నా హంతకుడెవరు?
- Divakarla Padmavathi
- May 4
- 6 min read
#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #NaHanthakudevaru, #నాహంతకుడెవరు?, #TeluguCrimeStory, #కొసమెరుపు

Na Hanthakudevaru - New Telugu Story Written By Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 04/05/2025
నా హంతకుడెవరు? - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఇన్స్పెక్టర్ గారూ! నా హంతకుడెవరు సార్!" అని వినిపించడంతో ఫైల్లో తలదూర్చి ఏదో చదవటంలో నిమగ్నమై ఉన్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ చివుక్కున తలెత్తాడు.
ఒక్కక్షణం ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో అర్ధంకాలేదు. ప్రశ్న అర్ధమైన తర్వాత నిర్ఘాంతపోయి అతనివైపు చూసాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
"అదే సార్! నా హంతకుడెవరో కనిపెట్టారా?" మళ్ళీ అడిగాడు ఆ ఆగంతకుడు.
అతని వయసు దగ్గరదగ్గర నలభై ఏళ్ళుంటుంది. చెదిరిన క్రాఫ్, మాసిన గడ్డంతో ఉన్న అతన్ని గుర్తు పట్టడానికి ప్రయత్నించసాగాడు ప్రశాంత్. తను చూస్తున్న ఫైల్లో ఉన్న ఫొటోను, ఆ వ్యక్తిని మార్చిమార్చి చూడసాగాడు.
"ఎవర్నువ్వు?" అని అడిగాడతన్ని.
"మీరు చూస్తున్న ఫైల్లో ఉన్న వాణ్ణి నేనే!" అన్నాడా వ్యక్తి తను కూడా ఆ ఫైల్లోకి తొంగి చూస్తూ.
ఆశ్చర్యపోయాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. తను చూస్తున్న ఫైల్లో హతుడి ఫొటోలో ఉన్న మనిషి, 'నా హంతకుడెవరు?' అని ప్రశ్నిస్తూ ఎదురుగా నిలబడితే ఎవరైనా ఆశ్చర్యపోక ఏం చేస్తారు మరి! 'హతుడు ఎలా బతికి తిరిగి వచ్చాడు? కొంపదీసి దయ్యం కాదు కదా? అసలు దయ్యాలంటూ ఉన్నాయా? అంతా ట్రాష్!' అనుకుంటూ, "నీ పేరు?" అని అడిగాడు ప్రశాంత్.
"ఏం, నాపేరు ఆ ఫైల్లో రాసిలేదా?" తిరిగి ప్రశ్నించాడా వ్యక్తి.
విస్తుపోతూ అతని వంక చూసాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
"అయితే, నీ పేరు జగదీశ్ అవునా? మరి హత్యకు గురైనవాడివి ఎలా తిరిగి వచ్చావో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
విచిత్రంగా నవ్వాడు ఆ వ్యక్తి. "అసలు నేను చనిపోతేగా, తిరిగి బతికి రావటానికి. అసలు నేను చనిపోయినట్లు...అదే హత్యకు గురైనట్లు ఎందుకు చిత్రీకరించారో, ఎవరు ఆ పని చేసారో తెలుసుకోవాలని ఉంది ఇన్స్పెక్టర్ గారూ.” అన్నాడు ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
ఆ వ్యక్తిని పరీక్షగా చూసాడు ప్రశాంత్. సందేహం లేదు, అతను ఫోటోలో ఉన్న వ్యక్తే! తన ఎదురుగా ఉన్నది జగదీశ్ అయితే, మరి చనిపోయినది, హత్యకు గురైంది ఎవరు? ఆశ్చర్యపోతూ అతనివంక చూసాడు ప్రశాంత్.
"సరే, మీరే జగదీశ్! మరి ఇన్నాళ్ళూ మీరెక్కడికెళ్ళారు? ఎక్కణ్ణుంచి ఇప్పుడు వస్తున్నారు?" ప్రశ్నించాడు ప్రశాంత్.
పెద్దగా నిట్టూర్చాడు ఆ వ్యక్తి. "ఇప్పటికి నన్ను నమ్మారన్నమాట! అఫ్ కోర్స్, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నేనే జగదీశ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధిపతినని చెప్తే మీరేకాదు ఎవరైనా సరే నమ్మరు." అంటూ టేబుల్ పైన ఉన్న మంచినీళ్ళ గ్లాస్ ఎత్తి గటగటా తాగాడు.
