'Tenali Ramakrishnudu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 02/06/2024
(కవులను గూర్చిన కథలు - పార్ట్ 7)
'తెనాలి రామకృష్ణుడు' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
తెనాలి రామకృష్ణుడు
===============
కృష్ణరాయల కాలంలో యువకుడిగా వుండి, అనంతరం పాండురంగ మహాత్యం అన్న కావ్యం వ్రాసి ప్రసిద్ధికెక్కిన వాడు తెనాలి రామకృష్ణుడు.
పాండురంగ మహాత్యం ఆంధ్ర పంచకావ్యాలలో ఒకటిగా పరిగణనలోకి తీసుకోబడింది. ఇందులోని " నిగమశర్మోపాఖ్యనం " ప్రతి సాహిత్య ప్రియుడు చదివితీరవలసింది. నన్నయ్య కు గోదావరి వలె ఈ కవికి తుంగభద్ర అంటే ఎంతో యిష్టం. తుంగభద్రా నది సముద్రంలో కలవడం లేదన్న భౌగోళిక సత్యాన్ని రామకృష్ణుడు ఎంత మనోహరంగా వర్ణించాడో చూడాలి.
"గంగా సంగమ మిచ్చగించునె, మదిం గావేరి దేవేరిగా
నంగీకార మొనర్చునే, యమునతో నానందము బొందునే
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రానదీ "
తుంగభద్ర కనుక సముద్రణ్ణి వరించి వుంటే ఆయన గంగా, కావేరి, యమునని దగ్గరికి చేరనిచ్చేవాడు కాదు అని అర్ధం.
రామకృష్ణుడు హాస్యప్రియుడు. విశేషమైన వాక్ చమత్కృతి కలిగినవాడు. ఇది ఆధారంగా చేసుకుని ఎన్నో కథలు కల్పింపబడ్డాయి. వాటిలో ఎక్కువ భాగం అసభ్యంగాను, అసహ్యంగాను ఉంటాయి. అటువంటి కథలకి మహాకవి రామకృష్ణుడిని నాయుకుణ్ణి చెయ్యడం ఆంధ్ర సాహిత్యానికి అపచారం.
ఒకరోజున రాయులవారు పళ్లెం నిండా వరహాలు పోసి, బల్లమీద పెట్టి, తప్పులు లేకుండా అశువుగా పద్యం చెప్పిన వాళ్ళిది తీసుకోవచ్చని సెలవిచ్చాడు. అప్పుడు అల్లసాని పెద్దన
శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!
అర్ధం... నరసింహరాయల కుమారుడవైన ఓ కృష్ణరాయా, రాజసింహా
బాణం వెయ్యడంలో నేర్పు, బలం, ఓర్పు, వున్నప్పటికి, నపుంసకత్వం, గుహలో దూరడం, కంపము, బ్రహ్మహత్య అనేవి లేకపోతే అర్జునుడూ, సింహం, భూమి, శివుడు, నీతో సమానులని అనివుండేవాళ్ళం.
అని పద్యం చదివాడు. అప్పుడు రామకృష్ణుడు లేచి, "అల్లసాని తాతా! రాయలవారు సింహం కంటే గొప్ప అని ఒక ప్రక్కన చెపుతూనే, చివరికి కంఠీరవా అని సంభోధించి సింహంతో సమానం చేసి పప్పులో కాలువేశావు. తప్పులేకుండా నేను పద్యం చెబుతాను చూడు అని
"కలనం దావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మా భర్తమార్తాండ మం
డల భేదం బొనరించి ఏగునెడ దన్మధ్యంబునన్ హర కుం
డల కేయూర కీరిట భూషితుని శ్రీనారాయుణున్ గాంచి లో
గలగంబారుచు నేగె నీవ యను శంకన్ గృష్ణ రాయాధిపా "
తాత్పర్యం.. ఓ కృష్ణరాయా నీచే యుద్ధం లో చంపబడిన శత్రురాజు, సూర్యమండలాన్ని భేదించుకుని వేడుతూ అక్కడ విష్ణుమూర్తిని చూసి, నీవే అని భ్రమించి భయపడి పరుగెత్తాడు.
ఈ పద్యం విని పెద్దనాదులు మెచ్చుకున్నారు. రాయలవారు రామకృష్ణునికి వరహాల పళ్లెం, కర్ప్పూర తాంబులం యిచ్చి సన్మానం చేసారు.
