సామెతల్లో నిజం
- Peddada Sathyanarayana

- 19 minutes ago
- 3 min read
#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #SamethalloNijam, #సామెతల్లోనిజం #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Samethallo Nijam - New Telugu Story Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 29/01/2026
సామెతల్లో నిజం - తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
“శాంతమ్మా, నీ కోడలు కాపురానికి వచ్చి ఆరు నెలలైనా ఇంకా నీవే కళ్ళాపి చల్లి ముగ్గులేస్తున్నావేంటి?” అని రాములమ్మ అడిగితే, "మా కోడలికి ఇంకా కొత్తకదా.. అదీకాకుండా, వాళ్ళ అమ్మగారు అపార్ట్‌మెంట్స్‌లో ఉండటం వలన ముగ్గులు వేసే అవకాశము ఉండేది కాదు," అని జవాబిస్తుంది శాంతమ్మ.
"సరే, వస్తాను శాంతమ్మా," అని రాములమ్మ వెళ్ళిపోతుంది.
వీరిద్దరి సంభాషణ కోడలు నీరజ విని, ‘అత్తయ్య చాలా బాగా జవాబిచ్చింది’ అని సంతోషిస్తుంది. అయితే, తనకి వీధిలో కూర్చుని ముగ్గులు వేయడం అంటే చిరాకు. ఏమి చేయాలో అర్థము కాక కిచెన్‌లోకి వెళ్లి పోయింది.
ఇంతలో పదో తరగతి చదువుకుంటున్న ఆడపడుచు సుమతి వచ్చి, "వదినా, ఈసారి మన ఊర్లో జరుగుతున్న ముగ్గుల పోటీలో నేను పేరు ఇస్తున్నాను. నీవు కూడా పోటీలో పాల్గొంటావా?" అని అడుగుతుంది.
"నాకు ముగ్గులు వేయడము రాదు. అదీకాకుండా, నాకు ఇష్టము లేదు." అంది నీరజ.
ముగ్గుల పోటీలు జరిగే రోజు అందరూ ముగ్గులు వేసే చోటుకి వెళ్తారు. నీరజ, అందరూ పోటాపోటీగా వేసిన రంగురంగుల ముగ్గులు చూసి ఆశ్చర్య పోయింది. పట్టణాలలో ఇటువంటి పోటీలు అరుదు, అందుకే తనకు ముగ్గుల మీద ఆసక్తి ఉండేది కాదు.
ముగ్గుల పోటీలు జరిగిన తర్వాత, ఫలితాలు ప్రకటించారు. సుమతికి ప్రైజ్ రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత సుమతి ఏడుస్తూ, "వదినా, ఈ రోజు వరకు మన ఇంట్లో ఎవ్వరికీ బహుమతి రాలేదు," అని బాధపడుతూ చెప్పింది.
"బాధపడకు సుమతి, ఈ సారి పోటీలో నీవు బాగా ప్రయత్నించు. తప్పకుండా నీవు గెలుస్తావు." అంది నీరజ.
అనుకోకుండా ముగ్గుల పోటీలు శివరాత్రికి కూడా ఉంటాయని ఊరిలో ప్రకటించారు.
"వదినా, ఈసారి నీవు పోటీలో పేరు ఇవ్వు," అని సుమతి అడుగుతుంది.
"సరే, ఇస్తాను," అని జవాబిస్తుంది నీరజ.
నీరజకు డ్రాయింగ్‌లో మంచి పట్టు ఉంది. కొత్త రకాల ముగ్గులు పేపర్‌మీద వేయడం మొదలు పెట్టింది.
ఒకసారి సుమతి, నీరజ వేసిన ముగ్గులు చూసి "చాలా బాగున్నాయి వదినా," అని మెచ్చుకుంది.
"సుమతి, నాకు నేలమీద వేయడము రాదు," అని జవాబిస్తుంది నీరజ.
"వదినా, మన ఇద్దరము పెరట్లో వేద్దాము," అని ఇద్దరూ రోజుకొక ముగ్గు వేసేవారు.
శివరాత్రి ముగ్గుల పోటీలో సుమతి మరియు నీరజకు బహుమతులు వస్తాయి.
రాములమ్మ, శాంతమ్మ దగ్గరకి వచ్చి "మీ కూతురు, కోడలు ఘటికులే!" అని మెచ్చుకుంటుంది
“‘అనగననగ రాగ మతిశయిల్లుచునుండు అనే వేమన పద్యము గుర్తుకొచ్చింది వదినా” అని జవాబిస్తుంది శాంతమ్మ.
సుమతికి మెడిసిన్‌లో సీటు వస్తుంది. హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి చదువుకోవాల్సి వస్తుంది.
ఇంట్లో భోజనము అలవాటు అయిన తర్వాత, హాస్టల్ భోజనము తినడం కష్టముగా ఉండేది.
సుమతి తోటి హాస్టల్ మిత్రులతో కాక, విడిగా కూర్చుని తినేది. అన్నీ కారముగా ఉండేవి. ఈ విషయము గమనించిన ఫ్రెండ్స్, సుమతి దగ్గరకి వచ్చి కబుర్లు చెబుతూ తినేవారు. సుమతి, దొండకాయ, చేమగడ్డ కూర తినేది కాదు.
తోటివారు ఆప్యాయముగా సమయానికి మంచినీళ్లు, అప్పడాలు ఇచ్చి, కబుర్లు చెబుతూ తినిపించేవారు. "సుమతీ, మనము ఉన్న పదార్థాలనే ఇష్టముగా తింటే అవి మనకి అమృతము లాగా ఉంటాయి," అని నచ్చజెప్పి తినిపించేవారు.
సుమతి సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు, దొండకాయ, చేమగడ్డ కూర తినడం చూసి ఆశ్చర్యపోయారు.
"నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది?" అని నీరజ అడిగితే, తన హాస్టల్ మేట్స్ గురించి చెప్పింది.
ఇంతలో శాంతమ్మ వచ్చి, "తినగా తినగా వేము తియ్యగా నుండు," అనేది నిజము.
అని చెప్పింది.
'మన సామెతల్లో నిజం ఉంది' అనుకున్నారు అందరూ.
***
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.




Comments