top of page

ఆ ఊరి చివర - పార్ట్ 2

Updated: May 23

#RathnakarPenumaka, #పెనుమాకరత్నాకర్, #AaVuriChivara, #ఆఊరిచివర, #TeluguHeartTouchingStories

Aa Vuri Chivara - Part 2/3 - New Telugu Story Written By Rathnakar Penumaka

Published In manatelugukathalu.com On 19/05/2025

ఆ ఊరి చివర - పార్ట్ 2/3 - పెద్ద కథ

రచన: రత్నాకర్ పెనుమాక

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

బైక్ లో అమ్మమ్మగారి వూరు వెళ్తున్న చైతన్యను రాసుకుంటూ వెళ్తుంది ఒక కారు. ఆరా తీస్తే ఆ కారు ఓనరు నాగభూషణం అనే ఓ రౌడీదని తెలుస్తుంది. ఆ నాగభూషణం తనను తాను నరకాసురుడిగా చెప్పుకుంటాడు.

ఇక ఆ ఊరి చివర - పార్ట్ 2 చదవండి.


ఈలోగా కుక్కల మొరుగులకి లోపలినించి ఓ నడి వొయస్సు మనిషి నిక్కరేసుకుని ఖద్దరు బనీనుతో లంక పుగాకు చుట్ట కాలుత్తా వొచ్చాడు. అతన్ని చూడగానే కేశవ ‘‘మీరియ్య బాగున్నావా?’’ అనడిగాడు.


‘‘నరకంలో ఉన్నోడికి ఏం బాగుంటాది బాబయ్య? ఇంతకీ నువ్వెలా ఉన్నావ్‌, అమ్మగారి ఒంట్లో బాగుందా? మొన్న ఒళ్ళు నొప్పులకి ఇచ్చిన బిళ్ళలు బాగా పనిచేసాయని చెప్పు’’ అన్నాడు, చైతూని చూసి ‘‘ఈ అబ్బాయిగారెవరూ?’’ అనడిగాడు.


‘‘అక్కకొడుకు మీరియ్య, మా మేనల్లుడు, కాకినాడలో ఉంటాడు’’.


‘‘ఏదైనా ఉజ్జోగమా బాబుకి?’’

‘‘లేదు ఇంకా చదువుతన్నాడు, ఉంకో ఏడాదిలో పూర్తవుద్ది, అప్పుడు లాయరౌతాడు’’ అని చెప్పాడు కేశవ.


‘‘పోన్లేబాబ బాగా చదువుకో మీయమ్మ నేను ఒకే ఈడోళ్ళం’’ అని చెప్పాడు.


‘‘అది సరే కానీ మీరియ్య మీ ఓనర్‌ గురించట చెప్పు, ఈడికి మా గొప్ప సరదాగా ఉంది. రేత్రి అడిగితే ఉప్పుడు తీసుకొచ్చాను’’ అన్నాడు కేశవ.


‘‘ఈడా, ఈడు నాకు ఓనరా నా తలకాయా? నా ఖర్మ కాలి మా చిన్నోడికి ఇరవై నాలుగ్గంటల నొప్పొత్తే ఊళ్ళో రైతులెవరూ అప్పివ్వా పోయీసరికి ఇక గచ్చంతరం లేక ఈడి దగ్గిర ముప్పై ఏలు, పది రూపాయల వొడ్డీకీ తీసుకున్నాను.


నెలదిరిగీటప్పుడికి తొమ్మిదొందలు కట్టాల్సొచ్చీది. మూడు నెలలు కట్టాపోతే ఇంటికొచ్చి నాలుగు తన్నీసి పోయాడు, మరసటి రోజుకి కట్టమని. కట్టలే పోయాను. ముందు మా ఆవిడి బతిమాలుకుందామని ఇక్కడకొచ్చింది. దాన్ని ఇంట్లో ఎట్టి తాళవెట్టాడు. రొండు రోజుల తర్వాత తీసి నెల రోజులు ఇంటిపని, వొంటపని, పెంటపని చేయించుకున్నాడు. బతిమాలితే దాన్నొదిలి నన్నెట్టుకున్నాడు. మొత్తం బకాయన్నా తీర్చు లేదా ఆరు నెలలు పనిచెయ్యి నీ అప్పు కొట్టేత్తాను అన్నాడు.


