top of page

పెళ్ళిచూపులు'PelliChupulu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 05/06/2024

'పెళ్ళిచూపులు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్"ఒరేయ్ సుందు.. ! నీకు పెళ్లి అవట్లేదని నాకు చాలా బెంగగా ఉందిరా.. " అంది జానకమ్మ


"ఎందుకే అమ్మా.. ! నాకు పెళ్లి ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది.. నువ్వు బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకుంటే, చాలా కష్టం.. ఎవరో అమ్మాయి నా కోసం పుట్టే ఉంటుంది లే.."


"అది కాదు రా.. నీకు ఎందుకు పెళ్లి అవట్లేదో నీకు తెలుసు.. ! నాకు తెలుసు.. !"


"అయితే ఏం చెయ్యమంటావు..? కొంత మంది సన్నగా ఉంటారు..నేనేమో బొద్దుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి నేతి సున్నుండలు తెగ తినిపించావు.. అందుకే ఇలా అయిపోయానేమో.. "


"నిన్ను చూసిన అందరూ.. అబ్బాయి బాగున్నాడు కానీ.. అని మాట్లాడుకుంటున్నారు. అందుకే, ఈ సారి పెళ్ళిచూపులు కాఫీ షాప్ లో ఏర్పాటు చేసాను. రాకరాక చాలా రోజులకి నీకు ఒక సంబంధం వచ్చింది. నీ ఫోటో కూడా వారికి పంపలేదు. అక్కడ మీ ఇద్దరే ఉంటారు.. జాగ్రతగా మేనేజ్ చేసి.. ఈ సంబంధం 'ఓకే' చేసుకోరా బాబూ.. నా బాధ్యత కూడా తీరిపోతుంది.. "


"అలాగే ట్రై చేస్తాను అమ్మా.. ! ఇంతకీ పెళ్ళిచూపులు ఎప్పుడు.. ? ఎక్కడ.. ?"


"రేపే రా.. ఫేమస్ కాఫీ షాప్ లో.."


"మరి ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టడం..?"


"అమ్మాయి గ్రీన్ కలర్ చుడీదార్ లో వస్తానని చెప్పింది.. పేరు కళ్యాణి.."


"ఈ డీటెయిల్స్ చాలు.."


"రేపు కొంచం నీట్ గా రెడీ అయి.. టీ షర్ట్ వేసుకో.. ముప్పై ఐదైనా, పాతిక లాగ కనిపిస్తావు. ఆ టోపీ కూడా పెట్టుకుని వెళ్ళు.. ఆ బట్టతల కనిపించదు.."


"అలాగే లేవే.. నా గురించి అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యకు.."


"నువ్వు ఎలా ఉన్నా.. నాకు ముద్దుల కొడుకువే. కానీ అమ్మాయి కి నచ్చడం కోసం ఇవన్నీ తప్పవు. మీ నాన్న ఇప్పుడు ఉండి ఉంటే, నిన్ను ఇలా వదిలేస్తారా చెప్పు..? ఈ పాటికే నీకు పెళ్ళి అయిపోయి ఉండేది.."


"ఏం చేస్తాం చెప్పు అమ్మా.. ! నాన్న యాక్సిడెంట్ లో చనిపోవడం మన దురదృష్టం.. "

"మీ నాన్న కూడా నీలాగే ఉండేవారు కదా.. నీకూ అదే పోలిక వచ్చిందేమో. బట్టతలతో, బొద్దుగా ఉండేవారు. అలా ఉండే, నన్ను ప్రేమించారు. నా మనసు దోచారు. అప్పట్లో మీ నాన్నని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని నేను మా ఇంట్లో చెప్పేసాను. మొత్తానికి మీ నాన్నని నేను పెళ్ళి చేసుకోలేదూ.. ? మీ నాన్నలాగే నీదీ మంచిమనసు.. నీకూ మంచి అమ్మాయి దొరుకుతుంది.."


మర్నాడు అమ్మాయిని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్ళాడు సుందరం.. 


‘అక్కడ ఎవరో అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంది. ఎదురుగా ఎవరూ లేరు.. కుర్చీ ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి ముఖం లో ఏదో టెన్షన్ కనిపిస్తోంది. నా ఫోటో కూడా చూడలేదుగా.. నేను ఎలా ఉంటానో అని తెగ అలోచిస్తునట్టుగా ఉంది.. డౌట్ లేదు, ఈ అమ్మాయి.. ఆ అమ్మాయే. నేనెవరో చెప్పకుండా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి.. ' అని మనసులో అనుకున్నాడు సుందరం 


"ఇక్కడ కూర్చోవచ్చా మిస్..?" అని సుందరం అమ్మాయిని అడిగాడు.

 

"కూర్చోండి.." అని అమ్మాయి సైగ చేసి చెప్పింది.

 

"ఏమిటి మిస్.. డల్ గా ఉన్నారు..? ఎనీ ప్రాబ్లం..?" అడిగాడు సుందరం.

