'Karthaveeryarjunudi Katha' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah Published On 06/12/2023
'కార్తవీర్యార్జునుడి కథ' తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కార్తవీర్యార్జునుడు త్రేతాయుగానికి చెందిన రాజు షట్చక్రవర్తులలో ఒకడు. గొప్ప చక్రవర్తి. వీరాధి వీరుడు. సత్ప్రవర్తనుడు. ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించిన పాలకుడు.
యదువు పెద్దకుమారుడు సహస్రజిత్, చిన్నకుమారుడు క్రోష్టుడు. బలరామకృష్ణులు, యాదవులందరూ ఈక్రోష్టుడి వంశంవారే. సహస్రజిత్ కొడుకు శతాజిత్, అతని కొడుకు హెహయుడు. ఇతని వలనే హైహయవంశం ఏర్పడింది. హైహయవంశంలో మహిష్మవంతుడు, కృతవీర్యుడు, కార్తావీర్యార్జునుడు గొప్ప చివరి రాజులు. పరశురాముడు కార్తావీర్యార్జునుడిని అతని కుమారులను సంహరించడం వలన హైహయవంశం అంతమైంది.
హైహయ వంశీయుడైన కృతవీర్యుడు వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్న అరూప దేశాన్ని మహిష్మతిపురంను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆమహారాజు కుమారుడే కార్తవీర్యార్జునుడు. పుట్టుకతోనే శాపవశాన చేతులు లేకుండా పుట్టాడు వీరి గురువు గర్గమహర్షి.
కొంత కాలానికి కృతవీర్యుడు వయసు పైబడి వార్డక్యంతో మరణించాడు. ప్రజలు కార్తవీర్యార్జునుడిని రాజై రాజ్యాన్ని పరిపాలించమని కోరారు.
"నేను వికలాంగుడిని. రాజ్యాన్ని ఎలా పాలించగలను. నాకు రాజ్యం వలదు. రాజ భోగములు వలదు" అని వైరాగ్య భావనతో ప్రజల కోరికను తిరస్కరించాడు కార్తవీర్యార్జునుడు.
గురువు గర్గమహర్షి " కార్తవీర్యార్జునా! నీకు ఈ అవిటితనం పోవాలంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఆయన కృపను, కరుణను పొందితే ఆ మహాత్ముడి కటాక్షం వలన నీకు వికలాంగత్వం పోయి తేజోవంతమైన మహావీరుడవుతావు. అయితే ఆయన అనుగ్రహం అంత సులువు కాదు. ఆయన చూడడానికి అసహ్యంగా కనబడుతాడు. కుక్కలతో ఆడుకుంటూ ఒకసారి, మధువు సేవిస్తూ ఒకసారి, బంగి తాగుతూ ఒకసారి, స్త్రీలతో కలిసి చిందులేస్తూ ఒకసారి కనిపిస్తాడు. అవేవి పట్టించుకోకుండా ఆయనను సేవిస్తే కరుణించి వరాలు వొసగి అనుగ్రహిస్తాడు. " అని తెలిపి దత్తాత్రేయుడి సన్నిధికి కార్తవీర్యార్జునుడిని పంపుతాడు.
గురువు మాట తలదాల్చి శ్రద్ధాభక్తులను హృదయంలో నిలుపుకొని దత్తాత్రేయుడి ఆశ్రమానికి బయలుదేరుతాడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు ఎన్ని వన్నెలు చిన్నెలు చూపిన, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన చరణాలు పట్టుకొని ఇడువకుండా ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు కార్తవీర్యార్జునుడు. ఎట్టకేలకు కార్తవీర్యార్జునుడి అకుంఠిత దీక్షకు, అమేయ భక్తి ప్రపత్తులకు అనుగ్రహించి, నిజరూపం దాల్చి వరములు కోరుకోమన్నాడు దత్తాత్రేయుడు.
కార్తవీర్యార్జునుడు " స్వామి! దయామయా! కరుణాసాగరా! ఇన్నాళ్లకు నాపై కృప కల్గిందా దేవా!
పరందామా! నాకు నాలుగు వరములు అనుగ్రహించండి పరమాత్మా!" అంటూ అనేక విధాలుగా వేడుకున్నాడు.
"కోరుకో! కార్తవీర్యార్జునా! నీకు వరములను ప్రసాదిస్తాను" అని అభయం ఇచ్చాడు దత్తాత్రేయుడు.
"1. నాకు వెయ్యి చేతులు కావలెను. యుద్ధభూమిలో నేను వెయ్యి చేతులతో కనిపించవలెను. వెయ్యి చేతులతో ఆయుధాలు ప్రయోగించ గలగవలెను. ఇంట్లో మామూలుగా కనిపించవలెను
2. ఈ భూమండలాంతటినీ జయించి సామర్థ్యంతో పాలించవలెను
3. నేను చెడుగా ప్రవర్తించినప్పుడు మునులు మహర్షులు నన్ను మంచి మార్గంలో పెట్టవలెను.
