top of page

వెంటాడే నీడ - ఎపిసోడ్ 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ventade Nida Episode 7' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో....

విజయవాడలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సుమంత్. స్పృహ వచ్చిన వెంటనే అతని తలమీద చెయ్యి వేస్తాడు ఒక వ్యక్తి. తనను హాస్పిటల్ లో చేర్చిన వ్యక్తి అతనే అయి ఉంటాడు అనుకొని అతని పేరు అడగడానికి ప్రయత్నిస్తాడు సుమంత్. కానీ ముఖమంతా బ్యాండేజ్ కట్టి ఉంచడంతో మాట్లాడలేక పోతాడు.

ఇక చదవండి.....



సుమంత్ ఉద్దేశం గ్రహించిన ఆ వ్యక్తి 'నా పేరు వెంటాడే నీడ' అని చెబుతాడు.

ఆ మాట వినగానే సుమంత్ భయంతో వణికిపోతున్నాడు.


అది గ్రహించిన ఆ వ్యక్తి "ఎందుకలా భయపడుతున్నావు? నీతో పాటు మీ వాళ్ళు ఎవరూ రాలేదు కదా! అందుకనే హాస్పిటల్ వాళ్ళు నన్ను నీకు పర్సనల్ అటెండెంట్ గా ఉండమన్నారు. మీ వాళ్ళు ఎవరైనా వచ్చేవరకూ నేను నీకు నీడలా వెన్నంటి ఉంటాను. అందుకే నా పేరు అలా చెప్పాను. నా అసలు పేరు గోవిందం. నువ్వు బహుశా ‘వెంటాడే నీడ’ అనే పేరుతో ఏదైనా హారర్ మూవీ చూసి ఉంటావు. లేదా ఆ పేరుతో ఉండే దయ్యాల నవల చదివి ఉంటావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నీకేం భయం లేదు. కాసేపట్లో డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేస్తారు" అని చెప్పాడు గోవిందం.


ఇంతలోనే నర్సు డాక్టర్ దగ్గరకు వెళ్లి, పేషేంట్ కదులుతున్న విషయం చెప్పి, అతన్ని పిలుచుకొని వచ్చింది. డాక్టర్, సుమంత్ నాడిని పరీక్షించి చూశాడు. అతని తలను తన చేతుల్తో అటు ఇటు రెండు మార్లు కదిపాడు. తరువాత సుమంత్ తో "మీకేం భయం లేదు. ప్రాణాపాయం నుండి బయటపడ్డారు" అని చెప్పాడు.


డాక్టర్ పేరు అడుగుదామని ప్రయత్నించాడు సుమంత్. కానీ ఇందాకటి లాగే మాట్లాడలేకపోయాడు. అది గమనించిన డాక్టర్, గోవిందం వైపు తిరిగి "అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు" అన్నాడు.


అది చూసిన గోవిందం, "ఇతను మీ పేరు అడగాలని అనుకుంటున్నాడు" అని డాక్టర్ తో చెప్పాడు.


"గుడ్! అతని కదలికలను బట్టి అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కనిపెట్టగలుగుతున్నావు" అని, సుమంత్ వైపు తిరిగి "నా పేరు డాక్టర్ గోవర్ధన్. నా చేతిలో పడ్డావు కాబట్టి నీ ప్రాణాల గురించిన ఆలోచన వదిలేయ్" అన్నాడు డాక్టర్.


అతని మాటలకు సుమంత్ ముఖంలో మళ్లీ కదలికలు మొదలయ్యాయి. అది గమనించిన ఆ డాక్టర్, గోవిందంతో "ఇతని భాష పట్టేశావు కదా. ఇప్పుడు ఏం అనుకుంటున్నాడో చెప్పు" అన్నాడు.


గోవిందం "అతను ఎందుకో మీ మాటలకు భయపడుతున్నాడు" అని చెప్పాడు.


"భయం ఎందుకు? ఇతను ఉన్న చోటినుంచి కదల్లేడు. కనీసం తల కూడా కదిలించలేక పోతున్నాడు. మరి ఇతని ప్రాణాలు నా చేతిలోనే కదా ఉన్నాయి?" అన్నాడు డాక్టర్ గోవర్ధన్.


