top of page

బంగారు బంధం'Bangaru Bandham' - New Telugu Story Written By Kannaiah Bandela

Published In manatelugukathalu.com On 02/06/2024

'బంగారు బంధం' తెలుగు కథ

రచన: కన్నయ్య బందెల


“రాజేష్! లెగు.. నాకు అసలే ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది. త్వరగా రావాలని జిఎం గారి ఆదేశాలు “ బ్రష్ ఫై పేస్ట్ వేసుకొని, హడావుడిగా దుప్పటి లాగింది రశ్మి. 


“ఓ మై గాడ్! ఈరోజు హైదరాబాదులో నాకు మీటింగ్ ఉందని చెప్పానుగా.. త్వరగా వెళ్లాలి “ రాజేష్ బెడ్ పై నుంచి గబాలున , తనకు అవసరమైన ఫైల్ అనేది వెతికి ఓచోట ఉంచి, “ఏమైనా తింటానికి టిఫిన్ ఆర్డర్ చేయనా” అన్నాడు. 


ఆ మాట కోసమే ఎదురు చూసినట్లు, వెంటనే “ఇవ్వండి” అని చెప్పింది రష్మీ. ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే ఇలాగే ఉంటుందేమో మరి! ఇంటిలో చేసిన వంట లేక, కనీసం పొద్దున్నే వాకింగ్ కూడా చేయలేని స్థితి అనారోగ్యాన్ని డబ్బులు పెట్టి మరీ కొనుక్కున్నట్టుగా ఉంటుంది. రాజేష్ రష్మిలు ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్లారు. 

 ******************** 

 తనకు ఎవరూ లేరు అనుకుంటున్న రాజేష్ కు అత్త, మామగారు ఇంటికి వచ్చేసరికి పట్టలేనంత సంతోషం. ఆశ్చర్యంతో తబ్బిబ్బు పోయాడు. మనవడిని చేతిలోకి తీసుకొని మురిసిపోతున్న దంపతులిద్దరిని చూసి పొంగిపోయాడు. పెద్ద వాళ్ళ అలనా పాలనా ఎరుగని తనకు అత్త మామ లు తల్లిదండ్రులు గా కనిపించారు. 


ఆప్యాయత, అనురాగాలు తన జీవితంలో ఏమీ ఎరగని అనాధగా పెరిగిన తను కుటుంబం అంటే ఏంటో ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నాడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే ఎంతో బాగుండేది. చేసిన తప్పును సరి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. 


“మీ అమ్మాయి చేసిన తొందరే మేము ఈరోజు బెంగళూరుకు వచ్చి ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ గా నేను, బ్యాంక్ ఉద్యోగిగా మీ అమ్మాయి పారిపోయి, సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నాం కానీ, అవి కృత్రిమంగా ఏర్పడిన సంతోషాలు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ముందు అవి ఏమాత్రం పనికిరావు. మేము చేసిన ఈ తప్పును క్షమించండి మామయ్య” అంటూ రెండు చేతులు జోడించి నిలబడ్డాడు రాజేష్. 


తను ఎన్నాళ్ళ నుండో చెప్పదలచిన విషయం చెప్పి వారి ఆశీస్సులు తీసుకున్నందుకు, తను ఎంతగానో సంతోషించాడు రాజేష్. 


“రాజేష్! మన ఆఫీసు వచ్చేసింది లెగు” అంటూ భుజం తట్టి లేపాడు స్నేహితుడు విజయ్. గాడ నిద్ర నుంచి బయటికి వచ్చి “అయ్యో ఇదంతా కలా? నిజమైతే ఎంత బాగుంటుంది కదా!” మనసులో అనుకున్నాడు. 