ఒకరోజున రాయలవారు కొలువులో ఒక కవి లేచి " కుంజర యూధoబు దోమ కుత్తుక జొచ్చెన్ " అన్న సమస్య యిచ్చి పూరించమన్నాడు. ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది అని అర్ధము. ఆ కవి అంటే రామకృష్ణుడికి పడదు అందుచేత
"గంజాయి త్రాగి ****
సంజాతుల గూడి కల్లు చవిగోన్నావా
*** *** ఎక్కడ
కుంజర యూధoబు దోమ కుత్తుక జొచ్చెన్ "
అని పూర్తి చేసాడు.
రాయల వారు అతని అసభ్య ప్రవర్తన కి కోపించి, ఆ సమస్య మేమిచ్చినదిగా గ్రహించి పూరింపమన్నాడు.
దానికి రామకృష్ణుడు లేచి
"రంజన చెడి పాండవు లరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయ విధి నేమందును
కుంజర యూధoబు దోమ కుత్తుక జొచ్చెన్ "
అని పూర్తి చేసి సభాసదుల మన్ననలని పొందాడు.
ఒకేరోజున, అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, భట్టుమూర్తి, రామకృష్ణుడు రాజదర్శనం కి బయలుదేరారు. రాయల సభాభవనం ముందు తిమ్మన్న అనే అతడు కాపలా వున్నాడు. పెద్దనకు అతన్ని చూసి పద్యం చెప్పాలని బుద్ది పుట్టింది.
"వాకిటి కావలి తిమ్మా" అని ద్వారం దాటి లోపలికి వెళ్ళాడు. వెనుక వున్న ముక్కు తిమ్మన
"ప్రాకటముగ సుకవివ పాలిటీసొమ్మా"
అని రెండవ పాదం చెప్పి పెద్దన ని అనుసరించాడు. భట్టుమూర్తి
"నీ కీ పద్దెము గొమ్మా " అని లోపలికి వెళ్ళాడు.
కొంటివాడైన రామకృష్ణుడు
"నా కీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా "
అని పద్యం పూర్తి చేసి రెండు అడుగులు వేసాడు.
పెద్దనాది మహాకవులు తనపై పద్యం చెప్పినందువల్ల తన జీవితం సార్ధకమైనదని తలచి, వాకిటి కావలి తిమ్మడు తన భుజం మీద వున్న శాలువా తీసి రామకృష్ణుడికి కప్పి నమస్కరించాడు.
అతనది ధరించి సభలోకి వెళ్లగానే రాయలవారు "ఆ పచ్చడం నేను వాకిలి కావలి తిమ్మన కి బహుకరించాను, అది నీకెలా వచ్చింది అని అడిగారు. అతడు జరిగింది అంతా చెప్పాడు. రాయలవారు కావటి తిమ్మ రసజ్ఞతకు, మెచ్చుకుని అతనికి
పెద్దన, ముక్కు తిమ్మన్న, భట్టు మూర్తి ఈ ముగ్గురి కవిత్వాల తారాత్మ్యం సభవారికి చెప్పవలసిందని కోరారు. రామకృష్ణుడు లేచి పెద్దన మనుచరిత్ర లోనుండి
"పాటున కింతు లోర్తురే కృపారహితాత్మక నీవు ద్రోయ ని
చ్చోట భవన్నఖాంకరము సోకె కనుంగొనుమంచు చూపి య
ప్పాటలగoధి వేదన నెపం బిడి ఏడ్చే గల స్వనంబుతో
మీటిన గబ్బిగుబ్బచనుమిట్టల నశ్రులు చిందువారగన్ "
అన్న పద్యం,
ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో నుండి
“ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దావానలంబుచే
గాసిలి ఏడ్చే ప్రాణవిభు కట్టేదుటన్ లలితాంగి పంకజ
శ్రీసఖమైన మోముపై జేల చెరంగిడి, బాల పల్లవ
గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలిధ్వనిన్ "
అని,
భట్టుమూర్తి వ్రాసిన వసుచరిత్ర లో ని పద్యం
"ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా
రాజశ్రీ సఖమైన మోమున బటాగ్రoబొత్తి యెలగేత్తి యా
రాజీవాసన యేడ్చే, గిన్నర వదూ రాజత్కరాంభోజ కాం
భోజీమేళ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగన్ "
అన్న పద్యం చదివి " ప్రభూ అల్లసాని పెద్దన అటు నిటూ గా ఏడ్చాడు, ముక్కు తిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు, మొత్తం మీద ముగ్గురు ఏడ్పులు బాగానే వున్నాయి " అనే సరికి రాయలవారు, సభ్యులు పొట్టలుబ్బేటట్లు నవ్వుకున్నారు.
