయ్యగారి ఆమోదం.


“పాపం బామ్మ శాంతమ్మగారు యింటిపనులతో చాలా కష్టపడుతున్నారు. మామయ్య!...”


వెంకటరామయ్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ మెల్లగా చెప్పింది కౌసల్య.

“ఆ... అలాగా!... అర్థం అయిందమ్మా!... నాకు బాగా అర్థం అయింది...” కోడలి ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య.


“ఏం అర్థం అయింది మీకు?...” పార్వతమ్మగారి ప్రశ్న. “నా చెల్లి శాంతకు వయస్సు అవుతూవుందని చెబుతూ వుంది మన కౌసల్య. నాకు అర్థం అయింది. నీకు యిప్పుడు అర్థం అయిందా!...” కొంటెగా నవ్వుతూ అడిగాడు వెంకటరామయ్య.


“నాన్నా!... అమ్మకు అర్థం అయిందో లేదో కానీ...నాకు బాగా అర్థం అయింది. శంకరం బావకు సుశీలకు త్వరలో పెండ్లి జరిపించాలి.” కౌసల్య ముఖంలోకి చూస్తూ దరహాస వదనంతో చెప్పాడు దశరధరామయ్య.


“కరెక్టుగా చెప్పారండి.” నవ్వుతూ చెప్పింది కౌసల్య.


“ఓహెూ!... అదా సంగతి. అలాగే. బలరామశాస్త్రిగారిని పిలిపించి ముహూర్తాన్ని పెట్టిద్దాం.” నవ్వుతూ భర్త ముఖంలోకి చూస్తూ చెప్పింది పార్వతమ్మ, సంతోషంగా అందరూ నవ్వుకొన్నారు.

వెంకటరామయ్య కూతురు సుశీల ముఖంలోకి తలవంచి చూస్తూ... “అమ్మా!... సుశీ!... నీకు మా నిర్ణయం ఇష్టమే కదా!...” మెల్లగా అడిగాడు. సుశీల సిగ్గుతో తలవంచుకొని నవ్వుతూ బేసిన్ వైపుకు వెళ్ళిపోయింది.


“మామయ్యా!... మన సుశీలకు శంకరం అన్నయ్య అంటే చాలా యిష్టం.” బేసిన్ లో చేతిని కడుక్కొంటూ వున్న సుశీలను చూస్తూ చిరునవ్వుతో పలికింది కౌసల్య. 


“అవునమ్మా!... ఆ విషయం మా ముగ్గురికీ తెలుసు. రేపు శాస్త్రిగారిని పిలిపించి ముహూర్తాన్ని నిర్ణయించమందాం” సంతోషంగా పలికింది పార్వతమ్మ. అందరినీ ఒక్కసారి చూచి... ముసిముసి నవ్వును చిందిస్తూ... సుశీల తన గదికి వెళ్ళిపోయింది. అందరూ ఆనందంగా ఒక నిర్ణయానికి వచ్చి నవ్వుకొన్నారు.

*

ఆ మరుదినం శుభసమయాన పద్దతి ప్రకారం... వెంకటరామయ్య పార్వతమ్మ.. దశరధరామయ్య కౌసల్యలు శంకరయ్యగారి యింటికి వెళ్ళారు. వెంకటరామయ్య తన సోదరి శాంతమ్మతో... తమ రాకకు గల కారణాన్ని, వుద్దేశాన్ని వివరించాడు. శాంతమ్మ ఎంతో సంతోషంతో అన్నగారి నిర్ణయానికి అంగీకరించింది. ఆమె భర్త గతించి అప్పటికి.... మూడేళ్లు. ప్రక్కనే వుండి అందరి మాటలు విన్న శంకరయ్య వదనంలో ఎంతో ఆనందం.


బలరామశాస్త్రిగారు వేంచేశారు. విషయాన్ని విని... పంచాంగాన్ని చూచి ముహూర్తాన్ని నిర్ణయించారు.


ఆ రాత్రి ఏకాంత సమయంలో... పార్వతమ్మ భర్తను అడిగింది. 

