top of page

మధురమైన బాల్యం'Madhuramaina Balyam' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 09/06/2024

'మధురమైన బాల్యం' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి వాకిట్లో నున్న ఎత్తైన అరుగుల మీద వాలు కుర్చీలో కూర్చుని విశ్రమిస్తున్నాడు రంగనాధం. అతని పక్కనే అరుగు మీద కూర్చుని వత్తులు చేసుకుంటూ భర్తతో ఏవో విషయాలను ముచ్చటిస్తోంది శ్యామల. 


పాత కాలం నాటి డాబా ఇల్లు, ముందు భాగంలో ఎత్తైన అరుగులు, లోపల మండువా వాకిలి. ఇంటి ముందు వెనుక భాగంలో రక రకాల కాయగూరలు చెట్లు, పూలచెట్లు. గోదావరి నది మీదుగా వీచే చల్లని గాలులు ఆ పరిసరాలంతటినీ ఆక్రమించి ఆహ్లాదపరుస్తున్నాయి. ఈశాన్య మూలంలో నుయ్యి, నుయ్యి చుట్టూ విశాలమైన చప్టా. పెరటి వెనుక దూరంగా తాటాకుల పాకలో గడ్డి మేస్తున్న రెండు పాడి గేదెలు ఒక ఆవు. ఇల్లు చూడముచ్చటగా ఉంది. కానీ పిల్లలు ఉన్నట్లుగా సందడి, హడావుడి లేదు. 


ఉన్నట్లుండి శ్యామల “ఈ సంక్రాతి కి అబ్బాయి, అమ్మాయి వాళ్ల కుటుంబాలతో వస్తే ఎంత బాగుంటుందో కదండీ? పిల్లలు మన ఊళ్లో జరిగే సంక్రాంతి సంబరాలు చూసి ముచ్చటపడతారు”. 


“ఓసి పిచ్చిదానా, పిల్లల స్కూళ్లు, వాళ్ల ఆఫీసులకి శెలవు పెట్టి ఎలా వస్తారనుకున్నావు? లేనిపోని ఆశలు పెట్టుకోకు శ్యామలా”. 


రంగనాధం, శ్యామలా రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో ఉంటారు. రంగనాధం అక్కడ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్ గా పని చేసి రిటైర్ అయినాడు. ఒక కొడుకూ కూతురూ వారికి. ఇద్దరినీ బాగా చదివించి ప్రయోజకులను చేసారు. పిల్లలిద్దరూ తమ కంటికెదురుగా ఉండాలనే అనుకున్నారు. కానీ ఏదీ మన చేతిలో లేదని నమ్మే ఆ దంపతులు పిల్లలకి మంచి అవకాశాలు రావడంతో అమెరికా వెడుతుంటే కాదనలేకపోయారు. 


అబ్బాయి, అమ్మాయికి పెళ్లిళ్లు అయిపోవడం వారికి పిల్లలు పుట్టి చదువులకు వచ్చేసారు. 


ఎప్పుడో రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఉన్నన్నాళ్లూ ముళ్లమీద ఉన్నట్లే ఉంటారు. మనవలు, మనవరాళ్లు ఎప్పుడూ ఐపాడ్, ఐఫోన్ స్క్రిన్ల మీద ఆడుకుంటూ ఉంటారే తప్ప కాస్త బయటకు వెళ్లి ఆడుకుందామని అనుకోరు. 


తాను ఎన్నో సార్లు మనవలనీ మనవరాళ్లనూ తీసుకుని వెళ్లి ఊరంతా తిప్పి చూపించాలని వాళ్ల అమ్మా నాన్నా చదువుకున్న స్కూళ్లను చూపించాలని, పరవళ్లు తొక్కే గోదావరి అలలను చూపించాలని ఆరాట పడుతూ రమ్మనమని బ్రతిమాలినా, బాబోయ్, ఇక్కడ రోడ్లన్నీ డర్టీగా ఇరుకుగా ఉంటాయి, నీట్ నెస్ ఉండదంటూ రామంటారు. 

మా బీచ్ లు ఇంకా ‘ ఆసమ్ ‘ గా ఉంటాయంటారు. 