అతన్నే నిశితంగా గమనిస్తూ ఉండిపోయాడు ప్రశాంత్.
పదిహేను రోజుల క్రితం జగదీశ్ ప్రయాణిస్తున్న కారు నగరానికి పాతిక కిల్లోమీటర్ల దూరంలో ఘాట్ సెక్షన్లో ఘోరమైన ప్రమాదానికి గురైంది. యాభై అడుగుల లోయలో పడిపోయి, కారంతా నుజ్జునుజ్జవడమే కాకుండా, అగ్నికి ఆహుతైంది.
మొహం గుర్తించలేని విధంగా కాలిపోయినా వంటికున్న దుస్తులు బట్టి ఆ మృతదేహం తన భర్తదే అని అతని భార్య కవిత దృవీకరించింది. అయితే, ఆ తర్వాత పోస్ట్ మార్టంలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కారు యాక్సిడెంట్ కి గురవడానికి రెండు మూడు గంటల ముందే అతను హత్యకు గురైనట్లు తెలిసింది.
అంటే అతన్ని ఎవరో తలమీద బరువైన సుత్తిలాంటి ఏదో వస్తువుతో మోది హత్యచేసి, ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని అర్ధమైంది ప్రశాంత్ కి. ఇంకా ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. ఆ సందర్భంగా జగదీశ్ భార్య కవితను, అతని స్నేహితులను, బంధువులనూ, అతని ఆఫీసులో ఉద్యోగులనూ విచారించాడు.
అన్ని కోణాల్లోంచి విశ్లేషించి హంతకులెవరై ఉంటారా అని ఆలోచిస్తున్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఎదురుగా ఇప్పుడు హతుడిగా భావిస్తున్న జగదీశ్ కూర్చొని ఉన్నాడు.
"సారీ, జగదీశ్ గారూ! ఇప్పుడు చెప్పండి ఇన్నాళ్ళూ మీరేమయ్యారు, ఎక్కడున్నారు?" అని అడిగాడు ప్రశాంత్ ముందుకు వంగి.
నెమ్మదిగా జరిగింది చెప్పడం ప్రారంభించాడు జగదీశ్.
పదిహేను రోజుల క్రితం రాత్రివేళ, తన ఫ్యాక్టరీలో అక్రమాలు జరుగుతున్నాయని, వస్తువులు కల్తీ అవుతున్నాయని ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి తన వివరాలు తెలుపలేదు. అతను చెప్పిన స్థలంకి వెళ్ళి, కారు దిగాడో లేదో ఎవరో అతనిపై వెనుకనుండి దాడి చేసారు.
తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయి ఉన్న అతన్నికాళ్ళూ చేతులూ కట్టేసి గోనె సంచీలో కుక్కి, దూరంగా ఉన్న నదిలో పారవేసారు. అదృష్టవశాత్తూ, కొద్ది దూరంలో ఉన్న పల్లె జనం అతన్ని రక్షించారు. స్పృహ వచ్చి, కోలుకోవడానికి పది రోజులు పైనే పట్టింది. అతని జేబులో ఉన్న పర్సు, చేతికున్న ఉంగరాలు దుండగులు తీసేయడంతో అతనెవరైందీ ఆ పల్లెలో ఎవరికీ తెలీదు.
తెలివి వచ్చిన తర్వాత, టివిలో వార్తలు చూసి జరిగింది తెలుసుకున్నాడు. తనపై దాడి జరపడం, ఆపైన తను కారు ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు రావడంతో ఇందులో ఏదో రహస్యం దాగి ఉందని అతనికనిపించి, సరాసరి పోలీసు స్టేషన్ కే వచ్చాడు. జరిగిన సంఘటనలు ప్రశాంత్ కి వివరించి చెప్పాడు జగదీశ్.
కేసు కొత్త మలుపు తిరిగిందని గ్రహించాడు ప్రశాంత్. ఇప్పటివరకూ హతుడు జగదీశ్ అని అనుకుంటే, అతను జీవించే ఉన్నాడు. ఇప్పుడు తన ముందు రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి - హతుడెవరో తేలాలి, రెండు - జగదీశ్ ని దెబ్బతీసి, హత్యా ప్రయత్నం చేసిందెవరు? నిజం తేలాంటంటే మరింత లోతుగా పరిశోధించాలని అనుకున్నాడు ప్రశాంత్.
"ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారూ, నా మీద హత్యా ప్రయత్నం చేసిందెవరు? నా బదులు హత్యకు గురైన వ్యక్తెవరు? ఇది కచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని చేసిన పని. ఈ కుట్ర వెనుక దాగిన వ్యక్తులెవరో మీరు కనిపెట్టాలి.” అన్నాడు జగదీశ్.
అతను చెప్పిందంతా విని తలూపాడు ప్రశాంత్.
"మీరు బతికి బయటపడ్డం నిజంగా మీ అదృష్టం. మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని కనుక్కోవడమే కాకుండా ఓ అమాయకుణ్ణి హత్య చేసిందెవరో కూడా తేల్చాలి.
మీకు శత్రువులెవరైనా ఉన్నారా...ఐ మీన్...మీరంటే కిట్టని వాళ్ళు, మీ స్నేహితులు కావచ్చు, మీవద్ద పనిచేసే ఉద్యోగులు కానీ, మీతో బిజినెస్ లో పోటీపడే వ్యక్తులు - ఇలా ఎవరికి ఇలాంటి అవకాశం ఉందో తెలియాలి ముందు. మిమ్మల్ని హత్య చేస్తే ఎవరికి లాభిస్తుందో అన్న కోణంలో కూడా ఆలోచించాలి. ఇంకేమైనా వివరాలు చెప్పగలరా?" ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
రెండు నిమిషాలపాటు ఆలోచించాడు జగదీశ్. నాకు పెద్దగా శత్రువులెవరూ లేరు. కొన్ని చిన్నచిన్న తగాదాలే ఉన్నప్పటికీ హత్య చేసేంత కక్ష ఎవరికీ ఉంటుందనుకోను. అయితే, ఆర్నెల్ల క్రితం శరత్ అనే మా అఫీసులో పని చేసే అతన్ని ఉద్యోగంలోంచి తొలగించాను. తన తప్పేమీలేదని, ఇంట్లో తనపై ఎన్నో బాధ్యతలున్నాయని అతనెంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు నేను.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇమ్మని అడిగాడు, కాని నేను వినలేదు. అతను వెళ్ళిపోయాక, మనసులో ఎంతో బాధపడ్డాను. అతని తప్పేమీలేదని తర్వాత తెలిసింది, కానీ అప్పటికే అతనెక్కడికో వెళ్ళిపోయాడు. అయినా, అతను నన్ను హత్య చెయ్యడానికి పూనుకుంటాడని అనుకోను." చెప్పాడు జగదీశ్.
అతను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు ప్రశాంత్. "అతని మీద ఎలాంటి ఆరోపణ వచ్చింది? ఎవరు ఆ ఆరోపణలు తెచ్చారు?" అడిగాడు.
"అతనిపై ఆరోపణలు తెచ్చినవాడు మా మేనేజర్, నా స్నేహితుడైన శశిధర్. ఆఫీసు డబ్బులు దొంగతనం చేసాడని, ఫ్యాక్టరీ నుండి దొంగతనంగా సరుకులు బయటకు తరలించాడని నాకు చాలా సన్నిహితుడైన శశిధర్ ఆరోపణలు చేసి, రుజువు చేయడంతో శరత్ ని ఉద్యోగం నుండి తొలగించాను." అన్నాడు.
"శశిధర్ ఎలాంటి వ్యక్తి?" తిరిగి ప్రశ్నించాడు ప్రశాంత్.
"అతను నా చిన్ననాటి స్నేహితుడు. నాకు అన్ని వ్యవహరాల్లో సహకరించేవాడు. మా ఇంటికీ తరచూ వచ్చేవాడు."
"మరి, మీ భార్య కవిత?" అడిగాడు ప్రశాంత్.
చెప్పాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించి చివరకు చెప్పాలని నిశ్చయించి పెదవి విప్పాడు జగదీశ్.
"నా భార్య కవిత కూడా నా చిన్ననాటి స్నేహితురాలే! మాది ప్రేమ వివాహం. అయితే ఏడాదైంది మా ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తి విడాకుల తీసుకొనే దాకా వచ్చి, మధ్యవర్తులవల్ల రాజీ కుదిరింది. శశిధర్ మా ఇద్దరికీ నచ్చచెప్పడంవల్ల రాజీపడ్డాం." చెప్పాడు.
సాలోచనగా తలపంకించాడు ప్రశాంత్.