“ఏమండీ!... అమ్మాయి పెండ్లిని ఎలా జరిపించాలనుకొంటున్నారు?... 


వెంకటరామయ్య నవ్వి... “పారూ!... మనకు వున్నది ఒక్క ఆడబిడ్డ. ఆమె వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపిద్దాం. చెప్పు నేను ఏం చేయాలో!... అంతా నీ యిష్ట ప్రకారమే జరుగుతుంది." ఎంతో సౌమ్యంగా చెప్పాడు వెంకటరామయ్య భర్తకు తనమీదు వున్న గౌరవాభిమానాలకు పార్వతమ్మ ఎంతగానో సంతోషించింది. పరవశంతో వెంకటరామయ్య ఛాతీపై తలవుంచి నిద్రపోయింది.


శంకరయ్య సుశీలల వివాహ ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంచబడ్డాయి. మూడు రోజులు ముందుగానే, వెంకటరామయ్యగారి కోర్కె ప్రకారం... ఆనందరావు సంధ్యలు తన బలగంతో వచ్చారు. పెండ్లికి ఏర్పాట్లు ఎంతో గొప్పగా జరిగాయి. వెంకటరామయ్యగారి బంధువులు, హితులు, ఆప్తులు ఎందరో వచ్చారు ఆ వివాహానికి.


శంకరం సుశీలల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. సహబంతి భోజనాలు... దానధర్మాలు ఘనంగా జరిగాయి. అన్ని విషయాలకు ముందు నిలిచిన దశరధరామయ్య కౌసల్యలను అయినవారు ఆప్తులు ఎంతగానో మెచ్చుకున్నారు. సుశీల అత్తగారి యింటికి, ఆ యింటి యిల్లాలుగా వెళ్ళిపోయింది.

*

“గది నుండి వేగంగా హాల్లోకి వచ్చి దశరధరామయ్య... అమ్మా!... అమ్మా!...” బిగ్గరగా పిలిచాడు.

“ఏంటి నాన్నా!...” వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చింది పార్వతమ్మ. 


“అమ్మా!... కౌసల్య వాంతి చేసుకొందమ్మా...” ఆందోళనగా... విచార వదనంతో పలికాడు దశరధ.

“ఆ...” ఆశ్చర్యపోయింది పార్వతమ్మ. కొద్దిక్షణాలు ఆలోచించి “పద.” ఆ యిరువురూ దశరధ గదికి వచ్చారు. కౌసల్య టవల్ తో మూతి తుడుచుకొంటూ వుంది. కౌసల్యను సమీపించింది పార్వతమ్మ.


“అమ్మా!...ఏమైయింది?...” కోడలి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది పార్వతమ్మ.


“వాంతి అయింది అత్తయ్యా!...” నీరసంగా పలికింది కౌసల్య.


"ఉదయాన ఏమీ తనకుండా వాంతి అయిందా!...”


అవునన్నట్లు తల పంకించింది కౌసల్య.


కౌసల్య చేతిని తన చేతిలోకి తీసుకొని గదిలో ఒక మూలకు నడిచింది పార్వతమ్మ. కౌసల్య ఆమెను అనుసరించింది. పార్వతమ్మ మెల్లగా ఏదో అడిగింది కౌసల్యను. అవునన్నట్లు తలపంకించింది కౌసల్య.


పార్వతమ్మ వదనంలో ఎంతో సంతోషం. కొడుకును సమీపించింది నవ్వుతూ... 

“నీవు తండ్రివి కాబోతున్నావు నాన్నా!...?" ఆప్యాయంగా అతని భుజాన్ని తట్టింది. నవ్వుతూ వేగంగా మెట్లు దిగి హాల్లోకి వచ్చింది.


“ఏమండీ!... ఏమండీ...” హెచ్చుస్థాయిలో భర్తను పిలిచింది.


స్నానంచేసి తల తుడుచుకొంటూ వెంకటరామయ్య హాల్లోకి వచ్చాడు. 

