top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 10



'Jeevana Ragalu Episode 10'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 28/06/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 

దశరథరామయ్యకు నలుగురు పిల్లలు. దశరథనందన, గోపీనందన కొడుకులు. సునంద, హిమబాల కూతుళ్ళు. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది. ఆమె చెల్లెలే సుందరి. వివాహం ఘనంగా జరుగుతుంది. కౌసల్య, దశరథ రామయ్యలకు కవలలు పుడతారు. వారికి దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు. 


గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు. 

పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. 


పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. 

సునంద వివాహం జరుగుతుంది. దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి. 


ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 10 చదవండి. 


“డజను పండ్లు, ఆరుమూరల పూలు యివ్వండి. ” విక్రయదారునికి డబ్బు యిచ్చి.. పూలు పండ్లు అందుకొన్నాడు దశరథనందన. తోటే తమ్ముడు గోపినందన, హిమబాల వున్నారు. ముగ్గురూ శివాలయంలో ప్రవేశించారు. పార్వతీ పరమేశ్వరులను దర్శించారు. తీర్థప్రసాదాలను తీసుకొన్నారు. ఆలయం ముందున్న మండపంలో కూర్చున్నారు. కొద్దినిముషాలు ఆ జగత్ మాతాపితలను ధ్యానించారు. దశరథనందన కళ్ళు తెరిచాడు. అంతకు ముందే కళ్ళు తెరిచి పెద్దఅన్న ముఖంలోకి చూస్తూ వుంది హిమబాల. 


“అన్నయ్యా!.. దేవుణ్ణి ఏమికోరావు?” నవ్వుతూ అడిగింది హిమబాల. 


దశరథనందన నవ్వుతూ.. “నా సంకల్పం నెరవేరాలని కోరానమ్మా!.. ” 


“నీ సంకల్పం ఏమిటన్నయ్యా!.. " గోపీనందన అడిగాడు. 


“తమ్ముడూ!.. మనం యీ ప్రాంతంలో ఒక కెమికల్ ఫ్యాక్టిరీని నిర్మించాలి. ఆ నాకోర్కె నెరవేర్చమని ఆ మాతాపితలను కోరాను”


"దశరథనందనా!.. నీ కోర్కెనెరవేరుతుంది. " అభయాస్తాన్ని చూపుతూ నవ్వుతూ అంది హిమబాల. 


“తప్పకుండా నీ కోర్కె నెరవేరుతుందన్నయ్యా!.. ” అన్నగారి ముఖంలోకి చూస్తూ ఘనంగా పలికాడు గోపీనందన. 


“అదే జరిగితే.. యీ ప్రాంతంలో వున్న ఐదారువందల పేదలకు మనం వుపాదిని కల్పించగలం. ” సాలోచనగా పిలికాడు దశరథనందన. 


“నీ సంకల్పం మంచిది. తప్పకుండా త్వరలోనే జరుగుతుంది. నాన్నగారితో మాట్లాడు. ” అంది హిమబాల. 


'అలాగే. ' అన్నట్లు తల ఆడించాడు దశరథనందన. ముగ్గురూలేచి తమ యింటి వైపుకు నడిచారు. 

దశరథరామయ్య ఆ రోజు సాయంత్రం కర్నాటక నుంచి తిరిగివచ్చాడు. రాత్రి భోం చేసిన తర్వాత మేడపైన టెరస్ లో కొంతసేపు పచారు చేయడం ఆయన అలవాటు. అదే పనిని చేస్తున్నాడు దశరథరామయ్య. దశరథనందన తండ్రిని సమీపించాడు. 

“నాన్నా!.. ”


“ఏమిటి నాన్నా!.. ”


“యీ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ పెడితే.. ”


“బాగుంటుంది అంటావా!.. "


“అవును నాన్నా.. ఐదారు వందల మందికి వుపాది కల్పించిన వాళ్ళం అవుతాము. మంచి లాభాలు కూడా వుంటాయి. ”


"యీ విషయంగా నేను జర్మనీ వెళ్ళిరావాలనుకొంటున్నాను. ”


“అలాగా!.. ’’


“అవును. ”


 “తాతయ్యతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం. ” నవ్వుతూ పలికాడు దశరథరామయ్య. 


