top of page

నాన్నంటే... పార్ట్ 1


'Nannante - Part 1/2' - New Telugu Story Written By Sathya S. Kolachina

Published In manatelugukathalu.com On 08/12/2023

'నాన్నంటే - పార్ట్1/2' పెద్ద కథ మొదటి భాగం

రచన: సత్య ఎస్. కొలచిన

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



గౌతమ్ హైస్కూల్ పూర్తి చేశాడు. ప్లస్ టూ లో జూనియర్ కాలేజీలో చదవాలంటే పక్క టౌనుకెళ్ళాలిసిందే. అతనుంటున్న ఊరు పల్లెటూరు కావడం వలన అక్కడ పదో తరగతి వరకే చదువుకోడానికి అవకాశం ఉంది. గౌతమ్ కి పదోతరగతిలో మంచి మార్కులే వచ్చాయి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి సబ్జెక్టులో ఇంటర్లో సీటు దొరుకుతుంది. అతనికైతే మేథమేటిక్సు ప్రథానాంశంగా తీసుకోవాలని ఉంది. అది చదవడానికి కావలసిన తెలివితేటలు అతనికి ఉన్నాయి. వీలైతే ఇంజినీరింగు చదవాలని, లేకపోతే కనీసం మేథమేటిక్సు ప్రథానాంశంగా ఎమ్.ఎస్.సీ వరకు చదవాలనీ అతని కోరిక. కానీ, అతని కోరిక తీరుతుందో లేదో ఏమౌతుందో.


గౌతమ్, తల్లి శ్యామలతో కలిసి ఉంటున్నాడు. అతనికి అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరు. నాన్న సిటీలో ఉంటూంటాడు. అప్పుడప్పడు సిటీనుండి వచ్చి రెండు మూడు రోజులు తమతో గడిపి వెళ్తుంటాడు. వచ్చినప్పుడు తనతో, అమ్మతో ప్రేమగానే ఉంటాడు.

కానీ ‘తమతో కాకుండా దూరంగా ఎందుకుంటున్నాడు?’


ఈ ప్రశ్నకి సమాధానం అతని దగ్గర లేదు. అమ్మయితే, ‘నాన్న సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, మంచిగా డబ్బులు వస్తున్నాయి, మనం మంచిగా జీవించాలంటే బాగా డబ్బు కావాలిగా?’ అంటుంది.


కొంతవరకు ఆమాట నిజమేననిపిస్తుంది గౌతమ్ కి. ఎందుకంటే నాన్న తనకీ, అమ్మకీ దేనికీ లోటు చెయ్యలేదు. నాన్న నెలలో కనీసం రెండుసార్లయినా వస్తాడు. ఇంటికి కావలసినవన్నీ కొంటాడు. పైగా అమ్మకి ఖర్చులకి కావలసిన డబ్బు ఇచ్చి వెళ్తాడు. తనతో, అమ్మతో కూడా ప్రేమగానే మాట్లాడతాడు. తనకి స్కూలికి కావలసినవి అన్నీ కొంటాడు. ఎప్పుడూ నాన్న నాకిది కొనలేదు అనే భావనే రాలేదు అతనికి. నాన్న వచ్చినప్పుడు నాన్నతోనే సమయం అంతా గడిచిపోతుంది. నాన్న ఉన్న ఆ రెండురోజులు మాత్రం గౌతమ్ ఎక్కడికీ వెళ్ళడు, స్నేహితులతో ఆడుకోడానికి కూడా వెళ్ళడు. ఎందుకంటే నాన్న ఉన్న రెండురోజులు అతనికి ఎంతో విలువైనవి.


అయితే, గౌతమ్ కి తీరని కోరిక ఒకటి ఉంది. నాన్న ఎప్పుడూ తమతోనే ఉండాలని. ముఖ్యంగా ఇప్పుడతను చిన్నతనం వీడి కౌమారంలోకి ఎంటర్ అవుతున్న వయసు. ఆవయసులో మగపిల్లలకి నాన్న మీదా చాలా ప్రేమ, ఇష్టం కలుగుతాయి, అన్నీ నాన్నతో షేర్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ గౌతమ్ కి ఈ విషయంలో, నాన్నతో టైము అసలు దొరకడమే లేదు. ఆవిషయం అప్పుడప్పుడు అమ్మతో అనేవాడు. అమ్మ తనమీదే చిరాకు ప్రదర్శించింది కానీ, నాన్నని ఒక్కమాట కూడా అననీయలేదు. అమ్మకి నాన్మంటే అంత ప్రేమ. నాన్న అమ్మగుండెలో పదిలంగా చోటుచేసుకున్నాడని తనకి ఖచ్చితంగా తెలుసు.


