top of page

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 8

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 8 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 03/06/2025

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక

రచన: వేలూరి ప్రమీలాశర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ..


సునీల, దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్ లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు.


రైల్వే స్టేషన్ లో  'అబద్ధం' అనే అనాధ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఆప్యాయంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది. స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ. అందులో సుదతి, సునీల చేరుతారు.


తన కూతురు సురభికి వేరే సంబంధాలు చూడాలనుకుంటాడు తేజ మేనమామ గోపీకృష్ణ. కనపడకుండా పోయిన సునీలను ట్రాకింగ్ డివైస్ సహాయంతో వెతకడానికి వెళ్తాడు తేజ.


ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 8 చదవండి. 


కారుకి అడ్డంగా వచ్చిన పందుల గుంపు తొలగిపోయేవరకూ ఆగాల్సివచ్చిన తేజ… అసహనంతో గట్టిగా కార్ హారన్ మోగించడం మొదలుపెట్టాడు. రోడ్డు మీద ఒక వెహికిల్ ఆపితే, పక్కనుండి మరో వెహికిల్ వెళ్లలేనంత ఇరుగ్గా ఉంది ఆ మార్గం. కంకర, బురదతో నిండివున్న ఆ ప్రదేశంలో పందుల సంచారం వల్ల వెలువడుతున్న వాసనకి ముక్కుకి చెయ్యి అడ్డుపెట్టుకున్నాడు తేజ. 


కారు డోరు తీసి, కాలు బయట పెట్టేంతలో, కిందనుంచి నాలుగడుగుల జెర్రిగొడ్డు మెలికలు తిరుగుతూ, వేగంగా వెళ్ళడం గమనించి, కాలు కారులోపలకి వెనక్కి తీసుకున్నాడు. తలెత్తి, ఇందాక కనిపించిన రెడ్ డ్రెస్ అమ్మాయికోసం చూస్తే, ఆమె అక్కడ కనిపించలేదు. ఉన్న ఒక్క ఆధారం కాస్తా చెయ్యిజారిపోయినట్టు అనిపించి, ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. కొంచెం ముందుకి నడిచి అక్కడ ఉన్న గడ్డివాము వెనక్కి వెళ్లి చూసాడు. 


బర్రెల్ని కాసే బుడతడు, దూరంగా చేల గట్లమీదకి వాటిని తోలి… తీరిగ్గా కూనిరాగాలు తీస్తూ, కునికిపాట్లు పడుతున్నాడు. 


"బాబూ! ఇందాక ఇక్కడ ఓ అమ్మాయి కూచునివుండాలి… ఇటేమైనా వచ్చిందా?" ఆతృతగా అడిగాడు తేజ. 


"ఉస్… అబ్బా!" అనుకుంటూ, మోచేతి వెనక పట్టిన నల్ల కండచీమను, చేత్తో పట్టుకుని దూరంగా విసిరేస్తూ లేచి నుంచున్నాడు ఆ బుడతడు.


"బాబూ! నిన్నే… ఇటువైపుగా ఎవరైనా అమ్మాయి…" ఆ కుర్రాడు ఏ సమాధానం చెప్పకపోవడంతో మళ్లీ తనే అడిగాడు తేజ.

పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడ్డం ఇష్టంలేనట్టు మొహం పక్కకి తిప్పుకున్న వాడిని చూస్తే ఒళ్ళుమండింది. నిభాయించుకుని మరోసారి అడిగాడు. 


చెప్పక తప్పేట్టు లేదన్నట్టు, చెయ్యిచాచి దూరంగా, కుడివైపుగా చూపించాడు ఆ కుర్రాడు. ఒక్కక్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అటువైపుకి పరుగుతీసాడు తేజ. ఏపుగా పెరిగిన వరిపైరు, ఒక పక్కకి గాలికి వంగి, నేలను తాకుతూ తన్మయత్వంతో తలాడిస్తోంది. చల్లటి ఆ పైరగాలిని ఆస్వాదించే మూడ్ లేని తేజ, గాభరాగా ఆ ప్రదేశాన్నంతా కలియజూసాడు. దూరంగా మోటారు పంపుకింద దోసిలితో నీరుపట్టి తాగుతున్న ఆమెను చూడగానే ప్రాణం లేచివచ్చింది. నాలుగంగల్లో ఆమెను చేరాడు.


 "హాయ్! నా పేరు తేజ! మీ ఫోన్ కి కాల్ చేస్తున్నది నేనే. మీరెవరో నాకు పరిచయం లేదు. కానీ మీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇంతకుముందు మీతో మాట్లాడింది నేనే. అసలు మీరెవరు? నాకెందుకు కాల్ చేసారు?" అడుగుతూనే, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సునీల కనిపిస్తుందేమోనని కళ్ళతోనే వెతుకుతున్నాడు. 


తన పలకరింపుతో చేతుల్లో ముఖం దాచుకుని, బిగ్గరగా ఏడుస్తున్న ఆమెని చూసి నివ్వెరపోయాడు.


"ఏమైంది? అయ్యో! ఎందుకేడుస్తున్నారు? మీకేదైనా కష్టం కలిగితే ఓ అన్నలా నేను సాల్వ్ చేస్తాను. ఏడవకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి… భయపడొద్దు. నా వల్ల మీకే హానీ జరగదు. మీరు నా నంబర్ కి కాల్ చెయ్యడం వల్ల, మా సునీల ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనన్న ఆశతో ఇంతదూరం వచ్చాను. ప్లీజ్… ఆమెకి ఏమైంది? ఎవరివల్లా ఏ ప్రమాదం జరగలేదు కదా!" ఆమెను ఓదారుస్తూనే సునీల గురించి అడిగాడు తేజ.


"నా పేరు మీనా… మీనా కుమారి. క్లాసెస్ కి అటెండ్ అయ్యి ట్రైన్ లో వస్తున్న నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఎక్కడికి తీసుకువెళ్లారో, ఎన్నాళ్లయ్యిందో ఏమీ నాకు గుర్తు లేదు. నలుగురైదుగురు వరకూ ఉన్నారు. నేను స్పృహలోకి వచ్చిన ప్రతీసారీ నాకు మత్తుమందు ఇస్తూ వచ్చారు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నడవలేకపోతున్నాను. చాలా ఆకలిగా, నీరసంగా ఉంది" వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతున్న ఆమె… వారిని ప్రతిఘటిoచలేకపోయిందని తేజకి అర్థమయ్యింది. 


"భయంలేదు. నేనున్నాను. ఇంకేమీ కాదు. కాస్త ధైర్యం తెచ్చుకోండి. అసలేమయ్యిందో… మీరిక్కడకి ఎలా వచ్చారో చెప్పండి. అదే కాదు. మీరు మాట్లాడిన ఈ మొబైల్ నుంచే గంట క్రితం మా సునీల కూడా మాట్లాడింది. అసలు తనకోసమే నేను వెతుకుతున్నాను. సునీల ఏమయ్యింది? అసలు ఆమె మాట్లాడిన ఫోన్ మీదగ్గరకి ఎలా వచ్చింది… అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను… భయపడకండి" అంటూ లాలనగా ఆమె తలమీద చెయ్యివేసి ధైర్యం చెప్పాడు. 


"వాళ్ళు… వాళ్ళు మళ్లీ వచ్చేస్తారేమోనని భయంగా ఉంది. ముందు ఇక్కడ్నుంచి నేను ఎక్కడికైనా వెళిపోవాలి. నేనిప్పుడేమీ చెప్పలేను. నాకంతా గజిబిజిగా ఉంది. ఎంత ఆలోచిస్తున్నా కొన్ని గుర్తుకురావట్లేదు. నేనెక్కడికీ వెళ్ళాలో కూడా తెలీడంలేదు. మీరు… మీరు కారులోనే వచ్చారా?" ఆయాసపడుతూ అడిగింది మీనాకుమారి. 


"నో… ముందు మా సునీల ఏమయ్యిందో తెలిసేవరకూ నేనిక్కడినుంచి కదల లేను. ఏమీ అనుకోవద్దు. కొంచెం ఓపిక పట్టండి. మీకే ప్రమాదం జరక్కుండా నేను చూస్తాను. నన్ను నమ్మండి. ప్లీజ్ మా సునీల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. మీరు తప్ప నాకు ఏ ఆధారమూ లేదు. దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇక ఆలస్యం చెయ్యడానికి లేదు" అభ్యర్థనగా అడిగాడు తేజ.


"మీరు అడుగుతున్న ఆ సునీల ఎవరో నాకు తెలీదు. కానీ ఒకమ్మాయి మాత్రం నాలాగే ఆపదలో ఉండడం గమనించాను. ఆమెను కూడా నాలాగే ఎవరో కిడ్నాప్ చేసారనిపించింది. కానీ నేనామెకు సహాయం చేసే పరిస్థితిలో లేను" గాభరాగా చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారేమోనని గమనిస్తూనే చెబుతోంది మీనా కుమారి. 


"ఇట్స్ ఓకే. నేను వచ్చాను కదా. ఇక ఏమీ కాదు. ఎక్కడున్నా సునీలను వెతికి పట్టుకుంటాను. చిన్న హెల్ప్ చెయ్యండి చాలు. మా సునీల మీకు ఎక్కడ కనపడిందో చెప్పండి చాలు" 


"ఆమె ఎటువెళ్లిందో నేను గమనించలేదు. బర్రెల సావిడి దగ్గర మాత్రం చూసాను. అక్కడికి నన్ను తీసుకొచ్చిన వాళ్ళలో ఒకతను, ఇందాక ఆమెతో ఏదో వాదులాడటం, దుర్భాషలాడటం గమనించాను. ఆమె కోపంతో వాడి చెంప పగులకొట్టింది. చెవికి ముందువైపు తగలడంతో, ఒక్కసారిగా మైకం కమ్మినట్టు ముందుకి పడిపోయాడు. నేను దూరంగా పరిగెత్తి చెట్ల చాటుకి దాక్కున్నాను. ఆమె.. వాడి జేబులోంచి ఫోన్ తీసి, ఎవరికో కాల్ చేసింది. 


బహుశా మీకే అయ్యుంటుంది. ఆమెకి కూడా వాళ్ళు మత్తుమందు ఇవ్వడం వల్ల, సరిగా నిలబడలేకపోతోంది. తర్వాత అటువైపుగా కారు వస్తున్న శబ్దానికి ఆమె అక్కడ్నుంచి పారిపోయింది. నలుగురు వ్యక్తులు అక్కడ చాలాసేపు వెతికి, ఆ అమ్మాయీ, నేనూ కూడా కనపడకపోవడంతో, వాళ్ళ మనిషిని తీసుకుని వెళ్లిపోయారు" అంటూ జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పింది మీనాకుమారి. 


అంతా విన్న తేజ, దీర్ఘంగా నిట్టూర్చాడు. నొసలు రుద్దుకుంటూ… "అయితే మా సునీల కోసం నేను కాల్ చేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారన్నమాట. ఓహ్ గాడ్! ఇప్పుడు తను ఎక్కడున్నట్టు?" కళ్ళు మూసుకుని, బాధగా తల విదిలించాడు తేజ. 


"తెలియదు. నేనుమాత్రం ఇటువైపుగా వచ్చేసాను. ఇక్కడ్నుంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది. నాకు మీ హెల్ప్ కావాలి… ప్లీజ్" చేతులు జోడించి అడుగుతున్న ఆమెను తన కారులో ఎక్కించుకున్న తేజ, ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్లలేకపోయాడు. 


"సునీల ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండి ఉంటుంది. తను దొరికేవరకూ నేను ఇక్కడ్నుంచి కదిలేది లేదు" అంటున్న తేజ మాటలకు, ఏం చెయ్యాలో తెలీక, మౌనంగా మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది మీనాకుమారి.


'సునీల ఎక్కడున్నదీ జీపీయస్ కనెక్ట్ అవ్వట్లేదంటే, ఆమె చేతికున్న డివైజ్ ఎక్కడో పడిపోయి ఉండాలి. నో… తప్పు చేశాను. పాస్ కోడ్ యూజ్ చేస్తే తప్ప, డివైజ్ ఊడిరాని విధంగా ప్రోగ్రామింగ్ చేసి ఉండాల్సింది… ఇప్పుడు తెలుస్తోంది… ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లలకు ఈ డివైజ్ ధరించడం ఎంత అవసరమో. నా ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి అందరికీ అవగాహన కల్పించాలి' మనసులోనే దృఢంగా అనుకున్నాడు తేజ. 

***************

సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు దిగిన సురభి నేరుగా సుదతికి కాల్ చేసి, ఆమె ఇంటికి బయల్దేరింది. 


"మీరూ!?… మీరు సురభియే కదూ! సారీ. నేను కొంచెం టెన్షన్ లో ఉండడం వల్ల స్టేషన్ కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేస్కోలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ప్లీజ్ కమిన్" లోనికి దారితీస్తూ చెప్పింది సుదతి. 


"అయ్యో! మరేం పర్లేదు. అసలు మీకు ముందుగా ఇంటిమేట్ చెయ్యకుండా నేనే డైరెక్ట్ గా వచ్చేద్దామనుకున్నాను. కానీ నాతో మా డాడీ కూడా ఇదే ట్రైన్ లో వచ్చారు. దగ్గరుండి ఆయనే నన్ను ఆటో ఎక్కించారు. ముందుగా మీకు కూడా ఓ మాట తెలియజేసి బయల్దేరమంటేనూ… తప్పలేదు. 


మీరు అసలే వర్రీడ్ గా ఉంటే, నేనొచ్చి ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమోనని చాలా ఆలోచించాను. కానీ, మీ సిస్టర్ మిస్సింగ్ గురించి విన్నాక ఉండలేక నేనూ వచ్చేసాను" ఆప్యాయంగా చెబుతున్న సురభిని ప్రేమగా హగ్ చేసుకుని, ఇంట్లోకి తీసుకువెళ్లింది సుదతి.


"అవునూ! మీతో మీ ఫాదర్ కూడా వచ్చారన్నారు కదా… ఆయన్ను కూడా మా ఇంటికి తీసుకురావాల్సింది"


"నో నో… నాన్న నాతో రాలేదు. నేనే ఆయనతో వచ్చాను. అదే… మీకు చెప్పలేదు కదూ! మా నాన్నగారు రైల్వే గార్డ్. గౌతమి ఎక్స్ప్రెస్ లో ఆన్ డ్యూటీ వస్తుంటే… నేనూ ఆయనతో కలిసి అదే ట్రైన్ కి వచ్చాను. అదిసరే… మీ సిస్టర్ గురించి ఏమైనా తెలిసిందా? నిన్న నేను బయల్దేరాక కూడా రెండుమూడుసార్లు మీకు ఫోన్ చేసాను. ఎప్పుడు చేసినా, ఎంగేజ్ రావడమో… స్విచ్డ్ ఆఫ్ అనో వస్తోంది. 


అసలు నేను వచ్చేసరికి ఉంటారో లేదోననుకుంటూ వచ్చాను. ఇలా కూర్చుని మాట్లాడే పరిస్థితి వుంటుందనుకోలేదు. ఇంతకీ ఆమె మిస్సయినట్టు పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చారా? " సుదతి అప్పటికప్పుడు పెర్క్యులేటర్ లో డికాషన్ తీసి, వేడిగా కలిపి ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ అడిగింది సురభి.

"లేదు సురభీ! తేజ మా అక్కని వెతుకుతూనే వెళ్ళాడు. సునీల ఓసారి తనని కాంటాక్ట్ చేసిందనీ, కానీ తను షేర్ చేసిన లొకేషన్ కి వెళ్ళేసరికి, అక్కడ లేదనీ చెప్పాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సునీలకి ఏదైనా కీడు తలపెడతారేమోనని, తేజా తనే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తానన్నాడు. దొరికినట్టే దొరికి, మళ్లీ సునీల ఆచూకీ తెలియకుండాపోయింది. అదే భయంగా ఉంది. అక్కకి ఏమైనా జరిగిందా? అసలు తను…" చేతుల్లో ముఖం దాచుకుని గట్టిగా ఏడుస్తున్న సుదతిని ఓదార్చడం సురభివల్ల కావడంలేదు.


"అయ్యో! ఆమెకేమీ జరగదు. ధైర్యంగా ఉండండి సుదతీ! ప్లీజ్! అయినా మీ ఫ్రెండ్ తేజ వెళ్లారు అంటున్నారు కదా! తప్పకుండా ఆచూకీ తెలుస్తుంది. డోంట్ వర్రీ!" ధైర్యం చెబుతున్న సురభి మనసులో సమాధానం దొరకని ప్రశ్న ఒకటి ఆమెను కొంచెం ఆందోళనకు గురిచేస్తోంది. 


 'ఈమె చెబుతున్న తేజా… నా బావ తేజా… ఒకరు కాకుండా ఉంటే బాగుణ్ణు. ఎందుకైనా మంచిది, బావకి నేను హైదరాబాద్ వచ్చిన సంగతి తెలియజేస్తాను. అనుకోకుండా బయల్దేరినా, సర్ప్రయిజింగ్ గా కలవడానికి ఇది సమయం కాదనిపిస్తోంది. కానీ బావ ఎక్కడ ఉన్నాడో… ఎలా ఉన్నాడో, ముందు తెలుసుకోవాలి' మనసులోనే అనుకుంటూ, తేజకి కాల్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది సురభి. 


అదే సమయంలో సుదతి ఫోను రింగయ్యింది.

"తేజా! సునీల… సునీల కనిపించిందా? ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదేమో.... లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ప్లీజ్… తనకి ఏమీ జరగకూడదు" ఏడుస్తూ కంగారుగా మాట్లాడుతున్న సుదతి మాటలు వింటూ, అనునయంగా ఆమె భుజం మీద చెయ్యివేసి, ధైర్యం చెబుతూ మెల్లగా తట్టింది సురభి. 


అట్నుంచి తేజ చెప్పిన సమాధానం విని, సుదతి కొంచెం కుదుటపడినట్టుగా కనిపించడంతో, 'హమ్మయ్యా! ఆమె ఆచూకీ తెలిసివుంటుంది…' అని ఊపిరిపీల్చుకుంది సురభి.


"మా సునీల ఎక్కడవుందో తెలిసిందిట… మరో అరగంటలో ఇంటికి తీసుకువస్తున్నామని తేజ చెప్పాడు" సంతోషంతో సురభి భుజాలు పట్టుకుని కుదిపేస్తూ చెప్పింది సుదతి. 


'ఈ తేజ ఎవరోకానీ… దేవుడిలా మిమ్మల్ని ఆదుకున్నాడు. అతను వెళ్ళివుండకపోతే, నిజంగానే సునీల ఆచూకీ దొరికి ఉండేది కాదు' మనసులోనే తేజను మెచ్చుకుంటూ, అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న సుదతికి వంటపనిలో సాయం చేద్దామని వంటగదివైపు కదిలింది సురభి. 


రోడ్డు మీద కారు ఆగిన శబ్దం విని పరుపరుగున బయటకి వచ్చి, బాల్కనీలోంచి కిందకి చూసింది సుదతి. కార్లోంచి ప్రశాంత్ దిగుతూ కనిపించాడు. అతనితోపాటు దిగిన అమ్మాయి ముఖం కనపడకుండా చున్నీతో తలపైవరకూ కవర్ చేసి ఉంది. 

"ఎవరయ్యుంటుంది??" సుదతి భ్రుకుటి ముడిపడింది. 'సునీలకి చుడీదార్ వేస్కునే అలవాటు లేదు. మరి ఈమెవరు? తేజ ఎక్కడ? కార్లోంచి వీళ్ళిద్దరే దిగారు… అంటే… సునీలని తీస్కుని తేజ, వెనకాల వస్తున్నాడా?' సమాధానం దొరకని ప్రశ్నలు ఆమె బుర్రని దొలిచేస్తుంటే, ఆదుర్దాగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.


"సుదతీ! ఈమె మీనాకుమారి అనీ… సునీలకోసం వెదుకుతున్న చోట, అనుకోకుండా తేజకి తారసపడింది. ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఈమెకి వెంటనే సరైన వైద్యం అందాలి. కానీ బయట ఏదైనా హాస్పిటల్ లో అడ్మిట్ అయితే, పోలీసులూ… కేసు అంటూ ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. అందుకే మీ ఫ్లాట్ కి తీసుకొచ్చాను. నాలుగు రోజులు ఇక్కడే ఉంచి, నాఫ్రెండ్ ఒక ఎమ్ డి ఉన్నాడు… అతని పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే కోలుకుంటుందని తేజ ఇక్కడ ఉంచమన్నాడు. ముందు ఈమెకి తినడానికి ఏదైనా పెట్టండి" అంటూ ఆమెను జాగ్రత్తగా నడిపిస్తూ హాల్లో సోఫాలో కూచోబెట్టాడు ప్రశాంత్. 


"ఓకే. నేను చూసుకుంటాను. కానీ మా సునీల ఎక్కడ? ఒక్కడివే వచ్చావు… తేజ నీతో రాలేదా?" గాభరాగా ప్రశ్నిస్తున్న సుదతికి సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు ప్రశాంత్. 


'ఆడపిల్లల రక్షణకోసం ఏమీ చెయ్యలేమా? మీనాకుమారి పరిస్థితి చూస్తుంటే... సునీల… నో! తనకి ఏమీ జరగడానికి వీల్లేదు. తేజా తిరిగి వచ్చాక, ఈ ఎల్ట్రానిక్ డివైజెస్, రోబోస్ తయారీ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. ఈరోజు వీళ్ళిద్దరూ... రేపు ఉద్యోగం కోసం బయటకు వచ్చే సుదతిలాంటి ఆడపిల్లలూ, చదువుకునేవారికీ రక్షణ ఏదీ? 


ఇప్పుడు మీనాకుమారి కోలుకుంటే సరే! లేదంటే ఇలా రహస్యంగా వైద్యం చేయించి, ఆమె జీవితాన్ని రిస్క్ లో పెట్టినవాడిని అవుతాను. అమ్మాయిల్ని వేధించే ముఠాలు పట్టుబడకపోతే ఈ అకృత్యాలు ఆగవు. పోనీ తేజాకి చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో...' ప్రశాంత్ మనసులో అంతర్మథనం మొదలయ్యింది.


"ఏమైంది? ఎందుకు మాట్లాడటం లేదు? అసలు మా సునీల కనిపించిందా? కనిపిస్తే ఎలావుంది? ఇక్కడికెందుకు తీసుకురాలేదు? తేజ ఏమైపోయాడు? చెప్పు ప్రశాంత్. నువ్వలా మౌనంగా ఉంటే నాకేదో భయమేస్తోంది. నా మనసేదో కీడు శంకిస్తోంది. అసలు సునీల ఆచూకీ తెలిసిందా?" ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్న సుదతి కళ్ళవెంట కారుతున్న నీళ్లు, కట్ట తెగిన ఏరల్లే ఆమె చెంపలపై జారుతున్నాయి. 

 

ఆమెలోని ఆందోళన గమనించిన ప్రశాంత్ చలించిపోయాడు. 


"ప్లీజ్ సుదతీ! ఏడవకు. నువ్విలా అధైర్యపడితే ఎలా చెప్పు. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. కొంచెం కూల్ గా ఆలోచించు. నెగెటివ్ గా ఆలోచిస్తే అంతా నెగెటివ్ గానే జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి అండగా ఉండగా సునీలకి ఎలాంటి ఆపదా రాదు. నన్ను నమ్ము" అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసాడు. 

 

"ఎలా? ఏ ఆధారం దొరికిందని నేను ధైర్యంగా ఉండగలను? ఓ పక్క మీనాకుమారిని చూస్తున్నాం కదా! చాలా భయంగా ఉంది ప్రశాంత్. సునీలకి ఏమీ కాకూడదు. ప్లీజ్ ప్రే టు గాడ్!" ప్రశాంత్ గుండెలపై వాలి, మనసులో భారం తీరేవరకూ ఏడ్చింది సుదతి. 


 "తేజ అండగా ఉండగా ఆమెకే కీడూ జరగదు. తను రావడం అంటూ జరిగితే, సునీలతోనే తిరిగివస్తాడు. నా మాట మీద విశ్వాసం ఉంచు సుదతీ! ఆ భగవంతుడిమీద భారం వేసి, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ముందు ఈమె కోలుకునేలా చూడాలి. పదినిముషాల్లో నా ఫ్రెండ్… డా. భరత్ ఇక్కడ వుంటానన్నాడు. అతనితో దాచకుండా జరిగినదంతా చెబితే… సకాలంలో వైద్యం అంది గాయాలన్నీ మాని, తొందరగా కోలుకుంటుంది.


అవునూ! ఈమె ఎవరు? ఇంతకుముందెపుడూ చూసిన గుర్తులేదు…" అంటూ సురభివైపు చూసాడు ప్రశాంత్. 


ఆమె, తన ఫ్రెండ్ అనీ, ఇకపై ఇక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటుందని చెబుతుండగా… డాక్టర్ భరత్ రావడం… ఏదో ఫోన్ కాల్ వచ్చి, ప్రశాంత్ అర్జంట్ గా బయటకి వెళ్లిపోవడం ఒకేసారి జరిగాయి.


=========================================================

ఇంకా ఉంది

చేయి వదలకు నేస్తమా - పార్ట్ 8 త్వరలో

=========================================================


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




Comments


bottom of page