top of page

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Srivari Kattu Kathalu Episode - 8' New Telugu Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…

సమీరను కలుస్తుంది స్నేహ.

జరిగిన విషయాలు అన్నీ చెబుతుంది.

ఆవేశంతో జయా ఆంటీ దగ్గరకు వెళ్ళబోతున్న సమీరను వారిస్తుంది.

ఇక చదవండి…


"లేదు. ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను" అంటూ జయా ఆంటీ ఇంటికి వెళ్ళబోతున్న సమీరను అతి ప్రయత్నం మీద ఆపింది స్నేహ.


"ఆవేశ పడొద్దు. ఆంటీ వాళ్ళది ఒక పెద్ద ముఠా. మనం కాస్త తెలివిగా బిహేవ్ చెయ్యాలి. గౌతమ్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. పోలీసులకు గౌతమ్ మీద అనుమానం కలిగించాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళు స్పందించలేదు. దాంతో రాజకీయంగా ఒత్తిడి తెచ్చి గౌతమ్ ను అరెస్ట్ చెయ్యాలని చూస్తున్నారు. అందుకే గౌతమ్ తన సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళాడు. నీ నంబర్ మీద నిఘా ఉండవచ్చు. అందుకే వీలు చూసుకొని నాకు కాల్ చేస్తానన్నాడు. అదికూడా వేరే నంబర్ నుండి చేస్తానన్నాడు." అంది స్నేహ.


ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.

"జయా ఆంటీ అయి ఉండవచ్చు. నువ్వు రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకో. నేను మాట్లాడి పంపిస్తాను" అంది సమీర.


"సరే. జాగ్రత్త సమీరా! నీకు తన గురించి తెలిసిపోయినట్లు ప్రవర్తించకు. నార్మల్ గానే ఉండు" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది స్నేహ.


జయా ఆంటీకి అనుమానం రాకుండా ఎప్పటిలా ఉండాలి అనుకుంటూ తలుపు తీసిన సమీర ఎదురుగా ఉన్న మోహినిని చూసి ఆశ్చర్యపోయింది.

"పర్మిషన్ ఇస్తే లోపలి వస్తాను" అంది మోహిని.

"భలే వారే. లోపలి రండి" అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది సమీర.


కూర్చోమని సోఫా చూపించి, తనూ పక్కనే కూర్చుంది.

మోహిని మాట్లాడుతూ "నేను కబుర్లు చెప్పడానికి రాలేదు. నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను" అంది కోపంగా.

"మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థంకావడం లేదు" అంది సమీర.


"ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేనంటే భర్త వదిలేసిన దాన్ని. కాబట్టి కనకారావును ప్రసన్నం చేసుకొని నాలుగైదు లక్షలైనా ఇప్పించుకోవాలనుకున్నాను.. తగుదునమ్మా అంటూ అయన కంట్లో పడ్డావు. ఇక నన్నెందుకు చూస్తాడు? ఎంత విదిల్చబోతాడు?" అంది మోహిని ఈసడింపుగా.


"ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అనుకోకుండా ఆంటీ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అంతేకాని ఆ కనకారావు కంట్లో పడటానికి అక్కడికి రాలేదు. నాకు నా గౌతమ్ చాలు. ఎవరి ప్రాపకం అఖ్ఖర్లేదు. నీలా ఎవరికీ ట్రాప్ వెయ్యను" అంది సమీర కోపంగా.


"అదే నేను కూడా చెబుతున్నాను. లక్షణంగా మంచి ఉద్యోగం చేస్తున్న మొగుడు ఉన్నాడు. నాలాంటి ఒంటరి దానికి పోటీగా రావద్దు. నేను కనకారావు మెడలో దండ వేస్తున్నా అతను నిన్నే చూస్తున్నాడు. అతని కంట్లో పడితే మర్యాద దక్కదు. సాయంత్రం డొనేషన్ కోసం జయా ఆంటీ వెడుతోంది. కూడా నిన్ను తీసుకొని వెడుతుందట. నువ్వు ఆమెతో వెళ్ళావంటే మర్యాద దక్కదు. నీ అంతు చూస్తాను" అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళింది మోహిని.


కొంతసేపు అచేతనంగా ఉండి పోయింది సమీర.

తరువాత తలుపు వేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

స్నేహ వంక చూస్తూ "ఆ మోహిని మాటలు విన్నావుగా. ఎంత అసహ్యంగా మాట్లాడుతోందో! అసలు ఆ కనకారావు ఇంటికి నేనెందుకు వెడతాను?" అంది సమీర.


"ఈమెను జయా ఆంటీ పంపించి ఉంటుంది. నిన్ను చాలెంజ్ చేసి రెచ్చగొట్టాలనే ఈమె ఆలా మాట్లాడింది. 'వెళ్తాను. ఏం చేస్తావు?' అని నీతో అనిపించాలని ఆమె ప్రయత్నం" అంది స్నేహ.


"నిజమే. నాకు ఆవేశం తెప్పించి ఆంటీతో నేను వెళ్లేలా చేయాలని ప్రయత్నిస్తోంది. మన ఊహ కరెక్ట్ అయితే కాసేపట్లో జయా ఆంటీ వచ్చి, సాయంత్రం తనతో రమ్మని చెప్పవచ్చు" అని సమీర అంటుండగానే మళ్ళీ బెల్ మోగింది.


"టేక్ కేర్ సమీరా! నార్మల్ గా ఉండు . సాయంత్రం కనకారావు ఇంటికి తోడుగా రమ్మంటే సరే అను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తరువాత డిసైడ్ చేద్దాం" అంది స్నేహ.


ఒంట్లో పొంగి వస్తున్న ఆవేశాన్ని అణుచుకొంటూ డోర్ తీసింది సమీర.

ఆమె ఉహించినట్లుగానే ఎదురుగా జయా ఆంటీ ఉంది. ఆమె పక్కనే పర్వీన్ కూడా ఉంది.


తన ఫీలింగ్స్ ని కప్పిపుచ్చుకుంటూ ఇద్దర్నీ లోపలి ఆహ్వానించింది సమీర.

ఆంటీని, పర్వీన్ నీ కూర్చోబెట్టి తనూ ఎదురుగా కూర్చుంది.


" ఇప్పడే కనకారావుగారు వెళ్లారు. ఇంటికి వెళ్తానని చెప్పిన మోహిని నీ దగ్గరికి వచ్చినట్లుంది" అంది జయా ఆంటీ విషయం ప్రారంభిస్తూ.

మౌనంగా ఉంది సమీర.


"చూడు సమీరా! ఈ పర్వీన్ లవ్ మ్యారేజ్ చేసుకుంది. దాంతో పుట్టింటి వాళ్ళు వదిలేశారు. చేసుకున్నవాడు మూడేళ్ళలో ఇద్దరు ఆడపిల్లల్ని పుట్టించి వదిలేసాడు. టైలరింగ్ చేసుకొని బతుకుతోంది. ఇలాంటి వాళ్లకు సహాయం చేయాలనే నేను కనకారావు లాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాను.


ఈ సారి కాస్త పెద్ద మొత్తం తీసుకొని దీనికి సహాయం చెయ్యాలని నా ప్రయత్నం.

మోహిని తనకు ఇప్పించమని అడుగుతోంది. మరో సారికి ఇప్పిస్తానని చెప్పినా వినిపించుకోలేదు. నిన్ను తీసుకొని వెడితే పని అయిపోతుందని దానికి తెలుసు.

అందుకే నిన్ను బెదిరించడానికి వచ్చి ఉంటుంది. నువ్వు భయపడే దానివి కాదని మాకు తెలుసు. కాస్త పెద్ద మనసు చేసుకొని సాయంత్రం నాకు తోడుగా కనకారావు దగ్గరకు వచ్చి పుణ్యం కట్టుకో. ఈ పర్వీన్ మీద కాస్త దయ తలువు" అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది జయా ఆంటీ.


"అవసరం పర్వీన్ ది కదా! తననే తీసుకొని వెళ్ళండి. మధ్యలో నన్నెందుకు లాగడం " అంది సమీర, ఆంటీ తనను వదలదని తెలిసినా.


"అదేదో సామెత చెప్పినట్లు, దీనికే అంత సీన్ వుంటే నిన్ను, నన్ను బతిమాలుతుందా? అసలు పెళ్లంటూ దీన్ని లేపుకు పోయిన వాడు వదిలేసే వాడా...

లక్షల్లో డొనేషన్ రావాలంటే నీలాంటి పిల్ల రావాల్సిందే. నువ్వు వయ్యారంగా కనకారావు దగ్గరకు వెళ్లి నిలుచుని , 'మీ లెవెల్ కి తగ్గట్లు ఇవ్వండి' అని ఒక్క మాట అడిగితే ఆయన ఐసైపోడూ!" అంది జయా ఆంటీ.


"అంటే నేను ఆ కనకరావును నా అందంతో అట్ట్రాక్ట్ చెయ్యమంటున్నారా?" కోపంగా అంది సమీర.


"కోపం వద్దే పిల్లా! వంద కోట్ల ఆస్తి వున్న హీరోయిన్ కూడా ఒక ఐటం సాంగ్ లో నటిస్తుంది. డబ్బు కోసమో, వొళ్ళు చూపించుకోవడాని కోసమో కాదు. ఆ ప్రొడ్యూసర్ కో, డైరెక్టర్ కో సహాయం చెయ్యడానికి అలా నటిస్తుంది.


అయినా అందమైన అమ్మాయి తన వంక ప్రేమగా చూస్తే ఏ మగాడు కరిగిపోడు? కాకుంటే కనకారావు రావు లాంటి వాళ్ళను ఇష్టంగా ఎవరూ చూడరు. ఎవరైనా చూస్తే మాత్రం యిట్టే కరిగిపోతాడు. అందులో నిన్ను చూస్తే ఇక ఫ్లాట్ అయిపోతాడు" అంది ఆంటీ.


"అంటే నన్ను ఓ మోడల్ లా నటించమంటున్నారా?" సీరియస్ గా అంది సమీర.


"నువ్వలా తప్పుగా అనుకోకు సమీరా! ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుంటారు. మంచి గొంతు ఉన్నవాళ్లు పాటలు పాడుతారు. డాన్స్ వచ్చినవాళ్లు డాన్స్ చేస్తారు. మాటలు నేర్చిన వారు ఉపన్యాసాలు ఇస్తారు. అందమైన నీ లాంటి వాళ్ళు కాస్త వయ్యారం చూపిస్తే తప్పేమిటి ? అది కూడా పర్వీన్ లాంటి పేదల కోసం?" అంది జయా ఆంటీ.


"అయినా గౌతమ్ ఇంటికి వచ్చే టైం అయింది. నేను సాయంత్రం రాలేను. ఏమీ అనుకోకండి" అంది సమీర.


మనసులోనే నవ్వుకుంది ఆంటీ.

ఇంకెక్కడి గౌతమ్? పరారీలో ఉంటాడు. ఇక్కడికెలా వస్తాడు. అనవసరంగా తమ వ్యవహారాల్లో తల దూర్చాడు...ఇక అతని కథ ముగిసినట్లే. నెమ్మదిగా ఈ సమీర తన చేతికి వచ్చినట్లే..


"అబ్బాయికి ఫోన్ చెయ్యక పోయావా! " అంది సమీరతో.

"చేశాను ఆంటీ. స్విచ్ ఆఫ్ వస్తోంది".

"ఈ మధ్య అయితే పాట వచ్చింది గానీ నేనెప్పుడో చెప్పానుగా మగవాళ్లది వంకర బుద్ధి అని" అంది జయా ఆంటీ.


'నీ కోసమే ఆ పాట రాసి ఉంటారు' మనసులోనే అనుకొంది సమీర.

"మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది ఆంటీ. గౌతమ్ మీద కోపం వస్తోంది" అంది సమీర, ఆంటీ ముఖ కవళికలు గమనిస్తూ.


ఒక్కసారిగా వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది ఆమె ముఖం.

దాచుకోడానికి ప్రయత్నం చెయ్యలేదామె.

సమీరను దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

పర్వీన్ గబుక్కున కిందకు వంగి సమీర కాళ్లకు నమస్కారం పెట్టింది.

తరువాత పైకి లేచి సమీరను గట్టిగా కౌగలించుకుంది.


"అయితే సాయంత్రం వస్తున్నట్లేగా.. గౌతమ్ రాకపోతేనేలే" అడిగింది జయా ఆంటీ.

"వస్తానులే. కానీ నాకెందుకో కాస్త భయంగా ఉంది" అంది సమీర.


" భయమెందుకు సమీరా? నీకు ఇదివరకే చెప్పాను. భర్త చేత మోసపోయిన వాళ్లకు కాస్త సహాయం చేస్తుంటాను కానీ నేనెవ్వరినీ, ఏ విషయంలోనూ బలవంత పెట్టను" అంది ఆంటీ సమీర తన ట్రాప్ లో పడుతున్నందుకు సంతోషిస్తూ.


'ఎంత నటిస్తుంది జయా ఆంటీ! తన విషయాలు బయటకు రాకూడదని యాక్సిడెంట్ చేయించడానికి సిద్హపడిన మనిషి, ఆ నేరం గౌతమ్ మీదకు తొయ్యాలని చూస్తున్న మనిషి , ఏమీ తెలియనిదానిలా తన దగ్గర నాటకాలాడుతోంది' మనసులోనే అనుకొని, "తప్పకుండా వస్తాను ఆంటీ. పర్వీన్ కు సహాయం చేద్దాం" అంది సమీర.


మరోసారి సమీరకు థాంక్స్ చెప్పి బయటకు నడిచారిద్దరూ.

వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేసి బెడ్ రూమ్ లోకి నడిచింది సమీర.

తనకోసం చూస్తున్న స్నేహతో " ఆంటీ నమ్మినట్లే ఉంది. తరువాత ఏం చేద్దాం?" అంది.

తన హ్యాండ్ బాగ్ లోంచి ఒక మొబైల్ తీసింది స్నేహ.


" ఇది స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆన్ చేసాక చూస్తే అందులో ఒకే నంబర్ ఫీడ్ చేసి ఉంటుంది. ఆ నంబర్ కు కాల్ చేస్తే...'


ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆ ఫోన్ ను ఆన్ చేసి ఆ నంబర్ కు డయల్ చేసింది సమీర.


అటు వైపు గొంతు వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.


ఇంకా వుంది…


శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 అతి త్వరలో ….

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 20 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


187 views0 comments
bottom of page