యింతలో అక్కడకి సుందరి వచ్చింది. 

“ఏమిటో నిర్ణయిద్దాం అంటున్నారు. విషయం ఏమిటి?” భర్త ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది సుందరి. 


“నందన కెమివల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకొంటున్నాడు. ఆ విషయంగా జర్మనీకి వెళ్ళివస్తాడట. ”


“జర్మనీకా!.. ” ఎంతో ఆశ్చర్యంతో పలికింది సుందరి. 


“అవును అమ్మా!.. ” తన నిర్ణయాన్ని చెప్పాడు నందన. 


“జర్మనీ వద్దూ.. గిర్మనీ వద్దూ.. నీ చదువుకి తగిన ఉద్యోగాన్ని చూచుకో. ” తన ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలియజేసింది సుందరి. 


తండ్రీ కొడుకులు ఒకరి మొఖాలు ఒకరు చూచుకొన్నారు. 

“చలిగా వుంది. రండి క్రిందకు. ” వేగంగా వెళ్ళిపోయింది సుందరి. 


“దాని మాటలు పట్టించుకోకు. తాతయ్యతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం. ” ఎంతో అనునయంగా చెప్పాడు దశరథరామయ్య. 


యిరువురూ మౌనంగా మేడ దిగారు. 

మరుదినం వెంకటరామయ్యతో చర్చించారు. అంతావిని.. 

“మంచి ఆలోచన. ప్రాజక్టు రిపోర్టు తయారు చేయించు. నాన్నా.. మనిషికి తను బ్రతకడం కాదు ముఖ్యం. పది మందిని బ్రతికించాలి. అందులో యిహము పరము రెండూ వున్నాయి. మంచి సంకల్పాలకు ఆ సర్వేశ్వరుని అండదండలు తప్పక లభిస్తాయి. నీ ఆశయం మంచిది. తప్పక నెరవేరుతుంది నందన!.. ”


తన హృదయపూర్వక అంగీకారాన్ని, ఆశీర్వచనాన్ని నందనకు యిచ్చాడు. డెభై అయిదు సంవత్సరాల తాతయ్య, యాభై ఐదు సంవత్సరాల తండ్రీ తమ అంగీకారాన్ని తెలియజేశారు. 

నందన నెల్లూరు వెళ్ళి తన నిర్ణయాన్ని బావ శాంతారామ్ చెల్లెలు సునందతో, శాంతారామ్ తల్లిదండ్రులతో వివరంగా చర్చించాడు. తండ్రి ఆదినారాయణ, తల్లి ఊర్మిళల ప్రోత్సాహంతో శాంతారామ్ భాగస్తుడిగా చేరేదానికి సమ్మతించాడు. 


ఆ యిరువురు జర్మనీకి వెళ్ళి అన్నింటినీ పరిశీలించి సెకండ్ హ్యాండ్ ప్లాన్టుకు అడ్వాన్సు యిచ్చి తిరిగి వచ్చారు. 

*

ఢమరుకనాదం క్యాసెట్ మ్యూజిక్ తో కారు వరండా ముందు ఆగింది. మ్యూజిక్ ఆగింది. 

మన్మధరావు, మంగమ్మ, భానుప్రియ కారు నుండి దిగారు. 

వెంకటరామయ్య వరండాలో కూర్చొని దిన పత్రికను చదువుతున్నాడు. మన్మధరావు కుర్చీలో కూర్చున్నాడు. వేగంగా మంగా, భానుప్రియ లోనికి వెళ్ళిపోయారు. 


“మామా!.. నీ కొడుకు, మనవడు ఎక్కడ?” సింహం గర్జించినట్లు వినిపించింది వెంకటరామయ్య చెవులకు. మన్మధరావును పరీక్షగా చూచాడు తనసహజ ధోరణితో నవ్వుతూ.. 

