top of page

వెంటాడే నీడ ఎపిసోడ్ 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








Video link

'Ventade Nida Episode 8' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

గత ఎపిసోడ్ లో...

మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి, తిరిగి తోటలోకి వెళ్లిన విశాల్ కు అక్కడ సుమంత్ కనిపించడు.

ఇక చదవండి...



శ్రేయకు ఇంజక్షన్ చేయబోతున్న వ్యక్తి తనను తాను డాక్టర్ గోవర్ధన్ గా పరిచయం చేసుకుంటాడు. ఇంతలో శ్రేయ మంచంపై ఉంచిన వికాస్ ఫోన్ మోగుతుంది. ఫోను అందుకోబోతున్న శ్రేయను విసురుగా పక్కకు నెట్టి, ఆ వ్యక్తి ఫోన్ తీసుకుంటాడు. అటువైపునుంచి ఒక స్త్రీ కంఠం వినపడటంతో "నేను డాక్టర్ గోవర్ధన్" అని చెబుతూ వికృతంగా నవ్వుతాడు ఆ అగంతకుడు.


అతను బలంగా తోయడంతో కింద పడ్డ శ్రేయ పైకి లేచి, రూమ్ కు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ లోకి దూరి తలుపు వేసుకుంటుంది. క్రింద పడడం, వెంటనే లేచి వేగంగా పరిగెత్తడం వల్ల ఆమెకు ధారగా బ్లీడింగ్ అవుతోంది. ఆమె వెనుకే పరుగెత్తిన ఆ అగంతకుడు, శ్రేయ తలుపు వేసుకోవడంతో కోపంతో ఊగిపోతాడు.


తలుపు మీద దబదబా బాదుతూ "మర్యాదగా డోర్ తీస్తే ఈ మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. లేదంటే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చి నీ అంతు చూస్తాను" అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో ఆ హాస్పిటల్ లో ఉన్న డేంజర్ అలారం మోగింది. ఉలిక్కిపడ్డాడు ఆ వ్యక్తి. 'అంటే తనను అనుమానించారు అన్నమాట. లాభం లేదు. వెంటనే తప్పించుకోవాలి. వీలు చూసుకుని మరో అటెంప్ట్ చేయవచ్చు' అనుకొని వేగంగా ఆ గదిలోంచి బయటకు వచ్చాడు.


ఆ హాస్పిటల్ లో డాక్టర్లు వెళ్లడం కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఉంది. క్షణాల్లో అక్కడికి చేరుకున్నాడు అతను. అప్పుడే లిఫ్ట్ డోర్ తెరుచుకుని డాక్టర్ ఆండాళ్ బయటకు వచ్చింది.


అతను ఆమెతో "మేడమ్! రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ లో మీ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. వెంటనే వెళ్ళండి" అని చెప్పి తను లిఫ్ట్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు.


డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఆ హాస్పిటల్ లో ఎప్పుడూ చూసినట్లు గుర్తు లేకపోవడంతో, పైగా డేంజర్ అలారం మోగడంతో వెనక్కి తిరిగి "మీ పేరు చెప్పండి డాక్టర్" అని అడిగింది డాక్టర్ ఆండాళ్.


నా పేరు డాక్టర్ గోవర్ధన్. కొత్తగా హెల్త్ హాస్పిటల్ నుంచి వచ్చాను" అన్నాడు ఆ వ్యక్తి. ఆలోచించేందుకు టైం లేకపోవడంతో రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ వైపు పరుగు తీసింది డాక్టర్ ఆండాళ్. లిఫ్ట్ లోకి వెళ్లిన ఆ వ్యక్తి క్షణం ఆలోచించాడు. 'కిందికి వెళితే తనను కార్నర్ చేయడం ఖాయం' అనుకొని ఫిఫ్త్ ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడినుంచి క్షణాల్లో టెర్రస్ పైకి వెళ్ళాడు.

***

ఆదుర్దాగా రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ లోకి ప్రవేశించింది డాక్టర్ ఆండాళ్. బాత్రూం లోనుండి 'హెల్ప్ ప్లీజ్!' అంటూ అరుస్తున్న శ్రేయ గొంతు వినబడింది.


వెంటనే డోర్ వద్దకు చేరుకొని "అమ్మా శ్రేయా! నేను డాక్టర్ ఆండాళ్ ని. తలుపు తెరువు. నీకేం భయం లేదు" అంది.


లోపల ఉన్న శ్రేయ "మేడమ్! నేను కింద పడి పోయి ఉన్నాను. బ్లీడింగ్ అవుతోంది. పైకి లేచి డోర్ తీయలేను" అంది. ఇంతలో వికాస్ ఆ గదిలోకి వచ్చాడు. బెడ్ మీద శ్రేయ లేకపోవడం, డాక్టర్ ఆండాళ్ వాష్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉండడం గమనించాడు. శ్రేయ వాష్ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుందని గ్రహించి, కాస్త కుదుట పడ్డాడు. డాక్టర్ ఆండాళ్ అతనికి విషయం చెప్పింది.


వికాస్ డోర్ దగ్గరకు వెళ్లి "శ్రేయా! నేను వచ్చేశాను. నీకేం భయం లేదు. గట్టిగా కొడితే ఈ తలుపు గడియ ఊడుతుంది. డోర్ తెరుచుకుంటే నీకు తగలని విధంగా, కాస్త దూరంగా జరుగు" అన్నాడు.


అతి ప్రయత్నం మీద డోర్ కు దూరంగా జరిగి, ఆ విషయాన్ని అతనితో చెప్పింది శ్రేయ. వికాస్ ఆ బాత్రూం తలుపును తన భుజంతో గట్టిగా మోదాడు. గడియ వూడి డోర్ తెరుచుకుంది. లోపలికి పడబోయి తమాయించుకుని చూసాడు వికాస్. అక్కడ నేల మీద పడి ఉన్న శ్రేయను చూడగానే అతనిలో దుఃఖం కట్టలు తెంచుకుంది.


ఇంతలో అక్కడికి వచ్చిన నర్సులతో "అర్జెంట్ గా స్ట్రెచర్ తీసుకురండి. ఈమెను ఐసీయూలో కి తీసుకొని వెళ్ళాలి" అని చెప్పింది ఆండాళ్.


వెంటనే నర్సులు, వార్డ్ బాయ్స్ కలిసి శ్రేయను ఐ సీ యూ లోకి తరలించారు.


ఐ సీ యూ బయట ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు వికాస్.

లోపల శ్రేయను చెక్ చేసిన డాక్టర్ ఆండాళ్ పది నిమిషాల్లోనే బయటకు వచ్చింది.

రెండు చేతుల మధ్య తల పెట్టుకొని దిగులుగా కూర్చుని ఉన్న వికాస్ దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి "మిస్టర్ వికాస్" అని పిలిచింది.


తలెత్తి చూసిన వికాస్ ఎదురుగా డాక్టర్ ఆండాళ్ ఉండడంతో పైకి లేచి నిలబడి "ఏమైంది డాక్టర్? శ్రేయ ఎలా ఉంది...?" అని అడిగాడు.

***


సుమంత్ కోసం శాంతి హోమం జరిపించాడు శంకరశాస్త్రి. తరువాత తనే స్వయంగా ఆంజనేయ స్వామి పూజలు చేసి, తాయత్తు సిద్ధం చేశాడు. చలపతి రావు కు ఫోన్ చేసి "రేపు ఉదయాన్నే మీ ఇంట్లో మహామృత్యుంజయ హోమం ఏర్పాటు చేస్తాను. నేనే స్వయంగా దగ్గరుండి ఆ హోమం జరిపిస్తాను. సిద్ధంగా ఉండండి. తోట దగ్గరికి మనుషుల్ని పంపించారు కదా.. ఏమైనా విషయం తెలిసిందా?" అని అడిగాడు.


చలపతి రావు మాట్లాడుతూ "అక్కడికి మనుషుల్ని పంపించాను. వాళ్లు ఆ పార్టీలో సుమంత్ తో కలిసి ఉన్న కొందర్ని విచారించారు. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి పార్టీ ముగిశాక అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు. సుమంత్ కొంతసేపు అక్కడే ఉంటాను అంటే అతని స్నేహితుడు విశాల్ కూడా తోడుగా అతనితోనే ఉన్నాడట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియడం లేదు" అన్నాడు.


"వాళ్ళు వెళ్ళిన ఆ తోట యజమాని పేరు గోవర్ధన్ అట కదా! ఆయన మాజీ సర్పంచ్ అనీ, ఆయన చనిపోయి చాలా కాలమైందనీ, ఆయనే దెయ్యమై ఆ తోటలో తిరుగుతూ ఉంటాడు అనీ చెబుతూ ఉంటారు" అన్నాడు శంకర శాస్త్రి.


" అవును. వాళ్ళు ఆ తోట అమ్మేసి చాలా కాలం అయింది. ఆయన మనవడి పేరు కూడా గోవర్ధన్ అట. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. శవమైతే ఇంకా దొరకలేదు" చెప్పాడు చలపతి రావు.


"అన్నట్టు సుమంత్ పుట్టిన రోజు రేపే కదూ!" అని అడిగాడు శంకరశాస్త్రి.

"కాదు బావగారూ!" అన్న చలపతి రావు కొంత సేపు ఆగి, "అవును బావగారూ! తిధుల ప్రకారం రేపే మా అబ్బాయి పుట్టినరోజు" అని చెప్పాడు.


"పుట్టినరోజు నాడు మహామృత్యుంజయ హోమం చేయడం ఎంతో మంచిది. చూశారా.. మన సంకల్పానికి భగవంతుడి కటాక్షం ఉందని అనిపిస్తోంది" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శంకరశాస్త్రి. తర్వాత కళ్లు మూసుకొని ధ్యానం లోకి వెళ్ళాడు. అతనికి ఒక వికృతమైన ఆకారం కనిపించింది. ఆ ఆకారం క్రూరంగా నవ్వుతూ సుమంత్ ని చంపడానికి వెడుతోంది.


"ఆగక్కడ!" అంటూ గర్జించాడు శంకరశాస్త్రి.

"ఏమైందండీ..?" అతన్ని కుదుపుతూ అడిగింది పార్వతమ్మ.

"ఏం లేదులే! కాస్త చిత్తభ్రమ కలిగింది" అన్నాడు శంకరశాస్త్రి.


"మధ్యాహ్నం పూట పడుకోకపోతే మీకు ఇలాగే అవుతుంది. వెళ్ళి పడుకోండి" సరదాగా అనింది పార్వతమ్మ. వెంటనే నాలిక్కరుచుకొని, భర్తకు ఎక్కడ కోపం వచ్చిందోనని ఒకసారి అయన ముఖంలోకి చూసింది.

చిన్నగా నవ్వుకొని గదిలోకి వెళ్లి పడుకున్నాడు శంకరశాస్త్రి.


అతడు గదిలోకి వెళ్లి పడుకున్న కాసేపటికి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గుమ్మం ముందు నిలుచుని "అమ్మా! శంకరశాస్త్రి గారు ఉన్నారా?" అని అడిగాడు.


అప్పుడే పడుకున్న శంకరశాస్త్రిని నిద్ర లేపడం ఇష్టం లేని పార్వతమ్మ గుమ్మం వద్దకు వెళ్లి "ఆయన ఇప్పుడే పడుకున్నారు. విషయం చెప్పండి. మరీ అవసరమైతే లేపుతాను" అంది. అందుకు ఆ వ్యక్తి "అయ్యో! వద్దమ్మా... ఆయనను విశ్రాంతి తీసుకోనివ్వండి.


తమిళనాడులోని శైవ క్షేత్రానికి వెళ్లి వస్తున్నాను. ఆయన కోసం సుగంధ విభూది తీసుకొని వచ్చాను. ఏదీ! ఒకసారి చెయ్యి జాపమ్మా!" అన్నాడు.


అప్రయత్నంగా చెయ్యి చాపింది పార్వతమ్మ. ఆమె చేతిలో చిటికెడు విభూది ఉంచి "ఒక్కసారి ఈ విభూతి వాసన చూడు తల్లీ " అన్నాడు ఆ వ్యక్తి.


ఆ విభూతిని వాసన చూసింది పార్వతమ్మ. నిజమే.. చాలా చక్కటి వాసన వస్తోంది. అదే విషయం అతనితో చెప్పింది.


అతను ఒక చిన్న పొట్లం ఆమె చేతికి ఇచ్చి, ఈ విభూది శాస్త్రి గారికి వాసన చూపించి, నుదుటి మీద రాయండి. చిత్త భ్రమలు తొలగిపోయి దీర్ఘ నిద్రలోకి వెళ్తారు" అన్నాడు. ఆయనకు భక్తితో నమస్కరించింది పార్వతమ్మ.


' వైధవ్య' అనే పదాన్ని అస్పష్టంగా పలికి, 'ప్రాప్తిరస్తు' అని పెద్దగా చెప్పి, వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అదేమీ గమనించలేదు పార్వతమ్మ. 'భ్రమ కలిగింది' అని తన భర్త చెప్పడం, విభూది వల్ల చిత్త భ్రమలు తొలగిపోతాయని ఈ సాధువు చెప్పడం గురించి ఆలోచిస్తోంది ఆమె.


సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ సాధువు రూపంలో వచ్చి, ఈ విభూది ఇచ్చాడేమో అనుకుంటూ ఆ విభూదిని తీసుకొని భర్త గదిలోకి వెళ్ళబోయింది. అంతలో ఆ వ్యక్తి తిరిగి గుమ్మం వద్దకు రావడంతో ఆశ్చర్యంగా చూసింది.


'ఏమీ లేదమ్మా! విభూది ఎవరు ఇచ్చారని శాస్త్రి గారు అడుగుతారు కదా. గోవర్ధన స్వామి ఇచ్చారని చెప్పండి. ఈ ముక్క చెప్పడానికే వచ్చాను" అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.


సశేషం...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




.


71 views0 comments

Commenti


bottom of page