'Karuna Katha' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 03/07/2024
'కరుణ కథ' తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
కరుణ కాలేజ్ నుండి వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళ బిందె తీసుకుని బయలు దేరింది.
"ఎందుకే? ఇపుడేగా కాలేజ్ నుండి వచ్చావు. అయినా కొన్ని నీళ్ళు వున్నాయే, రేపు తేవచ్చులే..” అని కరుణ అమ్మ జానకమ్మ అంటున్నా వినకుండా "లేదమ్మా తెస్తా”నంటూ.. వూరి చివర, చెరువు పక్కనున్న బావికి వెళ్ళింది.
కరుణ అల్ప సంతోషి. ప్రతి చిన్నదానికి హడావుడి చేయటం, అందరిని నవ్విస్తూ ఉండటం, ఉన్నదానిలో హ్యాపీగా ఉండటం కరుణ లక్షణం.
అందుకే అందరూ.. కరుణను ఇష్ట పడతారు. వెళ్తూ దారిలో ఫ్రెండ్స్ ను కలుపుకుని బావికి వెళ్లటం
కరుణకు అలవాటు. అందరికి, ఆరోజు కాలేజ్ లో ఏమి జరిగింది.. లెక్చరర్లు ఎలా లెసన్సు చెప్పేది.. మిమిక్రీ చేసి చూపించేది కరుణ. విజయ, రాజీ, సీత, పూర్ణ అందరూ కరుణ మాటలకు నవ్వేవాళ్లు.
చుట్టు పక్కల ఇళ్ళకు, వెళ్ళి పని చేసి పెట్టేది.
అందరూ.. “కరుణ, నువ్వు పెళ్లి చేసుకుని వెళితే, ఈ బజారుకు సందడి ఉండ”దనేవారు.
అలాంటి కరుణ కు పెళ్లి కుదిరింది.
భర్త రఘు, అమెరికాలో సాఫ్ట్ వేరు జాబ్ చేస్తున్నాడు.
ఫోటో చూపించారు. బానే వున్నాడు. వాళ్లకు కరుణ నచ్చింది. వచ్చే నెల్లో పెళ్లి చేసుకుని, తర్వాత అమెరికా వెళ్ళటం అనుకున్నారు.
ఫోన్లో ఒకటి రెండుసార్లు, తప్ప మాట్లాడలేదు కరుణ రఘుతో.
పెళ్ళిలో చూడటమే, రఘుని కరుణ. పెళ్ళి బాగా జరిగింది. పెళ్లయి రఘు వెంటనే వెళ్ళాడు, లీవ్ లేదని.
'రిజర్వుడుగా వున్నాడు, తక్కువ మాట్లాడుతాడులే' అనుకుని సర్ది పెట్టుకుంది తన మనసును కరుణ.
అత్తగారు వాళ్ళు ఎంతో ప్రేమగా చూసేవాళ్లు, కరుణను.
"మా రఘు చిన్నప్పటినుండి, మొహమాటస్తుడు. నువ్వే వాడిని మార్చా”లనేవారు.
కరుణకు వీసా వచ్చి అమెరికా వెళ్ళేసరికి, నాల్గు నెలలు పట్టింది. ఆ నాల్గు నెలలో రఘు ఫోన్లో మాట్లాడటం చాలా తక్కువ. ఎంతో, ఆనందంగా, అన్నీ సర్దుకుని కరుణ అమెరికా వెళ్ళింది. రఘు ఎయిర్పోర్ట్ కు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. కానీ ఆ కళ్ళలో ఎక్కడా ప్రేమ కనపడలేదు కరుణకు.
సరేలే.. అని మనసును సర్ది చెప్పుకుంది.
ఇంటికి వెళ్ళాక, "వంట చేసి వుంచాను. తినేసి నిద్రపో, ఆరూంలో" అంటూ బెడ్రూం చూపించాడు.
"మీరూ.. " అంది కరుణ.
"నా బెడ్ రూం అదిగో" అని చూపించి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఒక్కసారిగా స్టన్ను అయింది.
భార్యాభర్తలులాగా లేకుండా, ఫ్రెండ్సు మాదిరిగా ఉన్నందుకు ఏదోగ వుంది. పొద్దునే, లేచి చూసేసరికి, రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తున్నాడు.
