చేయి వదలకు నేస్తమా - పార్ట్ 6
- Prameela Sarma Veluri
- May 21
- 6 min read
Updated: May 28
#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #CheyiVadalakuNesthama, #చేయివదలకునేస్తమా, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Cheyi Vadalaku Nesthama - Part 6 - New Telugu Web Series Written By - Veluri Prameela Sarma Published In manatelugukathalu.com On 21/05/2025
చేయి వదలకు నేస్తమా - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక
రచన: వేలూరి ప్రమీలాశర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ..
సునీల, దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్ లో ఆమెను చూస్తాడు. ఆమె తలపుల్లో మునిగిపోతాడు.
స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడుతేజ. అతన్ని సునీల సోదరి, బిజినెస్ అనలిస్ట్ సుదతి కలుస్తుంది.
రైల్వే స్టేషన్ లో 'అబద్ధం' అనే అనాధ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఆప్యాయంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది. స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ. అందులో సుదతి, సునీల చేరుతారు.
ఇక చేయి వదలకు నేస్తమా - పార్ట్ 6 చదవండి.
"ఈ వారం కూడా తేజ రాలేదు అన్నయ్యా!" ఊరి నుంచి వచ్చిన తన అన్న గోపీకృష్ణకి భోజనం వడ్డిస్తూ దిగులుగా చెప్పింది నిర్మల.
"వాడేమన్నా చిన్న పిల్లాడా? ఊరికే బెంగ పడకు, ఈ వారం కాకపోతే పై వారం వస్తాడు. అయినా ఏదో కంపెనీ పెడుతున్నాడుటగా!? పెట్టుబడి కోసం నన్ను డబ్బు కూడా అడగలేదు. కన్నతండ్రి వీడి ఆలనా పాలనా ఎలాగూ పట్టించుకోలేదు… వాడి భవిష్యత్తు కోసం తాపత్రయపడే నాతోనైనా ఓ మాట చెప్పివుంటే బాగుండేది. హు! పోటీ పరీక్షలు రాయించి, గవర్నమెంట్ సర్వెంట్ గా చూడాలనుకున్నాను. నా మాట పట్టించుకుంటేగా… పోనీలే, వాడనుకున్నట్టే సెటిల్ అవనీ. ఏదో రకంగా బాగుపడి, నాలుగు రాళ్లు వెనకేసుకుంటే చాలు." ఉలవచారులో ఒడియాలు నంజుకుని తింటూ అన్నాడు గోపీకృష్ణ.
"పిల్లలు ఎదిగాక వాళ్ళకి ఎలా నచ్చితే, ఆ మార్గంలోనే వెళ్ళనివ్వడం ఉత్తమం అన్నయ్యా. నువ్వన్నట్టు పిల్లల్ని పెంచడం వరకే మన బాధ్యత. వాళ్ళ జీవితాల్ని మనం శాశించలేం కదా!" తన కొడుకు ఏ నిర్ణయాలు తీసుకున్నా తాను కల్పించుకోను అన్నట్టుగా ఉన్న చెల్లెలి ధోరణి అర్థమయ్యి… ఆమె మాటలు సూటిగా తనను ఉద్దేశించి అన్నట్టుగా అనిపించింది గోపీకృష్ణకి.
భోజనం పూర్తయ్యిందనిపించేసి లేచి చెయ్యి కడుక్కున్న అన్న మనసు చివుక్కుమనేలా మాట్లాడకుండా ఉండాల్సింది… అని లోలోపలే బాధపడింది నిర్మల.
"సురభికి సంబంధాలు చూద్దామనుకుంటున్నానమ్మా. ఎందుకో మనకి తెలీని కుటుంబాలకి వెళ్ళడానికి భయమేస్తోంది. పిల్ల ఇమడగలదా అని… చూద్దాం, దానికి ఎక్కడ, ఎవరితో పెళ్లి జరగాలని రాసిపెట్టుందో… " చెయ్యి తుడుచుకున్న టవలు దండెం మీద వేస్తూ అన్నాడు గోపీకృష్ణ.
