నిజాయితీపరుడు
- Dr. C S G Krishnamacharyulu
- Jun 7
- 4 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #Nijayitheeparudu, #నిజాయితీపరుడు, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Nijayitheeparudu - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 07/06/2025
నిజాయితీపరుడు - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో చెట్టు క్రింద నిరీక్షిస్తున్నాడు రంగబాబు. అతనికి చికాకుగా వుంది. పదకొండైనా అతని పనికి సంబంధించిన వుద్యోగి రాలేదు.
"ట్రాఫిక్ సార్! లేకుంటే పదిగంటలకే ఠంచనుగా వచ్చేస్తారు. మీరు ఆదుర్దా పడకండి. రాగానే మా లక్ష్మీపతి సారు, మీ పని వెంటనే చేసేస్తారు. మీరీ సాయంత్రమే మీ వూరు వెళ్ళిపోవచ్చు" అని ఆ వుద్యోగిని వెనకేసుకొచ్చాడు బ్రోకర్.
"ఏం ట్రాఫిక్కో, ఏమో! ఇదే మా కాలేజిలో అయితే లీవు మార్క్ చేస్తారు. ఇదొక బజారు. వచ్చేవాడూ పోయేవాడూ. క్రమశిక్షణా, కమిట్మెంటు శూన్యం, ఒక పద్ధతి లేదు. బాధ్యత లేదు" అని చులకనగా అన్నాడు రంగబాబు.
అతని మాటలకు బ్రోకర్ నొచ్చుకున్నాడు. ఎంతైనా అతను ఆ గూటి పక్షి కదా! అందుకే త్రిప్పి కొట్టాలని ఇలా అన్నాడు. "సర్! ప్రైవేట్ అంటేనే దోపిడీ కద సర్! క్రమ శిక్షణ పేరిట వుద్యోగుల శ్రమ దోచేస్తారు."
రంగబాబు కొంచెం ఆవేశపడుతూ, ప్రైవేటుని వెనకేసుకొచ్చాడు.
"ప్రభుత్వాలు మాత్రం తీసిపోయేయా, ప్రతి పనికి లంచం తీసుకోవడంలా? బడా రాజకీయ నాయకులు, అధికారులు, గుమాస్తాలు, అందరికీ డబ్బే ముఖ్యం. పేరుకు ప్రజా సేవకులం అని ప్రకటనలు చేస్తారు"
అతని మాటలకు బ్రోకరుకు నవ్వు వచ్చింది. అవకాశం వుంటే ఆయన మాత్రం చేతులు చాపడా అని అనుకుంటూ," సార్!, లంచం మాటే ఎత్తకండి. ఈ పాడు గాలి, మన మాటలని మోసుకుపోయి ఏ ఎసిబి వారి చెవినో వేస్తుంది. ఇక్కడ నిజాయితీకి పట్టం కట్టారు "
రంగబాబు నవ్వుతూ " నీకు నవ్వించే గుణముందోయ్! నమ్మశక్యం గాని మాట చెబుతున్నావు.”
బ్రోకర్ కూడా నవ్వులు చిందిస్తూ, "అయ్యో అదేం కాదు సర్! చూడండి ఆ నినాదాలు. అని ఆవరణలో గోడ మీద వ్రాసివున్న నినాదాలను చదివాడు.
“లంచం పుచ్చుకోవడమెంత నేరమో ఇవ్వచూపడం అంతే నేరం”.
“లంచం అనేది ప్రజాస్వామ్యానికి శత్రువు.”
“లంచం అనేది అవినీతికి ఒక రూపం, దీనిని తొలగించాలి.
నిజాయితీ మా ప్రాణం,మా ఊపిరి.”
రంగబాబు పరిహాసంగా నవ్వుతూ " ప్రభుత్వంలో నీతి అన్నది,నేతి బీరకాయలో నేయి వంటిది. నినాదాలు గోడ పైని వ్రాస్తే సరా ! అవి బుద్ధిలో వుండాలిగానీ! “ అని ఎద్దేవా చేసాడు.
బ్రోకర్ విసిగిపోయి, బ్రహ్మాస్త్రం సంధించాడు. "సర్! మీరిలా నిందలేస్తే పనులెలా జరుగుతాయి?"
ఆ మాటకి రంగబాబు నోరు కుట్టేసుకున్నాడు. పనయ్యేవరకు సహనంగా వుండాలని నిశ్చయించుకున్నాడు. కొద్ది సేపు వచ్చేవారిని, వెళ్ళేవారిని చూస్తూ గడిపేసాడు.
ఆయన్ని చూసి బ్రోకరుకి జాలి కలిగిందనుకుంటా, "ఎండలు మండిపోతున్నాయ్ సర్! శరీరం చెమటతో తడిసిపోతోంది. మీకు కష్టంగా వుందనుకుంటా" అని సానుభూతి చూపించాడు.
"అవునయ్యా! ఆ సూర్యుడు ప్రభుత్వోద్యోగి కాదు కదా! పంచాంగంలో చెప్పినట్లు టంచనుగా వస్తాడు, తన పని చేసుకుని వెడతాడు." అని మళ్ళీ ఒక చురక అంటించి, నాలుక కొరుక్కున్నాడు.
"అలా సూర్యాని పొగిడేయకండి. మబ్బులొస్తే, కబుర్లాడుతూ ఆయన అదృశ్యం కాడా? మా వుద్యోగస్తులూ అంతే పనిబడితే లేటుగా వస్తారు. కానీ నిజాయితీగా పనిచేసుకుని వెళ్ళిపోతారు. అయినా ఎందుకు సర్! వుద్యోగులని చిన్న చూపు చూస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా!"
అతని మాట ముగిసే లోపు లక్ష్మీపతి వచ్చాడు. ఒక అరగంటపాటు, అటూ ఇటూ తిరిగాక సీటులో కూర్చున్నాడు. బ్రోకర్, రంగబాబు పని గురించి చెప్పి, రంగబాబుని రమ్మని పిలిచాడు.
లక్ష్మీపతి ఎంతో ప్రసన్నత ప్రదర్శిస్తూ, "బర్త్ సర్టిఫికేటులో మీ అబ్బాయి పేరు అసంపూర్ణంగా వుందా? అలా ఎలా జరిగింది?” అని అడిగాడు.
"పుట్టగానే ఆస్పత్రిలో రాజా అని మా తాత పేరు వ్రాయించాను. మా ఆవిడ శివ భక్తురాలు. అందువల్ల స్కూల్లో చేర్చేటప్పుడు శివ ప్రసాద్ అన్న పేరు తగిలించింది. అందువల్ల జనన ధృవ పత్రంలో పేరుని రాజా శివప్రసాద్ గా మార్చాలి."
"పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చారేం? అప్పుడే రావాలి కదా?"
"ఇంతవరకు అవసరం లేదనుకున్నా. నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. నీట్ పరీక్షప్పుడు దీని అవసరం వుంటుందన్నారు. నేను చదువుకునే రోజుల్లో సర్టిఫికేట్లని, కార్డులని గోల లేదు. హైస్కూల్ పత్రాలతో పనైపోయేది. లేదంటే ఒక అఫిడవిట్ యిమ్మనే వారు. ఇప్పుడు కార్డుల రాజ్యం నడుస్తోంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్ద్, ఓటర్ కార్డ్, అన్నీ కలిపి ఇంకో కార్డ్ అంటున్నారు. మొదట అన్నిపనులకు ఆధార్ అన్నారు. ఇప్పుడు కాదంటున్నారు. ఒకటి చూపిస్తే, అది లేదా అని ఇంకో కార్డ్ అడిగి ప్రాణం తీస్తున్నారు”.
"నిజమేనండి. డెబిట్ కార్డుని, క్రెడిట్ కార్డుని మర్చిపోయారు. ఏదో ఒకటి లేకుంటే పని జరగదు." అని లక్ష్మీపతి తన పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేసాడు.
"ఈ కార్దుల్లో పేరు ఒకేలా లేకుంటే తిప్పలే. ఇంటిపేరు చదలవాడ అయితే సి అని ఒకడు సి. హెచ్ అని ఒకడు వ్రాస్తాడు. పూర్తిగా రాయవయ్యా అంటే అక్కర లేదంటాడు. రాసినా తప్పు రాస్తాడు. భలే కష్టమవుతోంది. రోబోలు వస్తే బాగుణ్ణు". రంగబాబు గొంతులో చికాకు ధ్వనించింది.
"అంత మాట అనకండి. మా గతేమిటి? ముఖ్యంగా మా నిజాయితీ సంగతేమిటి?" అని లక్ష్మీ పతి ఆత్మ రక్షణలో పడ్డాడు.
తనన్న మాట అప్రియమైనదని గ్రహించి, లక్ష్మీపతిని వుబ్బేసేలా రంగబాబు "మీరెంత నిజాయితీ పరులో తెలుసుకునే వచ్చాను." అని అన్నాడు..
లక్ష్మీపతి ప్రసన్న వదనంతో, “మీ అభ్యర్ధన పత్రం, యిచ్చి వెళ్ళండి. వారం రోజుల్లో పేరు మార్చిన పత్రం కొరియరులో మీ యిల్లు చేరుతుంది." అని, నమ్మబలికాడు.
"నేను రానక్కరలేదా" విస్మయంగా అడిగాడు రంగబాబు.
"ఎందుకు?. పేరు మార్చిన పత్రం వీడియో లో చూపిస్తాను. మీరు ఓకే అన్నాకే సంతకాలు పెట్టించి పంపిస్తాను. మా నిజాయితీకున్న బలం అలాంటిది " అంటూ లక్ష్మీపతి అభ్యర్ధన అందుకున్నట్లు రసీదు యిప్పించాడు.
అది ఒక కవరులో పెట్టి,” ఈ కవరు జాగ్రత్త. అలా మీ సంచీలో పెట్టుకోండి. నా ఫోన్ నంబర్ అందులో రాసాను. మీరు వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చెయ్యండి.ఈ లోగా మీ పనైపోతుంది. కవరు జాగ్రత్త!" అని చెప్పాడు.
"మీరెంత మంచివారు." అని రంగబాబు మనసారా అభినందించాడు.
"నా మంచితనం గుర్తించినందుకు మీకు పదివేల నమస్కారాలు.” అని చేతులు జోడించాడు లక్ష్మీపతి.
" పదివేల నమస్కారాలు." అని రంగబాబు ఆనందంగా బయటికి వచ్చి బ్రోకర్ ని కలిసి రెండొందల రూపాయలు అతని చేతిలో పెట్టి, "థాంక్సయ్యా. ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారంటే నమ్మలేకున్నాను" అన్నాడు.
అతని మాటలో వున్నది ప్రశంసో, వ్యంగమో అర్ధం కాక, బ్రోకర్ తెల్ల మొగంవేసి, వెకిలి నవ్వొకటి నవ్వాడు.
ఎంతో సంతోషంగా రంగబాబు యిల్లు చేరాడు. కష్టమవుతుందనుకున్న పని చిటికెలో చేసి పంపిస్తానన్న లక్ష్మీపతిని, బ్రోకర్ ని గుర్తు తెచ్చుకుని, వారికి మంచి చేయమని దేవుడిని ప్రార్ధించాడు.
@@@
వారం రోజులు గడిచాక, రంగబాబు వీడియో కాల్ చెయ్యడానికి, ఫోన్ నంబరుకోసం, కవరు తెరిచి చూసాడు. అందులో రసీదు తో బాటు మరో కాగితముంది. అందులో “ఈ జిపే నంబరుకు పదివేలు పంపండి. మీకు సర్వత్రా విజయం లభిస్తుంది.” అని వ్రాసి వుంది. ఆ వుద్యోగి నిజాయితీకి రంగబాబు నిశ్చేష్టుడయ్యాడు. బ్రోకర్ కి ఫోన్ చేసి “మంచి నిజాయితీ పరుడిని పరిచయం చేసావు” అని నిష్టూరంగా అన్నాడు.
"సర్! ఆఫీసుకి రావడానికి. ఉదయమే లేచి, ట్రాఫిక్కులో రావాలి. సాయంత్రం దాకా కుర్చీలో కూర్చోవాలి. ఆయన కష్టం గుర్తించండి. పదిహేను సంవత్సరాల క్రితం రికార్డ్, వెదకి తీయాలి, బూజు దులపాలి, క్రొత్త పేరు వ్రాయాలి. కనీసం పదిహేను అన్నాడు. పాఠాలు చెప్పే పంతులు గారు, గౌరవం వుండాలి, పది చాలే అని పదికి ఒప్పించాను" అని బ్రోకర్ అనునయంగా చెప్పాడు.
వినేవాడుంటే యేమైనా చెప్తాడనుకుని, రంగబాబు, కవరులోని ఫోన్ నంబరుకు పదివేల రూపాయలను జీపే చేసాడు.
“దేశాన్ని పాలించే రాజకీయ నాయకులకే లేని నీతి. ఒక సామాన్య వుద్యోగిలో కోరుకోవడం అసమంజసం. వాళ్ళు తీర్చని వాగ్దానాలకే ఓట్లు దండుకుంటుంటే, పని చేసి పెట్టిన వీడిని నిజాయితీపరుడు కాదనడం సరి కాదు" అనుకుని, రంగబాబు, గాఢంగా నిట్టూర్చాడు.
@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
ఈనాటి నిజాన్ని చెప్పారు.కథ బాగుంది.😀
“దేశాన్ని పాలించే రాజకీయ నాయకులకే లేని నీతి, ఒక సామాన్య వుద్యోగిలో కోరుకోవడం అసమంజసం. వాళ్ళు తీర్చని వాగ్దానాలకే ఓట్లు దండుకుంటుంటే, పని చేసి పెట్టిన వీడిని నిజాయితీపరుడు కాదనడం సరి కాదు"
ఈ చివరి వాక్యం కథ మొత్తం సారాంశాన్ని చెబుతుంది. దశబ్దాలుగా ప్రజలు ప్రభుత్వ ఆఫీసు పనుల్లో అనుభవిస్తున్న బాధలను చాలా స్పష్టంగా చెప్పారు కథలో. మీకు ధాన్యవాదములు.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తమ స్వలాభాలకోసం నీతి నిజాయితీలకు తిలోదకాలు ఇస్తున్నారు అనే నగ్నసత్యం కధకు కొసమెరుపుగా చెప్పడం నేటి సమాజపరిస్ధితికి అద్దం పట్టినట్టుగా ఉంది.
రచయితకు అభినందనలు
@chengalvalasarada
•3 hours ago
The story had reflected the reality in present society ❤
Reflections of the true work culture in Government offices in India lacking transperancy and accountability.. Congratulations to the author and his understanding 👏👏👏