'Nissabda Ghosha' - New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy
Published In manatelugukathalu.com On 12/12/2023
'నిశ్శబ్ద ఘోష' తెలుగు కథ
రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మంచును తొలుచుకుని సూర్యరశ్మి పచ్చిక మీద పడి నిత్య ముఖంపై రమ్యమైన రమణీయ నృత్యాలు ప్రదర్శిస్తున్నాయి. సృష్టి గీచిన అపురూప చిత్రాలను దాచుకున్నఆ విశాల నేత్రాలలో మనసును మత్తెక్కించే వలపు మధురిమలు ప్రతిఫలిస్తున్నాయి. నులివెచ్చకు తొలి పోద్దుకు మురిసిపోతూ, మధువుకోసం రంగురంగుల విన్యాసాలు చేస్తూ పూభోణులను మురిపిస్తూ, మరిపిస్తూ దాచుకున్న కన్నెరికపు మధువును దోచుకోవాలని, వలపు నృత్యాలు చేస్తున్న సప్తవర్ణాల మదుపాలను చూస్తూ ప్రక్రుతి వనంలో వసంతోత్సవం జరుపుకోవాలని మనసు గంతులు వేస్తుంటే అదుపు చేసుకుంది. ఈ జన్మ మధురం. మానవ జన్మ అద్భుతం అందునా స్త్రీజన్మ సృష్టికి సింగారం. అందునా ఆస్వాదించి అనుభవించే మనసు కలిగి ఉండటం ఈజన్మ సుకృతం. అనాది పునాదికి, ప్రచ్చన్న నిదర్సనం, పునీతం !!
అప్పుడే లోనుంచి సౌభాగ్యమ్మ శాలువకప్పుకుని వాకిట్లోకివచ్చి కూతురు ఆనందోచ్చాహ మానసిక సమాధి స్థితిని చూసి, ” ఇక చాల్లే లేచిరా ! జలుబు చేస్తుంది. మీ నాన్న చూస్తే ఇద్దరికీ పడుతాయి మొట్టి కాయలు” అంది.
ఆ మాటలకు ఉలిక్కిపడి తిరిగి చూసి విరబూసిన మందారాలలో పొదిగిన ముత్యాలు నిండి ఉన్న దానిమ్మగింజలు వెదజల్లి, ఆకాశానికి ఇంద్రధనస్సు రంగులు అద్ది, ” అమ్మా కాసేపు. ”అని కదలకనే ప్రకృతికి పులకరింపు కలిగే నవ్వు నవ్వింది.
అప్పుడే వచ్చి వెనక నిలుచున్న పూర్ణారావు, లోకాన్ని మరచిన వాళ్ళను చూసి,
“ఏవిటిది? అమ్మా కూతురు.. చలిగాల్లో! జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. ” అన్నాడు ఇద్దరినీ తొందర చేస్తూ.
కదలక పోయేసరికి మరీ మరీ బ్రతిమలాడి లోపలి తీసుకువచ్చాడు.
“నన్ను ప్రకృతి మాత వరాల స్వర్గానుంచి దూరం చేస్తున్నారు. నా జన్మ పునీతంకావాలి. మీరు కదిలించకండి. మళ్ళీ దొరుకుతుందో లేదో !! ” అని మారాం చేసింది.
పరిపూర్ణానంద రావు వెనుకనుంచి వినిపించిన కొడుకు మాటలకు తిరిగి చూసాడు. , “అమ్మా! ఏం చేస్తున్నారు. మా చెల్లెల్ని నన్ను మరిచిపోయేటట్లు చేసారు. తన చేతి కాఫీ అమృతం కోసం తపించి పోతున్నాను”.
నవ్వుతూ కొడుకు శ్రీనంద మాటలకు నవ్వుకున్నారు.
“అదేవిటి మీ ఆవిడ ఏమయ్యింది? ఇంకా నిదురలేవలేదా? దాడికోస్తుందేమో సగ భాగం జులుము చూపిస్తున్నానని ?”
“అంత సీను లేదులే ! అదో రకమైన పిచ్చే! సరాగాలాడుతుంది. ఈ రోజు ఆ జేజమ్మెవరిదో పూజ అట”
“అవునమ్మా! ఈ శ్రావణ శుక్రవారం. ఆమెను కదిలించకండి. మనం ఇలా ఉన్నామంటే ఆవిడ భక్తితో పద్దతిగా పూజలు చెయ్యబట్టే ! సాంప్రదాయాలను అనుసరించబట్టే !”
“అది ఆవిడకే కదా మనకు కూడా వస్తుందా? మరీ సనాతమైపోయిందిరా మీ ఆవిడ. ఇంత పిచ్చి ఉండకూడదు” అని ఎగతాళి చేసింది నిత్య.
“అలా ఎగతాళి చెయ్యకూడదమ్మా ! మంచిదికాదు. ఏదయినా జరుగు తుంది” అంది వాళ్ళ అమ్మ.
“నాకు భయంలేదు. నేను అందరి మంచి కోరేదాన్ని. మంచి వాళ్ళకు కూడా చెడ్డ చేసే ఆ దేవుళ్ళు దేవతలు ఎందుకు? అందరూ, బంగారు వజ్రాలు, వాడిది వీడిది భూమి కొట్టేయ్యాలని, బెంజికార్లు కావాలనే వాళ్ళకే లంచాలు ఇచ్చి, బట్రాజు పొగడ్తలు పొగిడి, పడి పడి మొక్కుతుంటారు. “
“పూజలు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి, ఆలోచనకు కూడా మంచిది ”
“అలా అంటే బావుంది. అందరూ దానికోసం చేస్తున్నారని నేను నమ్మను. స్వార్ధం తప్ప ఆ జపంలో భక్తి ఉండదు. ” అంటూ పక్కున నవ్వింది.
“అదృష్టంకూడా వాటితోనే వస్తుంది. ఎందుకంటే నెగటివ్ ఫోర్సు పాజిటివ్ గా మారుతుంది” అన్నాడు నందా.
“అదేవిటి మళ్ళా ! అదృష్టం పూజలు చేస్తే వస్తుందా ? పదే పదే చేసే వాళ్ళు చాలా మంది అడుక్కు తింటున్నారే మెట్ల మీద కూర్చుని !!”
“చిత్త సుద్దితొ చేయాలి. ఎవరికో ఆ రాత రాసుంటే... ?!”
“మళ్ళీ ఇదేవిటి రాత... కోత? ఎవరు రాసేది? దేన్నిబట్టి?”