"విన్నావుగా! నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. భారం డాక్టర్ గారి పైనే వేసి ఉంచు. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు" అని చెప్పాడు గోవిందం.


డాక్టర్ మాటల్లో గానీ, గోవిందం మాటల్లో గానీ ఏదో గూడార్థం ఉన్నట్లుగా అనిపిస్తోంది. వీళ్లు తనని ఏం చేస్తారో తెలియడం లేదు. వీళ్లు చెప్పినట్లుగానే, ప్రస్తుతం తను చెయ్యగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ విషయంగా టెన్షన్ పడితే తనకే ప్రమాదం. కాబట్టి మైండ్ ను వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. తను విశాల్ ను ఎక్కించుకొని బైక్ లో బయలుదేరినట్లు గుర్తు ఉంది. కానీ మధ్య దారిలో చూస్తే తన వెనుక వికృతమైన ఆకారం కూర్చొని ఉంది. తను విశాల్ కు ఫోన్ చేస్తే ఆ ఆకారం చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. అసలు విశాల్ తనతో రాలేదా? అదంతా తన భ్రమేనా? అయితే తన వెనక కూర్చుంది ఎవరు? ఏమీ అర్థం కావడం లేదు సుమంత్ కి. విశాల్ కు ఏమైనా జరిగిందా? ఒక వేళ విశాల్ నార్మల్ గానే ఉంటే తన ఆచూకీ ఈ పాటికి కనిపెట్టేసి ఉండేవాడు. ఇక్కడికి వచ్చి ఉండేవాడు. లేదా విశాల్ కూడా ఆపదలో ఉన్నాడా? తన మామయ్య శంకరశాస్త్రి తనను కాపాడినట్లు గా తనకు కల వచ్చింది. దేవుడి తో పాటు ఆయనను కూడా స్మరించుకోవడం మినహా తను చేయగలిగింది ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇలా ఆలోచిస్తూనే స్పృహ కోల్పోయాడు సుమంత్.

***

ఇక్కడ కంచికచర్లలో తన గదిలో....


నెమ్మదిగా కళ్ళు తెరిచాడు విశాల్. కొంతసేపు తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. కాసేపటికి అతని మెదడు పని చేయడం ప్రారంభించింది. తను తన రూమ్ లోనే ఉన్నట్టు గ్రహించాడు.. నెమ్మదిగా జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకోసాగాడు. తను, సుమంత్, మరికొందరు స్నేహితులు కలిసి హేమంత్ వాళ్ళ తోటలో పార్టీ చేసుకున్నారు. తర్వాత అందరూ ఇళ్లకు బయలుదేరారు. సుమంత్ కంట్రోల్లో లేకపోవడంతో, ‘కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుంటాను’ అని చెప్పాడు. అతనికి తోడుగా తను అతని పక్కనే పడుకున్నాడు. మరో ఐదు నిమిషాలకి అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వదినను హాస్పిటల్లో చేర్పించినట్లు చెప్పాడు. వెంటనే తనను బయలుదేరమని కూడా చెప్పాడు.

ఏం చేయాలో పాలుపోలేదు విశాల్ కు. ఈ పరిస్థితుల్లో సుమంత్ ను వదిలి ఎలా వెళ్ళగలడు?


'అతన్ని కూడా తన బైక్ లో ఎక్కించుకొని తన రూమ్ లో పడుకోబెట్టాలి. అతన్ని చూసుకోమని తన స్నేహితులకు చెప్పాలి. ఆ తర్వాతే తను హైదరాబాద్ కు బయలుదేరాలి' అని నిశ్చయించుకొని సుమంత్ ను లేపడానికి గట్టిగా కుదిపాడు. కానీ అతను ఇంకా మత్తులోంచి బయటపడలేదు. అతని నోట్లో నుంచి మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి.


ఆ మాటలకు అర్థం 'విశాల్! నన్ను విడిచి వెళ్ళవుగా' అన్నట్టు అనిపించింది విశాల్ కి.

వెంటనే తన ఫ్రెండ్ హేమంత్ కు ఫోన్ చేశాడు విశాల్. క్లుప్తంగా అతనికి విషయాన్ని వివరించాడు.


"అయ్యో! ఎంత ఇబ్బంది వచ్చింది! మా అన్నయ్య పెళ్లి బట్టల సెలక్షన్ కోసం, నేను విజయవాడ వచ్చి ఉన్నాను. లేకుంటే నేను పార్టీకి వచ్చి ఉండే వాడిని కదా. అయినా పర్వాలేదు. ఎవరో ఒకరికి చెప్పి వెంటనే తోట దగ్గరికి వెళ్ళమంటాను. సమయానికి వాచ్ మెన్ కూడా అక్కడ లేడు. పొద్దున్నే నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కూతుళ్లను చూడ్డానికి భార్యతో కలిసి గొల్లపూడి వచ్చి ఉన్నాడు. చీకటి పడ్డానికి ఇంకా చాలా టైం ఉంది. నేను ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఓ పావుగంట లేదా అరగంటలో అక్కడికి పంపుతాను. నువ్వు ఆలస్యం చేయకుండా హైదరాబాద్ బయలుదేరు" అని చెప్పాడు హేమంత్.


తన ఫోన్ ని పక్కన పెట్టి సుమంత్ ని రెండు చేతులతో బలంగా కదిలించాడు విశాల్. కొంతసేపటికి కళ్ళు తెరిచి, లేచి కూర్చున్నాడు సుమంత్. అతని చెంపల మీద సున్నితంగా తడుముతూ "సుమంత్! స్పృహలోకి వచ్చావు కదా... నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా..." అని అడిగాడు విశాల్.


"చెప్పు విశాల్! నేను నార్మల్ గానే ఉన్నాను. అసలు నేను తీసుకున్నది చాలా కొంచెమే. కానీ ఎందుకో ఈరోజు ఇంతలా మత్తు కమ్మేసింది.. ఇప్పుడు బాగానే ఉంది. విషయం చెప్పు" అన్నాడు సుమంత్.


" సుమంత్! మా వదినకు డెలివరీ టైం కదా. కొంచెం సీరియస్ అయిందట. వెంటనే రమ్మని మా అన్నయ్య ఫోన్ చేశాడు" అని చెప్పాడు విశాల్.


"అయ్యో! అలాగా... మరి ఇంకా ఇక్కడే ఉన్నావేం? నాకోసం వెయిట్ చేస్తున్నావా...? నాకేం పర్వాలేదు. నువ్వు బయలుదేరి వెళ్ళు. మరో అరగంట గడిచాక నేను ఇంటికి వెళ్తాను" అని చెప్పాడు సుమంత్.


"అలా కాదురా. ఇద్దరం బైక్ లో నా రూమ్ కి వెళదాం. నువ్వు ఈ పూటకి నా రూమ్ లో రెస్ట్ తీసుకో. నిన్ను రూమ్ లో వదిలి, నేను బస్సులో హైదరాబాద్ వెళ్తాను" అని చెప్పాడు విశాల్.


"చూడు విశాల్! ఇప్పుడు నాకేం అయిందని? నేనేమైనా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే నువ్వు నా కోసం టెన్షన్ పడాలి. మందు ఎక్కువై, తూలుతున్నాను. అంతే . ఓ అరగంటకో గంటకో మళ్ళీ మామూలుగా అయిపోతాను. నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు" అన్నాడు సుమంత్.


"సారీ రా! నువ్వు ఎంత చెప్పినా నిన్ను విడిచి వెళ్లాలంటే నాకెందుకో భయంగా ఉంది" అన్నాడు విశాల్.


"చూడు విశాల్! ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు వెంటనే బయలుదేరకపోతే మన స్నేహం మీద ఒట్టే" అన్నాడు సుమంత్.


ఆ మాటతో ఇంకేం మాట్లాడలేక " కాసేపట్లోనే హేమంత్ ఎవర్నో పంపిస్తానన్నాడు. అంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండు సుమంత్. టేక్ కేర్" అని చెప్పి బయలుదేరాడు విశాల్.


అతను కాస్త జాగ్రత్తగా గమనించి ఉంటే 'స్నేహం మీద ఒట్టే' అన్న మాటలు సుమంత్ మనసులోంచి వచ్చినవి కాదనీ, ఏదో దుష్ట శక్తి అతని చేత అలా పలికించిందనీ గ్రహించేవాడు.


వెళ్లేటప్పుడు గేట్ దగ్గర షణ్ముగం వచ్చి ఉన్నాడా లేదా అని చూశాడు. అక్కడ ఎవరూ లేరు. చేసేదేమీలేక తన రూం వైపు బయలుదేరాడు విశాల్. కొంత దూరం వెళ్ళాక, తన ఫోన్ తన దగ్గర లేనట్లు గమనించాడు. ఇందాక సుమంత్ ను లేపడానికి ప్రయత్నించినప్పుడు ఫోన్ పక్కన పెట్టిన విషయం గుర్తుకు వచ్చిందతనికి. ఈ సమయంలో చేతిలో ఫోన్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అటు అన్నయ్య కు కాల్ చేయాలన్నా, ఇటు సుమంత్ విషయం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఆ ఆలోచన రాగానే బైక్ ను వెనక్కి తిప్పి తోటలోకి పోనిచ్చాడు విశాల్.

బైక్ ను నేరుగా ఇందాక తాము కూర్చున్న చోటికి తీసుకొని వచ్చాడు. అక్కడ సుమంత్ లేడు. తన మొబైల్ కోసం ఆ చుట్టు పక్కల చూశాడు కానీ అది కనిపించలేదు.

'ఎవరైనా కాపాడండి' అంటూ సుమంత్ అరుస్తున్న ట్లుగా వినిపించింది. అలాగే దగ్గర్లోనే తన మొబైల్ రింగ్ అయినట్లుగా వినిపించింది. వేగంగా తోటంతా కలియ తిరిగాడు విశాల్. ఎక్కడా సుమంత్ కనిపించలేదు. అంటే హేమంత్ పంపిన మనుషులు అతన్ని హేమంత్ ఇంటికి చేర్చి ఉంటారు అనుకున్నాడు. విషయం కనుక్కుందాం అంటే చేతిలో మొబైల్ లేదు. తనకు కూడా మత్తు కాస్త ఎక్కువగానే ఉంది. మరి కాసేపు ఉంటే తను కూడా స్పృహ కోల్పోవచ్చు. వీలైనంత తొందరగా తన రూమ్ కి చేరుకోవాలి అని నిశ్చయించుకొని వేగంగా తన రూమ్ కి చేరుకున్నాడు. రూమ్ లో ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు పడుకున్న మనిషి తిరిగి ఇప్పుడే స్పృహలోకి రావడం!


టైం ఎంతయిందో చూశాడు. ఉదయం 8:00 దాటింది. అతనికి ఏమీ అర్ధం కాలేదు. 'ఎవరైనా తమ డ్రింక్ లో మత్తుమందు కలిపారా' అన్న ఆలోచన కూడా వచ్చింది అతనికి. వెంటనే పక్క రూమ్ లో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్ళాడు. అతని మొబైల్ తీసుకొని సుమంత్ నంబర్ కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తన నెంబర్ కి కాల్ చేసినా అలానే వస్తుంది. హేమంత్ కి ఫోన్ చేశాడు.


"సుమంత్ కోసం ఇద్దరు మనుషుల్ని మామిడి తోట దగ్గరికి పంపాను. కానీ అక్కడ సుమంత్ లేడు. అతని బైక్ కూడా అక్కడ లేదు. ఒకవేళ నీతో కలిసి మీ రూమ్ కి వచ్చాడేమో అనుకున్నాను. మీ ఇద్దరిలో ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదు" అని చెప్పాడు హేమంత్.


అదిరిపడ్డాడు విశాల్. సుమంత్ కి ఏమైంది? ఒకవేళ అతనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడా? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? అన్నయ్య కు ఫోన్ చేసి సుమంత్ విషయం తెలిసే వరకు హైదరాబాద్ కు రాలేనని చెప్పాలి. అలాగే వదిన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి" అనుకొని వికాస్ నెంబర్ గుర్తుకు తెచ్చుకొని తన ఫ్రెండ్ మొబైల్ నుండి కాల్ చేశాడు. అటువైపు నుండి వికాస్ చెప్పింది విన్న విశాల్ కు కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లు అనిపించింది.


***ఇంకా ఉంది ***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



100 views0 comments
bottom of page