top of page
Writer's pictureNDSV Nageswararao

సేవే మా ధ్యేయం

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Seve Ma Dhyeyam' - New Telugu Story Written By  NDSV Nageswararao

Published In manatelugukathalu.com On 01/02/2024

'సేవే మా ధ్యేయం' తెలుగు కథ

రచన:  NDSV నాగేశ్వరరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



'హలో నమస్తే సార్! సుబ్రహ్మణ్యం గారా?'


'హలో, ఎవరూ? నేను సుబ్రహ్మణ్యాన్నే మాట్లాడుతున్నాను.'


'సార్! నేను 'సేవే మా ధ్యేయం' సంస్థ నుంచి మాట్లాడుతున్నాను.'


'అవునా! దేని గురించి? నేను చందాలు అవీ ఏవీ ఇవ్వను. సారీ'


'సార్, సార్, ఒక్క నిమిషం. నేను చందాల కోసం కాదు సార్. మీరు మర్చిపోయినట్లున్నారు. క్రిందటి వారం మీ సొసైటీలో వైద్య శిబిరం నిర్వహించాము. గుర్తుందా?'


'ఓహో.... మీరా గుర్తొచ్చింది. ఆ చెప్పండి.'


'అదే సార్, ఆరోజు మీకు చెప్పాం కదా, ఏమైనా టెస్టులు కొన్ని అదనంగా చేయవలసి వస్తే, మీ దగ్గర ఆ డబ్బులు తీసుకుంటామని.'


'అవునవును గుర్తుంది. కానీ, ఇంకా టెస్టుల రిపోర్టులు రాలేదు కదా.'


'అవును సార్. మీ టెస్టుల్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అందుకే మరికొన్ని టెస్టులు చేసాం. దానికి సంబంధించి మీరు 250 రూపాయలు మాకు కట్టాలి.'


'ఓస్ ఇంతేనా. అలాగే, ఎలా పంపమంటారు?'


'మీకు ఆ శ్రమ అవసరం లేదు సార్. మీకు ఇప్పుడు ఒక ఓటిపి వస్తుంది, అది నాకు చెప్తే నేను బ్యాంకు ద్వారా 250 రూపాయలు మీ అకౌంట్ నుంచి మా సంస్థ అకౌంట్ కి వేస్తాను.'


'సరే అయితే. ఆ... ఇప్పుడే నెంబర్ వచ్చింది.'


'ఆ చెప్పండి సార్.'


'అది.....3 5 9 0 1 2' 


'సరే సార్. థాంక్యూ మీ రిపోర్టు తొందరలోనే పంపిస్తాం.'


'థాంక్యూ సర్.'

……………….

సుబ్రహ్మణ్యం ఒక్కసారి వారం వెనక్కి వెళ్ళాడు. ఆ రోజు అపార్ట్మెంట్ వాళ్ల సొసైటీ బిల్డింగ్ లో చాలా కోలాహలంగా ఉంది. 'సేవే మా ధ్యేయం' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆరోజు సీనియర్ సిటిజన్లకి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ సంస్థ సభ్యులు సొసైటీ ప్రెసిడెంట్ ని కలిసి, ఆ కాంప్లెక్స్ లో ఉన్న సీనియర్ సిటిజన్లకి అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని చెప్పారు. దానికి అయ్యే అన్ని ఖర్చులు మరియు ఏర్పాట్లు హైదరాబాదులో ఉన్న ప్రముఖ ఆరోగ్య సంస్థ భరిస్తుందని, వీరు శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాద్ పంపిస్తారని చెప్పారు. దీనివల్ల 'ఆ ఆరోగ్య సంస్థకు ఏమి లాభం?' అని ఆచూకీ తీస్తే, త్వరలో ఈ పట్టణంలో కూడా వాళ్ళ బ్రాంచ్ ప్రారంభించాలని అనుకుంటున్నారని, దానికి ఈ వైద్య శిబిరం ఒక రకమైన ప్రచారం అని అర్థమైంది. 