"శరత్ ఫోటో దొరుకుతుందా? అతని వివరాలు కావాలి. "
తలూపాడు జగదీశ్. "మా ఆఫీసులో ఫైల్లో అతని ఫోటోలు, వివరాలు ఉంటాయి." అన్నాడు.
"సరే! మీరెవరికీ కనపడకుండా ఉండండి, మీ హంతకుణ్ణి..." అని నవ్వి, "సారీ...అదే... మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాణ్ణి త్వరలో పట్టుకుంటాను." అని అతనికి హామీ ఇచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
శాస్త్రీనగర్ లో ఉన్న జగదీశ్ ఇండస్ట్రీస్ ఆఫీసులోకి ప్రవేశించి, శశిధర్ ని కలుసుకోవడానికి వెళ్ళేసరికి అతను చాలా బిజీగా ఉన్నాడు.
"జగదీశ్ చనిపోయిన తర్వాత, అతని భార్య కవిత కంపెనీ బాధ్యతలన్నీనాకు అప్పగించింది. అన్ని విషయాలూ నేనే చూసుకోవలసి వస్తోంది." నవ్వుతూ చెప్పి ప్రశాంత్ ని ఆహ్వానించాడు శశిధర్.
తను వచ్చిన పని చెప్పాడు ప్రశాంత్. అసిస్టెంట్ రంగారావుని పిలిచి, శరత్ కి సంబంధించిన ఫైల్ తెమ్మని చెప్పాడు. పావుగంట తర్వాత అతను వచ్చి ఫైల్ కనిపించలేదని చెప్పాడు. ముందే ఆ విషయం ఊహించిన ఇన్స్పెక్టర్ ప్రశాంత్, శరత్ కి సంబంధించిన వివరాలు కొన్ని సేకరించాడు.
మరి కొంతమంది ఉద్యోగులను కలుసుకొని మరిన్ని వివరాలు సేకరించాడు. వాచ్ మేన్ రాఘవులుని ప్రశ్నించడంతో కొత్త విశేషాలు తెలిసాయి. ఆఫీసుస్టాఫ్ అందరూ కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోలో శరత్ ఉండటంతో ఆ ఫోటో తన వెంట తీసుకెళ్ళాడు ప్రశాంత్.
రెండు రోజుల తర్వాత కలుసుకున్న జగదీశ్ ని నవ్వుతూ అహ్వానించాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
"నా మీద హత్యా ప్రయత్నం చేసినదెవరో తెలిసింది రమ్మని కబురు చేసారుగా! నా బదులు హత్యకు గురైన ఆ అనామకుడెవరో తెలిసిందా?" అని అడిగాడు అతనికెదురుగా కూర్చుంటూ.
అతని వైపోసారి జాలిగా చూసాడు ప్రశాంత్.
"మీకు ఎంతో సన్నిహితుడైన మీ మిత్రుడే మిమ్మల్ని హత్య చెయ్యాలని చూసాడు." అన్నాడు.
ఉలిక్కిపడ్డాడు జగదీశ్. "ఆ...శశిధరా నా మీద హత్యా ప్రయత్నం చేసింది? నేను నమ్మలేకుండా ఉన్నాను." అన్నాడు.
"అంతకన్నా నమ్మలేని నిజం మరోటి ఉంది! అతనికి ఆ విషయంలో సహకరించింది మరెవరో కాదు మీ భార్య కవితే!"
జగదీశ్ నోట మాట రాలేదు. విస్తుపోయాడు.
"మీ ఫ్యాక్టరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఫోన్ వస్తే మీరు వెళ్ళారు. అది తెలిసి, ఎక్కడ తన బండారం బయటపడుతుందోనని మిమ్మల్ని హత్య చెయ్యడానికి కిరాయి రౌడీలను పురమాయించాడు. వాళ్ళు స్పృహలేని స్థితిలో ఉన్న మిమ్మల్ని నదిలో పారేయడం, మీరు బతికి బయటపడటం అదంతా మీ అదృష్టమే!
శశిధర్ మీ ఇంటికి రాకపోకలు సాగించే క్రమంలో అతనికి, మీ భార్య కవితకు మధ్య ఆకర్షణ ఏర్పడి అది వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. అతనితో కలిసి జీవించడానికి, మీ నుండి విడాకులు కోరుకుందామె. మీరు విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతో, మీ ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చినట్లు కుదిర్చి మిమ్మల్ని హత్య చెయ్యడానికి ప్లాన్ వేసాడు శశిధర్.