మరి, అమ్మకి కూడా, నాన్న తమతో ఉండాలని అనిపించదా? ఎప్పుడూ అమ్మ నాన్నతో దెబ్బలాడినట్లు కానీ, కోపగించుకున్నట్లు కానీ చూడలేదు. వాళ్ళిద్దరి మధ్యా ఎప్పుడూ పరుషమైన సంభాషణ జరిగినట్లు తను చూడలేదు. ఏమో! ఎంత ఆలోచించినా ఇది తనకి తెగని సమస్య. తనకి కూడా నాన్నంటే చాలా ఇష్టం, కానీ నాన్నని తలుచుకున్నప్పుడల్లా ఈ ఒక్క అసంతృప్తి మాత్రం ఉండిపోతుంది.


ఇప్పుడు తను జూనియర్ కాలోజీలో చేరాలంటే, నాన్నతో బోలెడు విషయాలు మాట్లాడాలి. పోనీ, నాన్న టైములేనంత బిజీగా ఉన్నాడంటే, తనైనా సిటీకి పోయి నాన్నతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ, అమ్మే, పర్మిషన్ ఇవ్వడం లేదు.


‘ఎప్పుడూ నాతో చెప్పకుండా నాన్నని కలుసుకోడానికి నువ్వు సిటీకి వెళ్ళడానికి వీల్లేదు.’ అని ఒట్టు వేయించుకుంది. అమ్మకి కోపం కూడా వచ్చింది. అమ్మని అంత కోపంగా చూడడం తనకి అస్సలు ఇష్టంలేదు. నాన్నకి నేనంటే ఇష్టమే అయినా, అమ్మ నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది,

ఇంతవాణ్ణి చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ అమ్మకి ఇష్టం లేని పని చెయ్యకూడదు. ఏది ఏమైనా సరే. తన కోరిక ఎప్పటికీ తీరకపోయినా ఫరవాలేదు, కానీ అమ్మకి మాత్రం కోపం తెప్పించే పని చెయ్యకూడదు. తనకి నాన్ననుండి ఏం కావాలన్నా ముందు అమ్మనే అడగాలి. నాన్నొచ్చిన రెండురోజల్లో నాన్నని అడగచ్చు. కానీ, నాన్న వెళ్ళిపోయాక నాన్నని ఏమైనా అడగాలంటే అమ్మనే అడగాలి ముందు. తన కోరిక సమంజసమైంది అని అమ్మ భావిస్తే, నాన్నతో సీక్రెట్ గా తన సెల్ ఫోను నుండి మాట్లాడుతుంది. అమ్మదగ్గర సెల్ ఫోనుంది, కానీ తనని ముట్టుకోనీయదు. నాన్నే కొనిచ్చాడు అమ్మకి, అవసరం వచ్చినప్పుడు మాట్లాడడానికి.


గౌతమ్ కి బాగా నచ్చిన స్నేహితుడు రాజు. ఇద్దరూ ఒకే తరగతిలో చదివేవారు. ఇప్పుడు ఒకేసారి కాలేజీలో చదివే వయసుకి వచ్చారు. రాజు రోజూ వాళ్ళనాన్నతో తను చేరబోయే జూనియర్ కాలేజీ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ విషయాలన్నీ తనతో చెబుతూనే ఉంటాడు. అవి వింటున్నప్పుడు తన మనసులో ఉన్న దిగులు రెట్టింపు అవుతుందని తెలుసు గౌతమ్ కి. కానీ, రాజు చెప్పే మాటలు వినకపోతే, తనకే నష్టం. ఎందుకంటే మళ్ళీ నాన్న వచ్పినప్పుడు ఆ విషయాలన్నీ తను కూడా మాట్లాడాలి కదా.


