top of page

ఓ భారతమ్మ


'O Bharathamma' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 04/06/2024

'ఓ భారతమ్మ' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ



"అమ్మా!....."

నేలను చిమ్ముతూ వున్న ఖైదీ భారతమ్మ తలను పైకి ఎత్తి చూచింది.

ఎదురుగా జైలు ఆడ పోలీస్ వనజ.


"ఏమ్మా!..." మెల్లగా అడిగింది భారతమ్మ.


ఆమె వయస్సు నలభై ఐదు సంవత్సరాలు. సన్నగా పీలగా వుంటుంది. ఎనిమిది సంవత్సరాలుగా జైలు శిక్షను అనుభవిస్తూ వుంది.


"అమ్మా!... రేపు మీకు విడుదల" నవ్వుతూ చెప్పింది వనజ.


జైల్లో నేలను గంట నుంచి చిమ్ముతూ వుంది భారతమ్మ!.... నొసటన చెమట. శరీరమంతా కూడా ఓ మోస్తరుగా చెమట పట్టింది.


పమిటతో ముఖాన వున్న చెమటను తుడుచుకొంది. దీనంగా వనజ ముఖంలోకి చూచింది.

"అమ్మా!....నేను మీకు చెప్పింది సంతోషపడవలసిన విషయం కదా!... ఎందుకు అలా నీరసపడిపోతున్నారు!" ప్రీతిగా అడిగింది వనజ.


భారతమ్మ నిట్టూర్చింది. విరక్తిగా చిరునవ్వుతో వనజ ముఖంలోకి చూచింది.

"నిజంగానా అమ్మా!" అడిగింది భారతమ్మ.


"అవునమ్మా!.... జైలర్ సార్ మీతో చెప్పమన్నారు. ఇక ఆపండి... వెళ్ళి స్నానం చేసి భోంచేయండి. మీ మంచి ప్రవర్తనకు తొమ్మిదినెలల శిక్షాకాలాన్ని తగ్గించారట!" సంతోషంగా చెప్పింది వనజ.

భారతమ్మ ముఖంలో విచారం!....


సమయం సాయంత్రం ఐదున్నర. ఖైదీలందరూ చేస్తున్న పనులను ఆపవలసిన సమయం.

భారతమ్మ.... వనజ ముఖంలోకి దీనంగా చూచింది.


"సంతోషంగా వెళ్ళమ్మా!.... స్నానం చేసి, భోజనం చేసి... రేపటి బయట ప్రపంచం.... అయినవారిని గురించి ఆలోచిస్తూ.... హాయిగా నిద్రపొండి..." చెప్పింది పోలీస్ వనజ.


మౌనంగా భారతమ్మ తలాడించి... చేతిలో టెంకాయ పుల్ల చీపుతుకట్టను స్టోర్ రూములో వుంచి... స్నానం చేసి... పేరుకు తిన్నాననే రీతి నాలుగుమెతుకులు మ్రింగి సెల్‍లో తన స్థానంలో శయనించింది భారతమ్మ.

మనస్సున గత స్మృతులు.

*

మల్లికార్జున, భారతమ్మలు అన్యోన్య దంపతులు. మల్లికార్జున మేనమామ కూతురే భారతమ్మ. ఇంటర్ పాసై టీచర్ ట్రైనింగ్ ముగించి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుండేది. మల్లికార్జునకు చదువు అబ్బలేదు. ఓ లారీ ఓనర్ దగ్గర క్లీనర్‍గా పని నేర్చుకొని క్రమేణా ఎదిగి లారీ డ్రైవర్ అయ్యాడు. రెండు కుటుంబాలు పేద కుటుంబాలే. మల్లికార్జున, భారతమ్మలకు చిన్నతనం నుండి ఒకరంటే ఒకరికి ఇష్టం. యుక్తవయస్కురాలైన తర్వాత మల్లి డ్రైవర్‍గా.... భారతమ్మ టీచర్‍గా మారిన తర్వాత రెండు సంవత్సరాలకు మల్లి ఇరవై ఆరవ ఏట.... భారతమ్మ ఇరవై ఒకటవ ఏట... వారి తల్లిదండ్రులు వారిరువురికీ వివాహాన్ని జరిపించారు.