ఇది ఐదో నెల, ఉంకో నెల పన్జేసి ఈ నరకం లోంచి బయటడాల! ఈడు చేసీ పాపాలు చూత్తా పాపం మూటకట్టుకోలేను. ఇలాంటోణ్ణి నేను సినిమాల్లో కూడా చూళ్లేదు’’ అని చెప్తా గేటులోంచి ఒకతను రాటం చూసి మాట మార్చీసాడు.


అతను కుక్కలికి పెడిగ్రీ పెడతా ఉంటే అతనికి ఇనిపించకండా ‘‘ఈడో పిచ్చోడు, పెపంచంలో ఎవడికి నచ్చని ఆ నరకాసురుణ్ణి ఈడొక్కడే మంచోడంటాడు. ఏవన్నా అంటే ఆడి గురించి నీకేం తెల్సు అంటాడు.’’ అని ఆ వొచ్చినతను గురించి చెప్పాడు మీరియ్య.


నరకాసురుడు సంగతి చెప్తా ‘‘మడుషుల్ని మడుషుల్లా చూడ్డు గానీ కుక్కలకి అమలాపురం నించి ఏలు ఏలు తగలేసి మేత తెత్తాడు. ఇన్ని రోజుల్నించి ఆడికి అన్నీ టైముకి అందిత్తానా, నన్ను ఏ రోజూ తిన్నావా అని అడగడు. రోజూ ఆటికి మేతేసావా, అన్నీ బాగా తిన్నాయా? అనడుగుతాడు. ఆటికి రోజు తానం చేయిత్తాడు. ఆడికి ఎలా తెలుత్తాదో కానీ ఆటిని టైయానికి దాటిచ్చటానికి కూడా తీస్కెళ్తాడు. ఆటికి చిన్న దెబ్బ తగిలినా ఆస్పటల్‌కి తీస్కుపోతాడు. ఖరీదైన మందులేయిత్తాడు.


మొన్న ఓ ఊరపంది కాలు రత్తం కార్చుకుంటా వొచ్చింది. దాన్ని ఎత్తుకుని తానం చేయించమన్నాడు. తప్పక, కొడతాడేమోనని భయమేసి చేయిచ్చాను. ఆడు, నేను యానాం పశువులాస్పటల్‌కెళ్ళి డాట్టర్‌కి చీబెడితే ఆ దెబ్బకి మందు రాసి కట్టుకట్టారు. అప్పుణ్ణించి ఆ ఊరపంది అదిగో ఆ బోనులో ఉంది. మేం తిన్నా తినాపోయినా ఆటికి టైయ్యానికి మేతెట్టాల్సిందే, లేపోతే ఆరోజు నాకు దరువే! ఆడికంటే నేను పదేళ్ళు పెద్దోణ్ణి. అయినా నన్ను పచ్చి బూతులు తిడతాడు. తాగినప్పుడు మరీనీ! ఆడు తాగుతంటే నేను కాళ్ళు నొక్కాల. సరిగా నొక్కాపోతే చేతికందిన దాంతో కొడతాడు. పచ్చి బూతులు తిడతాడు’’ అంటా పైకి ఇనిపిచ్చకండా ఆణ్ణి బూతులు తిట్టుకున్నాడు మీరియ్య.


‘‘మరి ఇతనికి పెళ్ళాం పిల్లలు లేరా? ఇంత ఇంట్లో ఒక్కడే ఉంటాడా? అదీ ఊరి చివర సొశేనాల మజ్జిన, అయ్య బాబోయ్‌! ఇలాంటోణ్ణి నేనుప్పుడు దాకా చూళ్ళేదు’’ అన్నాడు చైతు. ‘‘లేకేం బాబా ఈడి పెళ్ళాం మాతల్లి చేనా అందగత్తి గిల్లితే పాలుగారినట్టుండీది. ఒక కొడుకు, కూతురు పుట్టారు. పిల్ల పిల్లోడు కూడా అచ్చం ఆళ్ళమ్మ పోలికే అందగాళ్ళు, మంచోళ్ళు.