 ********************

పెండ్లి అయిన రెండున్నర ఏళ్లుగా ఎటువంటి రాకపోకలు లేవు. ధనవంతులు ఇంట అతి గారాబంగా పెరిగి, తల పొగురుతో విచక్షణ మరిచి, తల్లిదండ్రులను, కుటుంబాన్ని కాదని, కనీసం తల్లిదండ్రులు కూడా లేని రాజేష్ ని వివాహం చేసుకుంది రష్మీ. తను ఇప్పుడు గర్భవతని తెలిసి రాబోయే కాలాన్ని గుర్తు చేసుకుని భయపడి పోయింది. 

అలనా పాలన గురించి తెగ ఆలోచనలో పడిపోయారు. దంపతులిద్దరూ. తన తల్లి జానకమ్మతో అప్పుడప్పుడు ఫోన్లో దొంగ చాటుగా మాట్లాడడం తప్ప వేరే సంగతే లేదు. 


“ఎలాగైనా మన వాళ్లను ఇక్కడ రప్పించుకోవడం తప్ప వేరే ఏ మార్గం కనిపించడం లేదు రాజేష్”


“ఎలా చేస్తే మంచిదో నువ్వే ఆలోచించు. నాకు ఆలోచించే బుర్ర కానీ, సమయం కానీ నాకు లేవు “ అంటూ నిట్టూర్చాడు రాజేష్. 


“రాబోయే రోజుల్లో సీమంతం, బారసాల, అన్నప్రాసనం ఇంకా బోలెడన్ని తంతులున్నాయి. మన పక్కన ఉన్న పంకజం తన సీమంతాన్ని ఎంత బాగా జరుపుకుందో చూసావా?”


“ఇవేమీ నాకు తెలియవు. ఏం చేసినా, మొదటి నుండి చక్రం తిప్పేది నువ్వేగా.. ఇది కూడా నీవే చేయి “అంటూ లాపీని ఓపెన్ చేశాడు రాజేష్. 

 ****************************

“ఏమండీ! ఎంత కాదనుకున్నా మన కూతురే కదా.. చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అసలే ఒట్టి మనిషి కాదు. మంచి చెడు దగ్గరుండి చూసుకోవలసింది మనమే అయినా ఇప్పుడు మీరు రిటైర్ అయి ఉన్నారు కదా! పొలం పనులు ఎప్పుడూ ఉండేవే. ఎవరికైనా కౌలుకి ఇచ్చి, మన అమ్మాయి దగ్గరకు వెళ్దాము పదండి” అన్నది జానకమ్మ తన భర్త రఘురామయ్యతో. 

“నాకు మాత్రం బాధగా లేదా ఏంటి జానకమ్మా! ఎంతో అల్లారుముద్దుగా ఆదర్శంగా పెంచిన నా పెంపకం ఇలా అయింది ఏంటి? అన్నదే నా బాధ. అల్లుడు మంచివాడని చెప్తున్నావు కదా అదొక సంతోషం. చూడూ.. చుట్టపు చూపులా వెళ్లి రావాలే కానీ అక్కడే ఉండడం సరికాదు. అన్నీ మనమే చూసుకుంటే, పిల్లలకు బాధ్యతలు తెలిసి రావు. ప్రతి అనుభవం మనిషిని నేర్చుకునేలా చేస్తుంది. “ తన మనసులోని మాటను వెలిబుచ్చాడు రఘురామయ్య. 

 ************+*+*************

“నా మనవడుఎంత ముద్దొస్తున్నాడో!! వాళ్ల తాతయ్య గారి పోలికే. వీడి బోసి నవ్వు చూస్తుంటే వీడి మేనమామలా ఉంటాడని అనిపిస్తోంది కదండీ! కాలం ఎంత త్వరగా గడిచి పోతుందో తెలియడం లేదు. చూడండి సీమంతం, బారసాల, అన్నప్రాసన అన్ని దగ్గరుండి జరిపించాము కూడా.. 


అయిననూ మనము వచ్చి, కొన్ని రోజులే అయినట్లుగా ఉంది. ఈ జన్మకు ఈ ఆనందం చాలండి. మిమ్ములను ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషాన్ని పొందగలుగుతున్నాను”. 


