top of page

గోగులపాటి కూర్మనాథుడు'Gogulapati Kurmanathudu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 09/06/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 8)

'గోగులపాటి కూర్మనాథుడు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్18 వ శతాబ్దం ఉత్తరభాగంలో, ఆంధ్రప్రదేశ్ లో ఆరాజకం వ్యాపించింది. పెద్ద రాజ్యాలు నశించాయి. చిన్న చిన్న రాజులు దొరికిన భూములని ఆక్రమించుకుని నిరంకుశంగా పాలించి ప్రజలని పీడిస్తున్నారు. దీనికి సాయం ఉత్తరం నుంచి తురకలు, మరాటీలు దండెత్తి వచ్చి ఊళ్లపై పడి దోచుకుంటున్నారు. స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. దేవాలయాలన్నీ పడగొట్టడం, శాంతిభద్రతలు లేకుండా చేసారు. 


ఆ స్థితి లో ఒకరోజున సింహాచలం మీదకి తురకలు దండెత్తి వస్తున్నారని తెలిసింది. ప్రజలు చెట్టుకి పుట్టకి పారిపోతున్నారు. ఊరంతా గోల గోల అయిపొయింది. తల్లీ పిల్లలు విడిపోయి ఎవరి దారిన వారు పారిపోయారు. గోగులపాటి కూర్మనాథకవి విసవిసా సింహాచలపు కొండ మెట్లు ఎక్కి స్వామికి ఎదురుగా ఒంటి కాలు మీద నిలబడి కంపిత గాత్రంతో భగవంతుడితో మాట్లాడి, బ్రతిమిలాడి, నిందించి ఆశువుగా పద్యాలు చెప్పటం మొదలుపెట్టాడు. తురక దండు ఊరుమీద పడింది. జనం ఆర్త నాదాలు మిన్నుమొట్టాయి. అప్పుడు గోగులపాటి కూర్మనాథుడు 


 "మున్ను తాటక ప్రాణముల్గొన బాణంబు

 మెరసి సుభాహు దున్మిన విశిఖము 

 మించి విరాధు ఖండించిన ప్రదరంబు 

 ఖరధూషణాది సంహారణ శరము 

 మాయల మారీచు మద మణించిన తూపు 

 ఘోర కబంధుని గూల్చు సిలుగు 

 వాలిని బలశాలి గూలవేసిన కోల 

 జలది నింకించిన సాయకంబు 


రావణాది మహాసురరాజి నణచు 

చండకాండంబు లేమాయే చటులయవన 

ఖండనము సేయ నయ్యాంబకముల బరవు 

వైరి హరరింహ సింహాద్రి నారసింహ "


ఈ విధముగా కవి అరవై ఏడు పద్యాలు చెప్పేసరికి తురక దండు మీదకి నాలుగు మూలల నుంచి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి తురకదండు మీద పడి రక్తం కారేడట్లు కరిచి విశాఖపట్నం వరకు తరిమి కొట్టి అక్కడ గుహలో మాయం అయ్యాయి.. ఆ గుహ వున్న కొండని తుమ్మెదల మెట్ట అని పిలుస్తారు. కూర్మనాథుడే తుమ్మెదలని పంపి తన దేవాలయాన్ని రక్షించుకున్నాడని నమ్మకం తో, సంతోషం పట్టలేక పొగుడుతూ మిగిలిన పద్యాలు చెప్పి శతకం పూర్తి చేసాడు. 


ఈ కవి వ్రాసిన గ్రంధాలు సింహాద్రి నారసింహ శతకం, మృత్యుo జయ విలాశమనే యక్షగానం, చోరసంవాదం అనేవి మాత్రమే యిప్పుడు లభిస్తున్నాయి. 


తురగా రామకవి 

 ---------------


ఈయన 18 వ శతాబ్దం కవిశ్వరుడు. వేములవాడ భీమకవి తరువాత, తిట్టు కవిత్వంలో యింతటి వాడు లేడు. ఈయన ఆడినమాట నిజం అవుతుందని భయంతో అందరూ గౌరవించేవారు. 


ఒకసారి ఈయన పెద్దాపురం సంస్థానాధిపతి అయిన వత్సవాయి తిమ్మ గణపతి మహారాజును చూడబోగా దర్శనం ఇవ్వలేదుట 

 వెంటనే కోపంవచ్చి, 


 "అద్దిర శ్రీ, భూనీళలు 

 ముద్దియ లా హరికి మువు రందులలో 

 పెద్దమ్మ నాట్యమాడును 

 దిద్దమ్మని, వత్సవాయి తిమ్మని యింటన్ "


అని శపించాడుట. 


తా.. విష్ణువుకు లక్ష్మి, భూదేవి, జేష్ఠ దేవి అని ముగ్గురు భార్యలు. అందులో జేష్ట దేవి ( peddamm) వత్సవాయి తిమ్మ యింటిలో నాట్యం చేయుగాక. 


కవి అన్నట్టుగానే, కొద్దికాలంలో తిమ్మ గణపతి రాజ్యం పోగుట్టుకుని, తిండికి, బట్టకూ కరువై అలమటించవలసిన దుస్థితి కి వచ్చాడుట. 


రామకవి బావమరిది తల్లాప్రగడ ప్రకాశరాయుడు అనే ఆయన ఉంగుటూరనే ఊళ్ళో పెద్ద యిల్లు కట్టి ఒకరోజు రామకవికా 


యిల్లు చూపిస్తో, వేళాకోళానికి ఒక గదిలో వదిలేసి కనబడకుండా తప్పుకున్నాడు. నూరు గదులున్న ఆ యింట్లో దారి తెలియక ఇబ్బంది పడి రామకవి, 


 "అంగణము లెన్ని కేళి గృహంబు లెన్ని, 

 యోడుబిళ్ళల యిండలేన్ని మేడ లెన్ని 

 కట్టేగాకేమి సూర్యప్రకాశరాయు 

 దుంగుటూరిండ్ల, రాకాసులుండవచ్చు"


అని పద్యం చదివాడుట. ఆయన వాక్కు వలన వందల కొలది పిశాచాలు పట్టపగలే అరుస్తూ గదులన్నిటిలోనూ నాట్యం చేయడం మొదలుపెట్టాయిట


ఒకప్పుడు రామకవి స్వయంగా యిల్లు కట్టుకొంటూ గోడ మీద కూర్చొని దారిన పోయే వాళ్ళందరిని నేల మీద వున్న ఇటుకలు ఒక్కొక్కరు ఒక ఇటుక చొప్పున అందించాలని ఆజ్ఞపించాడుట. 


ఆయన నోటికి జడసి వాళ్లంతా ఆయన చెప్పినట్టుగా చేసి వెడుతున్నారు. ఇంతలో ఆ దారిన ముక్కోపి అయిన అడిదం సూరకవి వెళ్లడం సంభవించింది. రామకవి ఆయనను కూడా ఒక ఇటుక అందించమన్మాడు. దానికి సూరకవి కళ్లెర్రా చేసి


 "సూరకవి తిట్టు, కంసాలి సుత్తి పెట్టు " అని ఇటుక అందివ్వకుండా ముందుకు నడిచాడు. అప్పుడు రామకవి 


 "రామకవి బొబ్బ, పెద్ద ఫిరంగి దెబ్బ " అని అరిచాడుట. 


ఓహో ఈయన తురగా రామకవా, ఈయనతో తగాదా మంచిది కాదు అనుకుని, తన వంతు ఇటుక కిక్కురుమనకుండా అందించి వెళ్ళిపోయాడు సూరకవి. 


రామకవి వ్రాసిన గ్రంధాలలో "నాగర ఖండ" మనే అయిదు అశ్వాసాల కావ్యమొకటి మాత్రం యిప్పుడు మిగిలి వుంది. 


 దత్తప్ప కవి 

 =========

మొచెర్ల వెంకన్న, దత్తప్ప అను కవులు అన్నదమ్ములు. ఒకరోజున ఒక పండితుడు వారింటికి అతిధిగా వచ్చి, భోజన సమయంలో తన కోరిక తీరుస్తానని మాట యిస్తే కాని అన్నం ముట్టనని భీష్మించుకుని కూర్చున్నాడు. వెంకన్న కవి, "మీ కోరిక ఎటువంటిదైనా తీరుస్తాను, ముందు భోజనం చెయ్యండి" అని బ్రతిమాలాడు. భోజనానంతరం ఆ పండితుడు నేను ముప్పై సంవత్సరాలనుండి కాశీలో గొప్ప పండితులకు సేవ చేసి, శాస్త్రాలన్నీ చదివాను. అనంతరం స్వదేశానికి వచ్చి, కుటుంబపోషణ కోసం, వెలుగోటి యాచమనాయుడు కవి పండిత పోషకుడు అని విని, ఆయనను దర్శించాను. ఆయన ‘నీకు తెలుగు కవిత్వం వచ్చా?" సమస్యలు పూర్తి చెయ్యగలవా?’ అని ఆడిగాడు. 


