top of page

నిజాయతీ దారి తప్పితే

Writer's picture: Yasoda PulugurthaYasoda Pulugurtha

'Nijayathi Dari Thappithe' - New Telugu Story Written By Yasoda Pulugurtha

'నిజాయతీ దారి తప్పితే' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



ఆదిశేషయ్య తన నిస్సహాయ పరిస్తితికి చాలా వ్యాకుల పడుతున్నాడు. చిన్న చెల్లెలికి పెళ్లి అయ్యి సంవత్సరం దాటిపోయినా మొదటి పండుగకి బావగారు అడిగిన మోటార్ బైక్ ఇంకా కొనివ్వలేదు.


చెల్లెలు ఫోన్ చేసిన ప్రతీ సారీ "అన్నయ్యా ఆయన ఆఫీస్ కు బస్ లో వెళ్లలేకపోతున్నారు. మా వారి కొలీగ్స్ అందరూ బైక్ ల మీదా కార్లలోనూ ఆఫీస్ కు వస్తారుట. ఈయన చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారట అన్నయ్యా. మీ అన్నయ్య కు ఫోన్ చేసి చెప్పు తొందరలో కొనివ్వమని అంటున్నారంటూ".


ఎక్కడ నుండి తేవాలి డభై అయిదు వేల రూపాయలు? "మీరు డబ్బు పంపితే హోండా ఏక్టివా కొనుక్కోవాలని అనుకుంటున్నానని" బావ అనేక సార్లు మాటల్లో చెప్పడం విన్నాడు. తనది దిగువ మధ్య తరగతి కుటుంబం. తను చేసేది ఒక ప్రభుత్వ రంగ సంస్తలో పర్ ఛేజ్ డిపార్ట్ మెంట్ లో సెక్షన్ అసిస్టెంట్. తన మీద ఆధార పడ్డ వాళ్లు తల్లీ, భార్యా, కొడుకూ కూతురూ. అబ్బాయి ఇంటర్ రెండో సంవత్సరం. కూతురు తొమ్మిదో క్లాస్. తండ్రి అర్ధాంతరంగా చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ల వివాహ బాధ్యతా తనమీదే పడింది.


పెద్ద చెల్లి భర్త సంస్కార వంతుడు. చిన్న బావగారిలా గొంతెమ్మ కోరికలు కోరడు. తనేమిటో తన స్తితిగతు లేమిటో పూర్తిగా తెలుసును. చిన్న చెల్లి సుధ భర్త రఘు మాత్రం డబ్బు మనిషి. అతనే కాదు అతని కుటుంబం అంతా డబ్బు మనుషులే. ప్రతీ పండక్కీ ఇంటిల్లిపాదినీ పిలిచి మర్యాదలు చేయాలి, బట్టలు పెట్టాలి. పెట్టకపోతే సుధను సూటీపోటీ మాటలతో వేధిస్తారు. అది ఏడుస్తూ "మా అత్తగారు దరిద్రపు సంబంధం చేసుకున్నామని, ఏ అచ్చటా ముచ్చటలు లేవంటూ ఒకటే సాధిస్తున్నారని" చెపుతుంటుంటే తనేమీ మాటలాడలేక కృంగిపోతున్నాడు.


కష్టాలలో పుట్టి పెరిగిన ఆదిశేషయ్య కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తాడు. తమది ఎంతో గౌరవప్రదమైన కుటుంబం. కష్టపడి మంచి ఉద్యోగమే సంపాదించుకున్నా తన ఒక్కడి సంపాదనలో బాధ్యతలు చుట్టముడుతుంటుంటే ఏమి చేయాలో తోచని అసహాయ స్తితిలో ఉండిపోతున్నాడు. చెల్లెళ్లను సంతోష పెట్టాలని, అటువైపు నుండి ఏ మాటా రాకూడదని అల్లాడిపోతాడు.


ఎంతో నిజాయతీ పరుడిగా కష్టపడి పనిచేసే ఆదిశేషయ్య ఆ డిపార్ట్ మెంట్ లో అందరి మన్ననలనూ పొందాడు. వచ్చే ఉగాది నాటికైనా బావగారికి బైక్ కి కావలసిన డబ్బులు పంపడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆఫీస్ లో అప్పటికే అన్ని రకాల లోన్స్ తీసేసుకున్నాడు. ఆరోజు ఆదిశేషయ్య ఆఫీస్ కి రాగానే మేనేజర్ విశ్వనాధ్ తనని వెంటనే కలవమవి ఇంటర్ కమ్ లో చెప్పాడు.