4. నేను యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ నా కంటే గొప్ప వీరుని చేతిలో మరణించవలెను. ఈ వరములను దయతో ప్రసాదించండి ప్రభు!" కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు
"తదాస్తు! నీవు కోరుకున్న వరములన్నీ ప్రసాదిస్తున్నాను. ఉత్తమ పరిపాలకుడవై ప్రజలను ఏలి ప్రసిద్ధి గాంచు కార్తావీర్యార్జునా!" దీవించి దత్తాత్రేయుడు వరములను వొసగినాడు. తక్షణం కార్తావీర్యార్జునుడికి సహస్ర బాహువులు, దివ్య తేజస్సు, అద్భుత లావణ్య రూపం, సకలాయుధ సహితంగా స్వర్ణరథం సిద్ధించింది.
అంతట దత్తాత్రేయుడికి సాష్టాంగ నమస్కారం చేసి, అనేక స్తోత్రంలతో కీర్తించి, సెలవు గైకొని తన రాజ్యంనకు పోయాడు కార్తావీర్యార్జునుడు. రాజ్యాభిషేక్తుడై, అశ్వమేధ యాగం చేసి, వరబలంతో భూమండలాంతటినీ జయించి, సమస్త జీవులపై అదుపు అధికారం సాధించి ధర్మధీక్షతో, న్యాయ బద్దంగా పాలించసాగాడు కార్తావీర్యార్జునుడు.
కార్తావీర్యార్జునుడు ఒకసారి తన దేవేరులతో కలిసి నర్మదా నదిలో క్రీడిస్తూ, నర్మదా నది ప్రవాహానికి తన సహస్ర బాహువులను అడ్డుగా పెట్టి నదీ గమనాన్ని నిలువరించాడు. నదీ ప్రక్కగా ప్రవహిచి సమీపములో ఉన్న రావణుని సైనిక శిబిరాల మీదుగా ప్రవహించింది. రావణుడు కోపించి కార్తావీర్యార్జునుడిపైకి యుద్ధానికి దండెత్తి వచ్చాడు. కార్తావీర్యార్జునుడు రావణుడిని యుద్దంలో ఓడించి చెరశాలలో బంధించాడు. రావణుడి తాత పులస్త్యుడు కార్తావీర్యార్జునుడి దగ్గరికి వచ్చి రావణుడిని విడిచి పెట్టుమని కోరగా రావణుడిని బంధవిముక్తుని చేసి సగౌరవంగా సాగనంపాడు.
కార్తావీర్యార్జునుడి పాలనను కిన్నెర కింపురుష గంధర్వులు ప్రశంసించారు. సకల లోకాలలో కీర్తించ బడినాడు. దానితో అతని లోనికి గర్వం అహంకారం అహంభావం ప్రవేశించి విర్రవీగాడు. వరబలంతో బలగర్వంతో దేవలోకాలను జయించాడు. ఇంద్రుడిని కూడ పీడించాడు కార్తావీర్యార్జునుడు
ఒకనాడు అగ్ని దేవుడు కార్తావీర్యార్జునుడి దగ్గరకు వచ్చి "రాజా! నాకు ఆకలిగా ఉంది. ఆహారం కావాలి. నీవు రక్షణగా నిలబడితే ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నా ఆకలి తీర్చుకుంటాను" అర్థిస్తూ అడిగాడు.
మదోన్మత్తుడై ఉన్న కార్తావీర్యార్జునుడు " ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నీ ఆకలి తీర్చుకో అగ్నిబట్టారకా! " అంటూ అనుమతినిచ్చి అండగా నిలిచాడు కార్తావీర్యార్జునుడు.
అగ్ని గిరినగరారణ్యాన్ని యథేచ్ఛగా స్వాహా చేస్తూ అడవిలోని పల్లెలను, ఆశ్రమాలను కూడా కాల్చివేశాడు. ఆ అరణ్యంలోనే ఉన్న వశిష్టుని ఆశ్రమాన్ని కూడా దహనం చేశాడు. దానితో వశిష్టుడు కోపించి రక్షణగా నిలిచిన రాజును "కార్తావీర్యార్జునా! దురాంకారముతో, మదాంభావంతో చెలరేగిపోతున్నావు! నీ అంతం సమీపించింది. నిన్ను ఒక ముని కుమారుడు నీ సహస్ర బాహువులను తెగ నరికి నీ మస్తకాన్ని త్రుంచుతాడు" అని శపించాడు వశిష్ట మహర్షి. కార్తావీర్యార్జునుడు బలమదంతో శాపాన్ని లెక్క చేయలేదు
దేవతలందరూ వైకుంఠం చేరి కార్తావీర్యార్జునుడి ఆగడాలు శృతి మించి, మితిమీరాయని, అతని పీడనం నుండి తమను రక్షించమని శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారికి అభయం ఇస్తూ
" కార్తావీర్యార్జునుడిని సంహరించే సమయం ఆసన్నమైంది. నేను పరశు రామావతారం ఎత్తి హతమార్చుతాను. కార్తావీర్యార్జునుడు నా సుదర్శన చక్రాయుధమే. ఒకనాడు సుదర్శనుడు ' నా వలనే నీవు ఎందరినో రాక్షసులను, లోకకంటకులను సంహరించావు. నేను లేకుంటే నీవు చంపలేక పోయేవాడివి' అని మిడిసిపడినాడు. అట్లైన కార్తావీర్యార్జునుడిగా నీవు భూలోకమునందు జన్మించు! నేను పరశురాముడిగా అవతారం దాల్చి నీతో తలపడతాను. అప్పుడు నీవు లేకున్నా నేను జయించలేనేమో నీవే చూస్తావు" అని సంఘర్షించాము. ఆకారణంగానే సుదర్శనుడు భూమిపై జన్మించాడు" అని గతాన్ని చెప్పి దేవతలను పంపించాడు శ్రీమహావిష్ణువు.
