top of page
Original.png

పరాభవ సాక్షిగా... పచ్చని మరణశాసనం


Parabhava Sakshiga Pacchani Marana Sasanam - Telugu Environmental Story Dr. Ram Prasad Eruvuri

పరాభవ సాక్షిగా... పచ్చని మరణశాసనం తెలుగు పర్యావరణ కథ | డాక్టర్ రాంప్రసాద్ ఇరువూరి

Published In manatelugukathalu.com On 18/03/2026



ప్రకాశం జిల్లా కనిగిరి కొండల పాదాల చెంత, వెయ్యి ఎండల సెగను గుండెల్లో దాచుకుని నిలబడిన నిశ్శబ్ద పల్లె 'ఈదరవారిపల్లె'. ఆ ఊరి పొలిమేరలో, వెంకయ్య పెంకుటింటి ముందు నిలబడిన ఆ వేపచెట్టు ఒక వృక్షం మాత్రమే కాదు; అది ఆ ఊరి శ్వాస, ఆ ఇంటి పెద్ద దిక్కు, ఆకాశం నుండి నేలకు దిగివచ్చిన పచ్చని గోపురం. ఏటా ఉగాది వస్తుందంటే ఈదరవారిపల్లె ఒక కొత్త పెళ్లికూతురులా ముస్తాబయ్యేది.


తెల్లవారుజామునే నాగలక్ష్మి అలికిన ముగ్గుల మీద వేపచెట్టు రాల్చిన తెల్లని పూలు ముత్యాల్లా మెరిసిపోయేవి. ఊరంతా వేపపువ్వు సుగంధం, కొత్త బెల్లం తీపి కలగలిసి ఒక పవిత్రమైన గాలి వీచేది. గ్రామస్థులంతా ఆ చెట్టు నీడనే పంచాంగ శ్రవణం చేసేవారు. ఆ చెట్టు కొమ్మల్లో ఊయలలు ఊగుతూ పిల్లలు కేరింతలు కొట్టే సమాజం అది. వెంకయ్యకు ఆ చెట్టుతో ఉన్న బంధం కేవలం యజమానికీ, వృక్షానికీ మధ్య ఉన్నది కాదు; అది ఒక ఆత్మకూ, మరో ప్రాణానికీ మధ్య ఉన్న అలిఖిత ఒప్పందం. తన ముత్తాతల నాటి జ్ఞాపకం అది, తన తండ్రి తలవాల్చిన నీడ అది.


కానీ ఈ 'పరాభవ' నామ సంవత్సర ఉగాది వేళ, ఈదరవారిపల్లె ఆకాశంలో ఒక వింతైన శూన్యం ఆవరించింది. అభివృద్ధి అనే రక్కసి నోరు తెరిచి, కనిగిరి కొండల అంచున ఉన్న పచ్చదనాన్ని మింగేయడానికి సిద్ధమైంది. నేషనల్ హైవే వెడల్పు పనుల కోసం మున్సిపాలిటీ వాళ్లు గీసిన ఆ ఎర్రటి గీత, వెంకయ్య ఇంటి గుమ్మం దాటి ఆ వేపచెట్టు రొమ్మును చీల్చుకుంటూ వెళ్ళింది. అది కేవలం ఒక గీత కాదు, ప్రకృతి పైన మనిషి వేసిన మరణశాసనం. "రోడ్డు వెడల్పు కావాలి, వాహనాలు వేగంగా వెళ్ళాలి, మనుషులు సమయాన్ని ఆదా చేసుకోవాలి. ఈ క్రమంలో ఒక ప్రాణం పోతే తప్పేముంది?" అనే ఆధునిక మేధావుల తర్కం ముందు వెంకయ్య నిస్సహాయుడై నిలబడ్డాడు. ఉదయాన్నే నాగలక్ష్మి పండగ పచ్చడి కోసం వేపపువ్వును ఏరుకోవడానికి చెట్టు దగ్గరకు వెళ్ళింది. కానీ అక్కడ పువ్వుల కంటే ఎక్కువగా జెసిబి యంత్రాల గర్జనలు వినిపిస్తున్నాయి. అవి యంత్రాలు కావు, ఆధునిక నాగరికత అనే అజగర సర్పం తన విషపు కోరలతో పచ్చని ప్రకృతమ్మను పరాభవిస్తున్న దృశ్యం.


