top of page

 కరణేషు మంత్రీ..

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #కరణేషుమంత్రీ, #KaraneshuManthri, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు


Karaneshu Manthri - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 03/05/2025

కరణేషు మంత్రీ - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


“రా నాన్న ఆడుకుందాం!. ”బంతిని తన ఎడమ చేత్తో పట్టుకొని, కుడి చేత్తో తరుణ్ చెయ్యి పట్టుకొని లాగుతూ అడిగింది ఎనిమిదేళ్ల మోక్ష. 


“ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకో.. ” చిన్న చిరునవ్వు ఇస్తూ అన్నాడు తరుణ్. 


ఎప్పుడూ తనతో హుషారుగా ఆడే తండ్రి కొన్ని రోజులుగా తనతో ఎందుకు ఆడటం లేదు అర్ధం కానీ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ, తల కిందకు దించుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది మోక్ష.. 


“ఏంటి మోక్ష! ఎందుకు అలా ముభావంగా వున్నావు. ఏమైంది నా చిట్టి తల్లికి?” అని ఎదురుగా వచ్చిన లక్ష్మి లాలనగా అడిగింది. “చూడమ్మ! నాన్న నాతో ఆడుకోవడానికి రావడం లేదు. ”పెదవి విరుస్తూ అంది.. 


“ఓహ్! చిట్టి తల్లి.. ఇందుకేనా.. ఇలా అయిపోయావు. మరేం ఫర్వాలేదు.. నేను వున్నాను కదా. నేను నీతో ఆడుతాను.. పదా ఆడుకుందాం” అని మోక్ష ను ఆడించడానికి తీసుకు వెళ్లింది లక్ష్మి.. 


కొంత సమయం తర్వత బాగా ఆడి, అలసిపోయిన కూతుర్ని చూసి, , ”ఏం చిట్టి తల్లి!. ఇప్పుడు నీకు సంతోషమే కదా!. బాగా ఆడుకున్నావు కదా!.. ”నవ్వుతూ కూతుర్ని దగ్గరకు తీసుకుంది.. 


“హా!, బాగా ఆడుకున్నాను అమ్మ.. చాలా హ్యాపీ గా వుంది!.. ” చిరునవ్వులు చిందిస్తూ అంది మోక్ష.. 


“సరే, మనం ఒక ఫంక్షన్ కు వెళ్ళాలి. నువ్వు రెడీ అవ్వు.. ” అని చెప్పి కూతుర్ని లోపలికి పంపించింది. ఇంకా ఏదో ఆలోచనలో వున్న తరుణ్ దగ్గరకు లక్ష్మి చేరుకొని, 


“ఏంటి తరుణ్! ఇంకా ఆ ఆలోచనలోనే ఉన్నావా?.. అయిపోయింది ఏదో అయిపోయింది. దాని గురించి మరచిపో.. హా! అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. నా ఫ్రెండ్ సుజాత వుంది కదా!. ఈ రోజు వాళ్ల అబ్బాయి పుట్టిన రోజు, నన్ను రమ్మని మరీ మరీ పిలిచింది. నేను, పాప వెళ్ళి వస్తాం. నిన్ను రమ్మని పిలుద్దాం అనుకున్నాను కానీ, నువ్వు డిస్టర్బ్ గా వున్నావని ఆగిపోయాను. సరే, నువ్వు జాగ్రత్తగా వుండు. మేము వేగంగా వచ్చేస్తాం” అని చెప్పి బయలుదేరింది లక్ష్మి. 


ఇంకా ఆలోచనలోనే వున్నాడు తరుణ్, ఇంతలో తన ఫోన్ మ్రోగింది. మెల్లగా తీసి చూసాడు. తన స్నేహితుడు వీర ఫోన్ చేస్తున్నాడు.. “చెప్పరా.. ”నిస్సారంగా మారిన గొంతు తో అన్నాడు తరుణ్. 


“రేయ్ తరుణ్!. ఒక విషయం చెప్పాలి రా.. కొత్త రకం బెట్టింగ్ బృందం దిగింది రా.. ఎవరికీ తెలియదు. ఎటువంటి రైడింగ్ భయం కూడా వుండదు. ఏమంటావు?.. ”అని అన్నాడు వీర. 


ఒక్కసారిగా కిందటి నెల జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది!. ‘వద్దు, వద్దు.. వాటి జోలికి పోవద్దు. కిందటి నెల జరిగిన నష్టం చాలు..’ లోలోపల అంతరంగం గగ్గోలు పెడుతోంది.. 


“రేయ్ ఏమి మాట్లాడవు ఏమిటి?.. లాస్ట్ సారి జరిగింది మరచిపో. ఈ సారి నీకు జాక్పాట్ పక్కా తగులుతుంది.. ” ఆశలు రేకిస్తూ అన్నాడు వీర.. 


‘అవును ఈసారి ఎలాగైనా నేను కోల్పోయింది సంపాదించాలి..’ తనలో ఏమూలనో మిగిలిన అత్యాశ ఉసిగొల్పుతుంది.. 


“సర్, నేను తర్వాత మాట్లాడతాను” అని కాల్ కట్ చేసి, వేగంగా ఇంటిలోపలికి వెళ్ళాడు. అప్పటికి మోక్ష, లక్ష్మి ఇంటి లోపల లేరు. మొత్తం వెతకడం ప్రారంభించాడు. చివరకు కబోర్డ్ కీ దొరికింది. వేగంగా వెళ్ళి దాన్ని తెరిచాడు. బోసిగా వున్న ఆ కప్ బోర్డు లో తళతళ మెరుస్తూ, ఒంటరిగా కనిపిస్తూ వుంది నెక్లెస్.. 


దాన్ని అందుకున్నాడు, తన పెళ్లి మొదట్లో లక్ష్మి కి ఆ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడు.. తాను ఇబ్బందుల్లో వుండటం చేత తన నగలన్నీ కోల్పోయింది లక్ష్మి. చివరికి ఆమె దగ్గర మిగిలిన ఏకైక బంగారు వస్తావు ఇది.. 


'వద్దు తరుణ్, ఆమెకు మిగిలింది ఈ ఒక్క వస్తువు మాత్రమే. పైగా నువ్వు ఇచ్చిన మొదటి బహుమతి. నీ వల్ల ఆమె అన్నీ కోల్పోయింది..' అంతరంగం హితవు పలుకుతుంది. 


'ఈ పందెం లో గెలిచావంటే. ఇలాంటివి రెండు కొనొచ్చు..' తనలో ఇంకా దాగి వున్న వ్యసనం ఊరిస్తుంది! కాసేపు సతమతం అయ్యి చివరికి దాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు తరుణ్.. 

“రేయ్ ఎక్కడ రా?” వీర కు ఫోన్ చేసి అడిగాడు.. 


“ఇప్పుడే ఉన్నపళంగా పని పడింది రా.. నీకు లొకేషన్ పంపుతాను. నువ్వు వెళ్ళు..” అని చెప్పి వీర ఫోన్ పెట్టేసాడు. 


‘సమయానికి అందుబాటులో వుండడు’ అని అనుకుంటుండగా, సెల్ కు మెసేజ్ రావడం తో, దాన్ని తెరిచి చూసాడు.. వీర పంపించిన లొకేషన్ వుంది!.. దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. సిటీకి చాలా దూరంలో వుంది ఆ చోటు.. 


‘చూస్తుంటే దాబా లా వుంది!.. పైగా లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది!.. వాడు ఏమైనా రాంగ్ అడ్రెస్స్ ఇచ్చాడా?’ అని ఆలోచిస్తుండగా, 


“ఏమి కావాలి సర్.. ” అని అంటూ ఒక కుర్రాడు, ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.. 


“అది.. అది.. ” అని తరుణ్ తటపటాయిస్తుండగా. “బెట్టింగ్ కోసం వచ్చారా?.. ” మెల్లగా అడిగాడు ఆ కుర్రాడు. 


సందిగ్ధం తో తల ఊపాడు.. 


“అయితే నాతో పాటు రండి.. ”అని ముందుకు కదిలాడు. 


తరుణ్ ఆ కుర్రాడిని అనుసరించాడు. మెల్లగా ఆ కుర్రాడు ఒక రూం లోపలికి వెళ్లి, తరుణ్ ను అక్కడ కూర్చోమని చెప్పి, అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 


చుట్టూ పరికించి చూస్తూ అక్కడే కూర్చున్నాడు తరుణ్. ఇంతలో తరుణ్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, , “ఇక్కడంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది. మీ ప్రత్యర్థి ఇక్కడే వుంటాడు కానీ, అతను ఎవరో మీకు తెలియదు!.. ఎటువంటి భయం లేకుండా మీరు ఆడుకోవచ్చు.. ” అని చెప్పి తనతో పాటు తీసుకు వెళ్లి, ఒక ప్లేస్ లో కూర్చొబెట్టాడు.. 


“మీకు ఎదురుగా ఈ కంప్యూటర్ వుంది కదా. ఇందులోనే మీరు ఆడాలి.. అదుగో పక్కనే వున్న ఆ డిజిటల్ ప్యాడ్ మీద మీకు సందేశం ఇవ్వాలి అనిపిస్తే దాని మీద రాయండి.. సరే, మీరు క్యాష్ తో వచ్చారా?. ” అడిగాడు ఆ వ్యక్తి.. 


తనతో తెచ్చిన నెక్లెస్ చూపించాడు..


“నో ప్రోబ్లం, మీరు అడవచ్చు.. ” అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి.. 


ఆట మొదలైంది!, మెల్లగా జోరుమీద వున్నట్టు కనిపిస్తూ ఒక్కసారిగా ఓడిపోయాడు తరుణ్.. ఒక్కసారిగా గుండెల్లో వేగం పెరిగింది. ఇంతలో మళ్లీ ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు.. 

“నో ప్రోబ్లం ఇది ట్రైల్ మాత్రమే. అసలు ఆట ఇంకా ప్రారంభం కాలేదు.” అని చెప్పాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్. 


“మీకు ఒక సలహా, మేము మా కస్టమర్స్ కి దీని గురించి హెచ్చరిస్తూ ఒక మాట ముందుగా చెప్తాము. మీరు డ్రాప్ అయిపోతాను అంటే డ్రాప్ అయి వెళ్లిపోవచ్చు. మేము ఎటువంటి అభ్యంతరం పెట్టం”

“నో వే, నేను డ్రాప్ అవ్వడమా?.. ఆట మొదలు పెట్టండి. ” అని అన్నాడు తరుణ్. 


“ఓకే! బెస్ట్ ఆఫ్ లక్.  అని అక్కడ నుండి కదిలాడు ఆ వ్యక్తి. 


మళ్ళీ ఆట మొదలు అయ్యింది. అతి ఉత్సాహం తో, ఈసారి కూడా తరుణ్ ఓటమి పాలయ్యాడు. రెండు నిమిషాల తర్వాత, అక్కడకు వచ్చాడు ఆ వ్యక్తి.. 


“మీరు బాగా ఆడారు, కానీ విజయం అవతల వ్యక్తికి వరించింది.. మీరు మీ నెక్లెస్ నాకు ఇవ్వండి. ” అని అడిగాడు అతను.. ఒక్కసారిగా తల గిర్రున తిరిగింది తరుణ్ కు, మెల్లగా తన దగ్గర వున్న నెక్లెస్ తీశాడు. చెయ్యి వణుకుతోంది. మరో మాట లేకుండా ఆ వ్యక్తికి దాన్ని అందించాడు.. దాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.. 


ఒక్కసారిగా ఆ టేబుల్ మీద పడి రోదిస్తున్నాడు తరుణ్. తన భార్య తనకోసం చేసిన త్యాగం వృథాగా పోయింది అని. తన అన్నవాళ్లు తనకి సపోర్ట్ రాకపోయినా, అండగా నిలిచి తన బంగారాన్ని, తాను సంపాదించిన సొమ్మును ఇచ్చి తనని కాపాడింది. అంత చేసిన ఆమెను మళ్ళీ మోసం చేశాను, ఇప్పుడు బాధపడి ఏమి లాభం అని రోదిస్తూ వున్నాడు. 


మిగిలిన ఒక్క నగ కూడా నా వ్యసనం కి బలైంది. ఇప్పుడు ఏ ముఖం తో లక్ష్మి ముందు నిలబడగలను. నాకు వేరే ఆప్షన్ లేదు అని దిగులు పడుతూ వుండగా, 

“సర్, ఇదుగో మంచి నీళ్ళు తీసుకోండి.. తర్వాత ఈ కాఫీ తాగండి. ” అని అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి, తాను తెచ్చిన మంచి నీళ్లు, కాఫీ ఆ టేబుల్ మీద పెడుతూ అన్నాడు. 


అతను వైపు కోపంగా చూసాడు తరుణ్. 

“మీ బాధ నాకు అర్దం అయ్యింది సర్, మీలాంటి వాళ్లను నేను రోజూ చూస్తుంటాను. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మీకు సహాయం చేయాలనిపిస్తుంది, మీ నెక్లెస్ మీకు దక్కే మార్గం కూడా వుంది. ” అని అన్నాడు ఆ వ్యక్తి. 


“ఏమిటది?.. త్వరగా చెప్పు. ” చిగురించిన ఆశతో అడిగాడు తరుణ్. 


“నేను మా బాస్ తో మాట్లాడి ఒప్పిస్తాను. మిగతా విషయాలు అతను చెప్తారు. ” అని అక్కడ నుండి కదిలాడు ఆ వ్యక్తి. 


కొంత సమయం తర్వాత అక్కడ వచ్చాడు ముందు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తి.. “చూడండి మిస్టర్!, మా వాడు అంతా చెప్పాడు.. అయితే పరిస్థితి నేను అర్దం చేసుకున్నాను. మీ నెక్లెస్ మీకు తిరిగి ఇస్తాను.. అయితే ఒక కండిషన్. ”


“ఏమిటది?. ”


“మొత్తం అయిన సొమ్ము మొత్తం మీరు నెల నెల వాయిదాల్లో కట్టాలి. ఈ విషయం మీరు ఎవరికీ చెప్పకూడదు.. ఈ సొమ్ము తేలే వరకు మీరు ఎటువంటి బెట్టింగులు ఆడకూడదు. ఇవన్నీ ఒప్పుకుంటున్నట్టు మీరు ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. ఇంకో విషయం..


 ఒకవేళ మీరు ఆత్మహత్యకు పాల్పడినా, వేరే దేనికి ప్రయత్నించినా ఈ భారం మొత్తం మీ కుటుంబం మీద పడుతుంది.. అన్నీ ఆలోచించుకోండి.. ” అని అన్నాడు ఆ వ్యక్తి, అగ్రిమెంట్ పేపర్లు టేబుల్ మీద పెడుతూ.. 


మరొక ఆలోచన లేకుండా ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు. 


“గుడ్ మిస్టర్! అయితే మీరు నెల నెల సరైన టైంకు అమౌంట్ ఇచ్చేస్తే ఎటువంటి సమస్య వుండదు. ఇప్పుడు తప్పించుకోవడానికి మీకు వేరే దారి లేదు.. ఆలోచించుకోండి హాయిగా. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మసులుకుంటే మీకే మంచిది.. మీరు ఇక వెళ్ళవచ్చు. ” అని చెప్పి ఆ నెక్లెస్ తరుణ్ కు ఇచ్చేశాడు ఆ వ్యక్తి.. 


ఆ నెక్లెస్ అందుకొని, “దేవుడా!, మళ్ళీ నాకొక అవకాశం ఇచ్చావు. ఇదే చాలు.. మరొక్క సారి బెట్టింగ్ జోలికి పోను.. ” అని అక్కడ నుండి ఇంటికి చేరుకున్నాడు.. అప్పటికి ఇంకా లక్ష్మి ఇంటికి రాలేదు.. మెల్లగా ఆ నెక్లెస్ దాని స్థానంలో పెట్టి, ఊపిరి పీల్చుకున్నాడు. 

 ***********

“హాయ్ లక్ష్మి!. ఐడియా నీకు చెప్పగానే మాకు సహకరించి నందుకు చాలా థాంక్స్. ” అని లక్ష్మి స్నేహితుడు అయిన విరాజ్ అన్నాడు. 


“నేనే నీకు థాంక్స్ చెప్పాలి, సమయానికి ఈ ప్రాజెక్టు గురించి నా దగ్గర ప్రస్తావించారు. మా ఆయన లో మిగిలి వున్న వ్యసనం పూర్తిగా పోగొట్టేందుకు పనికి వచ్చింది.. నీ ఐడియా సూపర్, దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగా ఉపయోగ పడే అవకాశం వుంది!. బెట్టింగ్ కోల్పోయిన తర్వాత కలిగే బాధను బాధితుల్లో ముందే కలిగించి, వాళ్లలో మార్పు వచ్చేలా చేయాలన్న నీ ఆలోచన బాగుంది. ఈ ఆలోచన నా కాపురం నిలబడేందుకు పనికి వచ్చింది. ” అని అంది లక్ష్మి.. 


“నేను నీకు నా ఆలోచన మాత్రమే చెప్తాను.. కానీ నీ తెలివి తేటలతో ఆ ఆలోచన ఎలా అమలు పరచాలి అన్న సూచన ఇచ్చి, దీన్ని జయప్రదం అయ్యేలా చేశావు. నిజంగా చెప్పాలి అంటే ఒక మంత్రిలా, అంటారు కదా కరణేషు మంత్రీ అలా నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకున్నావు. ”

“నాదేముంది. ఏదో నా భర్తను కాపాడుకోవాలని తాపత్రయం..” 


“నాకు తెలిసిన కొందరు స్నేహితులు వాళ్ల జీవితాలు బెట్టింగ్ కారణంగా కోల్పోయారు. నాకు చాలా బాధ కలిగింది.. బాగా ఆలోచించగా ఈ ఆలోచన వచ్చింది. ఈ ప్లాన్ తో కొంతమందినైనా నిజం గ్రహించేలా చేసి పూర్తిగా ఈ వ్యసనం నుండి బయటపడేయాలని, వాళ్ళు మళ్ళీ ఎప్పటిలానే వాళ్ల జీవితం హాయిగా గడపాలని నేను కృషి చేస్తున్నాను. 


ఒక విషయం మరిచిపోయాను, మీ ఆయన ప్రతి నెలా ఇచ్చే డబ్బు మీ పాప పేరు మీద డిపాజిట్ చేస్తాను. పాపకు భవిష్యత్తులో ఇబ్బంది వుండదు.. ”అని అన్నాడు విరాజ్. 


“విరాజ్! నేను ఆయన దగ్గర సొమ్ము తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకోలేదు. నీకు తెలుసుగా నా గురించి. ”


“లక్ష్మి! నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఇదంతా ఆయనలో మార్పు కలగాలనే కదా. ”


“అవును. ”అని తలూపి, కాసేపు ఆలోచించిన తర్వాత “విరాజ్! వీర అన్నయ్య సహాయం కారణంగా మనం ఎటువంటి అనుమానం కలగకుండా చేయగలిగాం.. వీర అన్నకు థాంక్స్ చెప్పాలి. ”అని అంది లక్ష్మి. 


“అవును లక్ష్మి, నిజమే. ఈ సారి వచ్చినప్పుడు అతన్ని కలుస్తాను. ఇప్పుడు చిన్న పని వుంది. మళ్ళీ మనం కలుద్దాం.. ” అని చెప్పి బయలుదేరాడు విరాజ్. 

 *********

అక్కడకు రెండు రోజులు తర్వాత, మళ్ళీ ఉద్యోగానికి బయలుదేరాడు తరుణ్.. భర్తను అలా చూసి, సంతోషం తో.. “ఏంటి! ఇంత సడెన్ గా మీలో ఈ మార్పు?.. ” అని అడిగింది లక్ష్మి. 


“నాకు కూడా ఒంటరిగా వుండి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఉద్యోగానికి వెళ్తే కాస్త బాధ్యతగా వుంటుందని ఈ నిర్ణయం. ” అని అన్నాడు తరుణ్ నిజం దాస్తూ. 


ఈ కారణం చేతైనా తన భర్త మళ్ళీ మంచి మార్గంలో నడుస్తాడు అని సంతోషించింది లక్ష్మి. 


 సమాప్తం


 ******

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments


bottom of page