top of page

తేనె కత్తులు - పార్ట్ 2

#AlluSairam, #అల్లుసాయిరాం, #TheneKatthulu, #తేనెకత్తులు, #TeluguCrimeStory, #కొసమెరుపు

ree

Thene Katthulu - Part 2/2 - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 09/05/2025

తేనె కత్తులు - పార్ట్ 2/2 - పెద్ద కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

గుర్తు తెలియని వ్యక్తులు నాగమణి అనే యువతిపై అత్యాచారం చేసి, ఆమెకు కాబోయే భర్త తిరుమలను హత్య చేస్తారు. గతంలో నాగమణిని ప్రేమించిన ఆటో డ్రైవర్ గోవిందు పైన కూడా హత్యాప్రయత్నం జరుగుతుంది.



ఇక తేనే కత్తులు పెద్ద కథ చివరి భాగం చదవండి. 


ఎస్సై, మాణిక్యంతో “మీరు యిప్పుడు వచ్చేటప్పుడు, దారిలో స్పాట్ దగ్గర బైక్ పడిపోయింటుంది. ఆటో పక్కన ఉంటుంది. చూడలేదా మీరు?” అని అడిగాడు. 


మాణిక్యం ఏడుపు ఆపుకుంటూ “వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి, హాస్పిటల్లో ఉన్నారు అని మీ దగ్గర ఫోన్ వచ్చినప్పటి నుంచి మా బుర్ర పని చెయ్యట్లేదు సార్. కంగారుగా వచ్చేశాం. అసలే చీకటి కదా సార్! ఇంకేం చూస్తాం!” అని అన్నాడు. 


“ఆ ఆటో కూడా అక్కడే ఉందంటే, వీళ్ళిద్దరూ టౌన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ గోవిందకి కనిపించడమో, లేక ముందు నుంచి పక్కగా ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యి చేసుండాలి. మొత్తానికైతే ఏదో జరిగింది. 


తిరుమలను కత్తులతో పొడవడం వల్ల ఆసుపత్రికి తీసుకువస్తున్న దారిలో చనిపోయాడు. ఈ గోవింద ఒంటిమీద కత్తులతో దెబ్బలున్నాయి. ఆ అమ్మాయికి కత్తులతో దెబ్బలున్నాయి. ముగ్గురికి దెబ్బలు తగిలి చావుబతుకుల్లో ఉంటే, ఎవరు పొడిచినట్లు, ఎవరు చంపినట్లు, ఎందుకు చేసినట్లు, కత్తులు ఎక్కడ నుంచి వచ్చాయి. 


ఈ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, చెప్పాల్సింది ఆ ముగ్గురే! మీ బావమరిది చనిపోయాడు. ఆయన తాలూకా వాళ్ళకి విషయం చెప్పి రమ్మనండి!” అని ఎస్సై అన్నాడు. 


మాణిక్యం “మా అక్క రత్నమ్మ. పిలిపిస్తాను. తిరుమల పెళ్లి చూసి, వాడి తల మీద నాలుగు అక్షింతలు వేసి, తాను కాటికి వెళ్లిపోతానని అంటుండేది. ఇప్పుడు చెట్టంత కొడుకు తనకంటే ముందే కాటికెళ్ళి పోయాడని తెలిస్తే, అక్కడి నుంచి ఆ ముసలమ్మ యింతదూరం రాలేదయ్యా. ఇక్కడికి వచ్చాకే, విషయం చెప్పాలి!” అని ఏడుస్తూ అన్నాడు.


మాణిక్యం కాస్త పక్కకు వెళ్లి, కళ్ళు తుడుచుకుంటూ ఊర్లో రమణకి ఫోన్ చేశాడు. రమణ ఫోన్ ఎత్తి “ఆఁ చెప్పు మాయ్య!” అని అంటే “రమణ! నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్లి, అర్జెంటుగా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని రారా!” అని అన్నాడు. 


“రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది. ఇప్పుడేటి మాయ్య! ఏమైంది?” అని రమణ అడిగితే “చెప్పింది చెయ్యిరా! అమ్మమ్మని వెంటనే తీసుకునిరా!” అని ఫోను కట్టేసి, బంగారమ్మ దగ్గరికి వచ్చాడు.