“దేవుడమ్మా ! ఆయన ఎప్పుడో మన జీవిత స్క్రిప్ట్ రాసేసి ఉంటాడు. ప్రారంభం.. ముగింపు. అక్షరంకూడా చెరపలేనట్లు ముద్రించి పెట్టేసి ఉంటాడు. ” నిత్య నాన్న పూర్ణారావు.
“ దేవుడి పూజ మనసు నిలకడకు చాలా అవసరం. అదే ధ్యానం మరో పేరే యోగ !! ” అన్నాడు నందా. “మన రక్షణ కోసం, మోక్ష ప్రాప్తికోసం అమ్మా” అంది నిత్య అమ్మగారు.
”ఏ దుర్మార్గాన్ని గాన్ని, జరిగిన ఘోరాలనుగాని గాని దేవుడు అడ్డుకున్న నిదర్సనాలులేవు. ఈ జనాలకు ఆరాధ్యులైన రాముడు, కృష్ణుడు, హరిచంద్ర, నల మహారాజులు, సీత, అనసూయ మహా సాద్విలు, మహా ఋషులు, ఎవ్వరూ ఏదీ తప్పించుకోలేదు. తెలియని మోక్షం ఉందని, అక్కడకే వెళ్లాలని గుడ్డిగా నమ్మి చేసినవే ! వెళ్ళిన వాళ్ళు ఎవ్వరో తెలియదు. అంతా అభూతకల్పన. బహుశా ఈ మానవులు ఆటు పోట్లను ఎదిరించలేని అర్భకులని, దుర్మార్గం వాళ్ళ మతం కాబట్టి నరకానికి పోతావు అష్టకష్టాలతో అలమటిస్తావు అని భయపెట్టడానికి ఇవన్నీచేస్తే తప్పించుకోవచ్చు అని ఆశబెట్టి చేయిస్తున్నారేమో ?
కర్కోటకులు, తప్పులు చేసిన వాళ్ళంతా స్వర్గభోగాలు అనుభవిస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. అదేమంటే ఉందొ లేదో తెలియని మరుజన్మలో అనుభవిస్తారు అనే బెదిరింపు. !! వాళ్లకు దేవుడు గీవుడు అంటే గౌరవంగాని భయంగాని లేనే లేదు. ఉంటే అర్భకుల కన్నీరు ఆక్రోశాలు ఉండనే ఉండవు. ”
“అదేకదా నేను చెప్పేది. విధి రాత అంటే తెలియక, నేను అనే అహంకారంతో చేసే పనులు !! తప్పక శిక్ష అనుభవించి తీరాలి. అదృష్టం ఉంటే తప్పించుకుంటారు ! ”అన్నాడు నందా చెల్లెలు మొండిగా వాదిస్తుందని నవ్వుకుంటూ.
“ రాసి ఉంటేనే, అదృష్టం ఉంటే ఎన్ని దుర్మార్గాలనయినా తప్పులయినా చెయ్యొచ్చా? ఎవరో జరిపించేటట్లుగా ఉంటే మన ప్రయత్నాలు ఎందుకు? మనిషి పుట్టక ఎందుకు? అపశ్రుతులు, ఆక్రందనలు, తప్పుడు తల రాతలు రాసే సాడిస్ట్ లు పూజలందుకోవడం ఏవిటి? తలరాతను దేవుడుకూడా మార్చలేడు అనే తీర్పు ఏవిటి? మళ్ళీ నీ జీవితాన్ని నువ్వే చక్క దిద్దుకోవాలి, అంతా నీ చేతిలోనే ఉంది అని గంటకొట్టి చెప్పడం ఏవిటి? అవి నేర్చుకోవడానికి భగద్గీత, రామాయణ, భారతాలు చదివి తరించడం ఏవిటి ?”
ఇవన్నీ ఇంత చిన్నతనంలో ఆలోచిస్తుంది అని కొంత గర్వపడినా మూర్ఖంగా ఆలోచిస్తుందేమోనని పించింద, “ఉదయాన్నే వాళ్ళ మీద పడ్డావెందుకు. నా శ్రీమతి ఉండి కూడా కాఫీ కషాయానికి కూడా గతి లేదు. నువ్వయినా కాస్త ఆత్మారాముడ్ని... ? ”ఆన్నాడు విచారంగా చెల్లెలి ఆలోచన మార్చాలని.
“అదేవిటి ఆవిడ చేతి కాఫీ అమృతం అని చెప్పావు. ఉండు రానీ వంకర్లు పెడుతున్నాడు ఈనో సాల్ట్ వేసి ఇమ్మని చెపుతా!”
“నా ప్రాణాలు నీ గుప్పెట్లో ఉన్నసంగతి మరిచిపోయి ఆవిడ మెడలో ఉన్నాయని బ్రమపడ్డాను. ఇక లాభంలేదు ఎవరో గొట్టంగాడినో, రౌడి హీరో గాడినో చూసి మెడకు తాడు గట్టించి త్వరగా తరిమెయ్యాలి. ” అన్నాడు నంద.
“అదేవిటి రౌడి, హీరో అవుతాడా ?“
“ఈ కాలపు సినిమా లబ్దప్రతిష్టులు నేటి నవనాగరిక యువతులకు వాళ్ళే సరి అని, తమ క్రియేటివ్ ప్రతిభనంతా రాత్రి తెల్లవార్లు మందు, ముండల దగ్గర ఆరేసి రౌడీ గాడిదలను, మానబంగ పోస్టు గ్రాడ్యుయేట్స్ ను, హంతకులను, కడుపులు చేసి మరిచిపోయేవాల్లను, చిన్నప్పుడే హత్యలు చేసి జులాయిగా తిరిగే అడ్డ గాడిదలను, మందులేనిదే నిదురపోనివాళ్ళను హీరోలుగా చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళదగ్గరికే నేటి అధునాతన ఎలైట్ ఆడంగులు పడి పడి పరుగెత్తుతున్నారు. ”
“అదేవిటి వెదవలను అసహ్యించుకుంటారుగాని సంసారాలు చేస్తారా?”