ఒక ఆడపిల్ల తండ్రిగా తన అన్నయ్య పడుతున్న ఆదుర్దాని ఆమె గమనించకపోలేదు. కానీ కొడుకు విషయంగా తాను ఎలాంటి ముందస్తు నిర్ణయాలూ తీసుకోదలచుకోలేదు. అదే విషయాన్ని చూచాయగా చెప్పింది నిర్మల. ఆమె మాటలకు ఆలోచనలో పడ్డ గోపీకృష్ణ… లేచివచ్చి, ముందు వరండాలో ఓ పక్కగా వాల్చిఉన్న మడత కుర్చీలో వెనక్కి వాలి కూచున్నాడు.
పెరట్లో తీగకి వేలాడుతున్న లేత తమలపాకులు నాలుగుకోసి, కడిగి, తుడిచి, వాటి మధ్యలో రెండు లవంగమొగ్గలు పెట్టి, దేవుడి మందిరం ముందు నైవేద్యంగా ఉంచిన పటిక పంచదార పలుకులు నాలుగు జతచేసి, చిన్న కిళ్ళీలా మడిచి అన్న గోపీకృష్ణకి అందించింది నిర్మల.
"అన్నయ్యా! ఈ మధ్య ఆయన్నేమైనా కలిసావా?" భర్త తనని కాదనుకున్నా, తాను మాత్రం అతనిని మర్చిపోలేక అప్పుడప్పుడూ అతని క్షేమం అడుగుతూనే ఉంది నిర్మల.
"నిన్ను కాదని మరొక ఆమెతో ఉంటున్న అతని గురించి ఎందుకమ్మా అడుగుతావు? అతనికేం దర్జాగా ఉన్నాడు. నీ కష్టమే చూడలేకుండా ఉన్నాను. తోడులేకుండా ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నావు. అందరం ఉండీ కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయాము" పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి, భార్యని వదిలించుకున్న ప్రబుద్ధుడి పేరు కూడా పలకడం ఇష్టం లేనట్టుగా అన్నాడు గోపీకృష్ణ.
"వయసులో ఉన్నప్పుడు కావరంతో కళ్ళు మూసుకుపోయినా, వయసు మీరాకైనా కళ్ళకు కప్పిన పొరలు విడతాయన్న ఆశ అన్నయ్యా! ఏదో ఒకనాటికి ఇక్కడికి వచ్చి నాతో…" ఆ మాటలు అంటున్నప్పుడు, ఆమె కళ్ళు ఊటబావులే అయ్యాయి. మెడలో భర్త మీద ఇంకా గౌరవంతో ఉంచుకున్న తాళిబొట్టు మీద నిలిచిన కన్నీటి బిందువులు, భారంగా కిందికి జారి ప్రవహించాయి. ఆకాశం నుండి రాలిపడి, కాంతి విహీనమైన నక్షత్రంలా ఉంది ఆమె ముఖం.
"నీ మీద ప్రేమ లేకపోవచ్చు… కానీ కన్న బిడ్డ మీద కూడా మమకారం లేనివాడి గురించి ఇంకా ఎందుకమ్మా ఆలోచించి, టైమ్ వేస్ట్ చేస్కోవడం? ఇలాంటివాళ్ళకి పెళ్లి అనేది ఒక అవసరం మాత్రమే. నువ్వు కాకపోతే, మరొకరు… అతని దృష్టిలో ఆడది అంటే… అవసరానికి తోడుండే ఓ విలాస వస్తువు మాత్రమే. బంధాలకూ, వేదమంత్రాలకూ కట్టుబడే వ్యక్తా అతను? అలాంటివాడి గురించి ఇంకా ఆలోచించడం అనవసరం. మనల్ని కాదనుకున్నవాళ్ళు ఎన్నటికీ మనవాళ్ళు కారని గుర్తుంచుకో…"
"....అదిసరేకానీ, చెప్పడం మర్చిపోయాను. వారం క్రిందట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కిన ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి మిస్సయ్యింది. ఆమె ఆచూకీ ఇప్పటికీ తెలీలేదు. ఏంటో! ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ఆశ్చర్యం ఏమిటంటే… ఆ పిల్ల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంతవరకూ ఎవరూ పోలీస్ స్టేషన్ కి రాలేదుట. పాపం ఆ ప్లాట్ ఫామ్ మీద అడుక్కునే ఓ పిల్లాడు చెబితేనే ఈ విషయం అందరికీ తెలిసింది. ఎవరి బిడ్డో ఏంటో…" నిట్టూర్చాడు గోపీకృష్ణ.