అనంతరం విష్ణుమూర్తి భూలోకంలో పరశురాముడిగా జమదగ్ని రేణుకా ముని దంపతులకు జన్మించి, పెరిగి పెద్ద అవుతాడు. సకల విద్యలు, శాస్త్రాస్రాలు అభ్యసించి మహావీరుడుగా ఎదుగుతాడు పరశురాముడు
చాల కాలం తరువాత ఒకనాడు అడవి క్రూర మృగాలు గ్రామాలపై బడి బాధిస్తున్నాయి. వాటిని వేటాడి మిమ్మల్ని వాటి నుండి రక్షించండి అన్న ప్రజలు విన్నపము మీద వేటకు బయలుదేరుతాడు కార్తావీర్యార్జునుడు. దినమంతా క్రూర జంతువులను వేటాడి, అక్కడే వున్న జమదగ్నిమహర్షిని దర్శించడానికి ఆశ్రమానికి తన సైన్యంతో సహా వెళుతాడు కార్తావీర్యార్జునుడు.
జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇంట్లోలేని
సమయంలో జమదగ్ని మహర్షి, ఆశ్రమవాసులు రాజును, సైన్యాన్ని ఆదరించి, సేదదీర్చి, రాజుకు సైనికులకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించి సంతృప్తి పరుస్తారు. రాజు - ఇంతమంది సైనికులకు భోజనాలు పెట్టిన ఆశ్రమవాసుల్ని చూసి విస్మయవిబ్రాంతుడైతాడు.
కార్తావీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సమీపించి "మహర్షి! ఇంత పెద్ద సైన్యానికి ఎలా భోజనం ఏర్పాటు చేశారు. మీ దగ్గర అంత ధాన్యం లేదు కదా! ఎలా సాధ్యం అయింది. " అడిగాడు.
" మహారాజా! ఇది నా గొప్పతనం కాదు. నా దగ్గర దైవ ప్రసాదితమైన కామదేనువు సంతతికి చెందిన ఒక గోవు ఉన్నది. దాని మహిమ వలననే మీకు ఆతిథ్యం ఇయ్యడం సాధ్యమైంది. " వివరించాడు జమదగ్ని మహర్షి.
" ఇలాంటివి రాజు దగ్గర వుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయ గలడు. కాబట్టి మహర్షి! ఈ గోవును నాకు ఇవ్వండి. బదులుగా మీకు ఏమి కావాలంటే అవి ఇస్తాను. భూమి, ధాన్యం, ధనం, బంగారం ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఆవును మాత్రం నాకివ్వండి. మీరివ్వకపోతే బలవంతంగానైనా తీసుకపోవలసి వస్తుంది. కాబట్టి మీరే సగౌరవంగా ఇచ్చి పంపుతే గౌరవంగా ఉంటుంది" నయానా భయానా చెప్పాడు కార్తావీర్యార్జునుడు. జమదగ్ని మహర్షి నిర్ద్వంద్వంగా నిరాకరించాడు.
కార్తావీర్యార్జునుడు బలవంతంగా గోవును తోలుకొని తన రాజధాని మహిష్మతి నగరాన్ని చేరుతాడు. ఇంటికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడై మహిష్మతి నగరంపై దండెత్తి, భీకరాకృతి దాల్చి కార్తావీర్యార్జునుడి సమస్త సైన్యాన్ని సంహరించాడు. కార్తావీర్యార్జునుడితో జరిగిన మహభయంకర యుద్ధంలో అతడి సహస్ర బాహువులను, తలను ఖండిస్తాడు పరశురాముడు.
"అసువులు బాసిన కార్తావీర్యార్జునుడి పార్థీవ దేహం నుండి సుదర్శనుడు బయటికి వచ్చి పరశురాముడికి నమస్కరించి "నా గర్వం, అహంకారం, అహంభావం తొలగి పోయాయి ప్రభు. విశ్వప్రభువైన నీతోనే గర్వించి ఆత్మ స్థుతి చేసుకున్నాను. నా గొప్పదనం నీ వలన సంప్రాప్తించినదే అని గుర్తించలేని అజ్ఞానిని. క్షమించు ప్రభు!" పరశురామావతారమూర్తిని స్థుతించి, వైకుంఠం జేరి, చక్రాయుధ రూపు ధరించి శ్రీ మహావిష్ణు దివ్యాస్తంను అలంకరించాడు సుదర్శనుడు.
***
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Podcast Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
Comments