అభివృద్ధి అనే మాయాజూదంలో భూదేవి ద్రౌపదిలా నిలబడి ఉంటే, స్వార్థపరులైన మనుషులు వ్యవస్థ సాక్షిగా ఆమె పచ్చని వస్త్రాన్ని ఒలుస్తున్నారు. "వెంకయ్యా.....ఈ చెట్టు పోతే మన ఇంటికి నీడ ఎక్కడిది? మన పిల్లలకి ప్రాణవాయువు ఎక్కడిది?" అని నాగలక్ష్మి వేసిన ప్రశ్న వ్యవస్థ చెవికి వినపడని ఒక ఆవేదన. గొడ్డలికి, కొమ్మకు మధ్య జరుగుతున్న ఈ అసమాన యుద్ధంలో తెగిపడుతున్న ప్రతి కొమ్మ, యుద్ధభూమిలో తెగిపడ్డ యోధుడి బాహువులా నేలపాలవుతోంది. ఆ వేపపువ్వుల సుగంధం, మరణశయ్యపై ఉన్న త్యాగమూర్తి కడసారి నిట్టూర్పులా గాలిలో విలీనమవుతోంది. అద్దాల మేడలు కట్టుకోవడానికి అడవులను దిగంబరం చేస్తున్న ఈ తరం, ఏసీ గదుల్లో కూర్చుని గ్లోబల్ వార్మింగ్ గురించి ఉపన్యాసాలు ఇస్తోంది. మనం రేపటి తరానికి ఏమి ఇస్తున్నాం? సిమెంట్ అడవులనా? లేక ప్లాస్టిక్ కవర్లలో దొరికే కృత్రిమ పండగల్నా? ఒకప్పుడు వేప పుల్లతో పళ్ళు తోముకున్న పవిత్రమైన నోళ్లు, ఈనాడు విషపూరితమైన రసాయనాలతో శుభ్రం చేసుకుంటూ అదే గొప్ప అనుకుంటున్నాయి. బుద్ధి పెరిగింది కానీ, స్పందన చచ్చిపోయింది.


చెట్టు కూలినప్పుడు వినిపించిన ఆ భయంకరమైన శబ్దం ఈదరవారిపల్లె పొలిమేరల దాకా ప్రతిధ్వనించింది. నాగలక్ష్మి సిద్ధం చేసిన ఉగాది పచ్చడి గిన్నెలో ఇప్పుడు నిజాయితీ అనే చేదు లేదు. మార్కెట్లో కొన్న రంగుల బెల్లం తీపి, కృత్రిమమైన రంగులు మాత్రమే ఉన్నాయి. ఉగాది పచ్చడిలో చేదు జ్ఞానానికి, కష్టానికి ప్రతీక. కానీ ఈనాడు మనకు జ్ఞానం వద్దని, కేవలం భ్రమలనే తీపి కావాలని కోరుకుంటున్నాం. నిజం చెప్పే గొంతుకను నొక్కేయడం ఎంత సహజమైపోయిందో, శ్వాసనిచ్చే చెట్టును నరికేయడం కూడా అంతే సులభమైపోయింది. పరాభవ నామ సంవత్సరం అంటే ప్రకృతి ఓడిపోయిన ఏడాది కాదు, మనిషి తన వివేకాన్ని తానే పరాభవిస్తున్న వినాశకాలం.


యంత్రాలు పని ముగించుకుని వెళ్ళిపోయాయి. రోడ్డు మీద నల్లని తారు రక్తంలా పారింది. ఆ కాంక్రీటు శిథిలాల మధ్య వెంకయ్య వంగి, మట్టిలో కలిసిపోయిన ఒక ముదురు వేప విత్తనాన్ని తీశాడు. అది కేవలం విత్తనం కాదు, లోపల వెయ్యి అడవుల ప్రాణాన్ని దాచుకున్న ఒక విస్ఫోటనం. నాగలక్ష్మి కన్నీళ్లు ఆ విత్తనం మీద పడగా, వెంకయ్య దాన్ని తన కళ్లకు అద్దుకున్నాడు. "చూడు నాగలక్ష్మీ, వాళ్ళు కొమ్మల్ని నరకగలరు కానీ మట్టిలో ఉన్న ప్రాణాన్ని చంపలేరు. ఈ పరాభవం మనకు ఒక హెచ్చరిక. ప్రకృతిని మనం అవమానిస్తే, ఆ అవమానం తిరిగి మన శ్వాసనే ఆపేస్తుంది" అని గొంతులో వణుకుతో అన్నాడు.