“చెప్పాపెట్టకుండా వచ్చారే.. ఏమిటి విషయం అల్లుడూ!.. ” చిరునగవుతో పలికాడు వెంకటరామయ్య. 


"మాకు యీగతిని కల్పించాడు మీ మనవడు. ” అతని స్వరం చాలా తీవ్రంగా వుంది. నిష్టూరం నిండి వుంది. 


యింతలో దశరథరామయ్య, నందన అక్కడకి వచ్చారు. “బాగున్నారా మామయ్యా!.. ” అడిగాడు నందన. 


మన్మధరావు అతని ముఖంలోకి తీక్షణంగా చూచాడు. 

దశరథరామయ్య వారి ప్రక్క వున్న కుర్చీలో కూర్చున్నాడు. 

“విషయం ఏమిటి బావా!.. ” మెల్లగా అడిగాడు.

 

“విషయం?” వికటంగా నవ్వి.. “చెప్పాలంటేనే నాకు సిగ్గుగా వుంది.. నీ కొడుకు.. :”


నందనను చేతివ్రేలితో చూపుతూ.. “వీడు.. వీడు.. ” నా బిడ్డ భానుప్రియ.. జీవితాన్ని నాశనం చేశాడు. యిప్పుడు ఆమె గర్భవతి. " ఆవేశంలో అతని కళ్ళు చెమ్మ గిల్లాయి. ముఖం రక్తవర్ణం అయింది. వెంకటరామయ్య, దశరథరామయ్య, నందనల తలపై పిడుగు పడినట్లయింది. నిశ్చేష్టులైపోయారు. 

యింతలో సుందరి, మంగమ్మ, భానుప్రియలు అక్కడికి వచ్చారు. భానుప్రియ ఏడుస్తూవుంది. సుందరి మంగమ్మల వదనాలు ఆగ్రహావేశాలతో గోచరిస్తున్నాయి. 


“నందనా!.. యిలాంటి పాడు బుద్ధి నీకు ఎలా పుట్టిందిరా!.. ” గర్జించింది సుందరి. 


“వరసైనదే అయినా అలాంటి పాడుపని చేస్తావా!.. ” నందనను తీవ్రంగా చూస్తూ అడిగింది మంగమ్మ. 


వారి మాటల వలన విషయాన్ని గ్రహించిన దశరథరామయ్య లేచి నందనను సమీపించాడు. 

“వాళ్ళు చెప్పేది నిజమేనా?” అతని నయనాలు అగ్నికణాల్లా వున్నాయి. వదనంలో ఎంతో ఆవేశం.. క్షణంసేపు తండ్రి ముఖంలోకి చూచి తలను దించుకొన్నాడు నందన. అతని నయనాలు అశ్రుపూరితాలైనాయి. 


“బావా!.. వాడేం చెబుతాడు. ఎవడైనా తను చేసిన తప్పును యీ రోజుల్లో ఒప్పుకొంటారా.. అందులో యిలాంటి విషయాల్లో. బావా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను. యీ విషయాన్ని అందరికీ తెలియనియ్యకూడదు. తప్పో ఒప్పో జరగకూడనిది జరిగింది. ఆరు ఏడు వారాల్లో మంచి ముహూర్తం వుంది. సోమయాజులుగారు చెప్పారు. నందనకు, భానుప్రియకు ఆ ముహూర్తాన వివాహం జరిగితీరాలి. మన రెండు కుటుంబాల మంచి కోసం మంగను ఒప్పించి నేను యీ నిర్ణయాన్ని తీసుకొన్నాను. ఆ ముహూర్తానికి వీరిరువురికి వివాహం జరిగితీరాలి. ” ఆవేశంగా కుర్చీనుంచి లేచాడు మన్మధరావు. 


“మంగా.. భానూ!.. రండి.. ” వేగంగా కారువైపుకు నడిచాడు. మంగమ్మ భానుప్రియలు పరుగున కార్లో కూర్చున్నారు. కారు కదిలి వెళ్ళిపోయింది. 