మూడు సంవత్సరాల తర్వాత భారతమ్మ గర్భవతి అయ్యింది. మగ శిశువు జననం....

ఆ దంపతులు వాడికి భాస్కర్ అని నామకరణం చేశారు. భాస్కర్ వయస్సు సంవత్సరంగా వున్నప్పుడు.... రాజమండ్రి నుండి పడవలో భద్రాచలానికి యాత్రకు బయలుదేరిన... మల్లికార్జున, భారతమ్మల తల్లిదండ్రులు... పాపికొండల ప్రాంతంలో... నదిలో పడవ రాత్రి సమయంలో తలక్రిందులైన కారణంగా మరణించారు. ఆ ప్రమాదంలో దాదాపు ముఫ్ఫైమంది గతించారు.


అంతవరకూ ఎంతో ఆనందంగా వున్న మల్లి, భారతమ్మలకు కష్టకాలం ఎదురైంది.

ఆ ఇరువురు.... కష్టాల నుండి సమస్యలను ఎదుర్కొంటూ....

ఎదిగిన వారు కాబట్టి కొన్నిరోజులు కన్నీరు కార్చి... దుఃఖాన్ని దిగమింగి.... భాస్కర్‍ను చూచి సంతోషపడుతూ కాలానికి ఎదురు ఈదసాగారు.


కాలచక్ర భ్రమణంలో పదమూడు వసంతాలు జరిగిపోయాయి.

భాస్కర్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అతను చాలా తెలివిగలవాడు. యదార్థం చెప్పాలంటే ఏకసంతగ్రాహి. అందరి ఉపాధ్యాయుల అభిమానపాత్రుడు.

*

భారతమ్మ ఆడపిల్లల స్కూల్లో బి.ఎ, ఎం.ఎ పాసై హయ్యర్ గ్రేడ్ సైన్స్ టీచరుగా పనిచేస్తూ వుంది. ఆమెకు చాలా మంచిపేరు. ప్రిన్సిపాల్ మిగతా టీచర్లు అందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు.... అభిమానించేవారు.


మగపిల్లల స్కూల్లో పనిచేసే ఆడటీచర్లను భారతి కలిసినప్పుడు....

"మేడమ్!... మావాడు ఎలా వున్నాడు?" ఎంతో ఆతృతతో అడిగేది.


"భారతీ మేడమ్!... మీ భాస్కర్.... బృహస్పతి. ఒక్కసారి విన్నాడంటే... మరోసారి చెప్పనవసరం లేదు. క్లాసులో అన్నింట్లో వాడిదే ఫస్ట్ మార్కు!" ఆ టీచర్లు అంత ఆనందంగా జవాబు చెప్పేవారు.

రాత్రి సమయంలో ఆ ఆలూమగలు ఏకాంతంలో....

"ఏమండీ!...."


"చెప్పు భారతీ!...."


"మనవాణ్ణి ఏం చదివిద్దామని మీ ఆశ?" అడిగింది భారతి.


"నీ వుద్దేశ్యం ఏమిటి?"


"వాడిని డాక్టర్‍గా చూడాలని నా ఆశ" మెల్లగా చెప్పింది భారతమ్మ.

ఆమె మాటకు మల్లి వెంటనే....

"ఓ.... దానికేం!... అలాగే చదివిద్దాం" నవ్వుతూ చెప్పాడు మల్లికార్జున. 


అతని ఉద్దేశ్యం... ఏ విషయంలోనూ ఎప్పుడూ భార్య... తన జవాబు విని బాధపడకూడదనే భావన.

"నిజంగానా?"


"నేను నీ కోర్కెను ఏనాడైనా కాదన్నానా?"


"లేదు.... కానీ ఇది అన్ని కోర్కెలలాంటిది కాదు కదండీ!... చాలా డబ్బు కావాలిగా!"


"ఆ... అవును... డబ్బు కావాలి?" సాలోచనగా అన్నాడు మల్లి.


"ఎలా చేస్తాం?"


"ఇంకా మూడేళ్ళనాటికి కదా!... ఇస్తాడు" నవ్వాడు మల్లి.


"ఎవరు?" ఆశ్చర్యంతో అడిగింది భారతమ్మ.


