top of page

మనసు మారేనా.. 



'Manasu Marena' - New Telugu Story Written By Pudipeddi Venkata Sudha Ramana Published In manatelugukathalu.com On 02/07/2024

'మనసు మారేనా' తెలుగు కథ

రచన: పూడిపెద్ది వెంకట సుధారమణ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



స్టేషన్ అంతా రద్దీగావుంది. ప్రయాణికులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ అమ్మాయి ట్రైన్ కోసం చూస్తోంది. ఎప్పుడూ కరెక్ట్ టైముకి వచ్చే ట్రైను ఎందుకు ఆలస్యమవుతున్నాదని ఆలోచిస్తోంది. 


నిన్న కూడా ఇంతే, ఆలస్యంగా వెళ్లినందుకు అమ్మకి కోపం వచ్చి ‘ఇంత రాత్రి వరకూ రావడం కుదరక పొతే ఆ చదువు మానేసేయ్, ఎందుకొచ్చిన చదువులు’ అని తిట్టింది. 

ఈరోజు కూడా ఆలస్యంగా వెళితే ఇంక చదువు మానిపించేస్తుంది, అనుకుంటూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ వుంది ఆ అమ్మాయి. 


“ఇక మీదట ఆలస్యంగా వస్తే మాత్రం ఈ చదువు మానిపించేసి, పెళ్లి చేసేస్తాను. ఇప్పటికే బంధువుల ముందు తల కొట్టేసినట్టుగా ఉంది. అయ్యో ఎక్కడికి వెళ్లినా నీ కూతురికి పెళ్లి చేయకుండా ఆ చదువులు అవరమా అని అడుగుతుంటే. అందరికీ నీ గురించే తపన పాపం. ఏదో మీ నాన్నగారి మాట మీద గౌరవంతో, నీ మీద ప్రేమతో మీ మాటని కొట్టేయ్యలేక ఒప్పుకున్నాను కానీ ఇలా రోజూ అర్థరాత్రుల వరకు ఇంటికి రావడం కుదరక పొతే ఇంక చదువుకు స్వస్తి పలికెయ్యడమే" అని పొద్దున్నే అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. 


పక్కనున్న స్నేహితురాలికి చెప్పుకొని ముఖం వెళ్ళాడదీసుకొని బాధపడుతున్న ఆమెని ఓదారుస్తూ “ఏం, మీ అమ్మగారికి నువ్వు టీచర్ ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదా” అన్న తన ప్రశ్నకి జవాబుగా “ఎందుకనో మా అమ్మకి ఈ వృత్తి నచ్చదు. తన చిన్నతనంలో ఆమెకి ఏం చేదు అనుభవాలు ఎదురయ్యాయో మరి. అలాంటి అమ్మకి టీచర్ అయిన నాన్నగారితో పెళ్లి జరిగింది చూడు, అయినా అమ్మ నాన్నగారి మీద గౌరవంతో యేనాడు అతని ఉద్యోగాన్ని కించపరచదు. కానీ నన్ను మాత్రం ఈ ట్రైనింగుకి వెళ్ళడానికి వీల్లేదని పట్టుబట్టింది, చివరకి నాన్నగారి మాట మీద ఒప్పుకుంది“ చెప్పింది ఆ అమ్మాయి. 


‘ఇవాళ ఆలస్యంగానే వెళతాను, ఇక రేపటినుండి నేను కాలేజీకి రాలేను అని తలచుకుంటేనే భయమేస్తోంది, ఇంక అమ్మని ఒప్పించడం కష్టమే. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల నాన్న ఉండగా నాకెందుకు భయం?’ అనుకుంటూ, నాన్నమీద గల అపారమైన నమ్మకంతో అప్పుడే వచ్చిన రైలు ఎక్కింది. 


కానీ ఎక్కడా నిలబడటానికి కూడా జాగా లేక గబుక్కున దిగేసి పక్కనే ఉన్న రిజర్వేషన్ పెట్టెలో ఎక్కేసి, ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది భయపడుతూనే, మనసులో తనకి అలవాటైన “ నాన్నా నాన్నా” అనే జపం చేసుకుంటూ. 


నాన్నని తలచుకోగానే కొండంత ధైర్యం వచ్చినట్టయి మెల్లిగా సర్దుకొని కూర్చుంది. కూర్చుందే గాని మనసునిండా అమ్మ ఆలోచనలే, ఎలాగైనా నాన్న, అమ్మని ఒప్పిస్తే బాగుణ్ణు. 


“నాన్న ఇన్ని సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉండి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు.. ఎంతమందికి నాన్న అంటే గౌరవం.. అది చూసే కదా చిన్నతనం నుండి టీచర్ని అవ్వాలనే కోరిక నాలో బాగా నాటుకుపోయింది. ఊహుం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను టీచర్ని అవ్వాలి, అంతే. నా నిర్ణయానికి తిరుగులేదు. కానీ అమ్మని ఒప్పించడం ఎలా.. నాన్న పట్ల గౌరవం ఉన్నా, అమ్మకి ఈ వృత్తి పట్ల మాత్రం చిన్నచూపే. అయినా ఏదైనా అద్భుతం జరిగి అమ్మ మనసు మారి, ఈ వృత్తి పట్ల గౌరవం పెరిగితే ఎంత బావుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో” అనుకుంటూ, అలసటగా అనిపించి కాస్త వెనక్కి జరిగి కళ్ళు మూసుకుంది. ఇంతలో మనసు గతంలోకి పరుగుతీసింది. 

.. 

సూర్యం గారు, రాజ్యం భార్యా భర్తలు. వారి ఏకైక సంతానం మంజుల. సూర్యంగారు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడు. ఆయన తొలుత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచరుగా పనిచేసి, తర్వాత పదోన్నతి ద్వారా కళాశాల అధ్యాపకుడిగా ఉన్నారు. రాజ్యం ఆదర్శ గృహిణి. భర్త అంటే ఎనలేని గౌరవం ఆమెకి. తొమ్మిదవ తరగతి వరకు చదువుకొని ఆపై చదువు ఆపేసి, తన నాన్నగారి మాట మీద గౌరవముతో తనకి ఏమాత్రం ఇష్టం లేని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సూర్యం భార్య అయ్యింది. 


ఎందుకో గానీ రాజ్యంకి చిన్నప్పటి నుండి బడిపంతులు ఉద్యోగం అంటే కిట్టదు. కానీ విధి వశాత్తు ఆమె టీచరు భార్య అయింది. ఆ వృత్తి పట్ల చిన్న చూపే గానీ భర్తని మాత్రం ఎప్పుడూ కించపరచడం జరగలేదు ఇంతవరకు. భర్తపై, కూతురుపై ఎంతో ప్రేమ, అభిమానమూను రాజ్యంకి. 


“అమ్మా.. , అమ్మా.. నేను డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాసు అయ్యేను. ఇప్పుడే రిజల్టు చూసుకొని వస్తున్నాను” అంది మంజు. 


“ఆఁ, వచ్చే వచ్చే, ఇదిగో నోరు పట్టు ఈ చక్కెర కాస్త నోట్లో వేస్తాను, తియ్యని కబురు చెప్పేవు కదా!” అంది రాజ్యం. 


“నాన్నగారు ఏరీ, ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి, ఉదయం నేను వెళుతుంటే, నీకు ఫస్ట్ క్లాసు గ్యారంటీ అన్నారు. అలాగే అయ్యింది. మీ ఇద్దరికీ చెప్పాలని పరుగు పరుగున వచ్చాను”. 


"అవును, నాతో కూడా అదే అన్నారు. ఏదో పనుందని వెళ్ళేరు మీ నాన్నగారు, ఇక ఘడియో, క్షణమో వచ్చేస్తారులే"


"తల్లీ.. మంజూ.. ఇలారా, నీకోసం ఏం తెచ్చానో చూడు" లోపలికి వస్తూనే అన్నాడు సూర్యం. 


"నాన్నగారు నేను బి. యెస్. సి. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను" అంది మంజు. 


"తెలిసిందమ్మా, అందుకే నా బంగారు తల్లికి ఇదిగో ఈ రిస్టు వాచి తెచ్చాను, చూడు, బావుందా ". 


"అబ్బో, చాలా బావుందండీ నాన్నగారు ". 


"ఆఁ ఇదిగో ఈ స్వీట్లు పట్టికెళ్లి మీ స్నేహితులు అందరికీ పంచి పెట్టు ". 


"అలాగేనండీ" అంటూ బయటికి వెళ్ళిపోయింది మంజు. 

.. 

"నాన్నగారండీ.. నా మర్క్స్ లిస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ వచ్చేసేయండీ, నేను బి. ఈడీ. చేస్తానండి, ఇదిగో ట్రైనింగుకి అప్లికేషన్ కూడా తెచ్చాను నాన్నగారూ". 


"అలాగేనమ్మా, ముందు అప్లై చెయ్యి, సీటు వస్తే చేద్దువుగాని ". 

.. 

"అమ్మా.. నాకూ బి. ఈడీ. ట్రైనింగుకి రాజమండ్రిలో సీటు వచ్చింది, రేపే జాయిన్ అవ్వాలి"

"ఆమ్మో, రాజమండ్రి అయితే ఎలా, ఇక్కడనుండి వెళ్లడం కష్టం కదా, అక్కడ నువ్వు ఉండటానికి మనవాళ్లెవ్వరు లేరాయే, మరిప్పుడెలా " అంది రాజ్యం గాభారాగా. 


"ఫర్వాలేదు, నేను రోజూ ఇక్కడ నుండే వెళ్తాను. ఉదయం ఆరు గంటలకి ట్రైను వుంది, అందులో వెళ్లి మళ్ళీ సాయంత్రం కాలేజీ అవ్వగానే ట్రైనులో వచ్చేస్తాను, రాత్రి ఏడింటికల్లా ఉంటాను ఇంట్లో " అంది మంజు. 


ఆడపిల్లని అలా అంత దూరం పంపడం రాజ్యానికి ఇష్టం లేదు. అందుకే ససేమిరా వీల్లేదని తేల్చి చెప్పేసింది. మంజు ఏడుస్తూ పడుకుంది. మంజు బాధ చూడలేక సూర్యం భార్యని మెల్లిగా ఒప్పించాడు. మంజు ఆనందానికి అంతులేదు. యెగిరి గంతేసినంత పనిచేసింది. 

మర్నాడు మంజు వెళ్లి కాలేజీలో జాయిన్ అయ్యింది. సీజన్ టిక్కెట్టు తీసుకొని, రోజూ ట్రైన్లో కాలేజీకి వెళ్లి వస్తోంది. 


 మంజు, తండ్రిలాగే తాను కూడా టీచరు కావాలని కలలు కనేది. అందుకే పట్టుబట్టి, అమ్మని ఒప్పించి మరీ రాజమండ్రి కాలేజీ దూరమైనా ఎంతో కష్టపడి చదువుకుంటునాది. కానీ రాజ్యంకి ఇష్టం లేక, ఏఁ సాకు దొరుకుతుందా మానిపించాడానికి అని చూస్తూనే ఉంది. 

.. 

"అమ్మాయి ఇది నా సీటు లే లే " అని వినిపించి, గబా గబా లేచి నిలుచుంది. చుట్టూ చూసింది కానీ ఇంకెక్కడా ఖాళీ లేదు, సరే నిలబడి ప్రయాణం చేయడం అలవాటే కనక ఓ సీటుకి ఆనుకొని నిలబడింది. ఒక పెద్దామె కొంచెం జరిగి తన పక్కన కూర్చోమంటే, కూర్చుంది. నీ సీటు ఎక్కడ అని అడిగిన వాళ్ళకి సమాధానంగా, 

“నాది సీజన్ టికెట్టు అండీ, నేను జనరల్ బోగీ ఎక్కాలి రూలు ప్రకారం కానీ అక్కడ అస్సలు ఖాళీ లేక ఇటు వచ్చాను” అంది నమ్రతగా. 


అప్పుడే అటుగా వచ్చిన కాఫీ అమ్మే కుర్రాడు ఆ మాటలు విని, “అయ్యో! అక్కా.. పక్క పెట్టెలో స్క్వాడ్ ఉంది, అక్కడ అవ్వగానే ఇటే వస్తారు, అసలే బాగా కచ్చి తంగా ఉంటాడు ఆ బాబు " అన్నాడు. అది వినగానే ఆమెకి భయం పట్టుకుంది. ఇప్పుడెలా, ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే, 

 “ఆఁ వందో, రెండొందలో చేతిలో పెడితే సరి, ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూడలేదని”, 

 “ఏమ్మా.. రిజర్వేషన్ లేకుండా ఇందులో ఎక్కకూడదని తెలియదా”, 


 “చూస్తుంటే చదువుకున్నదానిలా ఉన్నావు, ఆ మాత్రం తెలీదా “, 


 “తెలియక కాదు మాస్టారు, సుఖంగా ప్రయాణం చేసెయ్యొచ్చని, పనికిమాలిన తెలివితేటలు అవన్నీ”, 


 “నీకేమ్ భయం లేదులే ఆమ్మాయీ.. ఫైనుకి సరిపడా డబ్బులు లేవని చెప్పు, వదిలేస్తారు “, అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తుంటే, మళ్ళీ ఆ కుర్రాడే


“వందో వెయ్యో కాదు మీ ఆస్తి మొత్తం రాసిచ్చినా తీసుకోడు, రూలంటే రూలే, ఫైను మొత్తం కట్టాల్సిందే” అనగానే ఆమె పర్సు తీసి చూసుకుంది, యాభై రూపాయలే ఉన్నాయి, మరెలా ఇప్పుడు, ఫైను వెయ్యో రెండూవేలో రాస్తే కట్టేదెలా అనుకుంటూ మళ్ళీ తనకి అలవాటైన ‘ నాన్న జపం ‘ ‘నాన్నా.. నాన్నా.. ’ అంటూ మొదలు పెట్టింది అందరూ అంటున్న రకరకాల మాటలను పట్టించుకోకుండా. 


 ఇంతలో అనుకున్నంతా అయ్యింది. స్క్వాడ్ వచ్చింది ఆ పెట్టేలోకి, వస్తూనే అందరి టికెట్స్ చెక్ చేసి కొందరికి ఫైను కూడా రాస్తున్నారు. ఆమె మాత్రం నాన్న జపం చేస్తూనే ఉంది ఇంకా. తన వంతు రాగానే భయం భయంగా తీసి ఇచ్చింది తన సీజను టిక్కెట్టుని. ఆమె ఇచ్చిన సీజన్ టికెట్ చూసి, ఐ డీ కార్డు కూడా ఇమ్మన్నాడు. 


“సార్, నేను ఉదయం మూడు గంటలు, తిరిగి సాయంత్రం మూడు గంటలు ప్రయాణం చేసి చదువుకుంటున్నాను. నాకు మా నాన్నగారే స్ఫూర్తి, ఆదర్శం ఇంకా ధైర్యం కూడా, అందుకే ఆయనలాగే టీచర్ వృత్తి చేపట్టాలని చిన్నతనం నుండి అనకుంటున్నాను, అసలే బలవంతంగా అమ్మని ఒప్పించి రోజూ వస్తున్నాను. ఇంటికి వెళ్లడం ఆలస్యమైతే అమ్మ కాలేజీ మానిపించేస్తుంది, ఈ బండి మిస్ అయితే మరో గంట వరకు బండి లేదు, అందుకే ఇందులో ఎక్కేసాను, అర్థం చేసుకోండి” అని ఆమె గబ గబా పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసింది. 

అంతా విని అప్పుడు అతను ఐ డీ కార్డు తీసి చూస్తూ, ఆమె తండ్రి పేరు చదువుతూ అప్రయత్నంగా గబుక్కున లేచి నిలుచుంటూ “నువ్వు మా మాస్టారు గారి అమ్మాయివా, మీ నాన్నగారు నాకు గురువుగారు, పూజ్యనీయులు. ఆయన ఆనాడు పట్టుబట్టి నన్ను చదివించ బట్టే నేను ఇవాళ ఇక్కడ ఇలా ఉన్నాను. మాస్టారుగారు నాకు ఆనాడు చెప్పిన మాటలు నేనెప్పుడూ మరచిపోలేను కూడా. 


‘చదువుకునే వయసులో చదువుకోకుండా, సమయాన్ని వృధా చేస్తే, రేపు పొద్దున్న ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతారు. అప్పుడు చదువుకోవాలని ఉన్నా చదువుకొనే అవకాశం ఉండదు. చేతులు కాలేకా ఆకులు పట్టుకొని ఏఁ లాభం, అందుకే ఇప్పుడు కష్టపడి చదువుకుంటే ముందున్న జీవితమంతా సుఖ పడవచ్చు’ అని చెప్పేరు. ఆనాడు మాస్టారుగారి మాటలు విని చదువుకొని ఈనాడు ఇంత వాడిని అయ్యేను. అందుకు నేను నా జన్మ అంతా ఋణపడి ఉంటాను. నిన్ను చూడగానే ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నాను, నాన్నగారికి నా నమస్కారాలు చెప్పమ్మా, ఆఁ చూడు రూలు ప్రకారం ఫైను రాయాలి, నేను కట్టేస్తాను, అదే నీ తరపున నేను కట్టేస్తాను” అంటూ ముందుకి వెళ్ళిపోయాడు. 


“సార్.. మీ పేరు చెప్తారా, నాన్నగారికి చెప్తాను” అని మంజు అంటుంటే, వెనక్కి తిరిగి “ నా పేరు చెప్పకూడదు” అంటూ వెళ్ళిపోయాడు. 


మంజు, హమ్మయ్య అని హాయిగా ఊపిరి తీసుకుంది, ‘థాంక్స్ నాన్న’ అనుకుంటూ. 

.. 

“నాన్నగారు, .. నాన్నగారు.. ” అంటూ ఇంట్లోకి పరుగు పరుగున వెళ్తూ, అమ్మ కోపంగా చూస్తున్నా పట్టించు కోకుండా, “ఈరోజు ట్రైనులో ఏం జరిగిందో తెలుసా” అంటూ, జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పింది. 


అంతా విని, 

”అవునమ్మా.. అప్పట్లో చాలా మందికి కాలేజీ అయిపోయాక దగ్గర కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పేవాడిని, పాపం అందరూ తెలివైన కుర్రాళ్ళే గానీ, ఆకతాయి తనం వల్ల చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారు. 


వారి తల్లిదండ్రుల బాధ చూడలేక, అలాంటి వారందరినీ మంచిమాటలతో నచ్చచెప్పి, రోజూ కాలేజీ అయ్యేక స్టాఫ్ రూములోనూ, అప్పుడప్పుడు ఇంటి దగ్గరా ఒక గంట చదివించేవాడిని. అందరూ మంచి వృద్ధిలోకి వచ్చేరు కూడా, వారిలో ఒకరు అయ్యుంటాడు ఈ అబ్బాయి. ఇన్నేళ్ళు అయినా ఇంకా ఆ విషయం గుర్తుపెట్టుకొని, నీకు సహాయం చేసేడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఒకరికి సహాయం చేస్తే, భగవంతుడు తిరిగి ఏదో ఒక రూపం లో మనకి సహాయం చేస్తాడు అని మా నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు ” అని అంటుండగా, 

"నా తల్లే, నా బంగారమే.. , ఎంత మంచిరోజు ఈరోజు, పిల్ల క్షేమంగా ఇంటికి చేరుకుందంటే, ఆనాడు మీరు పెట్టిన విద్యాభిక్ష కారణంగానే అని తెలుసుకున్నాను.


ఎందుకోగానీ నాకు చిన్నతనం నుండి బడిపంతులు ఉద్యోగాలు నచ్చవు. , బ్రతకలేక బడిపంతులు ఉద్యోగం అనుకునేదాన్ని. ఇన్నాళ్ళు మీ నాన్నగారి మీద గౌరవమే గాని, ఆయన ఉద్యోగం మీద కాదే తల్లీ. 


 మీ నాన్నగారు ఎప్పుడూ అలా పిల్లల్ని పోగేసుకొని పాఠాలు చెప్తుంటే కాస్త చిరాకేసేది, కానీ ఎప్పుడూ ఆ చిరాకు కనబడనిచ్చేదాన్ని కాదు ఆయన మీద గౌరవంతో. అదంతా చూసి చూసి, మా నాన్నగారి మీద కోపం వచ్చేది నాకు టీచరు భర్త వద్దన్నా వినలేదని. కానీ ఇప్పుడు దాని విలువ తెలిసింది. మా నాన్నగారి ఆలోచన ఎంత గొప్పదో అర్థమయ్యింది. నా బుద్ధిలేని తనానికి ఇప్పుడు సిగ్గు పడుతున్నాను. 


 ఇక ఎంత కష్టమైనా ఫర్లేదు, నువ్వు తప్పకుండా టీచర్ అవ్వాలి, అవుతావు కూడా. నీకు మా ఇద్దరి ఆశీస్సులు ఉంటాయి ఎల్లప్పుడు. నువ్వూ మంచి టీచరుగా పేరు తెచ్చుకొని బాగా వృద్ధిలోకి రావాలి తల్లీ ” అంది రాజ్యం ఆనందంగా కూతురి తల నిమురుతూ. 


 ఆ మాట వినగానే మంజు యెగిరి గంతేసి, అమ్మని గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేసింది ఆనందంతో. 


శుభం. 


పూడిపెద్ది వెంకట సుధారమణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.


నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ (ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు ) (శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు), ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.


ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.


జన్నస్థలం: కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా

జననీ జనకులు: వెంకట రత్నం, బాలకృష్ణ శర్మ.

విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు, ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ

వృత్తి : ఉపాధ్యాయిని గా 15 సంవత్సరాలు.

ప్రస్తుతం: గృహ నిర్వహణ

భర్త : వెంకటరామ్, రిటైర్డ్ ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్

సంతానం : అబ్బాయి డాక్టర్, ( స్వంత హాస్పిటల్ )

అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్, U. S. A

అభిరుచులు : సాహిత్యం పై మక్కువ, పుస్తక పఠనం, కథలు వ్రాయటం.

అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని,

వీలైనప్పుడు దైవ దర్శనం, బంధు దర్శనం చేసుకోవడం.

చిరునామా : విశాఖపట్నం





 


82 views0 comments

Comments


bottom of page