top of page

ఆ ఊరి చివర - పార్ట్ 1

#RathnakarPenumaka, #పెనుమాకరత్నాకర్, #AaVuriChivara, #ఆఊరిచివర, #TeluguHeartTouchingStories

Aa Vuri Chivara - Part 1/3 - New Telugu Story Written By Rathnakar Penumaka

Published In manatelugukathalu.com On 17/05/2025

ఆ ఊరి చివర - పార్ట్ 1/3 - పెద్ద కథ ప్రారంభం

రచన: రత్నాకర్ పెనుమాక

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



చిలుకూరి చైతన్య పల్సర్‌ మీద కాకినాడ నించి ఆళ్ళ అమ్మమ్మ గారూరు గేదెల్లంక వత్తంటే, బండి ఎదుర్లంక దాటాక ఎనకాల నించి ఒక కియా సెల్టాస్‌ ఎరుపు కారు ఏగంగా పల్సర్‌ దాటుకుని ఎళ్ళింది. నడుపుతున్నదెవరో కానీ గుద్దినంత పక్కనించి నిర్లక్ష్యంగా ఎళ్ళిందా కారు. 

‘ఎవడ్రా ఎదవ కొంచుముంటే గుద్దేద్దుడు’ అని తిట్టుకుంటా కారొంక చూత్తే ఎర్రగా మెరిసిపోతా ఆకర్షణీయంగా ఉంది. అంతకంటే ఆకర్షణీయంగా ఉన్నదేంటంటే ఎనకాల నల్లని అద్దం మీద నరకాసురుడి బొమ్మ భయంకరంగా ఉంది. దాని కింద పెద్ద పెద్ద అక్షరాలతో ‘‘నందికం వారి నరకాసురుడు’’ అని రాసిన స్టిక్కర్‌ అంటిచ్చి ఉంది.


ఆ బొమ్మ, ఆ పేరు చిలుకూరి చైతన్యకి చేలా ఇడ్డూరంగా అనిపిచ్చాయ్‌. సాధారణంగా పతి మనిషిలోనూ ఓ మంచోడు, ఓ సామాన్యుడు, ఓ దుర్మార్గుడు ఉంటాడు. కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎవడు అవసరమైతే ఆడు బయటి కొత్తాడు. ఎక్కువుగా మనిషి నైజం దుర్మార్గుడేపు మొగ్గు చూపినా అందరి ఎదర మంచోడని అనిపిచ్చు కోటానికే చూత్తాడు.

కానీ ఈడెవడో నేను నరకాసురుడంతటి దుర్మార్గుణ్ణి అని గొప్పగా చెప్పుకుంటన్నాడు. అంటే ఈడికి నటించటం కానీ, జెనాలతో మంచోడు అనిపించుకోవాలనీ కుతి లేనోడని అర్ధమైంది చైతూకి.


ఈడి గురించి తెలుసుకోవాలి అనుకుంటానే తన బండి మీద ఆ కార్‌ని ఎంబడించాడు. ఆ కారు మురమళ్ళలో ఆగింది. అందులోంచి లావుగా, ఎత్తుగా పెద్ద పొట్టతో ఓ మనిషి దిగాడు. లెనిన్‌ చొక్కా, ఫేంట్‌ ఏసుకున్నాడు. ఆ భారీ మనిషి చింతనిప్పుల్లాంటి కళ్ళు, గిరజాల జుట్టుతో భయిపెట్టీ లాగున్నాడు. బుర్ర మీసాలతో, చేతి పది ఏళ్ళకి పెద్ద పెద్ద ఉంగరాలతో, మెడలో మోకు తాడు లాంటి లావాటి చైన్లుతో దిగాడు. రాజస్థాన్‌ టీ స్టాల్‌ అని ఉన్న టీ బడ్డి దగ్గిర సిగరెట్‌ ఎలిగిచ్చుకుని టీ తాగాడు. చైతన్య కూడా అక్కడ బాదం టీ తాగాడు. టీ తాగుతా అతన్ని పరిశీలించి చూసి ఈడెవడో నిజంగానే నరకాసురుడిలాగున్నాడు అనుకున్నాడు.