అదురుతున్న గుండెలతో మేనేజర్ కేబిన్ లోకి అడుగుపెట్టాడు. "ఏమిటిది ఆదిశేషయ్యగారూ, ఆర్.కె. ఎంటర్ ప్రైజ్ కి ఆర్డర్ ఇవ్వాలన్న మీ రికమెండేషన్ చూసాను. ఆర్డర్ ఫైనల్ చేసి సంతకం చేసే ముందు మీతో మరొక్కసారి మాట్లాడాలని పిలిచాను".


"అవును సర్, టెండర్ ఓపినింగ్ లో వాళ్లదే లోయస్ట్ ప్రైస్ కదా సర్"?


"అది సరేనండీ, ఒప్పుకుంటాను. మిగతా పేరామీటర్స్ చెక్ చేయలేదా"?


ఆదిశేషయ్య ముఖం తెల్లగా పాలిపోయింది. ఒంటి నిండా చమటలు పడుతున్నాయి. "వాళ్లతో మనకు ఉన్న గత అనుభవాన్ని పరిశీలిస్తే వాళ్లు సరైన టైమ్ లో మనకు మెటీరియల్ సప్లై చేయలేరన్న విషయం మనకు విదితమే కదా"? ఎన్ని సార్లు వాళ్లు డెలివరీ స్కెడ్యూల్ ని స్కిప్ చేసారు. మన ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్లు మెటీరియల్ అర్జంట్ అంటూ మన పీకల మీద కూర్చోడం, మనం సర్ది చెప్పలేకపోవడం, ఆర్డర్ కేన్సిల్ చేయమంటూ మన మీద ఒత్తిడి తేవడం, ఇవన్నీ గుర్తులేవా మీకు? వెండార్స్ లిస్ట్ నుండి ఆ కంపెనీను ఎలిమినేట్ చేయమని కూడా ఫోర్స్ చేసారు. "పైగా ఒకటా రెండా, వెయ్యి టన్నుల కాపర్ మెటీరియల్. ఇప్పుడూ అదే సమస్య వస్తే మేటర్ యూనియన్ వరకు వెళ్లిపోతుంది. మీ ఉద్యోగానికి నా ఉద్యోగానికి తిదోదకాలు ఇచ్చుకోవాలి".


"సర్ గుర్తున్నాయి. కాని గత ఒకటి రెండు సంవత్సరాలనుండి వాళ్ల సప్లై పొజిషన్ గేర్ అప్ అయింది. నేను బాగా స్టడీ చేసాను. ఈ మధ్య కాలంలో ఎవరెవరకి వాళ్లు ఎంత సమయంలో సప్లై చేసేరోనని. ఈసారి అలా జరగదని ఆ కంపెనీ మేన్యుఫేక్చరింగ్ హెడ్ ఫోన్ చేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. మీరు ఊహించినంతగా భయపడాల్సిన పనిలేదు".


"సరే ఆదిశేషయ్యగారూ, మీరు అంతగా చెపుతుంటే ఎలా కాదంటాను? సంతకం చేసి డిస్పాచ్ సెక్షన్ కి పంపుతాను". మీరు వెళ్లచ్చంటూ ఆదిశేషయ్యను పంపించివేసాడు.


ఆదిశేషయ్య మాటల్లో ఏదో ఒకలాంటి తత్తరపాటు, చిన్నపాటి వణుకు విశ్వనాధ్ తృటిలో కనిపెట్టగలిగాడు. ఏ విషయానైనా సూక్ష్మంగా గ్రహించగలిగే నేర్పు ఉంది ఆయనలో. నిజాయితీకి మారుపేరైన ఆదిశేషయ్య మీద ఆయనకు అపారమైన గౌరవం. ఆదిశేషయ్య స్తానంలో మరొకరు ఎవరైనా ఉంటే తన అనుమానం అక్కడకక్కడే నివృత్తి అయిపోయేది.


టెండర్స్ ను తణిఖీ చేసే సెక్షన్ లో ఆదిశేషయ్య పనిచేస్తున్నాడు. ఎన్నో పెద్ద పెద్ద టెండర్స్ ను క్షుణంగా పరిశీలించి వెండార్స్ ఆధారాలను, వాళ్ల స్తితిగతులను అంచనా వేయడంలో అతన్ని మించిన వారెవరూ లేరు. అన్నీ ఫైనలైజ్ చేసి ఆర్డర్స్ మీద సంతకాలకోసం మేనేజర్ కి పంపిస్తే ఆదిశేషయ్య మీద ఉన్న నమ్మకంతో మేనేజర్ సంతకాలు చేసేస్తాడు. ఈసారి మేనేజర్ విశ్వనాధ్ కి గత తాలూక అనుభవం గుర్తొచ్చి ఆదిశేషయ్యను పిలిపించాడు.


