top of page

జీవికి అమ్మే సర్వస్వం



'Jeeviki Amme Sarvasvam' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 31/01/2024

'జీవికి అమ్మే సర్వస్వం' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఇమ్మహి జీవుల పుట్టుక

అమ్మయె కారణ మనగను అందరు ఎరుగన్

అమ్మను గానని సుతులును

ఇమ్మహి ఉందురు కనగను ఈలయు లేకన్

కనగను వారిని ఎపుడును

మనిషిగ జూడక మెలుగుట మంచిది ఎరుగన్

కనబడి నంతనె అతనిని

జనముయు దూరము నిలుపుటె జంతువు అనుచున్

కనపడు దైవము అమ్మని

అనుమిక ఎపుడును మరువక ఆమెను నీవున్

క్షణముయు చంకను దించక

జననియె బెంచును శిశువుల జనులును దెలియన్

తనయుల బాధను ఓర్వదు 

జననియె జగమున కనగను జాగ్రత పడుచున్

ధనమన అమ్మకు సంతుయె

వనధిని మించిన మురిపెము పడునన అమ్మే

కమ్మని తిండియు బెట్టును   

కమ్మని నిదురయు చవిగొన కాంచును అమ్మే

అమ్మను మించిన దేదియు 

ఇమ్మహి దొరకదు వెతకను ఇచ్చయు  తీరున్

అందల మనగను అమ్మొడి

మందిర మనగను మనిషికి మాతయు దరియే

ఎందరు తనయుల గన్నను

పొందెడు అభినుతి కనగను పొరపొచ్చ మనకన్ 

అటువంటి తల్లితొ ఎపుడును

పటుతర భాగ్యము గలుగను పలుకుము ప్రీతిన్

కుటిలపు బుద్ధిని వదలుచు

దిటవుగ మెలుగగ జననితొ దిష్టము కలుగున్ 

అమ్మయె సకలము జీవికి 

అమ్మయె రక్షణ మనిషికి అన్నిటి యందున్

అమ్మయె ఇచ్చిన దేహము 

అమ్మయె పెంచును అమృతము  అందగ జేసిన్


--సుదర్శన రావు పోచంపల్లి


25 views0 comments
bottom of page