“వాళ్ళే ఈ నాటి యువతులకు హట్ కేక్స్, ఎంజాయ్ యండ్ త్రో! ఈజీగా ఉంటుందని. వాడు పెడితే హింస అయినా స్వర్గంలా ఉంటుందని !! ”
“మరీ తక్కువగా మాట్లాడుతున్నావు అన్నయ్యా ! స్త్రీ ఎప్పుడూ చెడ్డ వాళ్ళను కోరుకోదు. అలాటి వాడితో సంసారం చేస్తే అది స్త్రీయే కాదు. ”
“అలాగే ఉందమ్మా లోకం ! డబ్బు ఎలాగయినా సంపాదిస్తే చాలు కళ్ళుమూసుకుని పడి ఉంటున్నారు. సంసారం చేస్తారో లేదో తెలియదు. అందుకే నిన్ను మంచివాడి చేతికి అప్పగించాలని మా ప్రయత్నం. త్వరగా మా భాద్యత తీరిపోతే.. ?”
ఆ మాటతో కళ్ళనిండా నీరు తిరిగిన చెల్లెల్ని చూసి భయపడిపోయి దగ్గరకు తీసుకుని, ” అదేవిటది... దానికే... తమాషాకు అన్నాను. అంత బాధపడితే ఎలా?” అన్నాడు శ్రీనంద.
“అందుకు కాదులే అన్నయ్యా ! ఆడపిల్ల వయసుకు రాగానే భయం. బరువు మోస్తున్నట్లు గుండెలలో కుంపటి మండుతున్నట్టు తల్లడిల్లి పోతుంటారు. ఎప్పుడెప్పుడు తరిమేస్తామా అని గిలగిలలాది పోతుంటారు. ఎందుకో మా పుట్టుక అంత బరువు ? !!” అని కళ్ళు తుడుచుకుంది.
“నువ్వు మాకు బరువు ఎప్పుడూ కాదు. అలా అనుకోకూడదు. అది భాద్యత. కొంత వయసు వరకు తల్లిదండ్రుల ఆలనా పాలన ఒక విదంగా ఆజ్ఞాపాలన కూడా ! కానీ ప్రకృతి ధర్మం, సృష్టి కర్తవ్యం అందుకు మరో నాధుడు అవసరం. నీది నీ వాడు అనే స్వతంత్రం కోసమే ఈ క్షణిక ఎడబాటు. బంధం అనుబంధం జీవితం ఉన్నంత వరకు పెనవేసుకొనే ఉంటుంది. నువ్వు మా బిడ్డగానే ఉంటావు. ” అన్నాడు తండ్రి పూర్ణారావు.
“మీ బిడ్డగా ఎలా ఉంటాను గుణగణాలు తెలియని అపరచితుని ఇంటిలో ఉంటాను.. ”
వాళ్ళ ముగ్గరికి ఎం మాట్లాడాలో అర్ధంగాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిత్య అడిగిన వాటిలో ఏదీ అసందర్భంగా లేవు అనవసరం అయినవి కూడా కాదు. కానీ అనాది సాప్రదాయం !!
తల్లి దగ్గరకు తీసుంటూ,
“అది తప్పదు కదమ్మా ! సహజం కూడా ! ప్రకృతి ధర్మం. అవి లేకపోతే గుర్తింపు ఉండదు. ”
“ఇప్పుడు నాకు గుర్తింపు లేదా? స్వశక్తితో తెచ్చుకోలేనా?”
“ఆ స్వశక్తికోసమే స్వయంభూ సహచరుని వెతికేది. ”
“ఏం ఆయనేమన్నా గాలికి పుట్టాడా?”
“నీకోసం పుట్టించి ఉంటారులే ”
“దీనిలోకూడా నా ఇష్టా ఇష్టాలు లేవా?”
“నీకు తగ్గవాడినే, నువ్వు నచ్చిన వాడినే అంటే బ్రహ్మ మహేశ్వర విష్ణు మూర్తులు ఒక్కటిగా కలిసి ఉన్న వానిని తెచ్చి చేస్తాను. ” అన్నాడు ఆమోదంగా.
“ఏం బుద్దిరా నీది. నేను ద్రౌపతిని కాదు !! సీతమ్మకు రాముడ్ని ఇచ్చి చేస్తాను అనకుండా!” చెవిపట్టుకుంది అన్న కాలేజీ ప్రొఫెసర్ శ్రీనందను నిత్య.
“వాళ్ళందరూ కలిస్తేనే రాముడయ్యాడువే ! వాళ్ళందరూ హేన్పెక్ద్... బార్యా విదేయులు. బాధితులు బానిసలు. అందుకే వెతుకుతున్నా! అందరూ కలిసికట్టుగా అవతరించిన గొట్టంగాడు ఎక్కడున్నాడా అని. ”
“ఏవిటో ఈ కార్పోరేట్ మీటింగ్. నా ఉద్యోగానికి ఎసురు పెడుతున్నారా?” నిండుగా నవ్వుతూ అప్పుడే తల స్నానం చేసి, దేవుడికి పూజ చేసి కొత్త బట్టలు కట్టుకుని, హారతి పళ్ళెంతో వచ్చి, అత్తా మామలకు నమస్కారం చేసి, పళ్ళెం నిత్య వైపు చాపింది. ఎలాగున్నాడు అని అడుగుతూ.
“ఎవరు?” అంటూ అందరి వైపు చూసింది నిత్య.
“అదేవిటి మీ అన్న చెప్పలేదా ? నీ హృదయాన్ని దోచుకొబోయే కొంటె గంధర్వుడ్ని చూపించలేదా?”
“అంత ధైర్యమా ! కాళ్ళూ చేతులు విరగగొట్టి మూల తోస్తాను. ”
“నువ్వు అంత పని చేస్తావనే రౌడీలు, దోపిడీ దారులు, పారుబోతుల బైయోడాటాలు, రాత్రి తెల్లవార్లు వెతుకుతున్నారు. నన్ను దొంగలకు తోలి. ఇంతకీ ఇంకా చెప్పలేదా?” అంటూ భర్త వైపు చూసింది శివాత్మ.
“ఎక్కడ చెపుదామనుకునే లోగా నువ్వు వచ్చేశావు. ” తడబడ్డాడు నందు.
“మీరు ఎప్పుడూ అంతే! ఇప్పటికైనా చెప్పండి. ఈ రోజు శ్రావణ శుక్రవారం. జేబులోనే ఉన్నాడన్నారుగా తీసి చూపించండి. నా చిట్టి మరదలు ఆత్మీయ స్నేహితురాలికి నచ్చాలి. అత్తమామలకు నచ్చాలి.. నచ్చితే, వీలుంటే రమ్మనండి సాయంకాలం. అబ్బాయి పేరు. శ్రీకర్. చాలా బాగున్నాడు. ” అని అత్తమామల వైపు చూసింది కోడలు శివాత్మజ.