వెంకటరామయ్య, దశరథరామయ్య, దశరథనందన సుందరీలు, చిత్తరువుల్లా నిలబడ్డారు. 

కారు కనుమరుగైయ్యింది. 


సుధీర్గమైన నిట్టూర్పుని విడిచింది సుందరి. ఆ ముగ్గురి వదనాలను పరీక్షగా చూచింది. 

“ఆ రాత్రి తప్పతాగి మన సుపుత్రుడు యీ ఘనకార్యన్ని చేశాడట. వదిన, భాను చెప్పారు. ” చిరాకుతో పలికింది సుందరి. 


విచారవదనంతో.. కన్నీటితో కుర్చీలో కూలబడిపోయాడు వెంకటరామయ్య. మన్మథరావు పలుకులు వారికి ఎంతో అవమానాన్ని కలిగించాయి. 


దశరథరామయ్య వదనంలో ఆగ్రహం.. ఆవేశం.. వేదన.. "ఆ రాత్రి నీవు త్రాగావా!.. ” నందన ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు దశరథరామయ్య. 

నందన మౌనంగా తలదించుకొన్నాడు. అవమానంతో అతని హృదయం వెయ్యి ముక్కలయింది. నయనాలు వర్షపు మేఘాలైనాయి. 


“అడిగింది నిన్నే నందనా!.. ” గర్జించాడు దశరథరామయ్య. వెంకటరామయ్య లేచి మనుమడిని సమీపించి.. 

“నాన్న అడిగిన దానికి జవాబు చెప్పు. ”


“తప్పు ఒప్పుకోవడం మంచి మనిషి లక్షణం.. ” సుందరి పలుకులు ఎంతో కఠోరంగా వినిపించాయి నందనకు. 


“నేను కావాలని త్రాగలేదు నాన్నా. ” అతని స్వరం బొంగురు పోయింది. నయనాల నుండి అశ్రుధారలు. 


“అంటే.. త్రాగావన్నమాట!.. ” దశరథరామయ్యగారి యీ మాటల్లో ఎంతో ఆశ్చర్యం నిండి వుంది. 

“థమ్సప్ లో ఏదో కలిపి రఘునందన.. అతని మిత్రుడు ఫణీంద్రా నా చేత బలవంతంగా త్రాగించారు నాన్నా.. ” రోదిస్తూ దీనంగా పలికాడు దశరథనందన. 


ఎంతో ఆశ్చర్యంతో నందన ముఖంలోకి చూచారు, వెంకటరామయ్య.. దశరథరామయ్య.. సుందరీలు. 


“భానుప్రియ ప్రక్క గదిలోనే కదా నీవు ఆ రాత్రి పడుకొన్నావ్?.. ” లాయర్ లా ప్రశ్నించింది సుందరి.


ఆమె ముఖంలోకి క్షణం సేపు చూచి దోషిలా తలదించుకొన్నాడు నందన. 

“నందనా!.. ” తండ్రి పిలుపు సింహగర్జనలా వినిపించింది నందనకు. 


తొట్రుపాటుతో అతని ముఖంలోకి చూచాడు. 

"త్రాగిన మైకంలో చేయరాని తప్పును చేశావుగదరా!.. ” ఎంతో విచారాన్ని వ్యక్తం చేశాడు వెంకటరామయ్య. 


“యీ క్షణం నుంచీ నీకు మాకు ఎలాంటి సంబంధబాంధవ్యాలు లేవు. నీవు చేసిన తప్పును నేను క్షమించలేను. వెళ్ళిపో.. యీ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో.. వెళ్ళిపో!.. ”


తండ్రి ముఖంలోకి చూచి “నాన్నా!.. నేను ఏనాడూ యింతవరకూ మిమ్మల్ని సంప్రదించకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. కానీ యీనాడు నేను యీ నిర్ణయాన్ని స్వయంగా తీసుకొన్నాను. నా నిర్ణయం సరైనదని మీరు భావిస్తారని నా నమ్మకం.. ఆ మన్మథరావు.. వీడి మూలంగా యీనాడు మనలను తృణప్రాయంగా చూచాడు.. నాన్నా!.. వాడు.. నా తలను నరికినట్లనిపించింది. నేనుగా తీసుకొన్న నిర్ణయానికి నన్ను మీరు క్షమించండి. నాన్నా!.. క్షమించండి. " స్వరంలో గద్గదికం.. నయనాల్లో అశ్రువులు.. వేగంగా లోనికి వెళ్ళి పోయాడు దశరథరామయ్య. 


