'Vagdanam' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
'వాగ్దానం' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“రామం.. రామం.. ”అంటూ దబ దబా తలుపు తడుతున్న శబ్దానికి పక్క మీద నుండి లేచి టైం చూసాడు రామం. పదకొండు గంటలు అయ్యింది. గబ గబా వెళ్లి తలుపు తీసాడు. ఎదురుగా జనార్ధన స్వామి గుడి ఆచారి గారు. చాలా కంగారుగా ఉన్నారు.
“బాబూ, అమ్మాయి నొప్పులుపడుతోంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురా.. ” ఆందోళనగా అన్నారు ఆచారి గారు.
లోపలకి వచ్చి ఆటో తాళాలు తీసుకుని, బయటకి వచ్చి తలుపు తాళం వేసాడు రామం. “కంగారు పడకండి అయ్యా. అంతా సవ్యంగానే ఉంటుంది” అని ఆటో స్టార్ట్ చేసి, ఆచారి గారిని ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు రామం.
ఆచారి గారు లోపలకి వెళ్ళారు. రెండు నిముషాలలో ఆయన, ఆయన భార్య. వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకునివచ్చి ఆటో ఎక్కించారు. రామం ఆటో ని జాగ్రత్తగా నడిపి జయ నర్సింగ్ హోం కి తీసుకువచ్చాడు.
రామం వెంటనే హాస్పిటల్ లోకి వెళ్లి కంపౌండర్ సాయంతో స్ట్రెచర్ తీసుకువచ్చాడు. ఆచారి గారి అమ్మాయిని దాని మీద పడుకో బెట్టి; కాంపౌండర్, రామం ఆమెని హాస్పిటల్ లోకి తీసుకువెళ్ళారు. ఈలోగా నర్స్ మేడమీడకు వెళ్లి డాక్టర్ కామేశ్వరి కి డెలివరీ కేసు వచ్చిందని చెప్పింది. కొద్దిసేపటికి డాక్టర్ కిందకి వచ్చి ఆచారిగారి అమ్మాయిని చూసి, కంగారు పడవద్దని ఆచారి గారికి చెప్పి రూమ్ లోకి తీసుకు వెళ్లి ఇంజక్షన్ చేసారు.
వరండా లోని బల్ల మీద ఆచారి గారు, ఆయన భార్య కూర్చుని వున్నారు. పక్కనే ఉన్న చెక్క స్టూల్ మీద రామం కూర్చున్నాడు. తెల్లవారు ఝూము నాలుగు గంటలకు ఆచారి గారి అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. అంత వరకూ రామం వాళ్ళు ఇద్దరికీ ధైర్యం చెబుతూ అక్కడే ఉన్నాడు. భార్యని హాస్పిటల్ లో ఉంచి, ఆచారి గారు ఇంటికి వచ్చారు, బట్టలు మిగతా సామగ్రి తెచ్చుకోవడానికి.
రామం కి, మూడు వందలు ఇవ్వబోతే, ”వద్దండి అయ్యగారూ, గర్భవతులను హాస్పిటల్ కి తీసికెళ్తే, కిరాయి తీసుకొను” అని సున్నితంగా చెప్పి వెళ్ళిపోయాడు రామం.
లింగాల వీధి వెనుక వీధిలో కొట్టాని రాజు ఇంట్లో అద్దెకి ఉంటున్నాడు రామం. శివపురం వచ్చి రెండేళ్ళు అయ్యింది. అతని మంచితనం చూసి రాజు ఇంటి అద్దె పెంచలేదు. ఆ వీధిలోని వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు రామం. రిటైర్డ్ టీచర్ రామనాధం గారికి మోకాళ్ళు నొప్పులు. ఆర్. టి. సి. బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు. ద్వారకా తిరుమల వెళ్ళాలంటే, మాస్టారిని, ఆయన భార్యని, తన ఆటో మీద ద్వారకా తిరుమల తీసుకువెళ్ళి, దగ్గరుండి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయించి తీసుకు వచ్చాడు రామం. కిరాయి రెండు వేలు ఇవ్వబోతే “వద్దండి. గురువుల వద్ద ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు” అని ఆయిల్ ఖర్చులు ఆరు వందలుమాత్రమే తీసుకున్నాడు రామం. శివపురం నుండి ద్వారకా తిరుమల తొంభై కిలో మీటర్ల్ దూరం.
