top of page

అరవై రోజులు

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #AravaiRojulu, #అరవైరోజులు, #TeluguHeartTouchingStories


Aravai rojulu - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 07/06/2025

అరవై రోజులు - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది!. ధూళి కణాలను ఆలింగనం చేసుకుంటూ పెంకి గాలులు సుడులు తిరుగుతూ వీస్తున్నాయి. ఒక్కసారిగా పెద్ద పరిమాణం కలిగిన అల్లరి చినుకులు టపటపా కిందకు దిగాయి!.. "చూస్తుంటే పెద్ద వర్షమే తయారవుతుందేమో?. గొడుగు కూడా తీసుకు రాలేదు." అని అనుకుంటూ, చీర కొంగుని తల పై వేసుకుంటూ, తన చేతిలో వున్న మందుల సంచిని, తన హ్యాండ్ బ్యాగ్ లో భద్రంగా పెట్టింది శాంతి.


రెండు అడుగులు వేసే సరికి వర్షం ఎక్కువ అయ్యింది. తొందరగా ఇంటికి చేరుకోవాలని వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. వర్షానికి కింద నేల తేమగా మారడం తో, శాంతి అదుపుతప్పి పడబోయింది. 


ఇంతలో ఒక వ్యక్తి ఆమె రెక్క పట్టి, ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు. 


"దేవుడా!, రక్షించావు." అని ఊపిరి పీల్చుకుంటూ, తనని కాపాడిన వ్యక్తి వైపుకు చూసింది!.

చూడటానికి కొత్త వ్యక్తిలా వున్నారు?. కానీ, ఆ ముఖం ఇంతకు ముందు పరిచయమైన ముఖంలా వుంది!. కానీ, ఎవరన్నది గుర్తుకు రావడం లేదు?. 


"అలా చూస్తారేంటి శాంతి?. వర్షం పడుతుంది, పదండి నేను మీ ఇంటి వైపే వెళ్తున్నాను." అని అంటూ, తన చేతిలో వున్న గొడుగు ఆమె వైపు పెట్టాడు.


"ఆశ్చర్యం!. ఎవరు ఇతను?. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు?.” అని ఆలోచిస్తూ,

"క్షమించండి!, మీరు ఎవరు?." అని అడిగింది ఆశ్చర్యంతో..


"ఏంటి శాంతి!, అప్పుడే మరిచిపోయావా?. నేను సుందరంను!." సమాధానం ఇచ్చాడు అతను.


"సుందరం!." కాసేపు అతన్ని చూస్తూ నిశబ్దం వహించి, కొంత సమయం తర్వాత, 

"ఇలా మారిపోయావు?. చాలా రోజులకు నిన్ను చూడటం అయింది. ఇన్నాళ్లు ఏమై పోయావు?." ఆశ్చర్యం తో అడిగింది సుందరంను గుర్తు పడుతూ.


"అవన్నీ తర్వత, ఇక్కడే వుంటే ఈ గాలికి ఈ గొడుగు ఎగిరి పోయేలా వుంది?. ముందు మనం ఇక్కడ నుండి వెళ్దామా." అని అన్నాడు సుందరం.

"హా, సరే, సరే..." అంటూ ముందుకు కదిలింది.


కొంత సమయం నడిచిన తర్వాత ఇద్దరూ కలిసి శాంతి ఇంటికి చేరుకున్నారు...

"సుందరం!, చూస్తుంటే నువ్వుకూడా బాగా తడిచినట్టు వున్నావు. ఉండు టవల్ తీసుకువస్తాను." అని చెప్పి, లోపలికి వెళ్ళి టవల్ తో తిరిగి వచ్చి సుందరానికి ఆ టవల్ అందించింది..


దాన్ని తీసుకొని, తల తుడుచుకొని,

"శాంతి!, ఎలా వున్నావు?. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు. మీ ఆయన ఎలా వున్నారు?." అని అడిగాడు.


కాసేపు మౌనం వహించి,

"పెద్ద వాడు పై రాష్ట్రం లో స్థిర పడ్డాడు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటాడు. చిన్నవాడు ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని బలాదూర్ గా తిరుగుతున్నాడు. ఆయన మాట అంటావా, అదుగో అలా ప్రాణమున్న జీవచ్ఛవంలా పడివున్నారు. పక్షవాతం కారణంగా అలా అయిపోయారు" లోపల వున్న భర్తను చూపిస్తూ, "ఆయన మందుల కోసమే ఇప్పుడు షాప్ కి వెళ్లాల్సి వచ్చింది. ఇది నా గందరగోళ జీవితం. నా కథ సరే. నీ గురించి చెప్పు. మీ ఆవిడ ఎలా వున్నారు?. మీ పిల్లలు ఏం చేస్తున్నారు?." అని అడిగింది శాంతి.


"నా భార్య నాకు దూరమయ్యి చాలా ఏళ్ళు అయిపోయాయి శాంతి." చెప్తూ కాసేపు మౌనం వహించాడు.


 తర్వాత మళ్ళీ మొదలు పెడుతూ, "పిల్లలు వాళ్ల జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. నా మాట అంటావా, నేను ఒక ఎన్‌జీఓ లో సభ్యునిగా వున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీ గా బోధిస్తాను. మా వాళ్ళు ఈ ఏరియా లో సెంటర్ ఏర్పాటు చేశారు. అరవై రోజులు ఆ కోర్సు టైం. ఇప్పటికే పది రోజులు పూర్తి అయ్యాయి. ఇదుగో నిన్ను మూడు సార్లు చూసాను. కానీ ఈ రోజు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాను. నువ్వు శాంతివే అని." అని సుందరం అన్నాడు.


"మంచిది సుందరం!. ఈ స్నేహితురాలిని ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు. నీ స్నేహాన్ని నేను ఎన్నటికి మరువను..

నిన్ను చూడటం నాకు కొంచం ఆనందంగా వుంది. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు." తన బాధను చెప్పింది.


"బాధపడాల్సిన అవసరం లేదు శాంతి. నేను వచ్చానుగా. మీ ఆయనకి కూడా మంచి ఆయుర్వేద వైద్యం ట్రై చేద్దాం. నాకు తెలిసిన గురువున్నారు. నయం కూడా కావచ్చు." భరోసాగా అన్నాడు సుందరం.


"ఇలాంటి ఆశ కలిగించే మాటలు, చేతలు కేవలం నీకు మాత్రమే సాధ్యం సుందరం!." ఎప్పటి నుండి తనలో దాగిన ఆ చిరునవ్వు పెదాల మీదకు తెస్తూ అంది శాంతి..


"ఊరుకో శాంతి!. నువ్వు ఎప్పుడూ ఇంతే. చిన్న మాట సహాయం చేస్తే ఆకాశానికి ఎత్తేస్తావు." అని నవ్వుతూ అన్నాడు సుందరం..


"సరే, ఎంత సేపు బయట నిలబడతావు. లోపలికి రా. మంచి టీ పెడతాను." అని అంది శాంతి.


"వద్దు శాంతి!, మా గురువు గారు ఒక మాట చెప్పే వారు. ఒంటరిగా స్త్రీ వుంటే ఆ ఇంటిలోకి వెళ్ళకూడదు, అలాగే స్నేహితుడు భార్యతో హాస్యం చేయకూడదని. నేను ఇక్కడే వుంటాను. ఆ టీ ఏదో ఇక్కడికే తెచ్చి పెట్టు..." అని తన వేదాంతం చెప్పాడు సుందరం.


"నువ్వు ఇంకా మారలేదా!, ఇలాంటి సిద్ధాంతాలు ఇలానే ఫాలో అవుతున్నావా?. సర్లే, నీ ఇష్టం." అని అంటూ లోపలికి వెళ్ళింది. కొంత సమయంలో టీ కప్ తో వచ్చి, ఆ టీ ను సుందరం కు ఇచ్చింది..


"ఏంటి సుందరం సంగతలు?. ఇలా ఊరూరూ తిరుగుతూ హ్యాపీగా వున్నావు అయితే.” అంది శాంతి..


టీ తాగుతూ, "అవును, ఒక్కో దగ్గర ఒక్కో అనుభూతి, ప్రతి అరవై రోజులకు ఓ పాఠం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ అరవై రోజులు ఇక్కడ. ఇదొక అనుభూతి."


"అబ్బో!.” అని నవ్వుతూ అంది ఆమె.


"శాంతి!, నీకో మాట చెప్పాలి. ఇది ఇప్పటిది కాదు ఎప్పటిదో." ఆమె వైపు చూస్తూ అన్నాడు సుందరం..