"ఏమిటి పారూ!...”


వెంకటరామయ్య చేతులు పట్టుకొని..."మీకు గొప్ప శుభవార్త. మనం తాతయ్యా నానమ్మలం కాబోతున్నాము.” ఎంతో ఆనందంగా పలికింది పార్వతమ్మ. చేతులు జోడించి పైకెత్తి.... తండ్రీ సర్వేశ్వరా... మాతా పరమేశ్వరీ... అంతా తమేవ కరుణా కటాక్షం... పారూ!... చాలా మంచి వార్తను వినిపించావు.” ఎంతో ఆనందంతో పలికాడు వెంకటరామయ్య.


పార్వతమ్మ గదినుంచి బయటికి వెళ్ళగానే... దశరధరామయ్య కౌసల్యను సమీపించాడు. ఆమె భుజాలను పట్టుకొని నవ్వుతూ...


“అమ్మ చెప్పిందీ!!!...” ఎంతో ప్రీతిగా అర్ధాంగి వదనంలోకి చూచాడు. 


అవునన్నట్లు తల ఆడించింది కౌసల్య సిగ్గుతో.


ఆనందంగా కౌసల్య శిరస్సును తన హృదయానికి హత్తుకొన్నాడు దశరధరామయ్య...

క్రింద హాల్లో... "పారూ!... యీ విషయాన్ని మీ అన్నయ్యా వదినలకు తెలియజేయాలి.” వేగంగా ఫోన్ వున్న టేబుల్ను సమీపించాడు వెంకటరామయ్య రింగ్ చేశాడు.


"ఏమిటి బావగారు!... ఉదయాన్నే ఫోన్ చేశారు!...”


"మీరు తాతయ్య కాబోతున్నారు.” గలగలా నవ్వాడు వెంకటరామయ్య. 


“బావా! మీరు చెప్పేదీ!...” ఆశ్చర్యంతో పలికాడు ఆనందరావు. 


“అక్షరసత్యం.”


“బావా!... చాలా సంతోషకరమైన వార్తను తెలియజేశారు. మీకు నా ధన్యవాదాలు నేను సంధ్య, అమ్మాయిని చూచేటందుకు వస్తాం బావా!...”


“తప్పకుండా రండి.... మీకు యిదే నా స్వాగతం.”


“యిక ఫోన్ పెట్టేయనా!... యీ శుభవార్త సంధ్యకు చెప్పాలి.” అనందంగా అడిగాడు ఆనందరావు.

“మంచిది బావా!...”


స్నానాల గదిలో స్నానం చేస్తున్న సంధ్యకు తలుపు ముందు నిలబడి యీ శుభవార్తను తెలియజేశాడు ఆనందరావు. ఆమె ఎంతగానో ఆనందించింది.


ఆ మరుదినం ఆనందరావు... సంధ్యలు, కుమార్తెను చూడటానికి వచ్చారు. వారి ఆగమనంతో... కౌసల్య దశరధరామయ్య, పార్వతమ్మ, వెంకటరామయ్యలు... ఎంతగానో సంతోషించారు. సరస సంభాషణలతో విందుభోజనం అందరూ కలసి చేశారు.


ఏకాంతంలో... సంధ్య, కౌసల్యకు ఆ స్థితిలో తీసుకొనవలసిన జాగ్రత్తలను గురించి వివరించింది.

“అమ్మా!... నా భర్త అత్తమామలు నన్ను కన్న కూతురుగా భావించి నాతో ఎంతో ప్రియంగా వుంటారమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే.. అమ్మా!... నాకు యీ యిల్లు అత్తగారి యిల్లు కాదమ్మా. నా పుట్టిల్లే.” ఆనందంగా తల్లి కళ్ళల్లోకి చూస్తూ పలికింది కౌసల్య.


భోజనానంతరం అందరూ హాల్లో కూర్చున్నారు. “బావా!.. ఒంగోలు నుంచి మన మన్మధరావుకు ఒక సంబంధం వచ్చింది. వారి వివరాలను గురించి విచారించా. వారు... మనకు అన్ని విధాలా తగినవారని తెలిసింది.