ఓరోజు ఈడొచ్చీపాటికి ఆవిడిగారి ఊరి కుర్రోడు ఇక్కడ కేబుల్‌ దాంట్లో పన్చేత్తన్నాడు. ఆ కేబుల్‌ కుర్రోడు కనిక్షన్‌ బాగు చేయటానికొచ్చాడంట. ఆడి మీద ఈడికి అనుమాన మొచ్చింది. ఆ రేత్రే పిల్లలు పడుకున్నాక ఆ మాతల్లిని ఉరేసి చంపీసాడు. అది తెలిసి ఆ కేబుల్‌ కుర్రోడు ఊరుదిలి పారిపోయాడు. ఎక్కడికెళ్ళాడో ఇన్నేళ్ళైనా ఉప్పుడుకీ ఆ కుర్రోడి అజపజ లేదు. మూడేళ్ళు తర్వాత కూతురెవణ్ణో పేమించిందని కూతుర్ని కూడా ఉరేసి చంపీసాడు. శెవాన్ని కూడా కనిపిచ్చకండా మాయం చేసీసాడు. ఆ పిల్ల శెవాన్ని ఎవరిదో శెవం కాలుతన్న దాంట్లో పాడీసాడని అందరూ చెప్పుకుంటారు. ఇయ్యన్నీ చూసి కొడుకు ఆణ్ణి ఎదిరిచ్చలేక ఇంట్లోంచి పోయి ఆళ్ళ అమ్మమ్మ ఇంట్లో తల దాచుకుంటన్నాడు’’ అని చెప్పాడు.


‘‘మరి ఇన్ని దుర్మార్గాలు, హత్యలు చేత్తంటే ఎవరూ అతని మీద కేసెట్టలేదా?’’ అంటే ‘‘అదా ఆడు ఇంతమందిని బాగా ఉరేసాడని కాబోలు ఆడికి ‘‘తలారి’’ ఉజ్జోగం ఇచ్చారు. ఆడికి ఆ ఉజ్జోగం ఆడి పెళ్ళాన్ని చంపక ముందే ఉందిలే. అందుకే పోలీసులందరితో ఆడికి చనువే. పెద్ద పెద్ద ఆతికార్లుతో సహా! అందుకే ఆడిమీద ఏకేసిచ్చినా తీసుకోరు. అయినా ఆడిమీద కేసిచ్చీ అంత ధైర్నం ఎవలికి లేదు. ఊళ్ళో పెద్ద మోతుబరి గాదిరాజు రాగవరాజు గోరుకి కూడా ఈడంటే ఉచ్ఛే! ఆరికున్న పరపతికి ఈణ్ణి ఊళ్ళో లేకండా చేసీయ్యాల! ఆరు ఈడి ఊసెత్తరు. ఈడు కూడా ఆరి జోలికెల్లడు.


ఆడి బతుకెట్టుకుని, బయపడ్డం కానీ, ఏడుత్తుం కానీ, నవ్వుతుం కానీ ఒక్కపాలి చూల్లేదు బాబా నేను. అలాంటోడీ రాచ్చసుడు. ఎలాంటి చావొత్తదో కానీ! లం....కొడుక్కీ!’’ అని తిట్టుకున్నాడు.


కేశవ చెప్పాడు ‘‘అవునొరే ఊళ్ళో ఓ జోక్‌ చెప్పుకుంటారు. ఈణ్ణి నవ్విచ్చినా, ఏడిపిచ్చినా, భయిపెట్టినా ఈ మూడాటిల్లో ఏది చేసినా ఆడికి రాఘవరాజు గారు అరెకరం ఇత్తారంట. ఎవరైనా పయత్నం చెయ్యండి’’ అని. ‘‘కానీ ఊళ్ళో అంత సీనెవరికీ లేదు. ఆడు లేనపుడు ఎనకాలే ఆడు ఈడు అని చెప్పుకోటం ఎదురు పడితే తలెత్తి చూసీ అంత ధైర్నం కూడా లేదెవడికి! ఆడితో అందుకే ఏ రకమైన సమ్మందాలు ఎట్టుకోరు. ఆడు కూడా ఎవరితోటీ సమ్మందం పట్టుకోడు. ఆడికి ఆడు ఇలా అందర్నీ భయపెడతా దౌర్జన్యంగా బతకటాన్నే గొప్పగా చెప్పుకుంటాడు.


ఊరికి కిలోమీటర్‌ దూరంలో ఉన్నా కరెంటు, రోడ్డు, నీళ్ళు ఎలా వొచ్చాయో తెలుసా? పంచాయితీ వోళ్ళని భయపెట్టి ఏయించుకున్నాడు. కేబుల్‌ తీయించీసి డిష్‌ ఏయించుకున్నాడు. ఆడికి మాత్రమే బిల్‌ కడతాడు. మిగతా ఆటికి దేనికీ బిల్‌ కట్టడు. అసలు బిల్లే రాదు. ఆ కరెంటు, పంచాయితీ ఎకౌంటే. ఇక నీటి పన్ను, ఇంటి పన్ను సరేసరి.