ఆ తర్వాత అతని కారు మురమళ్ళ మీంచి అన్నంపల్లి మీదగా కొమానపెల్లి దాటి గేదిల్లంక ఎళ్తంటే హమ్మయ్యా! ఈ ఊరే వొచ్చింది కారు. లేపోతే దీన్ని ఎంబడిత్తా ఎక్కడి దాకా ఎళ్ళాల్సి వొచ్చునో! ఈడి గురించి తెలుసుకోవాలి. ఈ ఊరు అమ్మమ్మదే కనక అమ్మమ్మనో, తనతో జతగాడిగా ఉండీ మావయ్యనో అడిగి తెలుసుకోవాల అనుకున్నాడు.


చైతు ఆళ్ళ అమ్మమ్మ వోళ్ళుండే కుమ్మర్ల సందు కెళ్ళాలంటే ఆకెళ్ళోరి ఈది, గవర్లపేట, హనుమాన్‌ నగర్‌ దాటెళ్ళాలి. కానీ ఆ కారు అయ్యన్నీ దాటి అంబేద్కర్‌ నగర్‌, జీవన్‌ నగర్‌ దాటుకుని ఎళ్ళింది. అప్పడెప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నగారి హయాంలో బడుగు బలహీన వర్గాలకిచ్చిన కోలనీ అది. దానికి గవర్నమెంటోళ్ళు ‘‘పూలే నగర్‌’’ అని పేరెట్టినా అందరూ పిలిచీ పేరు కొత్తకొంపలు. ఆ కోలనీ కూడా దాటుకుని ఊరి చివర చుట్టూ చేల మజ్జిన ఏకాకిలా కట్టిన రెండంతస్థుల డాబా ముందాగింది. అక్కడి దాకా ఆ కారును ఎంబడిచ్చి ఎనక్కి వొచ్చీసాడు చైతు ఆళ్ళ అమ్మమ్మ ఇంటికి!


చైతుని చూడగానే ఆళ్ళ అమ్మమ్మ కాగిత రాజ్యలక్ష్మి ఆత్రంగా ఎదురొచ్చింది. ‘‘ఏరా చైతూ ఎలా వున్నావ్‌?, అమ్మ నాన్న బాగున్నారా? అమ్మను కూడా తీసుకు రాపోయావా?’’ అనడిగింది. 

నూతి దగ్గిరికెళ్ళి చేదతో బాల్చాలోకి నీళ్ళు తోడిచ్చి కాళ్ళు కడుక్కోమంది. 


‘‘నీకెందుకే అమ్మమ్మా నేను తోడుకోలేనా? ఎదుటోళ్ళని అస్సలు కష్టపడనివ్వవు ఇంత వయిసొచ్చినా’’ అంటా చిరుకోపం నటించాడు గారంగా. 


ఇంతలో ఇంట్లోంచి ఆళ్ళ మావయ్య లుంగీ సర్దుకుంటా నవ్వుకుంటా వొచ్చి ‘‘ఏరా చైతూ ఇన్నాళ్ళకి మావయ్య, అమ్మమ్మ గుర్తొచ్చారా? ఉంకో నెల రోజుల్లో ఐద్రాబాద్‌ ఎళ్ళిపోతన్నావట కదా, ఉప్పుడా రాటం?’’ అంటా చైతు దగ్గిరికొచ్చి కావిలిచ్చుకున్నాడు. 


అందరూ ఇంట్లోకెళ్ళారు. ఎంటనేకొట్టు గదిలో దాసిన కొబ్బరి బొండాలు కొట్టి చైతుకిచ్చాడు తాగమని. రొండు తాగీసరికి కడుపు నిండిపోయింది. అయినా ఆళ్ళ మావయ్య కాగిత కేశవస్వామి బలవంతపెడితే ఇంకోటి తాగాడు. ఆ లేత కొబ్బరి కోరి బెల్లం కలిపి ఇత్తే తిన్నాడు. ఇద్దరూ ఆళ్ళ అమ్మమ్మ చేసిన వేడి వేడి పొట్టిక్కలు, మావిడికాయ కొబ్బరికాయతో చేసిన పచ్చడేసుకుని తిన్నారు. 


దాల్చిన చెక్కేసిన బెల్లం టీ తాగి ఏటిగట్టుకెళ్ళారు. చైతు కిష్టమైన గౌతమీ నదిలో తనివితీరా ఈతకొట్టారు. అలసట తీరీదాకా గౌతమీనించి పిల్లగాలులు పీల్చుకున్నారు. చైతు తన ప్రియురాలు చాందిని గురించి, కేశవ తను ప్రేమిస్తున్న గాదిరాజు రాఘవరాజు గారి అమ్మాయి సుభద్ర గురించి మాటాడుకుంటా ఇంటికొచ్చారు.


బాగా ఈత కొట్టారేమో సాయంత్రం తిన్న పొట్టిక్కలు కడుపులోనే భస్మమైపోయాయి. ఆ సాయంత్రం ఆళ్ళ అమ్మమ్మని, సంగాడి గంగాద్రి ‘‘అమ్మగారూ వొంజిరాలు, పాలసొరలు తాజాగా ఉన్నాయి. వొంజిరాలైతే ఇంకా బతికే ఉన్నాయ్‌ తీసుకోండి’’ అంటా ఇచ్చాడు. 


పుల్లల పొయ్యి మీద మట్టిదాకలో అసలు ముళ్ళే ఉండని ఒంజిరాలు ఇగురెట్టింది. ఆ చేతిలో ఏం మాయ ఉందో కానీ ఒంజిరుం మావూలుగానే సముద్రం చేపలన్నిటి లోకి రుచిగా ఉంటది. దాన్ని రాజ్యలక్ష్మి వొండితే దాని రుచి రాతలో చెప్పలేం. తెల్లగా కోమలంగా ఉండీ పాలసొర్రలతో పిడిపి చేసింది. అది వేడి వేడి అన్నంలో తింటంటే అబ్బా ఆ రుచి ఎలా చెప్పాలి. ఆ సొర్ర పిడిపిలో దుమ్ముల్లాగుండీ ముళ్ళు నవుల్తుంటే ఆ కమ్మదనం అమ్మతనమంత బాగుంటాది.

ఇందాక యానాం మీంచి వొచ్చీటప్పుడు చైతు యానాం బైపాస్‌లో దుర్గా బార్‌ కాణ్ణించి స్మిర్నాఫ్‌ గ్రీన్‌ఏపిల్‌ ఫ్లేవర్‌ ఓడ్కా తెచ్చాడు. మావ, మేనల్లుడు కొబ్బరినీళ్ళలో కలుపుకుని చెరో క్వార్టర్‌ తాగుతా, మేడ మీద కబుర్లాడుకుంటా సొర్ర పిడిపి, ఒంజరుం ముక్కలు నంజుకుని తినీసారు. 

కిందకి దిగి అందరూ భోజనం చేసారు. చైతూ ఒంజరుం ఇగురుతో, పాల సొర పిడిపితో ఇష్టంగా తింటంటే ఆళ్ళ అమ్మమ్మ ముళ్ళు ఏరి ఏరి ఏసింది. ఆటిని ఆత్రంగా, ఇంత రుచిగా మళ్ళీ దొరకవేమో అన్నంత ఆబగా తిన్నాడు. అందరి అన్నాలయ్యాక మేడ మీద పరుపులేసుకుని వెన్నెలని, తారలని చూత్తా పడుకున్నారు.


ఇంతలో చైతూకి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చినోడిలాగ ‘‘మాయా, ఇందాక నేను వొచ్చీటపుడు ఎరుపు రంగు కియా సెల్టాస్‌ ఒకటి నన్ను గుద్దేయబోయింది. చేలా రేష్‌ డ్రైవింగ్‌ ఎవడో కానీ, ఆ కార్‌ ఎనకాల గ్లాస్‌ మీద నందికం వారి నరకాసురుడు అని స్టిక్కరంటిచ్చి ఉంది, నరకాసురుడి బొమ్మ కింద. ఆ కారు ఈ ఊరే వొచ్చింది. ఎనకాలే ఎళ్ళాను. ఊరు చివర సొశానాల దగ్గిరిలో ఓ డాబాలో కెళ్లింది. ఎవడు మాయా ఆడు, ఆ పేరేంటి అలా రాయించుకున్నాడు? ఆడి గురించి తెలుసు కోవాలనుంది. చెప్పు’’ అన్నాడు. 


దానికి ఆళ్ళ మావయ్య కేశవ ‘‘ఆడి గురించి చెప్తే జడుసు కుంటావ్‌ మనుషుల్లో ఇలాంటోళ్ళు కూడా ఉంటారా? అనుకుంటావ్‌. ఆడి ఇంటికి రేత్రిళ్ళు దేవుడెరుగు, పగలే ఎవరు ఎళ్ళరు. అంత ధైర్నం ఎవరికీ లేదు’’ అన్నాడు.


 ‘‘అదేంటి మాయా అతనేవన్నా చేతబడి చేత్తాడా? అందుకనేనా ఊరి చివర చేల్లో, సొశానానికి దగ్గిరిలో కట్టుకున్నాడు ఇల్లు?’’ అనడిగాడు.


‘‘నీకు చెప్పటం కాదు రోపు చీబిత్తాను. ఆ ఇంట్లో పనిచేసీ కందిగట్ల మీరాసాహేబ్‌ మనకి బాగా తెలుసు. అతనికి ఫోను చేసి నరకాసురుడు లేనప్పుడు ఎల్దాం’’ అన్నాడు. 


‘‘సరే మాయా, ఇంతకీ అతని పేరు నరకాసురుడేనా అసలు పేరు ఇంకేవైనా ఉందా?’’ అనడిగాడు.

 

‘‘అతని అసలు పేరు నందికం నాగభూషణం. కానీ ఎవరూ అతన్ని ఆ పేరుతో పిలరు. అసలు ఊళ్ళో చేలామందికి ఆపేరే తెల్దు. అందరూ ‘నరకాసురుడు’ అనే పిలుత్తారు. అసలు ఊళ్ళో అతన్ని పిలవాల్సిన అవసరమే రాదు. ఎవరూ ఏ కారిక్రమాలకి పిలిచీ ధైర్నం లేదు. పిలిచినా రాడు. సరే పడుకో రోపు మీరియ్యికి ఫోన్‌ చేసి రమ్మంటే ఎల్దాం’’ అన్నాడు. 


ఇంతలో రాజ్యలక్ష్మి కూడా దిండు దుప్పటి, మంచినీళ్ళు సీసాలు అట్టుకుని వొచ్చింది పడుకోడానికి.


పొద్దున్నే చైతు, కేశవ ఏపపుల్లతో పళ్ళు తోముకునీ సరికి రాజ్యలక్ష్మి ఏడేడిగా గార్లు, ఉల్లిపాయ పచ్చడి చేసింది. అయ్యి తిని, బాదం టీ తాగారు. ఊరి చివరనున్న ఆ ఇంటికి ఎళ్ళటానికి కందిగట్ల మీరాసాహెబ్‌కి ఫోన్‌ చేత్తే ‘‘ఓ పావు గంటలో రండి. ఆ యముడు ఊరెళ్తన్నాడు సందాలదాకా రాడు’’ అన్నాడు.


‘‘సరే చైతు.. ఆడు బైటికి ఎళ్తన్నాడంట. మనం ఆ ఇంటికెళ్ళినప్పుడికి మీరియ్య చెప్పిన పావుగంట అవుద్దిలే’’ అన్నాడు. కేశవ, చైతు ఆళ్ళ కాలేజీ గురించి మాటాడుకుంటా చెరో గులకరాయిని తన్నుకుంటా ఆ ఇంటికెళ్ళీసరికి రోడ్డు మీంచి చూత్తే కారు కనబళ్ళేదు. అందుకే ధైర్నంగా ఎళ్ళారు. 


కంకర రోడ్డు ఎడమేపు సొశేనం, కుడేపు గవర్నమెంటోళ్ళు మాలమాదిగలకిచ్చిన బాడవ ఉన్నాయ్‌. ఉప్పుడయ్యి ఆళ్ళెవరి పేరా లేవనకోండి. ఉప్పుకి పప్పుకి చవగ్గా ఊళ్ళో రైతులు కొనీసుకున్నారు. అది దాటాక మాలమాదిగల సొశేనం. అందులో ఓ ఇరవై సెంట్లు ఆక్రమించుకుని కట్టిన డాబా ఇల్లది. సొశేనానికి కూడా బాట లేదు. కానీ ఆ డాబా ఇంటికి పంచాయితీ వోళ్ళని భయపెట్టి కారు ఎళ్ళి వొచ్చీలాగ ఎర్ర కంకర రోడ్డు ఏయించుకున్నాడు! ఇయ్యన్నీ కేశవ చైతుకి చెప్తుంటే ఆశ్చర్యంగా ఇంటన్నాడు.