తన మాటలకు రఘురామయ్య లోలోపల ఎంతో సంతోషించాడు. వాస్తవానికి జానకమ్మ రఘురామయ్యను కులాంతర వివాహం చేసుకుంది. తన ఇంటిలోనే అద్దెకు ఉండేవాడు. , తన భావాలను నచ్చి, రఘురామయ్యను ఎలాగైనా తన వారితో మాట్లాడి, ఒప్పించి వివాహం చేసుకుంది. కాపురానికి ఓ సాదాసీదా గృహిణిగా అత్తారింటికి వచ్చింది. భర్త నిరాడంబరతను ఆదర్శంగా తీసుకొని, తను కూడా భర్తను అనుసరించింది. 


అత్తమామలను తన తల్లిదండ్రుల్లాగా భావించి, సేవలందించేది. భర్తకు యాక్సిడెంట్ అయినప్పుడు చిన్నపిల్ల వాడిలా సాకింది. పెద్ద చదువులు చదవకపోయినా సంస్కారం గలది. సమాజంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కూతురు యుక్త వయసు వచ్చాక కూతురి మాట తీరు, ప్రవర్తన తనకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. వివాహ విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, తన భర్తను సైతం నానా మాటలు అనడం, వీటన్నిటినీ దిగమింగి, ఓ తల్లిలా కూతురి సంసారాన్ని చక్కబెట్టేందుకు బెట్టు చేయక, భర్తను ఒప్పించి, బెంగుళూరుకు తన వెంట రప్పించింది జానకమ్మ. 


ఎంతో ఆరోగ్యంగా హుషారుగా కనిపించే తను ఆ మధ్య చెవులు పూర్తిగా వినపడని, వినికిడి సమస్య తనను ఎంతగానో బాధించేది, పెళ్లిళ్లు, పెరంటా లకు వెళ్లే సరదా కూడా ఆమెలో సన్నగిల్లింది. 

****-------------******************

“ అమ్మవాళ్ళు వెళ్తామంటున్నారు రాజేష్. బాబు బడికి వెళ్తున్నాడు కదా! వారితో పెద్ద పని ఏమి ఉండదు అనుకుంటా. ఇన్ని సంవత్సరాలు వాడి ఆలనా పాలనా చూసుకున్నారు. సంతోషంగా ఉంది. నాన్నగారు అంతగా మాట్లాడకపోయినా, అమ్మ మాత్రం గండాన్ని గట్టెక్కించిoది”. 

“అవును. ఇలాంటి గొప్ప తల్లిదండ్రులను ఇన్నాళ్లు కాదని దూరంగ ఎలా ఉండగలిగావు? నాకస్సలు అర్థం కావడం లేదు. నాకు మాత్రం వాళ్లతోనే ఉండిపోతే బాగుంటుందనిపిస్తుంది”


“అదే మరి నీ అమాయకత్వం. ఇక చాలుగాని ఇంతకాలం మన బాబుని మంచిగా చూశారుగా. ఉట్టి చేతులతో పంపించడం ఏం బాగుంటుంది చెప్పు”


“ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీవే చెప్పు”


“చూడు.. మన వాడిని బయట టేక్ కేర్ సెంటర్లో ఆయాల దగ్గర ఉంచినా, నెలకు కనీసం నాలుగు వేలు ఖర్చు అవుతుంది కదా! ఆ డబ్బులే అమ్మకు ఏదైనా కానుకగా ఇస్తే బాగుంటుందేమో కదా!”


“రష్మీ! నీ ఆలోచన ఏమాత్రం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఆమె చేసిన పనికి వెలగట్టడం అనిపిస్తుంది. బోడి గిఫ్ట్ కోసమా వాళ్లు ఇన్ని సంవత్సరాలు మన దగ్గర ఉంది? నాకు అంతగా మంచిగా అనిపించడం లేదు. “ గొంతు పెద్దది చేసి అన్నాడు రాజేష్. 