రంగనాధం పుట్టి పెరిగిన ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి డిగ్రీ కాలేజ్ లో బి. ఏ తెలుగు పూర్తి చేసాకా తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్స్ చేసాడు. రంగనాధం తండ్రి పిల్లలను రాజమండ్రీ పరిసర ప్రాంతాలను దాటి పంపించలేదు. అందుకనే రంగనాధం అక్క రాజమండ్రిలోనూ, తమ్ముడు మండపల్లిలోనూ ఉంటున్నారు. 


తన బాల్యం అంతా ఇక్కడే ధవళేశ్వరంలోనే గడచిపోయింది. తన బాల్య జ్నాపకాలతో నిండి ఉన్న ఈ ఊరంటే తనకు ప్రాణం. ఈ ఊరిలో ప్రతీ అణువణువూ తన బాల్య జ్నాపకాలను గుర్తుచేస్తుంటే నడుస్తూ నడుస్తూ అక్కడే ఆగిపోతాడో క్షణం. అమ్మా నాన్నా, బామ్మా తాత, అక్కా, తమ్ముడితో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. అక్క తనతో అన్ని పనులు చేయించుకునేది. ఈ ఇంటికి తానో యువరాణినన్నట్లుగా ప్రవర్తించేది. 


‘ఒరేయ్ రంగా, నా తిలకం అయిపోయింది’ అనో, 


‘నాన్నను డబ్బులడిగి తీసుకు రారా’ అనో, 


‘వీధి చివరలోనున్న ఆ ఉస్మాన్ టైలర్ గాడు నా కొత్త పరికిణీ జాకెట్టూ ఇస్తానన్నాడు, పోయీ తీసుకురా’ అంటూ తరిమేది. 


బామ్మ తనని ఎంతో గారం చేసేది. తను తాతలా ఉంటానని. తనకు పదేళ్లు వచ్చినా అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపించేది. బామ్మను తను కథలు చెప్పమని సతాయిస్తుంటే రాజుల కథలు, రాకుమార్తెల స్వయంవరాలు, మాంత్రికుల కథలు ఎంతో అద్భుతంగా చెబుతుంటే అక్కా తమ్ముడూ కూడా పక్కన చేరి నోరెళ్లబెడుతూ వినేవారు. 


ఒకటా రెండా జ్నాపకాలు? అవి గుర్తుచేసుకోడానికి ఒక జీవితకాలం సరిపోదేమో?


అద్దంలో తన ముఖం చూసుకుంటుంటే తన నుదుటి మీద మచ్చ బాల్యంలో తన తుంటరి తనానికి చిహ్నంగా కనపడుతుంది. 


తన ప్రాణ మిత్రుడు 'సూరిబాబు' గుర్తురాగానే రంగనాధం పెదవులపై చిరుదరహాసం మెరిసిందో క్షణం. 


‘ఏమిటండీ మీలో మీరే నవ్వుకుంటున్నారు, నాకు చెప్పకూడదా’? అంటూ పక్కనే కూర్చున్న శ్యామల అడిగింది. 


‘అదే శ్యామలా, సూరిబాబు గుర్తొచ్చాడు. చిన్నప్పుడు దొరబాబులా ఉండేవాడు. పచ్చగా, బూరెబుగ్గలూ వాడూను. అల్లరిగా చూసే వాడి పెద్ద పెద్ద కళ్లల్లో ఎన్ని తెలివితేటలో. వాళ్ల మామయ్య రంగూన్ లో ఉండేవాడు. వచ్చినప్పుడల్లా వాడికి రంగు రంగుల టీ షర్ట్సూ, స్ట్రెచ్ లాన్ నిక్కర్లు, బూట్లూ తెచ్చేవాడు. వాడు అవి తొడుక్కుని తెగ పోజు కొట్టేవాడనుకో. అసలు అల్లరంతా తెరవెనుక ఉండీ వాడే చేయించేవాడు. వాడు మాకు నాయకుడు అప్పట్లో’. 


‘అ మధ్య ఎప్పుడో మీరు అతను పోలీస్ డిపార్ట్ మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్పినట్లు గుర్తు’. 


‘అవునే, హైద్రాబాద్ లో డెప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు మా సూరిబాబు, అదే సూర్యనారాయణ.

 

మామిడి తోటల్లోకి మమ్మలని రమ్మనమని, అందరినీ బేచ్ లు గా చేసి దొంగతనంగా పంపించి తాను బయట నక్కేవాడు. తోటమాలి వస్తే ఈల వేసేవాడు. ఈలోగా మేమందరం కాయలు తెంపేసుకుని పరుగెత్తేవాళ్లం. 