సుందరం మాటకు అంతరార్ధాన్ని గ్రహించి, కాసేపు ఆలోచించి,

"సుందరం! నాకు తెలుసు. నీ మిత్రుడు తర్వాత నాకు అంతా వివరించాడు. నువ్వు నన్ను ప్రేమించావన్న సంగతి తెలుసు. ఆ విషయం నాకు చెప్దామని నా దగ్గరకు వచ్చావన్న సంగతి నీ మిత్రుడు రాము చెప్పాడు. కానీ మా నాన్న మీద గౌరవం తో అతనికి నువ్వు బాగా పరిచయం కారణంగా అతను నా పెళ్లి గురించి పెట్టుకున్న ఆశలు అతని ద్వారా విని నీ ప్రేమ ను అక్కడే వదిలేసి వచ్చావన్న సంగతి తెలుసు.."


శాంతి చెప్పింది విని, టీ తాగకుండా ఆశ్చర్యంతో చూస్తున్నాడు.

"ముందు ఆ టీ తాగు, చల్లారిపోతుంది.” అని శాంతి అనడం తో, టీ తాగడం పూర్తి చేశాడు...


"సుందరం నిజానికి నువ్వంటే నాకు ఇష్టమే. కానీ నీకంటే మా నాన్న అంటే ఇంకా ఇష్టం. అతను నాకోసం చేసిన దాని ముందు ఏ ప్రేమ నిలబడదు. అందుకే అతని మాటకి ఎదురు చెప్పలేక పోయాను. సుందరం! డైలాగ్ పాతదే అయినా ఇది నిజం, ప్రేమిస్తే కలవాలని లేదు. ఒకవేళ కలవలేక పోతే ఆ ప్రేమ పోదు. అన్నిటికంటే మన స్నేహం ఎప్పటికీ పోదు. ఇప్పుడు నాకు సర్వస్వం నా భర్తే. ఇప్పుడు ఆయనకు అనారోగ్యం అయిందని, అతను ఈ స్థితిలో వున్నాడని వదులుకోలేను. మా బంధం ఎప్పటికీ దూరం కాదు. ఆ చావు దూరం చేస్తే తప్ప." అంది శాంతి....


"శాంతి, నీ సంగతి నాకు తెలియదా?. నాకు తెలుసు. నాదే పొరపాటు. ఆ విషయం ఇప్పుడు అనవసరంగా నీకు గుర్తు చేశాను."


"సుందరం!, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు కదా. మరి ఎందుకు అలా ఫీల్ అవ్వడం?. మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే" అని అంది శాంతి.


ఇంతలో అక్కడకు చేరుకున్నాడు చేతన్. 

కొడుకు అక్కడకు చేరుకోవడం తో,

"రేయ్ చేతన్ వచ్చావా?. ఇంత వరకు ఎక్కడ వున్నావు?.” అని అడిగింది శాంతి.


కానీ సమాధానం చెప్పకుండా ముందుకు అడుగు వేయబోయి తూలి పోయాడు. పక్కనే వున్న సుందరం అది గమనించి అతన్ని పట్టుకున్నాడు. శాంతికి పరిస్థితి అర్ధం అయ్యింది. "వీడు మళ్ళీ తాగి వచ్చాడు. అసలు వీడిని ఇంటిలోపలికి రానివ్వకూడదు. రేయ్ బయటకు నడు." అని అరిచింది శాంతి. 


పరిస్థితి గమనించిన సుందరం శాంతిని వారించి, కొడుకు ను లోపలికి తీసుకు వెళ్ళమన్నాడు. కొడుకును పట్టుకుంది. కానీ, అతన్ని తీసుకు వెళ్ళడం తన వలన కావడం లేదు. ఇక తప్పదు అనుకొని ఇంటిలోపలికి తీసుకువెళ్లడానికి సహాయం చేశాడు సుందరం. ఇద్దరూ కలిసి చేతన్ ను రూం లోపలికి తీసుకు వెళ్ళారు. 


"ఇది సుందరం వీడి వరుస." వాపోతూ అంది శాంతి.


"శాంతి! బాధపడకు. నేను రేపు వచ్చి చేతన్ తో మాట్లాడుతాను." అని చెప్పి అక్కడ నుండి కదిలాడు సుందరం.


మరుసటి రోజు శాంతి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి చేతన్ ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఏదో ఆలోచనలో వున్నాడు. సుందరం ను చూసి ఏమీ అనలేదు. సుందరం చొరవ కల్పించుకొని, "హాయ్ చేతన్, నేను మీ అమ్మ స్నేహితుడ్ని. నీకు కూడా స్నేహితుడ్ని అనుకో. నీ గురించి తెలిసింది. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?. ఆ ఉద్యోగం కాకపోతే నేను నీకు ఉద్యోగం చూస్తాను." అని భరోసాగా అన్నాడు సుందర్.


సుందరం ఆ మాట అనగానే ఒక్కసారిగా సుందరం వైపు చూసి, "మొదటి సారి నాతో ఒక వ్యక్తి పాజిటివ్ గా మాట్లాడారు, అది మీరే. ఇన్నాళ్లు ఉద్యోగం కోసం తిరిగాను దొరకలేదు. స్నేహితులని అడిగాను వాళ్ళు కూడా నన్నే తప్పుబట్టారు, కానీ సహాయం చేయలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ మీరు మాత్రం నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నారు. మీ మాటలు నాకు భరోసా కలిపిస్తున్నాయి." అని అన్నాడు చేతన్.


చేతన్ తన దారిలోకి వచ్చాడు అని గ్రహించి, జరిగింది మొత్తం చేతన్ ను అడిగి తెలుసుకున్నాడు. చేతన్ కు ఓర్పు తక్కువని అతనితో మాట్లాడిన తర్వాత తెలిసింది. దాని కారణంగా ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలుసుకున్నాడు సుందరం. 


"సరే చేతన్. నీకు కంప్యూటర్ స్కిల్స్ బాగా వున్నాయని నాకు అర్థం అయ్యింది. అయితే నువ్వు ఒక యాభై రోజులు నాతో కలిసి పని చేస్తావా?. అయితే నువ్వు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది, ఓపిక పట్టాల్సి వుంటుంది. బలవంతం ఏమీ లేదు. నీకు ఇష్టం అయితేనే."


కొంత సమయం ఆలోచించి, "సరే, చేస్తాను." అని ఒప్పుకున్నాడు చేతన్. 


తర్వాత రోజు నుండి తనతో పాటు చేతన్ ను తీసుకు వెళ్లి, పిల్లలకు కంప్యూటర్ పాటలు చెప్పించే వాడు సుందరం. చేతన్ కూడా శ్రద్ధగా పాఠాలు చెప్పేవాడు. చేతన్ మెల్లగా దారిలోకి వస్తున్నాడని గ్రహించాడు సుందరం. అలా యాభై రోజులు పూర్తి అయ్యేసరికి చేతన్ కు తన తప్పేమిటో తెలిసింది. ఇక మీద ఓర్పు తో మసులు కుంటే జీవితం సాఫీగా సాగుతుందని తెలుసుకున్నాడు. 


మరుసటి రోజు ఒక లెటర్ తెచ్చి చేతన్ చేతిలో పెట్టాడు సుందరం. దాన్ని ఆశ్చర్యం తో తీసి చూశాడు చేతన్. అది తనకు ఉద్యోగం వచ్చిందని తెలిపే ఆఫర్ లెటర్. పైగా తను పోగొట్టుకున్న ఉద్యోగం.


ఆశ్చర్యం తో సుందరం వైపు చూసాడు.


"నువ్వు పని చేస్తున్న కంపెనీ యజమాని నాకు మిత్రుడు చేతన్. నీ గురించి అతనితో మాట్లాడాను. ఇది నీకు చివరి అవకాశం. నిలబెట్టుకోవడం నీ చేతిలోనే వుంది. చేతన్ ఏ సమస్య అయినా కాస్త ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పోతుంది. అలా కాకుండా కోపంలో నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది.”అని అన్నాడు సుందరం.


"చాలా థాంక్స్ అంకుల్. తప్పకుండా దీన్ని నిలబెట్టు కుంటాను." అని అంటూ సుందరం ను కౌగలించుకున్నాడు. 


"చేతన్!, ఈ లెటర్ పట్టుకొని వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఇక పై ఎప్పుడు కూడా వాళ్ళను బాధ పెట్టకు. మీ నాన్నగారి పట్ల శ్రద్ధ వహించు. మీ అమ్మకు తోడుగా ఉండు." అని చివరి మాటగా చెప్పాడు సుందరం.


సుందరం అక్కడకు వచ్చి అరవై రోజులు పూర్తి అయ్యాయి. ఇంతకు ముందు కలిగిన అనుభూతి కంటే ఈ అరవై రోజుల్లో కలిగిన అనుభూతి చాలా ప్రత్యేకమైంది. పైగా తన స్నేహితురాలికి ఏదో చిన్న సహాయం చేసానని మనసులో తెలియని హాయి తనకు కలిగాయి.


సమాప్తం..


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


1 comentário


అరవై రోజులు కథ బాగా వ్రాశారు👌👌👌

మీకు అభినందనలు💐💐

Curtir
bottom of page