ఆరోజు రాత్రి విశ్వనాధ్ భార్యతో కలసి మినర్వా కాఫీ షాప్, సోమాజిగూడా కి డిన్నర్ కి వెళ్లాడు. ఫేమిలో రూమ్ లో కూర్చున్న ఆయనకు గ్లాస్ డోర్ నుండి చూస్తే బయట ఒక టేబిల్ దగ్గర ఆదిశేషయ్య ఒక వ్యక్తితో కనిపించాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరా వ్యక్తి అనుకుంటూ పరిశీలనగా చూస్తే తమ డిపార్ట్ మెంట్ కు తరచుగా బ్రీఫ్ కేస్ పట్టుకుని టక్ చేసుకుని వచ్చే ఆర్.కె. ఎంటర్ ప్రైజస్ రిప్రజెంటేటివ్ గా గుర్తించాడు. ఇతనితో ఇక్కడ ఆదిశేషయ్యకు పనేమిటోనని తలబోసేసరికి అతని లో ఉన్న చిన్నపాటి అనుమానం పెరిగి మహా వృక్షం అవడం మొదలు పెట్టింది.


తన పనేమిటో తాను చూసుకుంటూ ఇల్లూ ఆఫీస్ తప్ప మరో వ్యాపకం లేని ఆదిశేషయ్య, అదీ అంతకముందు రోజున తామిద్దరి మధ్య జరిగిన ఆర్డర్ ఫైనలైజ్ విషయమే కాకుండా ఆర్.కె ఎంటర్ ప్రైజస్ పట్ల ఫేవర్ గా మాట్లాడిన ఆదిశేషయ్య మాటలు గుర్తొచ్చాయి. విశ్వనాధ్ కి ఏదో అర్ధమైంది.


ఆ తరువాత ఒకటి రెండు రోజుల నుండి ఆదిశేషయ్య ఎందుకో చాలా డల్ గా కనిపిస్తున్నాడు. ఆఫీస్ లో ఉన్నంత సేపు అందరితో సరదాగా మాట్లాడే అతను చాలా మౌనంగా అయిపోయాడు. ఆఫీస్ అయిన తరువాత ఇంటికి వెళ్లే అతనికి ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు. ఏదో తప్పుచేసానన్న భావన అతన్ని కృంగతీస్తోంది. ఆరోజు రాత్రి ఎక్కడెక్కడో తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ఇల్లుచేరాడు. ఇల్లంతా నిశ్శబ్ధంగా గంభీరంగా ఉంది. అతన్ని చూడగానే అతని తల్లి శాంతమ్మ ఎదురొచ్చింది. ఆవిడ కళ్లు ఏడ్చినట్లుగా ఉబ్బిపోయి ఉన్నాయి.


"ఒరేయ్ శేషూ, మీ మేనేజర్ గారు నీ కోసం వచ్చి ఇంతవరకూ కూర్చుని ఒక పది నిమిషాల క్రితమే వెళ్లిపోయారు. రేపు ఆఫీస్ లో మాట్లాడతానన్నారు రా".


ఈ లోగా అతని భార్య జానకి వచ్చింది. ఆవిడ ముఖంలో కూడా బాగా ఏడ్చిన గుర్తులు కనబడుతున్నాయి. పిల్లలిద్దరూ తండ్రి ముఖం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. "మన ఆర్ధిక పరిస్తితులు గురించి కుటుంబ విషయాలు గురించి తెలుసుకున్నారు రా అబ్బాయ్".


"నాకు పరాయి వ్యక్తిగా తోచలేదు ఆయన. నాకు మరో కొడుకులా అనిపించాడు. మీకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయా అని అడిగాడు". "చెప్పాను రా శేషూ, ఒక్కడి చేతుల మీదుగా ఈ సంసారం నడుస్తోందని. నాకు తెలియకుండనే నీవు పడుతున్న కష్టాలను అలా చెప్పుకుంటూ పోయానురా శేషూ. నన్ను తప్పు పట్టవు కదూ"?


'నిజాయితీకి మారుపేరు అనిపించుకుంటున్న మీ శేషూ ఆర్ధిక పరిస్తితులను ఎదిరించలేక లంచాలకు ఆశపడుతున్నాడమ్మా అనే సరికి తెల్లబోయాను. ఇదే అలవాటైతే అతని ఉద్యోగం ఊడిపోతే మీరంతా రోడ్డున పడతారని చెప్పాడు'. ఆవిడ చెంగుతో కళ్లు వత్తుకుంటోంది. జానకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది.