"నిన్ను నన్ను కలిపినవాడు. మనకు భాస్కర్‍ను ఇచ్చినవాడు.... ఇంకా చాలా టైమ్ ఉంది... అప్పటికి అన్నీ సమకూరుతాయి. దైవం మీద నమ్మికతో హాయిగా నిద్రపో" నవ్వుతూ భారతి తలను తన గుండెలకు హత్తుకొన్నాడు మల్లికార్జున.


మరుదినం... ఉదయం ఆరున్నరకు లారీ ఎక్కాడు. హైదరాబాద్ వెళ్ళాలి.

ఆ ఉదయం నుంచి కొంచెం గాలీ వాన. గంట గడిచే కొద్దీ గాలివాన ఉధృతం అయ్యింది. నెల్లూరు నుంచి తాను బయలుదేరిన లారీ ఉలవపాడు శింగరాయకొండ మధ్యన విపరీతమైన గాలి తాకిడికి తిరగబడింది. మల్లికార్జున బండి ముందు భాగాన క్రిందపడి గతించాడు.


కొన్ని గంటలసేపు భయంకర ప్రళయం. రోడ్డున పయనించే లారీలు... కార్లు... ఇతర వాహనాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. నడిపేవారు ఆ భీకర వాతావరణంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాల్లోనే వుండిపోయారు.


రెండవరోజు ఉదయం మల్లికార్జున శవం వారి ఇంటికి అంబులెన్సు ద్వారా చేర్చబడింది.

భారతమ్మ, భాస్కర్ మల్లికార్జున శరీరంపై బడి భోరున ఏడ్చారు. వారి ఆవేదనకు హద్దులు అవధులు లేవు... చుట్టుప్రక్కల వారు ఓదార్చారు. వారి ప్రయత్నం వారిది.

ఆ తల్లీకొడుకుల బాధ ఆవేదన వారికే పరిమితం....


మల్లికార్జున ఆఫీసునుండి అతని మిత్రులు కొందరు వచ్చారు. మల్లి అంతిమయాత్రకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. ఆ సాయంత్రం నాలుగున్నర ప్రాంతాన మల్లికార్జున అంతిమ పయనం.. స్మశాన వాటిక వైపు బయలుదేరింది.


ఈ మట్టిమీద పుట్టి.... ఎన్నోరకాల ఆడిపాడిన మనిషి చివరికి చేరవలసింది ఆ మట్టి (భూమాత) ఒడిలోకే. మల్లికార్జున ఆ తల్లి ఒడిలో శాశ్వత నిద్రకుపక్రమించాడు.

*

క్షణాలు... నిముషాలు.... గంటలు... ఎంతో భారంగా జరుగుతున్నట్టు భారతమ్మ, భాస్కర్‍ల మనోవేదన. వారిరువురూ ఒకరికి తెలియకుండా ఒకరు మల్లికార్జునను తలుచుకొని ఏడ్చుకొనేవారు. 

భాస్కర్ పూర్వంగా కాకుండా... ప్రస్తుతంలో తల్లికి ప్రతి పనిలో సాయానికి ముందుకు వచ్చేవాడు. కూరగాయలు తరగడం, బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టడం, బట్టలు ఉతికి ఆరవేయడం, వీధికొళాయి నుంచి మంచినీరు పట్టుకొని రావడం ఇలాంటి పనుల్లో తల్లికి సాయం చేసేవాడు భాస్కర్.


వీరి ఇంటిప్రక్క ఇంట్లో.... మల్లికార్జున స్నేహితుడు లారీ డ్రైవర్ భూపతి వుండేవాడు. అతని భార్య శ్యామల. ఆ దంపతులు ఎంతో మంచివారు. వారికి భాస్కర్ వయస్సున ఒక మగపిల్లవాడు దీపక్. దీపక్, భాస్కర్ క్లాస్ మేట్స్. ఆ భార్యాభర్తలు భారతికి, భాస్కర్‍కు ఎంతో సహాయంగా ఉండేవారు.


మల్లికార్జున ఓనర్ విశ్వేశ్వరరావు. పది పన్నెండు లారీలకు ఓనర్. మల్లికార్జున గతించిన మూడు నెలల్లోనే అతని భార్య ముత్యాలమ్మ.... స్కూటర్ మీద లేడీస్ క్లబ్‍కు వెళ్ళి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా... టర్నింగ్‍లో లారీ గుద్దుకొని స్పాట్‍లోనే మరణించింది. ఆ లారీ విశ్వేశ్వరరావు గారిదే. నడుపుతున్నది వారి బావమరిది మాలకొండయ్యగారే. అది జరిగి దాదాపు రెండు సంవత్సరాలు...


