top of page

స్వర్గానికి దారి ఎటు???'Swarganiki Dari Etu' - New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy

Published In manatelugukathalu.com On 03/07/2024

'స్వర్గానికి దారి ఎటు' తెలుగు కథ

రచన : డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

కథా పఠనం: పద్మావతి కొమరగిరిఆ రోజు.. ప్రతి రోజుకూడా ఒకే ప్రశ్న -  “స్వర్గానికి దారి ఎటు?. ఏం చేస్తే పోతాము, ఏ మతంలో చేరితే నేరుగా వెళ్ళగలము?” అని పదే పదే అడుగు తున్నాడు. 

ఎందుకో తెలియదు. బహుశా తను....?


ఏం చెప్పాలో అర్ధంగాక నవ్వుతూ, “నాకూ అంతగా తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది” అనే వాడిని. 


కానీ వదిలేవాడు కాదు. ఇదేవిటి ఈ వింత విడ్డూరమైన విచారణ అనుకునేవాడిని. 

“మంచి చేస్తే స్వర్గానికి వెళతారంట. నేను మంచే చేసానుగదా!”


జవాబుకోసం ఎదురు చూస్తూ నన్నే గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కరు తాము చేసే పని మంచిది అని గట్టిగా సమర్ధించుకుంటారు. అది తెలియని తనం. మూర్ఖత్వపు వ్యక్తిత్వం. కానీ ఇతర్లకు....??


చిన్నగా నవ్వుతూ, “ఏమో అంటారు! వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి చెపితేకదా నమ్మాలి” అన్నాను.

 

“నిజమే! కానీ కాశీలోనే చనిపోయి, హరిశ్చంద్ర ఘాట్ లో ఖననం చేస్తే ఎన్ని పాపాలు చేసున్నా తప్పక స్వర్గానికి వెళతారని అందరి నమ్మకం. నా నమ్మకం కూడా అదే!! తీసుకెళతావా?”


కన్నీళ్ళులతో ప్రాధేయపూర్వకంగా నావైపే చూస్తున్నాడు. అవునని గాని కాదనీ చెప్పలేదు. చాలా ఉద్వేగానికి లోనయ్యాను. అయ్యో పాపం అని హృదయం ద్రవించింది. ముక్తి, మోక్షం ఇవి మరు జన్మ లేకుండా చేసుకోవడం కోసం!! మరుజన్మ ఉండకూడదని, మానవులుగా పుట్టకూడదని!! 


అంతటి తపోధనులు మహిమాన్వితులు ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఘోరతపస్సులు అందుకే చేసారంటారు. స్వర్గానికి వెళ్లాలని ఎవ్వరూ చెయ్యలేదనుకుంటాను. 

“నిన్నే ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వు నా ఆత్మీయ స్నేహితుడవు.. మన పరిచయం యాబైయేళ్లది!! స్వర్గానికి తప్పక పోవాలనే నా చివరి కోరిక తీరుస్తావనే నమ్మకంతో నిన్ను...? ”


కాసేపు అతని వైపు చూసి, ” ధర్మార్ధ కామ మోక్షములు.... కోరికలను, డబ్బును ధర్మబద్దంగా అనుభవించితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటారు. ” అని రాని నవ్వు తెచ్చుకున్నాను. 


“తప్పనిసరిగా బ్రతుకు కోసం కొన్ని చేయాల్సి వస్తుంది. అవన్నీ తప్పులా? ప్రాణం పోయే ముందుగా తులసి తీర్ధం నోట్లో పోయించుకుని ‘రామా.. రామా’ అంటే స్వర్గానికి వెళతారంటకదా!! ”


నేను సమాధానం వెంటనే చెప్పలేక పోయాను. స్వర్గం ఒకటి ఉందని నమ్మకంగా తెలియదు. ఇక్కడే స్వర్గం నరకం ఉంటాయని, అవే మన మంచి చెడులోని వివక్షత సఘర్షణలు అని నా ఉద్దేశం!!


 క్రిస్టియానిటి జ్యూయిష్, ముస్లిమ్స్ మతాల అభిప్రాయం - స్వర్గం... హెవన్... పారడైజ్ ఉందని గట్టిగా నమ్ముతారు. మనకూ నమ్మకముంది. కానీ మోక్షం... స్వర్గం ఒక్కటేనా అని నాకు తెలియదు. 


 జొరోస్ట్రోయజమ్ లో చనిపోయిన నాలుగో రోజు ఆత్మను ఒక అడ్డుకట్ట దగ్గర నిలపడం బహుశా హిందూ మతం చెప్పిన వైతరణి నది ఏమో?? 