రామం రోజూ సాయంత్రం ఆరు గంటలకు ఆ వీధిలోని పిల్లలకు ఉచితంగా ప్రైవేటు చెబుతాడు. వర్షాకాలం వస్తే పిల్లలతో పాటు తానూ వర్షంలో తడుస్తూ కాగితం పడవలు చేసి నీటిలో వదిలి చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. ఆ వీధిలోనే ఉంటున్న కనకమ్మ కూతురు శ్రావణి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఒకరోజు కాలేజీ లో ప్రైవేటు క్లాస్ అయ్యాకా ఇంటికి వస్తోంది. సాయంకాలం ఆరు గంటలు అయ్యింది. చీకటి పడిపోయింది. పన్నాస వారి కొట్టు దాటాకా కొంతమని ఆకతాయిలు శ్రావణి ని అటకాయించి అల్లరి పెడుతున్నారు. అదే సమయానికి రామం మార్టేరు కిరాయి కి వెళ్లి ఇంటికి వస్తున్నాడు.
వెంటనే ఆటో దిగి ఆ కుర్రాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి, శ్రావణి ని టీసుకుని ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఆ ఘర్షణ లో రామం చేతికి గాయం కూడా అయ్యింది.
మర్నాడు సాయంత్రం రామం ఇంటికి వచ్చింది శ్రావణి. పిల్లలు అప్పుడే ప్రైవేట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. “రండి.. రండి.. ”అన్నాడు రామం శ్రావణి ని చూసి.
“నన్ను ‘అండి” అనక్కరలేదు. మీ కంటే చిన్న దానిని. ‘శ్రావణి’ అని పిలిస్తే చాలు” అని అతని చేతికి వున్న కట్టు చూసింది. “అయ్యో, మీకు గాయం అయ్యిందే” అని బాధపడింది.
“ఆ కుర్రాళ్ళలో ఒకడి దగ్గర ఉన్న కీ చెయిన్ కి, బుల్లి చాకు ఉంది. దానితో నన్ను గాయ పరిచాడు. పొద్దున్నే ఆర్. ఎం. పి. కోటేశ్వర రావు దగ్గర ఇంజక్షన్ చేయించుకుని, కట్టు కట్టించుకున్నాను” అన్నాడు రామం చిన్నగా నవ్వుతూ. తనని కాపాడం కోసం అతను గాయ పడడం చూసి శ్రావణి బాధపడింది.
“సారీ అండి, నా వలనే మీకు ఇలా జరిగింది” అంది శ్రావణి బాధగా.
“భలే వారే, మా ఫీల్డ్ లో ఇటువంటి దెబ్బలు మామూలే. మీరేం బాధ పడకండి” అన్నాడు నవ్వుతూ రామం.
‘అదిగో మీరు మళ్ళీ నన్ను ‘మీరు’ అంటున్నారు’ అంది శ్రావణి కళ్ళు పెద్దవి చేసి. ఆమె కళ్ళు చూసి ముచ్చటపడ్డాడు రామం.
“సరే, శ్రావణి అనే పిలుస్తాను. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు?” అడిగాడు రామం.
“మీకు ‘థాంక్స్’ చెబుదామని” అంటూ గది అంతా పరిశీలనగా చూసింది. గోడమీద వినాయకుడి పటం, దాని పక్కనే స్వామి వివేకానంద కేలండర్ ఉన్నాయి
“ఆ.. రామం గారూ, మీరు ఇంతకీ ఎం చదువుకున్నారు? పదవతరగతి ఇంగ్లీష్ మీడియం వాళ్లకి కూడా ప్రైవేటు చెబుతున్నారు? డిగ్రీ పాస్ అయ్యారా?” అడిగింది శ్రావణి.
“అవును. డిగ్రీ చదువుకున్నాను. ఉద్యోగం రాకపోవడంతో ఈ ఆటో నడుపుతున్నాను. రాబడి బాగానే ఉంది. నాకూ హ్యాపీ గానే ఉంది” అన్నాడు రామం. కాసేపు ఉండి ఇంటికి వచ్చేసింది శ్రావణి.
*****
వినాయక చవితి పండుగకు రామనాధం మాస్టారి సలహా మేరకు రాజు పొలం నుండి మట్టి తెచ్చాడు. రామం, రాజు కలిసి వినాయకుడి మట్టి ప్రతిమలు చేసి లింగాల వీధి, కన్యకా పరమేశ్వరి గుడి వీధి లోని అన్ని ఇళ్ళ వారికి ఇచ్చారు. అట్లతద్ది వచ్చిందంటే లింగాల వీధి ఆడపిల్లల హడావిడి ఇంతా అంతా కాదు. తెల్లవారు ఝామునే లేచి స్నానాలు చేసి, పెరుగు అన్నం తిని ‘అట్ల తద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్’ అంటూ వీధి అంతా తిరుగుతూ అల్లరి చేసారు.