ఫోటో తీసుకుని ఇద్దరూ చూస్తూ, ”నీకు నచ్చాడంటే చాలమ్మా! అది నీ బిడ్డ. నీ మాట కాదనదు. ” కూతురుకి ఇస్తూ అన్నారు అత్తామామలు. శివాత్మజ నిత్యను ఓరకంట చూసి నవ్వుతూ లోపలి వెళ్ళింది.
దాన్ని దూరంగా పెట్టి, “ మిమ్మల్ని వదిలి ఎవరో పరాయి వారితో గడిపే జీవితాన్ని ఆలోచించలేను. ఇప్పుడే నాకు ఇష్టం లేదు. అసలు పెండ్లి ఎందుకు చేసుకోవాలి ?” చాలా మొండిగా నిరుత్సాహంగా అంది.
“స్త్రీ పుట్టుకకు పరిపూర్ణత్వం, ఒక స్థిరత్వంకోసం !! రెండు వంశాలు, శరీరాలు ఒక్కటే అని ఏడేడు జన్మల బంధం శాస్వితం అని కాలం నిర్ణయించిన తీర్పుకు గుర్తు. ఇవన్నీకూడా ఎప్పుడో నిర్ణయాలు జరిగి పోయిఉంటాయి. అదే గోత్రపు శక్తీ ” చెల్లెలు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నందా.
“ఈ కాలం ఒక్కరోజు ఉంటే గొప్ప ! బంధాలు అనుభందాల అర్ధాలు మారిపోయాయి. మధ్యలో గోత్రం ఏవిటి ? వాచ్ మాన్ లాగ? ఇంత తిరుగుడెందుకు ?. ”
“అవును. మంద బుద్దికి అర్ధం అవుతుందో లేదోనని... ? ఏడు జన్మల ముందు తరాలు గుణగణా ల పరువు, ప్రతిస్థ, అభివృద్ధి.. అంటే వంశం, గోత్రం చెపుతుంది !” అన్నాడు నందా.
“తెలివితక్కువ. అవెందుకు? తెలివిని, నియమాలను, నిర్ణయాలను ఏర్పరిచేది మన అమ్మా నాన్నల వంశపు జీన్ అన్నావా ఒప్పుకోవచ్చు. ”
“అదేక్కడి నుంచి వస్తుంది? మన పూర్వీకులనుంచి వస్తుంది. ఆ పూర్వీకుల పారంపర్య కొనసాగింపే ఈ గోత్రం !! గౌతమ, భరధ్వాజ, జమదగ్ని, వశిష్ఠ, విశ్వామిత్ర, కశ్యప, అత్రి, అంగీర, పులస్తీ, పులహ క్రతు అనే మహర్షుల నుంచి మనం వచ్చామని అంటారు. ”
“ మరి కొందరు ఆహారధాన్యాల పేర్లు, ఇంకొందరికి ఆలమందల పేర్లు కూడా ఉన్నాయిగా? మరి అవి ఏమిటి? మన అమ్మానాన్నలు నేరుగా వాళ్ళ దగ్గరనుంచి రాలేదు. ఎన్నో తరాల వేరు, వేరు వంశాల, ఆడ మగ కలిస్తేనే వచ్చారు. ”
మీరన్నది నిజమనుకున్నా, మన ఆదిపురుషుల జీన్స్ కాలక్రమేనా రకరకాల మార్పు చెంది ఉంటాయి.. తొలి వంశంలోని గుణగణాలు అంటే వ్యక్తిత్వాలు అన్నీ మారిపోయి ఉంటాయి. దానితోపాటే నడవడికలు, ఆలోచనా విధానాలు మారిపోయి ఉంటాయి. మరి గోత్రం విలువ ఏవిటి ? నాకొద్దు. నా తల్లిదండ్రులే నాకు దైవాలు. వాళ్ళ పేర్లే చెప్పుకుంటా ! నా బిడ్డలకు పెట్టుకుంటా !!”
“ఒకప్పుడు రాజులకాలంలో గోమందలను బట్టి బలవంతులు, డబ్బున్నవారు అని నిర్ణయించేవారు. ఆవులకోసమే కౌరవులకు పాండవులకు ఉత్తర గోగ్రహణం అనే యుద్ధం జరిగింది. గోవులను ప్రతి ఋషికి దానంగా ఇచ్చేవారు. ఒక్కో మహర్షికి వేల గోవులు మందలు మందలుండేవి. దాన్నిబట్టే ఆ ఋషివి, ఈ ఋషి పేరుతో ఈ గోత్ర నామదేయం వచ్చిందంటారు. ”
“మరి మలయాళీలు, తులు వంశస్తులు మార్చుకోరు. వారి సంగతి ఏవిటి? ఎవర్నైనా పెండ్లి చేసుకోవచ్చు. సుఖంగా సంసారాలు చెయ్యడం లేదా? ” ప్రశ్నించింది నిత్య వాళ్ళ అన్నయ్యను.
నవ్వుతూ తలపట్టుకు కూర్చుని, ”. గోత్రం... అది ఎన్ని జన్మలెత్తినా మారదు. మనకు ఎక్స్, వై క్రోమోజోమ్స్ ఉంటాయని తెలుసు కదా. వై క్రోమోజోం ఆదిమునుల పరంరగా మగ బిడ్డకే వస్తుంది. ఆడబిడ్డలకు ఒక్క ఎక్స్ క్రోమోజోం మాత్రమే పుట్టుకలో వస్తుంది. ఆడ బిడ్డలకు వై క్రోమోజోం ఎందుకు రాదు అంటే నాకు తెలియదు. వై క్రోమోజోం మన ఆది ఆరంభాన్ని, ముని పరంపర వంశాన్ని, , గుణగణాలను, దేహపుష్టి, జబ్బులను తీసుకు వస్తాయి అందుకే నక్షత్రాలేకాదు, పెండ్లి సమయాలలో గోత్రాలు కలుస్తాయో లేదోకూడా చూసి నిర్ణయిస్తారు. ఒకే గోత్రం ఉండే వాళ్ళు చేసుకోకూడదు. ఒకే గోత్రంలో చేసుకుంటే దాంపత్యం బాగుండదని శాస్త్రం. పుట్టబోయే బిడ్డలకు దోషాలు వస్తాయని నమ్మకం. వేరు వేరు అయితే అరమరికలు లేని అనుబందాన్ని నూరేళ్ళు గట్టి పరుస్తుంది అని హిందూ శాస్త్ర సమ్మతం. అది నిజం కూడా కావచ్చు. ” అన్నాడు.