గౌతమ్ సమస్య రాజుకి తెలుసు. రాజుకే కాదు, పల్లెటూరులాంటి ఊరు కాబట్టి ఆ ఊళ్ళో చాలామందికి గౌతమ్ సమస్య తెలుసు. వాళ్ళ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసే వాళ్ళున్నారని అతనికి తెలుసు.


‘మీ అమ్మంటే మీనాన్నకి మోజు పోయింది. అందుకే మీతో ఉండకుండా సిటీలో వేరే కాపురం పెట్టాడు’ అని ఒకావిడ అంది.

‘మోజంటే?’ అర్థం కానట్లు అడిగాడు.


‘నువ్వు చిన్నాడివి. నీకు అర్థం కాదులే. ఇలాంటివి అర్థం కావాలంటే నువ్వు పెద్దవ్వాలి. మోజంటే ఇష్టం. మీ అమ్మంటే మీ నాన్నకి ఇష్టం లేదు.’ అందావిడ.


‘అది అబధ్ధం. నాన్నకి నేనన్నా, అమ్మన్నా ప్రాణం.’ గట్టిగా చెప్పేవాడు గౌతమ్. నాన్నని ఒక్కమాటన్నా వాడు సహించలేడు. నాన్నమీద వాడికి అసంతృప్తి ఉన్నప్పటికీ, నాన్నని బయటి వాళ్ళెవరూ ఒక్కమాట అనడానికి వీల్లేదు. ‘మా నాన్నగారు సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. అందుకే అక్కడ ఉంటున్నారు’ అని తండ్రిని సమర్థించాడు.


‘మరైతే, ఆయన రాలేకపోతే, మిమ్మల్నే ఆయన తనతో పాటు ఉంచుకోవచ్చుగా?’


ఆ ప్రశ్నకి గౌతమ్ సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే, తనకే తెలీదు. ఎన్నోసార్లు తనకి కూడా అలాగనిపించింది.


ఈసారి మరొకరన్నారు. ‘మీ నాన్న ఖచ్చితంగా వేరే పెళ్ళి చేసుకున్నాడు, లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నాడు. అందుకే నిన్నూ, మీ అమ్మనీ విడిగా ఉంచుతున్నాడు. ఆ మధ్యనోసారి సిటీకి వెళ్ళినప్పుడు హోటల్లో భోజనం చెయ్యడానికి వెళ్ళాను. మీనాన్న కనిపించాడు. పక్కన ఒక చిన్న పిల్లకూడా ఉంది. నీకు చెల్లెలు వరస అవుతుందనుకుంటాను. అంటే, ఆ పిల్ల తల్లి నీకు పిన్ని అవుతుందిగా మరి’ అని.


ఆమాటలు గౌతమ్ కి కర్ణ కఠోరంగా వినిపించాయనడంలో సందేహం లేదు. కానీ, చివరిగా అన్న మాట, తనకో చెల్లెలు ఉందన్న మాట, ఎంతో ఆహ్లాదంగా అనిపించింది గౌతమ్ కి.


మరొకరు ఇలాకూడా అన్నారు ‘మీ నాన్న మీ అమ్మకి విడాకులిచ్చేశాడు. అంటే, వదిలేశాడు. కానీ చట్ట పరంగా మీ పట్ల తన బాధ్యతని నెరవేర్చుకుంటున్నాడు’ అని. ఈమాటలైతే వాడి హృదయంలో ముళ్ళలాగ గుచ్చుకున్నాయి. ఆ తరవాత వాడు రెండురోజులు సరిగా నిద్రకూడ పోలేకపోయాడు.

వాడు మనసులో ఎంత బాధ పడినా, ఇరుగు, పొరుగు వాళ్ళు ఇలాంటి మాటలంటున్నారని అమ్మకి ఎప్పుడూ చెప్పలేదు గౌతమ్. అమ్మ బాధపడడం వాడు చూడలేడు. కానీ, అమ్మ వాడికంటే చాలా పెద్దది, ఇవన్నీ ఆవిడకి ఎప్పుడో తెలుసు, ఈ మాటలనేవాళ్ళు ఆవిడతోనే ఇలా మాట్లాడి ఉంటారు, అనే విషయం ఆ చిన్ని హృదయానికి తట్టలేదు. కానీ, ఎవరైనా ఇట్లాంటి సంభాషణ చేసినప్పుడు మాత్రం వాడి హృదయంలో అశాంతిగా ఉండేది. వాడికో చెల్లి ఉండడం ఇష్టమే, కానీ, ఆ చెల్లి తమ కుటుంబంలో పిల్ల కావాలి, అంతేగాని, మరో ‘పిన్ని’ అనే వ్యక్తి ఉనికిని వాడు సహించలేక పోతున్నాడు.