యానాం బైపాస్‌లో రాజుల బార్‌ నించి నెలకి సరిపడా బడ్‌విజర్‌ బీర్లు 5 కేసులు తెచ్చుకుంటాడు. కొనుక్కుని కాదు. ఆళ్ళనీ భయింపెట్టే! ఈడితో ఎందుకొచ్చిన తలపోటు అనుకుని చేలామంది ఆళ్ళ పెశాంతత పోగొట్టుకోటం ఇష్టం లేక, ఇలా ఆడు ఆడమన్నట్టు ఆడతన్నారు’’. ‘‘మీరియ్యా! ఈడు నీకు ఎన్నాళ్ళ నించి తెల్సు?’’ అంటే ‘‘ఓ పదేళ్ళు నించి తెల్సు బాబా అప్పుడు కొంచుం బాగానే ఉండీవోడు. రాను రాను రాచ్చసుడి కంటే దుర్మార్గంగా తయారయ్యాడు.


ఈడి చావు కోసం చూసీ ఓళ్ళలో నేను మొదటోణ్ణి, రొండోవోడు అదిగో ఆ ఆవుకి దాణా ఎడతన్నాడూ ఆడు. ఆణ్ణి కూడా పెళ్ళానికి బాగోపోతే ఓ లచ్చిచ్చి అది తీర్చాపోతే ఆడి పెళ్ళాన్ని మొన్నటి దాకా ఉంచుకున్నాడు. ఓ నెల కితమే ఆ మడిషి కదల్లేనంత జబ్బుదైపోతే అంపీసాడు. ఆ ఆవుని తోలుకొచ్చి కట్టీసి, అది సూడిది అది ఈనీ దాకా దాన్ని మేపమంటే ఆడు ఒప్పుకుని పన్చేత్తన్నాడు. ఆడికి ఓపికలేక కానీ లేపోతే ఆడే సంపెద్దుడు ఈణ్ణి. అంత కసుంది ఆడికి. ఈ లం..కొడుకు మీద’’ అని చెప్పాడు.


ఈలోగా ఇందాక కుక్కలకి పెడిగ్రీ ఎట్టినతను వొచ్చాడు ఆళ్ళ దగ్గిరికి. అతని పేరు ఇంటూరి సుందర్రావు. ‘‘ఎవరు మీరు ఈడికేమౌతారు?’’ అనడిగాడు. ‘‘మాదీవూరే, మీరియ్య మా మేనమావే అవుతాడు. మా మేనల్లుడు ఊరునించి వొత్తే మీరియ్యని పలకరిందామని తీసుకొచ్చా’’ అని చెప్పాడు కేశవ.


‘‘మరి మీ ఇసయాలు మాటాడుకోకండా మావోడు గురించి ఎందుకు మాటాడుకుంటన్నారు?’’ అనడిగాడు. ‘‘ఓ అదా మావోడు ఈ బోర్డు చదివి ఆశ్చర్యంగా అడుగుతంటే మీరియ్య మాయ తనకి తెల్సిందేదో చెప్తన్నాడు అంతేనండి’’ అన్నాడు కేశవ.


‘‘ఆడు చెప్పిందంతా ఇన్నాను. మావోడి గురించి ఈడికేం తెలుసని చెప్తున్నాడు? మా భూషణంగాడు నాకు చిన్నప్పుణ్ణించి తెలుసు. ఆళ్ళది కొమరాజులంక. ఆళ్ళ నాన్న రాజుల దగ్గిర పాలేరుతనం చేసీవోడు. ఆడికి ఆళ్ళమ్మన్నా, ఆడి చెల్లెలన్నా చేలా ఇది. ఆడి చెల్లెలు పిచ్చిది. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా నయిం కాలేదు. ఆఖిరికి రాయిమండ్రి దానవాయిపేటలో ఉండీ మానస ఆసుపత్రిలో మందులాడిచ్చినా తగ్గలేదు.


ఓ ఏసంగి సెలవుల్లో ఈడు ఆళ్ళ మేనమామ గారూరు దేవరపల్లి ఎల్లాడు. ఆడొచ్చీసరికి ఆళ్ళ చెల్లి ముందురోజు రేత్రినించి కనబడట్లేదని చెప్పింది ఆళ్ళమ్మ. ఆడు, ఆళ్ళ నాన్న, ఆళ్ళ అమ్మ చెరో చోటికి ఎళ్ళి ఎతికారు దొరకలేదు. పోలీటేషన్లో ఫిర్యాదు చేసారు. అన్ని బస్టాండుల్లో పోస్టర్లంటిచ్చారు. ఎన్ని చేసినా పిల్ల దొరకలేదు. వోరం రోజుల తర్వాత ఓ ఆడపిల్ల శెవం ముక్తేశ్వరం రేవులోకి కొట్టుకొచ్చింది.


ఆ శెవం బాగా ఉబ్బి పోయి బట్టలు చిరిగిపోయి ఒళ్ళంతా నాచట్టీసి మొఖం చేపలు కొరికేయటం వొల్ల గుర్తుపట్ట లేనంతగా మారిపోయింది. ఆ శెవాన్ని తీస్కుని ఇంటికొచ్చీసరికి పోలీసోల్లొచ్చారు. ఆ శెవాన్ని పోస్టుమార్టమ్‌ చేయించారు. చేసిన డాట్టర్‌ ఆ అమ్మాయిని ఎవరో వికృతంగా మానభంగం చేసి, హింసించి చంపీసి గౌతమిలో పడీసారని చెప్పాడు. అది ఇని ఆళ్ళమ్మ గుండాగి సచ్చిపోయింది. ఆళ్ళ నాన్న పిచ్చోడై పోయాడు.


ఆ సంఘటన ఆడిలో ఎంత మార్పు తెచ్చిదంటే ఆడికి మొత్తం మడుసులన్నా ప్రేమలన్నా అసహ్యం. ఆళ్ళ నాన్న ఆ సంఘటన జరిగాక ఐదేళ్ళు బతికి సచ్చిపోయాడు ఆ బెంగతోటే. ఆ తర్వాత ఆడు, నేను ఆ ఊరొదిలి ఈ ఊరొచ్చీసాం. ఆడు నన్నూ కూడా మడిసిలా చూడ్డు. కానీ నేనూ వొదిలేత్తే ఆడెంత మందికి పెమాదకరమో నాకు తెలుసు. అందుకే నేను ఆడి కూడానే ఉంటన్నాను’’ అని చెప్పాడు.


‘‘మరి మీరు కూడా ఉంటే ఆళ్ళావిణ్ణి, కూతుర్ని ఎందుకు చంపాడు?’’ అనడిగాడు కేశవ. ‘‘ఓ అదా నేను ఆడి కూడా జీవితాంతం ఉంటానేంటి అనుకుని, సమ్మందం చూసి పెళ్ళి జేసాను. భార్యని కూడా బాగానే చూస్కునీవోడు. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు గందా! ఇంక బాగానే ఉంటాడనుకున్నాను.


నాకు డక్కన్‌ సిమెంట్‌ పేట్రీలో ఉజ్జోగం వొత్తే పెళ్ళాం, పిల్లల్ని తీసుకుని మిర్యాలగూడ దగ్గిరున్న దాచేపల్లి ఎళ్ళిపోయాను. అలా నేను దగ్గిర లేనప్పుడు ఇదంతా జరిగింది. పోయినేడే మా ఇంటిది జబ్బుజేసి సచ్చిపోతే పిల్లలిద్దర్నీ ఆస్టల్లో జామిన్‌ చేసి ఈణ్ణి కనిపెట్టుకుంటా నేనిక్కడ ఉంటన్నాను.’’ అని చెప్పాడు. ఇంత దుర్మార్గుణ్ణి చూడ్డమే ఇడ్డూరం అనుకుంటే ఇలాంటోడి కోసం ఇంత త్యాగం చేసీ జెతగాణ్ణి చూడ్డమూ మహా ఇడ్డూరంగా ఉంది ఆళ్ళకి. మరి మీకో?


ఇలా అనుకుంటుండగా కేశవ అతన్ని చూసి ‘‘బాబాయ్‌ పెద్దాడ రాజు గారని ఊళ్ళో ఓ మోతుబరి రాజుగారున్నారు. పంచాయితీ కచేరి కాడ రోజూ పందాలేసుకుంటా వుంటారు. ఓరోజు ఆయిన ‘‘ఊరి చివరుంటాడే నరకాసురుడు ఆణ్ణి ఊళ్ళో ఎవరైనా ఏడిపిచ్చినా లేదా నవ్విచ్చినా, భయింపెట్టినా పదేలిత్తాను అదే పందుం అన్నాడు. అక్కడ కూచున్న మిగిలినోళ్ళతో.


========================================================================

ఇంకా వుంది..


========================================================================

రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక

నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.




Comments


bottom of page