రోడ్డు మీంచి పదిహేను మీటర్లు నడిత్తే కానీ ఆ ఇంటికి చేరలేం. అక్కడ ఒక పెద్ద గేటుంది.

కేశవ అతని గురించి చెప్తా ‘‘ఇతనికి ఇంటి పేరంటే పిచ్చి. నందికం ఇంటి పేరున్న వాళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరూ లేరు. ఉన్నది నేనొక్కడినే అయినా చుట్టుపక్కల ఊళ్ళ వోళ్ళందరినీ ఉచ్చ పోయిత్తన్న, 


అంటా కారు ఎనకాల ‘నందికం వారి రధం’ అనుండీది. ఉప్పుడిరకా ముదిరి ‘నందికం వారి నరకాసురుడు’ అని రాయించుకున్నాడు. అందరూ ఈడంటే భయంతో నరకాసురుడు అనే మాటాడుకుంటారు. అలా పిలుత్తారో లేదో తెలవదు. ఎందుకంటే ఊళ్ళో ఎవరూ ఆణ్ణి పిలవరు, మాటాడరు. తలారిగా ఉజ్జోగం చేత్తన్నాడు. ఆడికి తగ్గా ఉజ్జోగం’’ అన్నాడు.


ఇలా మాటాడుకుంటా ఆ డాబా దగ్గిరి కెళ్ళారు. ఆ డాబాకి ఏసిన రంగులు ఉప్పుడుదాకా ఆళ్ళు ఎక్కడా చూళ్ళేదు.


కమ్యూనిస్టోళ్ళు కూడా ఇష్ట పడనంత ఎర్రని ఎరుపు, పచ్చ, నలుపు ఏసిన డాబా అది. ఎంత దూరం నించి చూసినా జిగేల్మమని కనిపిచ్చటమే కాదు. చూడలేక కళ్ళు మూసుకునీ లాంటి రంగు. అలా నడుచుకుంటా ముందుకెళ్ళీసరికి చిన్న షెడ్డుల్లా వున్నాయ్‌. ఆటికి ఇనుప చట్రాలు ఏసున్నాయ్‌. ఒక్కోదాంట్లో ఒక్కో జాతి కుక్కలున్నాయ్‌. చూడబోతే కుక్కల్లా కాకండా, మాంచి బలంగా, దిట్టంగా, చూత్తేనే భయమేసీలాగా పులుల్లా ఉన్నాయ్‌! 


కుక్కల తర్వాత ఒక దాంట్లో పంది కూడా ఉంది. దాని కాలుకి దెబ్బ తగిలినట్టుంది. కట్టు కట్టి ఉంది. అలా ముందుకెళ్తే గోని సంచుల నిండా బడ్‌విజర్‌ బీర్‌ ఖాళీ సీసాలున్నాయ్‌. కుక్కలు ఆళ్ళని చూసి పెద్దగా మొరగటం మొదలెట్టాయ్‌. ఆటి అరుపులు, అరిచీటపుడు ఆటి ఆకారాలు చూత్తే దడొచ్చింది. నిజానికి ఆటిల్లో ఏ ఒకటి బయట ఉన్నా లేకా ఆ ఇనుపచట్రాల గొళ్ళాలు తీసి ఉన్నా ఆళ్ళు బతికీవోళ్ళు కాదు. 


ఇంతలో ఆళ్ళ చూపులు పెద్ద గేటు, గేటు పక్కన గోడకి తగిలిచ్చిన బోర్డు మీద పడ్డాయి. ఆ బోర్డు మీద ‘‘ఇది యమలోకం. ఇక్కడ యమ ధర్మరాజుంటాడు. యముడి రూల్సన్ని వేరుగా ఉంటాయి. ఇక్కడ యముడు చెప్పిందే వేదం, తీర్చిందే తీర్పు, నిర్ణయించిందే న్యాయం. లోపలికి రావాలంటే నరకానికెళ్ళటానికి సిద్దపడితేనే బెల్‌ కొట్టండి ` ఇట్లు నందికం వారి నరకాసురుడు’’ అని రాసుంది.


========================================================================

ఇంకా వుంది..


ఆ ఊరి చివర - పార్ట్ 2/3 త్వరలో

========================================================================

రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక

నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.




Comments


bottom of page