తరుచుగా రామకృష్ణుడు రాయలు వారు అడిగిన ప్రశ్నలకు జవాబు యిచ్చి గెలుస్తో యితరులిని పరాభవిస్తో ఉండేవాడు. కాని ఒకసారి అతనికి పరాభవం జరిగింది. ఒకరోజు అతను ముక్కు తిమ్మన గారింటికి వెళ్ళాడు. అప్పుడు తిమ్మన గారు తూగుటుయ్యాలలో నెమ్మదిగా ఊగుతున్నాడు. రామకృష్ణుడు ‘తాతా ఊతునా’ అన్నాడు. పాపం ఊపుతా అంటున్నాడు అనుకుని ‘అంతకంటే నా’ అన్నాడు తిమ్మన గారు. దానితో రామకృష్ణుడు తుబుక్కున ఆయన మీద ఉమ్మేసాడు.
రామకృష్ణుడి అసభ్య ప్రవర్తన కి వళ్ళు మండి, కాలికున్న పాంకోడు విసిరి వేసారు. అది రామకృష్ణుడు మూతికి తగిలి ఒక పన్ను ఉడిపోయింది. అతడు సిగ్గుపడి యింటికి వెళ్ళిపోయాడు. బోసినోటితో రాజసభకు వెడితే యీ సంగతి బయటపడుతుంది అని భయపడి బాగా ఆలోచించి, దుప్పి కొమ్ము విరగ దీసి, దానిని ఊడిపోయిన పంటి బదులు నోట్లో అమరుచుకున్నాడు.
ఏమి జరగనట్లుగా వెళ్లి రాజసభలో కూర్చున్నాడు. ఈ సంగతి అక్కడి వాళ్లందరికీ ఎలాగో తెలిసిపోయింది. రామకృష్ణుడు చేత అనేకసార్లు అవమానింపబడ్డ భట్టుమూర్తి లేచి,
"ఆ రవి, వీరభద్ర చరణాహతి డుల్లిన బోసి నోటికిన్
నేరడు రామలింగ కవి నేరిచెబో, మన ముక్కు తిమ్మన
క్రూర పదాహతిం, దెగిన కొక్కిరి పంటికి, దుప్పి కొమ్ము
పల్గారచియించిన్నాడు, రవి గానానిచో, కవిగాంచునే కదా "
అని చదివాడు.
దుక్షుడు యజ్ఞం చేస్తూ అల్లుడైన శివుణ్ణి పిలువలేదు. శివుని అనుమతి లేకుండా పార్వతి ఆ యజ్ఞం చూడటానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు సమస్త దేవతల ముందు శివదూషణ సాగించాడు. అది సహించలేక పార్వతి యజ్జగుండం లో దూకి ప్రాణం తీసుకుంది. ఈ సంగతి శివుడికి తెలిసి, ఆగ్రహం తో తలలోని జట నొకదానిని పీకి నేలకి కొట్టాడు.
అందులోనుంచి మహాభయాంకరుడైన వీరభద్రుడు పుట్టి, అట్టహాసం చేస్తూ వెళ్లి దక్షుణ్ణి చంపి, యజ్జo చూడవచ్చిన దేవతల్ని, ఋషుల్ని చితకోట్టాడు. ఆ సమయంలో సూర్యడికి మూతి పళ్ళు రాలిపోయాయి. అతడు బోసినోటితోనే వుండిపోయాడు
కాని ముక్కుతిమ్మన పావుకోడు దెబ్బకు పన్ను ఉడితే, వూరుకోక
రామకృష్ణుడు దుప్పికొమ్మ విరగదీసి పెట్టుకుని లోపం కనిపించనియ్యలేదు. రవి చేయలేని పని కవి చేసాడు కదా.
ఈ సంగతి విని రాయలవారు, సభాసదులు పొట్ట చెక్కలు అయ్యేడట్లు నవ్వుకున్నారు. ఈ కధలు ఎంత వరకు నిజమో చెప్పలేము.
7 భాగం సమాప్తం త్వరలో 8 వ భాగం.
(ఆధారం మా తండ్రిగారు శ్రీ జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన
-- శ్రీనివాసరావు జీడిగుంట)
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Commentaires