బంగారమ్మ రెండు చేతులతో తలబాదుకుంటూ “అంత నేనే చేశానయ్యా! నా తమ్ముడు తిరుమల. వాడు బంగారం. నా కూతురు పెద్దమనిషి అయినప్పటినుంచి, పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెబుతుండేవాడు. వాడికి ఉద్యోగం లేదని ఒక్క కారణం చెప్పి, సొంత తమ్ముడైనా పిల్లనివ్వనని సంవత్సరాల పాటు మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాను. నా కూతురు బాగుండాలని అప్పుడు పెళ్లి వద్దన్నాను. 


ఇప్పుడు అదే కూతురు జీవితం మీద మచ్చపడేసరికి, అదే ఉద్యోగం లేనివాడికే కదా, పెళ్లిచెయ్యడానికి ఒప్పుకున్నాను. అప్పుడు, యిప్పుడు నా స్వార్థమే. అప్పుడే పెళ్లి చేసుంటే, ఈపాటికి పిల్లాపాపలతో యిద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు! పాపిష్టి దానిని!” అని ఏడుస్తూ అంది. 


మాణిక్యం బంగారమ్మ పక్కన కూలపడి “నేను అంతే! ఆ గోవింద, మనిషి మంచోడే. కానో, పరకో ఆటో తిప్పి కష్టపడి సంపాదించుకుంటున్నాడు. అన్ని మంచివే, మన కులపోడు కాదు. అదొక్కటే అడ్డు. కులం అనే ఆహం అడ్డొచ్చింది. వద్దన్నాను. వాడికిచ్చి పెళ్లి చేసుంటే, వాళ్ళిద్దరైనా బాగుందురు. ఇప్పుడు ఎటుకు కాక అందరూ పోయారు!” అని అంటూ మాణిక్యం బంగారమ్మ ఒడిలో తలపెట్టి ఏడిచాడు. 


ఇదంతా వింటున్న ఎస్సై, కానిస్టేబుల్ లకి చాలా బాధాకరంగా అనిపించింది.


నర్సు వచ్చి “సార్! ఆ అమ్మాయి మాట్లాడాలని అంటుంది. డాక్టరుగారు రమ్మంటున్నారు!” అని అంటే అందరూ గాభరాగా లోపలికి వెళ్లారు. 


ఎస్సై మాట్లాడుతూ “అసలు ఏం జరిగిందమ్మా! ఏమైనా మాట్లాడగలవా?” అని అడిగితే, నాగమణి మెల్లగా “ఇంతవరకు ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడైనా మాట్లాడతాను! ఉద్యోగం లేదని సొంత తమ్ముడితో పెళ్లి వద్దంది మాయమ్మ! మన కులపువాడు కాదని గోవిందతో పెళ్లి వద్దన్నాడు మానాన్న! ప్రైవేటో, గవర్నమెంటో ఏదోక జాబ్ వచ్చినా, అది చేయకుండా వూర్లు పట్టుకుని తిరుగుతున్నాడు మా తిరుమల మామ! 


నేను వద్దొద్దు అంటుంటే, చిన్న చిన్న గిఫ్టులు యిచ్చేసి, ప్రేమలోకి దించేశాడు గోవింద! నాకు యిష్టం వచ్చినట్టు, బతకాలని అనుకున్నాను నేను!” అని చెప్తుంటే, మాణిక్యం, బంగారమ్మ లు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. 


ఎస్సై ముందుకు వచ్చి “అక్కడ ఏం జరిగిందమ్మా?” అని అడిగితే, నాగమణి దగ్గుతూ “జీవితంలో యిప్పుడైనా ధైర్యంగా నిజం చెప్తాను సార్. ఒక్కొక్క సారి మనిషి తనకి కావాల్సినదాని ఎందుకు జంతువులా మారుతాడో, అలాగే, గోవింద, నేను జంతువుల్లా మారి వేసుకున్న ప్లాన్ ప్రకారం, టౌన్ నుండి తిరిగి వచ్చేదారిలో, మధ్య కాపు కాసి, మామని అడ్డుతొలగించుకోవాలని అనుకున్నట్లుగానే, మామ మీద దాడి చేశాం. 

అది కనీసం ఊహించని మామ, ఎదురు తిరిగేలోపు కత్తులతో పొడిచాడు గోవింద. చిన్నప్పటినుండి నన్ను భుజాలపై ఎత్తుకుని పెంచిన మామ రక్తపుమడుగుల్లో కొట్టుకుంటుంటే, నాలో అంత పైశాచికత్వం ఉందా అని నాకే భయమేసింది. రక్తం ఎక్కువ పోయి, మామ స్పృహ తప్పిపోయాడు. గోవింద వెంటనే శవాన్ని కనిపించకుండా దాచేద్దామని, ఒకవైపు పట్టుకొమ్మని చెప్పాడు. 