ఇండియాలో వున్న ఆ పదిహేను రోజులు నయం, ఒకే గదిలో అన్నా వున్నాము. ఇదేంటి? అమెరికా వచ్చిన తర్వాత చెరొక బెడ్రూంలో వుండటం,
అంతా, వింతగా వుంది కరుణకు.
అత్తగారు, అమ్మా వాళ్ళు ఫోన్ చేసి, అమెరికా ఎలా వుంది. ఏం చేస్తున్నావు అని ఒకటే, ప్రశ్నలు.
అత్తగారు, "మా రఘు మొహమాటస్తుడు, నువ్వు, ఎక్కువ మాట్లాడుతావని, ఎన్ని సంబంధాలు వచ్చినా, నిన్ను సెలెక్ట్ చేశాం. వాడితో కలివిడిగా ఉంటే, బాగా మాట్లాడుతా”డని సలహాలు ఇచ్చింది.
"జట్లాగ్ గా వుంది. మళ్ళీ మాట్లాడుతా”నని ఫోన్ పెట్టేసింది. కరుణకు అత్తగారి మాటలు, విడ్డూరంగా అనిపించాయి.
'అంత మొహమాటస్తుడు అమెరికాదాకా వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నాడు' అని అడగాలనిపించింది.
కానీ అడగలేదు బావుండదని.
సాయంత్రం, రఘు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
రఘు వచ్చాడు. "లంచు చేసావా?" అన్నాడు.
ఆ.. అని తలాడించింది కరుణ.
"టివిలో తెలుగు ప్రోగ్రామ్స్ వస్తాయి, చూడు బోరు కొడితే" అన్నాడు రఘు.
వంట ఎలా చేయాలో చూపించాడు. డిష్ వాషరు ఎలా ఆన్ చేయాలి, వాషింగ్ మిషన్ ఎలా రన్ చేయాలి అన్నీ చూపిస్తే చూసింది. ఆ పూట వంట చేసింది. తినేసి, తన రూంలో కెళుతు, డోర్ వేసుకున్నాడు.
మళ్ళీ స్టన్ను అయింది కరుణ. సిగ్గు విడిచి ఏమని అడుగుతుంది, నేను మీ రూంలో పడుకుంటానని.
తన రూంలో పడుకుని 'అసలు రఘుకు నేనంటే.. ఇష్టమా కాదా?' అని ఆలోచించింది.
ఆ వీకెండ్, పక్కన వున్న లేక్స్ కు తీసుకెళ్ళి చూపించాడు రఘు. కరుణకు, ఇక్కడ ఉండటం పంజరంలో వున్నట్లుగా వుంది. వస పిట్టలా వాగే తను, ఇక్కడ, ఎవరితో, మాట్లాడక పిచ్చెక్కినట్లుగా వుంది.
వూరిలో, ఫ్రెండ్స్ అందరూ గుడి కెళ్లటం, అందరూ కలిసి మాట్లాడుకోవటం గుర్తుకొచ్చి ఎపుడు, ఇండియా వెళ్ళి మా వూరు చూస్తానా? అని వుంది కరుణకు.
ఇండియా నుండి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు.
" మీ ఆయన నిన్ను ఎట్లా? చూసుకుంటున్నా”డని.
'ఏమని? చెప్తుంది, ఇంతవరకు, మా ఆయన నన్ను ముట్టుకోలేదని. ' బయటకు వెళ్ళినపుడు దిగిన ఫొటోస్ పెట్టేది వాళ్ళకు.
"వాళ్ళు బాగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నావుగా?" అంటే, ఒక, నవ్వు నవ్వి వూరుకుంది కరుణ.
కరుణ అత్తగారు, ఫోన్ చేసి "కరుణ, తొందర్లో నాకు మనవడు, కావా”లంది. ఆ మాటకు జవాబివ్వక కరుణ సిగ్గుపడింది.
అమ్మా వాళ్లతో రఘు దూరంగా వుండే విషయం మాట్లాడదామని ట్రై చేసి.. ఏంటో సిగ్గుగా అనిపించింది. ఇంకా కొన్నాళ్ళు ఆగిన తర్వాత చెప్పొచ్చులే అని వూరుకుంది కరుణ.
వచ్చి నెలయిన తర్వాత, ఒకరోజు ఆపుకోలేక రఘును అడిగింది కరుణ. "నేనేమన్నా, తప్పు చేశానా? మీరు ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నారు"
"అదేమీ లేదు, రేపు చెప్తాను అసలు సంగతి. పడుకో.. వెళ్ళి" అంటూ తన రూంలోకి వెళ్ళాడు.
మరుసటి రోజు రఘు ఏమి చెప్తాడా? అని వెయిట్ చేస్తూ ఆ రాత్రి నిద్ర పట్టలేదు కరుణకు.
మరుసటి రోజు సాటర్ డే అవ్వటం వల్ల రఘు కరుణను, ఫ్రెండింటికి వెళ్దామని తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే,
"జూలి.. !"అని పిలిచాడు. ఒక నీగ్రో లేడీ బయటకు వచ్చింది. కడుపుతో వున్నట్లుగా ఆమె ఫ్రాక్లోనుండి పొట్ట కనపడింది.
"హాయి రఘు.. !" అంటూ రఘు పక్కన కూర్చుంది. కరుణను పరిచయం చేసాడు. రఘు కరుణ వైపు చూస్తూ, "జూలి నా భార్య.. !" అన్నాడు.
ఆశ్చర్యంతో చూసింది జూలీ వైపు.
మరి నేను అన్నట్లు చూసిన కరుణతో, "సారి కరుణ.. ఈ విషయం నీకు మన పెళ్లి ముందే చెప్పాల్సింది. కానీ అమ్మా వాళ్లు, చచ్చిపోతామని బెదిరించి నాకు పెళ్లి చేసారు. జూలీ మా ఆఫీసులో పని చేస్తుంది. ప్రేమించి పోయిన యియర్ పెళ్లి చేసుకున్నాను. నీకు ఇక్కడికి వచ్చినా తర్వాత, చెప్పి మెల్లిగా నిన్ను కన్విన్స్ చేద్దామని చెప్పలేదు. అందుకే ఇన్నాళ్లు నీతో దూరంగా ఉన్నాను. "
కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ "మీరు.. మీ అమ్మ వాళ్ల మధ్య నేను బలైపోయాను. ఇక్కడికి వచ్చిన రోజన్నా, చెప్పాల్సింది. నెలరోజులు ఈ మానసిక క్షోభకు గురవకుండా వుండేదాన్ని" అంది కరుణ.
"అవును, తప్పు చేసాను. జూలీ ఆఫ్రికా వెళ్ళి నిన్ననే వచ్చింది. తనను చూపించి చెపితేనే నీకు క్లారిటీ వస్తుందని చెప్పలేదు”.
" అవును. తను మనింటికి.. సారి.. మీ ఇంటికి రాక ఇక్కడ ఒంటరిగా ఉందే” అంది కరుణ.
"ఇది తన ఫ్రెండ్ రూం. నీకు నచ్చ చెప్పి తన్ను మనింటికి తేవచ్చని.. తేలేదు” అన్నాడు రఘు.
"మీ ఇంటికి మీ భార్యను తేవటానికి ఈ అనామకురాలి పర్మిషన్ ఏంటి? విడ్డూరం కాకపోతే" బాధ పడుతూ అంది.
వీళ్ళు మాట్లాడే భాష అర్థం కాక, జూలీ వీళ్లకు, స్నాక్స్ తేవటం కోసం లోపలికి వెళ్ళింది. కాసేపు కూర్చుని వచ్చేసారు. జూలీ చక్కగా కరుణతో మాట్లాడింది. తన కొచ్చిన ఇంగ్లీషులో మాట్లాడి ఇంటికి వచ్చి బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద పడి ఏడ్చింది కరుణ.
మరుసటి రోజు లేస్తూనే, రఘుతో ఈవెనింగ్ "మీ భార్యను, ఇక్కడికి తీసుకురండి. నాకు, ఇండియాకు టికెట్ బుక్ చేయండి" అని అడిగింది.
"ఒకే.. !" అని తలూపి ఆఫీసుకెళ్లాడు రఘు.
ఆ సాయంత్రం, రఘు జూలిని ఇంటికి తెచ్చేసరికి, గుమ్మములో ఎర్రనీళ్లు అన్నీ రెడీ చేసి వుంచింది కరుణ. జూలీ కారు దిగి ఇంట్లోకి వస్తుంటే.. దిష్టి తీసి ఇంట్లోకి తెచ్చింది. రఘు, కరుణను మెచ్చుకోలుగా చూసాడు.
ఒక నెలలో టికెట్ దొరికింది కరుణకు. ఈలోపు దగ్గర్లో వున్న ప్లేసెస్ చూపించాడు. జూలీకి ఇండియన్ వంటలు రుచి చూపిస్తూ, చాలా కేర్ గా చూస్తుంది కరుణ.
తన చీరల్లో కొత్త చీర తీసి, పండ్లు పువ్వులు, స్వీట్స్ జూలీ వొళ్ళో పెట్టీ, రఘు ఫ్రెండ్స్ భార్యల్ని పిలిచి శ్రీమంతం ఫంక్షన్ చేసింది కరుణ. జూలీ చీరలో బావుంది. జూలీ, రఘులు ఎంతో కృతజ్ఞతతో చూసారు కరుణ వైపు.
ఎవరికీ తను ఇండియా వస్తున్నట్లు రఘును చెప్పవద్దంది. ఈ నెల నా గురించి అలోచించి దిగులు పడతారని చెప్ప వద్దంది. జూలీకి నెలలు నిండటంతో ఇంట్లోనే ఉండటం వల్ల ఇద్దరూ, మాట్లాడుకునేవారు.
ఇంకో వారంలో వెళతానని అందరికీ షాపింగ్ చేసింది కరుణ. అన్నీ షాపింగ్ మాల్స్ కు తీసుకెళ్ళి, కొనిపెట్టాడు రఘు. పెళ్లికి అయిన ఖర్చులు, కరుణ బ్యాంక్ అకౌంట్ లో వేసి, ఆ సంగతి చెప్పాడు రఘు.
కరుణ కూడా తనకు రఘు చేసిన ద్రోహాన్ని మరచిపోయి, తనపట్ల అతను ఇప్పటివరకు తప్పుగా ప్రవర్తించనందుకు, థాంక్స్ చెప్పింది.
విడాకులకు అప్లై చేసారు ఇద్దరూ.
తన ఫ్రెండ్, ఇక్కడ ఒకడున్నాడని, కావాలంటే.. అతన్ని పెళ్లికి ఒప్పిస్తాను,చేసుకుంటావా? అని అడిగాడు రఘు కరుణను.
"లేదు. నాకు అమెరికా అంటే మోజు పోయింది. మా ఊరు, అంటే, నా కిష్టం. మా మామయ్య కొడుకు నన్ను చేసుకుంటానని అడిగితే, మా అమ్మ వాళ్ళు అమెరికా సంబంధం చేసుకుంటే సుఖ పడతానని మీకిచ్చి చేసారు. ఇపుడు మా బావ వ్యవసాయం చేసినా సరే, నా కన్నా తక్కువ చదువైనా సరే, అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని, మా అమ్మానాన్నలకు దగ్గర్లో మా వూరిలో వుంటా”నంది కరుణ.
“ఎంతోమంది నాలాగా, ఎన్నో కలలతో అమెరికా వస్తున్నారు. అలాంటి వాళ్లకు నేను రోలుమోడల్ అవ్వాలి. అమెరికా సంబంధాలు వద్దని, ఇండియన్ సంబంధాలు ముద్దని, దూరపు కొండలు నునుపు అని చెప్తాను. ఇండియా సంబంధాలు చేసుకునేట్లుగా వాళ్ళను ప్రోత్సహిస్తాను. ఇది నా తక్షణ కర్తవ్యం” అంది కరుణ.
ఆ మాటకు తలదించుకున్నాడు రఘు.
అమెరికా వస్తున్నప్పుడు, ఎన్నో ఆశలతో వచ్చిన కరుణ ఇండియాకు వెళ్ళేప్పుడు రేపటి కొత్త ఆశకు జీవం పోయటానికి వెళ్తునట్లుగా ఫ్లైట్ ఎక్కింది.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments