top of page

ఆ ఊరి చివర - పార్ట్ 3

#RathnakarPenumaka, #పెనుమాకరత్నాకర్, #AaVuriChivara, #ఆఊరిచివర, #TeluguHeartTouchingStories

Aa Vuri Chivara - Part 3/3 - New Telugu Story Written By Rathnakar Penumaka

Published In manatelugukathalu.com On 23/05/2025

ఆ ఊరి చివర - పార్ట్ 3/3 - పెద్ద కథ

రచన: రత్నాకర్ పెనుమాక

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:

బైక్ లో అమ్మమ్మగారి వూరు వెళ్తున్న చైతన్యను రాసుకుంటూ వెళ్తుంది ఒక కారు. ఆరా తీస్తే ఆ కారు ఓనరు నాగభూషణం అనే ఓ రౌడీదని తెలుస్తుంది. ఆ నాగభూషణం తనను తాను నరకాసురుడిగా చెప్పుకుంటాడు. గతంలో అతను భార్యను, కూతురిని చంపేశాడు. అతను ఎంతగానో ఇష్టపడే మతిస్థిమితం లేని అతని చెల్లెల్ని ఎవరో మానభంగం చేసి చంపేశారనే కోపంతో అతనలా మారాడంటారు. 


ఇక ఆ ఊరి చివర - పార్ట్ 3 చదవండి.


అప్పుడక్కడున్న ఉంకో రాజుగారు అవునొరే నేనీవూరొచ్చి పాతికేళ్ళైంది. ఆడు పరిచయమైయ్యి పదిహేనేళ్ళైంది. ఇన్నేళ్ళలో ఆడు నవ్వుతుంగానీ, ఏడుత్తుంగానీ, భయపడతం కానీ చూళ్ళేదు. నిజంగా ఆణ్ణి ఏడిపిచ్చినా, నవ్విచ్చినా పదేలేంటి పాతికేలియ్యొచ్చు అంటంటే రాఘవరాజుగారైతే గెలిసినోడికి అరెకరం ఇత్తానన్నాడంట. 


అక్కడున్నోళ్ళందరూ ‘‘అవునొరే ఈ పందుం నెగ్గినోడు మటుకు నిజంగా మొగోడే’’ అన్నారు. ఎవరూ ముందుకి రాలేదు కానీ ఈ పందెం గొడవ ఆడు నవ్వడని, ఏడవడని ఊరంతా ఇలాంటి మడిసిని ఇంక చూడం అని ఇచిత్రంగా చెప్పుకుంటన్నారు బాబాయ్‌. నేననుకుంటన్నాను ఎవరైనా పదేలిత్తాను నవ్వమంటే నవ్వడా, ఏడమంటే ఏడవడా? అన్నాడు కేశవ. 


అప్పుడు సుందర్రావు చెప్పాడు ‘‘ఆడు ఎవరో సెప్పారని ఏదీ చెయ్యడు. డూటీలో తప్ప ఇంకెక్కడా ఎవరి మాటా ఇనడు. నిజమే ఆడు నవ్వతం, ఏడుత్తం, భయిపడతం నేను కూడా చూల్లేదు. ఎప్పుడో ఆడి చెల్లి సచ్చిపోయినపుడు చూసాను. చివరిసారి ఆడు ఏడుత్తుం. ఆ తర్వాత ఆళ్ళమ్మ పోయినపుడూ, నాన్న పోయినపుడూ కూడా ఏడుత్తుం చూల్లేదు. ఇక నవ్వటం అంటావా పెళ్ళపుడో, ఆడి పిల్లలు పుట్టినపుడో సూద్దామనుకున్నాను. అప్పుడు కూడా కనబల్లేదు. ఆడి జీవితంలో అన్ని యాంత్రికమే ఆడి గుండి రాయైపోయింది’’ అని చెప్పాడు ఇంటూరి సుందర్రావు. 


‘‘ఆడికి తినాలనిపిత్తే తింటాడు, తాగాలనిపిత్తే తాగుతాడు, పడుకోవాలనిపిత్తే పడుకుంటాడు, కొట్టాలనిపిత్తే కొడతాడు. ఎదుటోడు ఎంత పెద్దోడైనా, పేదోడైనా, పెద్దోడనీ భయిం కానీ, పేదోడనీ జాలి కానీ చూల్లేదు ఉప్పుడిదాకా. ఏ పనికీ ఇష్టం, అయిష్టం లాంటి ఇశేషాలేమీ ఉండవు ఆడికి’’ అన్నాడు మీరియ్య. 


‘‘ఇంత కడుపు మంటెట్టుకుని పైకి ఏమీ లేనట్టు ఎలా నటిత్తున్నావురా మీరిగా’’ అనడిగాడు ఇంటూరి సుందర్రావు కోపంగా! 


‘‘ఎంతమంటున్నా ఆణ్ణెదిరించి బతగ్గలమా? జాలి దయ అంటే ఏంటో తెలీనోడు. ఆడి డబ్బు ఆడి మొఖం మీద కొట్టి అప్పుడు పోతాను. ఆడప్పు తీరిందాకానే ఈ తిప్పలు’’ అన్నాడు మీరియ్య. 

‘‘నేనో ఇసయమడుగుతాను నిజం జెప్పు, నువ్వు అప్పు అడిగినప్పుడు ఎలా అడిగావ్‌, ఏమనడిగావో చెప్పు’’ అన్నాడు. 


‘‘అన్న.. మా అబ్బిగాడికి బాలేదు, డబ్బులవసరం ఓ ముప్పై ఏలు కావాలి’’ అనడిగాను అని చెప్పాడు మీరియ్య. 


‘‘దానికి ఆడేమి చెప్పాడు’’ అనడిగాడు సుందరియ్య. 


‘‘ఇత్తాను వడ్డి నూటికి పది రూపాయలు, అసలు ఆరు నెలల్లో తీర్చాలి. నెలనెలా వడ్డి ఐదో తారీఖు కల్లా కట్టాలి. ఐదు దాటితే ఇంట్లో ఏదుంటే అదట్టుకొచ్చెత్తాను’’ అన్నాడు. 


‘‘ఏదో మాట వరసకి అన్నాడనుకున్నాను. కానీ నిజంగా అట్టుకెల్లటానికి ఏమీ లేపోతే మా యావిడిని తీసుకొచ్చి నెల రోజులుంచుకుని, ఇంటిపని, వంటపని, పెంటపని చేబిచ్చుకునీవోడు. అది చూసి తట్టుకోలేక దాన్ని అంపీసి దాని బదులు నేనొచ్చాను. ఆ పనులన్నీ నాతో చేబిచ్చుకుంటున్నాడు దొంగనాకొడుకు. ఉంకో నెల రోజులు చేత్తే అప్పు తీరిపోద్ది’’ అని చెప్పాడు మీరియ్య. 


అప్పుడు ఇంటూరి సుందర్రావు ‘‘ఇన్నారా బాబా ఆడు ఏ ఇసయం అబద్దం చెప్పడు. అన్నీ ముందే చెప్పాడు. అప్పుడీడికి అప్పు తీసుకోటమే కానీ తీర్చటం గురించి ఆలోచన లేదు. అందుకే ఆడు చెప్పిన అన్నీట్లికి తలాడిరచి ఉప్పుడిలా శాపనాకారాలెడతన్నాడు ఎదవ’’ అంటా రుసరుసలాడాడు. 


‘‘మరి ఆళ్ళావిడ సచ్చిపోయినపుడో, కూతురు సచ్చిపోయినపుడో ఎవరూ పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వలేదా?’’ ధైర్యం చేసి అడిగాడు చైతన్య. 


‘‘ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళలో ఓళ్ళకి కూడా ఆడంటే ఉచ్ఛే. మామూలోల్లకేంటి పోలీసోల్లకి కూడా ఈడితో ఎందుకొచ్చిన తంటా అనుకుంటారు. ఎవరూ కంప్లైంట్‌ ఇయ్యరు. ఇచ్చినా ఆళ్ళు తీసుకోరు. అయినా ఆడు కూడా పోలీసోడే కదా! ఆడికి జిల్లా కోర్టులో తలారి ఉజ్జోగం’’ చెప్పాడు మీరియ్య. 


‘‘ఆ ఉజ్జోగం ఇయ్యన్నీ చేసాక వొచ్చిందా, వొచ్చాక చేసాడా?’’ అడిగాడు చైతు. ‘‘ఉజ్జోగమొచ్చాకే’’ చెప్పాడు మీరియ్య. 


‘‘ఆడి గురించి అంత దారుణంగా మాటాడుకుంటన్నారు. ఆడికి కుక్కలన్నా, పిల్లులన్నా, పక్షులన్నా ఆఖిరికి పందులన్నా కూడా ఇట్టమే. ఈ కుక్కలూ అని అక్కడ బోనులో ఉన్న ఆల్షేషన్‌ని చూపిత్తా, దీన్ని ముఫ్పై ఏలకి కొన్నాడు. డాబర్‌మెన్‌ని చూపిత్తా దీన్ని యాభై ఏలకి కొన్నాడు అంటా బయటికొదిలితే మనిషిని చీల్చేసీ లాగున్న పులుల్లాంటి కుక్కల్ని చీబిచ్చాడు. 


ఆ పక్క బోనుల్లో ఉన్న కాకి, నెమలి, డేగ, రసంగి రకాల పందుం పుంజుల్ని, కొమ్ములు తిరిగిన ఎర్రబట్టు గొర్రెల్ని చీబిచ్చాడు. ఇయ్యన్ని మేపటానికి నెలకి లచ్చపైనే ఖర్చు చేత్తాడు. ఆటికి సిన్న రోగమొచ్చినా ఎంటనే పశువుల డాట్టర్‌ కాకర చిన్నంరాజు గారికి కబురెట్టి వైజ్జిం చేయిత్తాడు. ఆడికి మడుసులంటేనే పగ, నోరు లేని జంతువుల మీద ఎంత మవకారమో’’ అని దీర్ఘాలు పోయాడు ఇంటూరి సుందర్రావు. 


‘‘చేలా ఇడ్డూరమే మడుసులని మడుసుల్లాగ చూడ్డుకానీ జంతువుల్ని చూత్తాడంట’’ అంటా ఎటకారమాడాడు మీరియ్య. 


‘‘అవున్రా ఆడి గుండెకి చిన్నప్పుడెప్పుడో గాయిమైంది. అది మాన్పీ మందు లేదు. అందుకే ఆడలా అయిపోయాడు. అంతే కానీ ఆడూ మడిసే కానీ, అందరిలా మంచోడనిపిచ్చుకోవాలనీ కుతి లేదు, నటనా లేదు. 


మడుసులంతా ఎంత ఎలాటోళ్ళైనా మంచోళ్ళు కిందే నటిత్తారు. ఆడలా నటిచ్చడు. అందుకే ఆడి కారు మీదే నరకాసురుడిని అని రాపించుకున్నాడు. ఆడికి ఆణ్ణి చూసి పేమించీవోళ్ళు కంటే ఆణ్ణి చూసి భయపడీ వోళ్ళంటేనే ఇట్టం. ఏ నాటకాలు ఆడనోడాడు’’ అంటా ముక్తాయించాడు సుందర్రావు. 


ఇలా మాటాడుకుంటా ఉండగానే మజ్జాన్నం ఒంటిగంటై పోయింది. ‘‘ఒరేయ్‌ అమ్మ మనకోసం తినకుండా ఎదురు చూత్తది. ఎళ్దాం పద’’ అంటా తొందరపెడితే ‘‘సరే బాబాయ్‌ ఎళ్తాం చేలా కొత్త కొత్త ఇసయాలు ఇన్నాం ఇతని గురించి. ఇలాంటి మనిషిని ఉప్పుడుదాకా ఎక్కడా చూళ్లేదు. ఇలాంటి మనిషి గురించి ఎక్కడా ఇనలేదు. సరే ఎళ్తన్నాం’’ అంటా చైతు, కేశవ అక్కణ్ణించి బయిదెల్లారు. 

ఇంటికొచ్చీ వొరకూ చైతూ, కేశవని అడుగుతానే ఉన్నాడు ‘‘మాయా అతని గురించి ఆళ్ళు చెప్పినియ్యన్ని నిజాలేనా? అసలు నవ్వని మనిషంటూ ఉంటాడా? పోనీ నవ్వాపోయినా ఏదో దానికి జాలెయ్యని మనిషి, ఏడుపు రాని మనిషి, భయమెయ్యని మనిషి ఉంటాడా? ఆళ్ళు మరీ ఎక్కువ చేసి చెప్పినట్టున్నారు కదా?’’ అన్నాడు. 


‘‘అలా ఏం కాదురా నేనూ ఆడి గురించి అలాగే ఇన్నాను. ఆడి దుర్మార్గాల గురించి ఊళ్ళో కొమ్ములు తిరిగిన వొత్తాదులు కూడా ఆడితో పెట్టుకోడానికి భయపడ్డం గురించి చిన్నప్పుణ్ణించి చేలానే ఇన్నాను. అయన్నీ నిజాలేరా!’’ అన్నాడు. 


ఇంతలో ఇంటికొచ్చీసారు. రాజ్యలక్ష్మి ఈళ్ళని చూసి ‘‘ఏరా ఉప్పుడుదాకా ఎక్కడున్నార్రా అన్నం గొడవ మర్చిపోయి నట్టున్నారు. కాళ్ళు చేతులు కడుక్కుని బేగారండి. అన్నాలు తిందిరిగాని’’ అంది. 


‘‘అమ్మమ్మా మేము వాకిట్లోనే కూర్చుని తింటాం. అన్నం కూరలు ఇక్కడికే తెచ్చెయ్‌ అనీసరికి కేశవ ఏప చెట్టు కింద పట్టిమంచం వాల్చి లేపాక్షిలో కొన్న కళంకారి దుప్పటి పరిచాడు. రాజ్యలక్ష్మి పొద్దున్న సంగాడి బయ్యన్న సీరమేను ఇంటికి తెచ్చిత్తే, చింతకాయేసి ఇగురొండిరది. గుడ్డు పీతల్లో వంకాయేసి ఇగురెట్టింది. అయ్యి ఏడేడిగా వొడ్డిత్తంటే ఆకలిమీదున్నారామో కబుర్లాడుకుంటా ఆబగా తినీసారు. ఇద్దరికీ తిండెక్కువైపోయి నిద్దరొచ్చీసింది. ఆ ఏపచెట్టు నీడలోనే ఆ మంచం మీదే నిద్రోయారు. 

ఆ తర్వాత చైతు రొండ్రోజులుండి ఎళ్ళిపోతంటే ఆళ్ళమ్మమ్మ సంగాడి బయ్యన్నకి చెప్పి రప్పించిన సీరమేనుతో గారిలేసి ఇంటికి పట్టుకెళ్ళ మనిచ్చింది. అయ్యట్టుకుని బయిదెల్లాడు చైతన్య! ఎళ్ళీటప్పుడు ‘‘కాలేజీకి ఎళ్ళీ ముందోసారి కనిపించి ఎళ్ళరా’’ అని ఆళ్ళమ్మమ్మ అంటే సరేనన్నాడు. 

