top of page

మరపురాని బంధం

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #మరపురానిబంధం, #MarapuraniBandham, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు


Marapurani Bandham - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 05/05/2025

మరపురాని బంధం - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


"ఇంకా ఎంతమందిని రా ఇలా మాయమాటలు చెప్పి మోసం చేస్తారు?.. " అని తనలో అనుకుంటూ వుంది మేఘన, ఎదురుగా ఒకబ్బాయి ఒకమ్మాయిని కౌగలించు కోవడం చూసి.. 


"ఇంత సమయం అయినా ఇతను ఇంకా రాడేంటి?.. " అని  విసుక్కుంటూ తన చేతి వాచ్ చూస్తూ అనుకుంటుంది.. 


ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడం తో లిఫ్ట్ చేస్తూ.. 

"మీకోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ వున్నాను.. ఇంకా ఎంత సమయం వెయిట్ చెయ్యాలి?.. " అని కాస్త కోపం తో కూడిన స్వరంతో అంది.. 


"వచ్చేసాను.. మిమ్మల్ని చూసాను కూడా.. మీ ఎదురుగానే వున్నాను.. " అని అతను చెప్పడం తో.. 

"ఎదురుగా వున్నారా!.. "అని పరికించి.. చూసి.. 

"అంటే ఒక అమ్మాయితో వున్నది. మీరేనా?.. అయితే మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదు.. " అని ఫోన్ పెట్టేసింది.. 


"ఇందాకే చూసాను కదా.. ఆమెతో ఎంత చనువుగా వున్నాడో. మళ్ళీ నాతో మాట్లాడటం ఎందుకు.. ఛా.. " అని అనుకుంటూ.. 


"ఒకడికి పెళ్లికి ముందే రొమాన్స్ కావాలి.. ఒకడికి మా నాన్న కంపెనీ లో సీఈఓ పదవి కావాలి.. 

ఎవడేవడో వస్తాడు.. ఎన్నో అడ్డమైన కోరికలు కోరుతారు. ఎంత నేను అలుసు అయితే మాత్రం, మరి అంత చులకన.. మళ్ళీ ఏదైనా అంటే ఎన్ని మాటలు అంటారో.. వామ్మో.. అందుకే చెప్పాను నాన్నకి నాకు ఈ బాగోతం వద్దు అని, అందరూ అలాంటి వారే కాని వింటెగా.. ఛా. అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళబోయింది. మళ్ళీ ఒక్కక్షణం ఆగి చూసింది.. 


"ఇతను.. !.. ఆ రోజు!.. అతనే, ఇతను కదా!.. "అని ఆశ్చర్యంతో ఆలోచనలో పడిపోయింది.. 


"హాయ్ మేఘన గారు.. "అన్న మాటతో, ఆశ్చర్యంతో అతని వైపు చూస్తూ వుంది.. 


"మీరు!.. మీరు!.. "అని ఆమె అంటూ వుండగా.. 


"హాయ్, ఐ యామ్ ఆకాశ్.. " అని తనని తాను పరిచయం చేసుకున్నాడు.. 


ఒక్కసారిగా ఆమెకు ఏదో జరిగింది.. తల పట్టేసినట్టుగా అయ్యింది.. కళ్లు తిరుగు తున్నట్టు అయ్యింది. ఒక్కసారిగా కింద పడిపోయింది.. 

***

"మీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను సర్.. మీ అమ్మాయి పట్ల జాగ్రత్త వహించండి అని. ఆమెకు మళ్ళీ ఆ సంఘటన ఒక్కసారిగా గుర్తుకు రావడం తో ఆమె తట్టుకోలేక ఇలా పడిపోతుంది. ఇప్పటికైనా జాగ్రత్త వహించండి.. " అని డాక్టర్ సూర్యం తో అంది.. 


"క్షమించండి, డాక్టర్.. ఈ సారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను.. " అని అన్నాడు సూర్యం.. 


"ఒకే సర్, మీరు కొంత సమయం ఆగి ఆమెను చూడటానికి వెళ్ళండి.. " అని చెప్పి అక్కడ నుండి కదిలింది డాక్టర్.. 


********


"నువ్వంటే నాకు ప్రాణం మేఘ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అందుకే ఈ విధంగా నిన్ను తీసుకు వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. "అని అన్నాడు ప్రకాశ్.. 