"అయ్యో! ఎవరూ పట్టించుకోకపోవడం ఏంటి? కన్న బిడ్డల గురించి పట్టించుకునే తీరికే లేని తల్లిదండ్రులుంటారా? పైగా ఆడపిల్ల… అందులోనూ వయసులో ఉన్న పిల్ల. తలుచుకుంటేనే కాళ్ళలో వణుకు వస్తోంది. ఎక్కడుందో, ఎలావుందో!? భగవంతుడు చల్లగా చూసి, ఆ పిల్లకి ఏమీ జరక్కుండా ఉంటే చాలు. ఆ అమ్మాయి పేరేమైనా తెలిసిందా?" మనసులోనే దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ, ఆతృతగా అడిగింది నిర్మల.
"పూర్తి వివరాలు తెలియకపోయినా, ఈ మిస్సింగ్ కేసు విషయం తేజకి చెబుదామని రెండు, మూడుసార్లు ఫోన్ చేసాను. ఎందుకో నిన్నంతా వాడి ఫోను కలవలేదు. మా రైల్వే పోలీసులు కూడా ఆడవాళ్ల రక్షణ కోసం స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు. ఇదే విషయం సురభితో కూడా చెప్పాను. దూరపు ఊర్లలో హాస్టళ్లలో ఉండి చదువుకునే తన ఫ్రెండ్స్ కి కూడా జాగ్రత్తలు తీసుకోమని చెబుతానంది. నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళని పెంచి, పెళ్లి చేసేవరకూ నిత్యం ఇలా గాభరాతో బ్రతకాల్సిందే. అయినా ఈరోజుల్లో వయసులో ఉన్నవారికే కాదు, పెద్దవాళ్ళకీ రక్షణ కరవయ్యింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది" నిట్టూర్చాడు గోపీకృష్ణ.
నిర్మలకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మొదటి కాన్పులో మగపిల్లాడు పుట్టినా, ఆడపిల్లని కనడం కోసం మరోసారి తల్లి అవడానికి సిద్ధపడింది. ఇస్తామన్న కట్నం ఇవ్వలేదని, పుట్టింట్లో దిగబెట్టి, నాలుగేళ్ళతర్వాత ఆ డబ్బు చెల్లించినా, నాకీమె నచ్చలేదంటూ నిర్మలను దూరం పెడుతూనే వచ్చాడు ఆమె భర్త నరేంద్ర. భర్త ఎప్పటికైనా మారతాడనీ, తనని ఏలుకుంటాడనీ ఎదురు చూసిన నిర్మల ఆశలు అడియాశలే అయ్యాయి. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. చివరికి అది బంధం తెంపుకునేవరకూ వెళ్ళింది.
పెద్దమనుషుల తీర్పుకి కట్టుబడి నిర్మలకీ, కొడుకు పోషణకీ అయ్యే ఖర్చు తాను భరించడానికి నరేంద్ర సుముఖంగా లేకపోవడంతో, అత్త మామలు… చివరికి ఆమెకి పుట్టింటివారు కట్నంగా ఇచ్చిన నాలుగెకరాలూ తిరిగి ఆమెకే ఇచ్చివేశారు. అవే నిర్మల బ్రతకడానికి ఆధారమయ్యాయి. అందులోనే రెండో పంటగా కందులూ, మినుములూ పండిస్తూ పెంకుటిల్లే అయినా… పెద్దలిచ్చిన ఆస్తిలో వారసత్వంగా తనకు దక్కిన ఆ ఇంట్లోనే కాలం గడుపుతోంది.
"నిర్మలా! నేనింక వెళ్ళొస్తాను. నువ్వేమీ బెంగపడకు. తేజకి ఓసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కుంటానులే" అంటూ వసారా చూరుకి వేలాడదీసిన ధాన్యపు కంకులపై వాలిన పిచుకల సందడికి చిన్నగా నవ్వుకుంటూ, చెల్లెలు ఆ ఇల్లు వదిలి ఎందుకు రానంటుందో అర్థమైనవాడిలా, బయటకు దారితీసాడు గోపీకృష్ణ.
******************
సూర్యుడు అస్తమించే వేళ అవుతోంది. రోజు కూలీకి వెళ్లినవాళ్ళు తిరిగివస్తూ ఖాళీ క్యారేజీలలో దాచుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు మునిపంట కొరుకుతూ, కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. నిండు గర్భిణిలా ఉన్న పల్లెబస్సు, ఓ పక్కకి ఒరిగి, దుమ్ము రేపుకుంటూ దూసుకుపోయింది. మేపడానికి తీసుకెళ్తున్న మేకల మందను చీల్చుకుంటూ, మధ్యనుంచి పద్మ వ్యూహాన్ని ఛేదిస్తున్న అభిమన్యుడిలా… ఒంటి కాలితో సైకిలు బ్యాలెన్సు చేసుకుంటూ మందలోంచి బయటపడే మార్గం అన్వేషిస్తున్నారు వేదాంతి గారు.
"ఏవండీ! వేదాంతి గారూ! మీతో కొంచెం పనుంది. ఒక్క ఐదు నిముషాలు మాట్లాడాలి. కొంచెం పక్కగా ఆగుతారా!" అంటూ, ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా, అటువైపుగా వెళ్తున్న వేదాంతిని ఆపాడు గోపీకృష్ణ.
"ఇలా ఎప్పుడొచ్చారు? ఇంట్లో అంతా కులాసాయేనా? కలిసి చాలా రోజులయ్యింది. ఏమిటి విషయాలు?" నవ్వుతూ సైకిలు దిగి ఇటువైపుగా వచ్చాడు వేదాంతి.
"ఆ… ఆ! అంతా బాగానే ఉన్నాం. ఏమీలేదు… మా అమ్మాయికి చదువు పూర్తయిపోయింది. ఉద్యోగం పేరు చెప్పి ఊరు దాటి పంపే యోచన లేదు. ఎదిగిన పిల్ల… ఇక సంబంధాలు చూడాలనుకుంటున్నాం. ఎప్పట్నుంచీ మొదలుపెట్టవచ్చో కాస్త జాతకం చూసి చెబుతారేమోనని… అలాగే ఏదైనా మంచి సంబంధం ఉంటే కూడా చెబుతారేమోనని…" అంటూ తానూ, వేదాంతితో మాట్లాడుతూనే నాలుగడుగులు ముందుకి నడిచాడు.
"దానికేముంది… మంచిరోజు చూసి మొదలు పెడదాం. అన్నట్టు… మీతో ఓ విషయం మాట్లాడాలి. ఓ క్షణం ఇలా పక్కగా ఆగుదామా?" సైకిలు రోడ్డు వారగా స్టాండ్ వేస్తూ అడిగాడు వేదాంతి.
"ఏమిటీ… చెప్పడానికి ఏదో తటపటాయిస్తున్నట్టున్నారు… ఏదైనా డబ్బు అవసరమా? పర్లేదు చెప్పండి… సర్దుబాటు చేస్తాను, మీరేమైనా పరాయి వారా?" అంటూ జేబులోంచి పర్సు తీసి చేత్తో పట్టుకుని, అందులోని నోట్లు తడిమి చూసుకున్నాడు గోపీకృష్ణ.
"అబ్బే! డబ్బు అవసరం కాదండీ… ఆ మధ్య నేను హైద్రాబాద్ ఏదో గృహప్రవేశం పని ఉండి, చేయించడానికని వెళ్ళానని చెప్పాను కదా. ఆ ఇల్లు కట్టుకున్నవాళ్ళు ఎవరనుకున్నారు!? దొరబాబు భార్య రేవతికి స్వయానా పినతండ్రి కొడుకుట. ఆ ఫంక్షన్ కి రేవతీ, దొరబాబూ కూడా వచ్చారు. అక్కడే… వినకూడని మాట ఒకటి నా చెవిన పడింది. కొంచెం దగ్గరగా రండి చెబుతాను.
ఆ పిల్లకి బోన్ కాన్సర్ వచ్చిందట. పాపం, పట్టుమని పాతికేళ్లయినా లేవు… పెళ్లయి ఇంకా పట్టుమని పది నెలలైనా కాలేదు… ఇంతలోకే ఇలాంటి వార్త వినాల్సివచ్చింది. ఈ విషయం సుందరమ్మకి తెలుసో లేదో నాకు తెలీదు కానీ, మీరు మాత్రం ఈ మాట మీలోనే ఉంచుకోండి" లోగొంతులో వేదాంతి చెప్పిన మాట విని నిర్ఘాంతపోయాడు గోపీకృష్ణ.
"ఎవరూ!? మన దొరబాబు పెళ్ళానికా మీరంటున్నది?? ఎంత దురదృష్టం? అవునుమరి… ఒకరి ఉసురు పోసుకుంటే ఇలాగే ఉంటుంది. లక్షణమైన పిల్ల అని చదువుకున్న పిల్లతో సంబంధం కుదిర్చితే విన్నాడా? ఈ పిల్లని చేసుకుని ఏం సుఖపడ్డట్టు? అంతా తలరాత. ఎవరూ తప్పించలేరు" అన్నాడు గోపీకృష్ణ.
"తలరాత విషయం అలా ఉంచండి… సమస్య అక్కడితో ఆగిపోలేదు. ఈ పిల్లకి ఓ అవిటి చెల్లెలు ఉందట. పోలియో వల్ల తనపని తాను చేసుకోవడానికి కూడా మరొకరిమీద ఆధారపడే పరిస్థితి ఆ పిల్లది… ఆ రేవతి తనకేదైనా జరిగితే, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబడుతోందిట. ఈ విషయంగా దొరబాబుకీ, పెళ్ళానికీ మధ్య ఏదో స్పర్థలు వచ్చాయని తెలిసింది. ఈ పిల్లనే కోడలిగా అంగీకరించని తన తల్లికి, అసలు విషయం ఎలా చెప్పాలో తెలీక ఆ దొరబాబు నలిగిపోతున్నాడు. ఉండబట్టలేక నా దగ్గిర చెప్పుకుని బాధపడ్డాడు. ఇదీ ఆ ఇంటి పరిస్థితి. ఇంకా ఊళ్ళో ఎవరికీ తెలిసినట్టులేదు. మనం కూడా కాస్తంత గోప్యంగా ఉంచడం మంచిది" చెప్పడం పూర్తి చేసి, ఉత్తరీయం సవరించుకుని, సైకిలు స్టాండ్ తీసి బయల్దేరబోతూ… మళ్లీ ఏదో గుర్తొచ్చి ఆగాడు వేదాంతి.
"ఇంకో విషయం… మొన్న నేను తిరుగు ప్రయాణం అవుతూ, ఓ పాన్ షాప్ దగ్గర వక్కపొడి కొనుక్కుందామని ఆగాను. అక్కడికి వాటర్ బాటిల్ కొనుక్కోడానికని ఆ పిల్ల లేదూ… అదే దొరబాబు పీటలమీద వదిలేసిన పిల్ల… ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. ఎంత లక్షణoగా, ఎంత సాంప్రదాయంగా ఉందనుకున్నారు. తన పనేదో తను చూసుకుని వెళ్ళిపోయింది. లక్షణమైన సంబంధం కాదనుకున్నాడు… ఇప్పుడు అనుభవిస్తున్నాడు." నిట్టూర్చాడు వేదాంతి.
"పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయట వేదాంతి గారూ! ఆ బ్రహ్మ ఎవరితో ముడి వేస్తాడో వాళ్ళతోనే జరుగుతుంది. తలరాతలు ఎవ్వరూ తప్పించలేరు. విధి ఎటువైపు నడిపిస్తే అలా నడవాల్సిందే…" వేదాంతితో కలిసి ముందుకి నడుస్తూనే తన కూతురి సంబంధాల విషయం కూడా మరోసారి గుర్తు చేసాడు గోపీకృష్ణ.
=========================================================
ఇంకా ఉంది
=========================================================
వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ
నమస్తే!
సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.
రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.
వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.
మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.
వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.
ధన్యవాదములు. 🙏🏼
ఇట్లు,
వేలూరి ప్రమీలాశర్మ.
Comments