ఒప్పుల కుప్ప, దాగుడు మూతలు ఆటలు ఆడారు. రాజు, రామం ఇద్దరూ వెళ్లి వీధి మొగలోని పెద్ద రావిచేట్టు కొమ్మకి పగ్గ్గంతో పెద్ద ఉయ్యాల కట్టారు. ఉదయం నుండి సాయంత్రం గుడికి వెళ్ళే పేరంటాలు, చిన్న పిల్లలు అక్కడి ‘ఉయ్యాల’ ఊగుతూనే ఉన్నారు.
రామం సహాయం లేకపోతె ఏ కార్యక్రమం జరగదు అన్నంతగా వారితో కలిసి పోయాడు రామం.
ఒకరోజు సుబ్రహ్మణ్య శర్మ గారిని డాక్టర్ రామచంద్ర రాజు గారి హాస్పిటల్ కి ఆటో మీద తీసికెళ్ళి తిరిగి వారిని ఇంటి దగ్గర దింపేసి వస్తున్నాడు రామం. శివాలయం వీధి లో ఒక మహిళ రోడ్ మీద పడిపోయి ఉండడం, పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉండడం చూసాడు రామం. ఆటోదిగి అక్కడికి వెళ్లి ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. రోడ్ మీద పడి ఉన్నది శ్రావణి తల్లి కనకమ్మ.
“ఎం జరిగింది?” అడిగాడు రామం అక్కడున్న వారిని.
‘ఎవడో మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఈవిడని గుద్దేసి వెళ్ళిపోయాడు’ చెప్పింది ఒకావిడ. వాళ్ళ ఇద్దరి సహాయంతో కనకమ్మని ఆటోలో కూర్చోబెట్టాడు.
“అమ్మా, మీరు ఎవరైనా ఒకరు ఆమెని పట్టుకుని కూర్చోండి. హాస్పిటల్ కి తీసుకెళ్తాను. తిరిగి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను. సాయం చెయ్యండి’ అని ప్రాధేయపడ్డాడు రామం.
ఒకావిడ ఆటో ఎక్కి కనకమ్మ ని పట్టుకుని కూర్చుంది. ఆటోలో కనకమ్మని డాక్టర్ రాజు హాస్పిటల్ కి తీసుకువచ్చి డాక్టర్ రాజు కి చూపించాడు.
డాక్టర్ రాజు కనకమ్మ ని చూసి ‘ఈవిడ తలకి బాగా దెబ్బ తగిలింది. కుట్లు వేయాలి’ అని లోపలి తీసుకురమ్మనమని స్టాఫ్ కి చెప్పారు. అప్పుడు చూసాడు రామం, కనకమ్మ తల వెనుకనుండి రక్తం కారడం.
డాక్టర్ రాజు, కనకమ్మ గాయం శుభ్రంగా క్లీన్ చేసి, కుట్లు వేసి తలకి కట్టు కట్టారు. ఇంజక్షన్ కూడా చేసారు.
ఇది అంతా జరిగేసరికి అరగంట పట్టింది. తర్వాత రామాన్ని పిలిచి ‘ఆవిడని తణుకు పెద్ద ఆసుపత్రికి తీసుకు వెళ్లి, తలకి స్కానింగ్ తీయించు, ఎందుకైనా మంచిది’ అని చెప్పారు డాక్టర్ రాజు.
అలాగే అని చెప్పి కనకమ్మని ఇంటికి తీసుకు వచ్చాడు రామం. తర్వాత హాస్పిటల్ కి తోడు వచ్చిన ఆవిడని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి, కాలేజీ కి వెళ్లి శ్రావణి ని తీసుకువచ్చాడు రామం.