"నువ్వంటే ఇష్టం కనుకనే, నీ మీద నమ్మకం తో నీతో వచ్చాను.. నన్ను ఎంతగానో ప్రేమించే మా నాన్నకు కూడా ఈ విషయం చెప్పలేదు. అతను ఎంత బాధపడుతుంటారో.. " అని బాధతో అంది.. 


"అయ్యో. ఏంటి అలా బాధపడుతున్నావు. నువ్వు బాధపడటం ఏమిటి.. " అని ఆమెను దగ్గరకి తీసుకున్నాడు.. 


ఇంతలో ఫోన్ మ్రోగడం తో, ఒక్క నిముషం అంటూ బయటకు వెళ్ళాడు!.. 

అప్పుడే బయట వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. 

చల్ల గాలి వీచడం తో బయటకు వెళ్ళడానికి సిద్దం అయ్యింది.. 

చూసే సరికి అంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. 


చూస్తుంటే పెద్ద వర్షం పడేలా వుంది.. 

ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడు.. అని చుట్టూ చూస్తూ వుంది.. 

కొంత దూరం లో ప్రకాష్ వుండడం గమనించింది.. వర్షం పడేలా వుంది లోపలికి రా ప్రకాష్ అని పిలవాలి అని అనుకుంది.. కాని అతను ఇంకో ఇద్దరితో మాట్లాడుతున్నాడు. చూస్తుంటే వాళ్ళు అనుమానంగా వున్నారు.. 


వాళ్ళతో మాట్లాడుతున్న ప్రకాష్ ముఖంలో ఏదో కంగారు గమనించింది.. 

తనలో అనుమానం రెట్టింపు అయ్యింది.. 


ఏంటి అసలు, ఇంత సమయం వాళ్ళతో మాట్లాడటం.. 

ఏంటో కనుక్కోవాలి అని మెల్లగా మెట్లు దిగుతూ వాళ్లదగ్గరికి సమీపించింది.. 


"ఇప్పుడే ఆమెను మాకు అప్పజెప్పాలి.. లేదంటే ఆమెను బలవంతంగా లాక్కొని పోవాల్సి వస్తుంది.. " అని వాళ్ళు అంటున్నారు.. 


మేఘా ఈ మాట విని కంగారు పడింది.. గుండె చేత పట్టుకొని ఇంకా వాళ్ల సంభాషణ వింటూ వుంది.. 


"లేదు.. ఎంతో కష్టపడి ఆమె వెంట పడి ఇక్కడ వరకు తీసుకు వచ్చాను.. అంత అందాన్ని అనుభవించకుండా ఎలా వదిలేస్తాను.. మీరు రేపు రండి.. " అని వాళ్ళమీద గట్టిగా అరిచాడు.. 


"అదంతా మాకు తెలవదు.. నేను నీకు ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చాము.. ఆమెను మాకు అప్పగించు.. " అని వాళ్ళు అంటున్నారు.. 


నిజం తెలుసుకున్న మేఘ గుండె ఆగినంత పని అయ్యింది.. నీచుడా తల్లితండ్రులను కాదని నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నాకు బాగా బుద్ది చెప్పావు.. అని అనుకుంటూ అక్కడ నుండి పరుగు తీసింది.. 


అప్పటి వరకు వాదులాడు కుంటున్న ప్రకాష్ ఒక్కసారిగా మేఘా పారిపోవడం చూసాడు.. 


‘పారిపోతుంది పట్టుకొండి రా’ అని ఆమె వెంట పడ్డాడు.. 


ధూళితో నిండిన సుడి గాలులు ఎగసి పడుతున్నాయి.. 


ఒక్కసారిగా మెరుపు మెరిసింది. పెద్దగా శబ్దం చేస్తూ ఎక్కడో పిడుగు పడింది.. కర్ణ  భేరులు బద్దలయ్యే శబ్దం.. భయంతో ఒక్కసారిగా చెవులు మూసుకుంది మేఘ. ఎటుపోవాలో తెలియడం లేదు.. ఐనా పరుగు తీస్తుంది. వెంట కామ మృగాలు వెంబడిస్తున్నాయి.. 

ఇక తాను ఆయాసం తో పరుగు తీయలేక పోయింది.. 


దేవుడా.. అని గట్టిగా అరిచింది.. 

ఏదో శబ్దం వినిపించడం తో ముందుకు చూసింది.. 