“చిన్నతనం నుంచీ.. నిన్ను ఎంతో ప్రేమాభిమానాలతో సాకిసంతరించాను. మాకు మంచి ఖ్యాతిని సంపాదించి యిచ్చావురా!.. యికపై నీ ముఖాన్ని మాకు చూపకు. వెళ్ళిపో.. యిక్కడ నుంచి వెళ్ళిపో.. ” నిర్ధాక్షిణ్యంగా పలికి ఆవేశంగా యింట్లోకి వెళ్ళిపోయింది సుందరి. 


దశరథనందన వెంకటరామయ్యను సమీపించాడు. ఆయన ముందు కూర్చుని మోకాళ్ళపై చేతులు వుంచి.. "తాతయ్యా!.. నాకు తెలిసి నేను ఏ తప్పూ చేయలేదు. ” దీనంగా అశ్రునయనాలతో పలికాడు. 


“తెలిసి చేసినా.. తెలియక చేసినా.. తప్పు తప్పే అవుతుంది నందనా!.. నా కొడుకు యీనాడు నీ మూలంగా బాధపడినంతగా.. వాడు ఏనాడు బాధపడలేదు. యీ విషయంలో వాడి నిర్ణయమే నా నిర్ణయం. నా ముందుండి నా హృదయంలో రగిలే దావాగ్నిలో ఆజ్యం పోయకు. వెళ్ళిపో.. ఆ మన్మధరావును కలసి.. నీ బ్రతుకు నీవు బ్రతుకు. మమ్మల్ని మరచిపో. ” దగ్గుపొర వచ్చింది. సర్దుకొని లేచి, తూలుతూ యింట్లోకి నడిచాడు. 


దశరథనందనకు.. అంతా శూన్యంగా గోచరించింది. మెట్లుదిగి భవంతి ముందు నిలబడ్డాడు. చేతులు జోడించాడు. 


"హే భగవాన్ నా కేమిటి యీ అగ్నిపరీక్ష!.. నన్ను రక్షించవా!.. ” భోరున ఏడ్చాడు. మెల్లగా నడిచి వీధిలో ప్రవేశించాడు. అడుగులు తడబడ్డాయి. శక్తి అంతా కూడగట్టుకొని ముందుకు నడిచాడు. 

ఆ రోజు.. ఆ యింట ఎవ్వరూ భోంచేయలేదు. దశరథరామయ్య గది తలుపులు మూసుకొని గదిలో మంచంపై అచేతనంగా పరుండిపోయాడు. వెంకటరామయ్యగారు తన గదిలో అదే స్థితిలో వుండిపోయారు. 


ఆరుగంటలు ప్రాంతంలో సుందరి దశరథరామయ్య గది తలుపు గట్టిగా తట్టింది. మేల్కొన్న దశరథ తలుపు తెరిచాడు. మౌనంగా వెళ్ళి తలకు స్నానం చేశాడు. తండ్రిగారి గదికి వెళ్ళి నిద్రిస్తున్న తండ్రి ముఖంలోకి వంగి చూచాడు దశరథరామయ్య. ఆయన చక్కిళ్ళపైన కన్నీటి చారలు గోచరించాయి. మెల్లగా తట్టి తండ్రిని లేపాడు. చేయిపట్టుకొని డైనింగ్ హాలుకు తీసుకొని వెళ్ళాడు. సుందరి భోజనం వడ్డించింది. మౌనంగా నాలుగు మెతుకులు నోట్లో వేసుకొన్నారు. చేతులుకడుక్కొని తమ తమ గదులకు వెళ్ళిపోయారు. సుందరి.. భర్త మామగార్ల మౌనానికి బాధపడింది. 

*

మరుదినం దశరథరామయ్య పిలువగా.. అడ్వికేట్ అనంతాచారి వచ్చాడు. వెంకటరామయ్య వరండాలో కూర్చొని కళ్ళు మసుకొని వున్నారు. 


‘‘అయ్యా!.. నమస్కారం.. ” చేతులు జోడించాడు అనంతాచారి. 


కళ్ళు తెరిచి ఆచారిని చూచి.. “ఏమిటి విషయం అనంతాచారి?” మెల్లగా అడిగాడు వెంకటరామయ్య.


"అబ్బాయిగారు రమ్మన్నారండి. ”


దశరథరామయ్య వరండాలోకి వచ్చాడు.. "కూర్చోండి అనంతాచారిగారు. ” 

అనంతాచారి కూర్చున్నాడు. 


“నాన్నా.. ! ఆస్థి పంపకాలు చేసి వాడి భాగం పత్రాలను వాడికి చేర్పించాలనుకొన్నాను. వాడు ఆ మన్మధరావుతో చేరి.. మనలను కోర్టుకు లాగడం నాకు యిష్టంలేదు. ” ఎంతో అనునయంగా పలికాడు దశరథరామయ్య. 


కొడుకు ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు వెంకటరామయ్య. తలను క్రిందికి దించుకొని.. 

“సరే!.. నీ యిష్టం. ” సుధీర్ఘమైన నిట్టూర్పును విడిచాడు వెంకటరామయ్య. ఆ క్షణంలో వారి వదనంలో అంతులేని ఆవేదన. 


“యావదాస్థినీ.. ఏడు భాగాలుగా పంచాలి అనంతాచారిగారు. వివరాలను యీ కాగితాల్లో వ్రాశాను. దాని ప్రకారం డాక్యుమెంట్లను రడీ చేయండి. ” తన చేతిలోని కాగితాలను అనంతాచారికి అందించాడు దశరథరామయ్య. ఆచారి అందుకొన్నారు.


దశరథరామయ్య మాటలకు వెంకటరామయ్య.. 

“యింకా నాకు ఎందుకయ్యా భాగం!.. చూడవలసినవన్నీ చూచేశాను. అనుభవించాను. భాగాలు ఆరు. నీకు, నీ భార్యకు, నీ యిద్దరు బిడ్డలకు, నీ చెల్లెలికి, సునందకు.. వాడికి అంతే.. ఆచారీ!.. నేను చెప్పింది నీకు అర్థం అయింది కదూ!.. ” విరక్తిగా నవ్వుతూ అనంతాచారి ముఖంలోకి చూచాడు. 


“అర్థం అయిందయ్యా!.. ” ఎంతో వినయంగా పలికాడు. అనంతాచారి. 


ఆరు పత్రాల మీద ఆస్థి వివరాలను వ్రాశాడు ఆచారి. వెంకటరామయ్యగారికి పత్రాలు, పెన్ అందించాడు. అన్నింటి మీదా వెంకటరామయ్య సంతకం చేశాడు. పత్రాలను అనంతాచారికి యిచ్చాడు. లేచి.. తన గదిలోనికి వెళ్ళిపోయాడు కారిన కన్నీటిని పై పంచతో తుడుచుకొంటూ. వారి హృదయంలో దావాగ్ని నిండిపోయింది. 


తండ్రి ఆవేదనను అర్థం చేసుకొన్న దశరథరామయ్య నయనాలు చమ్మగిల్లాయి. ఆచారి చేతిలో ఐదు పత్రాలను.. తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆచారిగారి చేతిలో ఒక పత్రం మిగిలివుంది. 


“దాన్ని నందనకు అందచేయండి ఆచారిగారూ!.. ” ఎంతో గాంభీర్యం నిండి వుంది ఆ పలుకుల్లో. 