 

"అయినా మీకెందుకు.. నేను ఎలా ఉంటే..?"


"మీ ఫేస్ కి అలా డల్ గా ఉండడం సూట్ కాలేదు. నా గురించి మీకు చెప్పనేలేదు కదా; నేను ఒక ప్రైవేటు కంపెనీ లో జాబ్ చేస్తాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనేది నా ఫిలాసఫీ.. ఇప్పటికైనా చెప్తారా ఎందుకు అలా ఉన్నారో..?"


"నా జీవితానికి సంబంధించి ఒక వ్యక్తిని కలుసుకోవాలని వచ్చాను.. అందుకే వెయిట్ చేస్తున్నా.."


మరోసారి ఆ అమ్మాయి.. తనే అని కన్ఫర్మ్ చేసుకుని సంబరపడ్డాడు సుందరం.. 


"ఎందుకండీ బాధపడతారు.. చూస్తే మీరు చాలా మంచివారి లాగా ఉన్నారు. మీకు అంతా మంచే జరుగుతుంది లెండి.. కొంచం స్మైల్ ఇవ్వరాదూ.." అన్నాడు సుందరం.


ఎదురుగా అమ్మాయి ముఖంలో కొంచం నవ్వు ప్రవేశించింది.. 


"అలా నవ్వితే మీరు చాలా బాగున్నారు. నవ్వుతూ బతకాలనేది నా సిద్దాంతం.. మిమల్ని ఇబ్బంది పెడితే సారీ. నాది పెద్ద ఉద్యోగం కాకపోయినా.. ఉన్న జాబ్ లో హ్యాపీ గానే ఉన్నాను.. కాకపోతే మా అమ్మే నా పెళ్ళి కోసం చాలా టెన్షన్ పడుతోంది.. పైగా అమ్మ హార్ట్ పేషెంట్"


"మీకు ఇంకా పెళ్ళి అవలేదా.. ?" అడిగింది అమ్మాయి.

 

"లేదండీ.. ఉన్న నిజం దాచి పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంత బొద్దుగా ఉన్నాను.. పైగా బట్టతల.." అని క్యాప్ తీసి చూపించాడు సుందరం.


"నాకు ఎవరూ లేరు.. అమ్మ లేదు. నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయారు.. మీకు ఉన్న దానిలో హ్యాపీ గా ఉన్నారు. సరదాగా మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడుతుంటే, నా జీవితంలో బాధను మరచిపోయాను. అందం ఉండి, అన్నీ ఉన్నవారు ఎంతమంది హ్యాపీ గా ఉన్నారు చెప్పండి..? మిమల్ని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ.. మీతో హ్యాపీ గా ఉంటుంది" అంది ఆ అమ్మాయి.

 

"అదేంటి అలా అంటున్నారు కళ్యాణి గారు..?"


"నా పేరు కళ్యాణి కాదు.. జయ.."


"మరి మీరు ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు..?"

"నా ఫ్రెండ్ ని చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవబోతున్నాను.. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్" అంది జయ.

 

"అంతే లెండి.. ! నాకంత అదృష్టమా.. చెప్పండి..?"


"ఎందుకు అలా అంటున్నారు.. ఇంతకీ ఏమైంది..?"


"నేను పెళ్ళిచూపులు కోసం, కళ్యాణి అనే అమ్మాయిని కలవడం కోసం ఇక్కడకి వచ్చాను. మీరే కళ్యాణి అనుకుని.. మిమల్ని పెళ్ళి చేసుకుంటే బాగున్ను అనుకున్నాను.. కానీ.."


"నిజమా.. ? మరి మీ కళ్యాణి సంగతి ఏమిటి.. ? ఆమె వస్తుందేమో.."


"మీ కన్నా మంచి అమ్మాయి నాకు దొరకదు జయ.." అంటూ లేచి వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు సుందరం.

 

"ఉండండి.. మా నాన్న చెబుతుండేవారు.. అందం, డబ్బు కన్నా మనల్ని ఆనందంగా ఉంచగలిగే మనిషి, మనల్ని సపోర్ట్ చేసే లైఫ్ పార్టనర్ జీవితంలో దొరకడం అదృష్టం అని.. అందుకే, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీతో నా లైఫ్ హ్యాపీ గా ఉంటుంది. మీకూ.. మీ కళ్యాణి కి అభ్యంతరం లేకపోతే, నన్ను పెళ్ళి చేసుకుంటారా..?"


"కళ్యాణి రాకపోవడం మంచిదే అయ్యింది.. లేకపోతే మీలాంటి మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాడిని.." అంటూ ఎగిరి గంతేసాడు సుందరం.


"మీకు ఇంకో విషయం చెప్పనా.. ! నా పూర్తి పేరు జయ కళ్యాణి.." అని నవ్వుతూ చెప్పింది జయ. 


*************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


97 views0 comments

Comments


bottom of page