కుయి.. కుయు.. అని లైట్ వెలుగుతూ, రిటర్న్ శబ్దం చేస్తూ వెనక్కి వస్తోంది ఒక కారు.. 

మెల్లగా ఆ కారు వైపు పరుగు తీసింది!.. 


ఒక్కసారిగా ఆ కారు ఈమె దగ్గర ఆగింది.. డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి రండి అని పిలిచాడు ఒక వ్యక్తి.. క్షణం ఆలోచించ కుండా కారు ఎక్కింది మేఘ.. 


కారు కదిలింది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుతూ కార్ సీట్ పై వెనుకగా తల వాల్చింది.. ఏదో వాసన రావడం తో పక్కకు చూసింది.. అప్పటికి సిగరెట్ తాగుతూ వున్నాడు ఆ వ్యక్తి.. 

"ఏంటి, పాము నుండి తప్పించుకో బోయి పులికి చిక్కానా.. " అని కంగారు పడుతూ వుంది.. 


ఆమె కంగారుని గమనించిన అతను "భయపడకండి.. "అని అంటూ ఆ సిగరెట్ విసిరేశాడు.. 

నీళ్ళు బాటిల్ అందిస్తూ.. "మీరు ఎవరు, ఏమిటి అని నేను అడగను. నాకు తెలుసు మీరు ఏదో ప్రమాదం లో చిక్కుకున్నారు అని. అయితే మిమ్మల్ని ఇక్కడకు దగ్గరగా వున్న బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తాను. మీరు మీ ఇంటికి వెళ్ళండి.. " అని కొంత డబ్బు తీసి ఇచ్చాడు.. 


ఆమె చూస్తూ వుంది.. "మీకు ఈ డబ్బు తీసుకోవడం ఇష్టం లేక పోతే.. అప్పు అనుకోండి, తర్వాత ఇవ్వవచ్చు. మీరు సురక్షితంగా ఇంటికి చేరితే అదే చాలు.. " అని చెప్పి ఇచ్చాడు.. 


ఆమెను బస్టాండ్ దగ్గర దింపి తాను వెళ్ళిపోయాడు.. 

ఇదంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది మేఘకు.. 

అంటే అప్పుడు నన్ను కాపాడిన అతను, నన్ను చూడటానికి వచ్చిన అతను ఒక్కరేనా అని ఆలోచిస్తుంది.. ఇంతలో సూర్యం ఆమె దగ్గరకు చేరాడు.. 


"ఏంటమ్మా నీకు చాలా సార్లు చెప్పాను కదా, ఆ పీడ కలను మరచిపొమ్మని.. మళ్ళీ ఎందుకు పదే, పదే అది గుర్తు చేసుకుంటూ కంగారు పడుతుంటావు?. చూడు ఇప్పుడు ఏమి జరిగిందో?.. " అని సూర్యం అన్నాడు.. 


"నాన్న.. అది.. "


"నువ్వేం మాట్లాడకు, తర్వాత నువ్వు వెళ్లి ఆ అబ్బాయిని కలువు, మళ్ళీ ఆ గతాన్ని తలుచుకొని ఈ విధంగా అవ్వకు.. " అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.. 


***********


రెండు రోజులు తర్వాత ఆకాశ్ ని కలిసింది మేఘన.. 

"మొన్న మీకు అలా అవ్వడం తో కంగారు పడ్డాను. ఇప్పుడు మీకు ఎలా వుంది? పైగా మీరు నన్ను ఆ అమ్మాయితో చూసి వేరేలా అనుకొని వుంటారు, ఆమె నా స్నేహితురాలు.. ” అని అన్నాడు. 


"ఏంటి ఇతను నన్ను ఎప్పుడూ చూడనట్టు మాట్లాడు తున్నాడు?. ఆ రోజు నన్ను కాపాడిన సంగతి మరిచిపోయారా?.. లేక కావాలనే ఇలా చేస్తున్నాడా. " 


ఆలోచిస్తూ.. "హా.. ఇప్పుడు బాగుంది.. ఆ రోజు కోపంతో అలా అనేశాను. " అని సమాధానం ఇచ్చింది. 

ఇంతలో ఒక పిల్లాడు అతని దగ్గరకు వచ్చాడు.. వచ్చిన పిల్లాడిని ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నాడు ఆకాష్.. 