“నేను నమ్మను. మగ బిడ్డకే ఎందుకు రావాలి? కొన్ని తెగలకు, కొన్ని ప్రాంతాలలో నివసించే వారికి చెడు చేయనిది నాకు మాత్రం ఎలా చెడ్డ చేస్తుంది ? ప్రకృతి మార్పులు కలిగించే స్పందనలకు లొంగకుండా, బాహ్య ప్రలోభాలను దగ్గరకు రానీక కాపాడుకోచ్చిన పవిత్రతను, ఒక అపరిచితునకు అర్పించి ఒక జీవికి ప్రాణ మిస్తే, ఆ సారాంశానికి నా వంశపు పేరుగాని, గోత్రంగాని ఉండదు. నా శ్రమతో, ప్రతిభతో సాధించిన విజయాలన్నీ మొగుడి వంశానికి దాసోహం చెయ్యాలి. నన్ను అహర్నిశలు కాపాడిన నా వంశపు వాళ్ళ మాట ఏవిటి? ఇది ధర్మంకాదు. అసలు పద్దతే కాదు. నేను ఏదీ మార్చుకోను. నా దగ్గర గోత్రం సంగతి ఎత్తకండి. అంతే ! నా తల్లిదండ్రులే నా గోత్రం !!. ”
ఆలోచిస్తున్న నిత్యను చూసి శ్రీనంద, “మన ఋషులకు సైన్సు ల్యాబ్ లు లేవు, మైక్రోస్కో పులు లేవు, దూర ద్రుష్టితో, ఆత్మ పరిజ్ఞానంతో ఈ నాటి ఆధునిక విజ్గానానికి కంటే ముందుగానే ప్రతిది నిర్దుష్టంగా కనుక్కున్నారు. వాళ్ళు చెప్పినవి ఇంకా కొన్ని ఆధునిక శాస్త్రానానికి అంతు పట్టలేదు. మనలో ఉత్పత్తి అయ్యే ఫెరమొన్స్ అంటే చెమటలో వచ్చే కొన్ని గ్రంధులు అనుకూలంగానే ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్సు వలన భాంధవ్యం అనేది పటిష్టం అవుతుంది. అదే రాసి పెట్టడం ! అదృష్టం అని అంటారు !! సరే ! నీతో గెలవలేను ఆ వచ్చేవాడి తల తిను. ” అంటూ ఇక పొడిగించక తల్లి దండ్రితో, పెండ్లి సంబధాన్నిగురించి మాటల్లో మునిగి పోయాడు.
జాతకాలు చూపించి ముహూర్తం నిర్ణయిస్తాం అన్నారు.
అది నచ్చలేదు నిత్యాకి. అయినా పొడిగించడం ఎందుకని మౌనంగా ఉండిపోయింది.
వారం రోజుల్లో పెండ్లి చూపులు జరిగాయి. కలుసుకున్నప్పుడు మాటల్లోపడి సమయం గుర్తురాలేదు.
శ్రీనంద శివాత్మజ ఒకరినొకరు చూసుకుని తృప్తిగా గాలి పీల్చుకున్నారు. ఎంతకీ రాకపోయేసరికి శ్రీకర్ తల్లితండ్రులు తొందర పడటం గమనించి, శివాత్మజ చొరవ తీసుకుని నిత్యను పిలిచింది. ఇద్దరూ ఉలిక్కిపడి సమయం చూసుకుని, ” సారీ! సిస్టర్. మీరే పిలుస్తారని... ” తడబాటుతో అన్నాడు శ్రీకర్.
నిత్యకూడా సిగ్గుతో వదిన్ని వచ్చి గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుంది.
“ఇంటి పేరు మార్చమంటావా... గోత్రంకూడానా?” కొంటెగా నిత్య కళ్ళలోకి చూసి ప్రశ్నించింది శివాత్మ.
“ఆయన ఇష్టం. ”
ఇదే కాల నిర్ణయం, రాత, తొలి చూపులోనే పెన వేసుకు పోయే జన్మ జన్మల బంధం గొప్పతనం, శాస్వితం చేసే పూర్వ జన్మ అనుబంధం అని నవ్వుకుంది శివాత్మ.
పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకున్న శివాత్మజను వదిలించుకుని లోపలికి పారిపోయింది వెనుతిరిగి శ్రీకర్ని చూస్తూ నిత్య.
పూర్ణారావు సౌభాగ్యమ్మ, మరునాడు, సిద్ధ హస్తుడు, వాళ్లకు నమ్మకస్తులు అయిన సిద్ధాంతికి జాతకాలు చూపించారు. బ్రహ్మాడంగా ఉంది. దివ్వమైన జంట. వంశాంకురాళ్ళు భువిని వెలిగిస్తారు. కానీ చిన్న దోషం కనిపిస్తుంది. పరిహారం చేసుకోవచ్చు ఏం ఆలోచించకండి. ప్రొసీడ్ గో ఆహేడ్ ! అని భరోసా ఇచ్చాడు. సంతోషంతో తలమునకలవుతూ ఇంటికొచ్చి చెప్పారు.
నిత్య తన అదృష్టానికి పొంగిపోయింది.
కొద్ది నెలల పరిధిలోనే పెండ్లి జరిగిపోయింది. ప్రపంచలోని సంతోషం ఆ ఇంటిలోనే నిలిచినట్లు అనిపించింది.
మొదటి రాత్రి, సృష్టినే మరిచి మనసులు పంచుకున్నారు. రోజులు, నెలలు సంవత్సరాలుకూడా మరిచిపోయే స్థితిలోకి వెళ్లి పోయారు.
ఒక రోజు వెలిగి పోతున్న నిత్యను చూసి, “ఏవిటి అంత అందంగా పిచ్చేక్కిస్తున్నావు. సంతోషం దాచుకోలేక ఉరకలేస్తున్నావు. ” భర్త పలకరింపుతో ఉల్లిక్కిపడి అమాంతం కౌగలించుకుని హత్తుకు పోయింది.
దూరంగా జరుపుతూ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ”ఈ రోజు శ్రీమతిగారు వసంత వనాల స్వర్గంలో విహరిస్తున్నట్లుంది” అన్నాడు.
“వసంతమే మీకు అంకితమైతే నిత్య ఉత్సవాలు జరిపించడానికి ఓరచూపు చాలుకదా! ” సిగ్గుతో ముడుచుకుపోతూ అంది.
సరసానికి మురిసి కొంటెగా చూస్తూ, ” మునిగిపోదామా? అమృతాన్ని పంచి మధుర పలాలను సొంతం చేసుకుందామా?” అంటూ దగ్గరకు తీసుకున్నాడు.