"మీ అల్లుడికి మోటార్ బైక్ ఇవ్వకపోతే ఏమౌతుందుట? అతని కోరిక తీర్చడం కోసం మీ అబ్బాయి బలి అయిపోవాలా అంటూ" మీ చిన్న బావ ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడాడురా.


"నీ మేనేజర్ నని చెపుతూ, ఇలా కట్నాలూ కానుకలు కోసం అత్తవారిని పీడిస్తున్నావని పోలీస్ కేస్ పెడ్తానన్నాడు".


"బావ ఉద్యోగం ఊడపీకిస్తానంటూ చాలా సేపు గట్టిగా బెదిరించాడురా. అవతల రఘు చేత సారీ ఇంక అలా అడగను అనేవరకు వదలలేదురా అబ్బాయ్".


తల్లి మాటలు విన్న ఆదిశేషయ్య ముఖంలో నెత్తురుచుక్క లేనట్లుగా పాలిపోయింది. కన్నీళ్ళతో తన ముందు నిలుచున్న తల్లి, భార్య, పిల్లలకు సమాధానం ఇవ్వలేని నిస్సహాయతతో కృంగిపోయాడు. మౌనంగానే వాళ్ళ కళ్ళు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలను ఎదుర్కోలేక భుమిలోకి కృంగిపోతే బావుండని లోలోపలే దుఃఖిస్తున్నాడు.


"తను పొరపాటు చేసాడు. తను చేసిన తప్పుకి ప్రాయశ్చితం లేదు"! మరునాడు ఆదిశేషయ్య ఆఫీస్ కి వెళ్లగానే విశ్వనాధ్ తన కేబిన్ లోకి రమ్మనమని పిలిచాడు. చాలా తప్పుచేసానన్న ఫీలింగ్ తో ఆయన ముందు నిలుచున్నాడు.


"కూర్చోండి ఆదిశేషయ్యగారూ. ఆరోజు ఆర్డర్ మీద సంతకం చేయకుండా పెండింగ్ పెట్టాను. మీలోని తొట్రుపాటు, చిన్నపాటి భయం నన్ను ఆలోచింపచేసింది. ఏదో అనుమానం కలిగింది. దానికితోడు ఆ మరునాడు మినర్వా కాఫీ షాప్ లో మీతో ఒక వ్యక్తిని అదే ఆర్.కె. ఎంటర్ ప్రైజస్ రిప్రజంటేటివ్ ని చూడగానే నా అనుమానం నివృత్తి అయింది".


"సరే, ఈ సారి మీ బావగారి కి ఇవ్వాలసిన కానుక కోసం డభై అయిదువేలు లంచం తీసుకుంటారు. ఆనందమే. పాపం మీ బావగారూ సంతోషిస్తారూ, మీ చెల్లెలి అత్తగారూ మీ చెల్లిని నెత్తిన పెట్టుకుంటారు. కానీ మరోసారి మరో విలువైన కానుక కావాలంటూ, లేకపోతే మీ చెల్లిని పుట్టింటికి పంపేస్తానంటే మరో లంచం కోసం ప్రయత్నిస్తారా"?


"ఏం మీ చెల్లెలి భర్తకు ఇవ్వలేనని చెప్పలేరా"? నేను ఆ రోజు ఆ ఆర్డర్ మీద సంతకం చేసేస్తే ఇప్పటికే ఆ విషయం ఎంత పెద్దది అయ్యేదో తెలుసా? ఆ ఆర్.క్ కంపెనీ వాడిని పిలిపించి బెదిరించి మరీ అడిగితే చెప్పాడు. ఆర్డర్ వాళ్ల కంపెనీకి ఇస్తే లక్షరూపాయలు కేష్ మీకిస్తానని చెప్పానని. మీకిచ్చిన ఎడ్వాన్స్ ఏభై వేలు అతనికి తిరిగి ఇచ్చేయండి వెంటనే.


"మన ఆర్ధిక స్తోమతుని దృష్టిలో పెట్టుకుని జీవించాలండీ ఆదిశేషయ్యగారూ. మీరు సిటీ బస్ లో వస్తూ మీ బావకి హోండా మోటార్ బైకా? దానికోసం ఎప్పుడూ లేనిది లంచాలకి ఆశపడడమా"? "నిజాయితీగా పనిచేసుకోండి. మన నిజాయితీనే మనకు శ్రీరామ రక్ష".


"కష్టాలు కలకాలం ఉండవండీ. ఈ సారి జరగబోయే ఆఫీసర్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అవడానికి ప్రయత్నించండి". 'ఆల్ ది బెస్ట్' అంటూ సాగనంపుతున్న ఆయన పాదాలకు నమస్కరించాలన్న ఉద్వేగం కలిగింది ఆదిశేషయ్యకు.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









50 views0 comments

Comments


bottom of page