“నువ్వే మాట్లాడకు. అమ్మ బర్త్డే నాడు ఏమైనా తెచ్చి పెడితే సరి. ఆ.. ఏదీకాదు. బంగారు ఉంగరం తెద్దాం. అమ్మకు బంగారం అంటే బాగా ఇష్టం”. 


“నాకు తెలిసి వారు డబ్బు మనుషులుగా లేరు. పైగా మీ నాన్నగారికి తెలిస్తే, ఈసారి మన వైపు చూడనే చూడరు. పుట్టినరోజులు, పండుగలు అంటే ఆయన గారికి అసలే పడవని నాతో చాలా సార్లు చెప్పావు గుర్తుందా?”


తన పంతాన్ని నెగ్గించుకునేందుకే అన్నట్లుగా, తల్లి జానకమ్మ పుట్టినరోజున కేక్ తీసుకొచ్చి, చిన్న పార్టీ లైటింగ్స్ ఏర్పాటు చేసి, ఓ చిన్న వేడుక చేశారు. ఇష్టం లేకపోయినా మౌనంగానే తన కూతురి ఆనందం కొరకు వారు తెచ్చిన బంగారపు ఉంగరాన్ని స్వీకరించింది. 

 *********************

 “అప్పుడే వారం రోజులు అయింది మన వాళ్లు వెళ్లి. వారుంటే ఇల్లంతా కలకలాడుతూ ఉండేది. ఇప్పుడు చాలా వెలితిగా అనిపిస్తుంది కదా”


తన మాటను అంతగా పట్టించుకోకుండానే

“అవునులే గాని మా నాన్నగారు ఏమైనా మాట్లాడారా నీతో?”


“ఆ.. సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు.. సంస్కారం, గౌరవంఎలా కాపాడుకోవాలో, నీ నుండి తక్కువ సమయంలోనే ఎక్కువ వివరాలు చెప్తుండేవారు. బహుశా ఎక్కువ తెలిసినవారు తక్కువగా మాట్లాడతారేమో అనిపించింది. అవును ఆ రోజు మీ అమ్మగారిని గమనించావా? ఆమెగారు అంతగా సంతోషించినట్లుగా అనిపించలేదు”


“ఓ.. అదా.. అదేం లేదు. మనవడికి దూరం అవడాన్ని తలచుకొని కాస్త డల్ గా ఉందేమో లే!”

ఆదివారం.. ఈ రోజైనా ఇల్లు శుభ్రంగా చేద్దాం అనుకొని రష్మీ చీపురుతో ఊడ్చటం మొదలెట్టింది. ఊడుస్తూనే జానకమ్మ గదిలో అద్దం కింద తెల్ల కాగితం కంటబడింది. చీపురు కట్టను పక్కనపెట్టి, అందులో ఏముందని ఆతృతంగా చదవడం ప్రారంభించింది. 


“ పిల్లలకు ఆశీస్సులు. మమ్ములను ఇన్ని రోజులు చక్కగా చూసుకున్నారు. మీ ఇల్లు చాలా బాగుంది. ఇరుగుపొరుగు వారు మంచివారే అనిపించింది. వారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి, బంగారపు ఉంగరం కుడి చేతి వేలుకు పెట్టుకున్నాను. దాని వైపు చూస్తున్నప్రతిసారి, ఏదో వెలితి గానే అనిపిస్తుంది. టేక్ కేర్ సెంటర్ డబ్బులు నాకు ఇచ్చినందుకు, పోల్చుకున్నందుకు గుండెను పిండేసినంత బాధగా అనిపిస్తుంది. 


బంగారం అంటే నాకు ఇష్టం అనే సంగతే తెలుసు నీకు. కానీ ఉన్న బంగారానంత నీ పేరు మీదనే లాకర్లు దాచి ఉంచాం. మనవడిని చూసుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఈ తనువులు చాలిస్తే బాగు అనిపించేది. మీ జనరేషన్ చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తుంటుంది. ఈనాటి సమాజం మానవ సంబంధాలను మరిచి, మనీ సంబంధాలకే పరిమితమైంది అని మీ నాన్నగారు అప్పుడప్పుడుఅంటూ ఉంటుంటే ఏమిటో అనుకున్నాను కానీ నాకు ఇంత త్వరగా తెలుస్తుందని అనుకోలేదు. 


ఇవన్నీ మీరు నా ముందే చర్చించుకుంటుంటే వినాల్సి వచ్చింది. బహుశా నిజాలు ఎప్పుడైనా దేవుని ముందు, కోర్టులో మాట్లాడకపోయినా, చిన్నపిల్లల ముందు మరియు చెవిటి వారి ముందు మాత్రమే చెప్తారని అనుభవం తో తెలుసుకున్నాను. ఆరోజు నా చెవికి మిషన్ ఉన్న సంగతి మీరు గమనించలేదు అనుకుంటా. అల్లుడుగారు వారించినాకూడా, నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన తీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయినా పిల్లల తప్పులను తల్లిదండ్రులు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. కానీ ఆ ముసలి తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ మీరు ప్రయత్నించరు. 


ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? భవిష్యత్తులో నాలాగా నా కూతురుకు జరగకూడదని. మీ నాన్నగారికి విషయాలు తెలిస్తే బాధపడతారు. మీ నాన్నగారిని ఒప్పించి నీ దగ్గరకు తీసుకు రావడం ఎంత తప్పో తెలుసుకున్నాను.. 

 చివరిగా.. మనది బంగారు బంధం కాదని పేగు బంధం అని ఇకనైనా నీవు తెలుసుకుంటావని నమ్ముతున్నాను. మనవడికి నా ముద్దులు.. నీ అమ్మ జానకమ్మ. 


 ఉత్తరం చదివిన మరు క్షణమే తన కాళ్ళ క్రింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది రష్మీకి. తన తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు, తన పైనే తనకు అసహ్యం వేసింది. ఇన్నాళ్లు తన తల్లిని అందరికీ వంట వడ్డించే తల్లిగా మాత్రమే చూసింది. తన మాటలతో చేతలతో ఇన్నాళ్లు బాధపెట్టిన దృశ్యాలు ఒక్కొక్కటి కనబడుతున్నాయి.. ఇంత లోతైన ఆలోచనలు తనకు ఉంటాయని కూడా ఊహించలేకపోయింది. 

 చిన్నగా మంచానికి కూలబడి ఉత్తరాన్ని పదేపదే చదువుతూ పెద్దగా ఏడుస్తూ, 

“రాజేష్, .. నేనెంత తప్పు చేశానో, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నా ప్రవర్తనతో అందరినీ బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా” అంటూ ఎక్కి ఎక్కి ఏడవ సాగింది రష్మీ.

 

రాజేష్ చిన్నగా ఓదారుస్తూ “ అవును. బంగారం బంధం వెలతో కూడినది. పేగు బంధం వెలకట్టలేనిదని అమ్మ చాలా బాగా చెప్పారు”


పశ్చాత్తాపంతో ఉత్తరాన్ని ముఖానికి పెట్టుకొని ఏడుస్తున్న కన్నీటి ధారలు, క్షమించినట్లుగానే తనలోని అహంకారం లా, ఉత్తరంలోని అక్షరాలు మాయం కాసాగాయి. 


***

కన్నయ్య బందెల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు: కన్నయ్య బందెల

గ్రామం: గిద్ద

మండలం: రామారెడ్డి

జిల్లా: కామారెడ్డి.

వృత్తి: ప్రధానోపాధ్యాయులు

చదువు: M. A:BE d,

హాబీస్: కథలు చదవడం, రాయడం.


123 views0 comments

Comments


bottom of page