నా కళ్ళంటా నీళ్ళు కారిపోతున్నాయి. అవి భాదతో వచ్చిన కన్నీళ్ళో లేక మోసం చేస్తున్నానని తన కాళ్ళు కడగడానికి వచ్చిన నీళ్ళో తెలియదు కానీ, ఆనందంతో అయితే కాదు. మామని తీసుకుని పక్కన పడేయడానికి వెళ్తుంటే, అనుకోకుండా, అక్కడ ముగ్గురు తాగుబోతులు తాగుతున్నారు. 


వాళ్లు మమ్మల్ని చూడడం, మేం వాళ్ళని చూడడం, ఒకేసారి జరిగాయి. మైకంలో వాళ్ళు, శవంతో మేం. మాదే పెద్ద తప్పు. వాళ్లు దాన్ని అలుసుగా వాడుకుందామని చూశారు. నిండా మునిగిన తర్వాత చలి ఎందుకు అని, గోవింద మళ్లీ కత్తులు తీశాడు. తాగిన మైకంలో ఉన్న ముగ్గురు, మా కత్తులు తీసుకుని గోవింద మీదకి దాడి చేశారు. 


గోవిందకి నాలుగు పోట్లు పొడిచేసరికి, నన్ను పారిపోమని గట్టిగా అరిచాడు. మానవత్వం మరిచిపోయి మేమే జంతువులమంటే, ఫుల్లుగా తాగి మైకంలో ఉన్న వారు క్రూర జంతువుల్లా నా వెంట పడి, వేటాడి, వాళ్ళు కోరికలు తీర్చుకున్నారు. మామ, గోవింద బలైపోయారు పాపం! అన్నింటికీ కారణం నేనే సార్. నేనున్న యి పరిస్థితికి నేను చనిపోతే, అన్ని విధాలా మంచిది! పొరపాటున బతికితే, నన్ను జైల్లో పెట్టేయండి సార్. బయట ఉంటే నరకం సార్! ఎవరు అమాయకులం కాదు సార్. అందరూ తేనె పూసిన కత్తులులాంటి వాళ్ళమే సార్! నా బాధంతా ఒకటే సార్. 


నాకో చెల్లి ఉంది. నా బతుకు ఎలాగో పాడైపోయింది. ఇదంతా బయటకి తెలిస్తే, దాని జీవితం ఏమైపోతుందో! నన్ను క్షమించండి అమ్మానాన్న. ఇకపోతే, మామ, గోవింద వాళ్ళని క్షమాపణ అడగాలి. ఎలాగో పైకి వెళ్తున్నాను కదా. అక్కడ అడుగుతాను!” అని చెప్తూ ప్రాణం వదిలేసింది. 


బంగారమ్మ, మాణిక్యం భోరున ఏడుస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్, డాక్టరు ముగ్గురు మౌనంగా బయటికి వచ్చారు.


హాస్పిటల్ కి వచ్చిన మీడియావాళ్ళు “ఏం జరిగింది సార్?” అని అడిగితే, ఎస్సై గొంతు సవరించుకుంటూ “పట్టణం శివార్లలో యువతీ, యువకులపైన గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. వారికి కాపాడడానికి వచ్చిన ఆటో గోవింద అనే వ్యక్తిని కుడా చంపేసి, పరారీ అయిపోయారు!” అని చెప్పాడు. 


అక్కడినుండి దూరంవచ్చాక కానిస్టేబుల్ “అదేంటి సార్! అలా చెప్పారు?” అని అడిగితే, ఎస్సై “ఆ కుటుంబానికి పోయిన పరువు చాలు. ఉన్న పరువు మన వలన పోకూడదు. అమ్మాయి తనని అత్యాచారం చేసినవాళ్ళ గురించి బాధపడలేదు. ఉన్న కుటుంబం పరువు ఏమైపోతుందో అని బాధపడింది!” అని ఆకాశంలోకి చూస్తూ చెప్పాడు.

========================================================================

సమాప్తం

========================================================================

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

ree

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


1 Comment


@seera4501

•1 hour ago

Excellent story ❤

Like
bottom of page