“దగ్గరకొస్తే జేవురించిన ముఖంతో, చారడేసి కళ్ళల్లో కోపాన్ని దాచుకుని మీ శత్రువు చెరుకుగడతో కాచుకోనున్నాడు తరిమికొట్టాలని. ”
ఆశ్చర్యంగా చూసాడు శ్రీకర్. ఆమె కళ్ళల్లోకి. దోబూచులాడుతున్న ప్రతిభింభాన్ని గుర్తించి సంతోషంతో ఆకాశాన్ని చుట్టి పాదాలముందు పరుస్తూ, “అడుగు కింద పెట్టకూడదు. కంది పోతుందేమో వడలి కరిగిపోతుందేమో సొగసు. ఆణిముత్యం నాకు ప్రసాదించే వరకు అలుపెరగనివ్వను. నీకు పూజలు చేసి నిత్య నైవేద్యం అర్పించుకుంటా! ఆరగించి నన్ను తరింప చెయ్యవా ! ప్రసాధించవా పున్నామ నరకాన్ని తప్పించే వంశాదిపతిని. చాటిస్తాను ఈ భూమి ఆకాశం మారుమ్రోగేట్లుగా!” ఆరాదించే కళ్ళతో ఆమె నోసటిన ముద్దుపెట్టుకుంటూ పెదవుల్ని క్రిందకు జార్చాడు. శ్రీకర్.
తప్పుకుంటూ, ” ఇక ఆపండి స్వామీ ఈ నాటకీయత. చస్తున్నాను వస్తున్న వాంతిని ఆపుకోలేక. ”
“అంతేలే నేను మాట్లాడితే నీకు వాంతి... !” ముఖం ముడుచుకున్న శ్రీకర్ని చూసి, ” స్వామీ. మీరు కాదు. అదిగో లోపల పండు వెన్నెలను విరబూయిస్తూ బోసినవ్వులు నవ్వుతుందే ఆ పసిడి బొమ్మ. ” అని ముద్దు పెట్టుకుంది.
అర్ధంగాక అర్ధమయి ఎగిరి గంతేశాడు. “మగ పిల్లాడు కాదా ?” సంతోషంతో తబ్బిబ్బు అవుతున్న అతన్ని చూసి, ” స్వామీ! ఇద్దరూ ఏమో? కడుపులో కలియ పెడుతుంది. ఉదయాన్నే హాస్పిటల్ కి వెళదాం. ఏదోగా ఉంది. భోజనం చెయ్యాలంటే అయిష్టంగా ఉంది. ” అంది.
“అట్లా ఉంటే ఎలా ఇప్పుడే కనుక్కుందాము. ” అంటూ ఫోనుతీసుకున్నాడు శ్రీకర్.
వేవిళ్ళు ఎంత చేసినా, మందులు వాడినా తగ్గలేదు. నిత్య నీరసించి చాలా తగ్గిపోయింది. డాక్టరు.. తల్లి ప్రాణానికి ప్రమాదం గర్భం తీసేయ్యడమే దారి అని చెప్పారు. నిత్య ససేమిరా ఒప్పుకోలేదు. మొట్టమొదటి బిడ్డ, ప్రాణం ఉన్న నా బిడ్డ. అంత ఘోరాన్ని బ్రతికుండగా చెయ్యలేను అని మొండికేసింది.
క్రమేణా తగ్గు ముఖం పట్టాయి. కాస్త స్థిమిత పడింది. ఎన్నెన్నో శ్రద్దలు తీసుకున్నాడు శ్రీకర్. తల్లికాబోతున్న తియ్యని తలపు ఇలా ఉంటుందా అని పులకరిచిపోయింది నిత్య.
బిడ్డలో ఎదో లోపం ఉందన్నట్టుగా స్కానులు తీస్తూనే ఉన్నారు. బిడ్డ బాగుంది కానీ ఎదో కొత్తగా ఉంది అన్నారు. నిత్యా, శ్రీకర్ అర్ధగానట్లు చూసారు.
“ఏం భయపడకండి. చూద్దాం. కాన్పు అయిన తరువాత ఆలోచిస్తాము” అని భరోసా ఇచ్చారు.
ఆ రోజు రానే వచ్చింది. బిడ్డ ఆడ, మగ ఎవరో విచారించకనే అలిసి ప్రసవం కాగానే మగతలోనే రోజంతా ఉండి పోయింది నిత్య.
మరుసటి రోజు మెలుకువ వచ్చి తన బిడ్డ ముఖం చూస్తూ కళ్ళు తెరవాలని ప్రక్క తడిమి చూసుకుంది. కాళీగా ఉంటే హదాట్టుగా లేచింది. ఎదురుగా శ్రీకర్ ముభావంగా కూర్చోనున్నాడు.
అటు ఇటు చూస్తూ, ”బిడ్డ ఎక్కడండి?” అడిగింది.
“ఉంది. నువ్వు అప్పుడే లేవకూడదు. ప్రసవం కష్టమై చాలా రక్తం పోయిందట. పడుకో” అని పడుకోబెట్టడానికి ప్రయత్నించాడు.
“బాగున్నాను. బిడ్డను చూడాలి. మీరు చూసారా? ఎలా ఉంది. మీలాగా ఉందా ? “ ఆతృతను అణుచుకోలేక ఆనందంతో తబ్బిబ్బు అయిపోతూ అడిగింది.
ఎం చెప్పాలో అర్ధగాక అర్ధంగానట్టేచూసాడు.
అర్డంగాని బాష అర్ధంగానట్టు ఏవిటా వెర్రి చూపులు అనుకుని, మళ్ళీ బ్రతిమలాడింది.
“కొంచెం ఓర్చుకో, బిడ్డను పదిహేనురోజులు చూడకూడదన్నారు. బలహీనంగా ఉంది. ఎదో చెయ్యా.లి మీ చేతికిస్తే జబ్బులు వస్తాయి అన్నారు. ”
“ఏవిటి తల్లి చూస్తే, తాకితే, జబ్బులు వస్తాయా? మాతృత్వానికి మించిన రక్షణ ఎక్కడైనా ఉంటుందా? చనుబాలకు మించిన వ్యాధి నిరోధక శక్తీ, పోష్టిక ఆహరం ప్రపంచంలో ఉందా ? వాత్సల్యానికి మించిన ఆశీర్వాదం ఏదయినా ఉందా? వాళ్ళు చూపించేది ఏవిటి ? నేనే వెళతాను. ” అంటూ వెళ్ళబోయింది.