‘సంస్కృత పండితుణ్ణి, , మీ పండితుల చేత పరీక్ష చేయించండి’ అని కోరాను. ఆయన ‘తెలుగులో కవిత్వం చెప్పలేనివాడి ముఖం నేను చూడను. అడ్డమైన వాడు ఏదో వంకపెట్టుకుని యాచనకు బయలుదేరడం ఒక పెద్ద అలవాటైంది’ అని నన్నవమానించాడు. 


మీ అన్నదమ్ములలో ఒకరు నాతో వచ్చి ఆ యాచమనాయున్ని పరాభవిస్తేనే కాని నా అవమానం తీరదు " అని వాపోయాడు. 


వెంకన్నగారు తమ్ముడైన దత్తప్పను పండితునికి తోడిచ్చి పంపించాడు. ఆ యిద్దరూ యాచమనాయుడి సభకి వెళ్లారు. దత్తప్ప తాను తెలుగులో కవిత్వం చెప్పగలను, వ్రాయగలను అని, ఏ సమస్య అయినా పూర్తి చెయ్యగలనని చెప్పాడు. నాయుడు తన పండితుల సహాయంతో తయారు చేసుకున్న సమస్యల పుస్తకం తీసి, ఒక్కొక్క గడ్డు సమస్య యివ్వడం మొదలుపెట్టాడు. దత్తప్ప వాటిని అవలీలగా పూర్తిచేస్తున్నాడు. నాయుడు కి ఖంగారు పుట్టి చివరకు "గుండ్రాతికి కాళ్ళు వచ్చి గున గున నడిచెన్ " అని సమస్య యిచ్చాడు. దత్తప్ప కవి 


 "ఉండ్రా యోరి దురాత్మక 

 యిండ్రా ప్రాసంబు కవుల కియ్యం దగునా 

 ఆండ్రాము కరుణచేతను 

 గుండ్రాతికి కాళ్ళు వచ్చి గున గున నడిచెన్ "


అని పూర్తి చేసి "తిట్టుదునా" అని పద్యం మొదలుపెట్టాడు. యాచమనాయుడు గడగడలాడి, చీని చీనాంబరాలు తెప్పించి, దత్తప్పకి కప్పాడు. అతడు వాటిని ముక్కలు గా చింపి క్రింద వేసి 


 "యాచ మహీపతి వలువలు 

 గోచులకే కాక కట్టుకోకల కగునా

 రేచర్ల గోత్రమందున 

 నీచుడు జన్మించి కులము నీరుగ జెరిచెన్ "


అని ఆశువుగా చదివేసరికి, నాయుడు దత్తప్ప రెండు చేతులు పట్టుకుని క్షమించమని కోరాడు. 


అప్పుడు దత్తప్ప ‘క్షమించమని అడుగవలసినది నన్నుకాదు, ఈ పండితుణ్ణి, ఆయన శ్రమించి నేర్చిన పాండిత్యాన్ని గణించక అవమానించావు, ఐశ్వర్యం ఉన్నందుకు పండితులని సన్మానించాలి కాని అవమానం చెయ్యకూడదు’ అని మందలించాడు.. 


అప్పుడు యాచ భూపతి పండితుడిని క్షమించమని కోరి, ఇద్దరికి ఘనంగా బహుమానాలు యిచ్చి సత్కరించాడు. దత్తప్ప తనకి వచ్చిన వాటిని కూడా పండితుడీకే యిచ్చి " మీకు తృప్తి అయినదా? అని ఆడిగాడు.. 


మీ అన్నదమ్ములని ఆశ్రయించిన వారికి లోపం జరుగుతుందా? అని దత్తప్ప ని దీవించి సంతోషంగా వెళ్ళిపోయాడు. 


 8 వ భాగం సమాప్తం. 9 వ భాగం త్వరలో


(ఆధారం మా తండ్రిగారు శ్రీ జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన

-- శ్రీనివాసరావు జీడిగుంట) 


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

 


14 views0 comments

Comments


bottom of page