ఆస్తితో పాటు ప్రియురాల్ని కూడా సొంతం చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే మీరు అతన్ని పూర్తిగా నమ్మడంవల్ల కంపెనీలో కొన్ని అక్రమాలకు పాల్పడ్డాడు. డబ్బులు మాయం చెయ్యడం, సరుకులు కల్తీ చెయ్యడం, బయటకు దాటించెయ్యడం కూడా అతని పనే! కొంతమంది ఉద్యోగస్థులను తనవైపుకు తిప్పుకున్నాడు. తనకు సహకరించని శరత్ లాంటి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుండి ఉద్వాసన చేయించేవాడు.
చివరికి మీ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించి హత్యా ప్రయత్నం చేసాడు. అదే రాత్రి మీ ఇంటికి వెళ్ళాడు శశిధర్. తన ప్రయత్నం ఫలించిందని, మీ అడ్డు శాశ్వతంగా తొలగిపోయిందని, ఇద్దరూ ఇంక ఏ అభ్యంతరం లేకుండా త్వరలో పెళ్ళి చేసుకోవచ్చని కవితకు చెప్పాడు." అంటూ ఆగి జగదీశ్ వైపు చూసాడు.
ఆసక్తిగా వింటున్నాడు అతను. "మరి హత్యకు గురైన అనామకుడెవరు?"
దీర్ఘంగా నిట్టూర్చాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
"అదే చెప్పబోతున్నాను. ఉద్యోగం పోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు పాపం శరత్. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకొని శశిధర్ చీకటి పనులన్నిటి మీద నిఘాపెట్టి మీకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే మీ మీద హత్యా ప్రయత్నం జరిగినట్లు అతనికి బహుశా తెలియదు.
శశిధర్ని అనుసరిస్తూ మీ ఇంటికి వెళ్ళిన శరత్ వాళ్ళ మాటలు వినడమే కాక, ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తన సెల్ లో రికార్డ్ చేసాడు. మీరే హత్యాప్రయత్నం నుండి తప్పించుకొని వచ్చారని చీకట్లో భ్రమ పడ్డారిద్దరూ. చేతికి దొరికిన సుత్తితో తలమీద కొట్టి గాయపర్చాడు శశిధర్.
ఇద్దరూ కలిసి కార్లో శరత్ మృతదేహాన్ని తీసుకెళ్ళి లోయలోకి తోసేసి చేతులు దులుపుకున్నారు. యాక్సిడెంట్ గా నిరూపించి, మీ ఆస్తితో పాటు యాభై కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కొట్టేయాలని ప్లాన్ చేసారు. కానీ, వాళ్ళ ఫాన్ ఫలించలేదు. అడ్డంగా దొరికిపోయారు.
ఆఫీసులో శరత్ కి సంబంధించిన ఫైల్ మాయమైంది కానీ, వాచ్ మేన్ రాఘవులు దగ్గర నుండి అతని వివరాలు, ఫోటో సేకరించాను. హత్యా ప్రదేశంలో దూరంగా పడిపోయిన ఫోన్ మళ్ళీ వెతగ్గా దొరికింది. మీ వెనుక నడిచిన మొత్తం కథంతా తెలిసింది.
హత్యకు కారణమైన శశిధర్, కవితలను మా పద్ధతిలో విచారించేసరికి నేరం ఒప్పుకున్నారు. పాపం శరత్ అనవసరంగా ప్రాణం కోల్పోయాడు." అని ముగించాడు.
ఇన్స్పెక్టర్ ప్రశాంత్ సైగ చెయ్యగా నేరస్థుల్నిద్దరీ అక్కడ హాజరు పర్చాడు కానిస్టేబుల్ కనకాచలం. తన వెనుక ఇంత కుట్ర జరిగిందని ఇంకా నమ్మకం కుదరని జగదీశ్ వాళ్ళిద్దరివైపు ఆశ్చర్యంగా చూసాడు.
ఆ చూపును భరించలేక వాళ్ళిద్దరూ తలలు వంచుకున్నారు.
"పాపం. నా బదులు ప్రాణాలు కోల్పోయిన శరత్ కుటుంబానికి న్యాయం చెయ్యాల్సిన బాధ్యత నా మీద ఉంది." అన్నాడు జగదీశ్ భారంగా నిట్టూర్చుతూ.
తలపంకించాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments