అమ్మ సంకల్పం
Telugu emotional story, mother daughter story Telugu, amily emotional story, inspirational Telugu story, parenting awareness Telugu, psychological awareness story Telugu

Amma Samkalpam - Telugu Family Story | Malla Karunya Kumar
అమ్మ సంకల్పం - తెలుగు కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In manatelugukathalu.com On 24/05/2026
"వాసోవగల్ సింకోప్."
డాక్టర్ నుండి ఈ మాట వినగానే, కంగారుపడుతూ, 'ఏం అర్థం కావడం లేదు? ఇప్పుడు ఏం చేయాలి? ఈ జబ్బు పేరు వింటేనే గుండెల్లో దడగా ఉంది! ఇప్పటికే ఆయన అందరి మీద అరుస్తూ ఉన్నారు. పాపకి ఇటువంటి అనారోగ్యం అని తెలిస్తే, నా పరిస్థితి, పాప పరిస్థితి ఏమిటి?' ఎడతెగని ఆలోచనలు గౌరిని నిలువునా దహించి వేస్తున్నాయి.
"హల్లో మేడం!" డాక్టర్ గట్టిగా పిలవడంతో, ఒక్కసారిగా ఆలోచనల నుండి బయటకు వస్తూ, "డాక్టర్! పాప పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకీ ఆ జబ్బేమిటి?" గౌరీ స్వరం లో భయం.
గౌరి పరిస్థితి అర్థం చేసుకున్నాడు డాక్టర్. "కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం. వాసోవగల్ సింకొప్ అంటే ఎక్కువగా ఒత్తిడికి లోనైతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ మూర్ఛ కూడా రావడానికి కారణం అదే. పాపలో తెలియని భయం కారణంగా ఇలా జరుగుతుంది.
మీరు ఆమెపై ఏ విషయంలోనైనా ఒత్తిడి తీసుకువస్తున్నారా? ఆమెతో దురుసుగా ప్రవర్తిస్తున్నారా? ఇవి కూడా కారణాలు కావచ్చు. ఇక మీదట ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇలా పునరావృతమైతే చాలా కష్టం." పక్కనే ఉన్న పెన్ను తీసుకొని ఎదురుగా ఉన్న ప్రిస్క్రిప్షన్ హెడ్‌పై మెడిసిన్స్ రాసి ఆమెకు ఇచ్చాడు.
'ఎలా చెప్పను? ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిన తండ్రి తన పాలిట చండశాసనుడిలా తయారయ్యాడు అని, ప్రతిక్షణం పాపను, నన్ను సూటిపోటి మాటలతో హింసిస్తున్నాడు అని?' అని తనలో అనుకుంటూ, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అందుకుంటూ, "డాక్టర్! అమ్మాయి ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఏం చేయాలి?" అడిగింది గౌరి.
"ఏ విషయంలో కూడా ఒత్తిడి తీసుకురాకండి. ఆమెలో భయాన్ని పోగొడితే మొత్తం సర్దుకుంటుంది. తల్లిగా మీరు ఆమెపై కాస్త శ్రద్ధ చూపించాలి." చెప్పాడు డాక్టర్.
నమస్కారం చేస్తూ అక్కడ నుండి బయటకు వెళ్లింది. ఇంటికి చేరుకునేసరికి సోఫాలో కూర్చొని ఉన్నాడు మహేష్.
గౌరిని, కూతురు మానసను చూసి, "ఇప్పుడే స్కూల్ నుండి వస్తున్నాను. ఇలా జరిగింది అని ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు. అలాగే దీని చదువు గురించి కూడా చెప్పారు. పూర్తిగా డల్ స్టూడెంట్ అంట! దానికి తోడు ఈ జబ్బు ఒకటి.
మిగతా యాక్టివిటీస్‌లో కూడా ఏమాత్రం చురుకుగా ఉండదంట. చదువు శూన్యం, ఆరోగ్య స్థితి శూన్యం. పైగా ఈ జబ్బు! ఆడపిల్ల అంటే మైనస్, అందులో ఇవన్నీ మళ్ళీ మైనస్! అంతా నా తలరాత, నిన్ను కట్టుకున్నాను చూడు అందుకే ఈ కర్మ." అసహనంగా గౌరి వైపు చూస్తూ తిట్టిపోశాడు.
ఎప్పుడూ భర్త ఎన్ని మాటలన్నా విని ఓర్చుకొని వెళ్లిపోయేది గౌరి. కానీ ఈసారి భర్త మాటలు తనలో ఉన్న కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేశాయి.
"పాపకు ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. మీ చాదస్తం, అదుపు లేని మాటలు వలనే బంగారం లాంటి పిల్లలకు ఇలాంటి అనారోగ్యం చేసింది. ఏనాడైనా కూతుర్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడిన పుణ్యానికి పోయారా? పుట్టినప్పటి నుండి పాపను, నన్ను మాటలతో వేధిస్తూ ఉన్నారు కదా.
నన్ను చేసుకున్నాక మీకు ఈ కర్మ వచ్చింది అని అంటున్నారు కదా? నన్ను మీరు ఏమైనా వట్టి పుణ్యానికి చేసుకున్నారా? మా నాన్న ఎక్కువ మొత్తంలో కట్నం మీకు సమర్పించారు కదా! ఇంతవరకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండను. పాపను తీసుకొని మా పుట్టింటికి వెళ్తాను." అని గట్టిగా చెప్పి మానసను తీసుకొని బయలుదేరింది గౌరి.
భార్యను ఆపకుండా, 'వెళ్ళు, ఎన్ని రోజులు అక్కడ ఉంటావో నేను చూస్తాను కదా!' అని తనలో అనుకుంటూ సోఫాలో కూర్చొని బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉన్నాడు.
మరుసటి రోజుకు తన పుట్టింటికి చేరుకుంది. తనకు, పాపకు జరిగిన అన్యాయం గురించి తల్లిదండ్రులతో చెప్పి వాపోయింది. తల్లిదండ్రులు కూడా గౌరి ఆలోచనను సమర్థించారు. బాగా ఆలోచించి తన భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తన కూతురిలో ఉన్న భయాన్ని పోగొట్టాలని అనుకుంది.
కూతుర్ని దగ్గరకు తీసుకొని మంచి విషయాలు చెబుతూ, ఆమె భయానికి గల కారణాలు తెలుసుకుంది. వైకల్యాన్ని జయించిన వారి పుస్తకాలు ఇచ్చి, వారి చరిత్ర నుండి ప్రేరణ పొందేలా చేసింది.
"చూడు తల్లి, మీ నాన్న నీ పట్ల, నా పట్ల చాలా చిన్నచూపుతో ఉన్నారు. నిన్ను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదు. నువ్వేంటో నిరూపించుకోవాలి. నీ పట్ల హేళనగా మాట్లాడిన వాళ్లకు నువ్వు నీ సమస్యను జయించి నువ్వేంటో చూపించాలి. నీ విజయంతో నీ జీవితం, నా జీవితం ముడిపడి ఉంది." అని ప్రతినిత్యం కూతురిని ప్రేరేపిస్తూ, కూతురిలో భయాన్ని పూర్తిగా తొలగించింది.
గౌరి మహేష్ దగ్గర నుండి తన పుట్టింటికి వచ్చి మూడు నెలలు గడిచిపోయాయి. భార్య తోడుగా లేకపోవడంతో, ఉప్పు-కారం సమపాళ్లలో లేని తిండి తిని నాలుక కాస్త పిడచకట్టుకుపోయింది. పైగా ఇంటి పనులు మొత్తం మీదపడడంతో భార్య విలువ తెలిసొచ్చింది.
పని మీద బయటకు వెళ్తున్న మహేష్‌కు, వీధి చివరన ఉన్న భూపతి కలిసి, "మహేష్! ఈరోజు స్కూల్‌కు వెళ్లాను. రేపు ఏదో పాటల పోటీ ఉందంట! మా అమ్మాయి కూడా పాల్గొంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, మీ పాప మానస కూడా పాల్గొనబోతోంది!
రిహార్సల్స్ జరుగుతున్నాయని కాసేపు నిలబడి చూశాను. ఆశ్చర్యం కలిగింది. మీ అమ్మాయి అద్భుతంగా పాడుతుంది మహేష్. ఆమెకు బహుమతి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు!" అని చెప్పి వెళ్లిపోయాడు భూపతి.
భూపతి ఆ మాట చెప్పినప్పటి నుండి మహేష్ మనసులో ఏదో తెలియని ఆరాటం. రేపు ఎలాగైనా వెళ్లి ఆ పాటల పోటీ సంగతి ఏమిటో చూడాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లాడు. భూపతి చెప్పినట్టుగానే మానస పోటీలో పాల్గొంది. తన ఊహల్ని చెదరగొడుతూ మొదటి బహుమతి అందుకుంది.
మహేష్‌లో ఏదో తెలియని ఆత్మన్యూనత భావన. మానస ఆనందంతో వెళ్లి తల్లిని కౌగిలించుకోవడం తన కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు మహేష్. తాను చేయలేనిది ఒక తల్లిగా గౌరి చేసి చూపించింది. కూతురు ప్రేమను పొందలేకపోయాననే బాధ మెల్లమెల్లగా మహేష్‌లో మొదలవుతూ ఉంది. వేగంగా కూతురు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.













Comments