వెంకయ్య ఆ విత్తనాన్ని తన అరచేతిలో బిగించి పట్టుకున్నాడు. చుట్టూ చూస్తే ముక్కలై పడి ఉన్న ఆ మహా వృక్షం దేహం. శవాల కుప్పలా కనిపిస్తోంది. గూడు చెదిరిన పిట్టలు ఆకాశంలో తిరుగుతూ వేస్తున్న కేకలు వెంకయ్య చెవుల్లో మారుమోగుతున్నాయి. "రేపు మన పిల్లలు ఈ రోడ్డు మీద కారుల్లో వేగంగా వెళ్లొచ్చు నాగలక్ష్మీ. కానీ ఆ కారు ఏసీ గదిలో వాళ్లకు ఈ వేపచెట్టు ఇచ్చే చల్లని గాలి దొరకదు. వాళ్లు సంపదను కొనుక్కోగలరు కానీ శ్వాసను కొనుక్కోలేరు. మనం నేలని కాంక్రీటుతో కప్పేస్తున్నాం, కానీ ఆ కాంక్రీటు పొరల కింద మన తరాల భవిష్యత్తు ఊపిరాడక చచ్చిపోతోంది" అంటూ కుప్పకూలిపోయాడు. నాగలక్ష్మి ఆయన భుజంపై చేయి వేసింది. ఇద్దరి కళ్లలో నుంచి జాలువారిన కన్నీళ్లు ఆ ఎండిన మట్టిని తడిపాయి. ఆ తడి, ఓడిపోయిన మనిషి ఆవేదన కాదు... అది భూదేవికి ఇస్తున్న ఒక వాగ్దానం.


వెంకయ్య లేచి నిలబడ్డాడు. తన ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ జాగాలో, ఎండ తగలకుండా ఉన్న ఒక చోట మట్టిని తవ్వి ఆ విత్తనాన్ని నాటాడు. "ఈ ఏడు పచ్చడిలో చేదు లేకపోయినా పర్వాలేదు నాగలక్ష్మీ. కానీ మన పిల్లలు చేతికి ఈ గింజను మొక్కగా చేసి ఇద్దాం. పిల్లలు పెరిగి పెద్దయ్యాక, 'మా నాన్న నాకు కాంక్రీటు గోడలు ఇవ్వలేదు, ఒక ప్రాణాన్ని ఇచ్చాడు' అని చెప్పుకోవాలి. ఆ రోజే ఈ 'పరాభవం' ఒక విజయంగా మారుతుంది" అని గంభీరంగా అన్నాడు.


ఆ చల్లని సాయంత్రం వేళ, కూలిన వేపచెట్టు నీడ లేకపోయినా, వెంకయ్య గుండెల్లో ఒక కొత్త అడవి మొలకెత్తుతున్నంత ధైర్యం కనిపించింది. ఆ విత్తనం మట్టిలోకి వెళ్లడం లేదు, రేపటి తరం శ్వాస కోసం ఒక విప్లవమై మొలకెత్తడానికి సిద్ధమవుతున్న అక్షరాయుధం. మనిషి మేల్కోవాల్సింది పండుగ రోజు కాదు, ప్రకృతి పరాభవం పాలవుతున్న ప్రతి క్షణం. ఎందుకంటే, ప్రకృతి లేని మనిషి అభివృద్ధి. చితిపై అలంకరించిన పూలదండ లాంటిది మాత్రమే.


ఇట్లు

మీ మను రామ్.


**************


డాక్టర్ రాంప్రసాద్ ఇరువూరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

నేను డాక్టర్ రాంప్రసాద్ ఇరువూరి.

ప్రజాసేవను జీవన విధిగా మోసుకుంటూ,

పదాలను నిశ్శబ్ద సహచరుల్లా వెంట పెట్టుకునే కవిని.

రోజువారీ పనిలో మనుషుల కథలనూ,

వారి కళ్లలో దాచిన చిన్న చిన్న భావలనూ చూశాక

అవి రాత్రివేళ నా కలంలోకి పదాల్లా చేరి

కవితగా మారుతాయి.

సేవ నాకు నేర్పింది వినడాన్ని,

కవిత్వం నాకు నేర్పింది అర్థం చేసుకోవడాన్ని.

అదే రెండు వెలుగుల మధ్య

నడుస్తున్న నా ప్రయాణమే,

నా పదాల అసలు మూలం.


…ఇదే నా చిరు పరిచయం.

#పచ్చనిమరణశాసనం, #Teluguenvironmentalstory

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page