త్వరలో నిశ్చితార్థం... వివాహ ముహూర్తాన్ని నిర్ణయించాలని నిర్ణయించుకొన్నారు. మీరు, మా అక్కయ్యగారు వచ్చి ఆ కార్యక్రమాలను జరిపించాలని నా కోరిక.” ఎంతో భవ్యంగా చెప్పాడు ఆనందరావు.


“తప్పకుండా బావా!.. చాలా సంతోషం...” ఆనందంగా పలికాడు వెంకటరామయ్య.


తర్వాత... ఆ దంపతులు కావలికి బయలుదేరి... వెళ్ళిపోయారు.

అత్తమామ, భర్త దశరధరామయ్య కౌసల్యను నెల్లూరికి తీసుకొనివెళ్ళి డాక్టర్ కు చూపించారు. అంతా సవ్యంగా వుందని... కొన్ని విటమిన్స్ వ్రాసి యిచ్చింది డాక్టరమ్మ.


ఏడవనెలలో... ఆనందరావు సంధ్యలు వచ్చి కౌసల్యను... తమ యింటికి తీసుకొని వెళ్ళారు. సీమంతం ఎంతో ఘనంగా జరిగింది.


సీమంతం జరిగిన మూడవవారంలో మన్మధరావు వివాహం ఒంగోలు వాస్తవ్యులు కోటేశ్వర్రావు గారి కుమార్తె మంగమ్మతో ఎంతో ఘనంగా జరిగింది. మంగమ్మ అత్తవారింట్లో కాలు పెట్టింది. నవదంపతులు మన్మధరావు మంగమ్మలు ప్రేమయాత్రకు దక్షిణదేశం వైపు వెళ్ళారు. మద్రాసు నుంచి బయలుదేరి కంచి... మధుర... రామేశ్వరం... కన్యాకుమారి.. ఆది నగరాలను అచ్చటి దేవాలయాలను దర్శించి పది రోజుల తర్వాత కావలికి చేరారు.

*

కౌసల్యకు నవమాసాలు నిండాయి. డేట్ కంటే నాలుగు రోజుల ముందు... వెంకటరామయ్య పార్వతమ్మ... దశరధరామయ్య కౌసల్యతో నెల్లూరు చేరారు.


ఆరోజు అరుణోదయ సమయంలో కౌసల్య కవల పిల్లలను ప్రసవించింది. మొదట మొగబిడ్డ... తర్వాత ఆడపిల్ల. బిడ్డలు తల్లీ క్షేమం. కౌసల్య కనక ముందే ఆనందరావు సంధ్యలు నెల్లూరికి చేరారు. పెద్దలందరూ ఎంతగానో సంతోషించారు.


భర్తను వీడి వుండలేని కౌసల్య పురిటికి అమ్మగారి యింటికి వెళ్ళలేదు. ఆమె మనస్తత్వాన్ని... ఆమె అత్తమామల, భర్త ఆదరాభిమానాలకు... ఆనందరావు దంపతులు, కుమార్తె కోరికను మన్నించారు.


దశరధరామయ్య సంతోషానికి అవధులు లేవు. కవల పిల్లలూ అన్నమాట వినగానే హాస్పటల్ బయటికి వచ్చి తన జేబులో వున్న ద్రవ్యాన్ని పేదలకు ఆనందంగా పంచి పెట్టాడు. వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళి... స్వామిని దర్శించి పరమానందంతో హాస్పటల్ కు తిరిగి వచ్చాడు. భార్యను తన యిద్దరు బిడ్డలను చూచి... ఆనందంతో పొంగిపోయాడు.

ఐదవరోజు అందరూ తమ నిలయానికి చేరారు.

*

బలరామశాస్త్రిగారు బలసారెకు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ కార్యక్రమం... దివ్యంగా జరిగింది. మొగబిడ్డకు 'దశరధనందన', ఆడబిడ్డకు 'సునంద’ అని నామకరణం చేశారు.