ఒక రోజు ఉంచి, ‘పాపాలేవైనా చిన్న చిన్నవి మిగిలి ఉంటే కడిగేసి, అది మంచి ఆత్మ అని నిర్ణయం జరిగిన తరువాత జగన్మోహిని వచ్చి, మధు పాత్రతో స్వాగతించి, పరిమళించే అద్భుత పూలవనంలో, శ్రవణానందకరమైన సమ్మోహిత సంగీత నృత్యాలతో, సంతోష మయమైన మందిరానికి తీసుకు వెళుతుందట. నిత్య యవ్వనంతో విరాజిల్లుతూ చావు పుట్టకలు లేని స్వర్గంలోకి ఆహ్వానిస్తారట..’ అని ఆ మతం నమ్మకం. 


పోనీ ఇది అనుసరించమని చెపితే??

 హిందూ మతంలో, ‘మానవత్వపు విలువలతో నువ్వు మంచిగా జీవించి, దేవుడ్ని నమ్మి బ్రతికితే నీ ఆత్మ వైతరణి నది దాటితే, అప్పుడే స్వర్గ ప్రవేశం’ అంటారు.


 ‘నువ్వు చేసే పాప పుణ్యాల మీద ఈ నదిని దాటడానికి అనుమతి ఉంటుంది. కానీ చేసిన తప్పులకు నరకంలో శిక్ష అనుభవించి తీరాలి’ అని విశ్వసిస్తారు. కానీ ఏ ఒక్కరూ లెక్కే చెయ్యరు. డబ్బుకోసం, స్త్రీకోసం చెయ్యని ఘోరాలు, అకృత్యాలు ఉండవు. అన్ని మానసిక, శారీరక రోగాలకు అవే కారణం!! తెలియదా? తెలుసు. కానీ!? 


బుద్ధిజంలో ‘అత్యాశ, కోరికలు నీ మరుజన్మకు కారణం. మాయకు లోబడి అహంకారంతో బ్రతికిన వారికి నిర్వాణం ఉండదు’ అని చెప్పారు. 


ఏది ఏమయినా చెడ్డకు నరకం.. మంచికి స్వర్గం అని అన్ని మతాలువారు నమ్ముతారు. మరి ఇప్పుడు ఈ చివరి గడియల్లో ఇతన్ని ఏ మతాన్ని నమ్మమనేది?

 

ఆయన నమ్మిన ప్రకారం చేసింది ఏదీ తప్పుకాదు. బ్రతకడానికి ఎన్ని తప్పులు చేసినా తప్పులేదు అన్నారు కొందరు. ఆకలికోసం ఎలాంటి తప్పు చేసినా సమర్ధనీయం అంటారు. అయినా తప్పు అంటే ఏవిటి? అని ప్రశ్నించాడు. 


“అత్యాశ అన్ని అనర్ధాలకు మూలం. వక్తిత్వం చచ్చి తీరుతుంది” అన్నాను. 


“అన్ని రోజులూ ఒకే విధంగా ఉంటాయా?..” 


దీనికి సమాధానం చెప్పలేక పోయాను. 


 “అరిషడ్వర్గాలను ఎవరైతే అదుపులో ఉంచుకోగలరో వాళ్ళు ఉత్తములు అని మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. జీవితం సాగిస్తూనే భవ బంధాలకు బానిసగాక, తటస్థంగా ఉంటే, వారే స్థిత ప్రజ్ఞులని, వాళ్ళకే స్వర్గ ప్రాప్తి అని అన్నారు. అదే నిర్యాణం... మోక్షప్రాప్తి!!”


“అరిషడ్వర్గాలు అంటే?” నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు.. 


“అరిషడ్ వర్గాలు... కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయిస్తేనే స్వర్గ ప్రాప్తి అని చెప్పారు”. అదే అన్నాను!! 


“మరి అవిలేకుండా మానవుల జీవితం ఉండదు. పుట్టుక ఎందుకు? మనుషులం కదా, ఎదో ఒక్క తప్పుకూడా చెయ్యకుండా ఉండలేము. కూటికోసమే కదా కోటి విద్యలు. ఇది పోటీ ప్రపంచం. కాస్త ఏమారితే ఒక్క మెతుకు దొరకదు. నయాన్నో భయాన్నో మోసం చేసో, హత్యలు చేసో సాధించుకోవాలి. అవి సహజ గుణాలు. పుట్టుకకు అర్ధం, పరమార్ధం!!” నా వైపు ధీమాగా చూస్తూ అన్నాడు. 


ఒక విధంగా ఆలోచిస్తే సుభాషితాలు ఆదర్శంగా తీసుకుని బ్రతకలేము. ఆశ పుట్టుకతోనే మనిషి ప్రాణాన్ని అల్లుకునే ఉంటాయి. పెరిగే కొద్ది ఆకర్షణలతో అత్యాశకు లోబడక తప్పదు. అందనివైనా సొంతం చేసుకోవాలనేది ప్రతి మనిషి తపన, లక్ష్యం అవుతుంది. తృప్తి అనేది ఒకటి ఉందని మరిచిపోతారు. 


నేనూ అతను చిన్ననాటినుంచీ స్నేహితులం. కానీ నేను చదివి డాక్టర్ని అయ్యాను. సంపాదించాలనే పట్టుదలతో చదువు మానేసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఇప్పుడు కోట్లకు పడగలెత్తి గొప్ప వారిలో చేరిపోయాడు. 


డబ్బు ఉంటేనే అన్ని అర్హతలు. చదువు వ్యక్తిత్వం అవసరం లేదు. అయినా మా స్నేహం చెదరలేదు. ఏ విషయమైనా నాతో చెప్పేవాడు. కొన్ని చెప్పకూడనివి దాటేసేవాడు. అదీ వ్యాపార విషయాలు. ఇప్పటికీ ఏకవచనంలో పిలుచుకునే అలవాటు ఉంది. 


నేను చాలా మంచి డాక్టర్ని, దయార్ద్ర హృదయుడ్ని అని అంటుంటాడు. 


“డబ్బు సంపాదించడం చేతకాదు. అమాయకుడవు నువ్వు. అందరూ తెలివి తక్కువ దద్దమ్మలు ఏవేవో బోర్డులు తగిలించుకుని ఎంతంత సంపాదిస్తున్నారు చూడు. సంవత్సరం తిరిగెలోగా కోటీశ్వర్లయి పోతున్నారు” అనేవాడు.. 


నాకు వచ్చేది, ఉండేది సుఖ జీవితానికి సరిపోతుంది. మరి పాకులాడటం ఎందుకు? ఆయన లాంటి జబ్బులు తెచ్చుకోవడం ఎందుకు? నాకు సంతృప్తి ఉంది. ఆరాటం లేదు. అందుకే డెబ్బై లోకూడా అరవైలా కనిపిస్తాను అంటారు. ఆరోగ్యం మహాభాగ్యం అనే సూత్రాన్ని నమ్మిన వాడిని!! 


అనుమానం...? ఏమీ చెయ్యని పద్దతిగా ఉండేవాళ్లకు జీవితాన్ని నరకం చేసే వ్యాధులు రావడం లేదా? 


అది విధి!? వంశం!! పొగురుతో, అశ్రద్దతో తెచ్చుకునేవే ఎక్కువ!! అదీ ఇతని జబ్బు!! 


ఎప్పుడూ నా దగ్గరకు రావడమో తీరిక ఉంటే నేను వెళ్లి కాసేపు మాట్లాడుకోవడం అలవాటయి పోయింది. తనకుండే వ్యాపకాలు, అలవాట్ల వలన నా అవసరం మరీ ఎక్కువ ఉంటుంది.. 


‘బ్రతుకయినా చావయినా నీ చేతుల్లోనే అని, నువ్వు మారాలి.. మారాలి!! డబ్బు డబ్బు ముఖ్యం!!’ అని పోరు పెట్టేవాడు. 


ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేని జబ్బుతో బ్రతుకుతూ ఉన్నాడు. తప్పక స్వర్గానికే వెళ్ళాలి అని పదే పదే అడుగుతూ చాలా దిగులు పడుతున్నాడు. అదే ఒక పెద్ద జబ్బు అయిపోయింది. 


“ఆలోచించకు, జబ్బు ఎక్కువతుంది” అంటే, “నువ్వు స్వర్గానికి దారి చూపిస్తావుకదా, నాకు భయం లేదు” అనే వాడు. 


ఏం చెప్పాలో అర్ధమయ్యేది కాదు. 

“అసలు నువ్వు స్వర్గాన్ని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు. ”


“కొద్ది నెలలో, , , దినాలో కదా నాకు మిగిలి ఉండేది”..


 కళ్ళల్లో నీళ్ళు అప్పుడే చూసాను. 

చాలా బాధ అనిపించింది. “అలా అన్నవాళ్ళే వంద సంవత్సరాలు బ్రతుకుతారు”


“నిజంగా!” ఎంతో ఆశ్చర్యపోతూ ఆశగా అడిగాడు. 


నాకు తెలుసు అతని జబ్బు!! ఎంతకాలం బ్రతుకుతాడో అని కూడా!? 

ఇన్ని ఉన్నా ఉందో లేదో తెలియని స్వర్గాన్ని, అందులో దొరికే ఆనంద సంతోషాలను అనుభవించా లని ఆరాటపడటం ఏవిటి? అనుభవించింది స్వర్గం, అనుభవించాల్సింది నరకం. ఇక్కడే.. బ్రతికుండగానే!! 


సరెండర్ టు మి.. నిన్ను నువ్వు నాకు అర్పించుకో! నిన్ను నాలో ఇక్యం చేసుకుంటాను. దేవుడు అనబడే విశ్వశక్తి బ్రతిమలాడుతుంది. ‘ నేను నాది’ అనే అహంకారం మనలో చస్తేకదా?. 


కానీ ఒక ఇరవై సంవత్సరాలకు ముందు పెద్ద పెద్ద దేవాలయాలలో కూడా చాలా కొద్ది మంది దర్శనానికి వెళ్ళేవారు. ఇప్పుడో.. డబ్బు ఎక్కువయి, పాపం పెరిగి పోయి, భయం ఎక్కువయి, ఇంకా కావాలని ప్రతి వీధి పక్కన, రోడ్డుమీద ఉన్న అనామక గుడిలోనూ తోసుకుని, తోక్కిసలాడి, అడ్డ దిడ్డంగా సంపాదించిన కోట్ల డబ్బు చాలా ఉదారంగా హుండీలలో వేసి, తేలిగ్గా పాపాలు కడిగేసుకుంటున్నారు. 


“శాపాలు పనిచేస్తాయంటావా?”


ఇది ఎదురు చూడని ప్రశ్న “అంటే?” అతని కళ్ళలోకి చూస్తూ అడిగాను. 


“వయసులో ఉన్నప్పుడు కావాలనుకున్నది.. కంటికి నచ్చినదాన్ని బలాత్కారంగా వందల మందిని అనుభవించాను. శాపాలు పెట్టారు!! దుమ్మెత్తి పోశారు ”


అందుకే ఇప్పుడు భార్య అతన్ని పట్టించుకోవడం లేదేమో!! ఇది మదపు కామానికి నిదర్శనం. 


“ఎదురు చెప్పారంటే ప్రాణాలు తీసాను. ”


 క్రోధానికి అర్ధం. అందుకేనెమో ఇప్పుడు కొడుకు నానా తిట్లు తిడుతూ తన్నబోతున్నాడు. 


“ఒక్క పైసాకూడా ఖర్చు పెట్టేవాడిని కాదు. ఎవరైనా తింటుంటే ఒప్పుకునేవాడిని కాదు.”


తన దగ్గర ఉన్న సేవకులే తిని, బలిసి, దొరికింది ఎత్తుకు పోతున్నారు. ఇదే లోభమేమో?


“ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను. పెండ్లి అయినా వొంపులు తగ్గనే లేదు. అజంతా శిల్పంలా ఉండేది. ఎంతో బ్రతిమలాడాను. నువ్వు లేకుంటే బ్రతకలేనని కాళ్ళుకూడా పట్టుకున్నాను. లొంగలేదు. మరొకరికి దొరక కూడదని గొంతుకోసి చంపేసాను. నా ప్రేమ అలాంటిది!!” అని మరీ మరీ చెప్పాడు. 


దాన్ని వ్యామోహపు ఉన్మాదం అంటారుగాని ప్రేమ అంటారని నాకు తెలియదు. 


“దేన్నీ లెక్క చేసే వాడ్ని కాదు. ఎవ్వరైనా నా ముందు తల వంచాల్సిందే! నన్ను నేను కాపాడుకోవడానికి కబ్జాలు, హత్యలు చెయ్యాల్సి వచ్చింది. తప్పు ఎలా అవుతుంది”


ఇది మదంతో చేసింది. మరి బ్రతకడానికి అంటున్నాడు??


“అప్పుడు కోరుకున్న ఆవిడే నన్ను ప్రేమించి ఉంటే...? గొంతుకోయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఈ రోజు ఇంత దిక్కులేని...??” గొంతు పూడుకు పోయింది. 


“నీకు ఇద్దరి నర్సుల్ని పెట్టి సేవలు చేయిస్తున్నారు కదా?”


“వాళ్ళు డబ్బుకోసం చేసే వాళ్ళు. ప్రేమతో ఆప్యాయతతో చేసే వాళ్ళు కాదు. ఆ ముఖాలు చూస్తే వాంతి వస్తుంది. ముసిలివి!! చూడాలనిపించే అందం, ఆహ్లాదం కలిగించే పలకరింపు ఉంటే నేను మరో ఐదు సంవత్సరాలు బ్రతుకుతాను. ” అని నా వైపు చూసాడు. 


ఇప్పుడు కూడా ఇతనికి ఎదపొంగులుండే యవ్వనపు నర్సులు కావాలి.. 

“శ్రద్దగా చెయ్యాల్సింది చేస్తున్నారుకదా?” 


అతని కోరిక అసమంజసం అనుకోలేదు. కానీ అతి అనిపించింది. 

“చేస్తున్నారు. రెండు మూడు సార్లు బెల్ కొడితే అయిష్టంగా ముఖాలు మాడ్చుకుని వస్తున్నారు. ”


“మరి మీ ఆవిడతో చెప్పకపోయావా!? నువ్వంటే చాలా ప్రేమకదా! ఆవిడే దగ్గర ఉంటుందేమో?”


“ఆవిడ నాదగ్గర ఉంటే ఎలా? వి ఐ పీ లను మచ్చిక చేసుకోవాలి కదా! కొడుకు చేసే వ్యాపారాలకు వాళ్ళ సహకారం కావాలి కదా! చేసేది కత్తిమీద సాములాంటిది. అజాగర్తగా ఉంటే ఎదుటి వాళ్ళు కొట్టుకు పోతారు. కోట్లు పోతాయి!! ”


భౌతిక సుఖాలమీదనే మనసుంది. మరి స్వర్గానికి పోవాలని తపన ఎందుకో? అదే అడిగాను. 


“అక్కడ వావి వరసలు లేని అప్సరసలు పొందు, అమృతం, సర్వవేళలా దొరుకుతుంది కదా!! చావు అనే మాట వినిపించదుకదా!! నిత్య యవ్వనంతో ఉంటానుకదా!”


ఏం మాట్లాడాలో అర్ధంగాలేదు. అతను జన్మరాహిత్యంకోసం, మోక్షం కోసం చూడటం లేదు. అతనికి  ఇంకా అడ్డు, ఆపులేని కన్నెరికం తరగని అప్సరసల పొందు కావాలి. దానికి దారి ఎటూ అని నేను చెప్పాలి. 


మౌనంగా ఉండి పోయాను. స్త్రీ పొందులోని అమరత్వపు సుఖం కంటే ఆనందాన్ని యిచ్చేది ఈ భువిలో దివిలో మరొకటి లేదేమో? 


మహా ఋషులందరూ అందుకోసమే చేసారా? ముక్తి, విముక్తి కోసంకాదా?? 

ఇంతలో ఫోను వచ్చింది. 


ముఖంలో రంగులు మారిపోతున్నాయి. నాకే భయం వేసింది. విని ఒక్క అరుపు అరిచాడు. 


 “కళ్ళుమూసుకుని ఎట్లా ఉంటావురా? నాలుగు కోట్లు!! ఎత్తిపారెయ్యి! ఒక్క నా కొడుకు మిగలకూడదు. ” అలిసిపోయి నా వైపు చూసి, “ఇదంతా బిజినెస్స్. తప్పదు!!” అని సమర్ధింపు మొహమాటంగా నవ్వాడు. 


“ఇప్పుడవన్నీ ఎందుకు? ప్రశాంతంగా ఉండక!” అన్నాను. 


“నీకు తెలియదు డాక్టరు. అది ఎవరైనా కొట్టుకు పోతే స్వర్గానికి కాదు కదా నరకం ఇక్కడే ప్రతి క్షణం అనుభవిస్తాను. అది తప్పించుకుని ప్రశాంతంగా ఉండటానికే సమస్య లేకుండా చంపడాలు, కబ్జాలు!!” 


ఇది ఎలాంటి వాదనో, సమర్దింపో అర్ధంగాలేదు. రక్తం చూసిన వారు, వీళ్ళ శవాల్ని చూడకుండా ఉంటారా? 


అంతం ఎక్కడ? తృప్తి ఇదేనా? కసి మీద కసి.. మసిగావడానికి ఎందుకు ఈ తపన యాతన?? 


“వింతగా ఉందా! నీకు తెలియదు శీనయ్యా! డబ్బును అవమానించకూడదు.!! మహాలక్ష్మి!! ఆ తల్లి మన దగ్గరుంటే తప్పొప్పులు, ఇహ పరాలు, సాధ్యా సాధ్యాలు అన్నీ నీ చేతుల్లో ఉంటాయి. ఎంత చెడ్డ చేసినా సమర్దిస్తుందేగాని కోపగించుకోదు. ఎప్పుడూ ఆ తల్లి మాలాంటి వాళ్లకు అండగా ఉంటుంది. ”


అర్ధంగాలేదు. బహుశా డబ్బున్న వాళ్ళు ఎన్ని ఘోరాలు, సంఘ విద్రోహచర్యలు చేసినా పాపాలు అంటవా? దానికి దేవుడో, దేవినో అండగా ఉంటారా?? 


డబ్బు ఎంత ఉన్నా ఇంకా కావాలనుకునే అత్యాశ, వ్యసనాలకు జబ్బులకు నిలువఉండే ఖజానా అవుతుందని తెలియదు. చివరికి మిగిలేది?? 


“నా చివరి కోరిక అదే!” 


“ఏవిటి? “ అని ఆశ్చర్యంగా అడిగాను. 


“డబ్బుతో కొనలేనిది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఉండబోదు. అందుకని స్వర్గానికి టికెట్ లేవైనా అమ్మకానికి దొరుకుతుందా? ఎంతయినా సరే! ప్రెసిడెంటు లెవల్లో సిఫారసు చేయించగలను.! ”


ఇది చాలా విడ్డూరమైన కోరిక అని నాకు అనిపించినా వాస్తవానికి నేటి మానవులది అదే అభిప్రాయమోమో అనిపిస్తుంది. పుణ్యాన్ని, ప్రాణాన్ని, పరపతిని డబ్బుతో కొనవచ్చని గట్టి నమ్మకం. మరి స్వర్గానికి టికెట్...??? తల రాతను బ్రహ్మ దేవుడు కూడా మార్చలేడు అంటుంటారు. నిజమేనా!!


ఈ సృష్టి ఒకటుందని, అది అంతా మాయచేత కట్టడి చేయబడి ఉంటుందని తెలియదు. తెలిసినా నమ్మరు. ఎవరికీ ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అంతే తప్పక ఇస్తుందని మరిచి పోతున్నారు.. 


ఓడి పోతే.. దేవుడా నువ్వే దిక్కుఅని పడి పడి పూజలు చేస్తున్నారు. పేద వాడి కడుపు నింపితే సరి పోతుందని మరిచి పోతున్నారు. నైతిక విలువలు పాటిస్తూ

‘చాలు’ అనే పదాన్ని స్మరిస్తే జీవితం స్వర్గమే అవుతుందని ఏ ఒక్కరూ ఆలోచించే పరిస్థితిలో లేరు. ఈర్ష్యా, అసూయ, ద్వేషాలు, సుభాషితాలుగా భావిస్తున్నారు.

 

ఒకరోజు నన్ను వెంటనే బయలు దేరి రమ్మని ఫోను చేసాడు. దేనికంటే ‘అది చెప్పకూడదు. ముందుగా చెపితే ఫలితం దక్క’దంట! 


నిజమే! ఆ మాట ఎవరో చాణుక్యుడో… సరిగా గుర్తు రావడం లేదు. 

నేను వెళ్లేసరికి ఇంటి ముందు వందకార్లు, హడావిడిగా తిరుగుతున్న మనుషులు కనిపించారు. చాలా భయం వేసింది. ఫణికి ఏమయినా జరిగిందోమోనని? 


ఆందోళనతో, పరుగులాంటి నడకతో, ఇంట్లోకి వెళ్లాను. హాలు మధ్యలో హోమగుండం ఘణ ఘణ మండుతోంది. చుట్టూ పది పదిహేను మంది వేదపండితులు మంత్రాలు వల్లిస్తూ నెయ్యి కుమ్మరిస్తున్నారు. ఎంతో నిరాడంబరంగా దైవత్వం ఉట్టి పడేలా ఉండాల్సిన వాళ్ళు, ఒంటి నిండా బంగారుతో మెరిసి పోతున్నారు. 


దట్టంగా పొగ. కళ్ళు మండి పోతున్నాయి. వాసనలు వెదజల్లుతున్నాయి. ఫణి నన్ను చూసి దగ్గరకు రమ్మనట్టు సైగ చేసాడు. 


‘పరవాలేదు ఇక్కడే ఉంటా’ అని చేతులు ఊపాను. ‘కాదు’ అన్నట్టు కొంచెం కోపంగా చూసాడు. తప్పలేదు. 


అతని బెడ్ అక్కడ వేసుంది. వెళ్ళగానే నాకో కుర్చీ తెప్పించాడు. పవిత్రమైన హోమం చేస్తుంటే పైన కూర్చోడం తప్పు అని కింద కూర్చో బోయాను. కాదు పక్కనే కూర్చోమని బలవంతం చేసాడు. 


ఉపవాసం ఉండి అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని హోమం దగ్గర కూర్చోవాలి. ఇతనికి గంపడు షుగరుంది. 


“ఆహారం తప్పక తీసుకోవాలి అని, నాలుగు గంటలకే బిర్యాని, పరోటా తినేసి క్షమించమని అందరి దేవుళ్ళకు దండం పెట్టుకున్నా!” అన్నాడు. 


ఏమనను అతన్ని..??

 ఒంటి గంట దాటి పోయింది. చూస్తే వచ్చిన వారు ఒక్కరూ లేరు. 


అసలు భార్య ఉండి కదా ఆయుష్ పూజ, హోమాలు చేయించాలి. మరి ఆవిడే లేదు!!

ఫణి కూడా కాస్త అసహనంగా పదే పదే ఎదో ఒకటి తాగుతూనో, తింటూనో ఉన్నాడు. 

సాయంకాలం నాలుగు అయిపోయింది. బాగా అలిసి పోయినట్లు కనిపించాడు. అప్పుడు వచ్చింది భార్య! 


“సారీ డార్లింగ్! కొంచెం లేటు అయ్యింది. అంతా చాలా గొప్పగా జరిగిందని పండితులు చెప్పారు. నీకు నూరేళ్ళు అని చెప్పారు”. 


ఫణి, “పరవాలేదులే, ఆ మినిస్టర్ కాంట్రాక్టు మనకే వస్తుదని అన్నాడా?” అని అడిగాడు. 


 “ఓ యస్!” అంటూ లోపలికి వెళ్లిపోయింది, డ్రస్సు మార్చుకోస్తానని. 


ఫణి, నా వైపే అదోలా చూస్తున్నాడు. నేను ప్రక్కకు తిరిగాను. మొట్ట మొదటిసారి అసహ్యం వేసింది. నిర్ణయాలు తీసుకోబోయి ఛీ... అర్భకుడు, అమాయకుడు, నా స్నేహితుడు అనుకొని మానుకున్నాను. 


“తిరుపతి వెళుతున్నాను. ఒక వారం పట్టొచ్చు తిరిగి వచ్చేందుకు!” 


ఆలోచిస్తున్నట్లు నా వైపు చూసి, “వెళ్లిరా! అక్కడ బ్యాగులో ఐదు కోట్లు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేనే వెళ్ళాలి అనుకున్నాను కానీ అనుకోకుండా ఈ జబ్బు..? నువ్వు అయినా నేనయినా ఒక్కటే! నువ్వేం భయపడకు, నేను చావనులే! అన్నీ పూజలు నిష్టగా, పద్దతిగా చేయించాము కదా “ అన్నాడు. 


అంత డబ్బు? దారిలో ఎవరైనా..? హుండీలో వేసేందుకు అనుమతి...?? కాదని చెప్పలేక వెనకాడతూ చూసాను. 


“నీకేం భయం లేదు. నాపేరు చెప్పు చాలు. కిందనుంచి పై వరకు మన మనషులే! ఆ డబ్బు ఇచ్చేస్తే దేవుడు తప్పక స్వర్గ ద్వారాలు తెరుస్తాడని నా గట్టినమ్మకం!!” అంటూ గర్వంగా ధీమాగా నా వైపు చూసాడు. 


నిజంగానే పేరు చెప్పగానే రాచమర్యాదలతో మమ్మల్ని నేరుగా దేవుని దగ్గరకు తీసుకెళ్ళారు. అటు చూస్తే క్యూలో వేల మంది జనం, వాడి పోయిన ముఖాలతో, అలిసి పోయి, ఆత్రుతతో, భయంతో, ఆలశ్యం అయితే స్వర్గ ప్రాప్తి ఎవరికైనా ఇచ్చేస్తాడేమో అని కుమ్ములాడుకుంటూ తోసుకుంటున్నారు! 


వెళ్ళిన రెండో రోజే వాళ్ళ అబ్బాయి ఫోను చేసాడు. మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నాడు, దయ చేసి వెంటనే రాగలరా అని!! ఏదో కీడు జరిగిందా??


ఇంకా నా దర్శనాలు పూర్తికాలేదు. సుప్రభాత సేవ, కల్యాణోత్సవం మిగిలిపోయాయి. అయినా స్నేహితుడు ఎలాగున్నాడో అని ఆందోళన!! నిలవ బుద్ధి వెయ్యలేదు. మా ఆవిడ అలిగింది. పిల్లలను ఉండి పూర్తి చేసి రమ్మని స్టేషన్ కు వచ్చి తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కాను.


 రిజర్వేషన్ లేదు. ఎండాకాలం! ఉక్కపోసి పోతోంది. 

టి టి కి ముడుపు సమర్పించుకుని బెర్తు తీసుకున్నాను. ఆ ట్రైన్ మూడుగంటలు లేటుగా చేరింది విశాఖకు!


నేరుగా ఫణి ఇంటికి చేరాను. వాచ్ మాన్ తప్ప ఎవ్వరూ లేరు. భార్య గురించి అడిగాను. ఫోటోకు దండకోసం వెళ్లిందని చెప్పారు. పాపం కాశీలో చనిపోతే ఖచ్చితంగా స్వర్గానికి పోతారని గుడ్డిగా నమ్మాడు. దరిద్రంగాకపోతే ఇక్కడే చావాలా? బాధ వేసింది. 


ఎక్కడ ఖననం జరుగు తుంది అంటే చెప్పారు. అక్కడకు వెళితే ఇక్కడకాదు అక్కడ అన్నారు. నాలో ఆత్రుత పెరిగిపోతోంది, కనీసం చివరి చూపుకూడా దక్కదేమోనని!! 

సిటీలో ఎన్ని స్మశానాలున్నాయో అన్నీ వెతికేసాను. వస్తూ ఉంటే ఒక మురికి గుంట కాలువ దగ్గర కొంత మంది మనుషులు ఉన్నట్టు అనిపించి వెళ్లాను. ఫణి కొడుకు స్నానం చేసి దిగులుగా ఉన్నాడు. నన్ను చూడగానే పెద్దగా ఏడ్చేసి కావలించుకున్నాడు. 

నమ్మలేక పోయాను. అంత ప్రేమ ఉందని ఇంత వరకు నాకు తెలియదు. వచ్చిన వాళ్ళు కొందరు దూరంగా కారుల్లో కూర్చుని దిగలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ముఖాల్లో విసుగు!!


“ఈ మనుషులు ఎంత దిగజారి పోయారో.. సిటీలో ఉన్న స్మశానాలలో దేనికీ రానివ్వలేదు. కరోనా ఉందని అబద్దం చెప్పి పోలీసులను అడ్డు పెట్టారు. మా విరోధులు కులం కూడా అడ్డు పెట్టారు. మా మీద పగ, కుళ్ళు!! చూస్తాను, వాళ్ళను సర్వనాశనం చేస్తాను “ అని కోపంతో రగిలిపోతూ వణికి పోతున్నాడు. 


నిజమే! ఒక్కో కులానికీ, కర్మ భూమి.. పుణ్యభూమి అనబడే.. స్మశానాలు వేరు వేరుగా ఉంటున్నాయి. ఇదీ మన ఇరవై ఒకటో శతాబ్దపు సంస్కారం, మానవత్వం!! సిగ్గుతో కుంచించుకు పోయాను. కూలివానికయినా, కోటీశ్వరుడికయినా మరు భూమి ఒక్కటే. అదే పుణ్యభూమి అని మహాత్ములు చెప్పి ఉన్నారు!! కాల్చేడానికి కూడా వాళ్ళ కులస్తులే తొందరలో వస్తారేమో?? 


సముదాయించాలని ప్రయత్నించాను. వీలుకాలేదు. తండ్రి ఇచ్చిన ఆస్తి... ప్రతీకారం!!వదలదు!!!


 కోరలు చాస్తూ మండుతున్న మంటల్లో డబ్బు, అహంభావం, అహంకారం, మదం, మాత్సర్యం, లోభితనం, మోహం మాడి మసి అయిపోతున్నాయి. 


 అందులోనుంచి అతని దుర్గుణాలన్నీ గాలిలో కలిసి విశ్వం లోకి వెళ్లి పోతున్నట్లు అనిపించింది. అగ్నిదేవుడు దోషాలన్నిటిని హరించి వేస్తాడని మన పురాణాలు చెప్పి ఉన్నాయికదా! పునీతుడు అవుతాడా? స్వర్గానికి నేరుగా వెళతాడా? వెళ్ళవచ్చు... 

ఎందుకంటే తను తప్పులు చేసానని పశ్చాప పడ్డాడుకదా!! సమర్ధింపు కాదు కావాల్సింది, మనసా వాచా కర్మణా దాసోహమవటం!! బహుశా ఈ మురికి గుంట నుంచే స్వర్గానికి దారా??? చచ్చిన తరువాత మురికిగుంటా.. చెత్తగుంటా.. ఏదని అవసరమా? ఏమో అదికూడా అంతస్తు, పరపతి, ప్రతిష్ఠను పెంచుతుందేమో? బ్రతికున్న వాళ్లకు.. చచ్చిన వాళ్లకు కాదు!! 


పుట్టుక ఎక్కడో గిట్టుకెక్కడో?? మరి ఈ యాతన తపన ఎందుకు?? యుగయుగాల శేష ప్రశ్న!!!


ఏ తీర్ధం తీసుకున్నా, దేవుడికి పడి పడి మొక్కినా, ఆత్మ విశ్వాసంలేని ఈ మనుషుల బలహీనమైన ఈతి బాధలకు, మానసిక సంఘర్షణకు ఒక సముదాయింపు మాత్రమే. తెలియని ధైర్యం, నమ్మకం- ఎవరో ఉన్నారని, కాపాడుతారని??? 


మానవ సేవే మాధవ సేవని, మన్నింపు, పశ్చాతాపం, స్వర్గ ద్వారాలనీ మరిచి పోయారు. 

డబ్బు.. డబ్బు, చంపు, తొక్కు.. డబ్బు ఇవేనా నేటి స్వర్గానికి ద్వారాలు?? 


 మంచో చెడో ఒక స్నేహితుని పోగొట్టుకున్నాను. మనసు మూగపోయింది. అతను తిరిగి వచ్చి స్వర్గానికి దారి ఎటో చెప్పి నన్నుకూడా రప్పించుకోవాలికదా!! అని సర్దుకున్నాను. 


పిచ్చివాడా అని దిక్కులు పిక్కటిల్లేటట్లు ఎవరో అన్నట్లు ఉలిక్కిపడ్డాను. 


అటు ఇటు చూసినా ఎవరున్నారు శూన్యం తప్ప!!


*******


34 views0 comments

Comments


bottom of page