ఇంతలో నర్సు, “ ఎం మనుషులో ? కర్కోటకులు. ఏ బిడ్డ అయితే ఏవిటి?” చిరపరలాడుతూ లోపలి వచ్చింది.
అర్ధంగానట్టు చూస్తున్న నిత్య, శ్రీకర్ల తో, ” అదేనమ్మా! పక్కరూమ్లో వాళ్ళు.... నలుగురు ఆడపిల్లలంట. ఇప్పుడుకూడా అదేనంట. ఆ తల్లి ఏడ్చిన ఏడుపు ఎడవకుండా ఏడుస్తుంది. అత్తామామలు చెడామడా కొట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారట. అదేం చోద్యమో వంశోద్ధారకుడు కావాలంట. లేకుంటే వశం అంతమై పోతుందంట. ఖర్మ ఎట్లా పుడుతారో ఈ కసాయి వాళ్ళు. ఆడబిడ్డ వంశాంకురం కాదా?”
దూసుకు వెళ్ళబోయింది. నిత్య.
నర్సు, ” ఎక్కడికమ్మా?”అడ్డుకుంది.
“వెళ్లి బుద్ధి చెప్పి వస్తా. ఆది శక్తిరా! మీ ఇంటి అదృష్ట దేవతారా! అని”
“అన్నీ అయినాయి. ఇప్పటికి గమ్మనుండారు. మగాడయితే అమ్మానాన్నలును వీధుల్లో వేసి, తగలబడే స్మశానవాటిక స్థిరనివాసం చేస్తారు. అప్పుడు తెలుస్తుంది కూడుపెట్టి, కన్నీరుకార్చే ఆడబిడ్డ విలువ !! ఏవంటే కొరివి పెడతాడంట ! ఏవిటో ఈ తపన. చడ్డీలు తీసి చూపించే వాళ్ళే కావాలని ఒక్కటే పూజలు.. మొక్కుళ్ళు. పున్నామ నరకం అంట పుణ్య లోకాలంట !! ఇక్కడ చూపిస్తారు కదా అక్కడెందుకు? ”
చాలా ఎక్కువ మాట్లాడుతుంది అనిపించింది శ్రీకర్ కు.
“ కాలజ్ఞానం చెపుతున్నట్లుందే “అంటూ నవ్వాడు.
“అదేంటో నాకు తెలియదు సార్ ! కడుపు చించుకుని, తొమ్మిది నెలలు మోసి, ప్రాణాలు అరి చేతిలో పెట్టుకుని కన్న బిడ్డ, . మన రక్తం, పాశం, పేగు అని ఒక్క తల్లికికూడా లేదు. మొన్న కాళ్ళు వంకరగా పుట్టాడని పసి గొడ్డును కుప్పతోట్టిలో పారేసిపొయ్యారు, నిన్న బిడ్డ తల లావుగా పుట్టిందని కోడల్ని తరిమేశారు వియ్యంకులు. అది ఎవరి తప్పు. కాలం తీర్పు. మీ రాత తప్పు. భరించాల్సిందే ! ”..
“అంత కర్కోటకులున్నారా?” ఆశ్చర్యపోతూ అడిగింది నిత్య
“కర్కోటకులా? భయంకర బ్రహ్మా రాక్షసులు, అన్నెం పున్నెం తెలియని పసిగుడ్డులను గొంతుపిసికి చంపే క్రూరాతి క్రూరమైన తల్లులున్నారు. బిడ్డను అనుకున్నట్లు కనలేదని కాల్చి చంపే కసాయి వియ్యంకులున్నారు. మొగుళ్ళు ఉన్నారు. మొన్న ఒక బిడ్డ పుట్టిందమ్మా! మరీ భయంకరంగా ఉంది. ఛీ.. యాక్కు! నాకే వొళ్ళు గగొర్పోడిచి వాంతి వస్తుంది.. వొళ్ళంతా బొచ్చు, కోతుల్లాగా కళ్ళు గుంటలు, ముక్కు చప్పడి, బోసినోరు ముసిలి ముఖం. దగ్గరకు పోవాలంటే కంపరం పుడుతుంది. ఆ బిడ్డగతి నక్కలకో గద్దలకో? పాపం, ఎం కర్మ చేసుకుని పుడుతారో? ఎందుకు జన్మనిస్తాడో ఆ దేవుడు?”
నిత్య అర్ధంగానట్టు చూస్తూ,
“మాతృత్వాన్ని మించిన దైవత్వం ఉండదు. మానవత్వాన్ని మించిన ఆదర్శం ఉండదు. బిడ్డ ఎలా పుట్టినా మానవత్వమున్న ఏ తల్లి పసిగుడ్డు మీద అసహ్యం, ద్వేషం పెంచుకోదు. పుట్టడం ఆ బిడ్డ తప్పుకాదు. ” అంది నిత్య.
“అది బిడ్డనా ? చంపేస్తే మంచిది... చస్తే బాగుండు. బ్రతికి ఎం ఉద్దరిస్తుంది “ విరక్తిగా ఈసడించుకుంటూ అంది నర్సు.
“ప్రేమను, కారుణ్యాన్ని పంచాల్సిన నువ్వే అలా మాట్లాడితే ఎలా?” అంది నిత్య.
“ఎం చేయ్యమంటారమ్మా ! మరీ మొన్న పుట్టిన బిడ్డ.. ఎనిమిదో నెంబరు... !?” టక్కున నిలిచి మంచంపై ఉన్న నెంబర్ చూసి నివ్వెరపోతూ, నిత్య వైపు భయంగా చూసి, పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది.
నిత్య. “ఎవర్ని గురించి? ఎవరు... నా బిడ్డ.. ?” అంటూ లేచి విసురుగా పోబోతూ కింద పడపోయింది శ్రీకర్ వచ్చి పట్టుకున్నాడు.
“ఎవర్ని గురించి.. దేన్నిగురించి మాట్లాడుతుంది ఆమె. మన బిడ్డ... ” అతన్ని తోసేసి ఇంటెన్సివ్ కేర్ యునిట్లోకి అడ్డు చెపుతున్నా దూసుకు వెళ్ళింది. అక్కడ ఉంది ఒక్క ఊయలే! అందులో బిడ్డ ఉందొ లేదో చాలా వైర్లు ఉన్నాయి గొట్టాలు ఉన్నాయి. బిడ్డ కోసం నలుమూలలా చూసింది. ఒక వొక్కి పోయి శరీరమంతా వెంట్రుకలతో, కృశించి పోయిన పందికొక్కు లాగ ముసలి ముక్కు, గుంటలు పడిన ముఖం మసగ్గా కనిపించాయి. ”పందికొక్కు.. పందికొక్కు ఉంది. వెంటనే తీసెయ్యండి. బిడ్డను కొరుకుతుంది. తినేస్తుంది. ” వణికి పోతూ గట్టిగా అరిచింది.