సుందరి అక్కడికి వచ్చింది. తన చేతిలోని పత్రాలను ఆమెకు అందించాడు. అనంతాచారికి ద్రవ్యాన్ని యిచ్చాడు. ఆనందంగా చేతులు జోడించి.. శలవు తీసుకొని అనంతాచారి అక్కడినుంచి నిష్క్రమించారు. 


పత్రాలను తీసుకొని సుందరిలోనికి వెళ్ళిపోయింది. అంత వరకూ దశరథ హృదయంలో అణచివుంచిన ఆవేదన కన్నీరుగా మారి పొంగిపొరలింది. భోరున ఏడుస్తూ కుర్చీలో కూర్చున్నాడు. 

ఆ రాత్రి.. ఆ తండ్రీ కొడుకుల పాలిటి కాళరాత్రి. 


ప్రతిరోజూ తనకంటే ముందు నిద్రలేచే తండ్రి పది గంటలైనా గదినుండి బయటికి రానందున.. ఆశ్చర్యంతో దశరథరామయ్య తండ్రి గదిలోకి ప్రవేశించాడు. వెంకటరామయ్య వెల్లికిలా పరుండి నిద్రలో మునిగి వున్నారు. అనుమానంతో.. తండ్రి శరీరాన్ని తాకాడు దశరథరామయ్య. ఐస్ కన్నా చల్లగా గోచరించింది. తండ్రి శరీరం.. వెంకటరామయ్య శకం ముగిసింది. “నాన్నా!.. ” భోరున ఏడుస్తూ తండ్రి హృదయంపై వాలిపోయాడు దశరథరామయ్య. ఆ రోదనను విని సుందరి పనివాళ్ళు ఆ గదిలోకి పరుగెత్తారు. 


వెంకటరామయ్య సమాధి.. తన భార్య.. తల్లి సమాధుల ప్రక్కనే అమరింది. 

దక్షిణదేశపు తీర్థయాత్రలకు వెళ్ళిన బలరామశర్మ కుటుంబం నెల రోజుల తర్వాత తిరిగి వచ్చారు. జరిగిన చరిత్రను విని ఎంతగానో బాధపడ్డారు. 

*

తలను వంచి దశరథరామయ్య ముఖంలోకి చూచాడు వీరన్న. వారి కళ్ళు నుంచి కన్నీరు కారుతూవుంది. 

పాతజ్ఞపకాలతో అయ్యగారు బాధ పడుతున్నారని గ్రహించాడు వీరన్న. 

“అయ్యా!.. ” మెల్లగా చెవికి దగ్గరగా పలికాడు. 


దశరథరామయ్య తొట్రుపాటుతో వీరన్న ముఖంలోకి చూచాడు. పైపంచతో ముఖాన్ని తుడుచుకొన్నాడు. 


"పొద్దు పోయిందయ్యా!.. తమరు కూర్చొని చాలాసేపయిందయ్యా.. యింటికి.. ”


“ఆఁ.. వెళ్ళాలి.. సుశీల నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. " సోఫా నుంచి లేచాడు దశరథరామయ్య. 


యిరువురూ గెస్టుహౌస్ నుండి బయటకి వచ్చారు. 

తోట గేటు మూసి.. వీరన్న యజమానిని అనుసరించాడు. 

“నీవు వెళ్లు వీరన్నా. ”


"ఫరవాలేదయ్యా!.. మీతో యింటిదాకా వస్తాను” ఎంతో వినయంగా పలికాడు వీరన్న. 


సుశీల యింటిని సమీపించారు ఆ యిరువురు. శంకరయ్య సుశీల వాకిట్లో వారికి ఎదురైనారు. 

“యీ రోజు చాలా సేపు తోటలో వున్నావు అన్నయ్యా”


“అవునమ్మా.. మనస్సు గతంలోకి వెళ్ళిపోయిందిరా!.. ఆఁ.. ”


నిట్టూర్చి.. “అందువల్లనే ఆలస్యం అయింది. " విచారంగా పలికాడు దశరథరామయ్య. 