ఈ కాలంలో ఎవరైనా సేవా దృక్పథంతో చేస్తున్నారంటే, దాంట్లో ఎంతో కొంత వ్యాపార ధోరణి కూడా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే తమ సభ్యులకు ఉచిత సేవలు అందుకోవడంలో ఏ విధమైన ఇబ్బంది లేదు అనిపించి, సొసైటీ ప్రెసిడెంట్ మిగతా సభ్యులతో సంప్రదించి, వారి ప్రతిపాదనకు అంగీకారం తెలిపాడు. అనుకున్నట్టుగానే ఆ సంస్థ వైద్య శిబిరం నిర్వహించింది. దాంతో ఆరోజు చాలామంది తమ శాంపిల్స్ ఇచ్చారు.


ఆలోచనలో ఉన్న సుబ్రహ్మణ్యం, ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో ఉలిక్కిపడి చూసాడు. దాంట్లో తన అకౌంట్ నుంచి 25000 విత్ డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం. వాళ్ళు 250 కదా చెప్పారు, 25000 ఎలా అయింది? మరోసారి కళ్ళజోడు సవరించుకొని మెసేజ్ మళ్లీ చదవాడు. అది చాలా క్లియర్ గా ఉంది 25, 000. ఏం చేయాలో పాలుపోలేదు సుబ్రహ్మణ్యానికి.



మరోసారి ఆరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ఆ సంస్థ వాళ్ళు శాంపిల్స్ తీసుకునేటప్పుడు తమ వివరాలని కలెక్ట్ చేసారు. అంటే, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఇలా మరి కొన్ని వివరాలు. సంస్థ తమకు ఉచితంగా అన్ని సేవలు చేస్తోంది అనే ఉద్దేశ్యంతో ఎవరూ ప్రత్యేకంగా ప్రశ్నించకుండానే, వివరాలను ఇచ్చారు. కానీ తన ఫ్రెండ్ కృష్ణమూర్తి మాత్రం ఒప్పుకోలేదు. 'వైద్య పరీక్షలకి పేరు, చిరునామా, అవసరమైతే వయస్సు, ఇంకా అవసరం అయితే ఫోన్ నెంబర్ కావాలి గానీ, మిగతావన్నీ ఎందుకు ఇవ్వాలి?' అని ప్రశ్నించాడు. 


సంస్థ వారు ఏమైనా అదనపు టెస్టులు చేస్తే, వాటి ఖర్చులు వసూలు చేసినప్పుడు, ఆ డబ్బులు ఎవర్నించి వచ్చిందో తెలుసుకునేందుకోసం, అకౌంట్ నెంబరు ఇతర వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. దాంతో మిగతా వారంతా కృష్ణమూర్తి మాటని కొట్టి పడేశారు. చేసేదిలేక కృష్ణమూర్తి ఒక్కడూ టెస్టులు చేయించుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు.


సుబ్రహ్మణ్యం తను 'అన్ని వివరాలూ ఇచ్చి తప్పు చేశానా' అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఈ లోపున మరో మారు ఫోన్ మోగింది. నెంబర్ చూడగానే అర్థమైంది, ఇందాకటి వ్యక్తే మళ్ళీ ఫోన్ చేశాడు.


ఆదుర్దాగా ఉన్న సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా ఫోన్ తీసుకుని, అవతల వ్యక్తి మీద విరుచుకుపడ్డాడు.

'మీరు 250 అని చెప్పి, 25000 ఎందుకు నా అకౌంట్ నుంచి విత్ డ్రా చేశారు?'


'సారీ సార్. అది చెబుదామనే మీకు ఫోన్ చేశాను. నేను 250 పాయింట్ సున్నా సున్నా అని రాసిస్తే, పొరపాటున మా క్లర్క్ 25000 అని కొట్టాడు. అందుకనే ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయడానికి మీకు మళ్ళీ ఫోన్ చేసాను. ఇప్పుడు మీకు మరో ఓటిపి వస్తుంది. అది కనుక చెప్తే ఆ 25000 రివర్స్ అయిపోతుంది. తప్పు జరిగి మీకు ఇబ్బంది కలిగించాను కాబట్టి, ఆ 250 మా సంస్థ భరిస్తుంది. మళ్లీ క్షమించండి సార్. ఓటిపి నెంబర్ చెప్పండి.'