విశ్వేశ్వరరావు... కొంచెం కళాభిమాని...

భారతమ్మ... మంచి రూపవతి....


విశ్వేశ్వరరావు ముత్యాలమ్మలకు ఇద్దరు పిలల్లు. ఆడ, మగ కవలలు. వయస్సు పన్నెండు సంవత్సరాలు.


ఆడపిల్ల జ్యోతి భారతమ్మ స్కూల్లో... మొగవాడు నవీన్ భాస్కర్ స్కూల్లో చదువుతున్నారు.

జ్యోతి, నవీన్‍లు చదువులో చాలా మందం. ప్రతిసారి అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ మార్కులు. విశ్వేశ్వరరావుకు బాధ.... వీరికి బాగా పరిచయం ఉన్న అధ్యాపకురాలు ’కొంతకాలం భారతమ్మ మేడమ్ దగ్గర ట్యూషన్ పెట్టండి. మీ జ్యోతి జ్యోతిలా వెలిగిపోతుంది’ అని చెప్పారు.


విశ్వేశ్వరరావు భారతి ఇంటికి వచ్చి తన కూతురు కొడుకులకు రోజూ ఒక గంట ట్యూషన్ చెప్పే రీతిగా మాట్లాడి ఏర్పాటు చేసుకొన్నాడు. అతను తన భర్త ఒకనాటి యజమానైనందున భారతమ్మ ఆలోచించి ఒప్పుకొంది.


భారతమ్మ సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి విశ్వేశ్వరరావు గారింటికి వెళ్ళి పిల్లలకు ఓ గంటసేపు ట్యూషన్ చెప్పి ఇంటికి తిరిగి వచ్చేది. ఈ రీతిగా రెండు నెలలు ప్రశాంతంగా సాగిపోయాయి. భారతమ్మ చెప్పే విధానంతో పిల్లలు జ్యోతి, నవీన్ బాగా ఏకాగ్రతతో నేర్చుకోగలిగారు. భారతమ్మను పిల్లల అభివృద్ధిని చూచి విశ్వేశ్వరరావుకు ఎంతో ఆనందం... కానీ... అతని మనస్సున దినదినానికీ సైరంధ్రినీ చూచిన కీచకుని రీతిగా.... భారతి పట్ల ఆసక్తి... వాంఛ... పెరగసాగింది. 


భారతి హాల్లో కలయచూచింది. వాతావరణం రోజులా లేదు. ఆ సమయానికి పిల్లలు పుస్తకాలతో హాల్లో సందడిగా వుండేవారు. కానీ వారు లేరు.

బయట సన్నగా చినుకులు చల్లని గాలి ప్రారంభం అయ్యింది.

విశ్వేశ్వరరావు మనస్సున... ఏవేవో వూహలు....


"పిల్లలు ఎక్కడ సార్" అడిగింది భారతి.


"సినిమాకు పక్కింటివారితో కలిసి వెళ్ళారు"


"మ్యాట్నీకా!"


"కాదు ఫస్ట్ షోకు"


వర్షాన్ని చూచి రెండు గొడుగులతో తల్లికి ఒకటి ఇచ్చి వెళ్ళేదానికి భాస్కర్ విశ్వేశ్వరరావు గారి ఇంటికి వచ్చాడు.

"అయితే నేను వెళతాను" బయటి వాతావరణాన్ని చూచి అంది భారతమ్మ.


"వెళుదువుగాని... నీతో నేను మాట్లాడాలి కూర్చో భారతి" అనునయంగా చెప్పాడు విశ్వేశ్వరరావు.


"ఫర్వాలేదు విషయం ఏమిటో చెప్పండి!"


అతని ధోరణి వేరుగా వున్నదని అర్థం చేసుకుంది భారతి.


"చూడు భారతి.... నీవంటే నాకు ఎంతో ఇష్టం. నీకు భర్త లేడు. నాకు భార్య లేదు. మనం హాయిగా ఆనందంగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాలను సంతోషంగా గడుపుదాం. నిన్ను మహారాణిలా నేను చూచుకొంటాను."


వాకిటకు చేరిన భాస్కర్.... విశ్వేశ్వరరావు మాటలను విన్నాడు. యుక్తవయస్సు.... తన కళ్ళముందే తన తల్లిని....

అతనిలో ఆవేశం రేగింది. సింగపు కొదమలా విశ్వేశ్వరరావు పైకి దూకాడు. అతని చెంపలు పగులకొట్టాడు. పశుబలసంపన్నుడు విశ్వేశ్వరరావు.... భాస్కర్ చెంపపై తన శక్తినంతా కూడ తీసుకొని కొట్టాడు. భాస్కర్ నేలకు... ఒరిగాడు. అంతటితో కసి ఆగక.... డ్రాయర్ తెరిచి రైఫిల్‍ను భాస్కర్‍కి గురిపెట్టాడు.


అయోమయావస్థలో ఉన్న భారతి అతనిపై విరుచుకుపడింది. అతని చేతిని అతని వైపుకే త్రిప్పింది. తుపాకి ప్రేలింది.


గుండు విశ్వేశ్వరరావు హృదయానికి (గుండెకు) తాకింది. రక్తం ఫౌంటెన్ నుంచి చిమ్మినట్టు చిమ్మింది. ’అమ్మా’ అంటూ నేలకొరిగాడు విశ్వేశ్వరరావు.


విశ్వేశ్వరరావు చేతి దెబ్బ... భాస్కర్ కణతకు... తగలరాని చోట తగిలింది. 

భాస్కర్ నేలకొరిగి కొన్ని క్షణాలు కాళ్ళు చేతులు ఆడించి ఆగిపోయాడు.

కొన్ని నిముషాల వ్యత్యాసంతో ఇరువురి మృతి.

భారతమ్మ నిశ్చేష్టురాలై నేలకూలింది.


బజారుకు పళ్ళు తీసుకురావటానికి వెళ్ళిన నౌకరు వెంకన్న తిరిగి వచ్చాడు.

విశ్వేశ్వరరావు, భాస్కర్‍ల శవాలను చూచి.... భారతమ్మ వెర్రి చూపును చూచి.... పండ్లను జారవదిలి పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తాడు. 


పోలీసులు వచ్చారు. రెండు శవాలను పోస్టుమార్టంకు పంపారు. భారతమ్మకు బేడీలు వేసి పోలీసు జీపు ఎక్కించారు. తర్వాత కేసు... కోర్టు... వాదోపవాదాలు... భారతమ్మ దోషి అనే తీర్మానం.... ఎనిమిదేళ్ళ జైలు శిక్ష....

*

భోజనానికి గంట కొట్టారు. భారతమ్మ ఉలిక్కిపడి నాలుగువైపులా చూచింది.

ప్రక్క ఖైదీ "అమ్మా!... రండి భోజనానికి" పిలిచింది.


"మీరు వెళ్ళండీ... నేను వస్తాను" మెల్లాగా చెప్పింది భారతమ్మ.


భారతమ్మ ప్రస్తుత వయస్సు నలభై ఐదు సంవత్సరాలు.


రేపు బయటికి పంపుతారు. ఎక్కడికి పోవాలి.... ఎవరిని కలవాలి? ఎవరికోసం జీవించాలి? అన్న ప్రశ్నలే... చచ్చిపోతే ఏ సమస్యా వుండదుగా. చచ్చి సాధించేది ఏమిటి? నలుగురు నాలుగు రకాలుగా అనుకొంటారు. మంచీ చెడ్డా... తప్పు ఒప్పుల రుజువులను బ్రతికే సాధించాలి. నాలాంటి వారు పోరాడాలి. ఎవరినీ లెక్క చేయకుండా జీవితపు మరో అధ్యాయాన్ని ప్రారంభించాలి. మంచి మనిషిగా బ్రతకాలి. పదిమందికి మంచి చేయాలి.’


మనస్సున కొత్త ఊహలు.... పెదవులపై చిరునవ్వు... స్థిర నిశ్చయంతో చెంగున లేచింది. భోజనానికి భారతమ్మ. 

*

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


30 views0 comments
bottom of page