అలాగే దొంగతనంగా గోడలెక్కి జామకోయలు కోసుకుని తినడం ఒక అనుభూతి. నన్ను వాడు గట్టిగా పట్టుకుని పైకెత్తుతూ నా బరువుని తన రెండుచేతులమీదుగా మోస్తుంటే ఇంటివారి గోడకానుకున్న జామచెట్టు కాయలు కోయడం ఒక గొప్ప సాహసంగా భావించేవాళ్లం’. 


‘అబ్బ, మీరింత అల్లరిమనిషా శ్రీవారూ’ అంటూ ఫక్కున నవ్వింది శ్యామల. 


“అబ్బ, నీకేమీ తెలియనట్లు? అప్పట్లో ఎంత పెంకి ఘటానివి నీవు ! ‘నేనూ వస్తాను బావా’ అంటు నా వెంట పరుగెత్తేదానివి”.

 

తలెత్తి, మూతి మూడు వంకరలు తిప్పుతూ, “నేనా, ఎప్పుడూ?” అని అమాయకంగా అడుగుతున్నశ్యామల ముక్కున ముద్దాడుతున్న వజ్రపు ముక్కుపుడక తళుక్కున మెరిసింది. 


“మా అక్కా, నేనూ, తమ్ముడూ, నీవూ మామిడి చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టుకుని ఊగేవాళ్లం, గుర్తులేదా? అక్క మహారాణిలా చెక్క బల్లమీద కూర్చునేది. తమ్ముడు కూడా కూర్చున్నాడు. ఒకవైపు చేంతాడు నీవూ, మరోవైపు నేనూ పట్టుకుని ఉయ్యాల ఊపాం”.

 

“అవునౌను గుర్తొచ్చింది బావా?”


“ఎన్నాళ్లకు అప్పటిలా బావా అని పిలిచావు శ్యామలా?”


“మేనత్త మేనమామ బిడ్డలం, అప్పట్లో అలా పిలిచేదాన్ని, నన్ను ఎంత ఏడిపించేవాడివో నీవు?


మన పెళ్లైనాక కూడా ‘బావా, నువ్వు’ అని పిలుస్తుంటే అత్తయ్య అలా పిలవకూడదంటే మానేసాను. అప్పట్లో నన్ను మోహించి నన్నే పెళ్లిచేసుకుంటానని మా నాన్నతో అన్నారుట కదా?”


“నిన్నా, మోహించడమా? అబద్ధం శ్యామలా” రంగనాధం శ్యామలను ఏడిపించసాగాడు. “నీవే దెయ్యంలా నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకోమని వేధించేసరికి భయపడి మూడుముళ్లూ వేసేసాను”.

 

“ఓసోస్, కోతలు కోయకండి మహాశయా!”

“కోతలంటే గుర్తుకొచ్చాయి. ఒకసారి స్కూల్ కి వెడుతుంటే దారిలో ఒక నేరేడు చెట్టునిండా మిగలమగ్గిన నేరేడు పండ్లు కనపడ్డాయి. సూరిబాబు ఒక్క గెంతులో కొమ్మను అందుకుని కొమ్మని గట్టిగా ఊపేసరికి ఎన్ని పళ్లు రాలేయో తెలుసా? నేనూ, గోపీ, వనజా ఆ పళ్లన్నీ చక చకా ఏరేసుకుని స్కూల్ బేగ్ లో దాచేసుకున్నాం”.

 

“మరి నాకు పెట్టలేదేం బావా నేరేడు పళ్లు?” 


“అప్పుడు నీవు చిన్నదానివి కదే శ్యామలా, పైగా మా క్లాస్ మేట్ వి కూడా కాదు”.

 

“బావా నాకో సంఘటన కొంచెం కొంచెంగా గుర్తుంది”. 


“ఏ సంఘటన శ్యామలా?”


“నీవు ‘పంగల కర్ర’ తో రేగి పళ్లను కొడుతుంటే నేనూ మీ తమ్ముడు ఎప్పుడు అవి జల జల మంటూ రాలి కింద పడతాయా అనుకుంటూ ఆశగా వాటివైపే చూడడం”. 


“అబ్బో, నీకు బాగానే గుర్తుందే?”


“కోతి కొమ్మచ్చాట గుర్తుందా శ్రీవారూ?”


“బావా అనే పిలువు శ్యామలా, అప్పటి రోజుల్లోకి వెళ్లిపోయినంత హాయిగా అనిపిస్తోంది”.

 

“ఔనౌను, ఆ ఆట భలే ఉంటుంది కదూ. ఆ ఆటను ‘కాలు కింద కర్ర’ అని కూడా అనేవారు. 


ఇందులో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు. 


అప్పుడే కదా పరుగెడుతుంటే నేను పడిపోయి కాలు బెణక్కొట్టుకున్నాను”.

 

“నాకు అంతగా గుర్తులేదు, పడిపోయావా? అప్పుడు కదా బావా, బాధపడకు”.

 

“ఔరా, ఎన్ని ఆటలు, ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్లం అప్పట్లో!”


“శ్యామలా, ఈ ఆట గుర్తుందా నీకు?”


“ఏ ఆట?”

“అదే, అందరం గుండ్రంగా కూర్చుని ఒకరి కొకరం పిడికిలి మడచి మరొకరి పిడికిలి మీద పెట్టుకుంటూ పోతాం. ఆ పిడికిలి మీద ఎవరైనా ఎక్కి గాలిలోకి ఎగిరే ఆట. భలే గమ్మత్తుగా ఉంటుందనుకో”.

 

“బావా నీ నుదిటి మీద మచ్చకి కారణం ఆ సూరిబాబే కదూ?”


“వాడే కారణమని నేననుకోను శ్యామలా. ఎందుకంటే ఆరోజు సాయంత్రం స్కూల్ నుండి వస్తూంటే దారిలో నున్న సీమ చింత చెట్టుకి పక్వానికి వచ్చి గులాబీ రంగుతో మెరిసిపోతున్న పళ్లు ఆకుల చాటున కనపడ్డాయి. అవి మా కంటనే పడాలా? అందులో సూరిబాబు దృష్టిలో. నేనూ సూరిబాబు కాక మరో క్లాస్ మేట్ రామం కూడా ఉన్నాడు మాతో. ఆ ఇద్దరి కంటే నేనే కాస్త పొడుగు. 


ఆ చెట్టుపక్కనే ఒక పెద్ద తాడు కనిపిస్తే తీసుకున్నాను. సూరిబాబు నన్ను పైకి ఎత్తి లేపితే, నేను ఆ తాడుని చెట్టు కొమ్మకి వేసి గట్టిగా లాగితే నాకందాయీ చూడు, గుత్తు గుత్తుల సీమ చింత పళ్లు. ఎర్రగా కొన్ని, గులాబీ రంగులో కొన్ని. చకా చకా అన్నీ కోసేసాం. వాడు నన్ను కిందకు దించబోయేంతలో వాడి చేయి స్లిప్ అయితే నేను కింద పడిపోవడం, పక్కనే ఉన్న ఇటుక కొన నా నుదిటికి తగిలి ఎంత రక్తం వచ్చిందో. 


రక్తంతో తల, నుదురు అంతా తడిసిపోయింది. సూరిబాబు ఏడ్చేస్తూ మా ఇంటికి వెళ్లి చెప్పడం ఇంట్లో వాళ్లు పరుగెత్తుకొచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి కుట్లేయించడం జరిగింది. పాపం సూరిబాబు ఎంత బాధ పడ్డాడో, పొరపాటై పోయిందిరా అంటూ ఒకటే ఏడుపు. 


అలాంటి సూరిబాబు ఈ మధ్యనే ఫోన్ చేసి ‘ ఒరేయ్ రంగా తొందరలో నాశ్రీమతితో వచ్చి మీ ఇంట్లో పది రోజులుంటామురా’ అనేసరికి సంతోషం వేసింది. అప్పటి బాల్య స్నేహాలలో ఎంతో నిజాయతీ ప్రేమా ఉండేవి. 

అయినా శ్యామలా, ఈ ఆటలు ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యం పొందేవాళ్లం. పైసా ఖర్చు లేని ఆటలు. సామూహికంగా ఆడే ఆటలు అవడం వలన స్నేహవాతారణము ఏర్పడేది. 


కానీ నేటి తరం పిల్లల ఆటలన్నీ ఇంట్లోనే, కూర్చున్న చోటునుండి కదలనే కదలరు. అందుకనే చిన్నతనం నుండే అనేక అనారోగ్య సమస్యలు. 