***

చైతన్య నల్సార్‌ యూనివర్శిటీలో ఫైనలియర్‌ చదూతున్నాడు. ఉంకో తొమ్మిది రోజుల్లో కాలేజి మొదలవ్వుద్ది. వోరం రోజుల్లో ఐద్రాబాద్‌ ఎల్లాల. ఆ ఇసయం చెప్పటానికి అమ్మమ్మ దగ్గిరికొచ్చాడు. ఆరోజు ఆఊరంతా గగ్గోలుగా ఉంది. ఊరంతా ఊరి చివర సొశానాల్లో నరకాసురుడి ఇంటి వైపు ఎళ్తన్నారు, అందరూ! ఇంటికొచ్చీసరికి కేశవ కూడా అక్కడే ఉన్నాడని ఆళ్ళమ్మమ్మ చెప్తే చైతూ కూడా అక్కడికే ఎళ్ళాడు. అప్పుడుకే జెనం గుంపులు గుంపులుగా ఉన్నారు. 


చైతూని చూసి కేశవ ఎదురొచ్చి పలకరిచ్చాడు. ‘‘ఏవైంది మాయా ఊరంతా ఇక్కడున్నారు?’’ అనడిగాడు చైతు, ‘‘ఎవరూ నమ్మలేంది, ఊహించంది ఒకటి జరిగిందిరా చైతు. నరకాసరుడు సచ్చిపోయాడు’’ అని చెప్తుంటే ‘‘నిజమా మాయా? ఎటకారమాడకు నిజం చెప్పు, పాపం మీరియ్యని కానీ ఆడు చంపేశాడా? లేదా ఇంకేవైనా జరిగిందా నిజం చెప్పు మాయా’’ అని ఆత్రం తట్టుకోలేపోతన్నాను అన్నట్టు బతిమాలాడు. 


‘‘నిజంరా నిజంగా చచ్చిపోయాడు’’ అని నమ్మకం కలిగీలా చెప్పాడు. 


‘‘ఎలా చచ్చిపోయాడు, ఏక్సిడెంటా? లేదా ఎవరైనా ఏమైనా చేసారా?’’ అంటానే ‘‘ఆణ్ణెవరు ఏం చేయగలరులే! ఎవరైనా ఏవైనా చెయ్యటానికొచ్చినా పులుల్లాంటి కుక్కల్నొదిలేత్తాడు అయ్యి ఎలాంటోణ్ణైనా చంపి పాడేత్తాయ్‌!’’ అన్నాడు. 


‘‘అసలెలా చచ్చిపోయాడు మాయా తొరగా చెప్పు’’ అని బతిమాలాడు. 


‘‘కంగారు పడకరా అంత టెన్షన్‌ దేనికి ఆడు ఉరేసుకుని సచ్చిపోయాడు’’ అని నమ్మలేని మరో సంచలన ఇసయం చెప్పాడు. 


‘‘అవునా?’’ అంటా గట్టిగా అరిచాడు చైతు నమ్మలేక! 


‘‘అవును, ఆణ్ణి చంపాలంటే ఆడు తప్ప ఆణ్ణెవరూ చంపలేర్రా’’ అన్నాడు కేశవ. 


‘‘మాయా, మీరియ్య దగ్గిరికెళ్దాం నడు అసలేం జరిగిందో తెలుసుకుందాం’’ అని తొందరెట్టాడు. 

‘‘భైరవకోట’’ అని రాసున్న ఎరుపు పచ్చ నలుపు రంగుల ఆ ఇంటి ముందుకొచ్చారు. అక్కడ టెంట్‌లో కుర్చీలో కూచ్చుని బోరున ఏడుత్తున్న ఓ ఆడమనిషి, ఆవిడనోదారుత్తున్న ఇంటూరి సుందర్రావు కనిపిచ్చారు. ఊరంతా అక్కడే ఉన్నా ఆడి కోసం ఏడుత్తున్నది మాత్రం ఈళ్ళిద్దరే!

మీరియ్య కోసం ఎదికితే అప్పుడే లోపల్నించొచ్చాడు. ఈళ్ళని చూసి దగ్గిరి కొచ్చాడు. కందిగట్ల మీరాసాహెబ్‌ చైతుని ‘‘ఎప్పుడొచ్చావ్‌ బాబా’’ అని అడగ్గా ‘‘ఉప్పుడే బాబాయ్‌’’ అని జెప్పి ‘‘అదేంటి బాబాయ్‌ అతనెలా చచ్చిపోయాడు. మాయ ఉరేసుకున్నాడంటన్నాడు నిజవేనా?’’ అంటే ‘‘నిజమే బాబా! ఉరేసుకునే సచ్చిపోయాడు’’ అన్నాడు. 


‘‘అసలేమైంది?’’ అనడిగాడు చైతు. 


‘‘ఊళ్ళోకి కొత్తగా కొబ్బరి కొట్టెట్టిన బలగం భూపాల్‌రెడ్డి తెల్సా నీకు?’’ అన్నాడు కేశవని చూసి! 


‘‘అవును తెల్సు, ’’ 


‘‘అతని కూతురెవడో కుర్రోణ్ణి పేమించిందట. అతను ఈడికి ఆ గొడవ చూడమని చెప్పాడంట. ఈడు ఆ పిల్లని రేత్రికి రేత్రి బెంగాల్‌లో ఉన్న ఆళ్ళ తమ్ముడి గారింటికి అంపీసి గుండు చేయించేసారంట. ఈ కుర్రోణ్ణి ఈడు లచ్చ రూపాయలు తీసుకుని చంపీసి ఎదుర్లంక, కరవాగులంక, దాటాక భైరాలంకలో మూటకట్టి గౌతమి నదిలో పాడీసాడంట. 


ఆ కుర్రోడి అమ్మ ఆడి కోసం ఎతుకుతా ఎతుకుతా మొన్న ఈడు కొత్తపేట పోలీటేషన్‌ కెళ్ళినపుడు ఆవిడి ఆళ్ళబ్బాయి ఫొటో చూపిత్తా బోరు బోరున ఏడుత్తా ‘అయ్యిగారూ ఈయబ్బాయి నా కొడుకు. మూడు రోజుల్నించి కనపడతా లేదు. నిన్నొత్తే తవరు ఫొటో తెమ్మన్నారు’ అంటా ఎస్‌ఐకి చెప్తుంటే ఎదర కుర్చీలో కూర్చున్న ఈడు ఆ ఫొటో తీస్కుని చూత్తే అప్పుడు ఈడికి అర్ధవైందంట ఆ కుర్రోణ్ణి చంపీసినోడు ఈడేనని!


ఉంకో షాక్‌కొట్టిన ఇసయం ఏంటంటే ఆవిణ్ణి అప్పుడు చూసాడంట. ఆవిడి ఆళ్ళ చెల్లేనంట. 

చచ్చిపోయిందనుకున్న ఆ పిల్ల బతికే ఉందంట. అదిగో ఆవిడే అక్కడ కూచ్చుని ఏడుత్తున్నావిడ’’ అంటా చీబిచ్చాడు. 


ఆవిణ్ణి పట్టి పట్టి చూత్తే పోలికలు తెలుత్తున్నాయి. ఆ పక్కనున్న కుర్రోడు ఆవిణ్ణి ఓదారుత్తున్నాడు ఆ అబ్బాయి నరకాసురుడి కొడుకు కానీ ఒక్క చుక్క కూడా కార్చటంలేదతను. 


మీరియ్య దగ్గిర్నించి ఇంటూరి సుందర్రావు దగ్గిరికెళ్ళారిద్దరూ. పలకరిచ్చి ‘‘ఈవిడి ఆయన చెల్లెలంట కదండీ ఈవిడి సచ్చిపోయిందన్నారు కదండీ? అని ఆశ్చర్యంగా నెమ్మదిగా అంటే అతను పక్కకొచ్చి ‘‘అదా? ఈవిడి ఆడి చెల్లిలే! ఈవిణ్ణి ఎవడో తీసుకుపోయి వాడీసుకుని మోజు తీరాక బైటికి గెంటీసాడంట. ఈవిణ్ణి చూసి ఎవరో మహానుభావుడు రామకృష్ణ మిషనోళ్ళ ఆస్పటల్‌లో జామిన్‌ చేసాడంట. ఆళ్ళు ఈవిడికి నయిమయ్యాక ఒకతనితో పెళ్ళి చేసి అంపారంట. 