తల్లిని ఆ స్థితిలో చూసి కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి. రామం ఆమెకి ధైర్యం చెప్పి ‘మనం తణుకు వెళ్ళాలి. మీ అమ్మకి స్కానింగ్ తీయించాలి. భోజనం చేసి రెడీ గా ఉండు. ఎందుకైనా మంచిది, నీవి, మీ అమ్మవి రెండు జతలు బట్టలు తెచ్చుకో. హాస్పిటల్ లో ఉండవలిసి వస్తే ఉందురు గాని’ అని చెప్పాడు. ఇంటికి వచ్చి భోజనం చేసి, వాళ్ళు ఇద్దరినీ తీసుకుని ఆటో లో తణుకు చైతన్య హాస్పిటల్ కి వచ్చాడు రామం. డాక్టర్ శైలజ కనకమ్మకి స్కానింగ్ తీసారు. కనకమ్మ బాగా నీరసంగా ఉంది. ఎక్కువసేపు కళ్ళు మూసుకునే ఉంటోంది. అది గమనించింది డాక్టర్ శైలజ.
“చూడండి, ఈవిడని రెండు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలి. రూమ్ అలాట్ చేస్తారు. ముందు అడ్వాన్సు కట్టండి”అని చెప్పింది. రామం రిసెప్షన్ లోకి వెళ్లి తన ఎ. టి. ఎం. కార్డ్ లోంచి పదివేలు అడ్వాన్సు కట్టాడు. అప్పటికి కనకమ్మని రూమ్ లోకి మార్చారు.
“మీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పు. వారికి ఫోన్ చేస్తాను. నీకు తోడుగా ఉంటారు”అన్నాడు రామం శ్రావణితో. ‘ఎవరూ లేరని’చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది శ్రావణి.
“సరే. నేనుంటాను ఇక్కడే. నువ్వు కంగారుపడకు. మీ అమ్మకు ఏమీ కాదు”అని ధైర్యం చెప్పాడు రామం. శ్రావణి తల్లి రూమ్ లో ఉంటె, రామం హాస్పిటల్ వరండాలో ఉన్నాడు. మర్నాడు ఉదయం పదిగంటలకు కళ్ళు తెరిచింది కనకమ్మ. నర్సు ఆ విషయం డాక్టర్ శైలజకి చెప్పింది. ఆమె వచ్చి కనకమ్మని చూసి ‘ఫరవాలేదు, గండం గడిచింది’ అని చెప్పింది.
కానీ కనకమ్మ చాలా నీరసంగా ఉండడం వలన, రెండు రోజులు అనుకున్నది, నాలుగు రోజులు హాస్పిటల్ లో ఉన్నారు శ్రావణి, రామం. ఐదవరోజున మరో పదివేలు హాస్పిటల్ లో కట్టి, కనకమ్మ ని ఇంటికి తీసుకువచ్చాడు రామం. ఇంటికి రాగానే రామం రెండు చేతులూ పట్టుకుని ఘోల్లుమంది శ్రావణి. ‘మా కోసం మీరు చాలా చేసారు. హాస్పిటల్ బిల్లు మీరే కట్టారు, అయిదురోజులూ ఆటో వేయకుండా మాతోనే హాస్పిటల్ లో వున్నారు. మీ మేలు ఎప్పటికీ మరిచిపోము’ అంది.
“భలేవారే, ఒక చోట ఉంటున్నాం. ఒకరి కొకరం సాయం చేసుకోపొతే ఎలాగ. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో”అని వెళ్ళిపోయాడు రామం. రోజూ ఉదయం, సాయంత్రం కనకమ్మని చూసి వచ్చేవాడు రామం.
కనకమ్మ మిషిన్ కుడుతూ ఆ కొద్దిపాటి ఆదాయంతో సంసారాన్ని గుట్టుగా లాక్కోస్తోందని గ్రహించాడు రామం.
కనకమ్మ గాయం తగ్గడానికి నెలరోజులు పట్టింది..
ఈ నెలరోజులలో రామం, శ్రావణి ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రామనాధం మాస్టారు అప్పుడప్పుడు వచ్చి కనకమ్మ ని చూసి వెళ్ళేవారు. శ్రావణి డిగ్రీ పరీక్షలు రాయడం, కొద్దికాలానికే రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం వేగంగా జరిగిపోయాయి.
ఒకరోజు రామనాధం మాస్టారు కనకమ్మ ఇంటికి వచ్చారు. ‘శ్రావణి డిగ్రీ పూర్తీ చేసింది కదా. నువ్వు ఆరోగ్యంగా ఉండగానే అమ్మాయి పెళ్లి చేస్తే బాగుంటుంది’ అన్నారు మాస్టారు.
“నా పరిస్థితి తెలుసు కదా మీకు. ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి”అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది కనకమ్మ. రెండు నిముషాలు ఆలోచించారు మాస్టారు.