“పందికొక్కుకాదమ్మా ! బిడ్డే.. మీ... !!”
ఆ మాట వినగానే విరుచుకు పడిపోయింది నిత్య.
వార్డులోని అందరూ పరుగెత్తుకు వచ్చి దిగులుగా చూస్తూ నిలబడి పోయారు. అడ్డూ ఆపు లేకుండా హృదయవిదారకంగా ఏడుస్తున్న నిత్యను ఎన్ని రకాలుగా సముదాయించినా వీలుగాలేదు.
“నాకే ఎందుకు ఇలా పుట్టింది. ఎన్నో జాగర్తలు తీసుకున్నాను. మా వంశంలో ఎవ్వరికి ఇలా పుట్టలేదు. అన్ని పరిక్షలు చేసారు.. మీకు తెలియలేదా?”
“మామూలుగా అందరి బిడ్డల్లాగానే ఉంటారు. పుట్టిన తరువాత అతి త్వరగా మార్పులు కనిపిస్తాయి. దీనికి మందులు లేవు. ప్రయత్నిస్తున్నారు. మీలో మీ వంశంలో ఎలాటి తప్పు ఉండాల్సిన అవసరం లేదు. ఇది జన్యు పరివర్తన- జెనిటిక్ మ్యుటేషణ్ అనుకోకుండా జరిగేది. దానికి కారణం ఇంకా తెలియదు “
“పేగు తెంచుకుని ప్రట్టిన బిడ్డ, నా రక్తం పంచుకున్న బిడ్డ, మా వంశాంకురం, ఆశల దీపం, మాత్రుత్వపు వరం!! ” బోరున ఏడుస్తూ నొసలు విపరీతంగా బాదుకోసాగింది. పిచ్చి పిచ్చిగా అరవడం మొదలు పెట్టింది. శ్రీకర్ ఎంత సముదాయించినా, ఎందరు పట్టుకున్నా నిలవలేదు.
ఎన్ని కలలు, ఎన్ని రూపకల్పనలు, ఆకాశానికి నిచ్చెనలు, స్వర్గంలో విహారాలు. మరి.. మరి.. !! వాళ్ళందరిని తోసేసి బిడ్డను తీసుకుని, వెంటనే భయంతో పురుగును పట్టుకున్నట్లు కంపరంతో ఊయ్యాలలో విసిరేసి, ” అయ్యూయ్యో “ అని తల బాదుకున్నది.
“డాక్టర్ ! నా బిడ్డ. ఇక అంతేనా? మామూలుగా... ? గోత్రంలో, జాతకంలో.. ? ఎన్నెన్నో పరిహారాలు??”
“అవి మేం చెప్పలేం. సంభంధం ఉండదనుకోవచ్చు. ఉండోచ్చు ??. అది మీ నమ్మకం. ఇది జీన్ లోని న్యూ క్లియస్ విపరీత ప్రవర్తన. మళ్ళీ ఇలాగే పుట్టొచ్చు.. పుట్టకపోవచ్చు ?! అదీ చెప్పలేం !! పుట్టించుకో కుండా ఉండటం మంచిది. జాగర్తగా చూసుకుంటే కష్టం మీద రెండు సంవత్సరాలు... ? రేర్ కేసుల్లో పదనాలుగు సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. పెంచి ప్రయోజనం ఉండదు. శ్రమ దండుగ. నిత్య నరకం అనుభవించాల్సిందే !? ఈ లాంటి స్పెసిమెన్స్ కి రోగ నిరోధక శక్తీ చాలా తక్కువ ఉంటుంది. రోజు రోజుకు ముసలి రూపం పెరిగి శరీరంలో ఏదీ పని చెయ్యక చనిపోతారు. ”
స్పెసిమెన్ అనడం నచ్చలేదు. ‘జంతువా, అది నా బిడ్డరా’ అని అరవాలనిపించింది.
అంటే తల్లిగా నేను.. ? మాతృత్వం లేని స్త్రీ జీవితం... ? నేను గొడ్రాలిగానే... ?మా గోత్రం... మా ఇంటి పేరు... ఆ వంశ పారంపర్య... ?? మరి నా ఆడ జన్మ ? ఇది విధి రాసిన రాతనా? ఇది ఎవరి నిర్ణయం? పూర్వజన్మ పాపమా ? నేను నమ్మనే నమ్మను !! చూస్తాను విధి నన్ను లోబరుచుకుంటుందో నేను దాన్ని లోబరుచుకుంటానో ? దురదృష్టం నన్ను ఎగతాళి చేస్తుందో అదృష్టం నా కాళ్ళకు దండం పెడుతుందో? మా జీవితాలు దుర్భలమైన ఎడారులు కాకూడదు. సర్వకాల సర్వావస్థల్లో ఎండిపోని ఒయాసిస్ కావాలి. ఆ జలాశయంలో నా బిడ్డను జలకాలాడించాలి. ఉరకలతో పకపకలతో బోసి నవ్వులు మా హృదయాలలో అమృత వర్షం కురిపించాలి. ప్రకృతి అందాలు సృష్టించాలి !! మాతుత్వానికి దైవం కూడా కాళ్ళు మొక్కాలి.
దీర్ఘంగా ఆ బిడ్డ వైపు చూసి కుమిలిపోతూ, “ఘాతకు రాలిని, పసిగుడ్డు !! నా రక్తం, నా ప్రాణం. నా వరం!! పెంచుతాను, నా బిడ్డను సభ్యత, సంస్కారాలతో తీర్చి దిద్ది లోకానికి ఆదర్శ ప్రాయం చేస్తాను. మాతృత్వపు శక్తి చూపిస్తాను. ” అంటూ బోరున ఏడుస్తూ బిడ్డను ఎత్తుకుని హృదయానికి పదే పదే హత్తుకుంటూ స్పృహ తప్పి పడిపోయింది నిత్య !! మానసిక వ్యధను మరణ మృదంగాలను భరిస్తూ, ఎదురిస్తూ నిశ్శబ్ద ఘోషలో జీవించడానికి మనస్పూర్తిగా సిద్దమయ్యింది.
*****
డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..
నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
Comments