ఇలా ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన మన బాల్యం నిజంగానే ఒక మధుర కావ్యం కదూ !”


“అవును బావా! నా బాధ ఏమిటంటే ప్రస్తుత తరం పిల్లలు ఇటువంటి అందమైన అనుభవాలను ఆస్వాదించ లేకపోగా యాంత్రిక జీవితానికి అంకితమైపోతున్నారు కదా అని. 


పిల్లలకు కుటుంబ విలువలేమిటో అర్ధం కాకుండా పోతోందని. మన హిందూ సంస్కృతి మన తెలుగు భాష మనతోనే అంతమయిపోతుందేమోనన్న భయం”. 


“అలా అనుకోవద్దు శ్యామలా. మన సంస్కంతి, తెలుగు భాష ఎప్పటికీ అంతం అవదు. మనలాంటి తల్లితండ్రుల గల పిల్లలెందరో విదేశాల్లో ఉంటున్నా మన సంస్కృతిని, భాషనూ మరవలేదు. అమెరికాలో మన భారతీయులే ఎక్కువ భాగం ఉన్నమూలాన అక్కడ ఇంగ్లీష్ భాష తరువాత మన తెలుగు భాషే రెండో స్థానంలో ఉందట. 


ఈ మధ్య నేను పేపర్ లో చదివిన ఒక వార్త ఏమిటంటే వచ్చే సంవత్సరం నుండి న్యూయార్క్ సిటీలో మన హిందూవుల దీపావళి పండగకు అమెరికన్ ప్రభుత్వం శెలవు ప్రకటించే యోచనలో ఉన్నారుట. దీపావళి సంబరాలు చేసుకునేందుకు. 


మన భారతీయ సంస్కృతి అమెరికన్లకు కూడా బాగా అర్ధమయి ప్రభావితులౌతున్నారుట. అదే జరిగితే అమెరికాలోని అన్నిరాష్ట్రాలకు ఈ ప్రకటనను అమలు చేయచ్చు. 


ఇవాళ్టి గొప్పతనమేంటంటే, మనం ఆనందంగా అనుభవించిన ఎన్నో గొప్పగొప్ప బాల్యానుభూతులు గూగుల్ ప్లే స్టోర్లో, ఆపిల్ ఆప్ స్టోర్లో డౌన్లోడబుల్ యాప్స్ గా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి పిల్లలు ఐపాడ్, ఐఫోన్ స్క్రిన్ల మీద ఆడుతున్నారు, ఆనందపడుతున్నారు. ఏ తరానికి ఆ తరమే గొప్ప. 


‘అనగనగా ఒక పెద్ద ఊరు.. ఆ ఊరులో ఒక పెద్ద చెట్టు.. దానిమీదో దెయ్యం కూర్చుంది’ అని చెప్పే కథలు నేటి తరం పిల్లలకు ఆశక్తికరంగా ఉండడం లేదు. 


‘అవో కథలా’ అంటూ తీసిపారేస్తున్నారు. ప్రపంచం సాంకేతిక పరంగా ముందుకు దూసుకుపోతోంది. డిజిటల్ ప్రపంచంలో లో పెరుగుతున్నారు నేటి తరం పిల్లలు. ప్రపంచంతో బాటూ మనమూ పరుగెత్తడమే భావ్యం, 

లేకపోతే ఈ పోటీ యుగంలో వెనుకబడిపోతూ నలుగురిలో నగుబాటు అవుతాం అని ఆలోచిస్తున్నారు”. 


“మీరు చెప్పేవి వింటుంటే అవును సుమా అనిపిస్తోందండీ. 

పిల్లలు నీతిగా ఆదర్శంగా పెరిగి గొప్పవాళ్లైతే ఏ దేశం అయితే నేమండీ”. 


“సరే, సరే, మన బాల్య జ్నాపకాల వనంలో హాయిగా చాలాసేపు విహరించి వచ్చి ఎన్నో మధురానుభూతులను ఆస్వాదించాం. ఎంతో ఉత్సాహంగా ఉందిపుడు. కాస్త లేచి వేడి వేడి కాఫీ ఏమైనా ఇస్తారా శ్యామలాదేవిగారూ” అనేసరికి “ఒక్క క్షణం శ్రీవారూ” అంటూ లోపలకు నడచింది శ్యామల. 

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


46 views0 comments

Comentarios


bottom of page