ఆలయంలో అభిషేకం... అన్నదానం జరిగాయి. అన్నీ... అనుకున్న రీతిలో సవ్యంగా జరిగినందుకు వెంకటరామయ్య, పార్వతమ్మ... ఆనందరావు, సంధ్య దశరధరామయ్య ఎంతగానో సంతోషించారు. వీరి మధ్యనున్న కౌసల్య ఆనందం వర్ణనాతీతం.


అంతకుముందు నెలరోజుల క్రిందట ఫకీరా భార్య ముంతాజ్ మొగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకు వారు మస్తాన్ అన్నపేరు పెట్టారు.


ఇద్దరు బిడ్డలకు తల్లిపాల విషయంలో చిన్న సమస్య ఏర్పడింది. పాలు అధికంగా వున్న ముంతాజ్... దశరధనందనకు తన పాలను యిచ్చేది. తన బిడ్డ మస్తాన్ తో ఆమె ఎక్కువ సమయం భవంతిలోనే కౌసల్య ప్రక్కన వుండేది.


కావలిలో ఆనందరావుగారి యింటి కోడలు మంగమ్మ నెల తప్పింది. నవమాసాల తర్వాత పండంటి మొగశిశువు కన్నది. ఆ బిడ్డకు వారు రఘునందన నామకరణాన్ని చేశారు.


వెంకటరామయ్య కుటుంబసభ్యులు అందరూ వెళ్ళి ఆ బిడ్డను మనసారా ఆశీర్వదించారు.

దశరధరామయ్య రెండు ట్రాక్టర్లు కొన్నాడు. బీడుగా వున్న నూరెకరాల భూమిలో మూడు బోర్లు వేయించి... నవీన పద్ధతులతో ఆ బీడు భూమిని సాగుచేశాడు. సంవత్సరానికి రెండు కార్లు పండించేవాడు. అప్పుడప్పుడు ప్రక్క గ్రామాలకు వెళ్ళి... నూతన వ్యవసాయ పద్ధతులను ఆయా ప్రాంత వ్యవసాయదారులకు తెలియజేసేవాడు. దేశానికి రైతు వెన్నెముక అనివారికి ప్రభోదించేవాడు.


కాలచక్రం మూడు వసంతాలను మహా వేగంగా చుట్టింది. దశరధనందన సునంద బాగా నడవటం... మాట్లాడటం నేర్చుకొన్నారు. సుశీలకు మొదట కూతురు రెండవ సంవత్సరంలోనే కొడుకు పుట్టారు. పేర్లు ప్రశాంతి. నారాయణ.


మన్మథరావు భార్య మంగమ్మ... సహజంగా గర్విష్టి. ఆమె కాపురానికి వచ్చిన మూడు మాసాల్లోనే.. ఆ విషయాన్ని గ్రహించింది సంధ్య. కోడలి తత్వాన్ని గురించి కొడుకు మన్మథరావుకు సున్నితంగా చెప్పి అతను ఆమె పట్ల ఎలా నడుచుకోవాలో తెలిపింది. తల్లి చెప్పినదంతా మౌనంగా విన్నాడు. మన్మథరావుకు తల్లి బోధన... కొంత తియ్యగా, కొంత చేదుగా వినిపించింది. మౌనంగా వెళ్ళిపోయాడు.


కాలగతిలో మరో రెండు సంవత్సరాలు గడిచాయి. మంగమ్మ రెండవసారి ఆడపిల్లను కన్నది. పేరు భానుప్రియగా నిర్ణయించారు మన్మథరావు మంగమ్మలు. అప్పటికి మన్మథరావు భార్యా విధేయుడుగా మారిపోయాడు. కోడలితో తనకు కలిగిన చేదు అనుభవాలను ఏనాడూ సంధ్య ఆనందరావుగారితో చర్చించలేదు. ప్రతి సమస్యకు కాలం సరైన తీర్పు చెబుతుందని, సహనంతో వర్తించేది.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.19 views0 comments

Comments


bottom of page