తేనె కత్తులు - పార్ట్ 1
- Sairam Allu
- 4 days ago
- 4 min read
#AlluSairam, #అల్లుసాయిరాం, #TheneKatthulu, #తేనెకత్తులు, #TeluguCrimeStory, #కొసమెరుపు

Thene Katthulu - Part 1/2 - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 04/05/2025
తేనె కత్తులు - పార్ట్ 1/2 - పెద్ద కథ ప్రారంభం
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఇంత చీకటి పడిపోయింది. రాత్రి ఏడున్నర అయిపోతుంది. అప్పుడనగా టౌనుకి వెళ్లారు. ఇంకా రాలేదు. వద్దు వద్దంటే సినిమాలు, సిత్రాలు అని వూపుకుంటూ వెళ్లారు! పెళ్లి దగ్గర పడుతుంటే, యి తిరగడాలు అవసరమా! మన కూతురు ఉందంటే మరీనూ, అసలు ఫోన్ ఎత్తదు. చెయ్యదు! వయసు పెరిగింది కానీ, యింటికి ఫోన్ చెయ్యడం పాడు లాంటివి అలవాట్లు లేవు!” అని నొడుముకుంటూ వీధిలోకి, యింట్లోకి కంగారుగా తిరుగుతుంది బంగారమ్మ.
కుర్చీలో కూర్చొని పెళ్లికి కావాల్సిన వస్తువులు లెక్కలేసుకుంటున్న మాణిక్యంతో “ఏమయ్యో! నేనింత కంగారుపడుతుంటే, నువ్వు ఏం పట్టించుకోవేమీ?” అని అడిగింది బంగారమ్మ.
మాణిక్యం కళ్లద్దాలు సరిచేసుకుంటూ “నేనూ కంగారు పడుతున్నానే. నీ కంగారు చూస్తుంటే మరింత కంగారు వస్తుంది. ఇప్పటికిప్పుడు వందసార్లు అటుయిటు తిరిగేశావు. తర్వాత నడుమునొప్పి, కాలు నొప్పులు అంటావు. అంత కంగారుపడేదానివి, మరెందుకు వాళ్ళిద్దరిని పంపించావు?” అని సూటిగా అడిగాడు.
బంగారమ్మ చిరాకుగా “నేనేప్పుడు పంపించాను. మీకూతురే పెళ్లి షాపింగులు, సినిమాలు అని అడిగింది. మా తమ్ముడు తిరుమల పెద్ద తింగరోడు. ముప్ఫైయేళ్లు దాటినా, వాడికంటే తొమ్మిదేళ్లు చిన్నదైన నాగమణి ఏం చెప్పినా, గంగిరెద్దులా తలవూపుతాడు.
మన అమ్మాయి చేసిన ఘనకార్యానికి, వాడు కాబట్టి, పెళ్ళికి ఒప్పుకున్నాడు. తీరా, పెళ్లికి ఒప్పుకున్న తర్వాత యిప్పుడు ఎక్కడికి పంపించమంటే, బాగుంటుందా, అందుకు సరే అన్నాను. కాకపోతే, ఆలస్యమవుతున్న కొద్దీ, మళ్లీ యింటి మీదకి ఏ ఉపద్రవం వచ్చిపడుతుందా అని భయంగా ఉంది.
మీరు ఆ కాగితాలు పక్కన పెట్టి, బైక్ మీద ఎదురుగా వెళ్ళొచ్చు కదా!” అని అంటే, మాణిక్యం విసుక్కుంటూ “అబ్బా! పట్టుకున్నావంటే జిడ్డులాగా మరి వదలవు! బైక్ తాళాలు తీసుకుని రా వెళ్లు!” అని చొక్కా వేసుకుంటున్నాడు. బంగారమ్మ బైక్ తాళాలు పట్టుకుని వచ్చింది.
మాణిక్యం బైక్ బయటికి తీసి, స్టార్ట్ చేసి రైజింగ్ యిస్తూ “నీ కంగారుతో నన్ను వెళ్లమంటున్నావు. కానీ, యి చీకటిలో బైక్ మీద వస్తున్న వాళ్ళని ఎలా పోల్చగలం! ఎదురుగా ఎంత దూరమని వెతుక్కుంటూ వెళ్లమంటావు. ఈలోపు వాళ్ళు యింటికి వచ్చేస్తారేమో!” అని అన్నాడు.
బంగారమ్మ “ఎలాగో బండి తీశారు కదా. ఎదురుగా వెళ్లొచ్చు కదా. వాళ్లు యింటికి వచ్చేస్తే, నేను మీకు ఫోన్ చెయ్యమని చెప్తానులే!” అని అంటే, “నువ్వు మాట వినవు!” అని నసుగుతూ బైక్ గేర్ మార్చి, నడపబోతుంటే మాణిక్యంకి ఫోన్ వచ్చింది. “వాళ్ళే చేస్తున్నారు!” అని జేబులో ఉన్న ఫోన్ తీసి చూస్తే “ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది! ఎవరో!” అని అంటూ ఫోన్ ఎత్తి “హలో!” అని అన్నాడు మాణిక్యం.
“మేం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. తిరుమల, నాగమణి మీకు తెలుసా?” అని గంభీరంగా అడిగారు.
మళ్లీ ఏమైందో అని టెన్షన్ తో బంగారమ్మ గుండెలో రాయి పడిపోయింది. మాణిక్యం కంగారుపడుతూ “ఏమైంది సారు! వాళ్ళిద్దరికీ?” అని అడిగాడు.
“బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మీరు హాస్పిటల్ కి వచ్చి, ఎస్సై గారితో మాట్లాడండి!” అని చెప్తే, యిద్దరికీ గుండె ఆగినంత పనయింది.
బంగారమ్మకి బిపి పెరిగిపోయి “ఓలమ్మో యాక్సిడెంటా! ఏమయ్యిందో అడుగయ్యా!” అని అడిగితే, “అదే చెప్పారు కదా. యాక్సిడెంట్ అయిందని!” అని మాణిక్యం బైక్ పుల్ రైజింగ్ యిస్తుంటే, “ఏమయ్యో! ఉండు. నేను వస్తాను!” అని బైక్ ఎక్కబోతుంటే, “ఇంటి తలుపులు కుడా వెయ్యవా? ఇలాగే వచ్చేస్తావా? గొప్ప బిపి మనిషివి దొరికావు!” అని కోపంగా అంటే, బంగారమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళి, తలుపులకి తాళాలు వేసేసి, గబగబా వచ్చి క్షణాల్లో బైక్ ఎక్కిపోయింది.
“నీ బిపితో ఎక్కడ పడిపోతావో అని నాకు బిపి వస్తుంది!” అని అంటూ గవర్నమెంట్ ఆసుపత్రికి వాయువేగంతో బైక్ పోనిచ్చాడు మాణిక్యం.
గబగబా ఆసుపత్రి విచారణ దగ్గరికి వెళ్లి, తిరుమల, నాగమణి యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారని చెప్పారు. ఎక్కడున్నారని అడిగితే, రిసెప్షన్ వారు ఐసియులో ఉన్నారని చెప్పారు. ఐసియు వెతుక్కుంటూ వెళ్తే, అక్కడ పోలీసులు ఉన్నారు. కంగారుగా పోలీసుల దగ్గరికి వెళ్లి “సార్! నాగమణి, తిరుమల గురించి ఫోన్ చేశారు!” అని అడిగారు.
కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి “ వాళ్ళు మీకు ఏమవుతారు?” అని అడిగాడు.
బంగారమ్మ కంగారుగా “నాగమణి మా కూతురు. తిరుమల నా తమ్ముడు. వాళ్లకి ఏమైంది సారు. చెప్పండి!” అని అడిగింది.
కానిస్టేబుల్ “బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయింది. తిరుమల హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకు వస్తుండగా చనిపోయాడు. నాగమణికి గాయాలు తగిలి, ప్రాణాలతో ఉంది!” అని చెప్పాడు.
“ఓరి దేవుడో! నా కొంప ముంచేశావురో!” అని తలబాదుకుంటూ ఏడుస్తుంది. మాణిక్యం భావోద్వేగంతో “అసలు ఏం జరిగింది సారు!” అని అడిగాడు.
“ఇప్పటికైతే యిదే తెలుసు. రిపోర్టులు వచ్చిన తర్వాత, పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎస్ఐగారు డాక్టరుగారితో మాట్లాడడానికి వెళ్లారు!” అని పూర్తిగా వివరాలు చెప్తే ఎక్కడ భయపడిపోతారేమోనని సగం దాస్తున్నట్టుగా చెప్పాడు కానిస్టేబుల్.
ఎస్సై, డాక్టరు యిద్దరూ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి “మావాళ్లిద్దరికి ఏమైంది సారు?” అని మాణిక్యం కంగారుగా, బంగారమ్మ ఏడుస్తూ అడిగారు. “అది యాక్సిడెంటులా లేదు. ఎవరో కావాలనే అబ్బాయిని కత్తులతో చంపారు. అమ్మాయిని అత్యాచారం చేశారు. ఆ అమ్మాయికి కూడా చాలా దెబ్బలు తగిలి, పరిస్థితి విషమంగానే ఉంది!” అని డాక్టరుగారు చెప్పేసరికి బంగారమ్మ స్పృహతప్పి పడిపోయింది.
వెంటనే పక్కనున్న నర్సు, బంగారమ్మ ముఖం మీద నీళ్లు చల్లి లేపి, కూర్చోబెట్టి తాగడానికి నీళ్లు యిచ్చింది.
ఎస్సైగారు మాణిక్యంతో మాట్లాడుతూ “వాళ్ళిద్దరూ మీకు ఏమవుతారు?” అని అడిగితే “మాఅమ్మాయి పేరు నాగమణి. తిరుమల మాఆవిడ వాళ్ళ తమ్ముడు. వాళ్ళిద్దరికీ వచ్చేనెల పదోతేదిన పెళ్లి ఉందండి. ఈరోజు షాపింగుకని టౌనుకి వచ్చారండి. వీళ్ళ గురించి యింటి దగ్గర ఎదురు చూస్తున్నాం!” అని ఏడుస్తూ చెప్పాడు మాణిక్యం.
“మీకు ఎవరి మీద అయినా అనుమానంగా ఉందా?” అని ఎస్సై అడిగితే, “ఇంతలా చేసేవాళ్ళంటే ఎవరూ లేరండి, ఆఁ ఒకడి మీద అనుమానం ఉందండి. ఆటో గోవిందా అని మా అమ్మాయికి ఏవో మాయమాటలు చెప్పి ప్రేమించాడండి. మేం పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి, యిలా చేసుంటాడు!” అని మాణిక్యం చెప్తుంటే, బంగారమ్మ కుర్చీలో నుంచి ఆవేశంగా లేచి “అవును సార్! ఆ వెధవే చేసుంటాడు. అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు!” అని అరుస్తూ చెప్పింది.
ఎస్ఐ కానిస్టేబులుతో “గోవిందా అంటే” అని అడిగితే “అదే సార్! ఆ ఆటో డ్రైవర్!” అని కానిస్టేబుల్ అన్నాడు.
ఎస్సై ఆలోచిస్తూ “గోవింద అంటే వాడేనా. వాడిని కూడా ఐసియూలోనే జాయిన్ చేశారు. అసలు బతికేలా లేడు కదయ్యా. వాడు చేసుంటాడు అంటావా!” అని చెప్పేసరికి మాణిక్యం, బంగారమ్మలకి బుర్ర తిరిగిపోయింది.
========================================================================
ఇంకా వుంది..
తేనె కత్తులు పార్ట్ 2 త్వరలో
========================================================================
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.
@giribeligari8377
•10 hours ago
Nice 👍 bro sai ram ❤❤❤