అతని మాటలతో స్థిమిత పడ్డ సుబ్రహ్మణ్యం ఫోన్లో వచ్చిన ఓటీపీ చూసి, 'సార్ రాసుకోండి. 8 5 9 4 1 2. ఈసారి మాత్రం ఏమీ పొరపాటు చేయకండి సరేనా.'


'అలాగే సార్! ఈసారి పొరపాటు జరగదు. మీ రిపోర్టులు త్వరలోనే పంపిస్తాను.'


అమ్మయ్య అనుకుంటూ ఫోన్ పెట్టాడు సుబ్రహ్మణ్యం.


అదే క్షణంలో బ్యాంక్ అకౌంట్ లో మరో 25 వేలు విత్ డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఈసారి మరింత కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం. కానీ ఇంతకుముందు జరిగినట్టుగానే మళ్లీ పొరపాటు చేశారేమో, ఒకసారి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది అని ఆ నెంబర్ కి ఫోన్ చేశాడు. ఫోను స్విచ్ ఆఫ్ చేసినట్టుగా మొబైల్ సమాచారం వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఫోను పలకడం లేదు. ఈసారి సుబ్రహ్మణ్యం తను 'మోసపోయానా!' అనే ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిది ఒకసారి కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజు అకౌంట్ నెంబర్ ఇవ్వని ఒకే ఒక వ్యక్తి కృష్ణమూర్తి.


పరుగు పరుగున కృష్ణమూర్తి ఫ్లాట్ కి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. అతని గాబరా చూసిన కృష్ణమూర్తి, మంచినీళ్లు ఇచ్చి కూర్చోబెట్టి, విషయం కనుక్కున్నాడు. అతనికి వెంటనే అర్థమైంది సుబ్రహ్మణ్యం మోసపోయాడు అని. అతను అవతల వ్యక్తికి ఓటిపి చెప్పాడు కాబట్టి, అతని అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసి ఉంటారు. ఎందుకంటే అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ మొదలైన వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి.

 

'ఇప్పుడు ఏం చేయాలి?' అని అడిగాడు సుబ్రహ్మణ్యం. 'నాకు తెలిసి మీ సమస్యకి పరిష్కారం లేదు. ఎందుకంటే బ్యాంకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి, మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ అందజేయొద్దు అని. అయినా సరే వినకుండా మన సభ్యులంతా అన్ని వివరాలు వాళ్ళకి రాసి ఇచ్చారు. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పటికే మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు లాగే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా మనం సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి, అతనికి విషయం చెప్పి మనవాళ్ళందరినీ ఎలర్ట్ చేయాలి. లేదంటే సాయంత్రం లోపు అందరి అకౌంట్లూ ఖాళీ అయిపోవచ్చు.' 


వెంటనే ఇద్దరూ వెళ్లి, సొసైటీ ప్రెసిడెంట్ ని కలిసారు. విషయం తెలుసుకుని ఒక్కసారిగా ఖిన్నుడైపోయాడు సొసైటీ ప్రెసిడెంట్. ఈ తప్పులో తన భాగం కూడా ఉండడం అతన్ని బాధించింది. వెంటనే సొసైటీ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు 'ఎవరికైనా ఓటీపీ నెంబర్ చెప్పమని 'సేవే మా ధ్యేయం' సంస్థ నుంచి ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని.' అలాగే వెంటనే మరో నలుగురిని పిలిచి, విషయం చెప్పి, అందరిని తలో ఫ్లోర్ కు వెళ్లి, అందరికీ అర్థమయ్యేలా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పమని ఆదేశించాడు. 


పావుగంటలో ఈ వార్త మొత్తం అన్ని అపార్ట్మెంట్లు సభ్యులకి చేరింది. అప్పటికే మరో నలుగురు తమ ఓటిపి చెప్పి మోసపోయారని వార్త వచ్చింది. అదే సమయంలో, తమ దగ్గర ఉన్న సంస్థ వివరాలతో వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకులో కూడా వివరాలు అందజేయడం జరిగింది. అలాగే మరో కొంతమంది మోసపోయే అవకాశం ఉండడంతో, ఈ వార్త కేబుల్ టీవీ ద్వారా, ఇతర మీడియా ద్వారా ఊర్లో అందరికీ చేరేలా చూసాడు కృష్ణమూర్తి.


ఏది ఏమైనా ఉచితానికి ఆశపడి, వివరాలన్నీ చెప్పి, చదువుకుని కూడా విజ్ఞత ప్రదర్శించలేని తమలాంటి వాళ్ళు మోసపోతూనే ఉంటారని సుబ్రహ్మణ్యం అర్థం చేసుకున్నాడు. ఇకమీదట తనలాగా ఎవరికి జరగకూడదని, దానికి తగిన చర్యలు ప్రతివాళ్ళూ తీసుకోవాలని, తనకు తెలిసిన స్నేహితులందరికీ చెబుతూ వస్తున్నాడు సుబ్రహ్మణ్యం. 


అతని మాటలు విన్న ఒక మిత్రుడు అన్నాడు, 'నీకు గుర్తుంటే ఆరోజు వైద్య శిబిరం నిర్వహిస్తున్నప్పుడు మాట్లాడిన యాంకర్ చాలాసార్లు చెప్పింది షేవే మా ధ్యేయం అని. తనకి భాష రాదు అని మనం నవ్వుకున్నాం. కానీ, విషయం చెప్పకనే చెప్పింది, 'షేవే (shave) మా ధ్యేయం' అనీ, మనకే అది అర్థం కాలేదు.'

************


NDSV నాగేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు NDSV నాగేశ్వరరావు.

వృత్తి రీత్యా ప్రభుత్వ రంగ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా ముంబై లో పనిచేస్తున్నాను.

పదిహేనేళ్ల వయస్సు నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించాను.

కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వ్రాసాను, వ్రాస్తున్నాను. కంద పద్యం అంటే ఇష్టం. వారానికో వాట్సాప్ కథలుగా అరవైకి పైగా కథలు వ్రాసాను. తెలుగులోనే కాకుండా ఇంగ్లీషు, హిందీ, తమిళంలో కథలు వ్రాసాను.

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు 'నేను సైతం' యూ ట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన జనవరి 2022 సంక్రాంతి కథల పోటీ లో ప్రోత్సాహక బహుమతి మరియు 'సంక్రాంతి సాహిత్య కథా రత్న' పురస్కారం లభించింది. స్టోరీ మిర్రర్ వారి ఇంగ్లీషు కథల పోటీల్లో పలు బహుమతులు లభించాయి. గత ముప్పై ఏళ్లుగా అడపా దడపా ఏదో ఒక బహుమతి వచ్చింది.

నటన నా మరో ప్రవృత్తి. ఆల్ ఇండియా రేడియో నాటకాలలో, స్టేజి మీద మరియు టివీ ఛానళ్లలో నటించాను.

మీ

NDSV నాగేశ్వర రావు


207 views6 comments

6 Comments



@djyothi4158

• 15 hours ago

కథ చాలా బాగుంది అండి ఈ కథ విన్న వారికి మంచి మెసేజ్ కూడా అందించిన వారు అవుతారు అండి ధన్యవాదములు అండి

Like
ndsvnrao
Feb 03
Replying to

ధన్యవాదాలు

Like

Sir, కథ కాదు.. ఇది నిజం. కథ అని చెబుతూ పాఠకుల్లో అవగాహన కలిపిస్తున్నారు. Great.


Edited
Like
ndsvnrao
Feb 02
Replying to

మీ స్పందనకు ధన్యవాదాలు

Like

మంచి కథ వ్రాసారు సార్. మధ్య ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. అందరికీ అకౌంట్ నెంబర్, OTP చెప్పకూడదని చెప్పినా వీళ్ళు ఇస్తుంటారు. ఇవ్వకుంటే ఏదో ఒక మతలబు చేసి చెప్పించుకుంటారు.

Edited
Like
ndsvnrao
Feb 01
Replying to

మీ స్పందనకు ధన్యవాదాలు

Like
bottom of page