“మన ఆటో రామానికి, శ్రావణి కి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కుర్రాడు బుద్ధిమంతుడు. మనలో కలిసిపోయే మనిషి. ఏ బంధం లేక పోయినా మొన్న నీకు అంత ఆపద వస్తే నిన్ను ఆదుకున్నాడు. రేపు పెళ్లి అయ్యాకా మిమ్మల్ని ఇద్దర్నీ చాలా బాగా చూసుకుంటాడు. ఏమంటావు?” అడిగారు మాస్టారు.
“అమ్మాయితో మాట్లాడి మీకు చెబుతాను. తను కూడా అభ్యంతరం చెప్పదనే నేను అనుకుంటున్నాను” ఆనందంగా అంది కనకమ్మ. సాయంత్రం శ్రావణి తో మాస్టారు చెప్పిన విషయం చెప్పి, “రామంని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా”, అని అడిగింది కనకమ్మ. అప్పటికే రామం మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్న శ్రావణి అతనితో పెళ్ళికి ఒప్పుకుంది.
మరుసటి నెలలోనే రామనాధం మాస్టారి పెద్దరికంలో రామం, శ్రావణి ల పెళ్లి, గుళ్ళో నిరాడంబరంగా జరిగింది. నాల్గు రోజులు అయ్యాక ‘మా ఊరు వెళదాం’ అని భార్యని, అత్తగారిని పాలకొల్లు తీసుకువచ్చాడు రామం. ఆరుగదుల డాబా ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు తల్లీ, కూతురూ. పక్క వాటాలో అద్దెకు ఉంటున్న కౌసల్య వచ్చి, కొత్త దంపతులకు హారతి ఇచ్చి లోపలకు తీసుకువచ్చింది. హాలు లో గోడకు ఉన్న రామం తల్లితండ్రుల ఫోటో చూసి ఆశ్చర్యపోయింది కనకమ్మ.
“నువ్వు మా సుగుణ వదిన కొడుకు కిశోర్ వా?” అని అడిగింది. శ్రావణి కళ్ళు పెద్దవి చేసి విస్మయంగా రామం కేసి చూసింది.
“అవును అత్తయ్యా. నా పూర్తీ పేరు శ్రీరామచంద్ర కిశోర్. మా నాన్న, మావయ్యా అమ్మవారి జాతరలో మాటా మాటా వచ్చి విడిపోయారు. ఆ సంగతి నీకూ తెలుసు. మా అమ్మ చనిపోయేముందు ‘శ్రావణి ని పెళ్లి చేసుకుని, మన బంధం శాశ్వతం చేయా’లని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. నేను ఎం. ఏ. లో గోల్డ్ మెడల్ సాధించాను. మీ ఊళ్ళోకాలేజీ లో లెక్చరర్ గా జాయిన్ అవవచ్చు. కానీ మీలో ఒకడిగా కల్సిపోవాలంటే ఆటోయే బెస్ట్ అనుకున్నాను. అలా వచ్చి, ఇలా శ్రావణిని పెళ్లి చేసుకున్నాను” అన్నాడు నవ్వుతూ రామం. అప్పుడు చూసింది శ్రావణి, రామం తల్లి తండ్రుల ఫోటో పక్కనే ఫోటో. రామం, గవర్నర్ గారి నుండి గోల్డుమెడల్ తీసుకుంటున్నాడు.
శ్రావణి కళ్ళు ఆనందంతో మెరిసాయి. ‘తన భర్త మానవత్వం ఉన్న మనిషే కాదు, చదువులో బంగారు పతకం సాధించిన కార్యసాధకుడు’ అని. వెంటనే రామం కేసి తిరిగి ‘మీరు నాకో వాగ్దానం చేయాలి’ అంది. రామం నవ్వుతూ ‘అలాగే’ అని ఆమె చేతిలో చేయి వేసాడు.
“ఎంతో కష్టపడి సాధించుకున్న గోల్డ్ మెడల్ వృధా కాకూడదు. మీరు లెక్చరర్ గా చేరి, మీ జ్ఞానాన్ని పదిమందికీ పంచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి” అంది శ్రావణి.
“అలాగే. తప్పకుండా ఆ పని చేస్తాను” అన్నాడు రామం. ఆ మాటకు శ్రావణి కళ్ళు ఆనందంగా మెరిసాయి.
*****
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
댓글