ఇప్పుడు వాడి సమస్య, నాన్న వాడితో కాలేజీ ఎడ్మిషన్, జాయినింగు విషయాల్లో పాలు పంచుకుంటాడా, ఆయనకి అంత టైము ఉంటుందా, అని. ఆ సందేహం రావడానికి వాడికో కారణం ఉంది. గత సంవత్సరం, వాడు పదో తరగతిలో జాయిన్ అయినప్పుడు, ఒకసారి, నాన్న రెండునెలలపాటు వరసగా రాలేకపోయాడు, ఎప్పుడూ రెండువారాలకోసారి వచ్చే మనిషి.

ఆ మాటే అమ్మతో అంటే, అమ్మ ఇలా అంది. ‘ఒరే గౌతమ్! నాన్నగారు అన్నీ చూస్తుండబట్టే కదా నువ్వు ఇంతవాడి వయ్యావు? నువ్వు కాలేజీలో చేరే సమయం వచ్చిందని ఆయనకి తెలుసు. నీకు ఏ సమస్యా లేకుండా నిన్ను కాలోజీలో జాయిన్ చేస్తారు. క్రిందటి సారి రాలేకపోయారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక్కోసారి అనుకోని పనులు వస్తుంటాయి. మనం ప్రశ్నలు వేసి నాన్నగారిని వేధించకూడదు.’


‘నాన్నగారు నన్ను కాలేజీలో తప్పకుండా జాయిన్ చేస్తారని తెలుసమ్మా. కానీ, కాలేజీ మొదటి రోజు నాతో కాలేజీకి వస్తారా? రాజుతో వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ నాన్నలని తీసుకెళ్తున్నారు’ అన్నాడు ఆశగా. తను స్కూల్లో ఉన్నంతకాలం పేరెంట్ రావలసినప్పుడల్లా ఎప్పుడూ అమ్మే స్కూలికి వచ్చేది. తనకి గుర్తుండీ నాన్న ఎప్పుడూ తనతో స్కూలికి రాలేదు. ఇప్పుడు తను పెద్దవాడు అవుతున్నాడు కదా. నాన్న తనతో కాలేజీకి రావాలని అతని కోరిక.


‘ఈసారి నాన్నగారు వచ్చినప్పుడు నువ్వే అడుగు. ఒకవేళ ఆయనకి వీలు కాకపోతే, నేనెలాగూ వస్తాను కదా!’ అంది శ్యామల. ఆ సమాధానం అంతగా సంతృప్తినివ్వలేదు గౌతమ్ కి. అయినా అమ్మని బాధపెట్టడం ఇష్టం లేక మౌనం వహించాడు.


వాడి అసంతృప్తిని గ్రహించింది శ్యామల. వాడి భుజం మీద తట్టి, చిన్నగా నవ్వుతూ అంది. ‘నీకో సర్ ప్రైజ్.’ ఆశ్చర్యపోయాడు వాడు. ‘అమ్మా, చెప్పు, ప్లీజ్’. ఆమె కాసేపు వాడిని ఊరించి అంది ‘ఈసారి నాన్నగారు తొందరగా వస్తున్నారు. రేపు సాయంత్రం వస్తున్నారు.’

ఈసారి వాడి ఆశ్చర్యం రెట్టింపయింది.


‘నిజంగా?’


‘నిజంగానే. అమ్మెపుడైనా అబధ్దం చెప్పిందా నీతో?’


వాడి ఆనందానికి హద్దుల్లేవు.


‘ఈసారి నాన్నగారు వారంరోజులుంటారు. నిన్ను కాలేజీలో జాయిన్ చెయ్యడానికే వస్తున్నారు.’

ఈమాటలు గౌతమ్ కి అమృతం తాగిన అనుభూతిని ఇచ్చాయి. వాడికి నాన్నంటే ఇష్టం ఇంకా పెరిగిపోయింది. నాన్నగురించి అందరూ అబధ్ధాలు చెప్తున్నారని అతని మనసుకి అనిపించింది. వారం రోజులంటే, నాన్నతో ఎన్ని విషయాలు మాట్లాడొచ్చో, ఎన్ని అనుభూతులు పంచుకోవచ్చో. వాడి మనసు గాలిలో తేలిపోతోంది.


మరునాడు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడడం వాడికి అసాధ్యం అయిపోయింది.


****

రాఘవరావుకి లలిత ఏకైక సంతానం. అతని భార్య లక్ష్మి ఉన్నంతకాలం వాళ్ళ జీవితం చక్కగా సాగింది. ఈ మధ్యనే అనుకోకుండా లక్ష్మి కేన్సర్ బారిన పడి ఒక సంవత్సరం క్రితమే చిన్న వయసులోనే స్వర్గస్తురాలైంది. రాఘవరావుకి, లలితకి ఇది తట్టుకోలేని విషయం. ముఖ్యంగా రాఘవరావుకి తన పధ్నాలుగేళ్ళ కూతురు లలితని ఊరుకోబెట్టడం చాలా కష్టమై పోయింది. లక్ష్మితో పెళ్ళి అయినప్పటికీ, అతనికి శ్యామల తోను, గౌతమ్ తోను విడదీయరాని బంధం ఏర్పడింది, ముఖ్యంగా, ఎవరికీ చెప్పుకోలేని విధంగా.


అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఫోను తీసుకుని శ్యామలకి ఫోను చేశాడు.


‘వాడు ఈ మధ్య మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడండీ.’ అంది శ్యామల అవతలి వైపునుండి.


‘నాకు అర్థం అవుతోంది. నేను కూడా గమనిస్తున్నాను. నేను రేపు సాయంత్రం వస్తున్నానని చెప్పు. ఈసారి కనీసం ఒక వారం రోజులైనా ఉంటాను. వాడిని కాలేజీలో చేర్పించే వెళ్తానని చెప్పు... అన్నట్లు, నాతో ఈసారి లలితని తీసుకొస్తున్నాను. తను వాళ్ళమ్మ లక్ష్మిని చాలా మిస్ అవుతోంది.’


‘తప్పకుండా తీసుకు రండి. లలిత కోసం నేను ఏమి చెయ్యాలో అంతా చేస్తాను.’ అంది శ్యామల చాలా సంతోషంగా.


వాళ్ళిద్దరూ మరికొంచెం సేపు మాట్లాడుకున్నారు.


రాఘవరావు లలితని పిలిచి మరునాడు తనని ఒక గ్రామానికి తీసుకువెళ్తానన్నాడు. అతను గౌతమ్ గురించి, శ్యామల గురించి లలితకి ఎక్కువ వివరాలు చెప్పలేదు. కానీ అక్కడ గౌతమ్ అన్నయ్యని కలుసుకుంటావని, గౌతమ్ చాలా మంచి అన్నయ్య అని చెప్పాడు.


రాఘవరావు ఈ మధ్య లక్ష్మి పోయిన తరువాత లలితతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. నెమ్మది నెమ్మదిగా గౌతమ్ గురించి కొంచెం కొంచెంగా చెపుతూ, గౌతమ్ ని ఒక కజిన్ లాగా ఆమె మనసులో పరిచయం కలిగించడం చేస్తున్నాడు. లలితకి తండ్రి మీద ఎటువంటి చెడు అభిప్రాయమూ లేదు. తనకి అన్నయ్య వరసలో ఒక కజిన్ ఉన్నాడని, మరునాడు వాళ్ళ దగ్గరికి తండ్రి తీసుకువెళ్తున్నాడని అర్థం చేసుకుంది. ఒక విధంగా ఎక్సైట్ అయింది ఆమె.


మరునాడు ఇద్దరూ కారులో గ్రామానికి బయలుదేరారు. రాఘవరావు కారు నడుపుతున్నాడు. ఆరోజు లలిత కొంచెం ఉత్సాహంగా ఉంది. తండ్రితో ఎన్నో కబుర్లు చెపుతోంది. అతను లలితతో మాట్లాడుతూ దూరాన్ని కూడా మరిచిపోయి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఉన్నట్లుండి పెద్దగా వర్షం పడడం మొదలుపెట్టింది.


గ్రామం శివార్లలోకి వచ్చేశారు. కానీ వర్షం పెద్దగా పడుతుండడం చేత అక్కడున్న మట్టిరోడ్డు కాస్తా బురదరోడ్డుగా మారిపోయింది. కారు చక్రాలు బురదలో చిక్కుకుని బయటికి రావడంలేదు.


ఆసమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్ చక్రాల కింద ఉన్న మట్టి కరిగిపోయి, ఆ ట్రాక్టరు కాస్తా కారుమీదికి వంగిపోయింది. అది డ్రైవరు వైపు వంగిపోయింది. అంత బరువు కారుమీదికి వంగి పోయేసరికి ఆ బరువుకి డ్రైవరు సీటులో ఉన్న రాఘవరావుకి స్పృహ తప్పింది. ఇవతలగా కూర్చున్న లలితకి భయం వేసి కారు తలుపు తెరుచుకుని బయటికి దూకేసింది.


చుట్టూ చూసింది ఎవరైనా సహాయానికి వస్తారేమోనని. పడిపోయిన ట్రాక్టరు దగ్గరున్న ఇంట్లోంచి ఒక మధ్య వయస్కుడు గబగబ బయటికి వచ్చాడు. అతను లలితను చూశాడు, కానీ ఆమె ఎవరో అతనికి తెలీదు. కానీ, డ్రైవింగు సీటులో ఉన్న రాఘవరావుని గుర్తు పట్టాడు, శ్యామల భర్తగా అతను ఆ ఊళ్ళో కొంతమందికి పరిచయమే. గబగబా తన కొడుకు సాయంతో, ట్రాక్టరుని కొంచెం పక్కకి ఒత్తిగించి, రాఘవరావుని బయటికి లాగాడు. ఈలోపు వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాఘవరావుని, లలితని ఆ ఊళ్ళో ఆటో నడుపుకుంటున్న కేశవుడిని పిలిచి, అతని ఆటోలో శ్యామలమ్మ ఇంటికి చేర్చాడు. వాళ్ళిద్దరినీ చూసి శ్యామల ఖంగారు పడిపోయింది. రాఘవరావుని మంచం మీద పడుకోబెట్టి శుశ్రూష చెయ్యడం మొదలుపెట్టింది.


లలితని చూశాక, గౌతమ్ కి ఆమె తన చెల్లెలేమోనని అనుమానం కలిగింది. గుసగుసగా శ్యామల చెవిలో అడిగాడు. ఆమె చిరునవ్వుతో అవునని తల ఊపింది. లలితకి కూడా ఆ అబ్బాయి తన కజిన్ అన్నయ్యేమోనని అనుమానం కలిగింది. రాఘవరావు ఇంకా స్పృహలోకి రాలేదు. ఈలోగా శ్యామల పిల్లలిద్దరికీ రెండు గ్లాసుల నిండా పాలు కలిపి తీసుకొచ్చిచ్చింది.


‘లలితా, గౌతమ్, మీ ఇద్దరికీ నేనొక కథ చెప్తాను. ఇది నా కథ, మీ నాన్న కథ, అంటే మీ ఇద్దరికీ సంబంధించిన కథ...’ అని మొదలుపెట్టింది. లలిత, గౌతమ్, ఇద్దరూ ఉత్సాహంగా కథ వినడంకోసం కూర్చున్నారు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

సత్య ఎస్. కొలచిన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/sathya

సత్య ఎస్. కొలచిన, ఎమ్.టెక్.

వృత్తి – క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినీర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్.

(Cloud Security Engineer, Amazon Web Services, Amazon)

నివాసం – షికాగో నగరం, ఉత్తర అమెరికా

అభిరుచులు – కర్నాటక శాస్త్రీయ సంగీతం (సాధన మరియు బోధన), చిత్రలేఖనం, రచనలు చేయడం, జ్యోతిష్యం, హస్తసాముద్రికం.

సంగీతం గురువు – పద్మభూషణ్, డాక్టర్, శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు.

జ్యోతిషం గురుతుల్యులు – శ్రీ కె.ఎన్. రావు గారు.

చిత్రలేఖనం గురువు – శ్రీ వలివేటి శివరామ శాస్త్రి గారు

రచనలు గురువు – మా తండ్రి గారు శ్రీ కొలచిన వెంకట లక్ష్మణమూర్తి గారు


90 views0 comments
bottom of page