ఇదంతా జరిగాక ఈ పిల్ల ఆళ్ళూరెళ్లి ఆళ్ళ వోళ్ళ గురించి అడిగితే అమ్మ నాన్న సచ్చిపోయారని అన్నియ్య ఎక్కడికో ఎళ్లిపోయాడని ఎక్కడున్నాడో తెలవదని చెప్పారంట. 


ఈవిణ్ణి ఆళ్ళాయన చేలా బాగా చూసుకునీ వోడంట. అతను జబ్బు చేసి సచ్చిపోయాడంట. ఆళ్ళ కొడుకుని కూలీ నాలీ చేసి పేణంగా పెంచుకుంటా ఇంజనీరింగ్‌ చదివించిందంట. ఆ కాలేజీలో పరిచయమైన అమ్మాయి వల్లే ఆడి పేణం పోయింది. ఆ పేణం తీసింది ఈవిణ్ణి పేణానికి పేణంగా పేమించిన ఆళ్ళన్నియ్యేనంట. 


ఎవరి కోసం ఆడు ఇలా మృగంలా తయారయ్యాడో ఆవిడి సచ్చిపోలేదని సుఖంగా ఉందని తెలిసి ఎంతో సంతోషించాడంట. కానీ ఆవిడి కొడుకుని తన చేతుల్తోనే, కాళ్ళట్టుకుని బతిమాలుతన్నా, వదలకండా కర్కసంగా కొట్టి కొట్టి సంపీసాననీ పశ్చాత్తాపంతో రేత్రి ఎక్కెక్కి ఏడ్చాడు. ఆళ్ళ చెల్లి బతికే ఉందని చెప్తా ఎంత నవ్వాడో! 


ఆడు నవ్వటం, ఏడ్వటం రొండూ రేత్రే చూసాను. కానీ ఆళ్ళ చెల్లిని చూసి ఆ కుర్రోడు గేపకం వొచ్చి తట్టుకోలేక అపరాధ భావంతో తెల్లారగట్ల ఉరేసుకుని సచ్చిపోయాడు’’ అని ఏడుత్తా చెప్పాడు సుందర్రావు. 


ఇంతలో పోలీసులొచ్చారు. శెవాన్ని దించి పోస్టుమార్టమ్‌కి అంపారు. ఆళ్ళు మాటాడుకుంటంటే ఇన్నారు చైతు, కేశవ, సి. ఐ. చెబుతున్నాడు ఎస్‌. ఐ. కి ‘‘జిల్లాలో వున్న ఒకే ఒక తలారి ఉరేసుకుని సచ్చిపోయాడు. ఈడికిలాంటి కృారంగా ఉండీవోడిరక దొరకడు’’ అని. 


చైతు, కేశవ అక్కణ్ణించి వొత్తంటే దూరంగా సిలోన్‌ పెంతుకోస్తు చర్చిలోంచి ప్రసంగం లీలగా ఇన్పిత్తంది. పాస్టర్‌ అక్కిరాజు జాకబ్‌ రాజు గారు చెబుతున్నాడు. ‘‘మనిషి ఏ ఆయుధం చేతబడితే దానితోటే నశించిపోతాడని ఏసు ప్రభువు తన శిష్యుడు పేతురుతో చెప్పారు’’ అని. అవును అది ఇతని ఇసయంలో నిజమైంది. అతను ఎంతోమందిని ఉరేసి చంపీసాడు. కూతురిని, భార్యని, ఆఖిరికి మేనల్లుడిని, చివరికి తను కూడా ఉరేసుకునే సచ్చిపోయాడు. 


ఆ నరకాసుర వధకి దేవత దిగి రావాల్సొచ్చింది. ఈ నరకాసురుణ్ణి చంపటానికి ఆడిలో పుట్టిన మనిషే సరిపోయాడు. 


========================================================================

సమాప్తం

========================================================================

రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక

నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.




Comments


bottom of page