"ఎవరీ బాబు?.. "అని అడిగింది మేఘ.. 


"ఈ విషయమే మీకు చెప్దామని అనుకున్నాను.. ఈ బాబు నా అన్న కొడుకు.. మా అన్నయ్య, వదిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ బాబు బాగోగులు నేను చూసుకోవాలి అనుకుంటున్నాను.. "అని అతని చెప్పాడు. 


అతను చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది మేఘ.. 

ఏమి జవాబు ఇవ్వాలో అర్దం కావడం లేదు తనకి.. 


ఇంతలో ఆకాశ్ తన మొబైల్ తీసి అందులో వున్న తన అన్న ఫోటోని మేఘకు చూపించాడు. ఇతనే నా అన్న అని చెప్పాడు ఆకాశ్. 


ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది మేఘ.. 

"ఇతను.. ఇతను?.. " అని కంగారుగా అంటుంది.. 


"అవును చూడటానికి మేము ఇద్దరం ఒక్కలా వుంటాము!. మేము ఇద్దరం ట్విన్స్" అని ఆకాశ్ అన్నాడు. 


ఆకాశ్ చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది మేఘన.. 

"అంటే ఆ రోజు నన్ను కాపాడిన వ్యక్తి మరణించారా?.. " అని లోపల బాధపడింది.. 

"మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.. " అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. 


ఇంటికి చేరుకున్న మేఘన ను చూసిన సూర్యం ఆమెతో మాట్లాడాలి అని అన్నాడు.. 

"మేఘన, నాకు తెలుసు నువ్వు ఎందుకు అతనికి ఏ సమాధానం చెప్పకుండా వచ్చేసావో.. 

అతను తన అన్న కొడుకుని పెంచుకుంటాను అన్నాడు అని నీకు ఆ విషయం నచ్చలేదు అని నాకు అర్థం అయ్యింది.. "అని సూర్యం అన్నాడు. 


"నాన్న. అది కాదు.. " అని మేఘన ఏదో చెప్పబోతుండగా.. 

"మేఘన నీకో నిజం చెప్పాలి.. ఈ నిజం విన్నాక నీకు ఉన్న అనుమానాలు అన్ని తొలగిపోతాయి.. " అని సూర్యం అన్నాడు. 


మేఘన ఆశ్చర్యంతో చూస్తూ వుంది.. 

"మేఘన, నేను నీకు కన్న తండ్రిని కాదు.. "


ఈ మాట విని నివ్వెర పోయింది మేఘన!.. 


"ఒకానొక రోజున మీ అమ్మగారితో నాకు పరిచయం ఏర్పడింది.. అప్పటికే నువ్వు ఆమెకు జన్మించి వున్నావు. మీ తండ్రి మోసం చేసి మీ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమె తో పరిచయం నా జీవితాన్నే మార్చేసింది. ఒకరి మీద ఒకరికి ఇష్టం కలగడం తో మేము ఒక్కటి అయ్యాము. నీకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాము. అయితే ఇప్పుడు  విషయం చెప్పక తప్పలేదు.. " అని సూర్యం అన్నాడు. 


సూర్యం చెప్పింది విని మేఘన కళ్ళలో నీరు తిరిగాయి.. 

నాన్న అంటూ గట్టిగా తండ్రిని హత్తుకుంది.. 

"అదంతా నాకు అనవసరం నాన్న. నాకు తండ్రివి నువ్వే.. " అని ఏడుస్తూ వుంది.. 


"మేఘన.. మనం స్వచ్ఛమైన ప్రేమను పంచగలిగితే మనకు ఆ ప్రేమ తిరిగి వస్తుంది. ప్రేమ పంచడానికి కన్న వాళ్ళే అవసరం లేదు.. " అని ప్రేమతో మేఘనతో అన్నాడు సూర్యం.. 


తండ్రితో నిజం చెప్పాలి అనుకున్నది. కానీ ఆ నిజం తనతోనే వుండిపోవాలి అనుకుంది.. తనని ఆ రోజు కాపాడిన అతనికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది అని. మీరు లేని లోటు మీ కొడుక్కి రానివ్వను అని తన కన్నీరు తుడుచుకుంటూ అనుకుంది.. 


వెంటనే తన ఫోన్ తీసి ఆకాశ్ కి ఫోన్ చేసింది.. 


 ******

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comentários


bottom of page