"మరేం ఫర్వాలేదులే అన్నయ్యా.. రండి. ” ఆదరంతో ఆహ్వానించింది సోదరి సుశీల.

 

“రండి బావా!.. ” ప్రీతిగా పలికాడు శంకరయ్య. 


"అయ్యా!.. నేనిక శెలవు తీసుకొంటాను. ”


"మంచిది వీరన్నా. జాగ్రత్త. ”


వెంకన్న తోట వైపుకు వెళ్ళిపోయాడు. సుశీల శంకరయ్య దశరథరామయ్యలు సుశీల భవంతిలో ప్రవేశించారు. 


స్నానానంతరం.. అన్నయ్యకు, భర్తకు సుశీల భోజనం వడ్డించింది. చింత చిగురు పెసరపప్పు వేసి చేసిన పులుసుకూర, వంకాయకూరంటే దశరథరామయ్యకు చాలా యిష్టం. ఆనందంగా భోంచేస్తున్నాడు దశరథ. 


“అన్నా!.. కూరలు బాగున్నాయా!.. ”


"అమృతంలా వున్నాయి. ”


“నీకు యీ రెండు కూరలు ఎంతో యిష్టం కదా అన్నయ్యా!.. అందుకే చేశాను. ” నవ్వుతూ చెప్పింది సుశీల. 


ప్రీతిగా సుశీల అన్నగారి ప్రక్కన కూర్చొని అడిగి అడిగి వడ్డించింది. “చాలా రోజుల తర్వాత యీపూట కడుపునిండా తిన్నానమ్మా!.. ” చెల్లెలి ముఖంలోకి చూస్తూ ఆనందంగా పలికాడు దశరథ. 


యింతలో పిల్లలు గోపీనందన, హిమబాల సుశీల కొడుకు నారాయణ నెల్లూరు నుంచి వాచ్చారు. వాళ్ళు అక్కడ చదువుకొంటున్నారు. పిల్లలరాకతో ఆ ముగ్గురు పెద్దల వదానాల్లో ఎంతో ఆనందం. 

*

దశరథనందన.. ఆ వూరి బస్టాండుకు వచ్చాడు. నెల్లూరికి వెళ్ళే బస్సులో ఎక్కి కూర్చున్నాడు. ఏడ్చి ఏడ్చి అతని కళ్ళల్లో కన్నీరు యింకి పోయాయి. 


ఆ రాత్రి ఏం జరిగిందో తనకు తెలియదు. చేయరాని తప్పు తను చేసినట్లుగా నింద తనపై పడింది. యిది సాధారణ నింద కాదు. అది ఒక ఆడపిల్ల నిండు నూరేళ్ళకు సంబంధించింది. ఆ కారణంగానే, తనకు తండ్రి, తాతయ్య యింతటి శిక్ష వేశారు. తనను యింట్లో నుంచి బయటికి పంపేశారు. 


వారు ఎంతో గౌరవాభిమానాలు కలవారు. మన్మధరావు పక్కా రాజకీయ నాయకుడు. తండ్రి దశరథరామయ్యకు అతని మాటలు, నటన వారికి ఎంతో బాధను తలవంపును కలిగించాయి. తనను దోషిగా పరిగణించారు. తనకు యీ శిక్షను విధించారు. 


తను దోషా!.. నిర్ధోషా!.. అన్నది తనకే అర్థం కాని విషయం. అంతా అయోమయం. 


బస్సు నెల్లూరు చేరింది. లాడ్జిలో రూమ్ తీసుకొన్నాడు. విస్కీని తెప్పించాడు. మనస్సులోని వ్యధను, మస్తిష్కంలోని ఎడతెగని ఆలోచనలనూ మరచి ప్రశాంతంగా నిద్రపోవాలని విస్కీని సేవించాడు. తల, తనువు కైపులో మునిగిపోయాయి. మంచంపై వాలిపోయాడు. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



29 views0 comments

Comments


bottom of page